అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము
ప్రధమాశ్వాసము
[మార్చు]ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! మీరు నాకు ఎన్నో ఉపదేశించారు. కాని నా మనసుకు కొంచెం కూడా శాంతి కలుగ లేదు. పట్టుబట్టి ఎంతో మందిని బంధువులను యుద్ధములో వధించాను. మిమ్ము అతి దారుణంగా శరతల్పగతుడిని చేసాను. ఇంత చేసిన నాకు మనశ్శాంతి ఎలాకలుగుతుంది. పితామహా ! నేను సుయోధనుడిని రాజ్యం ఇరువురము పంచుకుని పరిపాలిద్దాము అని ప్రాధేయపడ్డాను. అతడు అందుకు సమ్మతించ లేదు. నేను మాత్రం పోతే పోనీలే అతడికే రాజ్యాన్ని వదిలి వేద్దాము అని అనుకున్నానా ! అలా ఉండక కోపంతో రగిలి పోయి పట్టుదలలకు పోయి యుద్ధం చేసాను ఫలితం సర్వనాశనం అయింది. ఈ నాడు పశ్చాత్తాపపడి ప్రయోజనమేమి ? ఇక నాకు దుఃఖం తప్ప శాంతి ఎలా కలుగుతుంది " అని బాధపడ్డాడు. భీష్ముడు ఊరడింపుగా " ధర్మనందనా ! చింతించకుము అంతా దైవనిర్ణయమే. దానిని తప్పించుట మనచేతిలో లేదు మనము కర్తలమూ కాదు.
బ్రాహ్మణ వనిత
[మార్చు]దీనికి ఒక కథ చెప్తాను విను. ఒక ఊరిలో గౌతమి అను బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒక రోజు పాము కరిచి చనిపోయాడు. అది చూసి ఆమె దుఃఖించ సాగింది. అంతలో అది చూసిన బోయవాడు ఆ కుర్రాడిని కరిచిన పామును పట్టి తెచ్చి " అమ్మా ! ఇదిగో నీ కుమారుడిని కరిచిన పామును పట్టి తెచ్చాను. దీనిని ఏమి చెయ్యమటావో చెప్పు. తలపగులకొట్టి చంపమంటావా ! లేక నిలువునా చీల్చి చంపమంటావా ! నీవు ఎలా చెప్తే అలా చేస్తాను " అన్నాడు. గౌతమి " అన్నా ! ఈ పామును విడిచి పెట్టు " అన్నది. బోయవాడు " అమ్మా ! ఇది నీ కుమారుని చంపింది కదా! " అన్నాడు. గౌతమి " అన్నా! విధివశాత్తు ఈ ఆపద వచ్చింది. నాకుమారుడు చనిపోయాడు. అందుకు దుఃఖించడము సహజమే అయినా ! దానికి కారకులు అయిన వారిని చంపడం అధములు చేసే పని. ఉత్తములు, ధర్మపరులు ఆ పని చెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచి పోతారు. అన్నా ! నీవు ఆ పామును చంపినంత మాత్రాన నా కుమారుడు బ్రతుకుతాడా ! దానిని విడిచి పెట్టు " అన్నది. బోయవాడు " అమ్మా ! నీ మాటలు నాలాంటి వాడికి అర్ధము కాదు. చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మము. కనుక ఈ పామును చంపుతాను " అని అన్నాడు. గౌతమి " అన్నా ! నీ పేరు అర్జునుకుడు. అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైన వాడివి, అమాయకుడివి నీవు ఇలా ప్రవర్తించ తగదు . అయినా నేను హింసకు ఎలా సహిస్తాను " అన్నది. బోయవాడు " అమ్మా ! నా మాట విను జనులను బాధించే వారిని చంపడమే ధర్మము దాని వలన పాపము రాదు " అన్నాడు. గౌతమి " తాను బంధించిన వాడు శత్రువైనా అతడిని చంపడము అధర్మము కదా ! " అన్నది. అమ్మా ! ఈ పామును చంపి ఈ పాటు వలన బాధించబడు వారిని రక్షించడం ధర్మము కాదా ! వృత్తాసురుడిని దేవేంద్రుడు చంపలేదా ! మహాశివుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయ లేదా ! అవన్నీ ధర్మములు అయినప్పుడు. ఇది మాత్రము ఎందుకు ధర్మము కాదు. కనుక ఈ పామును చంపుటకు అంగీకరించు " అన్నాడు.
పామువాదన
[మార్చు]వీళ్ళ సంభాషణ మౌనంగా విన్న పాము బోయవానితో " అన్నా ! ఇందు నాతప్పు ఏమీ లేదు మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను. అంతే కాని నాకు ఆ బాలుడి మీద కోపము కాని ద్వేషము కాని లేదు " అని పలికింది పాము. బోయ వాడు " మరీ మంచిది మృత్యుదేవతకు ఆయుధమైన నీన్ను చంపడం తప్పు కాదు " పామును చంపబోయాడు. పాము " అయ్యా ! కుమ్మరి వాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారెదా కుమ్మరి వాడిదా తప్పు. అయ్యా నరులు కనపడితే నన్నే చంపుతారు కదా ! అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది " అన్నది. బోయవాడు " బాగా చెప్పావు సర్పమా ! ఎదుటి వాడు బాణం వేసినప్పుడు బాణము వేసిన వాడిది తప్పా బాణాది తప్పా అని ఆలోచిస్తూ ఊరుకుంటామా ! వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా ! అందులో పాపము ఏముంది. అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణములు హరించిన నిన్నే కాదు మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నింటినీ చంపాలి " అన్నాడు. అందుకు పాము నవ్వి " అన్నా యజ్ఞములు, యాగములు, యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించినా యజ్ఞఫలితము యజమానికి చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతే కాని నాది కాదు " అన్నది.
మృత్యుదేవతవాదన
[మార్చు]అంతలో మృత్యుదేవత అక్కడకు వచ్చి పాముని చూసి " సర్పరాజమా ! నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము, నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ యముని చేతిలో ఉన్నాయి " అని మృత్యుదేవత పలికింది. పాము " నువ్వు చెప్పినది నేను చేస్తే అది నా తప్పు అని అంటున్నారు. నీవు పంపావని నేను చెప్పాను. ఇది యముని తప్పా, నీ తప్పా అని చెప్పడానికి నేను ఎవరిని " అని " బోయవాడితో " అన్నా ! మృత్యు దేవత మాట విన్నావు కదా ! నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా ! " అన్నది. బోయవాడు నవ్వి " నువ్వూ మృత్యువు ఇద్దరూ పాపాత్ములే నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయము లేదు " అన్నాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చి " మీకు కలిగిన ధర్మసందేహం తీర్చడానికి నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మలఫలమే కాని వేరు కాదు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని కాదు. మనిషి చేసుకున్న కర్మలే ఫలితంగా పుట్టుకు, మరణము, సుఖము దుఃఖము కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకో లేరు. ఈశ్వరుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు కనుక ఈ కుర్రాడు ఎంతటి వాడు కనుక ఎవరిని నిందించ వలసిన అవసరము ఏముంది " అన్నాడు. అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి " అన్నా ! యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా ! నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనుక జన్మలో నేను చేసిన కర్మల ఫలితము. దీనికి ఎవరిని నిందించిన ఫలితమేమి ? కనుక ఆ పామును విడిచి పెట్టు " అన్నది. ఇందరి మాట విని బోయవాడ జ్ఞానోదయము పొంది ఆ పామును విడిచి పెట్టాడు. కనుక ధర్మనందనా ! యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే ! నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా ! " అని చెప్పాడు.
