Jump to content

అశ్వమేధ పర్వము ద్వితీయాశ్వాసము

వికీపీడియా నుండి


ద్వితీయాశ్వాసం

[మార్చు]

బ్రాహ్మణుడు తపోమార్గము

[మార్చు]

శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాసారాన్ని బోధించే క్రమంలో ఇలా చెప్పాడు. " అర్జునా ! అభయ అనే పేరుతో ప్రసిద్ధులైన ఒక భార్య ఒక భర్త మధ్య జరిగిన సంవాదమును నీకు వినిపిస్తాను. పూర్వకాలంలో ఒకబ్రాహ్మణుని అతడి భార్య ఒక రోజు బ్రహ్మవిద్య బోధించమని కోరింది. ఆబ్రాహ్మణుడు " భార్యామణీ ! నాకు తెలిసిన వరకు బ్రహ్మవిద్య నీకు బోధిస్తాను. చెవులతో వినుట, నేత్రములతో చూచుట, చేతులతో చేయుట వాటిని కర్మలు అంటారు. అజ్ఞానంలో కొట్టుకుంటున్న మానవులు తాము చేసే కర్మలన్నీ సిద్ధిస్తాయని అనుకుంటూ ఉంటారు. ప్రపంచంలో కర్మచేయకుండా ఉండకలిగిన వాడులేడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకకర్మ చేస్తూనే ఉంటాడు. అది ప్రాణులకు సహజము. పని చేయక సోమరిగా ఉండడం మూర్ఖత్వమని జనులు అంటారు. కానీ కర్మలన్నీ విడిచి పెట్టడమే బ్రహహ్మపదము. నా వరకు నేను సదా ఆత్మను బ్రహ్మయందు నిలిపి ఉపాసిస్తాను. దానిని నిష్కర్మ అంటారు. బాహ్యప్రపంచంలో చేసేది అంతా కర్మయే. కర్మచెయ్యకుండా ఉండడం అసాధ్యం. అగ్ని సోముడు కలిసి ఈ సృష్టిని చేస్తుంటారు. బ్రహ్మ అక్షరతత్వము గురించి వివరిస్తాను. అక్షరపరబ్రహ్మము భూతాత్మకమూ కాదు, వాటి తన్మాత్రల మయం కాదు. అందువలన అక్షర పరబ్రహ్మమును బాహ్యనేత్రములతో దర్శించ లేము. కేవలం బుద్ధి, జ్ఞానములతో మాత్రమే దర్శించగలరు. మనలో ఉండే ప్రాణ, ఆపాన, వ్యాన, ఉదాన, సమాన అను పంచవాయువులు బ్రహ్మ నుండే ఉద్భవించాయి. అవి తిరిగి బ్రహ్మలోనే లీనం ఔతాయి. ప్రాణముకు అపానముకు మధ్య ఉదానవాయువు తిరుగుతుంటుంది. మానవుడు ప్రాణ అపాన వాయువుల వద్ద నిద్ర పోతున్నప్పుడు వ్యాన, సమాన వాయువులు వాటిలో కలసిపోతాయి. మానవుడు ఉదాన వాయువులో నిద్రించునప్పుడు మాత్రము ప్రాణ, అపాన వాయువులు విడిచిపెట్టవు. పైన చెప్పిన పంచ వాయువులు, వాటికి మనసు, బుద్ధి కలిస్తే అవి వైశ్వానరుడికి నాలుకల వంటివి. వైశ్వానరుడంటే అగ్నిదేవుడు. అందుకే అగ్నిదేవుడిని సప్తజీహ్వుడు అని పిలుస్తారు. కనుక మానవుల దేహములలో అగ్నిదేవుడు ఆత్మరూపంలో వెలుగుతుంటాడు. వాసన చూడడం, తినడం, చూడడం, వినడం, ఆలోచించడం, ఇతరుల నుండి తెలుసుకొనడం, స్పృజించడం ఈ ఏడు మనలో వెలిగే అగ్నికి సమిధలు. తినేవాడు, చూసేవాడు, స్పృజించేవాడు, వినేవాడు, ఆలోచించేవాడు, వాసన ఆఘ్రాణించే వాడు, తెలుసుకునే వాడు ఋత్విక్కులు. ఈ ఋత్విక్కులు సమిధలను మనలో ఉన్న ఆత్మ అనే అగ్నికి ఆహుతి అర్పిస్తుంటారు. మనలో నిత్యమూ జరిగే ఈ హోమమును సప్తహోమము అంటారు. వైశ్వానరునికి ముఖములు పది. అవి దిక్కులు, వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, మిత్రావరుణులు. శబ్ధము, రూపము, స్పర్శ, రసము, గంధము, మాట, పని చేయుట, గంతవ్యము, విసర్జన, ఆనందము ఈ పది ఆ పది ముఖముల హోమద్రవ్యములు. కళ్ళు, ముక్కు, చర్మము, నాలుక, చెవులు, పాదములు, చేతులు, జననేంద్రియము వీటిని దశహోత్ర విధి అంటారు. ఈ రెండు విధులను తెలుసుకున్న యోగి తనలో ఉన్న జీవాత్మను ఉపద్రష్టగా చేసుకుని తనలోనే నిత్యము యోగము చేస్తుంటాడు. చివరకు ఈ జననమరణచక్రము నుండి విముక్తి పొందుతాడు. ఇది తెలియని వాడు ఈ జనమరణచక్రంలో పడి గిరగిరా తిరుగుతుంటాడు.

ఓంకారం

[మార్చు]

ఓంకారం నుండి వాక్కు పుట్టింది. ఆ ఓంకారం అనుసరించి మనసు నాలుగు పురుషార్ధముల సాధనకు ప్రయత్నము చేస్తుంది " అన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు ఆయన భార్య " నాధా ! మనసులో సంకల్పిస్తే కదా నోటి నుండి వాక్కు వస్తుంది. మరి అటువంటి సమయాన వాక్కును అనుసరించి మనసు ఎలా ప్రవర్తిస్తుంది " అని అడిగింది. బ్రాహ్మణుడు " నీవనది వాస్తవమే కాని వాక్కు మనసు ఒక దానితో ఒకటి అనుసంధానమై పని చేస్తాయి. మనసు సంకల్పించింది తప్ప వాక్కు మరొకటి పలుక లేదు. ఒకసారి మనసు వాక్కు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్ప చెప్పమని అడిగాయి. మనస్సే గొప్పది అని బ్రహ్మదేవుడు ఠక్కున సమాధానం చెప్పాడట. పక్కనే ఉన్న సరస్వతి " నాధా ! నేను వాక్కు దేవతను. అలాంటి నేను మీ పక్కన ఉండగా మనస్సు గొప్పది అని మీరు ఎలా చెప్పారు ? " అని అడిగింది. అందుకు బ్రహ్మ " దేవీ ! మనస్సు రెండు విధములు. ఒకటి స్థిరమైనమనసు రెండవది చరమైనమనసు. స్థిరమైన మనసు నా వద్ద చరమైన మనసు నీ వద్దా ఉన్నవి. నీ అనుగ్రహం వలన పుట్టిన అన్ని వర్ణములు, అక్షరములు, విద్యలు, మంత్రములు మొదలైన వాటిని చంచల మనసు అంటారు. చంచలచిత్తము కంటే స్థిరచిత్తము మంచిది కదా ! " అని సమాధానం చెప్పాడు. అప్పుడు సరస్వతి ఏమీ బదులు పలుక లేదు " అని బ్రాహ్మణుడు భార్యకు చెప్పాడు.

వాక్కు

[మార్చు]

అప్పుడు బ్రాహ్మణునిభార్య " నాధా ! బ్రహ్మదేవుని మాటలకు చింతించిన సరస్వతి ఎలా తేరుకుంది " అని అడిగింది. బ్రాహ్మణుడు " తరుణీ ! వాక్కు అనునది ప్రాణము ఆపానము వలన కలుగుతుంది. అందులో ప్రాణవాయువే బ్రహ్మ. అది తెలియచెప్పి బ్రహ్మ సరస్వతి చింతను పోగొట్టగలిగాడు. కనుక వాక్కు మనసు యొక్క ధర్మమని తెలుసుకున్న వాడు మోక్షమునకు అర్హుడు. ఇంకా వాక్కు మనసు వీటి ధర్మాలను వివరిస్తాను. ప్రాణం అపానంలో కలిస్తుంది. అప్పుడు వాక్కు తన సహజమైన శబ్ధమును వదిలిపెట్టి పంచభూతములలో కలిసి వ్యానుడి ప్రేరణతో శరీరం అంట వ్యాపిస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతత పొందుతుంది. మనసలా ప్రశాంతత పొందడమే ముక్తికిమార్గం. వాక్కు అనేది బయటకు ఉచ్ఛరించేది. దీనిని ఘోషిణి అంటారు. బయటకు కన్పించనిది అఘోషిణి. అఘోషిణి అంటే మనసులో అనుకునేది. ఇందు అఘోషిణి ఉత్తమమైనది. ఆ వాక్కు అవ్యయము. శబ్ధరూపం లేనిది ఉజ్వలంగా ప్రకాశించేది. ఆ వాక్కు బ్రహ్మస్వరూపము. జ్ఞానేంద్రియములు ఐదు మనసు బుద్ధి ఈ ఏడు జీవాత్మను ఆశ్రయించుకుని ఉంటాయి. దేని పని అది చూసుకుంటుంది. ఒకదాని పని ఒకటి చెయ్యవు. వాసన చూడడం అన్నది ముక్కు మాత్రమే చేస్తుంది. మిగిలిన వాటికి అది చేత కాదు. నాలుక రుచి చూస్తుంది మిగిలిన ఇంద్రియాలు ఆ పని చెయ్యవు. కళ్ళు రూపాన్ని చూడగలవు. మిగిలిన అవయవాలు ఆ పని చెయ్యలేవు కదా ! స్పర్శను చర్మము గ్రహిస్తుంది, చెవులు శబ్ధమును గ్రహిస్తాయి. ఏదైనా విషయం శకించడం మనసు ధర్మము. మిగిలిన ఏ అవయవములు ఈ పని చెయ్య లేవు. మంచి చెడు తెలుసుకోవడం జాగృతం చెయ్యడం బుద్ధి చేసే పని. ఆపనిని మిగిలిన అవయవములు చెయ్య లేవు.

