శాంతి పర్వము ప్రథమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారత కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పసాగాడు. ఆ విధంగా ధర్మరాజు తన తమ్ములతో యుద్ధంలో ఇరువైపులా మరణించిన బంధు మిత్రులకు ఉదకకర్మలు నిర్వహించారు. తమతమ బంధువుల వలన కలిగిన అశౌచము తీరేవరకు గంగా నదీతీరంలో సమతల ప్రదేశం ఎంచుకుని కుటీరాలు నిర్మించుకుని నివసించసాగారు. ధృతరాష్ట్రుడు, విదురుడు తమ తమ భార్యలతో అక్కడ ఒకనెల కాలం నివసించారు. ఆ సమయంలో అక్కడకు వ్యాసుడు, దేవలుడు, కణ్వుడు, నారదుడు మొదలైన మహామునులు ధర్మరాజును చూడడానికి వచ్చారు. ధర్మరాజు తన తమ్ములు ద్రౌపదితో చేరి వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు నారదుడు ధర్మరాజుతో " ధర్మజా ! నీవు అదృష్టవంతుడవు. నీమేలు కోరుతూ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నీ వెంట ఉంటాడు. మహాబలశాలి అర్జునుడి సాయంతో నీవు ఈ భూమండలాన్ని జనరంజకంగా సేవిస్తావు. ధర్మజా ! ఇంతటి ఘోరయుద్ధం సంభవించినప్పుడు కూడా నీవు నీ ధర్మమును వీడ లేదు. నీ ధర్మనిరతి నీకు విజయాన్ని చేకూర్చినందుకు నీవు సంతోషిస్తున్నావా ? " అని అడిగాడు.

ధర్మరాజు యుద్ధపరిణామము తలచి చింతించుట

[మార్చు]

ధర్మరాజు " ఓ నారద మహర్షీ ! శ్రీకృష్ణుడు తన అశేష కృపాకటాక్షములను మా మీద వర్షించాడు కనుక, బ్రాహ్మణుల అనుగ్రహం మేము పొందాము కనుక, భీమార్జునుల భుజబల ప్రదర్శన మాకు విజయాన్ని చేకూర్చింది కాని ఈ యుద్ధములో మేము బంధుమిత్రులను, గురువులను, తండ్రులను కోల్పోయాము. ముఖ్యంగా వంశాంకురాలు అయిన అభిమన్య, ఉపపాండవులను వారి గర్భస్థశిశువులతో కోల్పోయాము. ఇరావంతుడు, ఘటోత్కచుల మరణం మా మనసులను కలచివేస్తుంది. మాకు కలిగిన విజయమూ ఒక విజయమేనా ! చెప్పండి " అన్నాడు.

కర్ణుడి మరణానికి ధర్మరాజు చింతించుట

[మార్చు]

ధర్మరాజు నారదుడితో ఇంకా ఇలా చెప్పసాగాడు " అదికాక మొదటి నుండి సుయోధనుడికి కుడి భుజంగా ఉన్న కర్ణుడు మా అన్న అని తెలిసి నా మనసు రగిలిపోతుంది. నా తల్లి కుంతీదేవి ఒంటరిగా కర్ణుడిని కలిసి తాను కర్ణుడి తల్లినని చెప్పింది. సూర్యుడి వరప్రసాదిగా కర్ణుడిని తాను కన్నానని అతడికి వివరించింది. ఆమె కౌరవులకూ పాండవులకు మధ్య ఉన్న వైరాన్ని మాన్పించమని కోరింది. అందుకు కర్ణుడు " అమ్మా ! సుయోధనుడు అర్జునుడిని ఎదిరించడానికే నన్ను చేరదీసాడు. ఇన్ని రోజులు సుయోధనుడిని ఆశ్రయించి ఉన్న నేను ఇప్పుడు నా స్వార్ధం చూసుకుని నన్ను పెంచిన వారిని ఇన్ని రోజులు నాతో బంధుత్వం పెంచుకున్న వారిని విడిచి రాలేను కనుక నీవు కోరినట్లు పాండవులను అందరినీ విడిచి పెట్ట లేను. అర్జునుడిని తప్ప మిగిలిన వారినెవ్వరినీ నా చేతబడినా నేను చంపను అన్నాడు " అని పలికి ఆమాట నిలబెట్టుకోవడానికే యుద్ధంలో అతడి చేతికి చిక్కిన మా నలుగురిన్నీ చంపక విడిచిపెట్టాడు. ఈ విషయాలను మా అమ్మ కుంతీదేవి మా నుండి దాచింది కనుక మేము మా అనుజుడినే చంపినాము. అతడు మా అనుజుడని తెలియని కారణంగా ఇంత ఘోరం జరిగింది. ఆనాడు కురు సభలో కర్ణుడు సుయోధనుడిని సంతోష పెట్టడానికి మమ్ము ద్రౌపది అనరాని మాటలు అన్నా నాకు అతడి మీద కోపం రాలేదు. ఒక్కోసారి కర్ణుడిలో మా తల్లి కుంతీదేవి పోలికలు కనిపించినా నేను అంతగా పట్టించుకో లేదు. సుయోధనుడి మాటలకు నాకు కోపం వచ్చినప్పుడు కర్ణుడి ముఖం కనిపించగానే కోపం స్థానంలో నా మనసు శాంతపడేది. ఓ నారద మహర్షీ కర్ణుడిని చంప కుండా నాకు ముఖం చూపవద్దని అర్జునుడిని తూలనాడాను. నేనే నా చేతులారా కర్ణుడిని చంపుకున్నాను. ఓ నారదమునీంద్రా అసలు కర్ణుడి రధచక్రం భూమిలో ఎందుకు కూరుకు పోయింది ? దానికి కారణమేమిటో నాకు వివరించగలరా ! " అని అడిగాడు.

కర్ణుడి మాత్సర్యం

[మార్చు]

ధర్మరాజు మాటలకు నారదుడు " ధర్మజా ! కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఇచ్చిన వరం కారణంగా మంత్ర ప్రభావంతో సూర్యదేవుడి వలన కుమారుడిని కన్నది. వివాహత్పూర్వం పుట్టినకారణంగా ఆమె ఆ విషయాన్ని లోకానికి చెప్పడానికి సిగ్గు పడింది. ఆ భయంతో ఆమె ఆ కుమారుడిని నదిలో విడిచింది. సూర్యదేవుడి వలన కుమారుడిని కన్నా కాని ఆమె కన్యాత్వానికి భంగం కలుగలేదు. నదిలో కొట్టుకుని పోతున్న మందసాన్ని తెరిచి చూసిన సూతుడు అప్పటి వరకు తనకు సంతానం కలుగని కారణంగా తానే పెంచుకున్నాడు. కాని కర్ణుడికి మొదటి నుండి మీ మీద మాత్సర్యం పెంచుకున్నాడు. నీ ధర్మనిరతి, భీమార్జునుల పరాక్రమం, నకుల సహదేవుల నీతిశాస్త్ర పాండిత్యం అతడికి నచ్చలేదు. మీరంతా ప్రజాభిమానం పొందడం అతడికి కంటగింపయ్యింది. అది అతడి స్వభావం. మీ మీద మాత్సర్యంతోనే అతడు సుయోధనుడి దరిచేరి అతడితో మైత్రి చేసాడు. విలు విద్యలో అర్జునుడి నైపుణ్యం చూసి ఒక రోజు కర్ణుడు ద్రోణుడి వద్దకు వెళ్ళి తనకు బ్రహ్మాస్త్రం నేర్పి అర్జునుడితో సమానం చేయమని కోరాడు ఆ మాటలకు ద్రోణుడు " కర్ణా ! బ్రహ్మాస్త్రం బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్ప ఇతరులకు ఉపదేశించ కూడదు. కనుక నేను నీకు బ్రహ్మాస్త్రం ఉపదేశించ లేను " అన్నాడు. కర్ణుడు మౌనంగా తన మందిరానికి వెళ్ళాడు.

కర్ణుడు విలువిద్యను అభ్యసించుట

[మార్చు]

ద్రోణుడు బ్రహ్మాస్త్రం నేర్పించ నిరాకరించిన తరువాత కర్ణుడు మహేంద్రగిరి వద్ద ఉన్న పరశురాముని వద్దకు వెళ్ళి తాను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి పరశురాముని శిష్యుడిగా చేరాడు. పరశురాముడు కర్ణుడిని తన ప్రియ శిష్యుడిగా స్వీకరించాడు. కర్ణుడు పరశురాముడి వద్ద అస్త్రవిద్యను అభ్యసిస్తున్నాడు. ఒక రోజు కర్ణుడు అస్త్రవిద్యను అభ్యసించే సమయంలో కర్ణుడి బాణం తగిలి ఒక బ్రాహ్మణుడి హోమధేనువు చనిపోయింది. అందుకు కోపించిన బ్రాహ్మణుడు " యుద్ధంలో ప్రాణాపాయ సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకు పోవుగాక " అని శపించాడు. తరువాత కర్ణుడికి పరశురాముడి శాపంకూడా తగిలింది. కర్ణుడు పరశురాముడి వద్ద బ్రహ్మాస్త్రం మొదలు అన్ని అస్త్రములను అభ్యసించాడు. ఒక రోజు పరశురాముడు అలసి పోయి కర్ణుడి తొడ మీద తలపెట్టి నిద్రించసాగాడు. ఒక భయంకరమైన పురుగు కర్ణుడి తొడ తొలిచి రంధ్రం చేయసాగింది. తొడ కదిలిస్తే గురువుగారికి నిద్రా భగం ఔతుందని కర్ణుడు ఆ బాధను మౌనంగా భరించాడు. ఆ గాయం నుండి కారిన రక్తం ప్రశురాముడిని తాకగానే పరశురాముడు నిద్ర నుండి లేచాడు. పరశురాముడు కర్ణుడిని అడిగి విషయం తెలుసు కున్నాడు. పరశురాముడు ఆ పురుగును చూడగానే ఆ పురుగుకు శాపవిమోచనం అయి ఒక రాక్షస రూపం ధరించి " మహాత్మా ! తమరి వీక్షణంతో నాకు శాప విమోచనం అయింది. ధన్యుడ నయ్యాను. నేను "శగ్రస్తుడు" అనే రాక్షసుడిని. నేను పూర్వం భృగు మహర్షి భార్యను అపహరించి ఎత్తుకు పోతుండగా ఆయన ఇచ్చిన శాపంతో ఇలా కీటకంగా మారాను. అమృత సమానమైన మీ చూపులతో శాప విమోచనమైంది " అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత పరశురాముడు కర్ణుడిని చూసి " కర్ణా ! నీవు చూపించిన సాహసం బ్రాహ్మణోచితం కాదు నీవు ఎవరివో నిజం చెప్పు " అని అడిగాడు. కర్ణుడు భయంతో వణుకుతూ " గురుదేవా ! నేను బ్రాహ్మణుడను కాను సూతుడను " అని బదులిచ్చాడు. పరశురాముడు కర్ణుడు తనతో అసత్యం పలికినందుకు కోపించి " కపటంతో అసత్యమాడి నీవు నా వద్ద నేర్చిన అస్త్ర విద్యలు నీకు పనికి రాకుండా పోతాయి " అని శాపం ఇచ్చాడు. కర్ణుడు ఖిన్నుడై అక్కడ నుండి సుయోధనుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. కనుక ధర్మరాజా ! నీ అన్న కర్ణుడు అసత్యం పలుకుటలో ఆరితేరిన వాడు " అన్నాడు.

శుభాంగి స్వయంవరం

[మార్చు]

కళింగ దేశపు రాజు చిత్రాంగదుడు తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి సుయోధనుడు, కర్ణుడితో కలిసి వెళ్ళాడు. ఆ స్వయం వరానికి శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులు హాజరయ్యారు. స్వయంవరంలో శుభాంగికి ఆమె చెలికత్తె ఒక్కొక్క రాజును పరిచయం చేస్తుండగా శుభాంగి ఎవరి మెడలోను వర మాల వేయక సుయోధనుడిని కూడా దాటి పోయింది. అది చూసి సుయోధనుడు కోపించి ఆమెను తన రథం మీద పెట్టమని ఆజ్ఞాపించాడు. అది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులంతా సుయోధనుడి మీద విరుచుకు పడ్డారు. సుయోధనుడు వారితో ఘోరంగా పోరాడాడు. కర్ణుడు తన అస్త్ర విద్యా నైపుణ్యంతో రాజులందరితో యుద్ధం చేసాడు. కర్ణుడి ధాటికి తాళ లేక రాజులందరూ పారి పోయారు. సుయోధనుడు శుభాంగిని తీసుకుని హస్థినా పురానికి వెళ్ళాడు. ఆ సమయంలో తనకు జరిగిన పరాభవాన్ని తలచుకుని జరాసంధుడు కర్ణుడిని తనతో యుద్ధం చెయ్యమని కోరాడు. అందుకు అంగీకరించిన కర్ణుడు జరాసంధునితో యుద్ధంచేసాడు. ముందు అస్త్ర శస్త్రములతో యుద్ధంచేసాడు. తరువాత జరిగిన బాహాబాహీ యుద్ధంలో కర్ణుడు జరాసంధుని ఓడించాడు. క ర్ణుడి పరాక్రమానికి మెచ్చిన జరాసంధుడు అతనికి మాలినీ నగరాన్ని బహూకరించాడు.

కర్ణుని మరణానికి కారణం

[మార్చు]

కర్ణుడి గొప్పతనానికి కలత చెందిన ఇంద్రుడు కపట బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుడి కవచ కుండలాలను దానంగా అడిగి పట్టుకు వెళ్ళాడు. అర్జునుడు కర్ణుడిని వధించ గలగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కనుక ధర్మజా ! నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. మొదట బ్రాహ్మణ శాపం, తరువాత పరశురాముడి శాపం, తరువాత ఇంద్రుడు కవచకుండలాలను పట్టుకు పోవడం, ఆ పై కుంతీదేవికి ఇచ్చిన వరం కారణంగా మీ నలుగురు అన్నదమ్ములను విడుచుట, భీష్ముడు కర్ణుడిని అర్ధ రథుడిగా ప్రకటించుట, తరువాత శల్యుడు తన ములుకుల వంటి మాటలతో కర్ణుడిని హింసించుట ఇన్ని తోడయ్యాయి కనుకనే అర్జునుడు కర్ణుడి ఓడించ గలిగాడు. ధర్మజా ! అది కాక అర్జునుడికి వరుణుడు, పరమశివుడు, ఇంద్రుడు, యముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీరంతా దివ్యాస్త్రాలను ప్రీతితో ఇచ్చారు. అందువలన అర్జునుడు కర్ణుడిని వధించాడు కాని, లేకున్న కర్ణుడిని జయించడం అర్జునికి వీలు కాని పని " అని నారదుడు పలికాడు.

ధర్మరాజు తల్లి కుంతీదేవిని శపించుట

[మార్చు]

నారదుడి మాటలను విని ధర్మరాజు తీవ్రమైన శోకంతో మరింత కలత చెందాడు. పక్కనే ఉన్న కుంతీదేవి ధర్మరాజును ఓదారుస్తూ " నేను కర్ణుడిని కలిసి అతడి జన్మ రహస్యం చెప్పి అతడిని మీ వైపు రమ్మని ఆహ్వానించినప్పుడు సూర్యభగవానుడు వచ్చి " కర్ణా కుంతి చెప్పింది నిజం " అని పలికాడు. అయినా కర్ణుడు సుయోధనుడిని వదిలి రావడానికి ఇచ్చగించ లేదు. అటువంటి కర్ణుడిని తలచుకుని ఇప్పుడు ఎందుకు బాధ పడుతున్నావు " అని పలకగా ధర్మరాజు తల్లిని ఏహ్యభావంతో చూసి " అమ్మా ! నీవు ఈ రహస్యాన్ని మా నుండి దాచినందు వలనే ఈ అనర్ధం జరిగింది కనుక నేటి నుండి స్త్రీలకు రహస్యం దాచే శక్తి క్షీణించును గాక " అని స్త్రీ జాతినంతా ధర్మరాజు శపించాడు. అయినా ధర్మరాజు మనసు కుదుట పడలేదు.

