ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము
[మార్చు]సంజయుడు అభిమన్యుని మరణ వార్త ధృతరాష్ట్రునికి చెప్పుట
[మార్చు]ధృతతరాష్ట్రా ! ఆ ప్రకారం మూడవ రోజు యుద్ధంలో సంశక్తులు అర్జునుడిని తమతో యుద్ధానికి రమ్మని కవ్వించారు. అర్జునుడు వారితో యుద్ధముకు దిగాడు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. ధర్మరాజు అనుమతితో అభిమన్యుడు ఆ వ్యూహమును భేదించి వ్యూహమున ప్రవేశించి బృహద్బలుడు, లక్ష్మణకుమారుడు మొదలైన పెక్కుమందిని చంపి పద్మవ్యూహం నుండి బయటకు వచ్చు మార్గం తెలియక కౌరవుల చేతిలో మృతిచెందాడు. కురుసేనలో ఉత్సాహం పాండవసేనలో విషాదాన్ని నింపుతూ ద్రోణసారథ్యంలో మూడవ రోజు యుద్ధం ముగిసింది " అని సంజయుడు వివరించాడు. అభిమన్యుడు రణరంగమున మరణించాడు అన్న మాటవిన్న ధృతరాష్ట్రుడు ఎంతో పరితపించాడు. " సంజయా ! నా మనుమడు అమిత తేజశ్శాలి, సద్గుణసంపన్నుడు అయిన అభిమన్యుడు ఉగ్రమనస్కులైన యోధుల చేతిలో ఎలా మరణించాడు " అని సంజయుని అడిగాడు.
మూడవరోజు యుద్ధం
[మార్చు]సంజయుడు " మహారాజా ! మూడవ రోజున ద్రోణుడు కురు సేనలను పద్మవ్యూహంలో నిలిపాడు. దానిని చక్రవ్యూహం అని కూడా అంటారు. వివిధ దేశాధీశులు పద్మవ్యూహముకు రేకులవలె నిలిచారు. వారి కుమారులంతా కేసరముల వలె నిలిచారు. కర్ణుడు, దుశ్శాసనుడు తమ తమ సేనలతో పద్మము యొక్క అంతర్భాగమున వారి మధ్య భాగమున సుయోధనుడు సేనలతో నిలిచాడు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవసుడు, శలుడు, శల్యుడు, నీ కుమారుడు, నీ మనుమలు తమతమ స్థానాలలో నిలిచారు. పాండవ సేనలో భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, చేకితాణుడు, క్షత్రధర్ముడు, క్షత్రవర్మ, ధృష్టకేతు, నకుల సహదేవులు, ఉత్తమౌజుడు, శిఖండి, యుధామన్యుడు, ఘతోత్కచుడు, విరాటరాజు, ద్రుపదుడు, ద్రౌపదీసుతులు, కేకయ రాజులు సంజయులు ఒక్కుమ్మడిగా ద్రోణునితో తల పడ్డారు. ద్రోణుడు వారి విజృంభణకు జంకక వారిపై వాడి అయిన బాణములు ప్రయోగించాడు. ద్రోణుని పరాక్రమానికి బెదిరి పాండవ వీరులు పారిపోసాగారు. వారిలో ఎవ్వరికీ ద్రోణుడు పన్నిన పద్మ వ్యూహంలో చొరపడడానికి సాధ్యం కాలేదు. ధర్మరాజు " పద్మవ్యూహములో ప్రవేశించడానికి అభిమన్యునికి తప్ప వేరెవరికి సాధ్యం కాదు " అని తలచి అభిమన్యుని వద్దకు వెళ్ళి " కుమారా ! పద్మవ్యూహమున ప్రవేశించుట నీకు, నీ తండ్రి అర్జునుడికి, శ్రీకృష్ణునికి తప్ప మరెవరికి సాధ్యం కాదు. మనలను నీ తండ్రి హేళన చేయకుండా ఉండాలంటే నీవు ఆ వ్యూహమును ఛేదించ వలెను " అన్నాడు. అభిమన్యుడు " తండ్రీ ! నాకు పద్మవ్యూహమున ప్రవేశించుట మాత్రమే తెలుసు. కనుక వ్యూహమున ప్రవేశించి కురుసేనను చీల్చి చెండాడుతాను. ధర్మరాజు " అది చాలు కుమారా ! నీవు త్రోవ చూపి వ్యూహమున ప్రవేశించిన వెంటనే మేమంతా నీ వెంట వస్తాము " అన్నాడు. భీముడు కూడా " కుమారా ! వ్యూహములో ప్రవేశించిన చాలు నీ వెంట నేను, ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు వచ్చి సేనలను మట్టు పెడతాము " అన్నాడు. అభిమన్యుడు " పెదనాన గారూ ! మీరు ఇలా అడుగ వచ్చునా పద్మ వ్యూహమును రచించిన ద్రోణుడు మెచ్చగా నేను వ్యూహమున ప్రవేశించి శత్రు నిర్మూలన గావించి ధర్మరాజు మాట నిలిపి నా తల్లి తండ్రులకు నా ప్రావీణ్యము ప్రదర్శిస్తాను. ఇంత చిన్నవాడు కురు సేనలను చెండాడుతున్నాడని నా మేనమామ శ్రీకృష్ణుడు మెచ్చేలా కురుభూపతి అచ్చెరువందేలా నా తండ్రి సంతసించేలా రణభూమిలో వీరవిహారం చేస్తాను " అన్నాడు. ఆ మాటకు సంతసించిన ధర్మరాజు " కుమారా! నీ ధైర్యమూ, నీ శౌర్యమూ, నీ బలము, నీ కీర్తి వర్ధిల్లుగాక " అని దీవించాడు. అభిమన్యుడు సుమిత్రుడనే సారధితో రధమును ద్రోణుని వైపు పోనిమ్మని చెప్పాడు. సుమిత్రుడు " కుమారా ! నీవు బాలుడవు నీ ఎదుటున్నది ద్రోణుని సైన్యము. వారు అతిరధులు, మహారధులు, క్రూరాత్ములు కనుక నీ చేతిలో మరణించు వారు కాదు. కనుక వ్యూహమున ప్రవేశించే ముందు ఆలోచించు " అన్నాడు. అభిమన్యుడు నవ్వి " సుమిత్రా ! దేవేంద్రుడే దేవగణముతో వచ్చినా, తన భూతగణముతో రుద్రుడే భూతగణముతో వచ్చినా, నా తండ్రి వచ్చినా, నా మేనమామ శ్రీకృష్ణుడే నాతో యుద్ధానికి వచ్చినా నన్ను యుద్ధమున గెలువ లేరు సందేహం వదిలి రథమును ద్రోణుని మీదికి పోనిమ్ము " అన్నాడు. సందేహం వీడకున్ననూ సుమిత్రుడు రధమును ద్రోణుని వైపు పోనిచ్చాడు. అది చూసి కురు సేన ఒక్కసారిగా అభిమన్యుని ఎదుర్కొన్నది సమరం సంకులు మైంది. అయినా అభిమన్యుడు మెరుపు మెరిసినట్లు కురు సేనలను ఛేధిస్తూ వ్యూహంలో ప్రవేశించాడు.
అభిమన్యుని ప్రతాపం
[మార్చు]దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు రుద్రుడై కార్చిచ్చు అడవిని దహించినట్లు కురుసేనలను దహిస్తున్నాడు. అభిమన్యుడు ప్రయోగిస్తున్న అస్త్రముల ధాటికి రధ, గజ, తురంగ, పదాతి దళములు నాశనం ఔతున్నాయి. కేతనములు విరిగిపడుతున్నాయి. సారధులు మరణిస్తున్నారు. ధనస్సులు విరుగుతున్నాయి. శత్రుసైన్యముల శరీరంలో అత్యంత క్రూర శరములు నాటుకున్నాయి. రణరంగం కకావికలైంది. పీనుగులు కుప్పలుగా పడ్డాయి. అభిమన్యుని ధాటికి పద్మవ్యూహం చెదిరి పోయింది. కురు సేన పారి పోసాగింది. అది చూసిన సుయోధనుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అది చూసిన ద్రోణుడు తమ సైన్యంలోని అతి రధ మహారధ యోధులను పిలిచి సుయోధనుడు అభిమన్యుని ఎదుర్కొంటున్నాడు. మీరంతా వెళ్ళి సాయం చెయ్యండి " అన్నాడు. అప్పుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, శకుని, పౌరవుడు, వృషసేనుడు అంతా కలిసి సుయోధనునికి సాయంగా వెళ్ళి ఒక్కుమ్మడిగా అభిమన్యుని చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. చేత చిక్కిన సుయోధనుడు చేజారినందుకు అభిమన్యుడు క్రుద్ధుడై అతి రథ మహారధుల మీద అస్త్రశస్త్రములు కురిపించాడు. అభిమన్యుని ధాటికి కురుసేన పారి పోసాగింది. ఇది చూసిన ద్రోణుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై శరములు గుప్పించాడు. పారి పోతున్న కురుసేన తిరిగి వచ్చి అభిమన్యునితో పోర సాగాయి. అభిమన్యుడు అతి లాఘవంగా వారు ప్రయోగించిన శరములు త్రుంచి వారి శరీరాలు తూట్లు పడేలా కొడుతున్నాడు. అభిమన్యుని శౌర్యం చూసి ఆశ్చర్యపడిన సుయోధనుడు చకితుడైనాడు.
కురుప్రముఖులు అభిమన్యుని ఒక్కుమ్మడిగా ఎదుర్కొనుట
[మార్చు]పారి పోతున్న తన సేనలను చేయి ఊపి పిలుస్తూ అభిమన్యుని ఎదుర్కొన్నాడు. సుయోధనుడు, భూరిశ్రవసుడు, కృపాచార్యుడు ఒక్కొక్కరు మూడేసి బాణములు, ద్రోణుడు పదిహేడు, వివిశంతి ఇరవై బాణములను, అశ్వత్థామ అయిదు బాణములు, బృహద్బలుడు ఎనిమిది బాణములను, శల్యుడు ఆరు బాణములతోను, దుశ్శాసనుడు పన్నెండు బాణములతో ఒక్క సారిగా అభిమన్యుని కొట్టారు. ఆ బాణములన్నీ త్రుంచిన అభిమన్యుడు వారి శరీరంలో మూడేసి బాణములు గుచ్చాడు. అశ్మకుని కేతనము త్రుంచి, విల్లు త్రుంచి అతని శిరస్సు ఖండించాడు. అది చూసిన కురుసేన భీతి చెంది పారిపోసాగింది, ద్రోణుడు వారిని తిరిగి యుద్ధోన్ముఖులను చేసాడు. నీకుమారులు అందరిని కూడగట్టుకుని అభిమన్యునిపై బాణములు గుప్పించారు. అభిమన్యుడు బెదరక వారి శరీరాలను శరములతో బాధించాడు. కర్ణుని కవచమును భేదించి వక్షస్థలము మీద క్రూరమైన బాణమును గుచ్చాడు. ఆ దెబ్బకు కర్ణుడు మూర్ఛపోయాడు. నీ కుమారులందరిని వెనక్కు తరిమాడు. శల్యుడు అభిమన్యుని ఎదుర్కొనగా అభిమన్యుడు శల్యుని అత్యంత పదునైన బాణంతో కొట్టి మూర్ఛిల్ల చేసాడు. అభిమన్యుడు సింహనాదం చేసాడు. కురుసేనలు ద్రోణుడు వద్దని ఎంత వారించినా వినక పారి పోయాయి " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు " సంజయా అభుమన్యుని తరువాత ఎవరు ఎదుర్కొన్నాడు " అన్నాడు. సంజయుడు " శల్యుడు మూర్ఛపోవడం చూసి అతడి తమ్ముడు అభిమన్యుని ఎదిరించి అభిమన్యునిపై పది బాణములు వేసాడు. అభిమన్యుడు ఆ బాణములు మధ్యలో త్రుంచి శల్యుని తమ్మునిపై రథమును విరిచి, హయములను చంపి, చేతులు నరికి ఆఖరుగా శిరస్సు ఖండించాడు, ఇది చూసిన మిగిలిన రాజకుమారులు భయభ్రాంతులైయ్యారు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన ప్రముఖ యోధులు ఒకరిని ఒకరు పిలుచుకుని ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుని ఎదుర్కొన్నారు. అది చూసి అభిమన్యుడు సాక్షాత్తు అర్జునుడే అక్కడ ఉన్నట్లు భ్రమ కలిగిస్తూ గుండ్రటి విల్లు ధరించాడా అన్నట్లు అందరిపై శరవర్షం కురిపించాడు. అభిమన్యుడు కౌరవ వీరుల మీద భల్లములు, అంజలకములు, క్షురపములు, కూర్మనఖములు మొదలయిన బాణములు ప్రయోగిస్తున్నాడు. అభిమన్యుని ప్రతాపము విని ధృతరాష్ట్రుడు మోదము ఖేదముల మ్మిశ్రిత భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తరువాత ఏమైంది అని ఆత్రంగా అడిగాడు. సంజయుడు " ఆ ప్రకారం పారిపోతున్న కౌరవ సేనలను అభిమన్యుడు పారిపోనీయక వారిచుట్టూ తన రధమును తిప్పుతూ ఎడతెరిపి లేని శరములు గుప్పిస్తూ రణరంగాన్ని పీనుగుల పెంట చేసాడు. అభిమన్యుని ప్రతాపం చూసి ద్రోణుడు కృపాచార్యునితో " అచార్యా ! చూసారా తన తల్లితండ్రులు, మామలు, స్నేహితులు, సోదరులు సంతోషించే విధంగా అభిమన్యుడు శత్రు సంహారం చేస్తున్నాడు. రథ, గజ, తురంగాదులను నేల కూలుస్తున్నాడు. అతడి ముందు మన సైన్యంలో వీరులు ఎవరూ నిలువ లేకున్నారు " అన్నాడు.