ఇంద్రియములు మనసు

[మార్చు]

ఒకప్పుడు మనసుకు ఇంద్రియములకు వాగ్వివాదం జరిగింది. మనసుతో ఇంద్రియములు ఒకసారి ఇలా అన్నాయి. " ఓ మనసా ! మనస్సు ఇంద్రియములు ఒకటే కదా ! ఇందులో మనసు గొప్ప ఏమిటి ? " అని అడిగాయి. అప్పుడు మనసు ఇంద్రియములతో " ఇంద్రియములారా ! నేను సంకల్పించక ఉన్న మీరు ఏపని చెయ్య లేరు. నేను లేకపోతే కళ్ళు, ముక్కు, చెవులు, పని చెయ్య లేవు. నేను లేకున్న ఇంద్రియములు ఉన్నా లేకున్నా ఒకటే కనుక మీ కంటే నేనే గొప్ప " అన్నది. ఇంద్రియములు " మనసా ! అంతమాత్రం చేత నీవు గొప్పదానివి అయ్యావా ! మేము లేకుండా నీవు దేనినీ అనుభవించ లేవు. ముక్కు లేకుండా నీవు వాసన చూడలేవు, కళ్ళు లేకుండా నీవు రూపమును గ్రహించ లేవు. మాలో ఏ ఒక్కటి లేకున్నా నీవు ఏమీ చెయ్య లేవు. పోనీ ఒక దానితో మరొక్క దాని పని చేయించగలవా అంటే అదీ చెయ్యలేవు. కనుక మేమంతా ఉంటేనే నువ్వు అన్నీ అనుభవించగలవు. ఇందులో నీ గొప్పతనం ఏమిటి ? అదీ కాక మేము అనుభవించిన తరువాతే నువ్వు అనుభవిస్తున్నావు. అంతేకాదు నీవు ఏ కారణం చేత అయినా పని చేయ లేక పోతే నీవు మా లోని ప్రాణశక్తి వలననే నీవు తిరిగి పనిచెయ్యగలవు. మేము ఉంటేనే నీవు అనుభవించగలుగుతున్నావు. లేకున్న నీవు ఏమీ అనుభవించ లేవు. కనుక నీకు స్వతఃసిద్ధంగా ఏమీ అనుభవం లేదు కనుక మామీద అధారపడక తప్పదు. కనుక నువ్వు మేము కలిస్తేనే ఈ శరీరం సుఖములను అనుభవిస్తుంది. ఇందులో ఎవరి గొప్పతనం లేదు " అన్నాయి ఇంద్రియములు. ఆవాదనకు మనసు బదులు చెప్పలేక పోయింది " అని చెప్పాడు బ్రాహ్మణుడు భార్యతో.

పంచవాయువులు

[మార్చు]

బ్రాహ్మణుడు ఇంకా " వనితా ! నీకు మరొక విషయం చెప్తాను. ఒకసారి మానవుని శరీరంలో పనిచేస్తున్న ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులు తమలో ఎవరు గొప్ప అని బ్రహ్మదేవుడిని అడిగాయి. అందుకు బ్రహ్మదేవుడు నవ్వి " మీలో ఎవరు ఉన్నప్పుడు మిగిలిన వాయువులు పని చేస్తాయో ఎవరు లేకున్న మిగిలిన అవయవములు పని చెయ్యవో అదే మిగిలిన వాటి కంటే గొప్ప " అని చెప్పాడు. అప్పటికీ ఆ వాయవులు అక్కడ నుండి కదలక తాము గొప్ప అంటే తాము గొప్ప అని వాదించుకున్నాయి. బ్రహ్మదేవుడు నవ్వి " ఆ విషయం నాకు తెలియదా ! మీలో అందరూ విశేష ప్రవృత్తి కలవారే. మీలో ఎవరు లేకపోయినా మిగిలిన వారు తమ పని చెయ్య లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క సారి ఒక్కొక్క పని చేస్తాయి. ఎప్పుడు ఏ వాయువు పని చేస్తుందో అదే అప్పుడు గొప్పది. కనుక మీరంతా ఐకమత్యంతో పని చేసినప్పుడు అందరూ గొప్ప వారే. కనుక ఐకమత్యంతో అందరూ నడవండి " అని చెప్పాడు. ఆ మ్మాటలువిన్న వాయువులు మారుమాటాడ లేక అక్కడ నుండి వెళ్ళి పోయాయి. ఒకసారి దేవమతుడు నారదుడితో " మహర్షీ ! మానవుడి శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు ఉంటాయి కదా ! తల్లి గర్భంలో ఉన్న శిశువులో మొదటగా ఏ వాయువు పని చేయడం పెడ్తుతుంది తెలియజేయండి " అని అడిగాడు. నారదుడు " పురుషుడిలోని సమానవాయువు స్త్రీలోని వ్యానము అనే వాయువులు కలసి పని చేసినప్పుడే పిండం ఉత్పత్తి ఔతుంది. ఆ పిండములోకి ప్రాణ ఆపాన వాయువులు చేరినప్పుడు పిండం ఉఛ్వాస నిశ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది. ప్రాణవాయువు కిందకు ప్రసరిస్తుంది. ఆపానవాయువు కిందికి ప్రసరిస్తుంది. ఈ రెండు వాయువులతో అగ్ని చేరిన తరువాత ఉదాన, వ్యాన, సమాన వాయువులు ఉత్పన్న మౌతాయి. ఈ అయిదు వాయువులు శిశువు శరీరం అంతా ప్రసరిస్తాయి కనుక ఈ వాయువులలో అంతర్లీనంగా అగ్ని నిక్షిప్తమై ఉంటుంది. ఈ అగ్నిని ఉదానము అని కూడా అంటారు. ప్రాణ ఆపాన వాయువులనే ఉంది లేదు, రాత్రి పగలు, శుభము అశుభము, సత్యము అసత్యము మొదలగు ద్వందములు అని కూడా అంటారు. మనలో ఉన్న అగ్నితత్వము, వాయుతత్వము, శరీరతత్వము తెలిసిన నిపుణులు మాత్రమే గ్రహించగలరు " అని నారదుడు బ్రాహ్మణుడితో చెప్పాడు. వనితామణీ ! ఈ ప్రపంచంలో జరిగే పనులన్నింటికీ మూలము కర్త, కర్మ, కరణము. కరణము అంటే సాధనము. ముక్కు, చెవులు, నాలుక మొదలైన జ్ఞానేంద్రియములు కరణములు. వాసన చూడడం, రుచి చూడడం, తాకడం, ఆలోచించడం మొదలైన పనులు జీవుడు చేస్తాడు. వీటితో జీవుడు సుఖములు అనుభవిస్తాడు.

మోక్షమార్గము

[మార్చు]

బ్రాహ్మణుడు ఇంకా ఇలా చెప్పసాగాడు " లలనామణీ ! జీవుడు ఈ కర్మలన్నింటినీ వదిలిపెట్టి మోక్షమార్గమున కూడా పయనించగలడు. కారణము కర్మలను అనుభవించే భోక్త జీవుడు. జీవుడు ప్రాపంచిక విషయాలను వదిలి సకలవిషయాలను ఆత్మలో ఆహుతి చేసినప్పుడు విషయవాంఛలు భస్మమై అవిద్య నశిస్తుంది. జీవుడు అవిద్య అనే పొగ నుండి విముక్తుడై దేదీప్యమానంగా వెలుగుతాడు. అదే మోక్షం అందరూ దీనిని యోగయజ్ఞము అంటారు. దీనికి దక్షిణ కోరికలను విడిచిపెట్టడమే. అపుడు సర్వవ్యాపి అయిన భగవంతుడు ఆనందించి ఆ జీవుడికి మోక్షము ప్రసాదిస్తాడు. అలాకాక భోక్త అయిన జీవుడు ప్రాపంచిక సుఖముల అందు ఆసక్తుడై ప్రవర్తించిన బంధనములో చిక్కుకుని పతనమౌతాడు. లలనామణీ ! ప్రపంచమును శాశించు వాడు ఒక్కడే. నేను అతడి శాసనమును పాటిస్తాను. ఈ లోకముకు గురువు ఒక్కడే. అతడి బోధనలను నేను శిరసావహిస్తాను. శ్రోత ఒక్కడే అతడే నేను. నాకు శత్రువు వలన ఆపద వచ్చినప్పుడు నేను శత్రువుకు కూడా తలవంచుతాను. ఈ సంసారమును దాటే మార్గము పెద్దలవలన తెలుసుకుంటాను. ఒకసారి దేవతలు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి తమకందరికీ హితమైన మార్గము చెప్పమని అడిగారు. బ్రహ్మదేవుడు వారితో " అక్షరోపాససనే మీకు హితమైన మార్గం" అని చెప్పాడు. నేను కూడా ఆ మార్గమునే అవలంబిస్తున్నాను. కనుక లలనామణీ ! నేను ఈ సంసారం అనే అరణ్యమును దాటే ప్రయత్నములో కోపము అనే చీకటిని, లోభము అనే పామును, కామము అనే కోటను దాటి ప్రస్తుతం ఒక అడవిలో ఉన్నాను " అని అన్నాడు.