ధర్మరాజు విరక్తి

[మార్చు]

యుద్ధ పరణామాలకు విరక్తి చెందిన ధర్మరాజు " ఎవ్వరూ లేని ఈ రాజ్యం మనకెందుకు ఎక్కడికైనా వెళ్ళి భిక్షుక వృత్తి స్వీకరించి బ్రతుకు వెళ్ళబుచ్చుదాము. అప్పుడే నా మనస్సుకు శాంతి లభిస్తుంది. అర్జునా ! మనమంతా దాయాదులను చంపాము. అది మనలను మనం చంపుకోవడంతో సమానం కాదా ! ఎందుకీ క్షత్రియ ధర్మం, కాల్చనా ! వనములలో ఉండి అహింసావ్రతమును పాటిస్తూ బ్రతకడం ధర్మం కాదా ! అందుకని మనం తిరిగి వనములకు వెడదాము. రాజ్యం అనే ఈ మాంసం ముక్క కొరకు పశువుల మాదిరి కొట్టుకున్నాము, చంపుకున్నాము, వంశనాశనం చేసుకున్నాము. ఇప్పుడు ఇంతటి కుత్సిత బ్రతుకు బ్రతుకుతున్నాము. అర్జునా ! ఈ కురు సామ్రాజ్యమే కాదు. ముల్లోకాధిపత్యం ఇచ్చినా నా మనస్సు శాంతించదు. నాకీ రాజ్యం వద్దు మీరే ఏలుకొండి. మన పెద నాన్న పుత్రవ్యామోహంతో తన కుమారుడైన సుయోధనుడిని కట్టడి చేయ లేక పోయాడు. ఆ నీచుడి వలన వంశనాశనం అయింది. సుయోధనుడిని చంపి మనం మన కోపం తీర్చుకున్నాము కాని, నా మనసంతా శోకపరితప్తమైంది. నేను మాత్రం ఏమి చేశాను? రాజ్యకాంక్షతో యుద్ధానికి సిద్ధపడి పాపం చేసాను. ఈ హేయమైన యుద్ధం వలన లభించిన రాజ్యమును వదిలితే గాని నాకు మనశ్శాంతి లభించి మనసు పరిశుద్ధం కాదు. అందుకని నేను తపోవనానికి వెళ్ళి మునివృత్తి స్వీకరించి శేషజీవితం ఆనందంగా గడుపుతాను " అని ధర్మరాజు అన్నాడు.

అర్జునుడి కోపం

[మార్చు]

ఆ మాటలకు అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది. అయినా తమాయించుకుని దానిని మనసులో దాచుకుని పైకి చిరునవ్వు నవ్వుతూ " అన్నయ్యా ! ఇలాంటి మాటలు ఎక్కడన్నా ఉన్నాయా ! ఎప్పుడైనా విన్నామా ! అరివీర భయంకరులమై శత్రువులను ఓడించి రాజ్యలక్ష్మిని చేపట్టాము. అది అంతా మరచి పోయి ఇప్పుడు ముని వృత్తి స్వీకరిస్తానని చెప్పుట తగునా ! మనం సుయోధనుడి మాదిరి అధర్మంగా రాజ్యం పొందలేదు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పొందాం. ధర్మబద్ధమైన రాజ్యమును పాలించకుండా వదలడం ధర్మమా ! అలాంటి వాడివి యుద్ధం చేసి ఇందరు రాజులను చంపడం ఎందుకు. ఇంత చేసి ఇప్పుడు రాజ్యాన్ని వదిలి ముని వృత్తిని స్వీకరిస్తానని చెప్పిన నిన్ను లోకం పిరికి వాడని నిందించదా ! మనం యుద్ధం వలన పొందిన పాపమును అశ్వమేధ యాగం చేసి పోగొట్టుకోవచ్చు. అంతే కాని క్షత్రియ ధర్మాన్ని వదిలి మునివృత్తి స్వీకరించుట అధర్మం కాదా ! అన్నీ ధర్మాలకు మూలమైన సంపద లేని నాడు చచ్చినవాడితో సమానం కాదా ! సంపదలు ఉంటే బంధువులు వారంతట వారే మన దగ్గరకు వస్తారు. సంపదలే మిత్రులను మనకు దరిచేరుస్తుంది. సంపద శౌర్యమూ, ధైర్యమూ, సద్బుద్ధీ కలుగజేస్తుంది. రాజ్యసంపద పురుషార్ధాలలో మేటి, అలాంటి రాజ్యసంపద మనకు ధర్మబద్ధంగా ప్రాప్తించింది. ఆ సంపదను అనుభవించడం మనధర్మం కాదా ! దేవతలు కూడా దాయాదులను చంపే అభివృద్ధిని సాధించారు. దాయాదులను, శత్రువులను చంపకుండా రాజ్య సంపద లభిస్తుందా ! వేదములు కూడా శత్రుసంహారం చేసి రాజ్యసంపద పొంది యజ్ఞ యాగాదులతో దేవతలను సంతోషపెట్టి చని పోయిన తరువాత ఉత్తమగతులు పొందడమే క్షత్రియ ధర్మం. మన పూర్వీకులైన దిలీపుడు, నృగుడు', అంబరీషుడు, సగరుడు, నహుషుడు, మాంధాత మొదలగు రాజులు ఈ ధర్మాన్నే అనుసరించి ఉత్తమగతులు పొందారు. ప్రస్తుతం నిన్ను వరించిన చక్రవర్తిపదవిని త్యజించుట న్యాయమా ! నీవు కూడా నీ పూర్వీకుల వలె యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి కాకపోతే నీకు పుణ్యం ఎలా లభిస్తుంది. అశ్వమేధయాగం చేసిన రాజులంతా పునీతులైయ్యారు " అని అర్జునుడు పలికాడు.

ధర్మరాజు దుఃఖం

[మార్చు]

అర్జుడి మాటలు ధర్మరాజు ను స్వస్థుడిని చేయలేక పోయాయి. అతడు తన దుఃఖాన్ని వీడక " అర్జునా ! ఎందుకో నా మనసు రాజ్యపాలనకు అంగీకరించడం లేదు. ఈ లోకంలో తృప్తిని మించిన సంతోషం వేరొకటి లేదు. ఈ నిస్సారమైన సంసారం వీడి ఒంటరిగా అడవులకు వెళ్ళి అక్కడ ఉన్న తాపసుల పలుకులు వీనులవిందుగా వింటూ కాలం గడపడం ఎంత బాగుంటుంది. నిందను పొగడ్తను సమంగా స్వీకరిస్తూ కత్తితో పొడిచిన వాడిని మేనికి చందమును అలదిన వాడిని ఒకటిగా చూస్తూ మూగవాడిలా మౌనవ్రతం ఆచరిస్తూ పర్ణశాల నిర్మించుకుని ఎవరు ఏమిచ్చినా భగవత్ప్రసాదంగా స్వీకరించి తృప్తి చెందడం కంటే ఆనందం మరొకటి కలదా ! అలా కాకుండా కర్మమార్గంలో ప్రయాణిస్తే పాపం మూట కట్టుకోవడం తప్ప మనకు ఒరిగేది ఏముంది? కనుక నేను మోక్షమార్గముకు దూరం కాలేను. దేవుడి కృప వలన అమృత తుల్యమైన జ్ఞానం లభించింది. అదే శాశ్వతం, అదే మోక్షమార్గం, నేను దానిని వదులుకోలేను " అన్నాడు.

భీముడి హితవు

[మార్చు]

ఆ మాటలు విన్న భీమసేనుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! నీవు కర్మయోగివి. శృతి విహితమైన కర్మలు ఆచరించకుండా జ్ఞానమార్గం అవలంబించడం న్యాయమా ! యుద్ధంలో అనేక మంది మరణాన్ని చూసి బంధుమిత్రులను పోగొట్టుకుని నీకీ విరక్తి, అసూయ వచ్చాయి. కాని ఈ వైరాగ్యం, ఈ కోపం, ఈ అసూయ యుద్ధానికి ముందు వచ్చి ఉంటే ఎంతో మంది రాజులు, బంధువులు, స్నేహితులూ ప్రాణాలు విడువక ఉండే వారు కదా. మేమూ రాజ్యం మీద ఆశ వదిలి మునివృత్తి స్వీకరించి ఉండేవాళ్ళం. ఈ మహాభారత యుద్ధం జరిగేదీ కాదు, ఇంత ప్రాణ నష్టం జరిగి వుండేదీ కాదు. ఆనాడు భీకర ప్రతిజ్ఞ చేసి యుద్ధంలో పాల్గొని అందరినీ చంపి ఇప్పుడు అడవులకు పోతాను అంటే విన్న వారు ఏమనుకుంటారు. నిన్ను హేళన చేయరా ! వెనుకటికి నీ లాంటి వాడొకడు కష్టపడి బావి తవ్వి చివరకు నీళ్ళు త్రాగ కుండా ఊరుకున్నాడట. ఎత్తైన చెట్టెక్కి శ్రమ పడి తేనెపట్టును కొట్టి తేనెను త్రాగక ఊరుకున్నాడట, విస్తరి నిండా మృష్టాన్నం వడ్డించే వరకు ఉండి తరువాత తినకుండా విడిచి వెళ్ళాడట. కోరి వచ్చిన వనితను విడిచి వెళ్ళాడట, నీ భుజ బలంతో పరాక్రమంతో శక్తియుక్తులతో రాజ్యలక్ష్మిని కైవశం చేసుకుని రాజ్యపాలన చేయకుండా అడవులకు పోతాను అనడం కూడా అటువంటిదే కదా ! అయినా నీకు అన్నీ తెలుసు. నీకు నేను చెప్పగలిగినది ఏమున్నది. నీవు అడవులకు పోతుంటే నీ వెనుక మేము నడుస్తుంటే లోకులు నవ్వుతూ " ఈ వెర్రి వాళ్ళు అడవులకు పోతాననే ధర్మరాజు ను ఆపకుండా ఆయన వెనుక వీళ్ళూ వెడుతున్నారు " అని హేళన చేయ్యరా ! నీవు అడవులకు పోయి నీ తమ్ములందరినీ రాజ్యభోగాలకు దూరం చేస్తావా ! ప్రజలను శోకసాగరంలో ముంచుతావా ! ధర్మరాజా ! కర్మ రాహిత్యమే మోక్షమార్గం అయితే అరణ్యంలోని చెట్లు కర్మలు చెయ్యవు కదా ! వాటికి మోక్షం రాలేదు కదా ! అన్నయ్యా కర్మలను త్యాగం చెయ్యడం కాదు కర్మలు ఆచరిస్తూ కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి, తాను చేసే కర్మలన్ని బ్రహ్మార్పణం అంటూ నిష్కామకర్మలో మునిగి తేలాలి. అప్పుడు తత్వజ్ఞానం కలిగి కర్మరాహిత్యమై మోక్షం లభిస్తుంది " అన్నాడు.

అర్జునుడు కర్మాచరణ విశిష్టత చెప్పుట

[మార్చు]

భీముడు మాటలకు కూడా ధర్మరాజు లో ఏమీ మార్పు రానందున అర్జునుడు అందుకుని " ధర్మజా ! నాకు తెలిసిన ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కొంత మంది బ్రాహ్మణ బ్రహ్మచారులు తమ కులముకు ఉచితమైన ఆచారములను వదిలి అడవులకు వెళ్ళారు. వారి మీద దయ కలిగిన ఇంద్రుడు ఒక పక్షి రూపంలో వారి వద్దకు వెళ్ళి" మీరు ఎంచుకున్న మార్గం తప్పు " అని చెప్పాడు. ఆ బ్రహ్మచారులు ఆ పక్షిని మహాత్ముడిగా గుర్తెరిగి తమకు తగిన మార్గం ఉపదేశించమని అడిగారు. అప్పుడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు ఇలా చెప్పసాగాడు " చతుష్పాదములలో గోవు, శబ్ధములలో మంత్రం, మనుష్యులలో బ్రాహ్మణుడు అత్యంత శ్రేష్టమైన వారని వేదవిదులు చెప్తారు. కనుక బ్రాహ్మణుడు మంత్రోపాసన చేసి తనకు నిర్ధేశించిన కర్మలు చెయ్యడం అతడి కర్తవ్యం. కానీ నిర్లక్ష్యంచేత కాని, కోపంచేత కానీ, శోకంచేత కానీ, తనకు నిర్దేశించిన విద్యుక్త కర్మలను చెయ్యకపోవడం మహాపాతకం. అజ్ఞానులు, అర్ధహీనులు సన్యాసం గురించి తెలియక ఉభయభ్రష్టులు ఔతున్నారు. ఎవరైతే గృహస్థు ధర్మాలను పాటిస్తూ అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతృప్తిపరుస్తాడో అతడికి పుణ్యలోకములు అరచేతిలో ఉంటాయి. మంచి కర్మలు చేసి వాటిని బ్రహ్మార్పణం చేస్తే మహదానందం కలుగుతుంది " అని చెప్పాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణ బ్రహ్మచారులు గృహస్థాశ్రమం స్వీకరించి తమతమ విద్యుక్త ధర్మం నిర్వర్తించుటకు వెనుకకు వెళ్ళారు. కాబట్టి ధర్మరాజా ! నీవు నీ రాజ్యమును జనరంజకంగా పాలించు. యజ్ఞ యాగాదులు చేసి పుణ్యలోకాలను సంపాదించు " అని పలికాడు.

నకులుడు ధర్మరాజుకు నచ్చచెప్పుట

[మార్చు]

తరువాత ధర్మరాజు మనస్థాపం నివారించుటకు నకులుడు ఇలా చెప్పాడు. " అన్నయ్యా ! బ్రాహ్మణులు తమ విద్యుక్త ధర్మమైన యజ్ఞయాగాదులు చేసినపాపము నుండి విముక్తులు ఔతున్నారు. కేవలం యజ్ఞయాగాదులు చేసినందువలన ఏమి ప్రయోజనం ఉంటుంది. ఫలాపేక్ష లేకుండా ధనమును సంపాదించి యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణులను తృప్తిపరిచిన అది నిస్సంగప్రవృత్తి ఔతుంది కాని మనలోని కామక్రోధాలను, శోకమోహాలను విడిచి పెట్టకుండా అడవులకు పోయి తపస్సు చేసినందువలన ప్రయోజనం ఏమిటి ? అదియును కాక గృహస్థాశ్రమధర్మం, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసధర్మాలలో గృహస్థాశ్రమం శ్రేష్టమైంది. క్షత్రియులు ధనమును కూడబెట్టి క్రతువులు చెయ్యకపోయిన పాపం వస్తుందని వేదములు చెప్తున్నాయి, గాఢాంధకార బంధురమైన ఈ విశాలవిశ్వానికి వెలుగునిచ్చే ఈశ్వరుడే ఆశ్రమధర్మాలను వర్ణవ్యవస్థను ఏర్పాటు చేసాడు. ఈ యుద్ధం కూడా ఆయన కల్పించినదే ! భగవంతుడు నిర్ణయించిన యుద్ధమున జరిగిన హింసను తలచి నీవిలా శోకించి నీ ఆశ్రమధర్మమును విడుచుట తగునా ! యుద్ధంలో హింస జరిగిందని బాధపడుతున్నావు. మనకు ముందు పాలించినరాజులు యుద్ధములు చేయలేదా వారు ఉత్తమగతులు పొందలేదా ! నీకు ఈ యుద్ధమున ఏమీ పాపం అంటదు. ధర్మాత్ముడవైన నీకు తప్పక ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. క్షత్రియుని పాలనలో ప్రజలు రక్షణ కోరుకుంటారు. ప్రజలు సుఖంగా జీవించడానికి కావలసిన పరిస్థితులను కల్పించడం రాజువిధి. అది నెరవేర్చకపోవడం పాపంకాదా ! దానధర్మాలు చెయ్యడం క్షత్రియధర్మం. అర్హులైన వారికి నీవు దానధర్మాలు చెయ్యాలి. అవన్ని వదిలి నీవిలా అడవులకు పోవడం ఉత్తమధర్మమా ! నీకిది భావ్యమా ! " అని పలికాడు నకులుడు.