సుయోధనాదులు అభిమన్యుడిని ఎదుర్కొనుట
[మార్చు]ఆ మాటలు విన్న సుయోధనుడు అతి దీనవదనంతో ముఖము మీద చిరునవ్వు తెచ్చుకుని కర్ణుడు, భూరిశ్రవసుడు మొదలగు వారితో ఇలా అన్నాడు " విన్నారా ! మన గురువుగారు ద్రోణార్యుని మాటలు విన్నారా! విల్లు పట్టి నేర్చుకున్న ప్రతి వాడికీ ద్రోణాచార్యులే గురువు. అలాంటి వాడు ఒక పసి బాలుడిని మహా వీరుడని పొగుడుతూ చంపడానికి ప్రయత్నించ లేదు. ఎంతైనా పార్ధుని కుమారుని పార్ధునికి అనుకూలుడైన ద్రోణుడు చంపుతాడా! అయినా ద్రోణుడు ఉపేక్షించబట్టి అభిమన్యుడు చెలరేగిపోతున్నాడు. మనమంతా కలిసి అభిమన్యుని ఎదుర్కొంటాము అన్నాడు. ఇది విన్న దుశ్శాసనుడు ముందుకు వచ్చి " అన్నయ్యా ! ఈ మాత్రం దానికి యోధాను యోధులు కావాలా! అవక్ర పరాక్రమంతో అభిమన్యుని చంపుతాను. అభిమన్యుడు మరణించాడు అన్న వార్త విన్న అర్జునుడు, శ్రీకృష్ణుడు మరణిస్తారు మన పగ చల్లారుతుంది " అన్నాడు. దుశ్శాసనుడు విల్లు సారించి శరములు గుప్పిస్తూ అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు దుశ్శాసనుచే ప్రయోగించబడిన శరములు త్రుంచి అతని మీద ఇరవై ఆరు అతి క్రూర బాణములు ప్రయోగించాడు. వారివురి యుద్ధాన్ని మిగిలిన వారు యుద్ధం ఆపి చూస్తున్నారు. ఇంతలో అభిమన్యుడు దుశ్శాసనుని విల్లు విరిచి దుశ్శాసనుడి ఒళ్ళంతా తూట్లుగా కొట్టి నవ్వుతూ " దుశ్శాసనా ! నాడు నిండు పేరోలగములో నా తండ్రిగారు ధర్మరాజును తూలనాడిన నీ తల ఖండించి నా తల్లి తండ్రులకు మోదము కలిగిస్తాను " అంటూ రెండు వాడి అయిన బాణములు దుశ్శాసనుని వక్షస్థలముపై కొట్టాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడు మూర్చిల్లి రథముపై బడ్డాడు. అలా మూర్చపోయిన అతడిని రథసారథి పక్కకు తీసుకు పోయాడు. అభిమన్యుడు దారి చేయగా లోనికి ప్రవేశించిన పాండవ సైన్యం అది చూసి హర్షధ్వానాలు చేసారు. సుయోధనుడు కర్ణునితో " కర్ణా ! దుశ్శాసనుడు అభిమన్యుని చేతిలో మూర్చిల్లాడు కదా " అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు తన సైన్యంతో అభిమన్యుని మీదకు వెళ్ళి డెబ్భై మూడు బాణములు అభిమన్యునిపై ప్రయోగించాడు. అభిమన్యుడు వాటిని లక్ష్యపెట్టక మధ్యలోనే త్రుంచి కర్ణుడు అలసి పోయేదాకా శరములతో కొట్టాడు. కర్ణుని తమ్ముడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యుని హయముల మీద సారథి మీద శరములు గుప్పించాడు. అభిమన్యుడు చిరునవ్వుతో ఒకేఒక భల్లభాణముతో అతడి శిరస్సును త్రుంచాడు.
అభిమన్యుని విజయోత్సాహం
[మార్చు]తమ్ముని మరణం చూసి కర్ణుడు తన సైన్యంతో పక్కకు తొలిగాడు. ఇది చూసిన కురుసేన విజృంభించింది.అభిమన్యుడు కురుసేనను బాణ వర్షంతో కట్టడి చేస్తూ పారి పోతున్న కర్ణుని తరిమాడు. కర్ణుడు ప్రాణభయంతో పారిపోయాడు. అతని వెంట కురుసైన్యమూ పారిపోయింది. అది చూసి ద్రోణుడు తల్లడిల్లి పోయి " కృపాచార్యా ! కర్ణా ! నిలవండి మీ లాంటి యోధాను యోధులు పారి పోవడము భావ్యమా ! సుయోధనా ! బాహ్లికా ! మీ పరాక్రమం చూపవలసిన తరుణం ఇదే కదా ! వెను తిరిగి వచ్చి అభిమన్యునితో పోరుసాగించండి " అని వారించినా వినక పారిపోసాగారు. అది చూసి అభిమన్యుడు సింహ నాదం చేసి విల్లు సారించి శరములు గుప్పిస్తూ కురుసేనను నాశనం చేసుతున్నాడు. రణరంగం విరిగిన ఆయుధములు, కేతనములు, ధనస్సులు, రథముల కుప్పలు హయములు, గజములు, సైనికుల కళేబరములతో నిండాయి. విరిగిన కాళ్ళు చేతుల విషయం అంతులేదు. రెండవ సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అభిమన్యుడు " అన్నాడు ధృతరాష్ట్రునితో సంజయుడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఇప్పటి వరకు అభిమన్యుడు మాత్రమే యుద్ధం చేస్తున్నాడని చెప్తున్నావు కాని మిగిలిన పాండవులు, ద్రుపదుడు, విరాటుడు ఏ మయ్యారు ఎందుకు సాయం రాలేదు " అని అడిగాడు.
పాండవులను జయద్రధుడు ఎదుర్కొనుట
[మార్చు]ధృతరాష్ట్రునికి సమాధానంగా సంజయుడు ఇలా చెప్పసాగాడు " మహారాజా ! పాండవ ప్రముఖులు అభిమన్యునికి సాయంగా పద్మవ్యూహంలో ప్రవేశించి కురుసేనను నిర్మూలించడం మొదలు పెట్టారు. అది చూసిన కౌరవ యోధులు నిశ్చేష్టులు అయ్యారు. పాంచాల, మత్స్య, యాదవ, కేకయ ప్రముఖులు ధర్మరాజుకు తోడుగా నిలిచి పోరాడుతున్నారు. అప్పుడు సైంధవుడు పాండవులను ఎదుర్కొన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు " అదేమిటి సైంధవుడు మహావీరుడే అయినా అతడు పాండవులను ఎదుర్కొనడమేమిటి. అంతటి శక్తి రావడానికి అతడు చేసిన తపస్సేమిటి " అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో " మహారాజా ! పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఒక రోజు సైంధవుడు భీముని చేతిలో ద్రౌపది కారణంగా భంగపడ్డాడు కదా ! ఆ అవమానం భరించ లేక ఈశ్వరుని గురించి తపస్సు చేసి ప్రసన్నుని చేసుకుని పాండవులను జయించు వరం కోరాడు. అందుకు శివుడు " అర్జునుడిని తప్ప మిగిలిన వారిని ఒక్క రోజు మాత్రం నివారించ గలవు " అని వరం ప్రసాదించాడు. ఆ వర ప్రభావంతో సైంధవుడు పాండవులను అడ్డగించగలిగాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించగానే సైంధవుడు వర ప్రభావం కారణంగా వారిని అడ్డుకుని మూడు బాణములతో సాత్యకిని, ఎనిమిది బాణములతో ధృష్టద్యుమ్నుని, ఇరవై బాణములతో, విరాటుని, పది బాణములతో శిఖండిని, ఏడు బాణములతో పాంచాల భూపతిని, పదిహేను బాణములతో దరుపదీ సుతులను, ఇరవై అయిదు బాణములతో క్వేకయరాజులను, డెబ్బై అయిదు బాణములతో ధర్మరాజుని కొట్టాడు. ధర్మరాజు సైంధవిని విల్లు విరిచి అతడిపై అతి క్రూర బాణములు గుప్పించాడు. సైంధవుడు మరొక విల్లు అందుకుని మంటలు విరజిమ్మే బాణములను ధర్మజుని పైన అతడి అనుచరముల పైన వేసాడు. భీమసేనుడు సైంధవుని ఎదుర్కొని మూడు బాణములతో అతడి విల్లును, కేతనమును, ఛత్రమును విరిచాడు. నీ అల్లుడు మరొక బాణమును చేతబట్టి భీముని ఛత్రమును, కేతనమును, కేతరుగకొట్టానమును, రథమును విడు. రథము విరిగిన భీముడుపక్కనే ఉన్న సాత్యకి రథము ఎక్కి సైంధవునిపై అనేక అస్త్రములు వేసాడు. సైంధవుడు వాటిన్నటిని మధ్యలోనే త్రుంచి పాండవ సేన మీద అతికౄర నారాచములు వేసాడు. సైంధవుని అస్త్ర ధాటికి తట్టుకోలేని పాండవసేన పారిపోయింది. ఈ ప్రకారం సైంధవుడు పాండవ సేనను పద్మవ్యూహములో ముందుకు పోకుండా అడ్డుకున్నాడు. పాండవులకు సైంధవునకు సమరం ఘోరంగా సాగుతుంది.
అభిమన్యుని శౌర్యం
[మార్చు]ద్రోణుని ప్రోత్సాహంతో వెనుతిరిగిన కౌరవ సైన్యం తిరిగి వచ్చి అభిమన్యుని చుట్టుముట్టి అతడి మీద బాణములు గుప్పించారు. అభిమన్యుడు వారిని అందరిని సంహరించి సింహఘర్జన చేసి కౌరవ సేనలో భయోత్పాతాలు సృష్టించాడు. వృషసేనుడు తన సైన్యంతో అభిమన్యుని ఎదుర్కొని క్రూరనారాచములు ప్రయోగించాడు. అభిమన్యుడు కోపంతో వృషసేనుని కేతనము విరిచి, అశ్వములను గాయపరిచాడు. వృషసేనుడి శరీరం అంతా పదునైన బాణములు దింపి మూర్చిల్ల చేసాడు. అతడి రథమును ఈడ్చుకుంటూ రథాశ్వములు ఎటో తీసుకు వెళ్ళాయి. ఇంతలో శౌర్యధనుడైన వసాపతి భూపతి ఆరు బాణములతో అభిమన్యుని కొట్టాడు. అభిమన్యుడు ఒకే బాణంతో వసాపతి భూపతిని కొట్టాడు. అతడి చావు చూసిన కురుప్రముఖులు తమ సైన్యాలతో అభిమన్యునిపై లంఘించి అభిమన్యుని క్రోధాగ్నిలో కార్చిచ్చులో పడిన మిడుతల వలె మాడి పోయారు. కురుసేన అభిమన్యుని ధాటికి ఆగలేక మిగిలిన పారిపోయారు. అది చూసిన కురు వీరులు యోధులు నానాదేశ రాజులు అందరూ ఆలోచించుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యుని మీదకు ఉరికారు. అభిమన్యుడు లేళ్ళ గుంపు మీదకు ఉరికిన పులి వలె వారి మీదకు లంఘించి వారందరిని మట్టుబెట్టాడు. తెగి పడిన అంగములు, మాంస ఖండములు, ఏనుగులు, హయములు, కళేబరములు రణరంగం అంతా చెదిరి పడ్డాయి.
అభిమన్యుడు కౌరవసేనను మట్టుబెట్టుట
[మార్చు]అభిమన్యుడు ఎదుట నిలువడానికి ఎవరికి ధైర్యం లేదు. దొరికిన వారిని దొరికినట్లు చంపుతున్నాడు. కురుసేన అంతా భయంతో నలుదిక్కుల పారిపోయారు. శల్యుని కుమారుడు రుక్మరధుడు వచ్చి " వీడికి నేను ఓడేదేమిటి. నేను వీడిని పట్టి ఇస్తాను నా పరాక్రమము ఏమిటో మీకు తెలుస్తుంది. మీకేమి భయం లేదు " అన్నాడు. అని అభిమన్యుని ఎదుర్కొని తొమ్మిది బాణములను అభిమన్యుని భుజముల మీద వక్షస్థలము మీద నాటాడు. అభిమన్యుడు ఒకే బాణంతో వాడి తల నరికాడు. రుక్మధరుని మరణము చూసిన అతడి స్నేహితులు, సాటి రాజులు ఒక్కుమ్మడిగా అభిమన్యుడి మీద విజృంభించి అతడి మీద శరములు గుప్పించారు. వారి శరములలో కనిపించని అభిమన్యుని రథం చూసి సుయోధనుడు అభిమన్యుడు మరణించాడని సంతోషించాడు. అభిమన్యుడు తన శత్రువులపై గంధర్వ మాయను ప్రయోగించాడు. ఆ గంధర్వ మాయ పూర్వము అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు దానిని అభిమన్యునికి ప్రసాదించాడు. గంధర్వ మాయా ప్రభావం వలన ఎంతో మంది వీరులు తమపై బాణములు కురిపిస్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది. ఆ దృశ్యములకు శత్రుసేన భయముతో వణికింది. అభిమన్యుడు వారి చుట్టూ తిరుగుతూ వారిని సంహరిస్తున్నాడు. కొంతసేపటికి వారంతా మృతులై ఉన్నారు. అభిమన్యుని యుద్ధనైపుణ్యం చూసి కౌరవసేన ఆశ్చర్యపోయింది. ఇది పనికాదని తలచి సుయోధనుడు స్వయంగా అభిమన్యునితో యుద్ధం చేసాడు. కాని అభిమన్యుని ధాటికి ఆగలేక ప్రాణములు దక్కించుటకు అక్కడి నుండి తొలగి పోయాడు. ధృతరాష్ట్రుడు అభిమన్యుని పరాక్రమము విని " సంజయా ! ఒక్క బాలుడు ఇంత మందిని వధించాడా ! నమ్మ లేక పోతున్నాను. అవునులే అభిమన్యుడు ధర్మాన్ని ఆశ్రయించాడు. ధర్మం ఎప్పుడూ అధర్మాన్ని జయిస్తుంది కదా ! " అన్నాడు.