మృత్యుభయము
[మార్చు]అగ్నిదేవుడు సుదర్శన
[మార్చు]అగ్నిదేవుడికి సుదర్శనకు ఒక కుమారుడు కలిగాడు. అతడికి సుదర్శనుడు అను నామకరణం చేసాడు. అతడు సుగుణసంపన్నుడు ధర్మపరుడు. సుదర్శనుడు పెద్దవాడై తాతగారి రాజ్యభారమును వహించి రాజ్యపాలన చేయసాగాడు. సుదర్శునుడికి వివాహమై ఒక కుమారుడిని పొందాడు. అతడి పేరు ఓఘవంతుడు. ఓఘవంతుడికి ఒక కుమార్తె ఓఘవతి ఒక కుమారుడు ఓఘరధుడుకలిగారు. ఓఘవతికి వివాహ వయసురాగానే ఆమెకు తగిన వరుడి కొరకు వెతికి చివరకు తాతగారైన సుదర్శనుడితో వివాహము జరిపించారు. ఓఘవతిని చేపట్టిన సుదర్శనుడు " నేను గృహస్థధర్మమును పాటిస్తూ మృత్యువును జయిస్తాను " అని ప్రతిజ్ఞ చేసాడు. తరువాత అతడు కురుక్షేత్రముకు వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని భార్య ఓఘవతితో గృహస్థ జీవితం కొనసాగించాడు. ఒక రోజు సుదర్శనుడు భార్యతో " ఓఘవతీ ! నాకు అతిథి పూజలంటే మక్కువ ఎక్కువ. అందు వలన నేను గృహంలో ఉన్నా లేకున్నా ! నీవు మాత్రము అతిథి మర్యాదలు చేయాలి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అతిథి తన కోర్కెలు తీర్చుకుంటారో ఆ గృహస్థు కృతార్ధుడు ఔతాడు. మన ఇంటికి వచ్చిన అతిథి ఏకోరిక కోరినా నీవు ఆ కోరిక సంకోచించచక తీర్చాలి. పతి ఆజ్ఞ నెరవేర్చడమే సతికి ధర్మము కదా ! " అని అన్నాడు. భర్త మాటలకు ఓఘవతి అంగీకరించింది. సుదర్శనుడు సమిధల కొరకు అడవికి పోయిన సమయంలో వారి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఓఘవతి అతడికి అతిథి మర్యాదలు చేసింది. అతడు ఓఘవతి వంక మోహంతో చూసి " లలనా ! నా మనసు నీ అందు లగ్నమైనది కనుక నీవు నా కోరిక తీర్చు. అతిథి మర్యాద చేయడమూ అతడి కోరిక తీర్చడము ధర్మము కదా ! నీకు తెలియనిది ఏమున్నది. అది నీధర్మమని నీభర్త నీకు చెప్ప లేదా ! " అన్నాడు. ఓఘవతి " మహానుభావా ! మీరు మరే కోరిక అడిగినా తీరుస్తాను " అన్నది. కాని అతడు " లలనా ! నాకు మరే కోరికా అవసరం లేదు " అన్నాడు. ఓఘవతి " తన భర్తమాట గుర్తుకు వచ్చి భర్తమాట నెరవేర్చిన తన శీలం పోతుంది. తీర్చక పోతే తన భర్తమాటలను ఉల్లంఘించినట్లౌతుంది అనుకుని చివరకు అతడి కోరికకు అంగీకరించింది " ఇంతలో సుదర్శనుడు తిరిగి వచ్చి ఓఘవతిని పిలిచాడు. అతిథి ఓఘవతిని మాట్లాడకుండా కట్టడి చేసాడు. ఆ బ్రాహ్మణ అతిథి శాపానికి భయపడి ఓఘవతి మాటాడక ఊరకున్నది. భార్య ఎంతకీ పలకనందున సుదర్శనుడు పర్ణశాలలోకి తొంగిచూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. బ్రాహ్మణుడు లోపల నుండి " ఓ యజమానీ ! నీ భార్య నాకు అతిథి సత్కారము ఇస్తుంది. నీకు గృహస్థధర్మాలు అతిథి సత్కారాలు తెలుసు కనుక కోపించకుము " అన్నాడు. అప్పుడు సుదర్శనుడు లోపల ఉన్న " అతిథితో మహాభాగా ! నీకు ఆతిథ్యము ఇచ్చినందు వలన నా జన్మధన్యము అయింది. అతిథి పూజలు నిర్వహించే గృహము ధన్యము పవిత్రము అంటారు కదా ! అతిథిపూజ అయ్యేంత వరకు నేను వెలుపల ఉంటాను " అని " అతిథీ ! నా మనసు నా వాక్కు ఒక్కటే దీనికి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు సాక్షి " అన్నాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతడు ధన్యుడు అందరూ గౌరవించ తగిన వాడు " అని పలికింది. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి తేజోమంతుడై సాక్షాత్కరించి " సుదర్శనా ! నేను ధర్మదేవతను. నీ చిత్తము ఎటువంటిదో తెలుసుకోవడానికి వచ్చాను. నీవు నిశ్చలవ్రతుడవు. నీవు ధర్మము ఎప్పుడు తప్పుతావో అప్పుడు నిన్ను చంపాలని మృత్యుదేవత నీ వెంటనే పొంచి ఉన్నది. కాని నీవు మృత్యువును జయించావు. నీ భార్య కూడా మహాపతివ్రత. మీరు సశరీరంగా ఊర్ధ్వలోక ప్రవేశానికి అర్హులు. కనుక మీకు ఎప్పుడు ఊర్ధ్వలోకాలకు రావాలని అనిపిస్తుందో అప్పుడే ఊర్ధ్వలోకాలకు భార్యాసమేతంగా రావచ్చు. నీవు చేసిన సగభాగం తపః ఫలము చేత నీ భార్య ఓఘవతి పుణ్యనది అయి ఈ లోకములో ప్రవహిస్తూ జనులను పావనం చేస్తుంది. మిగిలిన సగం తపః ఫలము వలన నీకు సేవచేస్తుంది. నేను నీ ఇంటికి రావడము నీ భార్యను కోరడమూ అన్నీ నీ కీర్తి లోకాలకు తెలియజేయడానికే నేను కల్పించాను. అంతే కాని నీ భార్యశీలానికి ఎంటువంటి హానీ జరగలేదు . ఇది నిజము " అని పలికి అంతర్ధానం అయింది. ధర్మనందనా ! ఇదీ ఓఘవతీనది చరిత్ర. ఈ కథసారాంశం ఏమంటే గృహస్థుకు అతిథి పూజకు మించిన పరమధర్మము వేరొకటి లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
బ్రాహ్మణత్వము
[మార్చు]ధర్మరాజు " పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! " అని తన సందేహం వెలిబుచ్చాడు. భీష్ముడు " ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభ్యం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో " అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు " అని చెప్పింది. గాడిదమాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు " గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది " అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. గాడిద " విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు " అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో " తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను " అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.
మతంగుడి తపసు
[మార్చు]మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై " కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి " అని అడిగాడు. మతంగుడు " దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి " అని అడిగాడు. ఇంద్రుడు " కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో " అని అన్నాడు. మతంగుడు " అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను " అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇంద్రుడు " కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శుద్రుడు వైశ్యుడు కాలేడు. దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గు డైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సారాల తపస్సుకు వస్తుందా ! చెప్పు " అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టు కొనుట కష్టము. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్త లేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు " అన్నాడు. మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. అతడి శరీరము శిధిలమై పడిపోతుడగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు " అన్నాడు. మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు " నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు " అని వరాలు ప్రసాదించాడు.
విశ్వామిత్రుడి బ్రాహ్మణత్వము
[మార్చు]మతంగుడి మాట కథ విన్న ధర్మరాజు " పితామహా ! ఇంద్రుడు చెప్పినట్లు బ్రాహ్మణత్వము పొందడం దుర్లభము అయిన క్షత్రియుడైన విశ్వామిత్రుడికి బ్రాహ్మణత్వము ఎలా సిద్దిస్తుంది " వివరించండి అని అడిగాడు. ధర్మనందనా ! జాహ్నవీదేవికి తండ్రి అయిన జహ్నుడు అనే వాడి వంశములోగాధి జన్మించాడు. గాధి కూతురు సత్యవతి. సత్యవతిని తనకిచ్చి వివాహము చేయమని రుచీకుడు అడగగా గాధి అంగీకరించక బదులుగా చెవి తెల్లగా ఉన్న వేయి గుర్రములను కట్నంగా ఇస్తే సత్యవతిని ఋచీకుడి కిచ్చి వివాహము జరిపిస్తానని షరతు పెట్టాడు. ఋచీకుడు అందుకు రోషంతో అంగీకరించి గుర్రములను వెతికి తెస్తానని చెప్పాడు. ఋచీకుడు వరుణుడి వద్దకు వెళ్ళి " నాకు తెల్లని చెవులు కలిగిన వేయిగుర్రాలను ఇవ్వు " అని అడిగాడు. వరుణుడు " ఈ మాత్రానికి ఇంత దూరము రావాలా ! నీవు కోరిన వెంటనే నీ ఎదుట నిలబడతాయి " అని చెప్పాడు. వెంటనే ఋచీకుడు గంగానది ఒడ్డుకు వెళ్ళి పద్మాసనము వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని " నాకు తెల్లని చెవులు కలిగిన వేయి గుర్రాలు కావాలి " అని కోరుకోగానే అతడి ఎదుట తెల్లని చెవులు కలిగిన వేయిగుర్రాలు నిలబడ్డాయి. అప్పటి నుండి ఆ ప్రదేశము అశ్వతీర్ధముగా ప్రసిద్ధి చెందింది. ఋచీకుడు ఆ గుర్రాలను గాధికి ఇచ్చాడు. గాధి చేసేది లేక సత్యవతిని ఋచీకుడికి ఇచ్చి వివాహము చేసాడు.