సహదేవుడి అభిప్రాయం

[మార్చు]

తరువాత సహదేవుడు " అన్నయ్యా ! మానవుడు పైపైన ఉన్న కోరికలు విడిచి జీవించిన అది మోక్షకారకం ఔతుందా ! అన్నయ్యా ! నీవు కూడా శారీరక సుఖం వదిలి నీ వంశధర్మములు నిర్వర్తించు. మమత బంధమును కలిగిస్తుంది. మమతను విడిచిన మోక్షం లభిస్తుంది. నీవు అడవులకు వెళ్ళినా ఈ లోకంలోని వస్తువులను, సౌఖ్యాన్ని నీ మనస్సు కోరిన అది నీకు ఉత్తమలోక ప్రాప్తికి ప్రతి బంధకం ఔతుంది. అన్నయ్యా ! నీవు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, చెలి, చుట్టం. నా మాట విని నీ మనస్సుమార్చుకో. నేను చెప్పింది అబద్ధమో, నిజమో నాకు తెలియదు. నేను భక్తితో పలికిన ఈ మాటలను నీవు కరుణతో విశ్వసించు " అని పలికాడు. నకులసహదేవుల మాటలకు ధర్మరాజు బదులు చెప్పలేదు.

ద్రౌపది రాజధర్మం వివరించుట

[మార్చు]

అప్పటి వరకు పెదవి విప్పని ద్రౌపది లేచి ధర్మరాజు వద్దకు వచ్చి " నాధా ! మీరు అనుమతి ఇచ్చిన నాకు తోచినమాటలు చెప్తాను " అని, ధర్మజుని అనుమతితో ఈ విధంగా చెప్పసాగింది. " నాధా ! మనం ఆడవులలో ఉన్నకాలాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అరణ్య అజ్ఞాతవాసాలు ముగియగానే సుయోధనుడిని చంపి మన రాజ్యసంపదలను తిరిగి కైవశం చేసుకుంటామని మీరు మీ తమ్ములకు నచ్చచెప్ప లేదా ! చెప్పినట్లు రాజ్యాన్ని కైవశం చేసుకుని ఇప్పుడిలా మాటతప్పి రాజ్యత్యాగం చేసి అడవులకు పోతానని చెప్పడం ధర్మమా ! ధర్మం సత్యం వ్రతముగా పెట్టుకున్న మీకు ఈ విధంగా పలకడం న్యాయమా ! రాజు ఎప్పుడూ పేదమనసుతో ఉండ కూడదు. రాజు తన రాజ్యమును, ప్రజలను రక్షించాలి, దుర్మార్గులను నిర్ధయగా శిక్షించి సన్మార్గులను దయతో రక్షించాలి. బ్రహ్మదేవుడు లోకాన్ని రక్షించడానికే క్షత్రియ కులాన్ని సృష్టించాడు. రాజు మనుష్యరూపంలో ఉన్న దేవుడు. అలాంటి రాజు చేతకాని వాడైన దుర్మార్గులు విజృంభిస్తారు. రాజునందు దేవుడు రాజనీతిని ప్రతిష్ఠించాడు. అపరాధులను శిక్షించడం రాజధర్మం దానిని నెరవేర్చిన ఇహపరములు సిద్దిస్తాయి. తప్పు చేసిన బ్రాహ్మణుడి నయినా రాజు శిక్షించడమే రాజధర్మం. ఇప్పుడు నీవు అదే రాజధర్మాన్ని నిర్వర్తించావు. రజస్వలను, ఏకవస్త్రను అయిన నన్ను సభకు ఈడ్చి వలువలు ఊడదీసి, తొడచూపి అవమానించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణులను నీవు ఒక రాజుగా శిక్షించావు. అది పాపంకాదు కనుక నీవు చింతించ పనిలేదు. విషప్రయోగం చేసిన వారిని, గృహదహనం చేసిన వారిని, రాజకీయ రహస్యములను బహిరంగపరచిన వాళ్ళను, హంతకులను, పరసతిని కోరిన వారిని, బందువులను చంపిన వాడిని శిక్షించడం రాజధర్మం. అది పుణ్యకార్యం. దండించ వలసిన వారిని దండించక పోవడం మహాపాపం. రాజు దండనీతిని అవలంబించడం పేదలకు, సాధువులకు, తాపసులకు మేలుచేస్తుంది. వారికి రక్షణ కలిగిస్తుంది, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్య వలసిన రాజు బ్రాహ్మణుల వలె ఇంద్రియనిగ్రహం పాటించడం ధర్మమా ! కనుక నీ మనసులోని శంకను తొలగించు. నాధా ! నా మాదిరి జీవితంలో కష్టపడిన వారు ఉన్నారా ! కాని నేను అన్నీ మరచి గృహస్థు ధర్మాలను విడువక నిర్వర్తించడం లేదా ! కౌరవులు వారి గోతిని వారే తవ్వుకున్నారు. వారిపాపం వారే అనుభవించారు. అందుకు మీరు బాధపడటం ఎందుకు. కనుక మీరు రాజ్యభారం వహించి ప్రజలను జనరంజకంగా పాలించండి. మీకు తెలియని యుద్ధనీతి లేదు. పూర్వం బృహస్పతి, శుక్రుడు యుద్ధనీతిని లోకానికి తెలిపారు. ఆ నీతిని కూలంకుషంగా అభ్యసించిన మీరు ఈ రాజ్యాన్ని పాలించుట ధర్మం " అని చెప్పింది.

అర్జునుడు రాజనీతిని వివరించుట

[మార్చు]

అర్జునుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. ప్రజలను పాలించవలసిన రాజు దండనీతిని వదిలిన, సన్యాసులు కూడా సన్మార్గం వదిలి అక్రమాలకు పాల్పడతారు. ప్రజలు క్రమము తప్పి ఒకరి ఆస్తిని, ధనమును, భార్యను మరొకరు అపహరిస్తారు. అరాచకం చెలరేగుతుంది. అందు వలన వచ్చే పాపం రాజుకు చుట్టుకుంటుంది. కనుక దండనీతిని పాపంగా తలచవద్దు. దుర్మార్గులను దండించిన రుద్రుడు, గోవిందుడు, ఇంద్రుడు, గుహుడు మొదలగు వారు పాపం పొందారా పైగా వారికి గౌరవాదరాలు లభించాయి. కనుక అన్నయ్యా ! దండనీతి వలన ధర్మం స్థాపించ పడుతుంది. అధర్మం నశిస్తుంది. అన్నయ్యా ! సామాన్య మానవులూ తమ దైనందిక జీవితంలో హింసకు పాల్పడక తప్పదు. మనం తినే పండ్లలో, నీటిలో, కాయలలో ఎన్నో కంటికి గోచరం కాని జీవులు ఉన్నాయి. అహారం కొరకు మనం వాటిని చంపుతున్నాము. మనం కందమూలాల కొరకు భూమిని తవ్వే సమయంలో అనేక జీవులు నశిస్తాయి అవి అన్నీ పాపమును కలిగిస్తాయా ! ప్రాణం నిలుపుకోవడానికి ఆహారం కావాలి, అహారం కావాలంటే హింస తప్పనిసరి. భగవంతుడు కూడా ఒక ప్రాణికి మరొక ప్రాణిని ఆహారంగా సమకూర్చ లేదా ! ధర్మమార్గాచరణలో చేసిన హింస పాపం కాదు. రాజుకు దుర్మార్గులైన శత్రువులను చంపడం అహింస కాదు. అన్నయ్యా ! మనతండ్రి పాండురాజు సంపాదించిన రాజ్యాన్ని మనం తిరిగి పొందుట అన్యాయం ఎలా ఔతుంది ? మనం చేసింది ధర్మయుద్ధమో అధర్మయుద్ధమో ఆ భగవంతుడికి తెలుసు. కనుక దక్షుడవై ఈ రాజ్యాన్ని పాలించు " అన్నాడు.

భీముని హితవు

[మార్చు]

ఎంత మంది ఏన్ని చెప్పినా ధర్మరాజులో చలనం లేదు. అప్పుడు భీముడు " అన్నయ్యా ! అన్నీ ధర్మములు తెలిసిన నీకు మేము చెప్పగలిగిన వాళ్ళమా ! కాని నా ఓర్పు నశించింది అందుకని తిరిగి తిరిగి చెప్పవలసి వచ్చింది. న్యాయ మార్గములో సంపాదించిన రాజ్యసంపదను విడుచుట పిరికితనం అనిపించుకుంటుంది. జనం మనలను చూసి పిరికివాళ్ళని చీదరించుకుంటారు. కపటజూదం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డాము. అవమానాల పాలయ్యాము. కాని నీవు సత్యాన్ని నమ్ముకున్నావు. మేము నిన్ను అనుసరించాము. యుద్ధములో అనేక మంది శత్రువులను చంపాము. నీకు ఎనలేని కీర్తి లభించింది. రాజ్యలక్ష్మి లభించింది. అసలు మనకు యుద్ధం చేయ వలసిన అవసరం ఎందుకు వచ్చింది. కౌరవసభలో పడిన కష్టాలు, అడవులలో అనుభవించిన ఇడుములు, అజ్ఞాతవాసంల్లో అనుభవించిన వ్యధ వలన శ్రీకృష్ణుని నిర్ణయం మేరకు అతడి సహకారంతో యుద్ధం చేసాము. యుద్ధంల్లో కౌరవులో మనమో చావడం తప్పదని యుద్ధానికి ముందే నీకు తెలియదా ! ఇప్పుడు శత్రువులు చచ్చారని బాధపడటం ఎందుకు ? కనుక అన్నయ్యా ! వచ్చి రాజ్యభారం వహించు " అని భీముడు పలికాడు.

ధర్మరాజు మునివృత్తిని సమర్ధించుట

[మార్చు]

భీముడి మాటలు సావధానంగా విన్న ధర్మరాజు " మీరు కోరికలు, మదం, భయంతో సతమతమౌతూ ఈ రాజ్యాన్ని పాలించమని కోరుతున్నారు. కాని రాజ్యపాలన దుఃఖభూయిష్టం అని పెద్దలు అంటారు. రాజుకు నరకం తప్పదని ఆర్యోక్తి. రాజ్య పాలనలో సుఖం శాంతి ఎలా లభిస్తుంది. కామపరమైన భోగములు అనుభవించడంలో ఆనందం ఎక్కడ ఉంది. వాటిని విడిచిన పరమానందం పొందవచ్చు. అరణ్యములలో కందమూలములు తిని జీవిస్తున్న మునులు వెర్రివాళ్ళా ! దుర్మతులు విషయసంబంధ విషయములలో చిక్కుకుని నిరంతర దుఃఖములు పొందుతున్నారు. విజ్ఞులు కోరికలను జయించి ప్రశాంత చిత్తులై జీవిస్తున్నారు. ఈ విషయంలో జనక మహారాజు మాటలు మనకు తెలుసు కదా ! " కోరికలు లేని వాడికి సంపదలతో పని లేదు. మిధిలా నగరం కాలి పోతున్నా నేను ఏ వస్తువూ కాలనట్లే భావిస్తాను " అన్నాడు కదా ! ఆ జనకమహారాజును అందరూ గౌరవించ లేదా ! బాగా ఆలోచించే శక్తి ఉన్న మీరు అజ్ఞానులై శాంతి కాముకుడు నిందార్హుడని అనడం ధర్మమా ! సంసార సుఖాలకు దూరంగా ఉన్న సర్వసంఘ పరిత్యాగికి సంసారంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళు పైనున్న వాడికి కొండ క్రింద ఉన్న వాడిలా కనిపిస్తాడు " అని అన్నాడు ధర్మరాజు.

జనకునికి అతడి భార్య హితవు

[మార్చు]

ధర్మరాజు మాటలకు అర్జునుడు ఇలా బదులిచ్చాడు. " నీవు చెప్పిన జనక మహారాజుకు ఆయన భార్యకు జరిగిన సంవాదం విను. నీ వలెనే జనకుడు రాజ్యమును వదిలి బిక్షుక వృత్తి స్వీకరించ నిశ్చయించినపుడు ఆయన భార్య " నాధా ! నీవు రాజ్యపాలన వదిలి భిక్షుక వృత్తి స్వీకరించిన ఇక్కడ అతిథి సత్కారాలు, దేవతర్పణములు, పితృ తర్పణములు ఎవరు చేస్తారు ? శిరోముండనం చేయించుకున్న తరువాత భిక్షకొరకు ఇల్లిల్లు తిరగాలి కదా ! మరి ఆ గృహస్థు మీకు అన్నదానం చేసి పుణ్యం పొందుతాడు కదా ! అన్నదానం వలన అధిక పుణ్యం వస్తుంది కదా ! దానం తీసుకునే వాడి కంటే దానం చేసే వాడు గొప్పని నీకు తెలుసు కదా ! వేదవిదులు రాజుల మీద ఆధారపడతారు. రాజైన మీరే మీ కర్తవ్యం వదిలితే మిగిలిన వారికి దిక్కెవ్వరు ? వారి బ్రతుకులు చెడుపుట మీకు ధర్మమా ! కన్నతల్లినీ కట్టుకున్న దానిని వదిలి, మీ కర్తవ్యం అడవులలో మీరు ఏమిసాధిస్తారు ? ఎండకు చలివేంద్రంగా, చెట్టుకు మధుర ఫలములుగా ఉండి ప్రజల కష్టములు తీర్చవలసిన మీరు ఇలా దీన వృత్తిని స్వీకరించ తగునా ! మీరు చేయదలచిన పని ధర్మవిరుద్ధం. దాని వలన మీకు మోక్షం కలుగుతుందని నేను అనుకోను " అని జనకుని భార్య జనకునితో చెప్పింది.

కర్మమార్గం

[మార్చు]

అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు " అర్జునా ! వేదాలు మానవులకు కర్మమార్గాన్ని నిర్ధేశించాయి. అదే వేదములు కర్మసన్యాస మార్గమును కూడా చెప్పి దాని వలన ఉత్తమగతులు కలుగుతాయని చెప్ప లేదా ! మానవుడు తన విజ్ఞతతో తనకు తగిన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఉత్తమకార్యములు చేస్తే పరలోకప్రాప్తి కలుగుతుంది. నీవు చెప్పినది లోకథర్మం అది తప్పు కాదు. కాని విజ్ఞులు, వేదవిదులు లోకపూజ్యులు చేసేది తప్పని అనగలమా ! నీవు ఇంద్రుడి పుత్రుడవు, భీముడు వాయుపుత్రుడు మీరిరువురు దైవాంశ సంభూతులు అరివీర భయంకరులు. శ్రీకృష్ణుడు మనతో ఉండటం వలన ఆయన తేజస్సు కూడా మీకు సంక్రమించింది. కాని మీరిరువురు యుద్ధవిద్యా విశారదులు కాని ధర్మవేత్తలు తత్వవేత్తలు కారు కదా ! ఈ సంసారం సారహీనమైనదని తత్వవేత్తలు అంటారు. ఆశాపాశములు వదిలి కర్మలు చేయుట మాని నిర్మలమైన మనసు కలవాడు సుఖి. ఎప్పుడూ ధనం సంపదల కొరకు పాకులాడు వాడు ఎన్నడూ సుఖించలేడు. వేదవేదాంగములు చదివి తత్వజ్ఞానమును రుచి చూసి కూడా జ్ఞానం లేని వారు కర్మమార్గమే మంచిదని ప్రభోదిస్తూ కర్మలలో పడి కొట్టు మిట్టాడు తుంటారు కాని శాశ్వత సుఖమును పొందలేరు. జ్ఞానసముపార్జన చేసిన వారు శమము, దమము, త్యాగము శాశ్వతానందం కొరకు మూలములని చెప్తారు. వాటిని నా వంటి విచక్షణ కలవారు అంగీకరించి ఆచరిస్తారు " అని పలికాడు ధర్మరాజు.