అడవి

[మార్చు]

బ్రాహ్మణి " నాధా ! అ అడవి ఎలా ఉంటుంది ? " అని అడిగింది. బ్రాహ్మణుడు " లలనామణీ ! ఆ అడవిలో చిన్నాపెద్ద తారతమ్యం లేదు. సుఖదుఃఖాలు అసలు లేవు. చింత భయమూ లేదు. అడవిలో ఉన్న చెట్లకు పంచరంగుల ఫలాలు ఉన్నాయి. అవి చాలా తియ్యగా ఉండి అడవిలోని అతిథులను ఆనందపరుస్తుటాయి. ఆ అడవికి సామాన్యులు రారు. మహర్షులు అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి వస్తారు. ఆ అడవికి యజమాని సూర్యుడు. ఆ అడవిలో బ్రహ్మసంభవమైన నీరు ప్రవహిస్తుంటుంది. ఆ అడవిలోని పర్వతముల మీద తపస్సు చేసిన ఋషులు ముక్తిని పొందుతుంటారు. ఆ అడవిలో ఉన్న ఋషులు శాంతులైన మహాప్రతిభావంతులు. వారు వైరాగ్యంతో బ్రహ్మానందస్తితిలో ఉంటారు. నేను కూడా ఆఅడవిలో ఉండే మునులవలె నిస్సంగత్యంతో ఉంటాను. నేను ప్రతిఫలం ఆశించి ఏ కర్మలు చెయ్యను కనుక నాకు కర్మ బంధములు అంటవు. రానున్నన్నది రాకమానదు, జరుగనున్నది జరుగకమానదు, ఆపదలను ఆపలేమని భావించి నేను వృధాప్రయాస వ్యర్ధమని భావించి నేను తామరాకుమీద నీటిబొట్టులా ఈ ప్రపంచంలో తిరుగుతుంటాను.

అధర్వుడు యాజకుడు

[మార్చు]

లలనామణీ ! నీకు అధర్వునికి యజ్ఞములు చేసే యాజకుడికి జరిగిన సంవాదం వివరిస్తాను. ఒకసారి ఒక యజ్ఞములో ఒక మేకను అలంకరించి దానిని బలి ఇవ్వడానికి సిద్దం చేసి దాని మీద నీళ్ళను చల్లుతున్న యాజకుడిని చూశీ ఒక యతి " అయ్యా ! ఇంతటి పవిత్ర యజ్ఞములో జీవహింస చేయడం తప్పు కాదా ! ? అని అడిగాడు. అప్పుడు ఆ యాజకుడు " అయ్యా ! మీరు వేదములు పఠించినట్లు లేదు. ఇది వేదములలో చెప్పిన విధి. ఈ మేక చనిపోయిన తరువాత స్వర్గసుఖములు అనుభవిస్తుంది. అప్పుడు ఆ యతి " మీరు చెప్పినట్లు ఈ మేక స్వర్గలోకం పోయినా ! ఈ మేకను బలి ఇచ్చినందుకు మీకు కలిగు ఫలం ఏమిటి ? " అని అడిగాడు. యాజకుడు " యజ్ఞములో జంతువును బలి ఇవ్వ వచ్చని వేదములు ఘోషిస్తున్నాయి. అందువలన యజ్ఞము చేసిన వారు యజ్ఞములు చేయిస్తున్న మేము స్వర్గముకు నిశ్చయముగా వెడతాము. ఇందులో తప్పేమిటి " అని అన్నాడు. యతి " మీరు చెప్పేది సరికాదు. వేదములలో జీవహింస తప్పని పదేపదే చెప్పారు " అన్నాడు. యాజకుడు " మీరు అలా చెప్తున్నారు కదా ! తమరు సమాధిలో ఉన్న సమయాన ఉఛ్వాస నిశ్వాసములను బంధించి శరీరములు హింస్తున్నారు కదా ! అది కూడా హింసే కదా ! " అప్పుడు యతి " నేను చేసేది తపస్సు నేను దానిలో పరిపక్వత పొందాను. జ్ఞానస్వరూపమైన అక్షరతత్వాన్ని తెలుసుకున్నాను. క్షరతత్వాన్ని నా జ్ఞానంతో వివేకంతో నశింపచేసాను. ఐహిక సుఖములను విడిచి మోక్షప్రాప్తి కొరకు నేను చేస్తున్న యాగమును హింస అనడం మూర్ఖత్వము కాక మరేమిటి ? " అని అడిగాడు. యాజకుడు " యతీంద్రా ! నాకు అదేమి తెలియదు. యజ్ఞములో బలి ఇవ్వమని వేదములు చెప్తున్నాయి. నేను యజ్ఞము చేస్తున్నాను. నేను వేదవిధిని నిర్వహిస్తున్నాను. ఈ యజ్ఞము చేసిన నాకు పాపము అంటదు. యజ్ఞమును చేసిన ఉత్తమగతులు పొందవచ్చన్నది మాత్రమే నాకు తెలిసిన విషయం " అన్నాడు. యతి " నీవు చేసే జీవహంసతో కూడిన యజ్ఞము కంటే నేను చేసే తపోయజ్ఞము గొప్పది అన్నాను కాని వేరేమి కాదు " అన్నాడు. యాజుకుడు ఆ మాటలకు అంగీకరించాడు.

కార్తవవీర్యార్జునుడు

[మార్చు]

బ్రాహ్మణుడు ఇలా కొనసాగించాడు " పూర్వము కార్తవీర్యార్జునుడు అనే రాజు పరశురాముడు అనే బ్రాహ్మణుడికి తీరని అపకారము చేసాడు. దానికి ప్రతీకారంగా పరశురాముడు కార్తవీర్యార్జునుడి చేతులు నరికివేసి అతడిని దారుణంగా చంపి వేసాడు. ఆ పగతో కార్తవీరార్జునుడి కుమారులు పరశురాముడు ఇంట్లో లేని సమయము చూసి అతడి తండ్రి జమదగ్నిని చంపారు. దానితో ఆగ్రహోదగ్నుడైన పరశురాముడు కార్తవీర్యార్జునుడి కుమారులందరిని చంపాడు. వారినే కాక క్షత్రియుల మీద 21 సార్లు దండెత్తి సమూలంగా నాశనంచేసాడు. అప్పటికి కాని అతడి పగ చల్లార లేదు. అప్పుడు అతడి పితృదేవతలు ప్రత్యక్షమై పరశురాముడితో " పరశురామా ! బ్రాహ్మణుడివి అయిన నీవిలా చేయడం తప్పు కాదా !" అని అడిగారు . అప్పుడు పరశురాముడు " పితృదేవతలారా ! నేను చేసేది మహాయజ్ఞము యజ్ఞములో ఈ క్షత్రియులందరూ బలి పశువులు. యజ్ఞములో బలి ఇవ్వడం వేదధర్మము. నేను వేదధర్మాన్ని పాటిస్తున్నాను. మీరు నాకు అడ్డు రాకండి " అన్నాడు పరశురాముడు. పితృదేవతలు తిరిగి " పరశురామా ! యజ్ఞములో తపోయజ్ఞమే శ్రేష్టమైనది. నీవు కూడా తపోయజ్ఞము చేసి శాంతివహించు. భగవంతుడు నిన్ను కరుణిస్తాడు. అసలు మనము కరుణించ వలసినది బాహ్యశత్రువులను కాదు అంతఃశత్రువులను. ఆయుధములు అంతఃశత్రువులను జయించలేవు. తపస్సు ఒక్కటే అంతఃశత్రువులను జయించగలదు. కనుక నీవు కూడా అంతఃశత్రువులను జయించి ఆత్మసుఖం అనుభవించు " అని చెప్పారు. పరశురాముడు పితృదేవతల మాటలు మన్నించి హింసవదిలి తపోమార్గము అవలంబించాడు.