గాధి రుచీకులకు పుత్ర భాగ్యము
[మార్చు]ఋచీకుడు కొన్ని సంవత్సరాలు సత్యవతితో కాపురము చేసిన పిదప సంతానం కావాలని కోరిక కలిగి " సత్యవతీ ! సంతానము కొరకు నేను యజ్ఞములో ఇచ్చే చరువు సంపాదిస్తాను " అన్నాడు. సత్యవతి తల్లి కూడా తనకూ సంతానం కావాలని అందు కొరకు తనకు కూడా చరువు కావాలని కోరింది. ఋచీకుడు అందుకు అంగీకరించి రెండు చరువులు సంపాదించి దానిని తన తపశక్తితో నింపాడు. వాటిలో ఒక చరువులో ఉన్న యజ్ఞశేషాన్ని భుజించిన వారికి ఉజ్వలంగా ప్రకాశించే బ్రాహ్మణుడు పుడతాడు అని రెండవ చరువులోని యజ్ఞ శేషాన్ని భుజించిన రాజసభావం కలిగిన పుత్రుడు పుడతాడు. ఋచీకుడు సత్యవతిని చూసి " సత్యవతీ ! ఇది ఒకటి క్షాత్ర శక్తి ప్రధాన పుత్రుడిని ఇస్తుంది నీవు దానిని నీ తల్లికి ఇవ్వు. రెండవది సాత్వికత, బ్రాహ్మణత్వము ప్రధానుడైన పుత్రుడిని ఇస్తుంది దానిని నువ్వు స్వీకరించు. తరువాత ఋతు సమయంలో నీవు మేడి చెట్టును నీ తల్లి రావి చెట్టును కౌగలించుకున్న మీకు సంతానము కలుగుతుంది " అని చెప్పాడు. కాని విధివిలాసంగా చరువును తీసుకునే సమయంలో చరువులు, కౌగలించుకున్న వృక్షములు తారుమారై ఫలితంగా వారు ధరించిన గర్భాలు తారుమారయ్యాయి. ఇదంతా దివ్యదృష్టితో తెలుసుకున్న ఋచీకుడు సత్యవతితో " సత్యవతీ ! మీ చరువులు వృక్షములు తారుమారయ్యాయి. ఫలితంగా నీ గర్భంలో దుర్మార్గుడైన క్షత్రియుడు పెరుగుతున్నాడు అని చెప్పాడు. ఆ మాటకు తల్లడిల్లిన సత్యవతి " సద్బ్రాహ్మణుడివైన, తపశ్శాలివైన మీకు దుర్మార్గుడైన క్షత్రియుడు కలిగిన మీకు అపకీర్తి కదా ! నీ మహిమ చేత ఈ అవాంతరము నివారించు " అని వేడుకుంది. అందుకు ఋచీకుడు అంగీకరించి " ఈ ప్రభావము ఒక జన్మకాలము పొడిగించి నీకు సద్బ్రాహ్మణుడు నీకుమారుడికి క్షత్రియాంశ కలిగిన కుమారుడు జన్మిస్తాడు " అని వరం ఇచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. జమదగ్ని కుమారుడు పరశురాముడు క్షత్రియాంశతో జన్మించి క్షత్రియ కుల వినాశకుడయ్యాడు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించినా అతడికి బ్రాహ్మణధర్మమునందు ఆసక్తి కలిగింది. ఈ కారణంగా పరశురాముడికి క్షత్రియత్వము, విశ్వామిత్రుడికి బ్రాహ్మణత్వము వచ్చాయి " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
వీతహవ్యుడు బ్రాహ్మణత్వము
[మార్చు]ధర్మరాజు " పితామహా నాకు ఈ సందర్భంలో నాకు మరొక కథ గుర్తుకు వస్తుంది. పూర్వము వీతహవ్యుడు అనే క్షత్రియుడు బ్రాహ్మణత్వము పొందాడు అని విన్నాము అది ఎలా జరిగిందో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మనువు పరంపరలో శర్యాతి వంశం ఒకటి. ఆ వంశలో జన్మించిన హైహయుడు వత్సదేశాన్ని పాలించాడు. అతడికి వీతహవ్యుడు అని కూడా పేరు ఉండేది. అతడికి పది మంది భార్యలు ఉండేవారు. వారి ద్వారా అతడు యోధులు, బలాఢ్యులు అయిన నూరుగురు పుత్రులను పొందాడు. హైహయుడి కుమారులు కాశీరాజైన హర్యశ్వుడి మీదకు దండేత్తి అతడిని ఓడించారు. అతడి తర్వాత అతడి కుమారుడు సుదేవుడు రాజయ్యాడు. హైహయుడి కుమారులు తిరిగి సుదేవుడి మీదకు దండెత్తి అతడిని కూడా ఓడించారు. ఆ తరువాత సుదేవుడి కుమారుడు దివోదాసు రాజయ్యాడు. హైహయుడి కుమారులు దివోదాసును యుద్ధానికి పిలిచి అతడిని ఓడించారు. అతడు భయంతో పారిపోయి భరద్వాజుడిని శరణుజొచ్చి హైహయకుమారులు తన తండ్రని చంపి తనను కూడా ఓడించారని చెప్పాడు. భరద్వాజుడు దివోదాసు భయమును పోగొట్టి " నీకు ఒక హైహయకుమారులను హతమార్చగలిగిన ఒక కుమారుడిని ప్రసాదిస్తాను " అని చెప్పి దివోదాసు చేత పుత్రకామేష్టి యాగము చేయించాడు. ఆ యాగఫలంగా అతడికి ఒక కుమారుడు కలిగాడు. అతడు 13 సంవత్సరాల ప్రాయానికి వచ్చాడు. వాడి పేరు ప్రత్యర్ధనుడు. భరధ్వాజముని అనుగ్రహంతో ప్రత్యర్ధనుడు వేదములు, ధనుర్వేదము అభ్యసించాడు. దివోదాసు అతడిని యువరాజుగా అభిషేకించాడు. ప్రత్యర్ధనుడు హైహయుల మీదకు దండేత్తి హహయకుమారులను అందరినీ హతమార్చడమే కాక హైహయుడి మీదకు లంఘించాడు. హైహయుడు పారి పోయి భృగుమహర్షి శరణుజొచ్చాడు. భృగుమహర్షి అతడిని తన ఆశ్రమంలో దాచాడు. అతడిని తరుముకుంటూ అక్కడకు వచ్చిన ప్రత్యర్ధనుడు భృగుమహర్షిని చూసి నమస్కరించాడు. భృగుమహర్షి అతడితో " నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమిటి ? " అని అడిగాడు. ప్రత్యర్ధనుడు జరిగినది యావత్తు భృగుమహర్షికి వివరించి తాను హైహయుడిని తరుముకుంటూ వచ్చిన విషయము చెప్పాడు. భృగుమహర్షి " ఇక్కడ ఎవరూ రాజవంశీయులు లేరు ఇక్కడ ఉన్న వారంతా బ్రాహ్మణులైన నా శిష్యులే " అన్నాడు. ప్రత్యర్ధనుడు నవ్వి " మహర్షీ ! మీరు అసత్యము పలుకరు కదా ! హైహయుడు క్షత్రియుడు కాదు అని చెప్పి అతడిని క్షత్రియకులము నుండి వెలివేసారు కనుక నేను వచ్చిన పని పూర్తి అయింది. నాకు కావలసినది కూడా అదే. మహర్షీ నా మీద కూడా కొంత కరుణ చూపండి " అని పలికి వెనుతిరిగాడు. అప్పటి నుండి హైహయుడు బ్రాహ్మణత్వము స్వీకరించి గొప్ప తపస్సు చేసాడు. కృత్సమదుడు అనే కుమారుడిని పొందాడు. అతడి వంశంలో సుతేజసుడు, వర్చసుడు, నిహవ్యుడు, సత్యుడు, సంతుడు, శ్రవసుడు, దమసుడు, ప్రకాశుడు, వాగీంద్రుడు, ప్రమతి, రురుడు, సముదుడు, శునకుడు, శౌనకుడు అనే బ్రాహ్మణులు జన్మించారు. ఇలా హైహయుడు అనే వీతహవ్యుడు ఒక బ్రాహ్మణ వంశ కర్త అయ్యాడు అని " చెప్పాడు.