దేవస్థానుడు హితవు చెప్పుట

[మార్చు]

అక్కడే ఉన్న దేవస్థుడు అనే ముని " ఓ ధర్మరాజా ! ఈ లోకములో సుఖంగా జీవించాలంటే అర్జునుడు చెప్పినట్లు సంపదలు, ధనమూ కావాలనడం సత్యం. యోగమార్గముకు చక్కని సోపానములు కలవు నీవు ఆ మార్గమున పయనించిన కాని మోక్షమును పొందలేవు. భోగములు అనుభవించడానికి మాత్రమే ధనార్జన చేయడం తప్పే కాని యజ్ఞ, యాగములు చేయుటకు దాన ధర్మములు చేయుటకు ధనార్జన చేయడం తప్పుకాదు. పైగా దాని వలన మోక్షం కలుగుతుంది. యజ్ఞయాగాదులకు వినియోగించడానికి సంపాదించిన ధనం మనస్తాపాన్ని పోగొడుతుంది. దాని వలన శమము, దమము కలుగుతాయి. కనుక ధనం సముపార్జించి యజ్ఞయాగములు, దానధర్మములు చేయుము. ధర్మరాజా ! శివుడు సర్వమేధము అనే యజ్ఞం చేసాడు. దిక్పాలకులు, బ్రహ్మ ఎన్నో యజ్ఞాలు చేసారు. మరుత్తులు ఎన్నో యజ్ఞములు చేసి ఖ్యాతి పొందారు. ఒక సారి ఇంద్రుని కోరిక పై బృహస్పతి " ఇంద్రా ! కామము క్రోధము మనసున చేర నీయక ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ శోకమును దరి చేరనీయక తాను సుఖుడై ప్రజలను సుఖపెడుతూ రాజ్యపాలన చేసే వాడికి సర్వం వాటంతట అవి వచ్చిచేరతాయి. ధర్మజా ! కర్మలు చెయ్యడం కర్మలు వదలడం రెండూ మేలుకాదు. కర్మలు చేస్తూ దాని ఫలమును ఈశ్వరార్పణం చేయడం ఉత్తమమని పెద్దలు చెప్తారు. మంచి చెడ్డ పనులను సమానంగా చూస్తూ ఎవరికీ ద్రోహం తలపెట్టక క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ రాజ్య పాలన చెయ్యడం ఉత్తమం. నీకు పూర్వులైన రాజులందరూ ఇదే చేసారు. నీకు పూర్వులైన రాజులందరూ ఇదే ఉత్తమమార్గమని ఎంచి దానిని అనుసరించారు. తరువాత వారి కుమారులకు రాజ్యమును అప్ప చెప్పి వానప్రస్థాశ్రం స్వీకరించారు. నీవు కూడా అలాగే చెయ్యి " అని దేవస్థానుడు పలికాడు.

అర్జునుడు రాజధర్మం చెప్పుట

[మార్చు]

తరువాత అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! క్షత్రియ ధర్మం అనుసరించి యుద్ధం చేసావు. యుద్ధంలో చని పోయిన శత్రురాజులు ఉత్తమ గతిని పొందారు. రాజధర్మం రౌద్రమని బాలురకు తెలుసు. రాజ్యపాలనలో పాపాలకు తావు లేదు. రాజనేవాడు రాజ్య పాలన చేస్తూ పదిమందిని పోషించాలి గాని ఒకరు పెడితే తినడం ధర్మమా ! కురువంశ అగ్రగణ్యుడవు ఇది నీకు తగునా ! రాజుల మనసు వజ్రంలా కఠినంగా ఉండాలి కాని ఇలా బేలగా ఉండకూడదు. కనుక శోకం విడిచి రాజ్యభారం వహించు.

వ్యాసుడు ధర్మజునికి నచ్చచెప్పుట

[మార్చు]

ఎందరు ఎంత చెప్పినా ధర్మరాజు మనసు మారలేదు. అప్పుడు వ్యాసుడు ధర్మరాజు తో " ధర్మరాజా ! అర్జునుడి మాటలు అక్షరసత్యాలు. అన్ని ధర్మములలోకి గృహస్థధర్మం గొప్పది. మానవులకే కాక పశుపక్ష్యాదులకు అది ధర్మమే. క్షత్రియులకు గృహస్థధర్మము తప్ప మిగిలిన తపస్సు, ఇంద్రియనిగ్రహం, బ్రహ్మచర్యం ఆచరణ యోగ్యం కాదు. ధనం సంపాదించకుండా ఉండటం, ప్రజారక్షణ మరవడం, యుద్ధం చేయకుండా పారిపోవడం క్షత్రియులకు మహాపాతకం. ఇది వేదవాక్కు కనుక వేదమార్గాన నాడిచి ఈ భూమిని జనరంజకంగా పాలించు. ధర్మజా ! నీవు గురువుల వద్ద విద్యను అభ్యసించి ధర్మసూక్ష్మాలను చక్కగా ఎరిగిన వాడివి నీవు వర్ణాశ్రమ ధర్మములు తెలియని వాడివా ! భూమిని పాలించే రాజుకు దడనీతి తప్ప వేరు మార్గం లేదు. నీకు సద్యుముడు ఎలా దండనీతిని అమలు పరచి దుష్టులను శిక్షించి చివరకు మోక్షం పొందాడో తెలియాలి. ఆ కథ నీకు వివరిస్తాను.

సద్యుమ్నుడు

[మార్చు]

పూర్వం బహుదానదీ తీరంలో లిఖితుడు, శంఖుడు అనే ఇద్దరు బ్రాహ్మణ సహోదరులు ఉన్నారు. ఇద్దరూ ధర్మతత్పరులు. వారి ఆశ్రమంలో కాయలు, పండ్లు సమృద్ధిగా ఇచ్చే వృక్షాలు అనేకం ఉన్నాయి. ఒక రోజు శంఖుడు ఇంట్లో లేనప్పుడు లిఖితుడు ఆశ్రమంలో ఉన్న చెట్ల నుండి బాగా పండిన పండ్లలను కోసి తింటున్నాడు. అప్పుడు శంఖుడు అక్కడకు వచ్చి " ఈ పండ్లు ఎక్కడివి " అని అడిగాడు. లిఖితుడు " మీ చెట్లో కోసుకున్నాను " అన్నాడు. శంఖుడు " నా అనుమతి లేకుండా నా చెట్టు నుండి పండ్లు కోయవచ్చా ! అది దొంగతనం కాదా ! నీకు పాపం అంటింది. రాజదండనతో కాని ఆపాపం పోదు " అన్నాడు. వెంటనే లిఖితుడు రాజు వద్దకు వెళ్ళి వార్తాహరుల ద్వారా తన రాకను తెలియజేసి రాజును మంత్రులతో వెలుపలకు రప్పించాడు . సుద్యుమ్నుడు " విప్రోత్తమా ! మీరు ఇక్కడకు వచ్చిన కారణమేమి ? ఆజ్ఞాపించిన మీరు చెప్పినట్లు చేస్తాను " అని అన్నాడు. అందుకు లిఖితుడు " రాజా ! మీరు మాటతప్పక నేను చెప్పినట్లు చేయాలి. నేను నా సోదరుడి ఆశ్రమం లోని పండ్లను దొంగిలించాను. దానికి మీరు తగిన శిక్ష విధించి నన్ను పాప విముక్తిడిని చెయ్యండి " అని ప్రార్థించాడు. ఆమాటలకు చాలాబాధను అనుభవించిన రాజు ఇక తప్పదనుకుని లిఖితుడి చేతులు నరకమని దండన విధించాడు. లిఖితుడు రాజుకు దీవించి వెళ్ళాడు. అతడికి దండన అమలుజరిగింది. లిఖితుడు శంఖుడి వద్దకు వెళ్ళి తన తెగినచేతులు చూపి " నేను దండన అనుభవించాను " అన్నాడు. శంఖుడు సంతోషించి " లిఖితా ! ఎవరూ ధర్మమార్గం, తప్పకుడదు. నీ జీవితం ధన్యమైంది. నీవు బహుదానదికి వెళ్ళి దేవతర్పణములు, పితృతర్పణములు విడిచి పెట్టు. లిఖితా ! కల్లుత్రాగడం, గురుపత్నిని కామించడం, బ్రాహ్మణుల సొత్తు అపహరించడం ఇవి మహా పాతకములు. ఈ మహా పాతకములలో ఏ ఒక్కటి ఎవరు చేసినా అది బ్రాహమణుడైనా దండనార్హుడే. రాజు చేత దండింపబడిన వారు పుణ్యలోకాలకు పోతాడు. నీవు కూడా రాజదండన అనుభవించావు కనుక పుణ్యలోకాలకు పోతావు. అందుకు నీవు సంతోషించు " అన్నాడు. వెంటనే లిఖితుడు బహుదా నదికి వెళ్ళి తెగిన చేతులతో దేవతర్పణములు పితృతర్పణములు విడిచాడు. అతడు ఆశ్చర్యపడేలా అతనికి తిరిగి చేతులు వచ్చాయి. లిఖితుడు ఆనందంగా శంఖుని వద్దకు పరిగెత్తి పోయి శంఖుడికి తన చేతులు చూపాడు. శంఖుడు " ఇందుకు ఆశ్చర్యం ఎందుకు ? ఇది దైవకృప చేత నా తపోమహిమ చేత కలిగింది. నీవు నిర్మల మనస్కుడవు కనుక నీకు దైవానుగ్రహం కలిగింది. నిన్ను దండిచిన సుద్యుమ్న మహారాజు తన పితృదేవతలతో సహా పుణ్యాత్ములైయ్యారు " అన్నాడు.

క్షత్రియ ధర్మం

[మార్చు]

వ్యాసుడు ఇంకా ధర్మరాజుతో " ధర్మజా ! నీవు కూడా తగిన విధంగా ప్రజారక్షణ కావించుము. నీ తమ్ములు చెప్పిన మాటలు వేదవాక్కు. రాజనీతి దండన చేత తప్ప మరొక విధంగా నిర్వర్తించబడ లేదు. కనుక నీవు శోఖమును వదిలి గొప్పగొప్ప యాగములు, యజ్ఞములు చేసి చక్కగా రాజ్యాన్ని పాలించు. ధర్మనందనా ! నీ తమ్ములు నీ భార్య నీమాట మన్నించి పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేసి కష్టములు అనుభవించారు. ఇప్పుడు నీవు వారి మాట మన్నించి వారికి సుఖశాంతులు కలుగచెయ్యి. విరాగి అయి అడవులకు వెళ్ళి దేవతలకు పితృదేవతలకు బాధ కలిగించకు. నీకు న్యాయశాసస్త్రం బాగా తెలుసు. ప్రజల మనోభిష్టం తెలుసుకుని శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేసి దండనీతిని అమలు పరచే రాజుకు అన్నీ శుభాలే కలుగుతాయి. ప్రజల ఆదాయం నుండి ఆరవ భాగం పన్నుగావసూలు చెయ్యి. ప్రజలన్ము కన్నలబిడ్డల వలె పాలించు. ఇదే మోక్షముకు మార్గం చూపుతుంది. నీ మనసులో ఉన్న భయం సంశయం వదిలి పెట్టు. కాని ధర్మరాజా రాజు అహంకరించి కామ క్రోధవశుడై ప్రజాకంటకంగా పాలిస్తే అతడికి ప్రజలు చేసే పాపంలో నాల్గవభాగం లభిస్తుంది. శత్రువులను నిర్మూలించడం క్షత్రియ ధర్మం, పాపాత్ములైన రాజులతో సంధి చేసుకోవడం దోషం, శత్రువులతో సంధి చేసుకుని తన రాజ్యంలో కొంత భాగం ఇవ్వడం మంచిదికాదు. యుద్ధం చేసి రాజ్యరక్షణ చేయడం క్షత్రియ ధర్మమం. కనుక నీవు యుద్ధం చేసినందుకు చింతింప పని లేదు. దుర్యోధనుడితో సంధి చేసుకోక పోవడం వలన ఈ ఘోర యుద్ధం సంభవించింది అనుకోవడం నీ అవివేకం పూర్వం హయగ్రీవుడనే రాజు యుద్ధములు చేసి శత్రువులను జయించి, దుండగులను శిక్షించి. సన్మార్గులను రక్షించి, యజ్ఞయాగాదులు చేసి, ప్రజారంజకంగా పాలించి తుదకు సద్గతి పొందాడు. కనుక యుద్ధములు రాజులకు కీడు చెయ్యవు. యుద్ధంలో చావడం, చంపడం సహజం కనుక నీవు అనుమానం వదిలి సమర్ధులైన రాజోద్యోగులను నియమించి రాజ్యకార్యములు నిర్వహించుము " అన్నాడు.

కలత వీడని ధర్మరాజు

[మార్చు]

ఇన్ని చెప్పినా కలత వీడని ధర్మరాజును చూసి అర్జునుడి గుండెలు రగిలిపోతున్నాయి. కాని మనసులో కోపందాచి నిలబడి ఉన్నాడు. ధర్మరాజు వ్యాసుడితో " ఓ మహర్షీ ! ఈ యుద్ధంలో ఎంతోమంది స్త్రీలు తమభర్తలను, కుమారులను, సోదరులను పోగొట్టుకున్నారు. వారి విలాపములు శోకసంతాపములు నా హృదయానికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో నేను ఈ రాజ్యమును ఎలా ఏలగలను ? " అన్నాడు.

సుఖ దుఃఖములు

[మార్చు]

వ్యాసుడు " ధర్మరాజా ! సుఖదుఃఖములు నీ వశంలో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. దుఃఖాలు పొమ్మంటే పోవు, సుఖాలు రమ్మంటే రావు, ఈ లోకంలో అనుభవించే సుఖదుఃఖములకు హేతువు వారు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలే. అయినా ఈ సుఖదుఃఖములు శాశ్వతం కాదు. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం వస్తూపోతూ ఉంటాయి. దుర్మార్గులకైనా కాలం కలిసివస్తే అనంత సుఖాలు ప్రాప్తిస్తాయి. ఎంతటి సుగుణవంతుడికి అయినా కాలం కలిసి రాకున్న సంపద లభించదు. కాలం కలిసి రాకున్న మంత్ర తంత్రములు పని చెయ్యవు. వర్షం, తాపం, చీకటి, వెన్నెల దైవ కల్పితములు. కమలం వికసించండం, చెట్లు పుష్పించుట, కాయలుకాయడం, పండ్లుపండడం ఋతు ధర్మం కాల మహిమ. జననం, వృద్ధిపొందుట, క్షీణించుట, మరణించుట కాల ధర్మమే. వీటి కొరకు నీవు దుఃఖించుట అవివేకం.

