Jump to content

వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2007)

వికీపీడియా నుండి
ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


23వ వారం

సుడోకు ఒక లాజిక్-భరితమైన గళ్ళ లో ఆంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికను సాధించడము ఎలాగ అంటే ఒక 9x9 గళ్ళ చతురస్రము లో ప్రతీ అడ్డు వరస, నిలువు వరుస, అందులో ఉన్న తొమ్మిది 3x3 చతురస్రాలలో 1 నుండి 9 వరకు నింపడము. ప్రశ్న ప్రహేళికలో కొన్ని అంకెలు అక్కడక్కడా నింపబడి ఉంటాయి. పూర్తయిన పజిలు ఒక రకమైన లాటిన్ చతురస్రము. లియొనార్డ్ ఆయిలర్ అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కాని, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము అమెరికాకు చెందిన హావర్డ్ గార్నస్. ఈ ప్రహేళికను 1979లో డెల్ మ్యాగజిన్‌లో నంబర్ ప్లేస్ మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని సుడోకు అనే పేరుతో ప్రాచుర్యాన్ని తీసుకొచ్చాడు. 2005లో ఈ పజిలు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది. "సుడోకు" జపనీసు వాక్యానికి సంక్షిప్త నామము, "సూజీ వ డొకుషిన్ ని కగీరూ", అనగా "ఒక్కొక్క అంకె ఒక్కొక్క సారి మాత్రమే రావలెను" పూర్తివ్యాసం : పాతవి

24వ వారం

అద్భుతం అనే మాటకు అసలైన నిర్వచనంగా నిలిచిపోయిన చిత్రం, మాయాబజార్. ఈ చిత్రము ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27వ తేదిన విడుదలై అద్భుత విజయం సాధించింది. 2007 మార్చి నాటికి 50 ఏండ్లు పూర్తి చేసుకొన్న ఈ సినిమాపై వివిధ టెలిజన్ ప్రసార వాహిణులు (ఛానళ్ళు), వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి. షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ వంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ ప్రేక్షకులకు అందించిన మరొక అపురూప కళాఖండం ఇది. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళభైరవి, దొంగరాముడు మొదలగు చిత్రాలను రూపొందించిన కె వి రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకుడు.

ఇదే కథతో 1936 సంవత్సరంలో శశిరేఖా పరిణయం పేరుతో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి మాయాబజార్ అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు. పూర్తివ్యాసం : పాతవి

25వ వారం

కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఆంధ్ర ప్రదేశ్ లో నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధించిన ఆధారాలు లభించడం వలన ఈ స్థలానికి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దిగువ కృష్ణ ప్రాజెక్టుగా రూపకల్పన చేసి, నందికొండ వద్ద నిర్మించడానికి ప్రతిపాదించింది. ప్రణాళికా సంఘం కృష్ణా జలాల సమర్ధ వినియోగానికి సంబంధించి పరిశీలించేందుకు ఖోస్లా కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నందికొండ వద్ద కృష్ణా నదిపై డ్యాము నిర్మణాన్ని సూచించింది. ప్రణాళికా సంఘం ఈ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్ధ్యం 281 టి.ఎం.సి. గా సూచించింది. 1955 డిసెంబర్ 10 న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2005లో స్వర్ణోత్సవాలను జరుపుకుంది. పూర్తివ్యాసం : పాతవి

26వ వారం
సంధ్యా సమయంలో చార్మినారు
సంధ్యా సమయంలో చార్మినారు

హైదరాబాదు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క రాజధాని. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ది. హైదరాబాదు భారత దేశములో ఆరవ అతి పెద్ద మహానగరము. అంతే కాదు హైదరాబాదు చుట్టు పక్కల మునిసిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో నిలుస్తుంది. హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు సికింద్రాబాద్‌లు జంట నగరాలుగా ప్రసిద్ది పొందినాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, హుస్సేన్ సాగర్ కు ప్రక్కగా ఉన్న ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో ఉన్న చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్థులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని మరియు కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు. పూర్తివ్యాసం : పాతవి