అంబరీషుడు

[మార్చు]

వనితామణీ ! నీకు నవగుణములు గురించి వివరిస్తాను. వాటిలో స్తంభము, అభిమానము, హర్షము అనునవి సత్వగుణ ప్రధానము. శోకము, సంరంభం, శోకము, రజోగుణ ప్రధానములు. మోహము, నిద్ర, స్వప్నము ఇవి తమోగుణ ప్రధానములు. వీటిని తగు అస్త్రములు ప్రయోగించి వధించాలి. అంత కంటే ముందు ఇంద్రియములను జయించాలి. తరువాత మోక్షమార్గములో పయనించాలి. మోక్షమార్గమును అడ్డగించే ప్రధాన శత్రువుల గురించి తెలుసుకోవడానికి నీకు అంబరీషుడి కథ చెప్తాను. పూర్వము అంబరీషుడు అనే రాజు ఉండే వాడు. అతడు రాజనీతిలో గొప్ప వాడు. శత్రువులను జయించి ప్రజలను కన్న బిడ్డలవలె పాలిస్తున్నాడు. ఒకరోజు అంబరిషుడు తన ఆస్థాన పండితులను చూసి " పండితులారా ! నేను శత్రువులందరినీ జయించాను కాని అది ఒక జయము అనిపించుకోదు. ఎందుకంటే నన్ను ఇంకా అరిష్డ్వర్గాలు, రోగములు, మృత్యువు మొదలైన అంతఃశత్రువులు వేధిస్తున్నాయి. వాటిని గెలువకనే నాకు సంపూర్ణ విజయం ఎలా లభిస్తుంది " అని చెప్పి అంబరీషుడు అప్పటి నుండి అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నము కొనసాగించాడు. ఆ తరువాత అంబరీషుడు శాంతితో రాజ్యపాలన సాగించసాగాడు. కనుక తరుణీ ! ముక్తిని పొందాలంటే అరిష్డ్వర్గాలను జయించడం ముఖ్యము.

జనకుడు బ్రాహ్మణుడు

[మార్చు]

బ్రాహ్మణూడు తన భార్యతో ఇంకా ఇలా చెప్పాడు. " ఒక సారి ఒక బ్రాహ్మణుడు జనకమహారాజు రాజ్యంలో ఒక అనుచితమైన పని చేసాడు. దాని ఫలితంగా రాజు అతడిని తన రాజ్యం నుండి బహిష్కరించాడు. అప్పుడు అతడు జనకమహారాజుతో " రాజా ! నన్ను రాజ్యము నుండి వెళ్ళమని చెప్పావు కదా ! నీ రాజ్యము ఎంత విస్తరించి ఉందో చెప్పు నేను దాని వెలుపలికి వెడతాను " జనకుడు ఆ మాటకు జవాబు చెప్పక కొంత సమయము మౌనంవహించి " అయ్యా ! ఈ రాజ్యము నాది కాదు. నాకిది నా తాత ముత్తాతల నుండి సంక్రమించింది. నాది కాని రాజ్యమును నాదని నేను ఎలా చెప్పగలను ? " అన్నడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు " అదేమిటి మహారాజా ! ఈ రాజ్యము నీది. నువ్వు దీనికి రాజువు. ఏదీ నీది కాదని అనుకుంటూ ఈ రాజ్యపాలన సాగిస్తున్న రహస్యము తెలుసుకోవాలని ఉంది " అని అడిగాడు. జనకమహారాజు " బ్రాహ్మణోత్తమా ! నే పుట్టక ముందే ఈ రాజ్యము రాజ్యాధికారము ఉన్నాయి. నేను పోయిన తరువాత కూడా అవి అలాగే ఉంటాయి. కనుక వాటిని నావి అని ఎలా చెప్పగలను. నేను ఈ రాజ్యము నేను అనుభవిస్తున్నా ఇది నాది కాదని భావిస్తూ రాజ్యపాలన సాగిస్తున్నాను " అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు నవ్వుతూ " జనక మహారాజా ! నేను యమధర్మరాజును నిన్ను పరీక్షించడానికి వచ్చాను. నీవు నిష్కామకర్మ యోగివి, జ్ఞానివి నీ మనస్సు సదా శాంతితో వర్ధిల్లుగాక " అని ఆశీర్వదించి యమధర్మరాజు వెళ్ళి పోయాడు.

బ్రాహ్మణుడి వైరాగ్యము

[మార్చు]

తిరిగి తన భార్యతో బ్రాహ్మణుడు " వనితామణీ ! నేను వైరాగ్యంతో ఇల్లు విడిచి పోవాలని సంకల్పించగా నా మనసు గ్రహించిన నీవు నన్ను వైరాగ్యము నుండి మరలచడనికి ఆత్మబోధ చెయ్యమని అడిగావు. నీ మనసుగ్రహించి కూడా నేను ఏమీ ఎరుగనట్లు ఆత్మబోధ చేసాను. నేనిక బ్రహ్మచర్యము అవలంబిస్తాను. ఇక ఎంత మాత్రం ఈ సంసారములో ఉండ లేను. నేను జీవన్ముక్తుడను అయ్యాను. కాని నువ్వు మాత్రం నన్ను సామాన్యుడిగా చూస్తున్నావు. నేను ఎంతోసాధన చేసి యోగిని అయ్యాను. ఇక నేను ఈ ఇంటికి పరిమితం కాలేను. ఈ ప్రపంచం అంతా నాది. నేను అంతటా నిండి ఉన్నాను. స్వార్గిధిపత్యమూ నాకిక అవసరం లేదు. ఈ వైరాగ్యమే నాకిక సర్వ సంపదలతో సమానము. అన్ని కొయ్యలలో అగ్ని ఉన్నట్లు ఈ చరాచరజగత్తు అంతా భగవంతుడు నిండి ఉన్నాడు. నదులన్నీ సముద్రంలో కలిసిన విధంగా అందరూ భగవంతుడిని చేరుకుంటారు. ఈ శరీరంతో భగవంతుడిని చేరుకుంటాము. ఈ శరీరంతో చేసే కర్మలన్నింటికీ మొదలు అంతం ఉంటాయి. అవి మానవుని బంధనంలో ఇరికిస్తాయి. నేనిప్పుడు కర్మబంధ విముక్తుడనైయ్యాను . నాకిక మృత్యుభయం లేదు కనుక నన్ను ఇప్పుడు అడ్డుపెట్టక నువ్వు కూడా నా మార్గములో పయనించి మోక్షమును పొందు " అని చెప్పాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణి " నాధా ! సామాన్యులకు అర్ధము కాని గుహ్యమైన రహస్యాలను ఒక వేళ అర్ధము అయినా గుర్తు ఉండని రహస్యాలను మీరు నాకు బోధించారు. నేను కృతార్ధురాలను అయ్యాను " అన్నది. బ్రాహ్మణుడు " లలనామణీ ! బ్రాహ్మణుడు అరణి అయితే గురువు ఉత్తర అరణి రెండూ కలిసినప్పుడే జ్ఞానాగ్ని పుడుతుంది " అని అన్నాడు. బ్రాహ్మణుడు అరణి అని గురువు ఉత్తర అరణి అని తెలుసుకున్న బ్రాహ్మణి తన భర్తను ఇలా అడిగింది " నాధా ! అటువంటి బ్రాహ్మణుడిని కకుక్కునేది ఎలా ? " అని అడిగింది. బ్రాహ్మణుడు " వనితామణీ ! అటువంటి బ్రాహ్మణోత్తముడిని తెలుసుకోవడానికి ఎలాంటి సాధనము లేదు. అతడి లక్షణములు ఇంద్రియములకు గోచరించవు. అతడు గుణాతీతుడు, సుద్ధసత్వగుణ సంపన్నుడు, అహంకారం లేని వాడు " అని చెప్పాడు. భర్తబోధనల వలన జ్ఞానము కలిగిన బ్రాహ్మణి భర్త అడుగు జాడలలో నడచి ముక్తిని పొందింది " అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.

బ్రహ్మము

[మార్చు]