అభిమన్యుడు లక్ష్మణ కుమారుని వధించుట
[మార్చు]అభిమన్యుని పరాక్రమ ధాటికి ఎందరో రాజులు మరణించారు. సుయోధనుడు మొదలగు వారు పారిపోయారు. నీ కుమారులకు చెమటలు పట్టి దిక్కులు చూస్తున్నారు. పారిపోయిన సుయోధనుడు అశ్వత్థామ, కృప, కర్ణ, కృతవర్మ, బృహద్బలుడు, శకుని మొదలగు వారిని కూడగట్టుకుని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు మేఘఘర్జన చేసి పిడుగు వలె వారి మీద పడ్డాడు. సుయోధనుని కుమారుడు, నీ మనుమడు లక్ష్మణకుమారుడు అభిమన్యుని ఎదుర్కొని నిరంతర శర ప్రయోగం చేసాడు. తన కుమారుని విడువలేని సుయోధనుడు అభిమన్యునితో పోరు చేస్తున్నాడు. అభిమన్యుడు లక్ష్మణకుమారుని మీద బాణములు గుప్పించాడు. ఇరువురి నడుమ పోరు ఘోరరూపం దాల్చింది. అభిమన్యుడు ఒకే బాణంతో లక్ష్మణకుమారుని తల తెగనరికాడు. తన కుమారుని మరణం కళ్ళారా చూసిన సుయోధనుడు మిక్కుటమైన కోపంతో ఊగిపోతూ వీడిని కొట్టండి, నరకండి, చంపండి అని ఆక్రోశించాడు. కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, బృహద్బలుడు అత్యంత ప్రభావం కల శరములు అభిమన్యునిపై వేసారు. అభిమన్యుడు ఆ బాణములను త్రుంచి తన సారథితో రథమును సైంధవుని వైపు మళ్ళించమని చెప్పాడు. ఇంతలో కళింగులు నిషాదులు తమ తమ సైన్యంతో వచ్చి అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు వారితో వీరావేశంగా పోరుతున్నాడు. అక్కడ సైంధవుడు పాండవులను పద్మవ్యూహం లోకి రానీయకుండా అడ్డుకుంటున్నాడు. అభిమన్యుడు ద్రోణునిపై ఏభై బాణములు, కృతవర్మ మీద ఎనభై బాణములు, అశ్వత్థామ మీద పది బాణములు కర్ణుని మీద ఒక్క బాణము వేసి నొప్పించాడు. కృపాచార్యుని రథము విరుగకొట్టాడు. బృహద్బలుని శరీరంపై ముప్పై బాణములు వేసి నొప్పించాడు. వారికి సహాయంగా ఉన్న వారిని అంసంఖ్యాకమైన బాణములతో నిర్మూలించాడు. క్రోధలిప్తుడు, బృందారకుడు అను రాజులు శిరస్సులు ఖండించాడు. కృపాచార్యుడు వేరొక రథం ఎక్కి అభిమన్యునిపై బాణములు గుప్పించాడు. బృహద్బలుడు వారినందరిని తోసుకుని వచ్చి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు వాడి అయిన బాణములతో బృహద్బలుని సారథిని చంపి విల్లు విరిచి కేతనమును విరిచి, రథాశ్వములను చంపాడు. బృహద్బలుడు కత్తి డాలు తీసుకుని అభిమన్యునితో యుద్ధం చేయ సాగాడు. అభిమన్యుడు ఒకే భల్లబాణంతో బృహద్బలుని శిరస్సు ఖండించాడు. అది చూసి తమ రాజును చంపినందుకు కోసలరాజు బంధు మిత్రులు ఒక్కసారిగా అభిమన్యునిపై పడ్డారు. వారినందరిని యమపురికి పంపి అభిమన్యుడు కర్ణుని మీదకు వచ్చాడు. అభిమన్యునికి కర్ణునికి మధ్య పోరు ఘోరమైంది. ఒకరి శరీరములు ఒకరు రక్తసిక్తం చేసుకున్నారు. ఇంతలో కర్ణుని సైన్యాధిపతులు ఆలోచించుకుని ఒక్కసారిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు వారిని చూసి చిరునవ్వు నవ్వి వారిని ఒక్కొక్క బాణంతో ఒక్కొక్కరిని అంతమొందించాడు. తరువాత ద్రోణుడు మొదలగు కౌరవ ప్రముఖుల మీదకు దృష్టి మళ్ళించాడు. మగధరాజ కుమారుడు బాలుడైనా అభిమన్యుని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు అతడి సూతుని, హయములను చంపి మరొక బాణంతో అతని తల తెగనరికాడు. అభిమన్యుడు సింహనాదం చేసాడు. అది చూసి దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు అభిమన్యుడు అతడి రథాశ్వములను, సారథిని కొట్టి " కుమారా ! నీ తండ్రి దుశ్శాసనుడు నా ముందు నిలువ లేక పారిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా ! నా ప్రతాపం రుచి చూడు " అని ఒకేఒక నారసముతో బాణంతో దుశ్శాసనుడి కుమారుని వక్షస్థలము మీద కొట్టాడు. ఇంతలో అశ్వత్థామ ఆ బాణమును మధ్యలో త్రుంచి దుశ్శాసనుని కుమారుని రక్షించాడు. అభిమన్యుడు కనీసం అశ్వత్థామ వైపు చూడకుండా దుశ్శాసన కుమారుని విల్లు త్రుంచి, అతడి సారథిని చంపి, ఆరు బాణములు అతడి గుండెలో దించాడు. అభిమన్యుని ధాటికి తాళలేక దుశ్శాసనుడి కుమారుడు పారిపోయాడు.
అభిమన్యుని మరణం
[మార్చు]అపహార్ణం వరకు యుద్ధం సంకులంగా జరిగింది. శత్రుంజయుడు, సువర్చనుడు, చంద్రకేతుడు, సూర్యభానుడు, మేఘవేగుడు మొదలైన వారు ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై పడ్డారు. అభిమన్యుడు తన అస్త్రశస్త్రములతో వారిని అందరిని దూరంగా తరిమి కొట్టాడు. శకుని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు అతడిని తీవ్రమైన శరాఘాతముతో నొప్పించి తనరధమును సుయోధనుని వైపు పోనిచ్చాడు. ఇది చూసిన కర్ణుడు " ఆచార్యా ! కౌరవ సేనలో మహామహులను ఓడించినభిమన్యుడు సుయోధనుడి మీదికి పోతున్నాడు. ఈ సమయంలో మీరు ఊరక ఉండుట తగునా ! ఏదైనా ఉపాయం ఆలోచించి అభిమన్యుని చంపండి " అని సుయోధనుడికి సాయంగా వెళ్ళాడు. అప్పుడు ద్రోణుడు " అభిమన్యుడు చిన్న వాడైనా తన తండ్రి అర్జునికి సమానంగా యుద్ధం చేస్తున్నాడు ఇక ఉపేక్షించరాదు. మనమంతా ఒక్కుమ్మడిగా అతడిని ఎదుర్కొన వలెను " అని పలికాడు. ఇంతలో అభిమన్యుని చేతిలో చావు దెబ్బలు తిని కర్ణుడు అక్కడికి వచ్చి ద్రోణుడితో " ఆచార్యా ! చూసారా అభిమన్యుడు నన్ను ఎలా దెబ్బ తీసాడో ! నేను మీ దగ్గరే ఉంటాను ఇంతకంటే నాకు సురక్షిత ప్రదేశం లేదు. అర్జునుడి పరాక్రమం గురించి విన్నాను కాని అతడి కొడుకు అంతకంటే పరాక్రమవంతుడు అని అర్ధం అయ్యింది " అన్నాడు.
అభిమన్యుడిని కపటోపాయముతో చంపమని ద్రోణుడు చెప్పుట
[మార్చు]అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి " కర్ణా ! నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచ ధారణ విద్య వలన అతడి శరీరంపై ఎవరూ శరములు నాట లేరు. ఎదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతడిని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును త్రుంచాలి, వేరొకరు అతడి సారధిని చంపాలి, మరొకరు అతడి రథం విరుగ కొట్టాలి కాని ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుని ఈ కపటోపాయంతో చంపు " అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు. కొంత మంది అతడి విల్లు విరిచారు, ద్రోణుడు అతడి రథాశ్వములను చంపాడు, కృపాచార్యుడు అతడి రథసారథిని చంపాడు, అభిమన్యుడు నిరాధయుడు విరధుడు అయ్యాడు. అదే తగిన సమయమనుకుని బాహ్లికుడు, శకుని, శల్యుడు, అశ్వత్థామ, కృతవర్మ అతడి మీద బాణవర్షం కురిపించారు. అభిమన్యుడు ఖడ్గము డాలు తీసుకుని రథము మీద నుండి కిందకు దూకి గాలిలో గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను ఖండించాడు. అభిమన్యుడు ఎప్పుడు తన తల ఖండిస్తాడో అని యోధులంతా అక్కడి నుండి పారి పోయారు. ద్రోణుడు ఒక బల్లెము తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు. కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు రథములోని చక్రాయుధం తీసి దానిని గిరగిరా త్రిప్పుతూ శత్రు సేనలను చంపుతూ సింహనాదం చేసాడు. రక్తసిక్తమైన అతడి ముఖమును చూసిన శత్రు సేనలు భయభ్రాంతం అయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణములు ఖండిస్తూ శత్రుసంహారం చేస్తున్నాడు. ద్రోణుని వైపు దూసుకు పోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండ్డాడుతున్నాడు. ఆ సమయమున శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడుమొదలైన యోధులు ఒకటిగా కూడి అభిమన్యుని చక్రయుధం ఖండించారు. అప్పుడు అభిమన్యుడు తన గదను తీసుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అభిమన్యుని దెబ్బకు భయపడి అశ్వత్థామ రథం నుండి దూకి రథం వెనక్కు పోయి దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ సారథిని, రథాశ్వలను చంపాడు. అభిమన్యుడు శకుని మీద లంఘించి అతడికి సాయంగా ఉన్న ఇరవై ఏడు మంది యోధులను గదాయుధంతో చంపాడు. గజములపై పది మంది యోధులు అభిమన్యుని ఎదుర్కొన్నారు అభిమన్యుడు వారిని గజములతో సహా యమపురికి పంపాడు. కేకయరాజులను ఏడుగురిని ఒక్క సారిగా యమపురికి పంపాడు. ఇంతలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై
అనేక శరములు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణములను గదాదండంతో అడ్డుకుని అతడి అశ్వములను, సారథిని చంపి అతడి రథమును విరుగకొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గదాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కార సాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమనుడు దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకుని కిందపడ్డారు. గాయపడిన వారి శరీరముల నుండి ప్రాణములు వేరయి స్వర్గలోకం చేరాయి. అప్పటికీ కసి తీరని కౌరవ యోధులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింప చేస్తూ అభిమన్యుడు కౌరవయోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. ధృతరాష్ట్ర మహారాజా ! ఆ విధంగా యోధాను యోధుడైన అభిమన్యుడు రణరంగమున మరణించగానే కౌరవసేనల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆ సమయాన అక్కడ చేరిన భూతగణాలు " అభిమన్యుని అమానుషంగా అధర్మ యుద్ధంలో అన్యాయంగా పలువురు కలిసి వధించారు " అని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే పాండవ సేనలు పారిపోయాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న ధర్మరాజు " మన అభిమన్య కుమారుడు దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి హయములను, గజములను చంపి రధములను విరిచి, పదాతి దళమును తనుమాడి. అనేక సైనిక ప్రముఖులను చంపి ద్రోణుడు మొదలైన మహాయోధులను భయభ్రాంతులను చేసి వీరస్వర్గం అలంకరించాడు. అటువంటి మహాయూధుని మరణముకు చింతించ పని లేదు " అన్నాడు. అప్పటికే చీకట్లు కమ్మాయి. ఆ రోజుకు యుద్ధము మాని వారి వారి శిబిరాలకు వెళ్ళారు. కౌరవ సేనలో ఆనందోత్సాహాలు నిండగా పాండవ యోధుల్లో విషాద ఛాతలు కమ్ముకున్నాయి.