దైవము పురుషప్రయత్నను
[మార్చు]ధర్మరాజు " పితామహా ! దైవబలము పురుషప్రయత్నము ఏది గొప్పది ? వివరించండి " అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇదే ప్రశ్నను పూర్వము వశిష్ఠుడు బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని నీకు చెప్తాను. క్షేత్రము, మానవప్రయత్నము, విత్తనము మూడు వేరు వేరు. మూడు కలిస్తే కాని విత్తనము మొలకెత్తదు. భూమిలో విత్తనము వేస్తే విత్తనములు మొలకెత్తుతాయి. విత్తనము భూమిలో వేయడానికి పురుషప్రయత్నము కావాలి. కేవలము భూమి విత్తనము ఉన్నంత మాత్రాన విత్తనము మొలకెత్తదు. కనుక పురుషప్రయత్నము కావాలి. అన్నీ దైవమే చూస్తాడు అనుకుంటే ఫలితము రాదు కనుక పురుషప్రయత్నము అవసరము. పురుషప్రయత్నము ఉంటేనే దైవబలము కూడా తోడౌతుంది. ఉదాహరణగా నిప్పురవ్వ చిన్నదే అయినా బాగా గాలి వీస్తేనే అది పెద్దమంట ఔతుంది. మనము చేసే పని చిన్నది అయినా దైవబలము తోడైతే అతి బలపడుతుంది. నేతితో దీపము పెట్టినప్పుడు నెయ్యి తగ్గిన తరువాత దీపము కొడిగట్టి పోతుంది. అలాగే మనము చేసే పనులకు దైవబలము లోపిస్తే ఆ పని విజయవంతము కాలేదు. పరశురాముడు, భృగువు, బలిచక్రవర్తి గొప్ప వాళ్ళే అయినా వారికి వారు చేసే పనిలో పవిత్రత లోపించింది కనుక దైవబలము లోపించింది కనుక వారు అపజయం పాలయ్యారు. కనుక ఏపనికైనా దైవానుకూలము ముఖ్యము. ఏ పనికైనా పురుష ప్రయత్నము దైబలము సమానంగా కావాలి కనుక రెండూ ముఖ్యమైనవే " అన్నాడు.
మంచి పనులు ఫలితము
[మార్చు]ధర్మరాజు " పితామహా ! మంచి పనులకు మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కదా ! ఏ మంచి పనికి ఎలాంటి ఫలితము ఉంటుంది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఒక్కో పనికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఆకలితో ఉన్న బాటసారికి అన్నం పెడితే వచ్చే ఫలితం అంతా ఇంత కాదు. రోజూ చేసే అగ్ని ఉపాసన మనపనులను విజయవంతం చేయడానికి తోడ్పడుతుంది. మనం మంచి వస్తువులు ఇతరులకు దానం చేస్తే మనకు అవసరమైన సమయాలలో ఆ వస్తువులు అయాచితంగా లభిస్తాయి. మౌనం పాటిస్తే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది. తపస్సు చేస్తే అధిక భోగములు చేకూరుతాయి. ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది. అహింసావ్రతము ఆచరిస్తే రూపము, బలము, ఐశ్వర్యము చేకూరుతాయి. ఉపవాసం చేస్తే మనస్సు నిర్మలంగా ఉంటుంది. కేవలం ఫలములు, నీరు త్రాగి జీవించిన వాడికి రాజ్యప్రాప్తి కలుగుతుంది. వేదములు చదివితే సుఖాలు ప్రాప్తిస్తాయి. వేదార్ధము గ్రహిస్తే పరలోకసుఖము ప్రాప్తిస్తుంది. సత్యవ్రతము పాటిస్తే మోక్షప్రాప్తి కలుగు తుంది. ధర్మనందనా మంచి పనులకు మంచి ఫలితము కలిగినట్లే చెడుపనులకు చెడు ఫలితాలు కలుగుతాయి. ఏ విత్తు వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది కదా ! మానవుడికి ముసలితనము వచ్చి పళ్ళు ఊడిపోయి, వెంట్రులకు రాలిపోయి, చెవులు వినపడక, కళ్ళు కనపడక పోయినా అతడిలో కోరికలు మాత్రము చావవు. ప్రాణములు పోయినా కోరికలు విడువవు. ఇది మామూలు మనుషులకే కాదు పండితులకు కూడా ఈ బానిసత్వము తప్పదు. ఆఖరిదశ వరకు ఈ కోరికల మీద మోహము విడిచి పెడదాము అన్న ఆలోచన కూడా రానివ్వరు. వెలుపలి ప్రపంచంలో విహరించే వారికి పుణ్యకర్మలు సుఖాన్ని పాపకర్మలు దుఃఖాన్ని కలుగచేస్తాయి " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
యజమానుడు సేవకుడు
[మార్చు]ధర్మరాజు భీష్ముడిని " పితామహా ! నాకు ఒక సందేహము తమ యజమానుల ఎడల అతడి దయా దాక్షిణ్యాల మీద బ్రతికే సేవకుడు ఎలా నడచుకోవాలి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! కాశీపట్టణంలో ఒక బోయవాడు ఉండే వాడు. అతడు ఒక రోజు వేటకొరకు అడవికి వెళ్ళి ఒక లేడిమీద విషముపూసిన బాణమును వేసాడు. కాని ఆ బాణము గురితప్పి ఒక చెట్టును తాకింది. ఆ చెట్టు పూలుపండ్లతో నిండి ఉన్నది. ఆ విషపూరిత బాణము ఆ చెట్టును నిలువునా పూలు విరుగకాసిన పండ్లలతోసహా దహించివేసింది. ఆ చెట్టు మీద నివసిస్తున్న చిలుక ఆ చెట్టు దహించ బడినా ఇన్ని రోజుల నుండి కాపాడిందన్న విశ్వాసంతో దానిని విడువక అక్కడే నివసించసాగింది. ఎండ వచ్చినా గాలి వచ్చినా వర్షము వచ్చినా అది ఆ చెట్టును విడువ లేదు. ఆ చిలుక గురించి విన్న ఇంద్రుడు మామూలు మనిషి రూపంలో దాని వద్దకు వచ్చి " ఓ చిలుకా ! ఈ చెట్టు మాడిపోయింది కదా ! ఈ అడవిలో ఫల పుష్పాలతో నిండిన ఇన్ని వృక్షాలు ఉండగా ఈ చెట్టును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు " అని అడిగాడు. చిలికు " మహేంద్రా ! ఈ చెట్టు ఫలపుష్పాలతో నిన్ను నిండుగా ఉన్నప్పుడు ఆ చెట్టును అంటిపెట్టుకుని ఉండి ఆ చెట్టు ఎండి పోయినప్పుడు వదిలి వెళ్ళడము కృతగఘ్నత కాదా ! " అన్నది. మారువేషములో వచ్చిన నన్ను మహేంద్రా ! అని సంభోదించడం చూసి ఇంద్రుడు ఖంగుతిన్నాడు . ఈ చిలుక పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యఫలము వలన తనను గుర్తించిందని తెలుసుకుని " చిలుకా ! నా దర్శనం వ్యర్ధము కాదు కనుక ఏదైనా వరము కోరుకో " అన్నాడు. ఆ చిలుక " ఈ చెట్టును పూర్వము ఉన్నట్లు ఫలపుష్పాలతో అలరారే విధముగా చెయ్యి " అని కోరుకుంది. ఇంద్రుడు వెంటనే ఆ చెట్టు మీద అమృతమును చల్లాడు. ఆ చెట్టు పూర్వములా ఫలపుష్పాలతో శోభిల్లింది. ధర్మనందనా ! చూసావా ఇంద్రుడు వరమిచ్చినా తన కొరకు కోరుకొనక తనకు ఆశ్రయమిచ్చిన చెట్టు శ్రేయస్సును కోరుకున్న చిలుకలా భృత్యులు సదా యజమాని శ్రేయస్సు కోరుకుంటాడు " అని చెప్పాడు.
యజమానులు భ్రుత్యులు
[మార్చు]ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! యజమానులు భృత్యులను ఎలా ఆదరించాలి ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వేదములు చదువుతూ, తపస్సు చేస్తూ , జనులకు ధర్మబోధ చేస్తూ ఇహపరలోకములలో సుఖమును కలిగించే బ్రాహ్మణుడు సదా పూజనీయులు. భార్యకు భర్త ఎలా పూజనీయుడో అలాగే రాజుకు బ్రాహ్మణుడు పూజనీయుడు. బ్రాహ్మణుడు పలికే ప్రతి పలుకు పవిత్రమైనదే ! సద్బ్రాహ్మణుడు తనను కష్టమును సుఖమును కలిగించిన ఇంద్రుడికైనా దుఃఖమును సుఖమును ఫలితములను ఇవ్వ కలిగిన సమర్ధుడు. రాజు బ్రాహ్మణుడిని తన పుత్రుడివలె ఆదరించాలి. గురువు వలె గౌరవించాలి. అగ్నివలె పూజించాలి. వేదములలో ఈ ప్రస్తావన వివరిస్తాను విను. బ్రాహ్మణ జాతిని పరాభవించిన వాడి పుణ్యములు సమస్తము నశిస్తాయి అని ఋగ్వేదము చెప్తింది. జపము, హోమము, యాగము, యజ్ఞములు బ్రాహ్మణుడి ఆధ్వర్యంలోనే జరగాలి అనే యజుర్వేదము చెప్తుంది. ఒక నెలపాటు బ్రాహ్మణులను అర్చించిన సకల పాపములు హరిస్తాయని సామవేదము చెప్తుంది. బ్రాహ్మణులను ఆదరించక పోవడము తప్ప వేరేకీడు ప్రపంచంలోనే లేదు అని యజుర్వేదము చెప్తుంది.