సేనజిత్తు మహారాజు

[మార్చు]

వ్యాసుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. " ధర్మజా ! పూర్వం సేనజిత్తు మహారాజుకు పుత్రశోకం కలిగింది. అయినా శోకించలేదు. అతడు నీమాదిరి శోకించక తనతానే ఆశోకమును పోగొట్టుకున్నాడు. అతడు పలికిన పలికులు విను " ఈ లోకంలో కొందరు ఇతరులను బాధపెడతారు. మరి కొందరు ఇతరుల చేత బాధను అనుభవిస్తారు. ఇవన్నీ పూర్వజన్మ కర్మలఫలితం కాలమహిమ అనుకోవాలి కాని ఎవరో మనలను బాధిస్తున్నారని చింతించి వాటివలన సుఖం, దుఃఖం పొంద కూడదు. ధనం, భార్య, బంధువులు పోయారని చింతించుట అవివేకం. మనం దుఃఖించినందున బాధలు తొలిగి పోతాయా ! మనకు కలిగే శోకముకు భయముకు ఎన్నో కారణాలు ఉంటాయి. అన్నీ తెలిసిన వాడు శోకముకు భయముకు తలవంచడు. మూర్ఖుడైన వాడు వాటిని తలచుకుని దుఃఖిస్తుంటాడు. సుఖదుఃఖాలు శాశ్వతములు కావు కనుక వాటిని చూసి పొంగుట, కుంగుట తగదు. ఏమీ తెలియని వాడు, అన్నీ తెలిసిన వాడు సుఖ దుఃఖములకు చింతించడు. తెలిసీతెలియని వాడు మాత్రమే సుఖములకు పొంగి దుఃఖములకు కుంగి పోతాడు " అని చెప్పాడు సేన జిత్తు మహారాజు. ఆ మాటలు నీకూ వర్తించి నీ దుఃఖాన్ని పోగొడతాయి ధర్మరాజా ! వర్ణాశ్రమ ధర్మములు ఆచరించి దండనీతిని అమలు చేస్తూరాజ్యమును పాలించుట క్షత్రియ ధర్మం. చనిపోయిన తరువాత కూడా ఎవరిని గురించి ప్రజలు తలచుకుంటారో వాడే సత్పురుషుడు. కనుక క్షత్రిఉయ ధర్మమైన రాజ్యపాలన క్షత్రియుడవైన నీవు చేపట్టు " అని పలికాడు.

ధర్మరాజు వ్యధ

[మార్చు]

వ్యాసుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు వికల మనస్కుడై " మహర్షీ ! ఎన్ని చెప్పినా ద్రౌపదేయులనూ, అభిమన్యుడిని, కర్ణుడిని, విరాటుడిని, ధృష్టకేతుని మరువలేకున్నాను. నాకు మనశ్శాంతి లేకున్నది. మునీంద్రా ! నేను ఎంతటి పాపాత్ముడనంటే చిన్నతనంలో మమ్ము చేరదీసి, ఆదరించి, తొడమీద కూర్చుండ చేసి అన్నం తినిపించిన తాత భీష్ముడిని చంపాను, అర్జునుడు వేసిన బాణములు శరీరం అంతా గుచ్చుకుంటూ ఉంటే భీష్ముడు శిఖండి వైపు చూసిన చూపు నేను మరువ లేకున్నాను. పరశురాముడి శిష్యుడిని అంతటి మహాత్ముడిని ఈ తుచ్ఛరాజ్యము కొరకు ఇలాంటి దుర్మరణం పాలు చెయ్యడం నాకు కడుదుఃఖాన్ని కలిగిస్తుంది. విద్య చెప్పిన గురువు నేను అసత్యం పలకనని నమ్మి నన్ను అడిగినపుడు అసత్యం పలికి అతడి మరణానికి కారకుడిని అయ్యాను. గురువు నమ్మకాన్ని వమ్ము చేసి నేను గురుద్రోహిని అయ్యాను. నేను ఎంతటి పాపాత్ముడను గురువును చంపిన వాడికి ఏమి శిక్ష విధించాలో నాకు మీరే చెప్పాలి మహాత్మా ! నా అన్నయ్య కర్ణుడు స్వంత అన్నను చంపి రాజ్యమును నేను ఎలా ఏలగలను. అది నాకు ఎటుల ఆనందాన్ని ఇవ్వగలదు. భగభగ మండే అగ్నివంటి పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన నేను ఎంతటి క్రూరాత్ముడను. సుభద్రార్జునులు కనుక నా కౄరత్వాన్ని సహించారు. ఇంకొకరెవరైనా నన్ను నరికిపారవేయరా ! పసివాడిని అగ్నిగుండలో వేసినవాడికి రాజ్యం పాలించే అర్హత ఎక్కడిది? కడుపున పుట్టిన అయిదుగురు పుత్రులను పోగొట్టుకున్న ద్రౌపది దుఃఖాన్ని నేను ఎట్లు పోగొట్టగలను ? దీనికంతట్కీ కారణమైన నన్ను ప్రాయోపవేశం చేసి మరణం కొరకు ఎదురు చూడనివ్వండి " అన్నాడు.

వ్యాసుడి హితవు

[మార్చు]

ధర్మజుడు మాటలు విని వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియుడవైన నీకు ఈ బేలతనం తగయ్యా ! ఎన్ని చెప్పినా నీ శోకం తీరలేదు. ఈ సారి నీవు నీ బాధలు మరచి మనసుపెట్టి నా మాటలు విను. ఈ లోకమంతా ద్వంధములతో నిండి ఉన్నది వృద్ధి చెందడం నశించడంకొరకే, పుట్టడం మరణించడానికే, పెరగడం తరగడం కొరకే పుట్టడం చావడం కొరకే సుఖం వెటనే దుఃఖం ఉంటుంది. మితృలంతా మంచి చేస్తారని, శత్రువులు మాత్రమే కీడు చేస్తారని, మంచి వారికే ధనం ప్రాప్తిస్తుందని, ధనంతోతే సౌఖ్యం వస్తుందని అను కోవడం పొరబాటు. అలా అనుకోవడం బ్రహ్మరాతను ధిక్కరించడమే ఔతుంది. విధాత నిన్ను ఎందుకు పుట్టించాడో నీవు ఆ కర్మను నిర్వర్తించాలి. నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానని అనడం కుదరనిపని.

జనకుడి బంధువియోగం

[మార్చు]

వ్యాసుడు పూర్వం తనమాటలను పొడిగిస్తూ " పూర్వం విదేహమహారాజుకు బంధువియోగం కలిగింది. అయనకు అప్పటికి పరిపూర్ణజ్ఞానం కలుగలేదు. అందువలన ఆయన అత్యంతశోఖం అనుభవించి ఇల్లువిడిచి పోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతడివద్దకు అశ్మకుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. జనకుడు అతడికి అతిధిసత్కారాలు చేసి " విప్రోత్తమా ! మానవునకు సంపద కలిగినప్పుడు బంధువులు ఉన్నప్పుడు కలిగే ఆనందం, అహంకారం, మదము సంపద పోయినప్పుడు కలిగే దుఃఖముకు కారణమేమిటి ? " అని ఆడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు " ఈ విధంగా చెప్పాడు " జనకమహారాజా ! సంసారం అన్న తరువాత సుఖందుఃఖం సహజం. అవి మానవుడి మనస్సును చెదరగొడతాయి. ఈ లోకంలో ఎక్కువ సుఖంకాని ఎక్కువ దుఃఖంకానీ ఎవరికీ ఉండదు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ భూమిసమస్తం ఏలే చక్రవర్తికి కూడా వార్ధక్యం, మరణం సహజమే వాటిని ఎవరికీ ఆపకలిగే శక్తి లేదు. జీవితంలో ఏదిజరిగినా బుద్ధి చెదరనీయక అది తన ప్రాప్తమని అనుకోవడం విజ్ఞులలక్షణం. కాలం వలన ప్రతిమనిషికీ ఆహారం, భోగములు, మంచి పడక, మంచి ఆసనములు అన్నీ కాలగమనం వలన కలుగుతుంటాయి తిరిగి పోతుంటాయి. కనుక ఉన్నప్పుడు పొంగడం లేనప్పుడు కుంగడం విజ్ఞులలక్షణం కాదు. కనుక వాటియందు విపరీతకాంక్ష పెంచుకోవడం తగదు. వైద్యులు చక్కగా అభ్యసించి రోగికి మందులు ఎన్నిచ్చినా అన్నీ రోగములు తగ్గవు కదా ! వైద్యులకూ రోగములు రావడం సహజమే ! కనుక అంతా విధిరాతప్రకారం జరుగుతుంది. మానవప్రయత్నం చేయడం మన విద్యుక్ధర్మం. ధనవంతుల ఇంట పుట్టడం, యోగుల ఇంట పుట్టడం, అందచందాలు కలిగి ఉండడం, బలవంతులు అవడం, అదృష్టవంతులు అవడం, భోగాలు అనుభవించడం అన్ని పూర్వ జన్మ పుణ్యఫలం. పూటగడవని దరిద్రుడికి తామరతంపరగా పిల్లలు పుడతారు. కాని అత్యంత ధనవంతునికి ఎన్ని వ్రతాలు చేసినా సంతానభాగ్యం కలుగదు. పేదవాడు ఏదితిన్నా హరాయించుకుంటాడు. ధనవంతుడికి పట్టెడన్నంకూడా అరగదు. పరస్త్రీవ్యామోహం, జూదం, సురాపానం, జంతువులను వేటాడడం పెద్దలు నిర్ణయించారు. కాని లోకులనేకులు ఆ మార్గమున పోయి భ్రష్టులవడం దైవసంకల్పములే కాని మరేది కాదు. ఇష్టం అయిష్టములకు కారణం కనుక్కోవడం కష్టం. భార్యాబిడ్డలు నదిలో కొట్టుకు పోతున్న కట్టెలమాదిరి కలిసి విడిపోతూ ఉంటాయి. మానవులు తాను ఎన్నో జన్మలు ఎత్తి ఎందరో తల్లులను, తండ్రులను, పుత్రులను, పుత్రికలను, బందువులను, మిత్రులను పొందుతాడు. ఇన్నివేల మందిలో మానవుడు ఎవరికొరకు ఏడవగలడు ! ఈ జీవితం శాశ్వతం కాదని తెలుసుకొనుట వివేకులలక్షణం. నిరంతర కాలప్రవాహం ఒక సముద్రంలాంటిది. అందు మొసళ్ళు సంచరిస్తుంటాయి కనుక చావు పుట్టులకు అనివార్యం. అని తెలుసుకొని శోకం వదలాలి. జనక మహారాజా ! ఈ శరీరమే మనం అప్పు తెచ్చుకున్నాము. ఇంక దారాసుతులు, బంధుమిత్రులు శాశ్వతమా ! ఎంత ఏడ్చినా చచ్చినవాడు తిరిగి రాడు కదా ! వారికొరకు శోకించిన తీరనిబాధ అనుభవించడం తప్ప మిగిలేది ఏమిటి ? కనుక జనకమహారాజా ! బంధుమిత్రుల శోకమును వదిలి నీ విద్యుక్ధర్మమైన రాజ్యపాలన చేసి కీర్తి ప్రతిష్టలు పొందు " అన్నాడు. అశ్మకుడి మాటలతో జనకునికి జ్ఞానోదయం కలిగింది. ఆయన ఇల్లువదిలి పోవాలన్న భావనను వదిలి రాజ్యపాలన చేపట్టాడు. కనుక ధర్మరాజా ! నీవు కూడా క్షత్రియధర్మంగా రాజ్యపాలన చెయ్యి " అన్నాడు.

ధర్మజుడికి శ్రీకృష్ణుడి హితవు

[మార్చు]

వ్యాసుడు చెప్పిన మాటలకు ధర్మరాజు బదులు చెప్పకపోవడం చూసిన అర్జునుడు పక్కనే ఉన్న శ్రీకృష్ణుడితో " కృష్ణా ! అనేకంగా బంధువులను, కుమారులు, అన్నదమ్ములు ఒకేసారి యుద్ధంలోమరణించడంవలన ధర్మజుడి మనసు వికలమైఉంది. నీ అమృతవచనములతో అతడికి ఊరటకలిగించు " అని అర్ధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్దకు పోయి అతడి చేతులు పట్టుకుని అనునయిస్తూ " బావా ధర్మజా ! నీ కెందుకయ్యా ఈ మనోవేదన. నీ బంధుమిత్రులు అవక్రపరాక్రమంతో పారాడి మరణించి వీరస్వర్గం అలంకరించారు. రాజరికం ఒకకల. రాజులు మాత్రం కాదు ఏ ఒక్కరూ పూర్ణాయుర్ధాయంతో ఉండరు. పూర్వం సంవర్తనుడు అనే మహాముని ఉండే వాడు. అతడికి దేవగురువు బృహస్పతి అంటే అసూయ ఎక్కువ. అతడు హిమాలయ పర్వతప్రాంతంలో ఉన్న మరుత్తు చేత ఎన్నో యజ్ఞ యాగాదులు చేయించాడు. కాని ఆ మరుత్తు కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. సుహోత్రుడు అనే మహారాజు అశ్వమేధము మున్నగు అనేక యజ్ఞములు చేసాడు. కాని అతడు కూడా కాలగర్భంలో కలిసి పోయాడు. అలాగే అనేక దానధర్మాలు చేసిన అంగుడు ఎందరికో వివాహాది సత్కార్యములు చేసి కూడా కాలధర్మం చేయక తప్పలేదు. ఏడు ద్వీపములలో తన రథమును నడిపించిన శిబిచక్రవర్తి కూడా మరణించి ఉత్తమ గతులుపొందక తప్పలేదు. అదే విధంగా దశరథపుత్రుడైన శ్రీరాముడు, భగీరధుడు , దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబిందుడు, గయుడు, రంతి దేవుడు, భరతుడు, పృధుచక్రవర్తి వీరందరూ ఈ భూమిని ఏలిన చక్రవర్తులు. ఎన్నో యజ్ఞ యాదులు చేసిన వీరంతా శాశ్వతంగా జీవించ లేదు. అదే విధంగా 21 మార్లు దండ యాత్రర చేసి రాజులనుసంహరించి ఆ భూమిని అంతటినీ కశ్యపప్రజాపతికి దానంగా ఇచ్చిన జమదజ్ఞి పుత్రుడైన పరశురాముడు ఈ భూమి మీద శాశ్వతత్వం పొందలేదు. ఇవన్నీ నీవు అభిమన్యుడి మరణ సమయంలో శోకతప్తుడవై ఉన్నప్పుఇడు నారదుడి వలన విన్నావు. కాని అవివేకమును మానలేక ఉన్నావు " అన్నాడు.