ధర్మరాజు అభిమన్యుని మరణానికి చింతించుట
[మార్చు]ధర్మరాజు తన శిబిరంలో కూర్చుని ఇలా " చింతింస్తున్నాడు. " ద్రోణాచార్య సురక్షితంమైన దుర్భేద్యమైన పద్మవ్యూహం ఛేదించుటకు అభిమన్యుని ఏల పంపవలె. నన్ను సంతోషపెట్టుటకు అభిమన్యుడు ఏల పద్మవ్యూహంలోకి చొరబడవలె. దుశ్శాసనాధి కురుప్రముఖులను ఓడించుట అనేక మంది యోధులను చంపుట పసి బాలునకు సాధ్యమా ? ఇది ఒరులకు ఏల సాధ్యము. అర్జునుడు వచ్చి ఏడీ నా కొడుకు అని అడిగిన నేను ఏమి చెప్పవలె. కృష్ణుడు వచ్చి నా గారాల మేనల్లుడు ఏడీ అని అడిగిన నేను ఏమి చెప్పవలె? అయ్యో ! బాలుడు సుకుమారుడు అయిన అభిమన్యునికి యుద్ధరీతులు ఏమి తెలియును. మహావీరులకే దూర శక్యముకాని పద్మవ్యూహము లోకి నేను ఎందుకు పంపించాను. పెద్దలు పిన్నలకు బహు ప్రియముగా బహుమానము ఇత్తురు నేను యుద్ధమునకు పంపి మరణముకు కారణమయ్యాను. నేను ఎంతటి పాషాండుడను. అభిమన్యునితో నేను పాటు నేను ఎందుకు మరణించ లేదు. పుత్రశోకంతో అలమటించే అర్జుడిని నేను ఎలా ఓదార్చగలను. కాలకేయులను చంపి ఇంద్రుడు అంతటి వాడిని ఆదుకున్న అర్జునుడు కుమారుడు ఇలా పగవారి చేత హతుడుకావలసిన దుర్ధశ దాపురించింది కదా! తన కొడుకును చంపారన్న కోపంతో అర్జునుడు ద్రోణాదులను చంపవచ్చును కాని మరణించిన కుమారుడు రాడు కదా! ఈ భూమిలోని సకల సంపదలు స్వర్గలోక సుఖములు సహితం చిరునవ్వులు చిందించు అభిమన్య ముఖారవిందముకు సాటి రావు కదా ! " అని పరి పరి విధముల విలపిస్తున్నాడు.
వ్యాసుని రాక
[మార్చు]అప్పుడు ధర్మరాజు వద్దకు వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజు ఆ మహామునికి అర్ఘ్యపాద్యములు సమర్పించి సత్కరించి ఇలా అన్నాడు. " మహానుభావా ! శత్రుసేనలను జయించడానికి నేను అభిమన్యుని పంపాను. అభిమన్యుడు శత్రుసేనలను ఎదుర్కోడానికి పద్మవ్యూహములో జొరపడ్డాడు. వెంటనే మేము కూడా వెళ్ళాము కాని పరమశివుని వరప్రభావంతో సైంధవుడు మమ్ము అడ్డుకున్నాడు. అప్పుడు కౌరవయోధులు పెక్కు మంది అభిమన్యుని చుట్టుముట్టి రకరకములైన ఆయుధములతో అధర్మంగా చంపారు. బాలుని ఒంటరిగా యుద్ధముకు పంపిన నాలాంటి పాపాత్ముడు ఎక్కడైనా ఉంటాడా ! విపరీతమైన దుఃఖంతో నా మనసు ఉడికి పోతుంది నా పాపానికి నిష్కృతి లేదు " అని విలపించాడు. వ్యాసుడు " ధర్మజా ! శోకింపకుము. ఎంతోమంది యోధాను యోధునులను చంపిన అభిమన్యుడు బాలుడా ! శత్రువులు అతడి మీద క్రూరబాణములు వేయక పూలబాణములు వేస్తారా ! తెలివి విపత్తులు కలవారు నీలా శోకించరు. మరణం ఈ లోకంలోని ప్రాణులకు సహజం . గరుడ, ఉరగ, దానవులకే మరణం జయింప శక్యము కానిది. మానవ మాతృలము మనమెంత . విధినిని తప్పించుట ఎవరికి సాధ్యము. కనుక ధైర్యము తెచ్చుకుని కాగల కార్యము గురించి ఆలోచింపుము " అని పలికాడు. మునీంద్రా ! ఈ భూమిని ఏలిన ధైర్యశాలులైన, పరాక్రమవంతులైన రాజులు మహాత్ములు ఒక్కరు కూడా మృత్యుముఖము నుండి తప్పించుకొనుటకు సాధ్యము కాలేదే ఎందుకు " అని అడిగాడు.
అకంపనుని గాధ
[మార్చు]ధర్మరాజు అడిన దానికి సమాధానంగా వ్యాసుడు ఇలా చెప్పాడు. " ధర్మరాజా ! పూర్వం అకంపనుడు అనే రాజు పుత్రశోకంతో పరితపిస్తూ నారదుని వలన మృత్యువు గురించి వవరంగా విన్నాడు. ఆ కథ వింటే నీ మనసుకు శోకము పోయి శాంతి చేకూరుతుంది. పూర్వము అకంపనుడు అనే రాజు ఉండే వాడు. అతడి మీద శత్రువులు దండెత్తి వచ్చి అతడిని పట్టి బంధించి కారాగారంలో బంధించాడు. అది చూసిన అతడి కుమారుడు హరి అను వాడు శత్రువులను ఎదిరించి వారిని జయించి తన తండ్రి అకంపనుడిని చెర నుండి విడిపించి తిరిగి శత్రువులతో పోరాడగా వారు ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి అతడిని చంపారు. అకంపనుడు విజృంభించి తన అవక్ర పరాక్రమంతో వారిని జయించి రాజధానిలో అడుగు పెట్టాడు. అయునా పుత్రశోకంతో దుఃఖిస్తుండగా నారదుడు అక్కడకు వచ్చాడు. అకంపనుడు నారదమహర్షికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి జరిగినదంతా చెప్పి తనకు లభించిన విజయం కూడా కుమారుని మరణం వలన సంతోషం కలిగించలేదని విలపించాడు. అకంపనుడు నారదునితో " నారద మునీంద్రా ! మృత్యువును ఈ లోకంలో ఎవరూ ఎదిరించ లేదని విన్నాను. అది ఎలా మృత్యువు జననం గురించి వనవలెనని కుతూహలంగా ఉన్నది వివరించండి " అని అడిగాడు.
ప్రజాపతి తన కోపానలంతో లోకాలను దహించుట
[మార్చు]నారదుడు " అకంపనా ! బంధువుల మరణం వలన కలుగు దుఃఖం పోగొట్టు కథను వినిపించెదను వినుము. మొదట ప్రజాపతి ప్రజలను సృంష్టించాడు కాని చావును సృష్టించ లేదు. వారికి చావు లేని కారణంగా భూమికి భారం ఎక్కువైంది. ప్రజలు చనిపోవడానికి తగిన ఉపకరణం కనిపించక ప్రజాపతి చింతాక్రాంతుడై ఉండగా అతని ఇంద్రియముల నుండి మంటలు చెలరేగి భూమి మీద ఉన్న భూతకోటిని దహించసాగాయి. మహాశివుడు సృష్టి అలా దహించుకు పోవడం చూసి సహించ లేక పోయాడు మహాశివుడు. లోక కల్యాణార్ధం బ్రహ్మదేవుని వద్దకు వళ్ళాడు. ప్రజ్వరిల్లి పోతున్న బ్రహ్మదేవుడు శివుని చూసి " మహాశివా ! నీవు నా వద్దకు వచ్చిన కారణమేమి అడుగుము నెరవేర్చెదను " అన్నాడు. అప్పుడు శివుడు " బ్రహ్మదేవా ! అఖిల సృష్టికి కర్తవైన నీవే ఇలా దహించుట తగునా! నా అందు దయ ఉంచి సస్త లోకములను దయతో ఆదరింపుము " అన్నాడు. బ్రహ్మదేవుడు " పరమశివా! నా యందు కోపము కాను కామము కాని లేవు. ప్రజలను సృష్టించాను కాని మరణం సృష్టించ లేదు. కనుక భూభారం ఎక్కువైంది. భూభారం ఎక్కువైందని భూదేవి నన్ను కోరింది. భూదేవికి హితము చేయకోరి ఈ సంహార క్రియ చేయుచున్నాను. భూభారం తగ్గించుటకు నాకు ఇంతకన్నా ఉపాయం తోచలేదు. ఆ కారణంగా నాలో కోపం ప్రవేశిచింది. నా కోపానల జ్వాలలలో భూతకోటి భస్మీపటలం ఔతుంది " అని పలికాడు. శివుడు " అనఘా ! నీ ఆజ్ఞ మేరకు నీవు సృష్టించిన ప్రాణులను నేను పాలిస్తున్నాను. నీవు ఇప్పుడు నీ కోపానల జ్వాలలతో భూతకోటిని భస్మీ పటలం కావించుట న్యాయమా ! ఇది నీకు తగునా ! భూభారం తగ్గించుటకు చరాచర జగత్తును ఒక్క పెట్టున భస్మీపటలం కావించవలెనా ! వేరొక ఉపాయం ఆలోచించి సంహారక్రియ ఒక పద్ధతి ప్రకారం సాగించవచ్చు కదా ! ఈ సంహార క్రియ అనే వరం నాకు ప్రసాదించండి " అని కోరాడు. బ్రహ్మదేవుడు తన కోపానలము ఉపసంహరించుకున్నాడు. సకల భువనాలు శివుని, బ్రహ్మదేవుని స్తుతించాయి.
మృత్యుదేవత జననం
[మార్చు]కోపానలము ఉపసంహరించుకున్న సమయంలో బ్రహ్మదేవుని నుండి ఎర్రటి కన్నులతో, ఎర్రని చీర కట్టుని రక్త వర్ణంతో ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె వారిరువురిని చూసి దక్షిణదిశగా పోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు " ఓ మృత్యుదేవతా ! ఎక్కడికి పోతున్నావు ఇలారా " అనగానే ఆమె బ్రహ్మదేవుని ఎదుట నిలిచింది. బ్రహ్మదేవుడు " ఓ మృత్యుదేవతా ! నాలో సంహారం చేయాలన్న కోరిక కలగగానే నీవు పుట్టావు కనుక నీవు పక్షపాతబుద్ధి లేక ఒక పద్ధతి ప్రకారం ఈ చరాచర జగతిని సంహరిపుంము. నీవు నా ఆజ్ఞను అనుసరించి ఈ కార్యము నిర్వహిస్తున్నావు కనుక నీకు పాపం అంటదు " అని ఆజ్ఞాపించాడు. అది విన్న మృత్యుదేవత దుఃఖించింది. బ్రహ్మదేవుడు ఆమె కన్నీటిని దోసిట పట్టి ఆమెను ఎన్నోవిధముల అనునయించాడు. అప్పుడు మృత్యుదేవత శోకంతో " ఓ మహానుభావా ! నీవు నన్ను సృష్టించి ఈ పాపకార్యానికి నియోగిస్తావా? బంధుమిత్రుల మరణం వలన శోకంతో విలపిస్తున్న వారి రోదనలు వినలేను. ఈ అధర్మమునకు నేను ఒడిగట్టలేను స్వామీ నా మీద దయ ఉంచి తపస్సుచేసుకొనుటకు అనుమతిస్తే నేను ధేనుకాశ్రము పోయి తపస్సు చేసుకుంటాను " అని పలికింది. అప్పుడు బ్రహ్మదేవుడు " ఓ మృత్యుదేవతా ! నేను నిన్ను సంహారముకు మాత్రమే సృష్టించాను కనుక సంశయం వదిలి నా ఆజ్ఞ ప్రకారం సంహారక్రియ నెరవేర్పుము " అని ఆజ్ఞాపించాడు. ఆ యనకు భయపడి అంగీకరించినట్లు అక్కడే నిలబడిపోయింది మృత్యుదేవత. తన ఆజ్ఞ పాటించినందుకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. తాను సృష్టించిన లోకాల వైపు చూడగా అవి అన్ని సంతోషించాయి. తాను వచ్చిన పని అయినందుకు పరమశివుడు కూడా కైలాసముకు వెళ్ళాడు. మృత్యుదేవత బ్రహ్మకు నమస్కరించి ధేనుకాశ్రముకు వెళ్ళి అచ్చట నంద, కౌశికి నదుల చెంత అత్యంత నియమ నిష్టలతో ఎన్నో వ్రతములు చేసింది. హిమాలయ పర్వతాల మీద ఘోరతపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు " ఓ మృత్యుదేవతా ! నీవు ఎందుకు ఇంత నియమ నిష్టలు ఆచరిస్తావు " అని అడిగాడు. అందుకు మృత్యుదేవత " నేను ప్రజల మెడలు నులిమి చంపలేను నన్ను ఈ పనికి పంప వద్దు. ఇది అధర్మమన్న భయంతో నిన్ను ఆశ్రయించాను. ఆర్తితో నిన్ను శరణువేడుతున్నాను " అన్నది. బ్రహ్మదేవుడు " నీవు నా ఆజ్ఞను అనుసరించి చేస్తున్నావు కనుక ఇందు అధర్మం లేదు. నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలా నేను పరమేశ్వరుడు వరమిస్తాము. నేను సంకల్పించిన పని చేసిన నీకు అధర్మము అంటదు. నాలుగు విధములైన భూతకోటిని సంహరింపుము " అన్నాడు. మృత్యుదేవత " దేవా! నేను నీ ఆజ్ఞను నీవు చెప్పినట్లు చేస్తాను. నాదొక్క విన్నపము వినుడు. ప్రాణులలో లోభము , క్రోధము, లోభము, ఈర్ష్య, అసూయ కలిగేలా చేస్తే నేను నా విధిని సక్రమంగా నెరవేర్చగలను " అని కోరింది.