ధర్మము జ్ఞానము
[మార్చు]ధర్మరాజు " పితామహా ! ఏది శ్రేష్టమైన ధర్మము ఏది ? ఉత్కృష్టమైన జ్ఞానము ఏది ? " అని అడిగాడు. భీష్ముడు " ఒక రోజు కొంతమంది బ్రాహ్మణులు శ్రీకృష్ణుడు వింటుండగా మధ్రదేశీధీశుడితో శల్యమహారాజా ! యజ్ఞమూర్తి, యజ్ఞ కర్త మూర్తి, యజ్ఞ కలన మూర్తి అయిన విష్ణుమూర్తిని తెలుసుకోవడమే జ్ఞానముల కంటే ఉత్తమమైన జ్ఞానము. ఆ విష్ణుమూర్తియే శ్రీకృష్ణుడు. ఈ బాలుడు వసుదేవుడి కుమారుడు కంసుడి చెల్లెలు అయిన దేవకి సుతుడు. ఇతడిని యజ్ఞ పురుషుడు అనడానికి కారణం ఏమిటి ? " అని అడిగారు. ఆ మాటలు విన్న కృష్ణుడు నన్ను చూసి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకలిగిన వాడివి నువ్వే కనుక నువ్వే జవాబు చెప్పు అని నన్ను అన్నాడు. నేను కృష్ణుడికి నమస్కరించి " శ్రీకృష్ణుడే సర్వమయుడు, వేదమయుడు, వేదములకు అర్ధము, వేదములు ఎరిగిన వాడికి ఇష్టుడు, శ్రీకృష్ణుడే సాక్షాత్తు విష్ణువు అని తెలుసుకొనడమే ఉత్తమ బ్రాహ్మణత్వానికి ఫలము " అని చెప్పాను. నా మాటలు విన్న బ్రాహ్మణులు శ్రీకృష్ణత్త్వము చక్కగా తెలుసుకున్నారు. అని చెప్పిన తరువాత మద్రదేశాధీశుడి సందేహము తొలగి పోయినది. ధర్మనందనా ! నీకు కృష్ణ తత్వము తెలుసునని నాకు తెలుసు. అయినా నీ ప్రజ్ఞను ఒక్క సారి జ్ఞాపకము చెయ్యడానికిది చెప్పాను " అని చెప్పాడు.
మాటతప్పుట
[మార్చు]ధర్మరాజు " పితామహా ! ఎవరైనా బ్రాహ్మణులకు ఇస్తానని చెప్పినది ఇవ్వక ఎగవేసిన కలుగు ఫలితమేమి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! దీనికి సమాధానంగా నీకొక కథ చెప్తాను. ఒక అడవిలో ఒక నక్క ఒక కోతి స్నేహంచేసాయి. ఒక రోజు కోతి నక్కతో " మిత్రమా ! నీవు పూర్వజన్మలో ఏమి పాపము చేసావో కాని ఈ జన్మలో చచ్చిన శవాలను ఆహారముగా తినే గతి పట్టింది " అన్నది. అప్పుడు ఆ నక్క కు పూర్వ జన్మస్మృతి కలిగినది " మిత్రమా ! నేను పూర్వ జన్మలో ఒక బ్రాహ్మణుడికి కొంత ధనము ఇస్తానని ఇవ్వకుండా ఎగ వేసాను. దానికి ఫలితంగా ఈ జన్మలో నాకు చచ్చిన శవాలను ఆహారంగా తినే గతి పట్టింది " అన్నది. కనుక ధర్మనందనా ! బ్రాహ్మణుడికి ఇస్తానన్నది ఇవ్వక ఎగవేసిన ఇటువంటి జన్మ లభిస్తుంది "అని అన్నాడు.
కులము విద్య
[మార్చు]ధర్మరాజు " పితామహా ! తక్కువ కులములో పుట్టినా కూడా గొప్పగుణములు, మంచిప్రవర్తన ఉన్న వాడికి మంత్రతంత్ర విద్యలు నేర్పడం దోషమా ధర్మవిరుద్ధమా ! " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. పూర్వము హిమాలయాలలో అనేక మంది బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు ధర్మనిష్టా గరిష్ఠుడు, మంచి గుణగణములు కలవాడు, గొప్ప ప్రవర్తన కలవాడు అయిన శూద్రుడు వచ్చి అయ్యా ! మీరందరూ తపస్సు చేసుకుంటున్నారు కదా ! నాకు కూడా తపస్సు ఎలా చెయ్యాలో ఉపదేశించండి " అని అడిగాడు. అందుకు బ్రాహ్మణులు " ఓ ధర్మాత్మా ! నీవు శూద్రుడవు కనుక నీకు వైదిక విద్య ఉపదేశించడం తగదు. నీవు మాకు శుశ్రూషలు చేయుటకు తగినవాడవు " అన్నారు. ఆ శూద్రుడు కూడా అలాగే అని అక్కడే చిన్న పర్ణశాల వేసుకుని ఆ విప్రులకు సేవ చేస్తున్నాడు. కాని విప్రులు చేస్తున్న కార్యములు చూస్తూ తాను కూడా అతిథిపూజలు, దేవ, పితృ పూజలు చేస్తున్నాడు. ఒక రోజు అక్కడ తపస్సు చేసుకుంటున్న విప్రులకు గురువు గారు అతడి ఆశ్రమముకు వెళ్ళి అక్కడ శూద్రుడు చేస్తున్న అతిథి, దేవ, పితృ పూజలు చూసి సంతోషించాడు. అతడు చేస్తున్న పూజలలో లోపాలను ఎత్తి చూపి పూజలు సరిగా పద్ధతులు ఉపదేశించి వెళ్ళాడు. ఆ శూద్రుడు కూడా గురువుగారి ఉపదేశమును అనుసరించి ఆచరించాడు. కాల క్రమమున గురువుగారు శూద్రుడు మరణించారు. మరు జన్మలో శూద్రుడు రాజకుమారుడుగా, గురువుగారు సకల వేద శాస్త్రములకు నిలయమైన బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించి పెరిగి పెద్ద వాడై గుణసంపన్నుడయ్యాడు. కాలక్రమమున ఆ రాజకుమారుడు ఆ బ్రాహ్మణకుమారుని పురోహితుడిని చేసుకుని సకల సంపదలు సమకూర్చాడు. కాని ఆ రాజకుమారుడు బ్రాహ్మణ కుమారుడిని చూసి సన్నగా నవ్వాడు. ఆ బ్రాహ్మణ కుమారుడికి మాత్రము రాజకుమారుడు తనను చూసి ఎందుకు నవ్వుతున్నాడో అర్ధము కాలేదు. బ్రాహ్మణకుమారుడు " రాజకుమారా ! మీరు నన్ను చూసినప్పుడల్లా సన్నగా నవ్వుకుంటున్నారు. నా వలన ఏదైనా అపరాధము జరిగిందా ! దయ చేసి తెలియజెయ్యండి " అని అడిగాడు. రాజకుమారుడు " విప్రోత్తమా ! నాకు పూర్వజన్మజ్ఞానం ఉంది. కిందటి జన్మలో నేను శూద్రుడను. మీరు గురువు గారు. మీరు నాకు వైదికవిద్యలోని మెళుకువలు, తపస్సు ఎలా చెయ్యాలో, దేవ, పితృకార్యములు ఎలా చెయ్యాలో బోధించారు. తత్ఫలితంగా ఇప్పుడు మీరు ఒక రాజకుమారుడికి సేవ చేస్తున్నారు. అది గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాను. అంతే కాని మీ వలన ఏదోషము లేదు. ధర్మపరుడివి అయిన నీలో లోపం ఎందుకు ఉంటుంది " అని చెప్పాడు. కనుక ధర్మనందనా ! వైదికవిద్యను, మంత్రతంత్రములను బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులలో అర్హత కలిగిన వారికి మాత్రమే ఉపదేశించాలి " అని చెప్పాడు.