పర్వతుడు

[మార్చు]

కృష్ణుడి మాటలు విని ధర్మరాజు " కృష్ణా ! నాకు సృంజయుడి వృత్తాంతం వినాలన్న కోరిక కలుగుతుంది. వివరించు " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! నీవు వ్యాసుడి వలన నారదుడి వృత్తాంతం విని ఉన్నావు. పర్వతుడి వృత్తాంతం విని ఉన్నావు అదికూడా చెప్తాను విను. ఒకసారి నారదుడు పర్వతుడు దివినుండి భువికి దిగివచ్చారు. ఆ సమయంలో వారిరువురు ఒక ఒప్పందంచే సుకున్నారు. ఒకరి మానసులోని మాట ఒకరికి దాపరికం లేకుండా చప్పాలన్నదే ఆ ఒప్పందం. అలా చెయ్యని ఎడల శాపగ్రస్తులు ఔతారన్నది ఆ ఒప్పందం. అలా వారిరువురు విహరిస్తూ వారు ఒకరోజు సృంజయుడిని కలుసుకున్నారు. వారు సృంజయుడి కోరికమీద అతడి గృహంలో కొన్ని రోజులు ఉందామని అనుకున్నారు. అప్పుడు సృంజయుడు తన కుమార్తె సుకుమారిని పిలిచి " అమ్మా ! వీరు మహర్షులు. వీరి సేవచేసి తరించు " అని చెప్పాడు. సుకుమారి అందుకు అంగీకరించింది. సుకుమారి సేవలతో నారదుడు, పర్వతుడు ఆనందంగా కాలం గడుపుతున్నారు. అతిలోక సుందరి అయిన సుకుమారి మీద మనసుమరులుగొన్న నారదుడు బయటకు చెప్పుకోలేక లోలోపలే కృంగిపోసాగాడు. నారదుడు అలా చిక్కిపోవడం చూసిన పర్వతుడు సందేహించి దివ్యదృష్టితో నారదుడి మనసులో విషయం తెలుసుకున్నాడు. పర్వతుడు తమఒప్పందం ప్రకారం నారదుడు తన మనసులో మాట బయటపెట్టనందుకు ఆగ్రహించి " నారదా ! నీకు సుకుమారి మీద మనసు లగ్నమైన విషయం నా వద్ద దాచి మనఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నేను నిన్ను శపిస్తున్నాను. నీవు ఆమెమీద మనసుపడ్డావు కనుక ఆమెను వివాహంచేసుకోకుండా ఉండలేవు. ఆమెను వివాహం చేసుకున్న మరుక్షణం నీకు కోతిముఖం ప్రాప్తించుగాక ! అని శపించాడు. అందుకు నారదుడు పర్వతుడి మీద కోపించి " నీకిక స్వర్గ లోక ప్రాప్తి ఉండక ఉండుకాక " అని ప్రతిశాపం ఇచ్చాడు. తరువాత నారదుడు శాపానికి భయపడక సృంజయుడి సహాయంతో అతడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పర్వతుడి శాపవశాన అతడికి కోతిముఖం వచ్చింది. అతడిభార్య సుకుమారి నారదుడి కురూపానికి అసహ్యించుకోక అతడిని సేవిస్తుంది. ఒక రోజు నారదుడు సమీపంలోని అరణ్యానికి వెళ్ళి అక్కడ పర్వతుడిని కలుసుకున్నాడు. పర్వతుడు నారదుడితో " నారదా ! నీవు నాకు ఇచ్చిన శాపం మరల్చవా ! " అని అడిగాడు. నారదుడు " పర్వతా ! నీవేకదా నాకు ముందుగా శాపం ఇచ్చావు. కనుక నీవు నీ శాపాన్ని ముందుగా మరల్చిన నేను నా శాపాన్ని వెనక్కు తీసుకుంటాను " అన్నాడు పర్వతునితో. నారదుడు పర్వతుడు తమతమ శాపాలను వెనక్కు తీసుకున్నందున నారదుడికి నిజరూపం వచ్చింది. వారిరువురు సృంజయుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ సుకుమారి వారిని గుర్తించక ఎవరో కొత్తవాళ్ళనుకుని లోపలకు వెళ్ళబోయింది. అప్పుడు పర్వతుడు " సుకుమారీ ! ఇతడు నారదుడు నీ భర్త. నేను ఇచ్చిన శాపవశాన నారదుడికి వానరముఖం వచ్చింది. నేను నా శాపం వెనక్కు తీసుకున్నందున అతడికి నిజరూపం వచ్చింది " అని చెప్పగానే అప్పుడు సుకుమారి కూడా తనభర్తను గుర్తించింది " అని కృష్ణుడు చెప్పాడు.

సృంజయుడి వృత్తాంతం

[మార్చు]

తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నాను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.

వ్యాసుడి హితవు

[మార్చు]

నారదుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు మౌనం వీడలేదు. అది చూసి వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియులకు రాజ్యపాలన కంటే వేరే ధర్మంకలదా ! అందువలన వేదవిహితమైన విప్రకర్మలు ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం వాటిల్లగలదు. వేదవిహిత విప్రకర్మలు ఆచరించని ఎడల రాజుకు పాపంసంక్రమించి ఉత్తమలోక ప్రాప్తికి ఆటంకంకలుగుతుంది. కనుక ప్రజాపాలనయే నీధర్మం " అన్నాడు.

వ్యాసుడి జ్ఞానబోధ

[మార్చు]

ధర్మరాజు వ్యాసుడితో " వ్యాసమహర్షీ ! మీరు చెప్పింది నిజమే. నేను కూడా రాజ్యకాంక్షతో ఈ యుద్ధానికి తలపడి నరమేధం జరగడానికి కారణమయ్యాను. చంపకూడని వారిని చంపాను. నా ఆత్మ దహించుకు పోతుంది. అందువలన నా హృదయం దహించుకు పోతుంది. కాని మీ మాటలు తిరస్కరించుట భావ్యంకాదు. ఏమిచెయ్యాలో తోచడంలేదు. వ్యాసుడు " ఈ పనిచెయ్యాలి ఈ పనిచెయ్యకూడదు అని నిర్ణయించడానికి మనం ఎవ్వరం. మనం నిమిత్తమాతృలం. అంతా ఈశ్వరాజ్ఞతో జరుగుతూ ఉంటుంది. గొడ్డలి తీసుకుని చెట్టును నరికితే ఆపాపం గొండ్డలికి అంటుతుందా ! సర్వము పరమేశ్వర సంకల్పం చేతనే జరుగుతుందని తెలుసుకున్న నాడు నీకు ఏ పాపం అంటదు. నీవు కర్మ చెయ్యి కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించు. జ్ఞానులు వేదంలో చెప్పినదంతా పరమాత్మ పరంగా చేస్తాడు. అందు వలన వారికి ఏపపుణ్యములు అంటవు. యుద్ధంలో శత్రువులను చంపానని దానివలన పాపం అంటగలదని నీవు అనుకుంటే అందుకు తగిన ప్రాయశ్చితం చేసుకో. యజ్ఞయాగములు చేసి పాపపరిహారం చేసుకో. అంతే కాని పాపానికి భయపడి రాజ్యమును, రాజ్యపాలనను, ప్రజలను వదిలివేయడం భావ్యం కాదు " అన్నాడు.

ధర్మరాజు సంశయం

[మార్చు]

ధర్మరాజు వ్యాసుడితో " ఓ వ్యాస మహర్షీ ! ఈ యుద్ధంలో నా కుమారులు, మనుమలు, అన్నలు, తమ్ములు, తండ్రులు, తాతలు, మామలు, గురువులు, సంబంధులు, మిత్రులు, అల్లుళ్ళు, బావలు, మరుదులు, ఎంతో మంది రాజులు, మహారాజులు, చక్రవర్తులు నా చేత చంపబడ్డారు. వారికి సంబంధించిన స్త్రీలు వారి భర్తల కొరకు, కొడుకుల కొరకు, తండ్రుల కొరకు శోకిస్తున్నారు. కొందరు ప్రాణాలు కూడా విడుస్తున్నారు కనుక స్త్రీలను చంపిన పాపం కూడా నాకు చుట్టుకుంటుంది. ఇన్ని పాపములు చేసిన నేను నిష్కల్మషుడను ఎలా ఔతాను. ఇంతగా పరితపిస్తున్న నాకు నా మనసు రాజ్యపాలనకు ఎలా సుముఖత చూపిస్తుంది. ఉగ్రమైన తపస్సు చేసి ప్రాణత్యాగం చేయడం కంటే నాకు మరో మార్గం లేదు " అన్నాడు.

అశ్వమేధయాగానికి నాంది

[మార్చు]

ధర్మరాజు మాటలకు వ్యాసుడు " నీ మనసులో శోకము బాధను పక్కనపెట్టి నా మాటలు విను. నీవు చెప్పినవారంతా ఊరికే చావలేదు. రాజ్యముకు ఆశపడి వారి పేరుప్రతిష్టల కొరకు, వారి అభివృద్ధికొరకు యుద్ధం చేసారు. వారి చావువలన నీకు పాపం ఎలా అంటుకుంటుంది. వారికి ఏ కర్మ పరిపక్వమై ఆ మరణాలు సంభవించాయో ఎవరికి తెలుసు ? ఎప్పుడు ఎవరిని ఎలా చంపాలో యముడికి బాగా తెలుసు. ఆ విధంగానే యముడు ప్రాణం హరిస్తుంటాడు. అందుకు నీవు కారణమని తలచి శోకించుట వెర్రి. అందు కొరకు రాజ్యమునువీడి, ఇల్లువిడిచి అడవులకు వెళ్ళుట మరింత వెర్రి. మనలను తోడు బొమ్మల వలె ఆడించే వాడే ఇదంతా చేస్తున్నాడు. ఈ యుద్ధంలో చనిపోయిన రాజుల రాజ్యాలను వారి కుమారులకు పట్టాభిషేకం చెయ్యి. కుమారులు లేకున్న వారి కుమార్తెలకు పట్టాభిషేకం చెయ్యి. అందువలన వారి తల్లులు సంతోషిస్తారు. నీకుపుణ్యం, కీర్తి లభిస్తుంది. ధర్మజా ! యుద్ధంలో జరిగిన నరమేధానికి నీవు చింతించ పనిలేదు. దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడు దానవులను అతికిరాతకంగా చంపి నెత్తుటేరులు పారించాడు. ఇంద్రుడు తన దాయాదులైన దానవులను చంపినందుకు మునులు శ్లాఘించారు కాని నిందించ లేదుకదా ! ఆ ఇంద్రుడికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇవ్వడం మానారా ! ఆ ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయి పాలించడం లేదా ! ధర్మరాజా ! నీవు కూడా దుష్టులైన నీ అన్నదమ్ములను పుణ్యమార్గంలో యుద్ధంచేసి సంహరించి క్షత్రియధర్మం ఆచరించావు. కనుక దేవేంద్రుడి వలె నీవు కూడా రాజ్యపాలనకు అర్హుడవే ! నీకు ఇష్టం అయితే జజ్ఞయాగాదులు చెయ్యి. ముఖ్యంగా అశ్వమేధం చెయ్యి. అశ్వమేధానికి కావలసిన ద్రవ్యాన్ని సమీకరించడానికి రాజ్యభారం వహించు " అన్నాడు.

పాపము ప్రాయశ్చిత్తం

[మార్చు]

వ్యాసుడి మాటలతో ధర్మరాజుకు శోకవిమోచనం కలిగింది. ధర్మరాజు " వ్యాస మునీంద్రా ! ఏ కర్మానికి ఏ పాపం వస్తుంది. ఏ పాపముకు ఏది ప్రాయశ్చిత్తం. నాకు వివరంగా చెప్పండి " అని ఆడిగాడు. వ్యాసుడు ధర్మరాజుకు ధర్మసూక్ష్మములు వివరించ సాగాడు. " ధర్మజా ! సూర్యుడు ఉదయించే కాలంలో అస్తమించేకాలంలో నిద్ర పోవడం. అతిథి ఇంటికి వచ్చినప్పుడు సత్కరించక పోవడం, పరస్త్రీలను కామించడం, గురువు మాటకు ఎదురు చెప్పడం, ఉన్న ఊరును నాశనం చెయ్యడం, వేదవిద్యను అమ్ముకోవడం, భగవంతుడిచ్చిన భూమిని అమ్ముకోవడం, సేవకులకు ఆపద వచ్చినప్పుడు కాపాడక పోవడం, ఎల్లప్పుడూ కపటంగా ప్రవర్తించడం, అడవులను తగులపెట్టడం, స్వధర్మం విడిచి పరధర్మం ఆచరించడం, తనకు ఇచ్చినపని చేయకపోవడం, జంతువులను కొట్టడం, హింసించడం, బ్రాహ్మణులకు చెందిన సంపదను హరించడం తనను శరణు వేడిన వాడిని రక్షించ పోవడం, బ్రాహ్మణులను చంపడం మహాపాపములు. అలాగే కొన్ని పనులు పైకి పాపం అనిపించినా అవి నిందించ తగినవి కాదు. అవి ఏమిటంటే యుద్ధంలో కత్తి తీసుకుని తనను చంపడానికి వస్తున్న వాడు వేదవిదుడైన బ్రాహ్మణుడైనా సరే అతడిని చంపితే పాపం రాదు.

అనృత దోషం కలగని కార్యములు

[మార్చు]

అలాగే బ్రాహ్మణుడి ఆస్తిని సంపదను ఎవరైనా అపహరిస్తుంటే వారిని చంపడం పాపం కాదు. ప్రాణాపాయ సమయంలో, అన్నం, నీళ్ళు దొరకనప్పుడు కల్లు త్రాగినా, తాను తాగేది కల్లు అని తెలియకున్నా దాని వలన కలిగిన పాపం పుణ్య కార్యములు చేస్తే పోతుంది.ప్రాణ హాని కలిగినప్పుడు, ప్రమాదకరమైన ఆపదలు కలిగినప్పుడు బ్రాహ్మణుల ధనమును అపహరించినప్పుడు, వివాహసమయంలో పెద్దలు పనులు నిర్వర్తించే సమయంలో, గురువులను రక్షించే సమయంలో స్త్రీలతో మాట్లాడే సమయంలో తనకు ఉన్న సంపదలు సర్వము, నాశనం అయ్యే సమయంలో అబద్ధములు చెప్పినా అది పాపం కాదు. ఎవరికైనా స్వప్నంలో తేజోపతనము జరిగిన అది దోషం కాదు. అతడి బ్రహ్మచర్యముకు అది దోషం కాదు. అగ్నిలోనేతిని హోమంచేస్తే ఆదోషం పోతుంది. తన అన్న దుర్మార్గుడైనా, చెడు మార్గం పట్టినా, సన్యాసంస్వీకరించినా ఆ సమయంలో అన్న భార్యను స్వీకరించడం తప్పుకాదు. గోవులను రక్షించుటకు అడవిని తగులపెట్ట వచ్చు. యజ్ఞయాగాలలో గోవును చంపడం, అర్హుడు కానివాడికి దానం చెయ్యడం, తప్పుచేసిన సేవకుడిని శిక్షించక వదలడం పాపాలు కాదు.