వ్యాధులు రోగాలు
[మార్చు]బ్రహ్మదేవుడు " అలాగే చేస్తాను అంతేకాదు నీవు దుఃఖించినపుడు నీ కన్నీటి బిందువులను నా దోసిట పట్టాను కదా ! ఆ కన్నీరు ఒక్కొక్క అశ్రువు ఒక్కొక్క వ్యాధిగా ప్రజ్వరిల్లి భూతకోటిని పీడిస్తుంది కనుక వారు వ్యాధి కారణంగా మరణిస్తారు కనుక నిన్ను నిందించరు నీకు పాపము అంటదు అది అధర్మము కాదు. పరబ్రహ్మ ఆజ్ఞనుసారం ప్రాణుల ప్రాణాలు గ్రహిస్తావు కనుక నీవు పరమధర్మము నిర్వర్తిస్తుంటావు కాని అది అధర్మము కాదు. నీవు ధర్మస్వరూపిణివి, పరమేశ్వరివి సమస్త జీవుల ప్రాణములు నీ చేతిలో ఉన్నాయి. కనుక నీవు నిర్భయంగా నీ ధర్మము నెరవేర్చుము. దుర్మార్గులను వారి అధర్మపు కార్యాలే వధిస్తాయి " అని పలికాడు. తనకు పాపము అంటదని అది అధర్మము కాదని బ్రహ్మదేవుడు వచించటంతో బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చక పోయిన శాపానికి గురి కావలసి వస్తుందన్న భయం చేత మృత్యుదేవత సంహార క్రియకు అంగీకరించింది. సమస్త జీవుల దేహములు వ్యాధులతో కృశించినపుడు వారి ప్రాణములు హరిస్తూ ఉంది. జీవులు ఒక దేహమును వదిలి వేరొక దేహము ఆశ్రయిస్తున్నాయి. మానవులు కూడా అలా మాణానంతరం వేరొక దేహమును ఆశ్రయిస్తున్నాయి . వాయుదేవుడు సర్వ వ్యాపి అపరిమిత తేజశ్శాలి ఈ చరాచర జగత్తుకు ప్రాణదాత. ప్రాణవాయువు ఈ శరీరంలో ప్రవేశించిన జననం శరీరాన్ని వదిలినపుడు మరణం సంభవిస్తాయి. దేవతలు కూడా కర్మ చేయాలంటే మానవులుగా అవతరిస్తారు. మరల మానవులు తమ ధర్మాచరణతో దైవత్వం కనుక పొందగలరు. కనుక నీ కుమారుడు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు. చింత వద్దు ఈ జగత్తు అంతా దుఃఖ్ భూఇష్టం నీకుమారుడు దుఃఖం అంటే వినపడని పుణ్య లోకమునకు పోయాడు. బ్రహ్మకల్పితమైన మరణముకు ధీరులైన వారు దుఃఖింపరు " అని నారదుడు మృత్యుదేవతా ప్రభావం గిరించి వివరించాడు. అకంపనుడు నారదునితో " నీవు చెప్పినది విన్న నా మనసున దుఃఖం తొలగి పోయి స్వస్థత చేకూరింది " అని నారదునికి నమస్కరించాడు. అప్పుడు అకంపనుడు అక్కడ నుండి అశోకవనముకు వెళ్ళాడు " అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పి " ధర్మరాజా ! ఈ కథ వ్రాసిన వారికి చదివిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి. అభిమన్యుడు రణరంగమున వివిధములైన ఆయుధములతో శత్రువులతో పోరాడి వీరస్వర్గము అలంకరించి ప్రపంచ ఖ్యాతి గడించాడు. కనుక నీవు చింతింప తగదు" అని చెప్పాడు.
ధర్మరాజు వ్యాసుని అడిగి యజ్ఞగాగాదులు వాటి ఫలితాలు తెలుసుకొనుట
[మార్చు]వ్యాసుని మాటలతో ఊరట చెందిన ధర్మరాజు క్షత్రియ ధర్మమును అనుసరించి వీరస్వర్గమలంకరించిన అభిమన్యుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు కదా అనుకుని " మునీంద్రా ! ఇది వరకు ఉన్న మహారాజులు చేసిన యజ్ఞయాగములు ఏమిటి ? వాటి ఫలితము ఏమిటి " అని అడిగాడు. ధర్మరాజు మనసులో మాట గ్రహించిన వ్యాసుడు " ధర్మరాజా ! నీ కుమారుడు అభిమన్యుడు కూడా పూర్వపు మహారాజుల వంటి వాడే కనుక అభిమన్యునికి ఎలాంటి పుణ్యలోకాలు లభిస్తాయో అని ఆలోచిస్తున్నావు కదా " అన్నాడు. ధర్మరాజు మహాత్మా ! నీ దివ్యచిత్తముకు తెలియనిది ఏమున్నది దానిని గురించి వినగోరుతున్నాను " అని అన్నాడు. వ్యాసుడు " ఎన్నో యజ్ఞ యాగములు చేసిన వారు, తపస్సు చేసిన వారు, దానధర్మములు చేసిన వారు, ఉదాత్తమైన సద్గుణములు కలవారు తాము మరణించిన తరువాత పుణ్యలోకాలకు వెళ్ళి సుఖపడుతున్నారు. నిశ్వార్ధంగా అభిమన్యునిలా యుద్ధము చేసి వీరమరణం పొందిన వారు అంతకంటే ఉన్నతమైన పుణ్యలోకాలు పొందగలరు. అదీ కాకుండా మహితాత్ములైన మహారాజులు చేసిన యజ్ఞయాగాదులు వారి కర్మానుష్టానం గురించి తెలుసుకోవాలని అనుకున్నావు కనుక చెప్తాను విను.
సృంజయుని కథ
[మార్చు]వ్యాసుడు ధర్మరాజుకు సృంజయుని కథ వివరించుట. " పూర్వము సృంజయుడు అనే రాజు పాలిస్తుండే వాడు. అతనికి సంతానము లేదు సంతానము కొరకు అతడు ఎప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తుండే వాడు. అతడికి నారదుడు ప్రియ మిత్రుడైనందు వలన సృంజయుని వద్దకు పలుమార్లు వస్తుండే వాడు. ఒక రోజుక్కడ ఉన్న బ్రాహ్మణులు అంతా కలిసి సృంజయుని కోరిక తీర్చమని ప్రార్ధించారు. నారదుడు సృంజయిని వద్దకు పోయి " మిత్రమా ! నీ మనసులో ఉన్న కోరిక ఏమిటి ? నాకు ఇంత కాలము ఎందుకు చెప్పలేదు? " అని అడిగాడు. సృంజయుడు " నారదునితో తనకు గుణవంతుడు రూపవంతుడు అయిన కుమారుడు కావాలని ఆ పుత్రుని స్వేదము, మూత్రము, పురీషము, కన్నీరు అన్నీ బంగారుమయంగా ఉండాలని అలాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు. నారదుడు నవ్వి సృంజయుని కోరిక తీరుతుందని చెప్పాడు. నారదుని వర ప్రభావమున జన్మించిన కుమారునికి సృంజయుడు సువర్ణష్ఠీవి అని నమకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ కుమారుని వలన అతడి ఇంట్లో బంగారం దినదినాభివృద్ధిగా పెరగ సాగింది. అతడి ఇంట్లో ప్రతి వస్తువు బంగారు మయం అయింది. పడుకునే మంచము, కూర్చునే ఆసనము, ఇళ్ళు, ప్రాకారం మొదలైన సమస్త వస్తువులు బంగారుమయం అయ్యాయి. ఇది చూసిన కొందరు దొంగలు ఒక రోజు సృంజయుని కుమారుని అపహరించుకుని అరణ్యముకు పారి పోయారు. అక్కడ వారు రాజకుమారుని చంపి పొట్ట చీల్చి చూసి బంగారం కనపడక పోయేసరికి ఆ శవమును అక్కడ పారవేసి పోయారు. కాని వారు చేసిన హత్య వారిని వెంటాడి వారిలో వారికి తగాదాలు వచ్చి వారిలో వారు కొట్టుకుని మరణించారు. సృంజయుడు తన కుమారుని కానక అతడి కొరకు వెతికించి అడవిలో అతడి మృతదేహాన్ని చూసి అంత్యక్రియలు చేసాడు.
నారదుడు రారాజులకు సైతం మరణం తప్పదని సృంజయునకు వివరించుట
[మార్చు]పుత్రశోకంతో అలమటిస్తున్న సృంజయుని చూచుటకు నారదుడు వచ్చి " సృంజయా ! పోయిన వారిని గురించి ఏడిస్తే తిరిగి వస్తారా ! ఇలా ఏడుస్తుంటే నీ ప్రాణాలు కూడా నిన్ను విడిచి పోగలవు. కనుక శోకించ తగదు. నీతో నాకున్న మైత్రి వలన నేను నీకు కొన్ని విషయములు చెప్పదలచుకున్నాను. పూర్వము మరుత్తు అనే రాజు ఎన్నో ఎజ్ఞయాగాదులు చేసి బంగారం వెండి వస్త్రములు దానం చేసి అమితమైన కీర్తిగడించాడు. అలాంటి మరుత్తు ఇప్పుడు ఉన్నాడా ! కాల గర్భములో కలిసి పోలేదా ! సుహోత్రుడు అనే మహారాజు అనేక పూజలు వ్రతాలు చేసాడు. అనేక అశ్వమేధయాగాలు చేసాడు కాని అతడు కూడా మరణించాడు కాని శాశ్వతంగా ఉన్నాడా ? అంగుడు అనేరాజు ఎన్నో రత్నాలు, మణిహారాలు, మణులు బ్రాహ్మణులకు దానం చేసాడు అతడు కూడా పరలోకం చేరుకోలేదా ! ఏడు దీవులలో రథాన్ని నడిపిన శిబి చక్రవర్తి ధనం కొరకు ప్రజలను అడిగింది లేదు. పరమేశ్వరుడు ఇచ్చిన ధనంతో అనేక అశ్వమేధాలు నిర్వహించాడు. లెక్కలేనన్ని గోవులను బ్రాహ్మణులకు దానం చేసాడు. ఈ లోకాన్ని విడిచి పోలేదా ! మరి శ్రీరాముని చరిత్ర నీకు తెలిసిందే కదా! చిన్న వయసులో రాక్షస సంహారం చేసి దశకంఠుని సంహరించి జనరంజకంగా రాజ్యమేలిన దశరథరాముడు పరలోకము చేరలేదా ! గంగను భూమికి తీసుకు వచ్చి అనేక యజ్ఞయాగాదులు నిర్వహించి అనేక దానములు చేసిన భగీరధుడు పరలోప్కగతుడు కాలేదా ! ఇక దిలీప మహారాజు చేసిన క్రతువులో మేనక, విశ్వావసువు, గంధర్వులు స్వయంగా పాల్గొన్నారు. ఎంతో మంది దేవరుషులు వచ్చారు. ఎన్నో దానధర్మములు చేసాడు, అతడు చేసిన అశ్వమేధయాగాలకు ఇంద్రుడే స్వయంగా వచ్చి యాగాశ్వన్ని తీసుకు వెళ్ళాడు. అంతటి దిలీప మహారాజు స్వర్గదామము చేరలేదా ! ఇక చెప్ప పనిలేదు పన్నెండు రోజుల శిశువుగా ఉన్నప్పుడు ఇంద్రుని బొటన వ్రేలి నుండి స్రవించిన అమృతాన్ని సేవించిన అదృష్టవంతుడు. పన్నెండవ ఏట సామ్రాజ్యాధీశుడు అయి ఈ భూమిని ఏలిన మహనీయుడు కాలం తీరిన పిదప ఒక్క క్షణం ఉన్నాడా ! యయాతి మహారాజు దేవాసుర యుద్ధములో ఇంద్రుడికి తోడుగా ఉండి జీవితం ధార పోసాడు. మనుష్యులలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పరచాడు. ఈ భూమిని అంతా పాలించి అగ్ని ష్ఠోమము, అశ్వమేధము, వాజిపేయి, అతి రాత్రము, పౌండరీకము మొదలైన యజ్ఞములు చేసి కీర్తి గడించిన యయాతి పరలోకము చేర లేదా! తనమీదకు దండెత్తి వచ్చిన శత్రువులను జయించి తన శరణు జొచ్చిన వారిని కరుణతో మన్నించి అనేక యజ్ఞ యాగములు నిర్వహించి అనేక దానధర్మములు చేసిన అంబరీషుడు ఇప్పుడు పరలోకమున నివసించుట లేదా ! శశిబిందు మహారాజుకు లక్ష మంది భార్యలు. ఒక్కొక్క భార్యకు వెయ్యి మంది కుమారులు. వారు అంతా మహా పరాక్రమవంతులు. అనేక అశ్వమేధయాగాలు చేసిన వాడు నేడు పరలోకగతుడు కాలేదా ! ఘోరతపమాచరించి అగ్నిదేవుని ప్రసన్నము చేసుకున్న గయ మహారాజు అగ్ని దేవుని అనుగ్రహమున శమము, దమము, బ్రహ్మచర్యము, సౌశీల్యము, పాండిత్యము, అహింస దానధర్మములు మొదలగు సద్గుణములతో విరాజిల్లాడు. ముప్పై ఆరు యోజనముల వేదికను ఏర్పరచి దానిపై మహాయజ్ఞము నిర్వహించి బ్రాహ్మణులకు ఎన్నో దానములు చేసాడు. ఇప్పటికీ గయలో అతడి పేరున ఒక మర్రి చెట్టు ఉంది. అంతటి మహానుభావుడు పరలోకమునకు ఏగలేదా ! ఇరవై వేల వంట వాళ్ళను పెట్టి వండించి నిరంతర అన్నదానం చేసాడు రంతిదేవుడు. సత్రయాగం నిర్వహించాడు. అటువంటి రంతిదేవునికి మరణం తప్ప లేదు కదా! చిన్న తనంలో క్రూరమృగములను మచ్చిక చేసుకుని వాటి మీద విహరించిన ధీశాలి భరతుడు. ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమిని ఏలి, గంగా, యమునా, సరస్వతీ తీరాన అనేక యజ్ఞయాగాదులు నిర్వహించి రథ, గజ, తురంగములను ప్రీతితో బ్రాహ్మణులకు దానము చేసాడు. అటువంటి భరతునికి కాలంతీరి పోలేదా ! ఎగుడు దిగుడుగా ఉండి రథములు తిరగ శక్యము కాని భూమిని చదును చేసిన మహారాజు పృధు చక్రవర్తి. అతడి పేర భూమికి పృధివి అనే నామధేయం వచ్చింది. అతడు చేసిన యజ్ఞయాగాదులు లెక్కలేదు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాడు. ఈ భీమినంతా బ్రాహ్మణులకు దానమిచ్చి ఖ్యాతి గాంచిన వాడు. ఈ భూమి మీద అతడూ శాశ్వతముగా ఉండ లేదు. తన తండ్రిని చంపిన కార్తవవీర్యార్జునిడిని చంపి క్షత్రియ ద్వేషంతో ఈ భూమి మీద ఇరవై ఒక్క ప్రదక్షిణం చేసి క్షత్రుయుల మీద దండెత్తి క్షత్రియ కుల నాశనం చేసిన భార్గవరాముడు. ఈ భూమిని అంతా ఏలిన వాడు. ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహించిన వాడు పరశురాముడు బ్రతికి ఉన్నాడా. అలాంటి వారికే మృత్యువు సహజమైనప్పుడు ఇక సామాన్యుల సంగతి చెప్పవలెనా ! కనుక సృంజయా వీరికంటే ఉదాత్తుడైన నీ కుమారుడైనా మృత్యువు నుండి తప్పించుకొన జాలడు " అన్నాడు.