లక్ష్మీ నివాసము
[మార్చు]ధర్మరాజు " లోకంలో ఉన్న అనేక జనులలో లక్ష్మీదేవి ఎవరింట నివసిస్తుంది " అని అడిగాడు.భీష్ముడు " ధర్మనందనా ! ఒక సారి రుక్మిణీ దేవి లక్ష్మీదేవిని ఈ ప్రశ్న వేసింది. అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీ దేవికి చెప్పిన విషయములు నేను నీకు చెప్తాను. నిత్యము సత్యము పలికే వారు, శుచిగా శుభ్రంగా ఉండే వారు, గురువుల ఎడ భక్తి కలవారు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు, సదా దక్షతతో దీక్షితులుగా ఉండేవారు, మంచి పనులు చేసే వారు, మలినము లేని వారు, ఎప్పుడూ మంచి పనులు చేసే వారు, వుజ్ఞావంతులు, తపస్సు చేసే వారు, తనకు ఉన్నంతలో దానము చేసే వారు, బ్రహ్మచర్యము పాటించే వారు, ఇంద్రియ నిగ్రహము కల వారు నాకు ప్రేమ పాత్రులు నేను వారి వెంట ఎప్పుడూ ఉంటాను. ఇక క్రూరాత్ములు, నాస్థికులు, కృతఘ్నులు, దుర్మార్గుల వద్ద అసలు ఉండను. ఇక స్త్రీల వాద ఎవరి ఎంగిలి తినని వారు, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునే వారు వారి అందు నివసిస్తాను. ఇక భర్తకు ఎదురు చెప్పే వారు, ఇతరులను నిందించు వారు, భర్తకు తెలవకుండా పర పురుషుల ఇళ్ళకు వెళ్ళే వారు, ఎప్పుడూ నిద్రించె వారు వారి వద్ద నేను ఉండను. , నేను తామర పువ్వులందు, పూల తోటలందు, ఫలవృక్షముల అందు నేను నివసిస్తాను " అని లక్ష్మీ దేవి రుక్మిణీ దేవికి చెప్పింది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
స్త్రీలు పురుషులు దాంపత్యము
[మార్చు]ధర్మరాజు " పితామహా ! దాంపత్య జీవితంలో అధికమైన ఆనందించేది స్త్రీయా ! పురుషుడా ! అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము భంగాస్వనుడు అనే రాజుకు సంతానము కలుగ లేదు. సాధారణంగా యజ్ఞము ఇంద్రుడి అనుమతి తీసుకుని చేయాలి. కాని భంగాస్వనుడు ఇంద్రుడి అనుమతి లేకుండా యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందాడు. ఆ రాజు సంతోషంగా ఉన్నాడు కాని ఇంద్రుడు తన అనుమతి లేకుండా యజ్ఞము చేసినందుకు అతడి మీద కక్షకట్టాడు. ఒకరోజు భగాస్వనుడు వేటకు పోయాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారితప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసి గుర్రము దిగి సమీపంలోని కొలనులో దిగి ఆనీటిని సేవించాడు. వెంటనే ఆ రాజు ఆశ్చర్యపోయేలా అతడికి స్త్రీత్వము ప్రాప్తించింది. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి ఆ రాజు చాలా చింతించి " ఈ వేషముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లకు, పురజునులకు ఎలా ముఖము చూపగలను " అని విచారించి " అయినా ఇలా అడవిలో ఉండలేను కదా ! " అనుకుని చివరకు రాజధానికి వెళ్ళి మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ మునిపుంగవులతో నివసించ సాగాడు.
భగస్వనుడు మునిపుంగవుడిని వివాహమాడుట
[మార్చు]అక్కడ ఉన్న ఒక ముని స్త్రీలాగా మారిన రాజును చూసి మోహించి వివాహమాడారు. భగాస్వనుడు మునివలన స్త్రీగా అత్యంత బల సంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు. ఆ తరువాత అతడు నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో " కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను కనుక వీరు మీ అన్నదమ్ములు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి " అన్నాడు. తండ్రిమాట పాలించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు " నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భగాస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి " రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా ! అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు " అని వారిలో కలతలు రేపాడు. అలాగే భగాస్వనుడు స్త్రీగా ఉన్నపూడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగాడు. ఇది చాటుగా చూస్తున్న ఇంద్రుడు " అమ్మా నీవు ఎవరు ? ఎందుకిలా రోదిస్తున్నావు ? " అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞ ము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై " రాజా ! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను " అని చెప్పాడు. భస్వానుడు " దేవా ! అజ్ఞానంతో తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వాడినా ! కనుక నన్ను దయతో రక్షించు " అని వేడుకున్నాడు. ఇంద్రుడు " రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో " అన్నాడు. రాజు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకున్నాడు. ఇంద్రుడు " అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా ! " అని అడిగాడు. భగస్వానుడు " వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా ! " అని చెప్పాడు. ఇంద్రుడు " రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను " అని " రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోప్గొట్టుకున్న పురుషత్వము ఇస్తాను " అన్నాడు. భగస్వానుడు " మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు. నేనిలా స్త్రీగానే ఉంటాను " అన్నాడు. ఇంద్రుడు " అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. స్త్రీగా ఉన్న భగస్వానుడు సిగ్గు పడి " మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను కనుక ఇలాగే ఉండి పోతాను " అన్నాడు. దేవేంద్రుడు నవ్వి అలాగే అగుగాక అని చెప్పి వెళ్ళాడు " అని చెప్పి భీష్ముడు " కనుక ధర్మనందనా ! నీవడిగిన ప్రశ్నకు నా సమాధనము ఇదే ! " అని భీష్ముడు చెప్పాడు.
వైష్ణవము
[మార్చు]ధర్మరాజు " పితామహా ! తమరు అంపశయ్య మీద ఉండి కూడా నేను అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. నేను ఎన్నో ధర్మసూక్ష్మాలు తమ ముఖతః విన్నాను. కాని అవి ఏవి జననము, మరణము వీటి వలన వచ్చే దుఃఖం తొలగించవు కదా ! ఎన్నో జన్మల నుండి ఎంతో మంది తల్లి తండ్రులకు పుడుతూ మరణిస్తూ ఈ సంసార చక్రంలో నేనిక తిరుగ లేను. పితామహా ! గర్భవాసముకు స్వర్గము నరకము ఉంటాయా చెప్పండి. ఈ చరాచర జగత్తు అసత్యము కనుక నేను ఈ జగత్తును విషతుల్యముగా చూస్తాను. నాకు ఈ రాజ్యము వద్దు సంసారము వద్దు. నాకు మోక్షకారకమైన వైష్ణవధర్మము ఉపదేశించండి. ఈ యుగములో వైష్ణవధర్మము కనిపించడం లేదని వ్యాసుడు చెప్పాడు. కనుక నేను అది మీ నుండి తెలుసుకొనగోరుతున్నాను " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ఏమిటీ వెర్రి. 18 రోజులు యుద్ధము చేసి శత్రువులను జయించి రాజ్యము కైవశము చేసుకుని ఇలా మాట్లాడటము నీకే చెల్లింది. లేకున్న క్షత్రియులకు ఇది తగదు. నీవు మిధిలా నగరాధిపతి జనకుడిలా మాట్లాడుతున్నావు. నిర్యాణము అనునది శాశ్వత సుఖాన్ని ఇస్తుంది. దానిని ఇలా ఉంటుంది అని వర్ణింపజాలము. జీవుడికి అది అతీతము. ప్రకృతులు ఎన్నో ఉన్నా ఆకృతి ఒక్కటే . అదే అన్నింటికీ మూలము. ఆకృతి ఎన్నో జీవాత్మలుగా రూపాంతరము చెందినా అది ఎటువంటి వికారము చెందదు. అది తన స్వస్వరూపము మరువదు. సంసారము అనే మార్గము సుగమంగా కనిపిస్తుంది. మోక్షమార్గము కామము, క్రోధముతో కప్పబడి ఉంటుంది. కనుక కామము, క్రోధములను విడిచి సత్వగుణమును ఆశ్రయించి జీవితము గడపాలి దానినే వైష్ణవమని అంటారు. నీవుఈ ధర్మమును పాటించి సంసార భయమును వీడి మోక్షము సాధించు " అని భీష్ముడు చెప్పాడు.