పాపములకు పరిహారం

[మార్చు]

ధర్మజా ! పైనచెప్పిన బ్రాహ్మణుడిని చంపినదోషం పోవడానికి తాను చేసినపని చెప్పుకుంటూ బిక్షాటన చేస్తూ ఒక్క సారి మాత్రమే భుజిస్తూ, బ్రహ్మచర్యం అవలంభిస్తూ, నేలమీద నిద్రిస్తూ 12 సంవత్సరాలు నియమనిష్టలతో జీవితం గడపాలి. లేనిఎడల ఆరుసంవత్సరాల కృఛ్రమవ్రతం ఆచరించాలి. లేనిఎడల మూడు సంవత్సరముల చంద్రాయణవ్రతం చేయాలి. నెలకు ఒక్కమారు తింటూ ఒక్కసంవత్సరం గడపాలి. అదీ లేనిఎడల అశ్వమేధయాగం చేయాలి. బ్రాహ్మణులకు ఒకలక్ష గోవులను కాని ఒకవంద గుర్రాలను కాని దానంచేయాలి. ఇందు వలన బ్రాహ్మణ హత్యాదోషం, బ్రాహ్మణసొత్తును అపహరించిన దోషంపోతుంది. ఇక సురాపానం చేసిన వాడికి ఆ సురను ఎర్రగాకాచి దానిని వాడిచేత త్రాగించాలి. లేని ఎడల కళ్ళు మూసుకుని నిప్పులలో దూకాలి. లేని ఎడల మహా ప్రస్థానం చేయాలి. లేనిఎడల భృహస్పతియాగం చేయాలి, లేనిఎడల భూదానం చేయాలి. అలాచేసిన సురాపానం చేసిన పాపం పోతుంది. గురువు భార్యను కామించిన వాడికి బాగా ఎర్రగాకాల్చిన ఇనుప స్త్రీవిగ్రహాన్ని కౌగలించుకునేలా చేయాలి. లేనిఎడల పురుషాంగం కోసి చేత్తో పట్టుకుని ఆకాశంవైపు చూస్తూ మరణించాలి. లేని ఎడల యుద్ధమున తన గురువుకొరకు ప్రాణత్యాగంచేయాలి. లేనిఎడల ఉన్నధనం అంతా బ్రాహ్మణులకు దానం చేయాలి. బ్రాహ్మణుడి బంగారం దొంగిలించిన పోవడానికి దనికి సరిపడినంత బంగారం తిరిగి ఇవ్వాలి, అసత్యదోషం పోవడానికి ఆ అసత్యం వలన ఎవరికి అపచారం కలిగిందో వారికి సంతోషం కలుగ చేయాలి. గురువును ఎదిరించిన పాపం పోవడానికి ఆ గురువుకు నమస్కరించి గురుదక్షిణ ఇవ్వాలి. పరభార్యను కామించిన వాడు ఆ పాపానికి ఒక సంవత్సరం కృచ్ఛమవ్రతం చేయాలి. వరసకాని స్త్రీని కామించిన వాడికి తడిబట్టలు కట్టుకుని బూడిదలో ఆరునెలలు నిద్రించాలి. పరపురుషునితో సంగమించిన స్త్రీకి రజోదర్శనంతో ఆ పాపం పోతుంది. నరకకూడని చెట్టునినరికినా, జంతువులను చంపినా దాని వలన కలిగేపాపం మూడు రోజులు ఉపవాసం ఉంటే పోతుంది. ఇంకా తెలిసి చేసినవి, తెలియక చేసినవి మితాహారం తీసుకుంటూ ఉదయం సాయంత్రం గాయత్రీ జపంచేస్తే పోతుంది. పూర్వజన్మలో చేసినపాపాలు దానధర్మాలు చేస్తూ పోగొట్టుకోవాలి. అంతే కాని నాస్తికులు, శ్రద్ధ, నియమం లేనివారు ఏమిచేసినా వారు చేసినపాపం పోగొట్టుకో లేరు. ధర్మజా ! ఆస్తికుడవు నియమనిష్టలు కలిగిన నీవు చేసిన స్వల్పపాపమును స్వల్ప ప్రాయశ్చితములతో పోగొట్టుకొన వచ్చు. నీవు చేసినపాపం యుద్ధంచెయ్యడం, అందు వీరులనుచంపడం. అది నీవు క్షత్రియధర్మంగా ఆత్మరక్షణకు చేసింది. కనుక అది పాపంకాదు అని నిరూపించాము నీలోకలిగిన అపారమైనకరుణ పశ్చాతాపంవలన నీవు పరిశుద్ధుడవు అయినావు. కనుక నీవు తప్పస్సు చేయవలసిన పనిలేదు కనుక నీవు నిశ్చింతగా రాజ్యపాలన చేయవచ్చు.

త్రాగకూడనివి తినకూడనివి

[మార్చు]

అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! తినకూడనివి ఏవి ? త్రాగ కూడనివి ఏవి ? ఎవరు యోగ్యులు ? ఎవరు అయోగ్యులు ? వివరించండి " అని ఆడిగాడు. వ్యాసుడు బదులుగా " ధర్మనందనా ! గుర్రము, ఒంటె, గాడిద పాలు త్రాగ కూడదు. బ్రాహ్మణుడు ఆడగుర్రము, ఆడఒంటె, ఆడగాడిద దరిదాపులకు వెళ్ళ కూడదు. మనిషిపాలు అసలు త్రాగ కూడదు. ఈ నిన పది రోజుల లోపల ఆవు పాలు త్రాగ కూడదు. ప్రేతము వెళ్ళిన ఇంటి భోజనం, పురుటి భోజనం, తలారి ఇచ్చిన భోజనం, కులట ఇచ్చిన భోజనం, స్త్రీ సంపాదన మీద బ్రతికేవాడు పెట్టిన అన్నం, ఆట పాటలతో జీవించేవాడు ఇచ్చే అన్నం, జూదరి ఇచ్చే అన్నం, పూలు అమ్ముకునేవాడు ఇచ్చిన అన్నం, ఊరి నుండి వెలివేసినవాడు ఇచ్చే అన్నం, అన్న కంటే ముందు వివాహంచేసుకునే వాడు ఇచ్చే అన్నం తినరాదు. అవి అభోజ్యములు. ఇతరులను పొగడుతూ జీవించేవాడు ఇచ్చిన అన్నం అత్యంతహేయం. నిలవఉన్న అన్నం పాచిపోయిన అన్నం తినరాదు. సురాపానంతో సంబంధించిన అన్నం తినరాదు. పులగము, పాయసం, అప్పములు, నువ్వులతో చేసిన వంటకములు, దేవుడికి అర్చనచేసి నివేదన చేసిన తరువాత కాని తినకూడదు. ఇవి మామూలుగా వండుకుని తినరాదు.

చేయకూడనివి

[మార్చు]

గృహస్థాశ్రమ ధర్మమును పాటించే వారు దేవతార్చన చేయకుండా దేవతలకు నివేదించక, పితృదేవతలకు పెట్టక, అతిథులకు పెట్టక తినరాదు. గృహస్థు అయిన వాడు భార్యాబిడ్డలు బంధువులతో సంచరిస్తూనే అంటీ అంటక ఉండాలి. వారి ప్రేమాభిమానాలాకు పూర్తిగా లొంగకూడదు. ధర్మనందనా ! ఇంక అయోగ్యుల గురించి చెప్తానువిను. పాటలుపాడుతూ నృత్యములు చేస్తూ జీవించేవారు. విదూషకులు, దుర్జనులు, నపుంసకులు, మోసగాళ్ళు, వేదం చదవనివాళ్ళు, తక్కువ కులమువాళ్ళు, ఇతరులకు హానిచేయడమే వృత్తిగాపెట్టుకున్న వాళ్ళు దానం స్వీకరించడానికి అనర్హులు. పేదవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, దానానికి అర్హులు. నీకు దానగుణం ఎక్కువగా ఉన్నా చెడ్డవాళ్ళకు దానం చేయకూడదు. దాని వలన ప్రయోజనం శూన్యం. అపాత్రాదానం మంచిది కాదు. అనర్హులకు చేసే దానం నపుంసకుడికి కన్యను ఇచ్చినట్లు, బూడిదలో నెయ్యిపోసినట్లు, ఓటికుండలో నీళ్ళుపోసినట్లు ఔతుంది. అర్హుడైనవాడికి చేసేదానం చేసినవాడికి పుచ్చుకున్న వాడికి ఇహ లోకసౌఖ్యం పరలోక సౌఖ్యం కలుగుతుంది. ధర్మజా ! నీకు నేను మంచీచెడు సంక్షిప్తంగా మంచిచెడు గురించి వివరంగా చెప్పాను. నా పలుకులు మన్నించి ధర్మబద్దంగా ప్రవర్తించు " అన్నాడు.

ధర్మరాజు స్వస్థ మనస్కుడగుట

[మార్చు]

ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! మీరు చెప్పిన మాటలు నా మనసుకు చాలా హర్షం కలిగించాయి. మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను ధర్మమార్గం అవలంబించి రాజ్యభారం వహించి అమంగళం కలగకుండా చూస్తాను. నా మీద కృపతో మీరు రాజధర్మములు వర్ణాశ్రమ ధర్మాలు ఆపద్ధర్మాలు నాకు తెలియ చెప్పండి. నాకు రాజధర్మం ధర్మాచరణ పరస్పర విరుద్ధం తోస్తుంది. అందుకని మిమ్ము ఇలా ప్రార్ధిస్తున్నాను " అన్నాడు. అప్పుడు వ్యాసుడు నారదుడిని చూసి " మహర్షీ ఈ మహారాజును భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాలి. భీష్ముడే ధర్మజుడికి సకల ధర్మములు చెప్పగల సమర్ధుడు " అన్నాడు. అప్పుడు నారదుడు " మహర్షీ ! మీరు చెప్పినది చాలా యుక్తంగాఉన్నది " అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు ధర్మనందనుడితో " ధర్మనందనా ! భీష్ముడు కురువృద్ధుడు. ఇంద్రాదులకు కూడా పూజనీయుడు. కుటిలత్వం తెలియనివాడు. పరశురాముడి వద్ద విద్యలునేర్చి విలువిద్యా రహస్యాలను తెలుసుకున్న వాడు. పవిత్రగంగా గర్భమున జన్మించిన వాడు. సుగుణాలకు పుట్టిల్లు. ఆయనకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. చ్యవనుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు మొదలగు మహర్షుల వద్ద ధర్మసూక్ష్మములు తెలుసుకున్న వాడు. తండ్రినుండి స్వచ్ఛందమరణం వరంగాపొంది తన ప్రాణములు మేనిలో నిలుపుకుని ఉన్నాడు. నీవంటే ఎంతో అభిమానం ఉన్న అంతటి మహానుభావుడి వద్దకు నీవు వెళ్ళి ప్రార్ధించిన అతడు నీకు అత్యంత వాత్సల్యంతో నీకు ధర్మసూక్ష్మములు తెలుపగలడు. దీనివలన నీవు ఎంతో కీర్తిమంతుడవు కాగలవన్నది మా అందరి అభిమతం. పైగా భీష్ముడికి అవసాన కాలం సమీపిస్తుంది. ఇంక ఆలస్యంచేయకు " అన్నాడు.

ధర్మరాజు భీష్ముడి వద్దకు వెళ్ళుటకు సంశయించుట

[మార్చు]

ధర్మరాజు వ్యాసుడితో " మునివర్యా ! ఎంతో మంది బంధువులను, మిత్రులను వధించిన వాడను ఆయన ఎదుట ఎలా నిలువగలను ? విలువిద్యా విశారదుడైన భీష్ముడిని కృత్రిమసమరంలో కూల్చిన పాతకుడిని తిరిగి ఆయన ఎదుట ఎలా నిలువగలను ఆయన మొహంచూసి ధర్మసూక్ష్మములు చెప్పమని ఎలా అడగను " అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మజా ! అలా అనుకోవడం ఎందుకు. నీవు వ్యాసమహాముని ఆజ్ఞమేరకు భీష్ముడి వద్దకు వెళుతున్నావు. కాని ఇంతశోకంతో భీష్ముని వద్దకు వెళ్ళకు ముందు నీవు రాజ్యానికి వెళ్ళు తరువాత భీష్ముడి వద్దకు వెళ్ళవచ్చు. నీకొరకు నీతమ్ములు, బ్రాహ్మణులు, పురజనులు ఎదురుచూస్తున్నారు. హస్థినాపురప్రవేశం చేసి వారందరికి ఆనందం కలిగించు " అని పలికాడు. ఈ ప్రకారం వ్యాసుడు, నారదుడు, శ్రీకృష్ణుడు, దేవలుడు చెప్పిన మాటలతో తన శోకమును వదిలిపెట్టిన ధర్మరాజుకు రాజ్యపాలన పట్ల ఆసక్తి కలిగింది. ధర్మరాజు ఆ మునులందరికీ ప్రదక్షిణంచేసి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తరువాత మునులందరూ తమతమ స్థానాలకు వెళ్ళారు.

హస్థినాపుర ప్రవేశం

[మార్చు]

ధర్మరాజు దేవతలను బ్రాహ్మణులను పూజించాడు. తనదర్శనం కొరకు వేచిఉన్న సామంతులను కలుసుకుని వారిచ్చిన కానుకలను స్వీకరించాడు. మరునాడు వేకువనే లేచి అభ్యంగనం ఆచరించి తెల్లనివస్త్రములు విలువైననగలు అలంకరించుకున్నాడు. పదునారు తెల్లనిగుర్రములను కట్టిన రథమును అధిరోహించాడు. భీముడు సారథిస్థానమున కూర్చున్నాడు. అర్జునుడు వెనుక నిలబడి తెల్లనిగొడుగు పట్టుకున్నాడు. నకులసహదేవులు వింజామరలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి వెంటవస్తున్నారు. విదురుడు, కుంతీదేవి, ఇతర అంతఃపుర స్త్రీలు వారవారి వాహనములలో పల్లకీల మీద వస్తున్నారు. సామంతరాజులు తమతమ సైన్యములతో పక్కన వస్తున్నారు. ఇలా ధర్మరాజు హస్థినాపురానికి పయనమయ్యాడు. వంధిమాగదులు ధర్మరాజు గుణగణాలను కురువంశ చరిత్రను కీర్తిస్తున్నారు. వేదపండితులు వేదపాఠాలను భోధిస్తుండగా ధర్మరాజు హస్థినాపుర ప్రవేశం చేస్తున్నాడు.

హస్థినాపుర ప్రజల స్వాగతం

[మార్చు]

ధర్మరాజు వచ్చేవేళకు హస్థినాపురప్రజలు నగరమంతా పచ్చనితోరణాలు కట్టి, గుమ్మాలకు అరటిచెట్లు కట్టి, పూర్ణకళశాలను ఇంటి ముందు అలంకరించి, వాకిట కళ్ళాపిచల్లి ముత్యాలముగ్గులు పెట్టారు. ఆ బాలగోపాలం కొత్తబట్టలు కట్టుకున్నారు. అంతటా పండుగవాతావరణం నెలకొంది. ధర్మరాజు రాజవీధిలో ప్రవేశించాడు. హస్థినాపుర వాసులు తమలోతాము " నలుదిక్కులా రాజులను జయించిన అజాతశత్రువు ఇతడే. రాజసూయయాగము చేసి బ్రాహ్మణులకు ధన, కనక, రత్నములను దానంగా ఇచ్చినది ఇతడే. ధర్మనిరతుడు అని చెప్పతగిన వాడు, శత్రురాజులను జయించి, విజయలక్ష్మిని వరించినది ఇతడే " అని ధర్మరాజును పొగడసాగారు. మరి కొందరు భీమార్జున నకులసహదేవులను పొగడుతున్నారు. వ్రతములు ఆచరించుటలోనూ, అదృష్టంలోను, పాతివ్రత్యంలోనూ ద్రౌపదికి సాటి ద్రౌపదియే నని పాండవసతిని పొగడుతున్నారు. ధర్మరాజు రాజమందిర ముఖద్వారం వద్దకు రాగానే బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలు శోభనద్రవ్యములు తీసుకుని ఎదురువచ్చారు. వారు ఇచ్చినవి పుచ్చుకుంటూ ధర్మరాజు గజశాల వద్ద తనరధమును దిగాడు. పురోహితుడైన ధౌమ్యుడు పెదనాన ధృతరాష్ట్రుడు మున్నగు వారితో సహా అంతఃపురప్రవేశం చేసాడు. గృహదేవతలకు పూజచేసాడు. బ్రాహ్మణ సంఘములను పిలిచి వారికి బంగారం గోవులను దానంగా ఇచ్చాడు. వారి ఆశీస్సులు తీసుకున్నాడు.

