Jump to content

మల్లీశ్వరి

వికీపీడియా నుండి
మల్లీశ్వరి
అప్పటి సినిమా పోస్టరు [1]
దర్శకత్వంబి.ఎన్.రెడ్డి
రచనదేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు
స్క్రీన్ ప్లేబి.ఎన్.రెడ్డి
నిర్మాతబి.ఎన్.రెడ్డి
తారాగణంనందమూరి తారక రామారావు,
భానుమతి
ఛాయాగ్రహణంబి.ఎన్.కోదండరెడ్డి,
ఆది.ఎమ్.ఇరాని
సంగీతంసాలూరి రాజేశ్వరరావు,
అద్దేపల్లి రామారావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
డిసెంబరు 20, 1951 (1951-12-20)
సినిమా నిడివి
175-194 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

మల్లీశ్వరి 1951 లో బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రముఖ చిత్రంగా ఖ్యాతిగాంచింది. ఆ సినిమా భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ప్రదర్శింపబడింది. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనా లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్.రెడ్డి నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం." అన్నాడు.

విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాంతఃపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకీ పంపి, వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి, రాజాస్థానానికి పిలిపించేవారు. కాని ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించినవారికి ఉరిశిక్ష వేసేవారు.

మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక నందమూరి తారక రామారావు) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన (న్యాపతి రాఘవరావు)వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు. మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి అని అంటాడు.

మల్లీశ్వరి తల్లికి డబ్బు ఆశ ఎక్కువ. అది సంపాదించి మల్లీశ్వరిని చేపట్టడం కోసం నాగరాజు ఊరువిడిచి వెడతాడు. ఈలోగా నిజంగానే కొద్దిరోజులకు రాణివాసం పల్లకి మల్లి ఇంటికి వస్తుంది. కూతురికి పట్టిన రాణివాస యోగం చూసి మల్లి తల్లి నాగమ్మ (ఋష్యేంద్రమణి) మురిసిపోతుంది. మల్లి క్రమంగా అంతఃపురంలో మహారాణికి ఇష్టసఖి మల్లీశ్వరి అవుతుంది. కాని ప్రియురాలికి దూరమైన నాగరాజు, బావకు దూరమై మల్లి విలవిలలాడిపోతారు. అయితే రాణివాసం వలన వచ్చిన సంపద వల్ల నాగమ్మ తన కూతురిని నాగరాజునుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది.

తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడై విరాగిగా శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి విజయనగరం చేరతాడు. ఒకనాడు మంటప నిర్మాణం చూడడానికి వచ్చిన మల్లీశ్వరి బావను గుర్తిస్తుంది. మరునాడు వారిరువురు నదీ తీరాన కలుస్తారు. అక్కడనుంచి ఆ మరునాడు తప్పించుకుని వెడదామని అనుకుంటారు. ఎంతకూ రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును, మల్లీశ్వరిని సైనికులు బంధిస్తారు. అందుకై మరణశిక్ష పడవలసి ఉన్నా, వారిరువురి ప్రేమను అర్థం చేసుకున్న రాయలవారు పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో కథ ముగుస్తుంది.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్.రెడ్డి రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు. ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం హంపి వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, బుచ్చిబాబు వ్రాసిన రాయలకరుణకృత్యం నాటిక కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రి చేత "మల్లీశ్వరి" స్క్రిప్టుగా అభివృద్ధి చేశారు. అయితే బుచ్చిబాబు పేరు కథారచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు.[1]

బి.ఎన్.రెడ్డి ఈ సినిమా స్క్రిప్టును కృష్ణశాస్త్రితో కూర్చుని చాలా శ్రద్ధగా అభివృద్ధి చేయించుకున్నాడు. సినిమాలో మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్య గానాలను మారువేషంలో చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఆమెను మెచ్చుకుంటూ ఓ పద్యం చెప్పే సన్నివేశం ఉంది. అల్లసాని పెద్దన రాసినట్లుగా అల్లిక జిగిబిగితో రావాలన్న జాగ్రత్త వల్ల కృష్ణశాస్త్రితో 108 పద్యాలు రాయించుకుని అందులో ఒక్కటి ఎంపిక చేసుకున్నాడు బి.ఎన్.రెడ్డి.[2][3]

నటీనటుల ఎంపిక

[మార్చు]

చిత్రీకరణ

[మార్చు]