సృంజయిని కుమారుడు జీవించుట
[మార్చు]ఆ మాటలు విని మిన్నకున్న సృంజయుని చూసి నారదుడు " ఇప్పటి వరకూ చెప్పినది నీ బుద్ధిలోకి ప్రవేశించిందా లేక నిష్ఫలమేనా !" అన్నాడు. సృంజయుడు " నారదా ! నీ మాటలు నాకు ఊరట కలిగించాయి నేను ప్రశాంత చిత్తుడను అయ్యాను " అన్నాడు. నారదుడు " సృంజయా ! నీకు ఏమి కావాలో కోరుకో " అని అడుగగా సృంజయుడు " దేవా ! నీవు నాకు ప్రసన్నుడవు అయ్యావు నాకు ఇంత కంటే కావలసినదేమిటి " అన్నాడు. నారదుడు " సృంజయా ! చోరుల మూర్ఖత్వముకు బలి అయిన నీ కుమారుని నీకు తెచ్చి ఇస్తాను " అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం నారదుడు సువర్ణష్ఠీవిని సృంజయునకు తెచ్చి ఇచ్చాడు. సృంజయుడు తన కుమారునికి అస్త్రశస్త్ర విద్యలు నేర్పి వివాహం చేసాడు. అతడు సంతాన వంతుడు అయ్యాడు. కాలం తీరగానే అతడూ మరణించాడు. ధర్మరాజా ! మృత్యువును జయించుట ఎవరితరం కాదు. నీ కుమారుడు అభిమన్యుడు వీరస్వర్గము అలంకరించి సురలోక భోగములు అనుభవించుచున్నాడు. అతడి మృతికి నీవు చింతించుట అనవసరం. కనుక నామాటలు ఆలకించావు కనుక స్వస్థ చిత్తుడవై ధైర్యము వహించి ధీరుడవై కర్తవ్య నిర్వహణ కావింపుము " అని చెప్పి వ్యాసుడు అక్కడి నుండి వెళ్ళాడు.
అర్జునుడు మనసు కలత చెందుట
[మార్చు]వ్యాసుడి రాక ధర్మరాజుకు ఉరట కలిగించినా అర్జునుడు వచ్చి తనకుమారుని గురించి అడిగినా ఎలాబదులు చెప్పాలి. అతడిని ఎలా ఓదార్చగలను అని మధనపడసాగాడు. సంజయుడిలా చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! సంశక్తులతో యుద్ధానికి వెళ్ళిన అర్జునుడు ఏ విధంగా యుద్ధము చేసాడు. అభిమన్యుని మరణవార్త అతడికి ఎలా తెలిసింది " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! సంశక్తులను అర్జునుడు సమూలంగా నాశనం చేసి తిరిగి వస్తుండగా అనేక దుశ్శకునాలు గోచరించాయి. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " ఎన్నడూ లేనిది నాకు దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి. నా మనస్సు అలజడి చెందుతుంది, శరీరం గగుర్పాటు చెందుతుంది ద్రోణాచార్యుడు సామాన్యుడు కాదు. మా అన్నయ్య ధర్మజునికి ఎలాంటి అపాయము జరగలేదు కదా !" అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " అర్ఝునా ! ధర్మజునుకి అతడి తమ్ములకు ఎలాంటి ఆపదా కలుగదు. మిగిలిన వారికి కలిగిన మనకు త్వరలో తెలుస్తుంది " అన్నాడు. కృష్ణార్జునులు పాండవ శిబిరంలో ప్రవేశించగానే అక్కడ అలముకున్న నిస్తేజమైన వాతావరణం చూసి కలత చెందిన అర్జునుడు " కృష్ణా ! సైనికులు అందరూ నన్ను చూసి తల దించుకుంటున్నారు. వారి ముఖాలలో విషాదచ్ఛాయలు గోచరిస్తున్నాయి. మన శిబిరంలో సందడి లేదు. నేను రాగానే నాకెదురు వచ్చు అభిమన్యుడు నేడు రాలేదు. ఎలాంటి దుర్వార్త వినవలసి వచ్చునో అని మనసు వ్యాకులపడుతుంది. ఎలాంటి దుర్వార్త వినవలెనో అని భయంగా ఉంది " అన్నాడు. కృష్ణుడు బదులు చెప్పలేదు. అర్జునుడు వెంటనే ధర్మరాజు శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు మొదలైన వారు కూర్చుని ఉన్నారు. వారిలో అభిమన్యుడు లేడు. అది చూసిన అర్జునుడికి కాళ్ళు తొట్రుపడ్డాయి.
అర్జునుడు అభిమన్యుని కొరకు వెదకుట
[మార్చు]అర్జునుడు ధర్మజుని చూసి " అన్నయ్యా ! మీరంతా విచారవదనంతో కూర్చుని ఉన్నారు. మీ మధ్య అభిమన్యుడు కనబడుట లేదు. అతడికి ఏమైయ్యిందో చెప్పండి. ఈ రోజు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు దానిలో నేను మాత్రమే ప్రవేశించి వెలుపలకు రాగలను. అభిమన్యునికి ప్రవేశించుట మాత్రమే తెలియిను మీరు అభిమన్యుని పద్మవ్యూహం భేదించుటకు పంలేదు కదా! మీరు కోరారని పద్మవ్యూహమున ప్రవేశించి వెలుపలికి రాలేక ప్రాణములు కోల్పోలేదు కదా ! శ్రీకృష్ణుని మేనల్లుడు, కుంతీదేవి మనుమడు, నా కుమారుడు, యుద్ధవిద్యా నిపుణుడు, దిన్యశరసంధానం తెలిసిన వాడు అయిన అభిమన్యుని శత్రువులు ఏ మాయోపాయంతో చంపారో కదా! గురువుఎడ భక్తి కలవాడు, అత్యంత ఉదారుడు, కరుణాత్ముడు, శౌర్యవంతుడు, ధైర్యశాలి, ఇంద్రుని మనుమడు అయిన అభిమన్యుడు లేక పోవడం దుస్సహము కదా ! చిరు నవ్వు చిందించే మోము, వీశాల నేత్రాలు, విశాలవక్షము కలిగిన అభిమన్యుని వదనారవిందం చూసి కదా నేను జీవిస్తున్నది. అభిమన్యుని మోము చూడక నేను ఎలా బ్రతుకగలను. హంసతూలికా తల్పమున నిదురించు అతడి శరీరం నేడు కఠిన శిలలపై శాశ్వతంగా నిద్రిస్తుందా ! తెల్లని ఛత్రముల నీడన ప్రకాశించు మోము నేడు ధూళిదూసరితమై ఉన్నదా! సదా అందమైన నెచ్చెలుల మధ్య సంచరించే అభిమన్యుడు నేడు క్రూరమైన నక్కల మధ్య ఉన్నాడా! నానా జనులకు నాధుడైన అభిమన్యుడు ఎంతో వినయ విధేయతలు కలిగిన సుభద్ర తనయుడు, దేవేంద్రుని మనుమడైన నా కుమారుడు ఇక లేడా! అయినా నా వంటి మందభాగ్యునికి అంతటి కుమారుడు ఎలా ఉండగలడు. విధాత ఎంతటి నిర్ధయుడో కదా ! మంచి వారిని ఎక్కువ రోజులు బ్రతకనీయడు కదా ! ఆ సంశక్తులు పిలిచిన నేను ఏల యుద్ధముకు పోవలె. నాకుమారుని ఏల పోగొట్టుకున వలే " అని శోకిస్తూ అర్జునుడు అక్కడే కూలబడ్డాడు. అభిమన్యా ! ధర్మరాజు ముద్దులకొడకా ! నీ తల్లి సుభద్రను విడిచి వెళ్ళుట నీకు ధర్మమా ! నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు ఒక్కసారి లేచి రావా ! నీ ప్రియమైన మాటలతో నీ భార్యను ఊరడింపవా ! " అని పరి పరి విధముల పరితపించాడు.
అభిమన్యుని మరణానికి ధర్మరాజును నిందించుట
[మార్చు]అభిమన్యుని కొరకు విలపిస్తున్న అర్జునుడు ధర్మరాజును చూసి " అన్నయ్యా ! ఇది ఎలా జరిగింది? భీమసేనుడు ఏమయ్యాడు ? ధృష్టద్యుమ్నుని వెంట పంపక వేరొక చోటకు పంపావా ? మహా వీరుడు విరాటుడు ఏమయ్యాడు? నీవు ఎందుకు అభిమన్యుని కాపాడ లేదు ? మరొక చోటున యుద్ధం చేస్తున్నావా ? ఇలా అందరూ ఉండీ నా కొడుకుని దిక్కు లేని చావుకు గురి చేసారా ! రణరంగమున నా కుమారుడు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి మరణించాడు కదా ! నాకుమారుని పలువురు చుట్టుముట్టి తమ వివిధ ఆయుధములతో చంపుతుండగా తనకు ఎవ్వరూ తోడు లేరని నా కుమారూడు ఎంత బాధను అనుభవించాడో కదా ! " తండ్రీ ! శత్రువులను వధించి నన్ను కాపాడు " అని ఎంత బాధపడ్డాడో కదా ! అయినా నాకుమారుడు కృష్ణుని మేనల్లుడు అమిత ధైర్యశాలి మిన్ను విరిగి మీద పడినా ధైర్యంగా పోరాడుతాడు కాని వేరొకరి సహాయం అర్ధిస్తాడా ! నా కుమారుని మరణ వార్త విన్న నా హృదయం ముక్కలు కాలేదేమి ? పలువురు కూడి వధించునప్పుడు నా గాండీవం కాని శ్రీకృష్ణుని సుదర్శనం కాని గుర్తుకు రాలేదా ఏమి ? మరణించిన నా కుమారుడు నెత్తుటి మడులో ఎక్కడ పడి ఉన్నాడో నాకు చూపు వారెవరు ? రణరంగమున పడిఉన్న నాకుమారుడి మోము ఉదయించిన చంద్రుని వలె ఉందేమో ? ప్రాణం కంటే మిన్నగా చూసుకొనే సుభద్ర తన కొడుకు మరణాన్ని తట్టుకొనగలదా ! కుమారుని కొరకు తపించే ద్రౌపది శోకం ఎవరు మాన్పగలరు ? " అని పరి పరి విధముల పరితపిస్తూ ధర్మరాజు ముఖము చూసి " ధర్మరాజా ! నేను సంశక్తులతో పోరుతున్నప్పుడు కౌరవవీరుల సింహనాదం విన్నాను. యుయుత్సుడు ఎలుగెత్తి అన్న మాటలు విన్నాను. " మీరు అభిమన్యుడితో పోరాడలేక బాలుడైన అభిమన్యుని పలువురు చేరి చంపారు. ఇప్పుడు మీకు సంతోషం కలిగిందా ! అర్జునుడికి, కృష్ణుడికి అపకారం చేసి బతుకగలరా ! ఈ దుష్కార్యం వలన కలిగిన పాపాం వారిని దహించక ఉంటుందా? " అని పలికిన యుయుత్సుని మాటలు నేను చెవులారా విన్నాను. నేను కృష్ణుడు ఆ మాటలు విని కూడా నమ్మలేదు. ధర్మజా ! తగిన సమయంలో నాకు తెలిపిన నేను అభిమన్యుని చుట్టుముట్టిన వారిని ఎదిరించి అభిమన్యుని రక్షించుకునే వాడిని కదా ! అని విలపిస్తున్న అర్జునుడిని శ్రీకృష్ణుడు పొదివి పట్టుకుని " అర్జునా ! ఏమిటీ వెర్రి ! రణరంగమున యోధులకు మరణం సహజము కదా! నీ కుమారుడు అభిమన్యుడు ఒంటరిగా అనేక మంది కౌరవ యోధులను వీరోచితంగా ఎదుర్కొని మరణించినందుకు సంతోషించక దుఃఖించుట తగునా ! తెలుకొనతగిన విద్యను తెలుసుకున్న జ్ఞానివి. నీ వారంతా ఎలా శోకిస్తున్నారో చూడు నీవిలా దుఃఖిస్తుంటే వారిని ఓదార్చేదెవరు " అన్నాడు. అర్జునుడు " నాకుమారుడైన అభిమన్యుని చంపిన వారెవరు. నేను వెంటనే వారినందరిని సంహరిస్తాను. ఈ రోజు యుద్ధం ఎలా జరిగిందో వివరించండి. ఇంత మంది అస్త్రకోవిదులు, మహావీరులు ఉండగా అభిమన్యిని ఇలా దారుణంగా చంపుటకు వారికి ఎలా సాధ్యమైంది. ధర్మజా ! మిమ్ము పాంచాలురను నమ్మి ఇలా మోసపోయాను. మీకు నా కుమారుని రక్షించు శౌర్యం లేదని తెలిసీ నేనే వచ్చి నా కుమారుని కాపాడలేక పోయాను. ఇంతకూ అభిమన్యుని వెన్నంటకుండా మిమ్ము అడ్డగించిన దెవరు ? అయినా మీకు అంతటి ధైర్య సాహసములు ఏవి ? ఇందరు ఉండీ ఒక్కడిని రక్షించ లేక పోయారు. మీరంతా బలహీనులు యుద్ధానికి జానికి వారు అని తెలిసీ మిమ్మలిని నమ్మి నా కుమారుని మీకు వదిలి పోగొట్టుకున్నందుకు నన్ను నేనే నిందించుకోవాలి. మిమ్ము అని ప్రయోజనము ఏమి పైకి శూరుల వలె కన్పట్టుచున్న మీ ఆయుధములు కేవలం అలంకార ప్రాయమే కాదా! కాకున్న నాకుమారుని రక్షించరా ! " అని అర్జునుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అక్కడ ఉన్న రాజులకు అర్జునుడితో మాట్లాడే ధైర్యము చాల లేదు. కృష్ణుడు మాత్రమే అర్జునుడిని అనునయిస్తున్నాడు.