చార్వాకుడు

[మార్చు]

ఆ సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు అనే రాక్షసుడు బ్రాహ్మణవేషంలో వచ్చి మిగిలిన బ్రాహ్మణులతో కలిసాడు. అతడు ధర్మరాజుతో " ఓ ధర్మరాజా ! సకలబ్రాహ్మణులు నన్ను తమ ప్రతినిధిగాపంపారు. వారిసందేశం విను. మహాపాపములు చేసిన వాడు ఇతడు ఎలా రాజౌతాడు. తండ్రులను, అన్నలను, పుత్రులను శంకలేకుండా చంపాడు. విద్యనేర్పిన గురువు అని చూడక ద్రోణుడిని చంపాడు. వీడిజన్మ ఎందుకు కాల్చనా ! ఈ విధంగా అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఇంకా నీకీ రాజ్యమెందుకు ? బంధువులను అందరినీ చంపి రాజ్యభోగాలు అనుభవిస్తున్నావు. నీకు మహాపాపం చుట్టుకుంటుంది " అని పలికాడు. చార్వాకుడి మాటలను విన్న బ్రాహ్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ధర్మరాజు వారివంక చూసి చేతులుజోడించి " బ్రాహ్మణోత్తములారా ! నేను మీకు మొక్కి వేడుకుంటున్నాను. నన్ను మీరు నిందించకండి. ఆదరించండి వ్యాసుడు నారదుడు మొదలగు మహా మునులు నన్ను ఆజ్ఞాపిస్తేనే నేను ఈ రాజ్యపాలనకు ఒప్పుకున్నాను " అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు " మహారాజా ! ఈ మాటలు మావి కాదు. ఇవి ఎలా వచ్చాయో మాకు తెలియడం లేదు. నీవు ఉత్తమక్షత్రియ ధర్మంతో సముపార్జించిన ఈ రాజ్యలక్ష్మి సుస్థిరతను పొందుతుంది " అని ఆశీర్వదించాడు. వెంటనే చార్వాకుని వంక చూసి దివ్యదృష్టితో అతడు సుయోధనుడి అనుయాయుడు అని తెలుసుకున్నారు. " మహారాజా ! వీడు బ్రాహ్మణుడు కాదు. సుయోధనుడి అనుయాయుడు అయిన రాక్షసుడు. కపటసన్యాసివేషంలో వచ్చి మిమ్మలిని అనరానిమాటలు అన్నాడు. వీడు కుక్కలాగా మొరిగినంత మాత్రాన మీ కీర్తికి కళంకంరాదు. ధర్మాత్ములైన నీ తమ్ముల సాయంతో మీరు రాజ్యలక్ష్మిని చేపట్టవచ్చు " అని పలికారు. వెంటనే బ్రాహ్మణులంతా చార్వాకుడిని చూసి ఒక్కసారి హుంకరించారు. ఆ హూంకారానికి భయకంపితుడై చార్వాకుడు నిజస్వరూపం ధరించి భస్మం అయ్యాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణులందరిని ఆదరించి పంపాడు.

చార్వాకుడి పూర్వవృత్తాంతం

[మార్చు]

అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! కృతయుగంలో చార్వకుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపమాచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తనకు సకల భూతములవలన భయంలేకుండా వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు " నీవు బ్రాహ్మణులకు ఇష్టంలేని పనులు చేయకు. వారికి కోపంతెచ్చినప్పుడు మాత్రమే నీకు మరణం సంభవించగలదు " అని అన్నాడు. ఆ ప్రకారం బ్రహ్మ వరంపొంది చార్వాకుడు దేవతలను పీడించ సాగాడు. దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి చార్వాకుడి నుండి రక్షణ కల్పించమని ప్రార్ధించాడు. బ్రహ్మదేవుడు దేవతలతో " ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకని నేను తగినఏర్పాటు ముందే చేసాను. ద్వాపరయుగంలో చార్వాకుడు సుయోధనుడు అనే రాజుకు మిత్రుడుగా ఉంటాడు. సుయోధనుడి మరణం తరువాత ఈ చార్వాకుడు బ్రాహ్మణులకు మనోవ్యధ కలిగించే పనులు చేసి ఆకారణంగా వారి ఆగ్రహానికి గురి అయి భస్మంఔతాడు " అని చెప్పాడు. శ్రీకృష్ణుడు తరువాత " ధర్మరాజా ! నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి. ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడు. బ్రాహ్మణులను ఆదరించు. బంధుమిత్రులను సుఖంగా ఉండేలాచేయి. కురుసామ్రాజ్యముకు పట్టాభిషిక్తుడివి కమ్ము " అని పలికాడు.

ధర్మరాజు పట్టాభిషేకం

[మార్చు]
ధర్మరాజు పట్టాభిషేకం - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

పట్టాభిషేకముకు తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కురుమహాసభలో ఎత్తైన బంగారు సింహాసనం ఏర్పాటు చేసారు. పెద్దలకు, మంత్రులకు, సామంతులకు సైన్యాద్యక్షులకు ఎవరికి తగిన ఆసనములు వారికి ఏర్పాటు చేసారు. ఒక శుభముహూర్తాన ధర్మరాజు మనసులోని బాధను దిగమింగుకుని బంగారుసింహానం మీద తూర్పుముఖంగా కూర్చున్నాడు. అతడికి ఎదురుగా బంగారు ఆసనమున శ్రీకృష్ణుడు సాత్యకి సమేతంగా కూర్చున్నాడు. ధర్మరాజు ఇరు పక్కలా మణిమయ పీఠముల మీద భీమార్జునులు కూర్చున్నారు. వెనుక పక్క బంగారు పీటముల మీద నకులసహదేవులు కూర్చున్నారు. వారిపక్కన ఉచితాసనం మీద కుంతీదేవి కూర్చుంది. శ్రీకృష్ణుడి దక్షిణభాగంలో ఒక ఉజ్వలమైన ఆసనంమీద ధృతరాష్ట్రుడు కూర్చుని ఉన్నాడు. అతడికి తూర్పు పడమర దిక్కున విదురుడు, ధౌమ్యుడు కూర్చుని ఉన్నారు. ధృతరాష్ట్రుని వెనుక భాగాన అర్హమైన ఆసనముల మీద గాంధారి, యుయుత్సుడు, సంజయుడు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కృపాచార్యుడికి ధర్మరాజు ధౌమ్యుడి పక్కన ఉచితాసనాన్ని ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు తెల్లని పూలతోను, అక్షితలతోను, బంగారుతోను, వెండితోను భూదేవిని పూజించి ఆమెను తాకాడు. పండితులు, వివిధ దేశాధీశులు, మంత్రులు, ఉన్నతోద్యోగులు, వ్యాపారవేత్తలు, పరిచర్యలు చేసే సేవకులు, వైశ్య ప్రముఖులు, పౌర సంఘాలు, కర్షకులు, జానపదులు, గాయకులు, విదూషకులు, వేశ్యలు మున్నగు వారంతా ధర్మరాజుని సందర్శించారు. ధర్మరాజు వారికి ఉచితమైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ఇంతలో అభిషేకద్రవ్యములు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అనుమతితో ధౌమ్యుడు ఈశాన్య దిక్కుగా ఉన్న వేదికను అలంకరించాడు. అందు నవరత్నఖచిత సింహాసనమును ప్రతిష్టించాడు. దానిమీద పులితోలు కప్పాడు. శంఖమును స్థాపించి పూజించాడు. దాని చుట్టు గంగాజలం నింపి వాటిని మంత్రసహితంగా ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుపంచితం, గోమయము మొదలగు పంచగవ్యములతో శుద్ధి చేసాడు. ధర్మరాజు చుట్టూ బ్రాహ్మణులు మంత్రపఠనం చేస్తున్నారు. ధౌమ్యుడు ధర్మరాజును తీసుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చుండ చేసాడు. ఎదురుగా అగ్నినివేల్చి దేవతాయజ్ఞం చేసాడు. ఇంతలో శుభముహూర్తం సమీపించగానే శ్రీకృష్ణుడు ధర్మరాజును సమీపించి శంఖం పైకెత్తి" ధర్మజా ! నీవు ఈ కురుసామ్రాజ్యానికి అధిపతివి కమ్ము " అని అభిషేకించాడు. ఆ సమయంలో ప్రశాంత చిత్తుడై ధౌమ్యుడు అందించిన బంగారుకలశం లోని గంగాజలాన్ని ధృతరాష్ట్రుడు ధర్మరాజు మీద అభిషేకించాడు. ఆ తరువాత వారి వారి ప్రాధాన్యతను అనుసరించి అందరూ ధర్మరాజును అభిషేకించారు. శంఖములు, భేరీ మృదంగ నాదములు మిన్నంటేలా మ్రోగాయి. ఇలా ధర్మరాజు కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు.

బ్రాహ్మణుల దీవెన

[మార్చు]

ఆ సందర్భంగా ధర్మరాజు బ్రాహ్మణులకు పేదలకు ఎన్నో అన్నదానాలు చేసారు. అప్పుడు పండితులైన బ్రాహ్మణులు ధర్మరాజుకు ఎదురుగా నిలిచి " దేవా ! దైవబలం, మానవీయబలం కలిసిన ఫలితంగా మానవాతీతమైన ఈ విజయం వసుధాధిపత్యం నీకు లభించాయి " అని పలికారు. దానికి ధర్మరాజు " అయ్యా ! మీరు చెప్పిన సద్గుణాలు నాలో ఉన్నాయో లేవో కాని మీరందరూ ఇలా అంటూ ఉంటే పాండవులందరూ అదృష్టవంతులని నేను భావిస్తాను " అని ధృతరాష్ట్రుని చూసి " మాకు తండ్రి గురువు దైవం ఇతడే. ఇతడి ఆజ్ఞలు అమలు చేయడం మీ కర్తవ్యం. మునుపటిలా ఈతడిని మీరు గౌరవించి ఆదరించండి. అదే మాకు ప్రియమైనది. మేము జ్ఞాతులను చంపి ఈ సింహాసనం అధిష్టించడం ధృతరాష్ట్రుడిని సేవించడం కోసమే. మనకందరకూ అధిపతి ధృతరాష్ట్రుడే అని మీరు మరువకండి " అని పలికాడు. తరువాత ధర్మరాజు సభచాలించాడు. ధృతరాష్ట్రుడిని గాంధారిని వారి నివాసాలకు పంపాడు. పౌరులను, జానపదులను సభవిడిచి పోవడానికి అనుజ్ఞ ఇచ్చాడు. కృపాచార్యుని అతడి నివాసానికి సగౌరవంగా పంపాడు.

ధర్మరాజు రాజ్యనిర్వహణా బాధ్యతలను అప్పగించుట

[మార్చు]

ధర్మరాజు యువరాజుగా భీమసేనుడిని నియమించాడు. మంత్రాంగం నిర్వర్తించడానికి విదురుని మంత్రిగా నియమించాడు. న్యాయవ్యవహారాలు నిర్వర్తించడానికి సంజయుడిని నియమించాడు. సైనిక నియామకముకు వారి జీతభత్యముల నిర్ణయం తీసుకొనుటకు, సకల కార్య నిర్వహణకు నకులుడిని నియమించాడు. అహంకారులను దుష్టులను శిక్షించుటకు దండెత్తుట జయించుట మొదలైన కార్యక్రమాలకు అర్జునుడిని నియమించాడు. బ్రాహ్మణకార్యములకు శ్రౌత, స్మార్త కర్మల అనుష్టనమునకు ధౌమ్యుని నియమించాడు. సహదేవుని తన అంతరంగిక కార్యదర్శిగా ప్రధాన అంగరక్షకునిగా నియమించుకున్నాడు. మిగిలిన అధికారములను అర్హులకు అప్పగించాడు. యుయుత్సుడిని, విదురుని, సంజయుని చూసి " మీరు ప్రతి రాచనగరిలో వారి యోగక్షేమాలు పర్యవేక్షించండి. ప్రజాహిత కార్యక్రమాలను ఆయా అధికారులకు అప్పగించి అవి సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడండి " అని అజ్ఞాపించాడు. కుంతీదేవిని ద్రౌపదీ దేవితో అంతఃపురానికి పంపాడు. తరువాత బ్రాహ్మణుల అనుమతితో యుద్ధంలో చనిపోయిన బంధువులందరికీ శ్రాద్ధకర్మలు ఆచరించి. వారి పేరుతో దాన ధర్మాలు చేసాడు. ద్రోణాచార్యునకు, ద్రుపదునకు, వారి బంధువులకు, విరాటుడికి, ప్రత్యేకంగా కర్ణుడికి, అభిమన్యుడికి, పరలోకక్రియలు జరిపించాడు. వారి పేరుతో బ్రాహ్మణ సంతర్పణలు చేయించాడు. దుర్యోధనుడికి అతడి తమ్ములకు ధృతరాష్ట్రుని చేత వైభవంగా నిర్వర్తింప చేసాడు. వారసులు లేనివారికి ధౌమ్యుని చేత కర్మకాండలు దానధర్మములు నిర్వహింపజేసాడు. చనిపోయిన తన బంధువుల ప్రీతి కొరకు వారి వారి పేరుతో వారి రాజ్యములలో చలివేంద్రములు పెట్టించాడు, సత్రములు కట్టించాడు, చెరువులు తవ్వించాడు, దేవాలయములు కట్టించాడు. బ్రాహ్మణులకు గోదానం చేయించాడు. ఇలా వారి రుణం తీర్చుకున్నాడు.

ధర్మరాజు శ్రీకృష్ణుడిని కీర్తించుట

[మార్చు]

ధర్మరాజు శ్రీకృష్ణుడి ఎదుట నిలుచి " శ్రీకృష్ణా ! నీ కరుణాకటాక్షాల వీక్షణము వలన నేను ఈ కురు సామ్రాజ్యచక్రవర్తిని అయ్యాను. నా మనసు ఆనందంతో నిండి పోయింది. నీవు సదా మా వెన్నంటి ఉండి మమ్ము కాపాడుతూ ఉన్నావు. నీవు లేకున్న మేమెంత ! మా పరాక్రములు ఎంత ! నీవు ఈ సృష్టికి ఆది పురుషుడవని వేదాలు ఘోషిస్తున్నాయి. నీ గురించి చెప్పడానికి వేదాలకే వీలు కాదు. ఇక మేమెంత. నీ నామస్మరణ చేతనే పాపాలు పోతాయి. పుణ్యములు చేకూరుతాయి. సద్బ్రాహ్మణులు సదా నీ నామస్మరణ చేస్తుంటారు " అని ధర్మరాజు కృష్ణుని విష్ణు, విశ్వాత్మ, జిష్ణు, శర్వ, హంస, దామోదర, శంభు మొదలైన నామములతో కీర్తించాడు. ధర్మరాజు తన తమ్ములవంక తిరిగి " మీరంతా నా వలన అడవులలో కష్టములు అనుభవించారు. నా మూలంగా అజ్ఞాతవాసంలో ఊడిగం చేసారు. నా కొరకు యుద్ధం చేసి నా అన్న వారిని అందరిని పోగొట్టుకుని అమిత దుఃఖముకు గురి అయి, నన్ను చక్రవర్తిని చేసి ధన్యుడిని చేసారు. శ్రీకృష్ణుడి దయతో మనకు ప్రాప్తించిన ఈ రాజ్యాన్ని నాతో పాటు మీరూ అనుభవిస్తూ రాజును, మంత్రాంగమును, ధనాగారమును, హస్థినాపురమును, మన సైన్యాలను, మన ప్రజలను, మన మిత్ర రాజులను కంటికి రెప్పలా కాపాడండి. భీమసేనా నీవు రారాజు మందిరంలో ఉండు, అర్జునా ! నీవు దుశ్శాసనుడి మందిరంలో నివసించు, దుర్మర్షణుడు, దుర్ముఖుల మందిరాలలో నకుల సహదేవులు నివసిస్తారు. విదురుని, సంజయుని, యుయుత్సుని, ధౌమ్యులను చూసి మీరు మీకు ఇచ్ఛవచ్చిన మందిరాలలో నివసించండి. మా పెదనాన ధృతరాష్ట్రుడు ఇప్పటి వరకు ఆయన నివసించిన మందిరంలో నివసిస్తాడు. శ్రీకృష్ణుడికి, సాత్యకికి అర్జున రాజప్రాసాదములో విడిది ఏర్పాటు చేయండి. అని ఆదేశాలు ఇచ్చి ధర్మరాజు తన అభ్యంతర మందిరానికి వెళ్ళాడు.

బయటి లింకులు

[మార్చు]