చిత్రీకరణ విషయంలోనూ దర్శకుడు బి.ఎన్.రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఉదాహరణకు సినిమాలో నాటకాన్ని చూడడానికి రాణి, రాజు వేర్వేరుగా బయలుదేరేప్పుడు రాణి బయలుదేరే వైభవాన్నే చూపించి, రాజుది తెరపై చూపకుండా వదిలేశాడు. దేనికంటే బి.ఎన్.రెడ్డి - "రాణిగారి వైభవం చూసి రాజుగారిది మరెంత గొప్పగా ఉంటుందోనని ప్రేక్షకులు ఊహించుకోవడానికి వదిలేయాలి. ఎంతో గొప్పగా ఊహించుకునే రాయలవారి వైభవాన్ని సంతృప్తికరంగా చిత్రీకరించడం కష్టం" అని వివరించాడు. ఇలా చిత్రీకరించిన సన్నివేశాలను, చిత్రీకరించకుండా వదిలివేసినవి కూడా జాగ్రత్తగా ఎంచుకుని చేశాడు.[4] ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పటేల్ మరణిస్తే అతని అభిమాని, అతనితో కొంత స్నేహం కలిగిన బి.ఎన్.రెడ్డి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అసిస్టెంట్లకు వదిలివెళ్ళాడు. వచ్చి చూసుకునేసరికి మహారాణి తిరుమలదేవి పాత్రధారిణి మహారాణికి తగినట్టు కొంగు వెనుక విడిచి నడవకుండా, కుడిచేత్తో పట్టుకుని సామాన్యురాలిగా నడిచినట్టు కనిపించింది బి.ఎన్.రెడ్డికి. దాంతో ఆ దృశ్యం తిరిగి చిత్రిస్తానని పట్టుబట్టగా, భాగస్వాములు ఆ కాస్త షాట్ల కోసం తిరిగి సెట్ వేసి చిత్రీకరించడం ఆర్థికంగా భారమని వివరించి ఎలాగో ఒప్పించారు.[5]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలే. స్త్రీలను ఆకర్షించేందుకు భక్తి పాటలను ఏదో విధంగా చొప్పించే రోజుల్లో ఈ సినిమాలో టైటిల్స్‌ శ్రీగణనాథం అనే పిళ్ళారి గీతం తప్ప మిగతా పాటలన్నీ సినిమాకు ముఖ్య కథాంశమైన అనురాగం, ప్రణయం, రెండవ థీం అయిన విజయనగర వైభవం చుట్టూ ఉండేలా రూపొందించారు.[3] మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సల్స్ నిర్వహించారు. అద్దేపల్లి రామారావు ఆర్కెస్ట్రా నిర్వహించాడు.

  • లంబోదర లకుమికరా - పురందర దాసు కీర్తన
  • కోతీ బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట -
పిలచిన బిగువటరా పాట
  • పిలచిన బిగువటరా ఔరౌరా - భానుమతి
  • ఔనా! నిజమేనా! మరతునన్నా మరువలేను- ఘంటసాల, భానుమతి
  • ఉషా పరిణయం యక్షగానం- కమలాదేవి, భానుమతి
  • పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి - భానుమతి
  • నోమి నోమన్నాల నోమన్న లాలా (సంప్రదాయ గానం)- భానుమతి
  • మనసున మల్లెల మాలలూగెనే - భానుమతి
  • ఎవరు ఏమని అంటారు - భానుమతి
  • ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు (జాలి గుండెల మేఘమాలా..)- బానుమతి, ఘంటసాల
  • ఎన్నినాళ్ళకీ బతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో - భానుమతి
  • ఝుం ఝుం ఝుం తుమ్మెదా తుమ్మెదా - కమలాదేవి
  • ఎందుకే నీకింత తొందరా ఇన్నాళ్ళ చెరసాల_పి.భానుమతి
  • జయ జయ జయ శభాశయా జయ విజయ శ్రీనగర_బృందం
  • నంద యశోదా నందునకు నవమధన దేవునకు_బృందం
  • పోయిరావే తల్లి పోయీరావమ్మా మాఇంట వెలసిన_బృందం
  • భళీరా ఎన్నడు జారే నీభూమికి రంభా రాగిణీ రత్నమే(పద్యం)_మాధవపెద్ది
  • మగువా నీ జనకునకు పగవాడ ...నా ప్రాణేశ్వరా నవమదన_
  • రావిచెట్టు తిన్నెచుట్టు రాతిబొమ్మలు చెక్కలోయి_జి.రామకృష్ణ, వి.శకుంతల
  • రావి చెట్టు మీద ఉయ్యాల రంగు రంగుల తూగుటూయ్యాల _జి రామకృష్ణ, వి శకుంతల
  • శ్రీ సతితో సరసీజన యనువలె చెలువున దేవేరితో_
  • ఎవరే పిలిచేరళ్లన మెల్లన పిల్లన గ్రోవిని ప్రియా ప్రియా
ఆకాశ వీధిలో - పాట

స్పందన

[మార్చు]

మల్లీశ్వరి సినిమా మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుని, విమర్శకుల ప్రశంసలు సాధించింది. మల్లీశ్వరి తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో స్వర్ణయుగానికి చెందిన గొప్ప సినిమాగా ప్రాచుర్యం పొందింది. ప్రేక్షకులు, అభిమానులు దీన్ని బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మేటి సినిమాగా ఎంచారు. ఈ సినిమా రచన చేసినందుకు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మద్రాసు (నేటి చెన్నై) పచ్చయ్యప్ప కళాశాల అధ్యాపక బృందం సన్మానించగా కృష్ణశాస్త్రి ఆ సందర్భంగా "వాస్తవంగా దీనికి అర్హుడైన వ్యక్తిని నేను కాదు. మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాతృలం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం" అన్నాడు.[6]

విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ చూశాడు. ఆయన గమనించిన విషయం- చిత్రంలో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణం గా. ఐతే రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?
  • మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, భావకవితోద్యమంలో ముఖ్యుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రిని పరిచయం చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. గొల్లపూడి, మారుతీరావు (11 జూన్ 2015). "'బుచ్చిబాబు' చిరంజీవి". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Archived from the original on 29 జూలై 2015. Retrieved 11 June 2015.
  2. దక్షిణామూర్తి, పాటిబండ్ల. కళాత్మక దర్శకుడు బి.యెన్.రెడ్డి.
  3. 3.0 3.1 రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. p. 30.[permanent dead link]
  4. రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. p. 28.[permanent dead link]
  5. రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. p. 29.[permanent dead link]
  6. రమణారెడ్డి, ఎం.వి. (2004). తెలుగు సినిమా స్వర్ణయుగం. ఎం.వి.రమణారెడ్డి. p. 25.[permanent dead link]

ఆధారాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]