ధర్మరాజు అభిమన్యుని మరణవిధానము వివరించుట
[మార్చు]అభిమన్యుని మరణం తలచుకుని పరి పరి విధముల రోదిస్తున్న అర్జునుడితో " అర్జునా ! నీవు సంశప్తకులతో యుద్ధం చేయడానికి వెళ్ళావు కదా ! ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. మేము ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయాము. కనుక నేను అభిమన్యుని వద్దకు వెళ్ళి " కుమారా ! వ్యూహమున ప్రవేశించుట మాకెవరికి తెలియదు ముందు నీవు మార్గము చూపుతూ ప్రవేశించిన మేము నిన్ను అనుసరించి వస్తాము " అని చెప్పాను. అందుకు అభిమన్యుడు అంగీకరించి వెంటనే తన రథముతో పద్మవ్యూహమున ప్రవేశించి కౌరవ సేనను చీల్చి చెండాడుతున్నాడు. మేము కూడా అతడిని అనుసరిస్తూ ముందుకు ఉరికాము. కాని సైంధవుడు ఈశ్వరవర ప్రభావమున మమ్ము అడ్డుకున్నాడు. మేము అతడిని అనుసరించ లేక పోయాము. అభిమన్యుడు అత్యంత పరాక్రమంతో అరివీర భయంకరుడై కౌరవ సేనను ఎదిరించి చీల్చి చెండాడి కర్ణాది వీరులను భయభ్రాంతులను చేసాడు. ద్రోణుడు, కర్ణుడు, కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు మొదలైన కురువీరులు ఒక్కుమ్మడిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు అయినా వెరువక అభిమన్యుడు లక్ష్మణకుమారుని, బృహద్బలుడు మొదలైన రాజకుమారులను హతమార్చాడు. వారు తన రథం విరుగ కొట్టగా అభిమన్యుడు గదాయుధముతో వారితో తలపడ్డాడు. దుశ్శాసన కుమారుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరయుద్ధం చేస్తూ క్రింద పడి గదాఘాతాలకు ప్రాణాలు వదిలారు. అలా అభిమన్యుడు తన తల్లి తండ్రుల మేనమామల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తూ వీరస్వర్గం అధిష్టించి అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు " అన్నాడు.
అర్జునిని ప్రతిజ్ఞ
[మార్చు]తన కుమారుని మరణించిన విధానం తెలుసుకున్న అర్జునుడు మనస్సు వికలమై మూర్చపోయాడు. శ్రీకృష్ణుడు యుధిష్టరుడు అర్జునుడికి ఉపచారములు చేసారు. మూర్ఛ నుండి తేరుకున్న అర్జునుడు కోపంతో ఊగిపోతూ ముఖం అంతా ఎర్రబడగా " అందరూ వినండి ఇదే నా ప్రతిజ్ఞ. సైంధవుని రేపు సూర్యాస్తమయం లోపు చంపుతాను. ఆ సైంధవుడు నిన్ను శరణు వేడినా శ్రీకృష్ణుని శరణు వేడినా కడకు నన్నే శరణు వేడినా యుద్ధ భూమి నుండి పారిపోతే తప్ప అతడిని వదలను. సైధవుని రక్షించుటకు కౌరవసేన ఏకమై నా మీద అస్త్రశస్త్రములు ప్రయోగించినా వాడిని వదలను. నేను ఈ ప్రతిజ్ఞ తప్పిన ఎడల గురుద్రోహం, బ్రహ్మహత్య, మద్యపానము మొదలగు ఘోర పాపములు చేసిన వాడను ఔతాను. దేవతలు, కింపురుషులు, రాక్షసులు వాడికి రక్షణగా వచ్చినా నేను వాడిని వదలను. లేని ఎడల అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుయంటాను " అని ప్రతిజ్ఞ చేసాడు. వెంటనే తన గాండీవం తెచ్చి పూజాదికములు నిర్వహించాడు. నారి సారించాడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. పాండవ సైన్యములో తూర్యనాదములు మిన్నుముట్టాయి. సైనికులు సింహనాదములు చేస్తున్నారు. అర్జునుడి అక్షయ తుణీరంలోని అస్త్రశస్త్రాలు వీరావేశంతో నృత్యం చేసాయి. పక్కనే ఉన్న భీమసేనుడు అర్జునుడితో " అర్జునా ! నీ వెంట నేను ఉన్నాను. విజృంభించు సైంధవుని త్రుంచు. దేవదత్తము, పాంచజన్య ఘోషలు విని కౌరవ వీరుల గుండెలు పగులుతాయి ఇది తథ్యం " అని అన్నాడు.
కౌరవ శిబిరంలో కలవరం
[మార్చు]ఆ రాత్రి సమయంలో పాండవ శిబిరంలో పాంచజన్య, దేవదత్త ఘోషలు విని కౌరవసేనలలో కలవరం రేగింది. వెంటనే వారు చారులను పిలిచి అడుగగా వారు జరిగినది అంతా సవిస్తరంగా చెప్పారు. అది విన్న సైంధవుని శరీరం కంపించింది. అక్కడ నిలువ లేక సిగ్గు విడిచి నీ కుమారుని శిబిరానికి పరుగు తీసి " సుయోధనా ! నేను ఒక్కడినే అపకారం చేసినట్లు అర్జునుడు నాపై పగబూని నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసాడట. మీరంతా సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం ఎందుకు దుఃఖపడాలి ? అర్జునుడి ప్రతిజ్ఞకు దేవాసురులు, సిద్ధసాధ్యులుగాని అడ్డుపడగలరా ! సుయోధనా ! ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, శల్యుడు, బాహ్లికుడు నీవు తలచిన యమపురి పోయిన వాడిని తీసుకురాగలరు. కానీ మీరు కాపాడవలెనని అనుకున్నట్లు లేరు కనుక నాకిక దేవుడే దిక్కు " అన్నాడు. అతడి పెదవులు ఎండి పోతున్నాయి కాళ్ళు తడబడుతున్నాయి నిలబడ లేక పోతున్నాడు. " సుయోధనా ! ముందు నేను అర్జునుడి కంట పడకుండా దాక్కుంటాను. మీకిక శలవు బ్రతికుంటే రేపు కలుస్తాను " అని వెళ్ళబోయాడు.
సైంధవుడికి ధైర్యం చెప్పుట
[మార్చు]సుయోధనుడు " సైంధవా ! ఏమిటీ వెర్రి ! ఇప్పుడే కదా ! మా పరాక్రమము పొగిడావు. ద్రోణుని శౌర్యము, సోమదత్తుని ధైర్యము, శకుని వీరము, శల్యుని బలము నీకు తెలియనిదా ! మేము నిన్ను విడిచి పెడతామా భయపడకుము నిన్ను వెన్నంటి ఉంటాము " అని ధైర్యము చెప్పాడు. వెంటనే సుయోధనుడు సైంధవుని వెంటబెట్టుకుని ద్రోణుని వద్దకు వెళ్ళాడు. సైంధవుడు ద్రోణునితో అర్జునుడికి తనకు ధనుర్విద్యలో కల తారతమ్యాలు అడిగాడు. ద్రోణుడు " సైంధవా ! మీరందరూ నా దగ్గర విలు విద్య అభసించారు. నేను మీకందరికి ఒకే విధంగా నేర్పాను కాని అర్జునుడు కఠోర శ్రమకు ఓర్చి ఎన్నో ప్రయోగములు చేసి విలువిద్యలో మెళుకువలు తెలుసుకున్నాడు. కనుక మీ కంటే అర్జునుడు అధికుడు కాని నీవు అర్జునుడికి భయపడ పని లేదు నా రక్షణలో ఉండగా నిన్ను దేవతలు కూడా తేరిపార చూడ లేరు. అర్జునుడు కూడా భేదింప లేని వ్యూహము రేపు పన్నుతాను. నీవు క్షత్రియ ధర్మము ప్రకారం యుద్ధం చెయ్యి. వేదవేదాంగాలు అభ్యసించి, యజ్ఞయాగాదులు చేసిన నీవిలా మృత్యువుకు భయపడ తగునా ! యాదవులు, పాండవులు, కౌరవులు మొదలైన ఎవరైనా ఈ భూమిపై శాశ్వతులా కాలం తీరగానే అందరూ పోవలసిన వారే కదా ! మహా మునులు యజ్ఞము చేసి పొందు ఫలం వీరులు యుద్ధభూమిలో మరణించిన పొందవచ్చు. కనుక నిశ్చింతగా ఉండు " అన్నాడు. ఆ మాటలకు ఊరట చెందిన సైంధవుడు సుయోధనునితో కలిసి తమ శిబిరానికి వెళ్ళాడు. ఇరుపక్షముల సైన్యాలు జరిగిన విషాదం తలపక రేపటి యుద్ధము గురించి ఆలోచించ సాగారు. సుయోధనుడు మరునాటి యుద్ధానికి సమాలోచనలు జరుపుతున్నాడు. ధర్మరాజు పాంచాల, కేకయ, మత్స్య, పాండ్య, యాదవ రాజులను మరునాటి యుద్ధానికి సమాయత్త పరుస్తున్నాడు.
అర్జునుడు ప్రతిజ్ఞకు శ్రీకృష్ణుడు కలత చెందుట
[మార్చు]అర్జునుడు చేసిన భీకర ప్రతిజ్ఞకు కృష్ణుడు కలవరపడి " అర్జునా ! నాతో ఏమాత్రం ఆలోచించక ఘోర ప్రతిజ్ఞ చేసావు. దుస్తరమైన ఈ ప్రతిజ్ఞను నీవు నెరవేర్చక పోయిన నాకు కలిగే బాధను నువ్వు అర్ధం చేసుకున్నావా! చారులు తెచ్చిన సమాచారం ఏమంటే నీ ప్రతిజ్ఞ విన్న కౌరవ శిబిరంలో కలకలం రేగింది. వారు నీవు ఎప్పుడైనా నీ కుమారుని మరణానికి కారకులైన వారి మీద విరుచుకు పడతావని గ్రహించారు. సైంధవుడు సిగ్గు విడిచి సుయోధనుడి వద్ద తనను రక్షించమని వేడుకొనగా ద్రోణ, కృప, అశ్వత్థామ, శల్య, కర్ణాది కౌరవ వీరులు సైంధవుని ప్రాణానికి అభయం ఇచ్చారట. ద్రోణుడు అత్యంత క్లిష్టమైన వ్యూహము పన్ని సైంధవుని నీ కంట పడకుండా చేసి నిన్ను ఆపగలనని చెప్పాడట. అంత కట్టుదిట్టమైన వ్యూహంలో సకల కౌరవ యోధుల రక్షణలో ఉన్న సైంధవుని ఒక్క పగటిలో సంహరించుట సామాన్యం కాదు. కనుక దీని గురించి మనకు ఆప్తులైన వారితో ఆలోచించవలసిన అవసరం ఉంది " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! కౌరవ ప్రముఖుల బలాబలాలు నాకు తెలియనిదా. నా గురించి వారికి తెలియును నీ సహాయ సంపత్తి నా యడల ఉన్న సైంధవుని రక్షించగలిగిన వారెవ్వరు. సైంధవుని చంపునపుడు అడ్డగింన వారెవరైనా వారు నా క్రూర నారాచబాణములకు బలికాక తప్పదు. కౌరవ వీరుల అస్త్రశస్త్రములు నా అస్త్రశస్త్రముల ధాటికి నిలువ లేవు. ఒక్క సుయోధనుడి సేనలే కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినా సైంధవుని రక్షించుటకు వీలు కాదు. నీ మీద, నా అస్త్రశస్త్రములు, దివ్యాస్త్రముల మీద ఆన రేపు గాండీవం నుండి వెలువడిన బాణము సైంధవుని తల త్రెంచుట ఖాయం. కృష్ణా ! నీ అండ దండలు నాకుండగా నాకిక అడ్డేమి. నా ప్రతిజ్ఞ నెరవేర్చు విధంగా ఆలోచన ఒసగి నన్ను కృతార్ధుని చెయ్యి " అని నమస్కరించాడు. కృష్ణుడు అర్జునుడి మాటలకు సంతసించి నీ మనస్సు స్థిరముగా ఉన్నది నీవు పోయి నిద్రించుము " అన్నాడు. అర్జునుడు తన శిబిరముకు వెళ్ళాడు.