అర్జునుడు " శ్రీకృష్ణా ! భార్యా భర్తలు అయిన ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణి అంత గొప్పవారా ! వారిని గురించి ఇంకా వినాలన్న కుతూహలం కలుగుతుంది. వివరించండి " అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు నవ్వి " అర్జునా ! నా మనసే బ్రాహ్మణుడు నా బుద్ధి బ్రాహ్మాణి. ఇంద్రియాతాతీతమైన ఆ పరమాత్మను నేనే " అని అర్జునుడితో చెప్పాడు. అది విన్న అర్జునుడు శ్రీకృష్ణుడితో " శ్రీకృష్ణా ! నీ బోధనల వలన నా మనసు సూక్ష్మగ్రాహి, వివేకవంతం అయినది. కనుక నాకు బ్రహ్మము గురించి తెలుసుకోవాలని ఉన్నది తెలియజేయవా " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " అర్జునా ! నీ ప్రశ్నకు బదులుగా గురుశిష్య సంవాదం చెప్తాను. నీవు అడిగినట్లే ఒక శిష్యుడు తన గురువును అడిగాడు. అప్పుడు ఆ గురువు బృహస్పతి, భరద్వాజుడు, గౌతముడు, భార్గవుడు, కశ్యపుడు, వశిష్ఠుడు, అత్రి, విశ్వామిత్రుడు మొదలైన మహామునులను తోడు తీసుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి నమస్కరించి " దేవ ! హితము అనగా ఏమి ? హితము పొందుటకు సులభమైన మార్గము ఏది ? " అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు " ఈ చరాచరజగత్తు సత్వగుణంలోనే జన్మిస్తాయి. కొంత కాలము ఆ సత్వగుణములో సంచరించిన తరువాత రజోగుణము తమోగుణము జీవుడిని ఆశ్రయిస్తాయి. ముందుగా సత్వగుణము గురించి వివరిస్తాను. సత్వగుణము మహిమాన్వితమైన గుణము కనుక యోగులందరూ సత్వగుణమును ఆశ్రయించి కామమును క్రోధమును పూర్తిగా వదిలివేస్తారు. ఆ సత్వగుణమును అనుసరించుటకు తగిన మార్గము చెప్తాను. ధర్మమునకు నాలుగు ఆశ్రయములు నాలుగు కాళ్ళ వంటివి. ఈ ధర్మము అన్ని వర్గముల చేత అనుష్టించచబడుతుంది. ఉత్తమ ధర్మమైనదానిని అనుసరించి జీవులు ముక్తిపొంద వచ్చు. పైన చెప్పిన నాలుగు ఆశ్రమాలలో ఆత్మసాక్షాత్కారం పొందని వారు మోక్షమును పొందలేరు. అది అన్ని వర్గాల వారికి సమానము. మరుత్తులు, ఆదిత్యులు, దేవతలు ఎవరైనా మోక్షము పొందాలంటే ఆత్మదర్శనమే సులభమైన మార్గము. ఆధ్యాత్మదర్శనం అంటే 24 తత్వము గురించి తెలుసుకోవడమే. వాటిని గురించి వివరిస్తాను. భూమి మొదలైన పంచభూతములు అయిదు. వాటి తన్మాత్రలైన రూప, రస, గంధాదులు అయిదు. ఇంద్రియములు 10. మనసు బుద్ధి అహంకారం 3. ప్రకృతి 1. అన్నీ కలిపి 24 తత్వములు. జీవుడు అహంకారము వదిలి జననమరణ రహస్యం తెలుసుకుని 24 తత్వముల నిజరూపము తెలుసుకుని అజ్ఞానము వదిలి జ్ఞానము సముపార్జిస్తాడో అప్పుడు అతడు సంసార బంధముల నుండి విడివడి మోక్షమార్గము వైపు పయనిస్తాడు.

త్రిగుణములు

[మార్చు]

మానవ దేహానికి నవరంద్రాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిరంధ్రముల ద్వారా మనసు సత్వ, రజో, తమో, గుణాల ప్రభావంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలను పెట్టుకుంటుంది. అందుకే ఈ దేహము వ్యక్తము. దానిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మ అవ్యక్తము. కనుక వ్యక్తమైన దేహము మీద భ్రాంతిని వదిలి అవ్యక్తమైన పరమాత్మ దర్శనానికి ప్రయత్నించాలి. కాని అది చాలా కష్టసాధ్యము. ఇంద్రియములను, మనసును, త్రిగుణములను జయించిన వాడే మోక్షమార్గమున పయనించగలడు. పైన చెప్పిన త్రిగుణాలు ఒక దానితో ఒకటి కలసి పనిచేస్తాయి. ఒకదానికి ఒకటి ఆసరాగా ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి వస్తాయి. ఒక దానికి మరొకటి సహకరించుకుంటాయి. కనుక సత్వరజోతమో గుణములను గుర్తించి వాటిని నివారించడంసాధ్యం. ఒక దానిని నిరోధిస్తే మరొకటి విజృభిస్తుంది. లోభము, శోకము, భ్రాంతి, నిద్ర, భయము, వికారము, దురభిమానము, వికారము, మంకుతనము, పాపకార్యములందు ఆసక్తి, అధిక కోపము, ఇతరులను మోసగించడం, అసూయ, ద్వేషం ఇవి తమోగుణ ప్రధానము. ఈ జన్మలో పాములు, తేళ్ళు, పశువులుగా, పందులుగా, కుక్కలుగా, చేపలుగా, కోళ్ళగా, కాకులుగా, క్రిములుగా, చీమలుగా, దోమలుగా, నక్కలుగా, గుంటనక్కలుగా, జింకలుగా, చెట్లుగా జీవనం గడుపుతుంది గత జన్మలో తమోగుణముతో జీవితం గడిపిన వారే. ఈ విషయమును గమనించిన వారు తామసగుణము నుండి బయట పడి అధోగతి నుండి తప్పించుకుంటారు.

రజోగుణము

[మార్చు]

ఇక రజోగుణము గురించి చెప్తాను. బలము, శౌర్యము, మదము, ప్రాభవము, సుఖము, దు॰ఖము, స్నేహం చెయ్యడము, మిక్కుటమైన కోరికలు, కాంక్షలు, ఏదీ నచ్చక పోవడం, ప్రతాపము, ఇతరులతో పోట్లాడడమూ, ఈర్ష్య, పరుషభాషణ, తిట్టడం, కామప్రవృత్తి, దాని గురించి అబద్ధాలు చెప్పడం, తన గురించి తాను గొప్పలు చెప్పడం, పొగడ్తల అందు ఆసక్తి ఇవి రజో గుణ ప్రధానుల లక్షణము. రజోగుణ ప్రధానులు నీతి అవినీతి తేడా గ్రహించి ధనము సంపాదించి వాటితో కోరికలు తీర్చుకుంటూ కేవలం ప్రాపంచక విషయముల అందు ఆసక్తులై సుఖజీవనము సాగిస్తూ ఉంటారు. ఇవి రజోగుణ లక్షణములని గ్రహించిన వారు రజోగుణమును విడిచి సత్వగుణమువంక పయనిస్తారు.

సత్వగుణము

[మార్చు]

ఇక సత్వగుణము గురించి వివరిస్తాను. సంతోషము, ప్రకాశము, ప్రియభాషణ, ఆనందము, కరుణ, క్షమాగుణము, సత్యము, శౌచము, ధైర్యము, లోభము లేక ఉండడం, ఓర్పు వహించుట, సత్ప్రవర్తన, అసూయ లేకుండుట, అహింస పాటించుట, ఇతరుల ఎడ కోపము ప్రదర్శించ పోవడము, అన్నింటికి హడవిడి చెయ్యక పోవడము, అందరి ఎడల సమభావము కలిగి ఉండడము, దయ, శ్రద్ధ కలిగి ఉండడము, ఇతరులను గౌరవించడం, క్రూరత్వము విడిచి పెట్టడము ఇవి సత్వగుణ ప్రధానములు. సత్వగుణ ప్రధానులు అహంకారము, కామాతురత, అత్యాశ, మమకారము లేని వారై సదా దైవచింతనలో ఉంటారు. ఈ గుణముల జ్ఞానము ఎరిగిన వాడు వాటి అందు చిక్కడు. ఈ మూడు గుణములు వేరుగా ఉండవు. ఒక దానివెంట ఒకటి ఉంటాయి. ఈ మూడు గుణములలో ఒకటి ప్రకోపించినప్పుడు మరొకటి దానివెంట ఉండి మరొక గుణమును లేకుండా చేస్తుంది. తమస్సు అధోముఖంగా ప్రవహిస్తుంది. రజస్సు మధ్యస్థంగా ఉండి సత్వగుణము ఊర్ధ్వముఖంగా ప్రవహిస్తుంది. ఈ మూడు గుణముల ప్రభావము నుండి బయట పడాలంటే వీటిని నిసర్జించడమే మార్గము. అలా కాక ఈ మూడు గుణములకు లోనైన వారిలో సాత్వికులు స్వర్గలోకముకు పోతారు. రజోగుణప్రధానులు భూలోకములో జన్మిస్తారు. తమోగుణ ప్రధానులు జంతుజన్మలు ఎత్తి నరక బాధలు అనుభవిస్తారు. మానవులు సత్వరజతమోగుణ ప్రభావితులై ధర్మార్ధకామములతో కూడిన కర్మలు చేస్తూ ఉంటారు. కనుక మానవులు త్రిగుణాలను వదిలి నిర్గుణులై ప్రవర్తించాలి.

మన శరీరములో ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువులు ఉన్నాయి. వాటిలో ప్రాణము సత్వగుణము, అపానము రజోగుణము, ఉదానము తమోగుణము. ఈ మూడింటిలో సాత్వికము ఉత్తమమైన గుణము. ఈ మూడు గుణములు సమానంగా ఉండడమే అవ్యక్తము. అదే మహత్తత్వము శాశ్వతమైన బ్రహ్మపదము. ఈ అవ్యక్తము సత్తు, అసత్తులకు అతీతమైనది. ఈ అవ్యక్తము నుండి తెలుసుకున్న వాడు విజ్ఞానవంతుడై మోక్షాపదవిని పొందగలడు " అని బ్రహ్మదేవుడు మునులతో చెప్పాడు. బ్రహ్మదేవుడు ఋషులతో ఇంకా ఇలా చెప్పాడు. " ఋషులారా ! అవ్యక్తము నుండి మహాతత్వము పుడుతుంది. ఆమహతత్వమును బుద్ధి ధృతి అంటారు. ఈ బుద్ధితో మానవుడు బయట ప్రపంచంలో జరిగేవన్నీ గ్రహించగలుగుతాడు. కనుక బుద్ధికి ప్రపంచంలో ఉన్నత స్థానం ఉంది. ఈ బుద్ధి నుండి అహంకారం పుడుతుంది. ఈ లోకములో ఇన్ని పనులు జరగడానికి కారణం ఈ అహంకారమే. ఈ అహంకారమే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వేదాధ్యయనం, వ్రతములు, తపస్సు, యజ్ఞములు చేస్తున్నారు. ఈ అహంకారతత్వ మహిమ వల్లనే ఈ ప్రపంచంలో సకలకార్యములు జరుగుతున్నాయి. ఈ అహంకారతత్వము నుండి పంచభూతములు పంచభూతముల నుండి తన్మాత్రలు ఆవిర్భవించాయి. ఈ తన్మాత్రలను పొందడానికే మానవులు తాపత్రయ పడుతూ విషయవాంఛలలో తేలియాడుతుంటారు. సకల జీవులూ ఈ మోహాంధకారంలో మునిగి పోతూ ఎన్నటికి బయట పడలేవు. కాని జ్ఞానులు మాత్రము జ్ఞానమనే ఆయుధముతో నిష్కామకర్మలు ఆచరిస్తూ ఈ మోహాంధకారమును చేధించి బ్రహ్మపదమును పొందగలరు.

తత్వములు

[మార్చు]

ఈ ప్రాపంచక సుఖములు అశాశ్వతము. సుఖంవెంట దుఃఖము. దుఃఖమువెంట సుఖము వస్తూ ఉంటాయి. ఈ విషయ సుఖములే అన్ని వికారములకు మూల కారణము. విషయసుఖముల మీద మోహము లోభాన్ని కలుగజేస్తుంది. ఆ లోభానికి ప్రభావితుడైన మనిషి బుద్ధిని కోల్పోయి దురాలోచనలు చేసి పాపాలు చేస్తాడు. మానవశరీరము రక్తము, మాంసము, ఎముకలతో చేయబడింది. కాలము తిరగానే ఈ శరీరము కరిగిపోతుంది. కాని మానవులు ఈ శరీరము శాశ్వతమని నమ్మి అనేక పాపాలుచేసి నశిస్తారు. మానవులలోని పంచప్రాణములు బుద్ధి, వాక్కు, మనసు ఈ ఎనిమిదిని అంతరాత్మ అంటారు. లోకములో జరిగే సమస్తకార్యములకు ఈ ఎనిమిది తత్వములే కారణము. కుండచేయడానికి మట్టి ఎంత అవసరమో ప్రపంచంలోని సకలకార్యాలకు ఈ ఎనిమిది తత్వములే కారణము. పెద్దలుచేసే జ్ఞానబోధ నుండి ఈ విషయములను గ్రహించాలి. అహంకారం నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు కలిపి పదకొండు తత్వములు ఏర్పడతాయి. వీటివలన ప్రభావితము కాకుండా బుద్ధి స్వతంత్రముగా ప్రవర్తిస్తుంది. ఆ బుద్ధిని వాడుకున్న వాడు ఆత్మజ్ఞానము పొందగలడు.

ఆధ్యాత్మతత్వము

[మార్చు]

బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెప్పాడు " ఋషులారా ! ఇప్పటి వరకు ప్రాణులగురించి చెప్పాను. ఇప్పుడు ఆధ్యాత్మతత్వము గురించి చెప్తాను. పంచభూతములు ఐదు. అవి భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము. ఈ ప్రకృతిలో మూడుతత్వములు ఉన్నాయి. అవి ఆధ్యాత్మము, అధిదైవతము, అధిభూతము. చెవి ఆధ్యాత్మము అయితే శబ్ధము అధిభూతము. ఆ శబ్ధము వచ్చు దిక్కు అధిదైవతము. చర్మము అధ్యాత్మము అయితే స్పర్శ అధిభూతము. ఆ స్పర్శ నుండి పుట్టే విద్యుత్తు అధిదైవతము. నాలుక అధ్యాత్మము అయితే రుచి అధిభూతము. చంద్రుడు అధిదైవతము. ముక్కు అధ్యాత్మము అయితే వాసన అధిభూతము. వాయువు అధిదైవతము. ఇక కర్మేంద్రియాల గురించి చెప్తాను. వాక్కు ఆధ్యాత్మము అయితే మాట అధిభూతము, అగ్ని అధిదైవతమ. చేతులు ఆధ్యాత్మము అయితే పని చేయడము అధిభూతము, వాటికి దేవేంద్రుడు అధిదైవతము. పాదములు అధ్యాత్మము అయితే నడవడము అధిభూతము. భభ్రువు అధిదైవతము. విసర్జకావయవము అధ్యాత్మము అయితే విసర్జము అధిభూతము. మిత్రుడు అధిదైవతము. జ్ఞానేంద్రియములు అధ్యాత్మము అయితే శుక్రము అధిభూతము. ప్రజాపతి అధిదైవతము. మనసు ఆధ్యాత్మము అయితే ఆలోచన అధిభూతము. చంద్రుడు అధిదైవతము. బుద్ధి అధ్యాత్మము అయితే విషయ పరిజ్ఞానము అధిభూతము, బ్రహ్మ అధిదైవతము. ఈ విషయ పరిజ్ఞానము కలిగిన మానవుడు వీటి మోహములో పడకుండా మోక్షప్రాప్తిని పొందుతాడు.

నివృత్తి మార్గము

[మార్చు]

బ్రహ్మదేవుడు ఋషులతో " ఋషులారా ! ఇప్పుడు మీకు నివృత్తిమార్గము చెప్తాను. తాబేలు తన అవయవాలను డిప్పలోకి ఎలా లోపలికి తీసుకుంటుందో అలాగే విద్వాంసుడు బయటప్రపంచంలోని కోరికలనుండి తన అవయవములను మనసు లోనికి తీసుకుని మనసును ఆత్మవంక మరలిస్తాడు. అడ్డూఆపు లేకుండా విజృంభించే కోరికలను ఎవరు అదుపు చేయగలడో అతడే ధీరుడు. అతడు సత్వరజతమో గుణాలను విడనాడి మొక్షమార్గమున పయనిస్తాడు. ఇంద్రియనిగ్రహము చాలా కష్టమైన పని. ఈ ఇంద్రియములకు అతీతంగా ఆత్మవెలుగుతూ ఉంటుంది. ఆత్మను దర్శించిన వాడే మోక్షముకు అర్హుడు. పంచభూత నిర్మితమైన ఈ శరీరంతో సంసారసాగరాన్ని దాటడము కష్టసాధ్యము. ఎందుకంటే సంసారంలో ఇంద్రియ సుఖాలు, దుఃఖాలు, రోగాలు వస్తూపోతూ ఉంటాయి. ఈ సంసారానికి కామము క్రోధము అధిపతులు. కనుక మానవుడు ముందుగా కామమును, క్రోధమును జయించాలి. అప్పుడే సంసారసాగరాన్ని సులభంగా దాటగలడు. ఒక దీపము అనేక దీపాలను వెలిగించినట్లు ఒక్క పరమాత్మ అనేక ఆత్మలుగా వెలుగొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకుని అన్ని భూతములలో పరమాత్మను దర్శిస్తారు. పామరులు ఈ విషయాన్ని ఎరుగక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పరమాత్మకు అనిలిడు, అగ్ని, సోముడు, విష్ణువు, అజుడు, శివుడు అనే పేర్లు ఉన్నాయి. ధర్మము లక్షణము అహింసావ్రతము. అధర్మము లక్షణము హింస. మనుష్యుల లక్షణము కర్మలు చెయ్యడం. ఆకాశం లక్షణం శబ్దం, వాయువు లక్షణం స్పర్శ, జ్యోతి లక్షణం వెలుగు రూపము, నీటి లక్షణం, భూమిలక్షణం వాసన, విద్యకు లక్షణం సత్యం పలకడం, మనసు లక్షణం ఆలోచన చింత, బుద్ధి లక్షణం విచక్షణ, మహత్తు లక్షణం ధ్యానం చెయ్యడం, ఆవ్యక్తం లక్షణం ధ్యానం చెయ్యడం, సాధుస్వభావం, యోగము లక్షణం ప్రవృత్తి, జ్ఞాని లక్షణం కర్మబంధములు విడుచుట. జ్ఞానంతో కూడిన సన్యాసం మోక్షము కలిగిస్తుంది. ద్వందములకు అతీతమైన యోగిని రోగములు, మృత్యువు బాధించవు. ఈ ప్రకృతి అవ్యక్తము. దీనిని క్షేత్రము అంటారు. ఈ ప్రకృతి సత్వరజోతమో గుణముల నుండి పుట్టింది. అన్నీ తెలిసిన మనలో ఉన్న అంతరాత్మయే పురుషుడు. అతడికి అంతా తెలిసినా గుణాతీతుడైన అతడు స్థిరంగా ఉంటాడు. అతడు దేనికీ ప్రభావితుడు కాడు. జీవాత్మ ప్రకృతి నుండి విడిపడి పరమాత్మ వంక పయనించిన నాడు ముక్తి పొందగలడు.