తత్వములు
[మార్చు]ధర్మరాజు " పితామహా ! తత్వములు, అధ్యాత్మములు, అదిదైవతములు, అదిభూతములు అను వాటికి కర్త భర్త హర్త అయి సకల భూతములకు ఆధారభూతమైన పరమాత్మ గురించి వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వీరు కాక బ్రహ్మకు మరీచి, భృగువు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను ఆరుగురు కుమారులు ఉన్నారు. అందు సనత్సుజాతుడు బొటనవ్రేలి ప్రమాణంలో ఉండి అగ్ని మాదిరి మండుతుంటాడు. ఒక ప్రదేశాన నిలువక సదా లోకాలన్నీ చుట్టివస్తాడు. ఒక రోజు సనత్సుజాతునకు నారదుడు మేరుపర్వతము మీద కనిపించాడు. ఆయన చెప్పిన విషయము నేను నీకు చెప్తాను. విష్ణుమూర్తికి పదివేల సంవత్సరములు రాత్రి, పదివేల సంవత్సరాలు పగలు. ఇరవై వేల యుగములు ఒక రోజు. విష్ణువు రూపమును అవ్యక్తము అంటారు. విష్ణువు రాత్రు నిద్రించి పగలు సృష్టి ఆరంభిస్తాడు. సృష్టిచేయ సంకల్పించిన విష్ణువు శుక్లమును అండాకారములో జలములో విడిచిపెడతాడు. తరువాత తన నాభి నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆయనను సృష్టికి కర్తగా నియమించాడు. తరువాత బ్రహ్మను అహంకారము ఆవహించింది. తరువాత మనసు, బుద్ధి, ఇంద్రియములు, పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, జలము, భూమి అను పంచభూతములను సృష్టించాడు. పంచభూతములకు గుణముగా శబ్ధము, స్పర్శ, రూపము, రసము, గంధము ఆవిర్భవించాయి. తరువాత దేవతలు, మునులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, నరులు, జంతువులు మొదలైన జీవజాతులు ఆవిర్భవించాయి. వీటన్నింటినీ అహంకారము ఆవహించింది. ఇవి అన్నీ అవ్యక్తమైన సంసారసాగరమున పుడుతూ మరలా చస్తూ మరలా పుడుతూ జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు. ఈ సృష్టి స్థితి లయములకు కారకుడైన విష్ణువు జీవరాసులకు శుభాశుభములు కలిగిస్తూ ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ వినోదిస్తుంటాడు. పంచభూతములు, పంచ గుణములు, మహాతత్వము, పది ఇంద్రియములు, అహంకారము, మనసు, బుద్ధి అను 24 తత్వములు.
అధ్యాత్మము అదిభూతము అధిదైవతములు
[మార్చు]చెవి అధ్యాత్మము అయితే శబ్ధము అదిభూతము. దిక్కులు అధిదైవతములు. చర్మము అధ్యాత్మము అయితే స్పర్శ అదిభూతము, గాలి దానికి అదిదైవతము. కళ్ళు అధ్యాత్మము అయితే రూపము అది భూతము సూర్యుడు దానికి అదిదైవతము. నాలుక ఆధ్యాత్మము అయితే రుచి దానికి అదిభూతము నీరు దానికి అదిదైవతము. ముక్కు అధ్యాత్మము అయితే వాసన దానికి అదిభూతము భూమి దానికి అదిదైవతము. వీటిని బుద్ధి ఇంద్రియత్రయము అంటారు. పాదములు, విసర్జకావయవము, జననేంద్రియము, చేతులు, నోరు కర్మేంద్రియములు అనునవి అధ్యాత్మికములు. పైన చెప్పిన అవయవములకు వరుసగా నడక, విసర్జనము, ఆనందము, పని, మాట అధిభూతములు. వాటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని అధిదైవతములు. అహంకారము, మనసు, బుద్ధి ఆధ్యాత్మకములు, వీటికి అభిమానము, సంకల్పము, నిశ్చయము అధిభూతములు. వాటికి మేధస్సు, చంద్రుడు, బ్రహ్మ అధిదైవతములు. ఇవన్నీ విష్ణువు నుండి పుట్టి లయమౌతాయి. అవ్యక్తము అంటే మూల ప్రకృతి. అందులో పురుష చైతన్యము చేరితే ఆ ప్రకృతి చైతన్యవంతమౌతుంది. అప్పుడు ఈ ప్రపంచమంతా అంతా వైభవంతో నడుస్తుంది. ఈ సృష్టికంతా ఆధారం విష్ణువు. పరమశివుడి అనుమతితో బ్రహ్మ జననమరణములు నిర్వహిస్తూ ఉంటాడు " అని సనత్సుజాతుడు నారదుడికి చెప్పాడు " అని చెప్పి భీష్ముడు " ధర్మజా ! ఈ సృష్టికంతకూ మూలము 25వ తత్వము అయిన పరమాత్మ. వేద వేదాంత పురాణ వేద్యుడైన ఆ పురుషుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు. అతడే కాలాంతకుడైన అచ్యుతుడు, అనంతుడు, యోగి జనముల హృదయములలో నివసించే వాడు, విష్ణువు, అద్వయుడు, అసంగుడు. అతడే పరమాత్మ " అని భీష్ముడు పలికాడు.
విష్ణుస్వరూపము
[మార్చు]ధర్మరాజు " పితామహా ! మహానుభావులు అగ్నులను తమయందు సమాహితం చేసుకుంటారు కదా ! అటువంటి వారు విష్ణుమూర్తిని ఎటువంటి వాడిగా భావిస్తారు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! క్షీరసాగరమధనంలో అమృతం పుట్టగానే దేవతలు దానవులకు యుద్ధం జరిగింది అందులో దానవులు దేవతలను జయించి అమృతము కైవశము చేసుకున్నారు. దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు ఆకాశము నుండి " దేవతలారా ! నేను మిమ్ము గెలిపించడానికి వస్తున్నాను " అన్న మాటలు వినిపించాయి. అంతలో విష్ణుమూర్తి గరుఢారూడుడై శంఖ చక్ర గధా సహితుడై అసురుల మీదకు యుద్ధానికి వచ్చి వారిని జయించి వెంటనే అంతర్ధానం అయ్యాడు. అది చూసి ఆశ్చర్యచకితులైన దేవతలు " ఈ మహానుభావుడు ఎవరు ? " అని బ్రహ్మదేవుడిని అడిగారు. బ్రహ్మదేవుడు " దేవతలారా ! ఆయన విష్ణుమూర్తి వైకుంఠములో ఉంటాడు. ఆయన ఇలా ఉంటాడు అని నాకు వర్ణించడానికి శక్తిచాలదు. అయినా ఆయన రూపము తెలుసుకోవడానికి నేను ఒకకథ చెప్తాను.
మునులతో గరుత్మంతుడు
[మార్చు]హిమాలయాలలో మునులు, సిద్ధులు తపసు చేసుకుంటున్న తరుణంలో అక్కడకు గరుడుడు వచ్చి వారికి నమస్కరించాడు. వారు అతడిని సుఖాసీనులను చేసి " గరుడా ! నిన్ను ఒక విషయం అడగాలని ఉంది " అని అడిగారు. అందుకు గరుడుడు " ధన్యుడను అడగండి చెప్తాను " అని అన్నాడు. మునులు సిద్ధులు " గరుడా ! విష్ణు భక్తుడవై సదా విష్ణువుకు సమీపంలో ఉండే నీవు మాకు విష్ణుతత్వము ఎరిగించగల సమర్ధుడవు. కనుక భక్త సులభుడైన విష్ణుతత్వము గురించి మాకు వివరించు " అని అడిగారు. మహానుభావులారా ! ఈ మూడు లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు అని మాత్రమే నాకు తెలుసు. అంతమాత్రాన నాకు అన్ని తెలుసునని అనుకోవడం కష్టం. మీకు నాకే కాదు ఎవరికైనా విష్ణుతత్వము గురించి చెప్పడము కష్టమే. నేను విన్న ఆయన కథలను కావాలంటే చెప్తాను. నేను దేంద్రుడిని జయించి అమృతభాంఢమును తీసుకు వెడుతున్న తరుణంలో ఆకాశం నుండి " గరుడా ! నీ పరాక్రమానికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో " అనే మాటలు వినిపించాయి. అప్పుడు నేను " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిపి వరాలను ఇవ్వండి " అన్నాను. ఆ మాటలకు బదులుగా ఒక నవ్వు వినిపించి తరువాత " కాలక్రమేణా నీకు నేనెవరో తెలుస్తుంది. నీవు నా వాహనముగా ఉండు. నీకు వ్యాధులు సోకవు మరణం ఉండదు. అసురులను జయిస్తావు " అన్న మాటాలు చెప్తూ ఒక కాంతిపుంజము నా ఎదుట నిలిచింది. నేను ఆకాంతి స్వరూపానికి చేతులెత్తి నమస్కరించి " మహానుభావా ! నేను నీకు వాహనమౌతాను. నీవు ఎక్కిన రధముకు నన్ను ధ్వజముగా నియమించమని నేను కోరుకుంటున్నాను " అని అడిగాను. " అలాగే జరుగుతుంది " అని చెప్పి ఆ కాంతి స్వరూపం మాయమయ్యింది. ఆ మాటలకు ఆశ్చర్యానందాలు కలిగాయి.