27వ వారం

తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 26) (జనవరి 23)న విజయనగర సామ్రాజ్యమునకు, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశము న చివరి హిందు సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం పతనానికి దారితీసింది. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉచ్ఛస్థితి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాత కాలంలొ అచ్యుత రాయలు, ఆ తరువాత సదాశివ రాయలు పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు, వాస్తవంలో పూర్తి అధికారాలు రామరాయలు వద్ద ఉండేవి. అళిత రామరాయలు దైనందిన పరిపాలనను నిర్వహించేవాడు.ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్క సారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచు యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించేది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 నుండి 1565 వరకు విజయనగరంపై విజయం, సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో ఉంది. పూర్తివ్యాసం : వ్యాసాన్ని వినండి : పాతవి

28వ వారం
అక్షరధామ్
అక్షరధామ్

అక్షరధామ్ భారత దేశ రాజధాని కొత్త ఢిల్లీలో దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. నవంబర్ 7వ 2005 తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో "నొయిడా క్రాసింగ్" వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా, ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రభోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధామ్ సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకది ప్రతీక.

అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో , ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు "స్వామి నారాయణ్ అక్షరధామ్". పూర్తివ్యాసం : వ్యాసాన్ని వినండి : పాతవి

29వ వారం

టి.జి.కమలాదేవి (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు) అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు తో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది. పూర్తివ్యాసం : వ్యాసాన్ని వినండి : పాతవి

30వ వారం
ఎర్ర రక్తకణాలలో మలేరియా పరాన్న జీవులను చూపిస్తున్న గీంసా ద్రావకం
ఎర్ర రక్తకణాలలో మలేరియా పరాన్న జీవులను చూపిస్తున్న గీంసా ద్రావకం

మలేరియా, దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులపైనే అధారపడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టినందుకుగాను ఫ్రెంచి రక్షణ వైద్యుడయిన "చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్"కు 1907లో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రము, అది దోమలలో మరియూ మనుషులలో ఎలా నివసిస్తుందో తెలిపినందుకు 1902లో సర్ రొనాల్డ్ రాస్ కు నోబెల్ బహుమతి లభించింది. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు.

మలేరియాను కలుగచేసే పరాన్నజీవులను "ప్లాస్మోడియం ప్రొటోజోవా" (Plasmodium Protozoa) అని అంటారు. ప్రోటోజోవాలు ఏకకణజీవులు. కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. పూర్తివ్యాసం : పాతవి

31వ వారం
ఒమన్‌లో వివిధ ప్రాంతాలను చూపే పటం. (స్కేలు ప్రకారం లేదు)
ఒమన్‌లో వివిధ ప్రాంతాలను చూపే పటం. (స్కేలు ప్రకారం లేదు)

సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (Sultanate of Oman) (అరబ్బీ భాషలో:سلطنة عُمان ) నైఋతి ఆసియాలో అరేబియా సముద్రము తీరాన ఉన్న దేశము. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యెమెన్ దేశాలతో సరిహద్దులున్నాయి. ముసందమ్ అనే ఒక చిన్నభాగం ప్రధాన భూభాగానికి విడిగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనికి చొచ్చుకొని అరేబియా సముద్రము తీరాన ఉన్నది. ఒమన్ జనాభా 25 లక్షల పైచిలుకు (ఇందులో దాదాపు 24 శాతం విదేశీయులు). దేశం వైశాల్యం 3,12,000 చ.కి.మీ.

ఒమన్ మధ్యభాగం చాలావరకు విశాలమైన ఎడారి. తీర ప్రాంతంలో వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులకు, తీరానికి మధ్యలో ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. రుబ్ అల్‌ఖలి (అంటే ఖాళీ ప్రదేశం) అనే సువిశాలమైన ఎడారి ఒమన్ పశ్చిమ భాగాన ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంది. మానవజాతి పుట్టినిళ్ళు (Cradle of Humanity) గా గుర్తించబడిన 15 దేశాలలో ఒమన్ ఒకటి. పూర్తివ్యాసం : పాతవి

32వ వారం
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (Komarraju Venkata Lakshmana Rao), తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త.46 సంవత్సరాల ప్రాయంలోనే మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.

1877 మే 18న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాధమిక విద్యను భువనగిరిలో పూర్తిచేశాడు. పూర్తివ్యాసం : పాతవి

33వ వారం
భారత జాతీయపతాకం
భారత జాతీయపతాకం
భారత జాతీయపతాకం ప్రస్తుతమున్న రూపంలో 1947 జూలై 27వ తేదీన జరిగిన రాజ్యాంగసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది. మన దేశంలో త్రివర్ణపతాకమంటే జాతీయపతాకమే. దీంట్లో పైనుంచి కిందకు అడ్డపట్టీలవలె వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. మధ్యభాగంలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోకచక్రం ఉంటుంది. ఈ చక్రం నమూనాను సారనాథ్‌లోని అశోకస్థంభం నుంచి తీసుకున్నారు. దీని వ్యాసం తెలుపు రంగు పట్టీ యొక్క ఎత్తులో నాలుగింట మూడొంతులు. జెండా ఎత్తు, వెడల్పుల నిష్పత్తి 2:3. ఇది భారత సైన్యం యొక్క యుద్ధపతాకం కూడా.

భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రుడైన పింగళి వెంకయ్య. జాతీయపతాకాన్ని ఖాదీ బట్టతో మాత్రమే చేయాలని జాతీయపతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. పతాకావిష్కరణ, వాడకాల గురించి ఖచ్చితమైన నియమావళి అమల్లో ఉంది. పూర్తివ్యాసం : పాతవి

34వ వారం
తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తోలుబొమ్మల పుట్టుకమీద అనేక కథలు ఉన్నాయి. పూర్వం ఒక రాజాస్థానంలోని పండితులు తమ ప్రభువును సంతోషపెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపచేస్తే సృజనాత్మకంగా ఉంటుందని తోలుబొమ్మలను తయారుచేసి తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటగా ప్రదర్శించారట. ఈ ఆటలు నిజంగా పండితుల చేతనే మెరుగులు దిద్దుకున్నదని చెప్పడానికి అమరకోశంలోని శ్లోకాలు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ తోలుబొమ్మలు ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కొరింగ, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని అక్కడ జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి తెలుస్తున్నది. అదేవిధంగా అక్కడి నుండి పర్షియా, టర్కీల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించి, అక్కడ నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికాలోని ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీకి, అక్కడినుండి ఫ్రాన్స్కు వ్యాపించాయి. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయాదేశాల్లో భిన్నరూపాలు ధరించినప్పటికీ, భారతదేశం వీటికి మాతృక అని చెప్పవచ్చు. పూర్తివ్యాసం : పాతవి
35వ వారం

ఖొరాన్ లేదా ఖురాన్ లేదా ఖుర్‌ఆన్, ఖొర్ఆన్, కొరాన్ (Qur'ān, القرآن ) ఇస్లాం మతము యొక్క పవిత్ర, మౌలిక గ్రంధము. అరబ్బీ భాషలో మూలముగా ఉన్న ఈ గ్రంధము అల్లాహ్ ప్రత్యక్ష వాణియేనని ఇది భగవంతునిచే మహమ్మదు ప్రవక్తకు తెలియజేయబడినదని ముసల్మానుల విశ్వాసము. ఇది మానవజాతికి భగవంతుడొసగిన చివరి సందేశము అని మహమ్మదీయుల విశ్వాసము.అరబ్బీ భాషలో 'ఖొరాన్' అనగా 'చదువుట','వల్లె వేయుట' అని అర్ధము. నేను మీదగ్గర రెండు వస్తువులు వదలిపెట్టి పోతున్నాను. ఈ రెండింటిని దృఢంగా పట్టుకొని ఆచరించేవారు ఎన్నటికీ దారి తప్పలేరు. వాటిలో ఒకటి దైవగ్రంధం (ఖుర్‌ఆన్). రెండవది నా ప్రవచనాలు, సంప్రదాయాలు (హదీస్) - మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). ముసల్మానుల నమ్మకము ప్రకారము భగవంతుని సందేశములు మొట్టమొదటి ప్రవక్తయైన ఆదాము తో ప్రాంభింపబడి, షుహుఫ్ ఇ ఇబ్రాహిమ్,తోరాహ్ (మోషే ధర్మశాస్త్రము, పాతనిబంధన జబూర్ (దావీదు కీర్తనలు),ఇంజీల్ (క్రీస్తు సువార్త) , వంటివానితో కొనసాగింపబడి, చివరకు మహమ్మదు ప్రవక్తకు తెలుపజేయబడిన ఖొరాన్‌తో ముగిసినవి. పైన చెప్పిన గ్రంధాలలోని వివిధ సందేశాలను ఖుర్‌ఆన్ గుర్తిస్తుంది.యూదు, క్రైస్తవ గ్రంధాలలోని వివిధ ఘటనలు ఖొరాన్‌లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, కొంత భేదాలతోగాని ప్రస్తావించబడ్డాయి.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే అని.పూర్తివ్యాసం : పాతవి