శ్రీకృష్ణుడు సుభద్రను ఊరడించుట
[మార్చు]అర్జునుడు శిబిరానికి వెళ్ళే సమయానికి అక్కడకు సుభద్ర, ఉత్తర, పాంచాలి వచ్చి ఉన్నారు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఈ విషయం తెలిసిక్కడకు చేరికుని సుభద్రను ఓదార్చ సాగాడు " అమ్మా సుభద్రా ! క్షత్రియకంతలు యుద్ధములో మరణించిన వారి కొరకు విలపించుట తగునా ! క్షత్రియ వీరులు రణరంగమున మరణించుట వీర స్వర్గమును అంకరించుట సహజమే కదా ! నీ కుమారుడు తుచ్ఛమైన ఈ లోకమును వదిలి పుణ్యలోకముకు పోయాడు. తపస్సు, బ్రహ్మచర్యము, ఉదాత్తమైన దానధర్మాలు చేసి పొందు లోకాలను నీ కుమారుడు యుద్ధమున వీరమరణం పొంది సులభంగా పొందాడు. అందుకు నీవు చింతించనేల ! క్షత్రియ కాంతలకు వీరులను పుత్రులుగా పొందుట వారు అతిలోక వీరులై ప్రఖ్యాతి గాంచుట అతడి తల్లి వీరమాత అగుట అతడి భార్య వీర పత్ని అగుట ఎంత సహజమో అతడు వీరస్వర్గం అలంకరించుట అంత సహజము కదా! అలాంటి పుత్రుని కన్నందుకు సంతోషించాలి కాని దుఃఖిస్తారా చెప్పు ! ఎంతటి గొప్ప వారైనా కాలం తీరిన మరణించుట తధ్యం. ఈ విషయం తెలిసీ పామరుల వలె చింతించుట తగునా! నీవే ఇటుల శోకించిన నీ కోడలిని ఓదార్చు వారెవ్వరు. మాకు ధైర్యం చెప్పవలసిన దానివి ధైర్యవంతురాలివి నీవే ఇటుల శోకించ తగదు. నీ కోడలిని ఓదార్చుము. నీ భర్త రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుని సంహరించుట తధ్యము. నా మాట నమ్మి నీవు ధైర్యముగా ఉండుము " అన్నాడు.
సుభద్ర శోఖం
[మార్చు]కాని సుభద్ర పుత్రశోకము తట్టుకొన లేక శోకిస్తూ " నాయనా అభిమన్యా ! నేను పుణ్యం చేసుకుని నిన్ను కనే భాగ్యాన్ని పొందాను కాని నీ ముద్దు ముచ్చటలు చూసే భాగ్యానికి కరువయ్యాను. అత్యంత పరాక్రమవంతులైన కౌరవ వీరులను హతమార్చిన నీవు ఇలా దిక్కు లేని మరణం పొందుట నా మనస్సు కలచి వేస్తుంది. శిశువుగా సగం శరీరం నా మీద మిగిలిన శరీరం మెత్తటి శయ్య మీద ఉండేలా శయనించిన నీవు ఇలా కటిక నేలపై పరున్నావా! వంధి మాగధుల శోత్రపాఠములను విను నువ్వు ఇప్పుడిలా నక్కల ఊళలు వింటున్నావా ! ఇంతమంది మహా యోధులు పాండవులు విరాట, ద్రుపద, సాత్యకి, భీమసేనుల పరాక్రమం నిన్ను రక్షించ లేక పోయిందా! మహావీరుడైన అర్జునుడి కుమారుడవు శ్రీకృష్ణుని మేనల్లుడవు నీవు ఇలా శత్రువుల చేత మరణించుట చోద్యము కాక మరేమి ! నాయనా నీ భార్య ఉత్తర వచ్చింది చూడు లేచి ఆమెను ఓదార్చు " అని పలు విధముల రోదిస్తూ ఉంది. ద్రౌపది తన రెండు చేతులతో సుభద్ర, ఉత్తరలను పొదివి పట్టుకుని అలాగే వివశురాలై భూమి మీద పడి పోయింది. శ్రీకృష్ణుడు వారిని ఉచిత వచనములతో ఓదార్చి పాండవుల వద్దకు వచ్చి అందరిని వారి వారి శిబిరములకు వెళ్ళమని చెప్పాడు. తాను కూడా అర్జునుడితో అతడి శిబిరానికి వెళ్ళాడు.
కృష్ణార్జునులు ఆయుధపూజ చేయుట
[మార్చు]శిబిరానికి వెళ్ళిన కృష్ణార్జునులు ఒక ప్రదేశమున దర్భాసనము వేసి దానిపై గాండీవము, దేవదత్తము, పాంచజన్యము, సుదర్శనము మొదలైన ఆయుధములు అమర్చారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని వాటి మధ్య నిద్రించమని చెప్పాడు. ఆ తరువాత తన సారథి దారుకునితో తన శిబిరానికి వెళ్ళాడు. తాను కూడా నిద్ర పోదామని అనుకున్నా! నిద్ర రాలేదు. పాండవ శిబిరములో ఎవరికి నిద్ర రాలేదు. పాండవులు " కుమారుని మరణనానికి క్రుద్ధుడైన అర్జునుడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. దానిని కౌరవులు ఎలాగైనా వమ్ము చేయ ప్రయత్నిస్తారు. రేపు పొద్దుక్రుంకే సమయానికి అర్జునుడు సైంధవుని చంపలేకున్న అగ్నిప్రవేశం చేస్తాడు. అప్పుడు పాండవులు ఏమౌతారు మనమేమి ఔతాము. అతడి పూజలు ఫలించి అర్జునుడు సైంధవుని వధించాలి. ద్రోణుల వంటి వారు పది వేల మంది రక్షించినా సైంధవుడు అర్జునుడి చేతిలో మరణించాలి " అని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ వేడుకున్నారు. శ్రీకృష్ణుడికి కూడా నిద్ర పట్ట లేదు. సారథి దారుకుని చూసి " దారుకా ! అర్జునుడి ప్రతిజ్ఞ విన్నావు కదా ! రేపటి లోపల సైంధవుని చంపుట సాధ్యమా ! ఒక వేళ చంపలేకున్న ఎంత దుర్ధశ సంభవించగలదు. అర్జునుడు నా బహిర్ప్రాణము నాలో సగము అతడు లేక నేను జీవించ లేను ఇది నీకు తెలుసు. కనుక అతడిని రక్షించుకోవడం నా కర్తవ్యం. నాకు ఈ ద్రోణుడు ఒక లెక్క కాదు. రేపు ఈ చరాచర ప్రపంచం నా పరాక్రమము తిలకిస్తాయి. పాండవుల మీద నాకున్న ప్రేమ లోకానికి తెలియజేస్తాను. రేపు నేను విజృంభించి సైంధవుని హతమారుస్తాను. గర్వాంధుడు సుయోధనుడు సకల సైన్యంతో నన్ను అడ్డుకున్నా అందరిని హతమార్చి సైంధవుని చంపుట తధ్యం " అన్నాడు. " దారుకా ! నా రథం సిద్ధం చెయ్యి. శౌబ్య, సుగ్రీవ మొదలగు అశ్వరాజములను రధముకు కట్టు. గరుడ ధ్వజము ఎత్తించు. నా ఆయుధములైన సుదర్శనచక్రము, గధ వంటి ప్రముఖ ఆయుధములు రధములో పెట్టు. రేపు అత్యంత జాగరూకుడివై నేను పాంచజన్యం పూరించినంత రధమును అతి వేగంగా తీసుకు వచ్చి నా ముందుంచు. నేను నా రధము ఎక్కి సైంధవుని వధిస్తాను " అన్నాడు. దారుకుడు " మహానుభావా! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. రధము సిద్ధము చేసి మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాను. అసలు మీరు అర్జునుడి రథం ఎక్కి పాంచజనన్యం పూరించగానే కౌరవుల గుండెలు జారిపోతాయి. తమరు యుద్ధం చేసే అవకాశం ఉండదు అయినా తమరి ఆజ్ఞకొరకు వేచి ఉంటాను " అన్నాడు.
శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యము చెప్పుట
[మార్చు]శ్రీకృష్ణుడు దారుకునితో మాట్లాడుతున్న సమయంలో అర్జునుడు దర్బాసనంపై కలత నిద్రలో ఉన్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు వచ్చాడు. అర్జునుడు కృష్ణుని భక్తితో ఆసీనుని చేసి పూల మాలికలతో పూజించి పక్కనే నిలబడ్డాడు.శ్రీకృష్ణుడు " అర్జునా ! శోకించకుము. శోకార్తుడు శత్రువుల చేత ఓడింపబడతాడు. నీ ప్రతిజ్ఞ నెరవేరు ఉపాయము ఆలోచింపుము " అన్నాడు. అర్జునుడు కృష్ణా ! నాకు శోకము కాక మరేమి ఉంది. నేను సైంధవుని చంపెదనని ప్రతిన పూనాను. ద్రోణుడు కాపాడెదనని ప్రతినబూనాడు. సైంధవుడు నాకు కనబడక వారి వెనుక దాగి ఉంటాడు. అది తలచిన నాకు శోకము కాక మరేమి కలదు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! నీవన్నది నిజమే అయినా నీవు తూర్పు ముఖంగా నిలిచి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుని ప్రార్థించి పాశుపతము నీకు మనస్సున ప్రస్పుటము కావాలని కోరుము. పాశుపతము నీ వశమైన సైంధవుడు ఎక్కడ ఉన్నా వధించ కలవు " అన్నాడు. అర్జునుడు ఆచమనం చేసి సుచి అయి ధర్భాసనంపై కూర్చుని భక్తితో ప్రమేశ్వరుని ధ్యానించాడు. ఆ పరమేశ్వరుని కృప వలన అర్జునుడు కృష్ణుడు గగన మార్గమున పయనించసాగారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు సేవించు మార్గమున పోతున్నారు. కైలాసం చేరుకుని అక్కడ ఒక మందిర ప్రవేశం చేసారు. కృష్ణార్జునులు అక్కడ పార్వతీదేవితో ప్రమద గణాలతో పరివేష్టితుడైన శివుని దర్శించి సాష్టాంగ దండ ప్రమాణాలాచరించారు. పరమశివుడు మందహాసం చేసి " నరనారాయణులకు స్వాగతము. మీరు వచ్చిన కారణమేమి మీ కోరికను ఆవశ్యము తీర్చెదను " అన్నాడు. కృష్ణార్జునులు మనసులోనే భక్తి పొంగిపొరలగా స్తుతించారు. కృష్ణుడు " దేవా! దయ ఉంచి పాశుపతమును అర్జునుడికి ఉపదేశింపుము " అన్నాడు. అర్జునుడు శివుని చూసి ఆశ్చర్య పోయాడు. తాను కృష్ణునికి సమర్పించిన పూల మాలికలు పూజా ద్రవ్యములు శివుని దివ్యశరీరంపై ఉండుట చూసి శివకేశవులు ఒక్కటే భేదము లేదని తెలుసుకున్నాడు. అర్జునుడు కూడా తనకు పాశుపతం ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడు మందహాసం చేసి " అర్జునా ! ఆ తామర కొలనులో ఉన్న నా విల్లు బాణములు తీసుకు రా " అన్నాడు. అర్జునుడు వాటిని స్పర్శించగానే అవి సర్పాలలా బుసలు కొట్టాయి . అర్జునుడు పాద ప్రక్షాళన చేసుకుని మహాశివుని ధ్యానించి రుద్రము జపించగానే ఆ సర్పాలు విల్లు అమ్ములు అయ్యాయి. వాటి తీసుకుని శివుని వద్దకు రాగానే అక్కడ నిలుచున్న నీలలోహిత వర్ణము కలిగిన బాలుడు ఆ విల్లంబులు తీసుకుని శరసంధానం చేసాడు. అర్జునుడు ఏకాగ్రతతో మంత్ర సహితంగా పాశుపతాన్ని ప్రయోగ ఉపసంహారాలు నేర్చుకుని శివుని ఆజ్ఞానుసారం విల్లంబులను తిరిగి సరస్సునందు ఉంచాడు. అరణ్యవాసంలో ఈశ్వరుని చేత అనుగ్రహించబడిన పాశుపతం ఇప్పుడు సమంత్రసహితంగా ప్రయోగ ఉపసంహారాలతో అర్జునుడికి అనుగ్రహించాడు పరమశివుడు. అర్జునుడి మనసు పరవశించింది. కృష్ణార్జునులు శివునకు ప్రణమిల్లి కురుక్షేత్రము లోని తమ శిబిరాలకు చేరుకున్నారు. అర్జునుడు ఈ రకంగా కల కన్నాడు. " అని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించాడు.