అల్లసాని పెద్దన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లసాని పెద్దన

జననం 15, 16 శతాబ్దాల నడుమ
బళ్ళారి మండలం, దోరాల (దోర్ణాల) గ్రామం
ఇతర పేర్లు ఆంధ్ర కవితా పితామహుడు
రచనలు స్వారోచిషమనుసంభవము లేదా మనుచరిత్ర
గురువు శఠకోపయతి
ఆశ్రయమిచ్చిన రాజులు శ్రీ కృష్ణదేవ రాయలు

ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల ఆశువుగా చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయల వారికి సలహాలు ఇచ్చే వాడు . అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఇతడు నంద వరీక బ్రాహ్మణుడు.‌

ఉ. ముద్దుగ గండ పెండేరమున్ గొనుడంచు బహూకరింపగా

నొద్దిక నా కొసంగుమని యొక్కరు గోరగ లేరు లేరొకో


అని రాయల వారు సగము పద్యము జదువగా, మిగతా పద్యమును అల్లసాని వారు ఈ విధముగా పూరించారు.


పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే

పెద్దన కీ దలంచినను బేరిమి నా కిడు కృష్ణ రాణ్ణృపా!


ఇతఁడు బళ్లారి ప్రాంతము నందలి దోపాడు పరగణా లోని దోరాల అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను. ఈతని కృతి స్వారోచిషమనుసంభవము. ఇది మిక్కిలి ప్రౌఢకావ్యము.ఈ కావ్యానికి కృతి భర్త శ్రీ కృష్ణ దేవ రాయలు

అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల/ దోర్నాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు. కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. ఒకప్పటి కడప జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట అగ్రహారం ఉంది. రాయలు గారు ఈ అగ్రహారమును దానముగా పెద్దన గారు ఇచ్చినారని ఒక పద్యము నందు చెప్పు కొన్నారు.

సీ.: ఎదురైనచో దన మద కరీంద్రము నిల్పి కేలూత యొసగి యెక్కించు కొనియె

కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు లడిగిన సీమలందునిచ్చె

మను చరిత్రం బందుకొన వేళ బుర మేగ బల్లకి దన కేల బట్టి యెత్తె

బిరుదైన కవిగండపెండేరమున కీవె తగుదని తానె పాదమును దొడిగె.


తే.గీ.: ఆంధ్ర కవితాపితామహ అల్లసాని

పెద్దన కవీంద్ర యని నన్ను బిలుచునట్టి

కృష్ణరాయలతో దివి కేగ లేక

బ్రదికి యున్నాడ జీవచ్ఛంబనగుచు.‌


ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.[1]

రచనలు

[మార్చు]
  1. స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర)
అలభ్య రచనలు
  1. హరికథాసారము
  2. రామస్తవరాజము
  3. అద్వైత సిద్ధాంతము
  4. చాటు పద్యాలు

ఇవీ చూడండి

[మార్చు]


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు


మూలాలు

[మార్చు]
  1. ఎం.వి.ఎల్., నరసింహారావు (1974). కావ్యపరిచయాలు-మనుచరిత్ర (1 ed.). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ. p. 1.