గరుత్మంతుడు కశ్యపుడు
[మార్చు]నేను నా తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో " కుమారా ఆమహానుభావుడెవరో కాదు అతడే నారాయణుడు. నీ మీద కలిగిన దయవలన నీకు దర్శనమిచ్చాడు. నేను ఆయనను దర్శించవలెనన్న కోరికతో ఆయనను ఆరాధిస్తూ యోగసమాధిలో ఉండి తపమాచరించాను. ఆయన నాకు అనేక శరీరాలతో ఉన్న తన విశ్వరూపము చూపి " కశ్యపా ! నీలో ఇంకా కోరికలు చావలేదు. మనసులో కోరికలు పెట్టుకుని నన్ను చూడడం జరగని పని. నీ వు నిస్సంగుడవైనప్పుడు నన్ను దర్శించగలవు " అన్నాడు. అటువంటి దివ్యమూర్తికి సేవలు చేసే భాగ్యము లభించిన నీవు అదృష్టవంతుడవు నీ జన్మ ధన్యమైంది. నీవు వెంటనే బదరికాశ్రముకు వెళ్ళి అక్కడ ఆ దివ్యమూర్తిని సేవింపుము " అని చెప్పాడు. నేను వెంటనే బదరికాశ్రము వెళ్ళి అక్కడ అచ్యుతుడు, పుండరీకాక్షుడు, గోవిందుడు, లోకజనకుడు, నారాయణుడు అను దివ్యమూర్తిని దర్శించి అతడికి భక్తితో నమస్కరించాను. ఆ పీతాంబరధారి శంఖు చక్ర గదా ధారి అయి అష్ట భుజములతో ఉన్న నారాయణుడు " వచ్చావా ! మంచి పని చేసావు నా వెంట రా " అంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.
గరుత్మంతుడు నారాయణుడిని వెంటవెళ్ళుట
[మార్చు]నేను ఆయనను అనుసరిస్తూ ఎన్నో యోజనములు పయనించాను. అక్కడ ఏ విధమైన ఇంధనము లేకుండా మండుతున్న అగ్నిలో ఆ పీతాంబరధారి ప్రవేశించాడు. నేను ఆయనను అనుసరించాను. అక్కడ పార్వతీ సహితుడైన శివుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు వారిని దాటి వెళ్ళాడు. నేను ఆయనను అనుసరించాను క్రమంగా గాంఢాంధకారం అలుముకుంది నాకు ఏమీ కనిపించ లేదు. " ఈ దిక్కుకు రా " అన్న శబ్ధము వినిపించింది. నేను దిక్కు తోచక అటువై వెళ్ళాను. క్రమక్రమంగా చీకట్లు అంతరించి అక్కడ ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించింది. అక్కడ సూర్యుడు పట్టపగలు మాదిరి ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. కమ్మని సంగీతము వినవస్తుంది. తామర కొలనులు ఉన్నాయి. అందమైన మగవారు ఆడవారు నారాయణ మూర్తిని పూజిస్తుండగా ఆయన అలా వెళుతుండగా నేను ఆయనను అనుసరించాను. నేను ఆ వెలుగును తట్టుకోలేక స్వామీ అని అరిచాను. ఆయన వాత్సల్యంతో " వినతాకుమారా ! నేను నిన్ను మరచిపోతానా ! నా వెంట రా ! నీవు నన్ను చూడలేదని బాధపడకు. మమతలు, అహంకారం మనసున రానీక నిశ్చల మనసుతో ఏకాగ్రచిత్తులైన వారు మాత్రమే నన్ను చూడగలరు. నీకు నా మీద కలిగిన భక్తిప్రత్తులు కారణంగా నీవు కేవలం నా స్థూల శరీరము మాత్రమే చూడగలుగుతున్నావు " అని స్వామి నాతో అన్నాడు. అప్పటికి అమితమైన వేడి తేజస్సు చల్లబడింది. నేని తిరిగి స్వామిని అనుసరించాను. నారాయణుడు ఆకాశానికి ఎగిరాడు నేను కూడా ఆయన వెంట ఎగిరాను. అక్కడ స్వామి అంతర్ధానం అయ్యాడు. ఇటురా ! అన్న శబ్దం వినిపించి నేను అటుగా వెళ్ళాను. అక్కడ తెల్లటి హంసలు విహరిస్తున్న తామర కొలను కనిపించింది. అక్కడ నారాయణుడు స్నానం చేస్తుండగా నేను ఆయన వద్దకు చేరబోయాను. ఆయన నాకు కనిపించ లేదు బదులుగా వెలుగుతున్న కొన్ని వందల అగ్నులు కనిపించి వేధ ఘోషలు వినవచ్చాయి. అప్పుడు కొన్ని వందల గరుడపక్షులు నన్ను చుట్టుముట్టగా నేను భయ భ్రాంతుడనయ్యాను. నేను అచ్యుతా, శివా, సహస్రాక్షా, వేదమయా, అనాది నిధనా, త్రిభువనైక నాధా, త్రినైనా, గోవిందా, పద్మనాభా, హరా, కృపా విధేయా అని పెద్దగా స్వామిని స్తోత్రం చేసాను. అప్పుడు స్వామి నా ఎదుట ప్రత్యక్షమై " వినతా పుత్రా ! భయపడకు " అని నా భుజం తట్టాడు. నేను కళ్ళు తెరిచి చూడగా బదరికాశ్రమంలో ఉన్నాను. అది చూసి ఆశ్చర్యచకితుడనై ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకుని పులకించిపోయాను. అప్పుడు నాముందు ఎనిమిది భుజములతో ప్రత్యక్షమైన నారాయణుడిని చూసి స్వామి ముందు మోకరిల్లి " మహానుభావా ! నేను నీ పాదసేవకుడను అయితే, నేను నీ దయకు పాత్రుడనైతే, నేను వినడానికి అర్హుడనైతే నీ మహిమ నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాను.
విష్ణు మహిమ
[మార్చు]నారాయణుడు " వినతా పుత్రా ! దేవతలు కానీ, గంధర్వులు కానీ, దనుజులు కానీ ఇప్పటి వరకు నా నిజ స్వరూపము ఎరుగరు. అఖిలభూతములు నా యందు జన్మించి, నాయందు పెరిగి, నా యందే నశిస్తాయి. అఖిలభూతములు నాయందు ఉంటాయి. నేను అఖిల భూతములందు ఉంటాను. నన్ను తెలుసు కోవాలంటే జీవాత్మను పరమాత్మ వైపు మళ్ళించాలి. కామమును, అహంకారమును, కోపమును, జడత్వమును వదిలి పెట్టాలి. ఇతరుల నుండి ఏదీ గ్రహించకూడదు. అహింసను అవలంబించి మనసును నిర్మలంగా ఉంచుకుని నిత్య తృప్తులై ఉండాలి. అలాంటి వారికి నేను దర్శనం ఇస్తాను. సాంఖ్యయోగము అవలంబించినప్పటికి బాహ్యముతో సంబంధబాంధవ్యాలు తెంచుకోలేని వారికి నిశ్చయబుద్ధి లేని వారికి నేను కనిపించను. అధికమోహములో పడి కొట్టుకుంటూ పూజలు, వ్రతములు, ఉపవాసములు ఆడంబరముగా చేసే వారికి నేను కనిపించను. ఏకాంతమనస్కులు నన్ను దర్శించగలరు. రజ, తమోగుణులకు కాక కేవలం సత్వగుణము కలవారికి మాత్రమే నేను దర్శనమిస్తాను. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని నాలుగు విధములుగా విభజింపబడి ప్రాణులందు ఆత్మ, బుద్ధి, అహంకారము, మానస్సు అనే నాలుగు విధములుగా ప్రవర్తిస్తుంటాను. ఇది నా స్థూల రూపము. నీవు కూడా నన్ను తెలుసుకుని నాయందు భక్తితో సదా నన్ను ధ్యానిస్తూ నా నిజస్వరూపమును తెలుసుకో " అని నారాయణుడు నాకు తెలియజేసాడు. నారాయణుడు నాకు చెప్పినది నేను మీకు చెప్పాను " అని సుపర్ణుడు మునులకు సిద్ధులకు చెప్పినది విని వారు ఆనంద పరవశులై " మహానుభావా ! నీ వలన మేము విష్ణుతత్వము విని ధన్యులమైయ్యాము. ఈ కథ అత్యంత పుణ్యదాయకమై విన్న వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ కథ విన్న బ్రాహ్మణులకు వేదవిద్య అలవడుతుంది. క్షత్రియులకు జర్వత్రా విజయము లభిస్తుంది. వైశ్యులకు సంపద అభివృద్ధి చెందుతుంది. శూద్రులకు సకల శుభములు చేకూరుతాయి. సర్వజనులు ఇహపరసౌఖ్యాలను పొందుతారు. అని పొగిడారు. ధర్మనందనా ! ఈ కథ పూర్వము బ్రహ్మదేవుడు వసువులకు చెప్పగా వసువులు మా తల్లి గంగాదేవికి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇప్పుడు నీకు చెప్పాను. ధర్మనందనా ! మనసులో చేసే సకలవిధ సంకల్పములను విడిచి పెట్టి ఆత్మను అగ్నియందు ప్రతిష్ఠించి బాహ్యసంబధములు విడిచి ధ్యానమగ్నుడవై విష్ణువును ధ్యానించి మోక్షమును సాధించు. ఇలా చేసిన వారికి మోక్షము సులువుగా లభిస్తుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.