36వ వారం

మంగళగిరి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణం మరియు అదే పేరుగల మండలం. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరు కు 20 కిలోమీటర్ల దూరంలో ఈ మంగళగిరి పానకాల స్వామిగా పూజలందుకొంటున్న పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం గల చారిత్రాత్మక పట్టణం. ప్రసిద్ధి చెందిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, ఆపై ఆనందగోత్రిజులు, విష్ణు కుండినులు - ఇలా ఎన్నో రాజవంశాల పాలనలో మంగళగిరి ప్రాతం ఉంది. కుతుబ్‌షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాము పాలనలోను ఉన్నది. తరువాత కంపెనీ పాలన. 1831లో అతివృష్టి కారణంగా రైతులు పంటను కోల్పోయారు. మరుసటి యేడాది తుఫాను కారణంగా పంటలు నాశనమయ్యాయి. 1833లో భయంకరమైన కరువు ఏర్పడింది.ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభు వంటి ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. వూరి ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసనస్థంభం వీధి ఉంది. మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కళ్యాణ పుష్కరిణి 1807-09లో నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసి వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. పానకాలస్వామి దేవాలయం మెట్ల మొదట్లో ఉన్న శాసనం శ్రీ కృష్ణదేవరాయలచే వేయించబడినదని చెబుతారు. పూర్తివ్యాసం : పాతవి

37వ వారం

కె.వి.రెడ్డి గా ప్రసిద్ధుడైన కదిరి వెంకటరెడ్డి 1940-1970 మధ్యకాలంలో ఎన్నో ఉత్తమమైన తెలుగు సినిమాలు అందించిన దర్శకుడు, నిర్మాత. ఇతడు దర్శకత్వం వహించిన భక్త పోతన, యోగి వేమన, పాతాళభైరవి, మాయాబజార్ వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలుగా ఈనాటికీ పరిగణింప బడుతున్నాయి. ఇంకా గుణసుందరి కథ, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం, శ్రీకృష్ణసత్యవంటి ఎన్నో సినిమాలు అందించాడు. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1 జూలై, 1912 సంవత్సరంలో జన్మించాడు. గృహలక్ష్మి సినిమాకు కేషియర్ గా పని చేశారు. తరువాత వాహినీ సంస్థ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వందేమాతరం, సుమంగళి, దేవత, స్వర్గసీమ సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశాడు.

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన (1942). తరువాత యోగివేమన, గుణసుందరి కథ సినిమాలు తీశాడు. కె.వి.రెడ్డి మరియు విజయా సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక ఇంట్లో మారుమ్రోగేలా చేసిన పాతాళ భైరవి సినిమా 1951 సంవత్సరంలో విడుదలైంది. అయితే కె.వి.రెడ్డి అపూర్వ సృష్టిగా మాయాబజార్‌ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా అతని కళా తృష్ణకూ, సునిశితమైన పనితనానికీ దర్పణం.

నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఎక్కడా రాజీ పడకుండా వేసుకున్న బడ్జెట్‌లోనే, వ్రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అతని సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది. ...పూర్తివ్యాసం : పాతవి

38వ వారం

నర్తనశాల (Narthana Sala) సినిమా పౌరాణిక ఇతివృత్తాలను వెండి తెరకెక్కించడంలో తెలుగు సినిమా దర్శకులకున్న ప్రతిభను మరొక్కసారి ఋజువు చేసింది. నటులు (నందమూరి తారక రామారావు, సావిత్రి, దండమూడి రాజగోపాలరావు, ఎస్.వి.రంగారావు వగైరా ), దర్శకుడు (కమలాకర కామేశ్వరరావు ), రచయిత (సముద్రాల రాఘవాచార్య), గీత రచయిత, సంగీత కళాదర్శకులు (సుసర్ల దక్షిణామూర్తి, టి.వి.ఎన్.శర్మ)- ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. రాజ్యం పిక్చర్స్ పతాకంపై దీనిని నిర్మించారు.

మహాభారతంలోని 'విరాట పర్వం'లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాధ ఈ చిత్రానికి ఇతివృత్తం. శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. అక్కడ కీచకుని కన్ను ద్రౌపదిపై బడుతుంది. మరో ప్రక్క పాండవులను కలుగులోంచి బయటకు లాగాలని దుర్యోధనుని చారులు ప్రయత్నిస్తుంటారు. ఉత్తర గోగ్రహణానంతరం పాండవుల అజ్ఞాతవాసం జయప్రదంగా ముగుస్తుంది. ఈ సినిమా చివరి సన్నివేశంలో వాడిన భారతంలోని తిక్కన పద్యాలు ఎంతో వన్నె తెచ్చిపెట్టాయి.