శ్రేష్టమైనవి

[మార్చు]

జ్యోతిస్సులలో సూర్యుడు, పంచభూతములలో అగ్ని, విద్యలలో సావిత్రీదేవి, దేవతలలో ప్రజాపతి, వేదములలో ఓంకారం పక్షులలో డేగ, యజ్ఞవిధానములో హవిస్సు, పర్వతాలలో మేరుపర్వతము, వృక్షములలో జువ్వి, దిక్కులలో ఊర్ధ్వము, నదులలో గంగానది, సరస్సులలో సముద్రము, నాలుగు ఆశ్రమములలో గృహస్థాశ్రమము, ప్రజాపతులలో నేను, తత్వములలో విష్ణుతత్వము, దేవతలలో ఈశ్వరుడు శ్రేష్టము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేరుగా పిలువబడినా ముగ్గిరిలో ఉన్న పరమాత్మతత్వము ఒక్కటే. ఈ ఏకత్వాన్ని గుర్తించడమే బ్రహ్మజ్ఞానము. రాత్రి పగలు ఒకదాని వెంట ఒకటి ఎలా వస్తాయో కష్టం వెంట సుఖం, సుఖం వెంట కష్టం వస్తాయి పోతాయి. సుఖములు వచ్చినప్పుడు పొంగి పోవడము కష్టం వచ్చినప్పుడు కుంగి పోవడంతగదు. ప్రపంచంలో పుట్టిన ప్రతివస్తువు పెరగడనమూ తరగడమూ జరుగుతూ ఉండడం సహజము. పుట్టినవస్తువు మరణించుట సహజం. సుఖాలన్నీ దుఃఖానికి బాట వేస్తాయి. విజ్ఞులు ఈ విషయము తెలుసుకుని అన్నింటి అందు సమదృష్టితో ప్రవర్తిస్తారు.

ఆశ్రయములు

[మార్చు]

బ్రహ్మదేవుడు ఋషులకు గృహస్థాశ్రమధర్మముల గురించి ఇలా చెప్పసాగాడు " ఆశ్రమములలో బ్రహ్మచర్యము మొదటిది. బ్రహ్మచారి గురువుకు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం చెయ్యాలి. ప్రతిరోజు భిక్షాటనచేస్తూ ఆహారము సేకరించాలి. బిల్వవృక్షము నుండి సేకరించిన దండమును ధరించాలి. శుచిగా, శుభ్రముగా ఉండాలి. బ్రహ్మచర్యము పాటించాలి. ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. యజ్ఞోపవీతము ను ధరించాలి. మొలనూలు ధరించాలి. మితభాషణ చెయ్యాలి. ఒద్దికగానూ నియమంగానూ ప్రవర్తించాలి. సత్యముపలకాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. రెండు వేళలా అగ్నికార్యము నిర్వహించాలి. పాపకార్యముల జోలికి వెళ్ళకుండా ఉండాలి. ఇవి బ్రహ్మచారి ఆచరించ వలసిన విధానములు. గృహస్థు బయట ప్రపంచంలో తిరిగే సమయంలో ధర్మము, న్యాయము పాటిస్తూ ఆ విధంగానే నడవాలి. పరస్త్రీవంక కన్నెత్తి చూడకూడదు. నిర్మలమైన జీవితంగడపాలి. పంచయజ్ఞములు పాటించాలి. అతిథులను ఆదరించాలి. అతిథులకు పెట్టి తానుభుజించాలి. తెల్లని వస్త్రములను ధరించాలి. శక్తికొద్దీ దానములు చెయ్యాలి. ఇంద్రియ నిగ్రహము పాటించాలి. సదా శుచిగా ఉండాలి. అందరితో మైత్రివహించాలి. క్షమాగుణము కలిగి ఉండాలి. వేదాధ్యయనము, యజ్ఞయాగములు చెయ్యాలి. సత్పురుషులు ఇచ్చే దానములు స్వీకరించాలి. నిష్పక్షపాత బుద్ధి కలిగి ఉండాలి. పాపకార్యములకు దూరంగా ఉండాలి. ఇవీ గృహస్థాశ్రమ ధర్మాలు. తరువాత ఆశ్రమము వానప్రస్థము. వానప్రస్థులు జనపదములను వదిలి వెళ్ళాలి. అరణ్యములో కుటీరములు నిర్మించుకుని జీవించాలి. రెండు పూటలా స్నానం ఆచరించాలి. సంధ్యావందనం చెయ్యాలి. బ్రహ్మచర్యము పాటించాలి. అరణ్యములో లభించే ధాన్యము, పండ్లు, కాయలు, ఆకులు, దుంపలు ఆహారం స్వీకరించాలి. నార వస్త్రాలను, చర్మములను ధరించాలి. భూశయనం చెయ్యాలి. అతిథులను సత్కరించాలి. వేదాధ్యయనం అగ్ని హోత్రము ప్రతి నిత్యము చెయ్యాలి. ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. ఇవి వానప్రస్థులు ఆచరించ వలసిన ధర్మములు. సన్యాసాశ్రమ ధర్మాలను వివరిస్తాను. సన్యాసి సకల ప్రాణుల ఎడ దయకలిగి ఉండాలి. అహింసను పాటించాలి. గతించిన విషయానికి విచారించ కూడదు. జరగనున్న వాటిని గురించి ఆసక్తి కనబరచగూడదు. జరుగుతున్న దానిని గురించి మాత్రమే ఆలోచిస్తూ జీవిక సాగించాలి. తాబేలు తన అవయవములను డిప్పలోకి లాగినట్లు సన్యాసి బాహ్యవిషయాలను లోనికి లాగివేసి నిరాసక్తత కలిగి ఉండాలి. కేవలం భిక్షాటనచేసి జీవించాలి. రేపటికి తన కొరకు ఏమీ దాచుకొనకూడదు, కూడబెట్ట కూడదు. రోజుకు ఒక రోజు మాత్రమే భుజించాలి. ఇతరుల నుండి ఆహారము వస్త్రములను తప్ప వేరేమి గ్రహించకూడదు. స్నేహము, ప్రశంశలకు, కోపతాపములకు లొంగకూడదు. అసూయ కోపము ఉండ కూడదు. ఇంద్రియములను మనసును నిగ్రహించుకోవాలి. బ్రహ్మచర్యము పాటించాలి. క్రమజీవితము పాటించాలి. సత్యము, అహింస పాటించాలి. ఇవి సన్యాసి ఆచరించ వలసిన ధర్మమ్ములు.

సన్యాసి ఉండవలసిన ప్రదేశములు

[మార్చు]

బ్రహ్మదేవుడు ఋషులతో సన్యాసి ఉండవలసిన ప్రదేశముల గురించి ఇలా చెప్పసాగాడు. " చెట్ల కింద, నదీతీరములలో, జనము లేని చోట, అడవులలో, కొండగుహలలో, దేవాలయములలో నివసించాలి. కుటిలత్వముతో ఏమీ సంపాదించకూడదు. తన గొప్పతనము గురించి ప్రచారము చేయ కూడదు. తన వద్దకు వచ్చే ప్రజలతో అంటీ ముట్టనట్లు ఉండాలి. ఇవి సన్యాసిలక్షణము. సన్యాసము అంటే తపస్సు చేసుకోవడము. తపస్సు వలననే జ్ఞానము సంపాదించి సన్యాసి పరమాత్మదర్శనం చేస్తాడు. తపస్సు వలన సన్యాసి రజో తమో గుణాలను వదిలి సత్వగుణ ప్రధానుడు ఔతాడు. మొక్షమార్గముకు అదే తొలిమెట్టు. సన్యాసి తపో మార్గములో ద్వందములను వదిలి మోక్షము కొరకు ప్రయత్నించాలి.

సంసార వృక్షం

[మార్చు]

ఋషులారా " సంసారము అనేది మహావృక్షము. ఈ వృక్షముకు అవ్యక్తము అనేది విత్తనము. బుద్ధి అనేది కాండము. అహంకారమే దీని కొమ్మలు. పంచభూతములు దీని ఆకులు రెమ్మలు. ఇంద్రియములు ఈ చెట్టుకు ఉండే తొర్రలు. ఈ సంసార వృక్షానికి మంచి చెడు అనే పండ్లు కాస్తుంటాయి. ఆశలు అనే చిగుళ్ళు ఎప్పుడూ చిగురిస్తూనే ఉంటాయి. ఈ చెట్టును నరకడానికి జ్ఞానముఅనే కత్తి కావాలి. జ్ఞానము అనే కత్తితో సంసారము అనే వృక్షాన్ని నరికిన వాడు బ్రహ్మపదమును పొందగలడు. దానికి యోగసాధన అవసరము. ఆ యోగసాధన ద్వారా ముందు జీవాత్మను దర్శించాలి. క్షణకాల దర్శనమైనా అది మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. తరువాత ఈ విషయ వాంఛలను వదిలి ముక్తిమార్గమున పయనిస్తాడు. ఋషులారా ! మీకు తెలియనిది ఏమున్నది. వేదములు చదివిన తత్వవేత్తలు మీరు. ఆత్మసాక్షాత్కారానికి సత్వమార్గము తప్ప మరొక మార్గము లేదు. సత్యము, ఆనందము, అహింస, క్షమాగుణము, మంచిప్రవర్తన, సన్యాసము, ఒకరికి ఇచ్చే గుణము, విజ్ఞానము ఇవి సాత్విక గుణములు. పరమాత్మను చేరుకోవాడానికి ఈ సాత్వికగుణములే సోపానాలు " అని అన్నడు బ్రహ్మదేవుడు.