1964 లో జకార్తాలోని ఆఫ్రో ఆసియన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు, ఎస్వీఆర్, రేలంగి హాజరయ్యారు. ఎస్వీఆర్ స్వయంగా సుకర్నో చేతులమీదుగా అవార్డు అందుకొన్నాడు. ఈ చిత్రం యూనిట్‌కి సుకర్నో విందు ఇవ్వడం మరోవిశేషం...పూర్తివ్యాసం  : వ్యాసాన్ని వినండి : పాతవి

39వ వారం
రుక్మిణీదేవి అరండేల్
రుక్మిణీదేవి అరండేల్

రుక్మిణీదేవి అరండేల్ చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది.

ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం లో చేరింది. తన అభిరుచులకతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి బాలే నృత్యాన్ని అభ్యసించింది. మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆ విద్యను పది మందికి పంచి పెట్టడానికి "ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" ప్రారంభించింది. తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.

1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం "పద్మభూషణ్" తోను, శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదుతోను ఆమెను సత్కరించాయి. ...పూర్తివ్యాసం: పాతవి

40వ వారం
ఖర్జూరం
ఖర్జూరం

ఖర్జూరం ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామ్‌ (palm) కుటుంబానికిచెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫోనిక్స్‌ డాక్టిలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి.

మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు తొలిగా పెంచారనీ తరవాత బాబిలోనియన్లూ అస్సీరియన్లూ ఈజిప్టియన్లూ మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు. శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు, తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం ఇరాక్‌. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలీస్‌ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ చైనా, పశ్చిమ భారతం, దక్షిణ పాకిస్తాన్‌లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా ఈజిప్టు మన్ననలందుకుంటోంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు ...పూర్తివ్యాసం: పాతవి

41వ వారం

రూపాయి భారత అధికారిక మారక ద్రవ్యం. Rs, రూ లను రూపాయికి గుర్తుగా వాడుతారు. ISO 4217 పద్ధతి ప్రకారం రూపాయి గుర్తు INR. సంస్కృత పదమైన రూప్యకం (అనగా "వెండి నాణెం") నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. రూపాయికి వంద పైసలు.

క్రీ.పూ. 6 వ శతాబ్దంలో రూపాయిని మొదటి సారిగా షేర్‌షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు "బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్" (1770-1832), "జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్" (1773-75), (వారన్ హేస్టింగ్స్ స్థాపించాడు), బెంగాల్ బ్యాంక్ (1784-91).

స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ద్రవ్యం ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.

1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో "కొత్త") పైసలు గా పిలిచారు. తరువాతి కాలంలో నయా అనేది మరుగున పడిపోయింది. "డేనిష్ ఇండియన్ రూపాయి"ని 1845 లోను, 1954 లో "ఫ్రెంచి ఇండియన్ రూపాయి"ని, 1961లో "పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో"ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు....పూర్తివ్యాసం: పాతవి

42వ వారం

ది హిందూ ఆంగ్ల దినపత్రికకు భారతదేశములో ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ పత్రికకు దక్షిణ భారత దేశములో సర్క్యులేషన్ ఎక్కువ. పత్రికను స్థాపించి ఇప్పటికి సుమారు 125 సంవత్సరాలు అవుతోంది. దీని యాజమాన్యం ఒక కుటుంబం చేతిలోనే ఉంది. రోజూ 22 లక్షల మంది ఈ పత్రికను చదువుతారు. ఈ పత్రిక సంవత్సర ఆదాయము సుమారు 400 కోట్ల రూపాయలు.

ఇద్దరు పాఠశాల ఉపాధ్యాయులు - తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణియ అయ్యర్, ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవాచారియర్ - నలుగురు న్యాయశాస్త్రవిద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, మరియు న్యాయపతి సుబ్బారావు పంతులు (హిందూ స్థాపకుల్లో ఆంధ్రుడు) - వీళ్ళందరూ ట్రిప్లికేన్ సాహితీసంఘం సభ్యులు. ఈ సంఘం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ వైఖరుల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడం లక్ష్యాలుగా ఏర్పడింది. ట్రిప్లికేన్ సిక్స్ అని పేరుబడ్డ ఆ ఆరుగురు యువకులు మొదట న్యూస్‌పేపర్ అనే సైక్లోస్టైల్ పక్షపత్రికను ప్రారంభించారు. చెన్నైలో ఆ పత్రికకు మంచి స్పందన లభించడంతో హిందూను వారపత్రికగా ప్రచురించడం మొదలుపెట్టారు...పూర్తివ్యాసం: పాతవి

43వ వారం
వాసవీ మాత
వాసవీ మాత

కన్యకా పరమేశ్వరి లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా కోమటి లేదా ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివశిస్తున్నారు.

మద్రాసు ప్రెసిడెన్సీ కి చెందిన వైస్రాయి 1921 మరియు 1931 మధ్య కాలంలో ఒక కమీషన్ చేసాడు.దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది.దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్(1905) వారు తమ పేరును కోమటి నుండి ఆర్యవైశ్య గా మార్చుకున్నారు.ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం.దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు.వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు.వీరిలో చాలా మంది ద్రావిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉన్నది. ఈ ఆలయంలో ఏడు అంతస్థులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు....పూర్తివ్యాసం: పాతవి

44వ వారం
సంఖ్యలను సూచించే పటం
సంఖ్యలను సూచించే పటం

అంకె లేదా సంఖ్య అనేది లెక్కించడానికీ, కొలవడానికీ ఉపయోగించే ఒక అంశం. భౌతికంగా అంకెలు అనేవి ప్రకృతిలో లేవు. ఇవి మానవుల మనసులో ఏర్పడిన విషయాలు. ప్రతి సంఖ్యకూ ఒక గుర్తు ను వాడుతారు. మానవజాతి నాగరికత, విజ్ఞానం ప్రగతికి మౌలికమైన అంశాలలో అంకెలు, వాటి గుర్తులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అంకెలు, వాటి సంబంధాలనూ విస్తృతపరచే విజ్ఞానాన్ని గణితం లేదా గణిత శాస్త్రం అంటారు.

సంఖ్యలలో అనేక రకాలు ఉన్నాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు, బీజీయసంఖ్యలు మొదలైనవి. లెక్కించటానికి వాడే 1, 2, 3, వగైరాలని సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల చరిత్ర మానవుడి చరిత్ర కంటె పురాతనమైనదని కొందరి నమ్మకం. పక్షులు గూటిలో పెట్టిన గుడ్లలోంచి ఒకటో, రెండో గుడ్లు మనం తీసేస్తే కొన్ని గుడ్లు లోపించాయనే విషయం తల్లి పక్షి గ్రహించగలదని ప్రయోగాత్మకంగా నిరూపించేరు. కనుక లెక్కపెట్టగలగటం అనే పని ఒక్క మానవుడే కాదు, తదితర జీవులు కూడా చెయ్యగలవన్న మాట.

మానవులకి జంతువులకి తేడా ఏమిటంటే, మానవుడు లెక్కించేటప్పుడు భాష వాడతాడు. కాని మనిషి లెక్కించేటప్పుడు వాడే భాషకి, దాని వెనక ఉన్న భావానికి మధ్య ఉండే లంకె తెగడానికి కొంత కాలం పట్టింది. ఉదాహరణకి, ఫీజీ ద్వీప వాసులు పది పడవల్ని బోలో అంటారు, కానీ పది కొబ్బరికాయలని కోరో అంటారు. అంటే వారి భాషలో పది అనే భావానికి మాటలేదు. మన భాషలలో కూడ వెతికితే ఈ రకం మాటలు దొరుకుతాయి...పూర్తివ్యాసం: పాతవి

45వ వారం
విఠలేశ్వరుడి ఆలయ సముదాయంలో ఉన్న ఏకశిలా రథం
విఠలేశ్వరుడి ఆలయ సముదాయంలో ఉన్న ఏకశిలా రథం

విజయనగరం లేదా హంపి 13-15 శతాబ్ధముల మధ్య దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్యపు రాజధాని, ఇప్పుడు ఒక చారిత్రాత్మక పట్టణం. ఈ విజయనగర అవశేషాలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని హంపి గ్రామంలో కనిపిస్తాయి. ఈ పురాతన నగరములో ప్రసిద్ధమైన విరుపాక్ష దేవాలయం ఉన్నది. ఈ నగరానికి ప్రక్కన ఉన్నది హంపి అనే గ్రామము. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు. 1999 సంవత్సరములో హంపి యునెస్కో సంరక్షిస్తున్న చారిత్రక ప్రదేశాల జాబితాలో, ప్రపంచ వారసత్వపు‌ స్థలాలో ఒకటిగా చేరింది.

విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హక్క రాయలు(హరిహర రాయలు),బుక్క రాయలు స్థాపించారు. హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర చూపగా, తరువాత రాజ్యానికొచ్చిన ఈయన సోదరుడు బుక్క రాయలు రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యం ముందు తుంగభద్ర నది ఉత్తర తీరాన అనెగొందిని రాజధానిగా చేసి స్థాపించగా విద్యారణ్య స్వామి అధ్వర్యంలో రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరానికి తరలించి విజయనగరం అనే పేరుతో ఈ నగరాన్ని శత్రుదుర్భేద్యమైన రీతిలో నిర్మించారు. విజయనగరం అంటే విజయాన్ని ఇచ్చే నగరము అని అర్థం. పూర్తివ్యాసం: పాతవి

46వ వారం

వైరస్ అనే పదము లాటిన్ భాష నుండి ఉద్భవించింది. లాటిన్‌లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషము అని అర్థం. వైరస్‌లు అతి సూక్షమైనవి (సుమారుగా 15-600 నానోమీటర్లు). ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశ్యము వైరస్‌ల సంతతిని పెంచుకోవడముతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీనులతో చేయబడి ఉంటుంది, దీనిని క్యాప్సిడ్ అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేయగలవు (బాక్టీరియా, జంతురాజ్యము, వృక్షరాజ్యంతో పాటు శిలీంధ్రాలు, ప్రొటిస్టా కి చెందిన జీవులు కూడా వీటి దాడికి గురవుతుంటాయి). బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను బాక్టీరియోఫేజ్ (సరళత కొరకు ఫేజ్) అని అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని 'వైరాలజీ' అని, వీటిని అధ్యయనం చేసే వారిని వైరాలజిస్టులని అంటారు.పూర్తివ్యాసం: పాతవి

47వ వారం

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 జూలై 19 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.

అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు. పూర్తివ్యాసం: పాతవి

48వ వారం

సాలూరు రాజేశ్వరరావు (1922-1999) పేరెన్నికగన్న తెలుగు సినిమా సంగీత దర్శకుడు. సాలూరు మండలములోని శివరామపురం గ్రామంలో జన్మించాడు. అతి చిన్న వయసులోనే సంగీతం నేర్చుకొని అన్నతొ కలిసి కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. 1933-34 మధ్యకాలంలో గ్రామఫోను రికార్డుల ద్వారా అతని ప్రతిభ యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.'శ్రీకృష్ణలీలలు' (1935) చిత్రంలో 'కృష్ణ' పాత్రధారిగా తన పదమూడేళ్ళ వయసులో తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. 'శశిరేఖాపరిణయం' అతని రెండవ చిత్రం. తరువాత కలకత్తాలో ఉద్దండులవద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నాడు. 1938లో మద్రాసుకు తిరిగి వచ్చి సంగీతబృందాన్ని యేర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పని చేశాడు. 'జయప్రద'(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించాడు.

సినీ సంగీతదర్శకునిగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940). సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని,లాటిన్‌ అమెరికన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మిళితం చేసి, ఆ కాలంలో వూహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది. ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు. తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ.

శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్‌ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు- ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించాడు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో అందె వేసిన చేయి. తన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200 కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో తప్పక పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద, మిస్సమ్మ, భలేరాముడు, మాయాబజార్‌ (4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, చెంచులక్ష్మి, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన, భక్త ప్రహ్లాద.... పూర్తివ్యాసం: పాతవి

49వ వారం

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీబాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము.

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ) చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్ధి. పోర్ బందర్లోను, రాజ్‌కోట్లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి.

1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. బొంబాయిలోను, రాజ్‌కోట్ లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో ఒక లా కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది. పూర్తివ్యాసం: పాతవి

50వ వారం

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.

హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము.

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు,గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.

తులసికి సంబంధించి హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన నమ్మకాలు: తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు. తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది. తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి. ...పూర్తివ్యాసం: పాతవి

51వ వారం

భారతదేశ స్వపరిపాలనా విషయాలను చర్చింటానికి బ్రిటీషు ప్రభుత్వం 1930 నుండి 1932 వరకు లండన్ లో నిర్వహించిన మూడు అఖిల పక్ష సమావేశాలను రౌండు టేబులు సమావేశాలు లేదా గుండ్రపు బల్ల సమావేశాలు అంటారు. భారత స్వపరిపాలనపై సైమన్ కమిషను ఇచ్చిన నివేదిక పర్యవసానంగా 1930-32 లలో బ్రిటిషు ప్రభుత్వం రౌండు టేబులు సమావేశాలను ఏర్పాటు చేసింది. స్వపరిపాలన కోరిక దేశంలో క్రమేణా బలపడుతూ వస్తోంది.

మొదటి రౌండు టేబులు సమావేశం 1930, నవంబర్ 13న ఐదవ జార్జి అప్పటి బ్రిటీషు ప్రధానమంత్రి రాంసే మెక్‌డోనాల్డ్ అధ్యక్షతన ప్రాంభమైంది. భారత జాతీయ కాంగ్రేసు దేశములోని వ్యాపారవేత్తలతో పాటు సమావేశాలను బహిష్కరించినది. చాలామంది కాంగ్రేసు నేతలు అప్పటికే సహాయనిరాకరణోద్యమములో పాల్గొని జైళ్లలో ఉన్నారు. రెండవ రౌండు టేబులు సమావేశం లండన్లో సెప్టెంబర్ 7, 1931న ప్రారంభమయ్యింది. రెండవ సమావేశము యొక్క ప్రధాన కార్యమంతా సమాఖ్య స్వరూపం మరియు అల్పసంఖ్యాక వర్గాల పై నియమించిన రెండు కమిటీలు నిర్వర్తించాయి. మహాత్మా గాంధీ ఈ రెండు కమిటీలలో సభ్యుడు. మూడవ రౌండు టేబులు సమావేశం నవంబర్ 17, 1932న ప్రారంభమైంది. ఇది చిన్నది మరియు అంత ప్రధానమైనది కాదు.కాంగ్రేసు నాయకులుగానీ ఇతర ప్రధాన రాజకీయనాయకులెవ్వరూ హాజరుకాలేదు.

1931 సెప్టెంబరు నుండి 1933 మార్చి వరకు రౌండు టేబులు సమావేశాల యొక్క సిఫారుసులను, ప్రతిపాదించిన సంస్కరణలను పొందుపరచి 1933 మార్చిలో ఒక శ్వేత పత్రమును విడుదల చేశారు. ఆ తరువాత నేరుగా దీనిపై బ్రిటీషు పార్లమెంటులో చర్చ జరిగినది. పార్లమెంటు సంయుక్త కమిటీ విశ్లేషించి ఆమోదము తెలియజేసిన తర్వాత ఆ బిల్లు 1935 జూలై 24న 1935 భారతదేశ ప్రభుత్వ చట్టంగా రూపొందినది.. ...పూర్తివ్యాసం: పాతవి

52వ వారం

పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లా మొత్తం ఎటువైపు వెళ్ళినా చల్లగా పలకరించే పచ్చని పంటచేలు - విస్తృతంగా దిగుబడినందిస్తూ పచ్చగా కళకళలాడే కొబ్బరి తోటలు - అమృతమధురమైన ఫలాలందించే అరటి వనాలు - గోదారి గలగలలు - పంటచేల పదనిసలు - పశ్చిమగోదావరి....కాదు...కాదు.. ఇది ప్రకృతి గోదావరి. నైసర్గికంగా జిల్లాను మూడు సహజ ప్రాంతాలుగా విభజించవచ్చును - డెల్టా ప్రాంతము, మెరక భూముల ప్రాంతము, ఏజన్సీ (అటవీ) ప్రాంతము. జిల్లాను 46 రెవిన్యూ మండలములుగా విభజించినారు.

పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివశిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490. జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. జిల్లా ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు.


ఈ జిల్లా 73.95% (పురుషులు 78.43%, స్త్రీలు 69.45%) అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు తరువాత రెండవ స్థానంలో ఉన్నది. మొత్తం దేశంలో ఈ జిల్లా చదువుకొన్న వారి సంఖ్య ప్రకారం 31వ స్థానంలోను, అక్షరాస్యత శాతం ప్రకారం 149వ స్థానంలోను ఉన్నది... ...పూర్తివ్యాసం: పాతవి

ఇవి కూడా చూడండి

[మార్చు]