అనుసరించవలసిన ధర్మములు

[మార్చు]

ఋషులు బ్రహ్మదేవుడితో " బ్రహ్మదేవా ! ధర్మములు అనేక విధములు అంటారు కదా ! వాటిలో దేనినీ అనుసరించిన మేలు జరుగుతుంది. మేము అందరమూ అన్ని ధర్మములను అనుసరిస్తూ అన్నీ ధర్మములను అనుసరిస్తూ వాటిలో ఏది మంచిది అనే నిర్ణయానికి రాలేక పోతున్నాము. కనుక నిశ్చయమైన ధర్మమేదో దానిని మాకు బోధించండి. ఇంకా సత్వగుణముకు పురుషుడికి ఉన్న సంబంధము వివరించండి " అని అడిగారు. బ్రహ్మదేవుడు వారితో " ఋషులారా ! సకల ధర్మములలో అహింస పరమధర్మము. అహింసను అవలంబించే వాడికి ఉత్తమమైన జ్ఞానము లభిస్తుంది. అదే మోక్షముకు మార్గము. నిరంతర కోరికలతో సతమతమయ్యే వాడు ప్రాపంచక సుఖములు అనే బంధములో చిక్కుకుంటాడు. అందు వలన జననమరణ చక్రములో తిరుగుతూ ఉంటాడు. కోరికలు సహజమే. వాటిని తీర్చుకోవడానికి కర్మలుచెయ్యడమూ సహజమే. కాని ఫలితము ఆశించక కర్మలుచేసినప్పుడు కర్మబంధములు అంటవు. ఫలాపేక్ష లేకుండా చేసే కర్మల వలన మానవుడు బంధములో చిక్కడు. అదే మోక్షముకు మార్గము. కనుక మానవుడు బయటి ప్రపంచములో విహరించే సమయంలో మానవుడు తామరాకు మీద నీటి బొట్టువలె వ్యవహరించాలి. దేనిమీదా ఆసక్తి చూపకూడదు. అప్పుడు అతడికి ఏ బంధములు అంటవు. పరతత్వము దర్శించడానికి సత్వము అనేది దివిటీ వంటిది. కనుక పరతత్వ సాధనలో సత్వము ఒక మంచి సాధనము. సత్వగుణ సాధనతో యోగులు పరతత్వమును సాధించి ముక్తిని పొండుతారు. కనుక సత్వము ముక్తిని పొందడానికి ఒక మంచి ఉపాయము. ఎవరైనా ఉపాయము లేనిది ఏదీ సాధించ లేడు. కనుక సత్వము ముక్తికి తరుణోపాయము. సాధకుడు సత్వగుణముతో తను తాను శుభ్రపరచుకోవాలి. తాను తలపెట్టిన కార్యము సిద్ధిస్తుందా లేదా అన్న సందేహము వదిలి పెట్టాలి. తాను శక్తివంతుడిని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిరంతరసాధన చేస్తూ సాధకుడు ఆత్మజ్ఞానము కలిగే వరకు నిరంతరము సత్వగుణమును అవలంబించాలి. ఒకసారి ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత సత్వగుణము కూడా వదిలి నిర్గుణుడై ముక్తి కొరకు సాధన చెయ్యాలి. ఋషులారా ! మరలా చెప్తున్నాను. అవ్య్యక్తము నుండి మహాతత్వము మహాతత్వము నుండి అహంకారము అహంకారము నుండి పంచభూతములు వాటి నుండి శబ్ధ, రూప, రస, స్పర్శ, గంధములు ఏర్పడ్డాయి. వీటి వలననే విషయములు ఏర్పడతాయి. ఈ విషయ వాంఛలలో మానవుడు మునిగితేలుతుంటాడు. ఎవరైతే వీటిని గురించి తెలుసుకుంటాడో అతడూ ఈ విషయాలను తేలికగా అధిగమించగలడు. విషయముల గురించి తెలుసుకుంటూ పంచ భూతముల గురించి తెలుసుకోవాలి. పంచభూతముల గురించి తెలుసుకున్న మానవుడు శరీరము పంచభూతాత్మకము అని తెలుసుకుని దేహాభిమానము వదిలి ముక్తిమార్గములో పయనిస్తాడు.థసారథి రథముకు కట్టిన గుర్రాలను నియంత్రించినట్లు మనసు ఇంద్రియములను అదుపులో ఉంచుతుంది. దానికి బుద్ధి తోడ్పడుతుంది. అందుకనే ఈ శరీరము అనే రథములో అధిరోహించి ఉన్న అంతరాత్మ స్వేచ్ఛగా విహరిస్తుంది. ఈ రహస్యమును తెలుసుకున్న సాధకుడు నిర్గుణుడై ముక్తిపధంలో పయనిస్తాడు. సముద్రంలో అలలు ఎలా పైకి లేస్తూ కింద పడుతూ ఉంటాయో అలాగే ఈ చరాచర జీవరాశులు అవ్యక్త మైన ప్రకృతిలో పుడుతూ పెరుగుతూ చస్తూ ఉంటాడు. ఈ అవ్యక్తమైన ప్రకృతి అవ్యయుడైన పరమాత్మ నుండి ఆవిర్భవించింది. కనుక ఈ ప్రకృతి శాశ్వతము కాదు. ఈ సత్యము తెలిసిన వాడు మోహబంధములలో చిక్కడు. పరమాత్మను దర్శించడానికి తపస్సే కారణము కనుక సాధకుడు తపోధనము సంపాదించాలి. పూర్వము ప్రజాపతులందరూ తపో మార్గముతోనే ఈ సృష్టికార్యము నిర్వహించారు. ఆకులూ అలములు తిని మహామునులు తపసు చేసి మహాజ్ఞానము పొందగలిగారు. తపస్సు వలన తను నేర్చుకున్న విద్యలో నైపుణ్యం సిద్ధిస్తుంది. ఏ ఇతర మార్గములో పొందవచ్చు. బ్రాహ్మణులను హింసించడం, మద్యపానము మొదలైన దుర్గుణములను తపోమార్గము దూరంచేస్తుంది. తపస్సువలన సమస్త భూతకోటి తృప్తి చెందుతుంది. ఈ తపోదీక్షలో సాధకులు, యోగులు, మమతలు, అహంకారము వదిలి పెట్టి బ్రహ్మపదము పొందుతారు. ఈ బ్రహ్మపదము పొందడానికి ముందు రజోగుణము, తమోగుణము వదిలిపెట్టి సత్వగుణమును ఆశ్రయించాలి. క్రమంగా ఆ సత్వగుణమును కూడా వదిలి నిర్గుణుడై పరమాత్మలో ఐక్యము ఔతాడు. వేదముల అంతమున ఉన్న ఉపనిషత్తుల సారమే జ్ఞానసముపార్జనకు ముఖ్యమైనది. ఈ ఉపనిషత్తులను అధ్యయనం చేయడంద్వారా జ్ఞానము సిద్ధిస్తుంది. ఉపనిషత్తులను అధ్యయనం చేయుటద్వారా ఆత్మజ్ఞానము కలుగుతుంది. మనలో ఉన్న జ్ఞానమే క్షేత్రజ్ఞుడు. మానవుడు కర్మజీవి. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తుంటాడు. ఆ పనిలో లీనం ఔతుంటాడు. ఆ పనులను మనసు పెట్టి చేస్తూ ఉంటాడు. కాని ఆత్మమాత్రం ఏ పనిలో లీనం కాకుండా సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. ఇదియే యోగసాధన. ఈ ప్రకృతి అవ్యక్తము. మానవుడు ప్రకృతిలో సంచరిస్తూ ఉంటాడు. కాని తనలోని ఉన్న అవిద్య కారణంగా తాను చేసే ప్రతి పనిలోనూ మమతాను బంధాలు పెంచుకుంటాడు. తాను చేసే పనిని మమతానురాగాలు లేకుండా నిర్మలంగా మమతానురాగాలు లేకుండా చేస్తే ఆ బంధనాలు అంటవు. దాని వలన వచ్చే దుఃఖము అంటదు. యోగులు రెండురకాలు. జ్ఞానయోగులు, కర్మ యోగులు. జ్ఞానయోగులు జ్ఞానయోగమే మేలంటారు. కర్మయోగులు కర్మచేయడమే మేలంటారు. కాని వేదము ముందుగా కర్మలుచెయ్యాలి. పదహారు వికారాలతో పరమాత్మను సేవించాలి. క్రమేణా కర్మలు వదిలి జ్ఞానయోగము అవలంబించాలి. ఎందుకంటే జ్ఞానమే పురుషుని యొక్క స్వభావము. ఈ జ్ఞానము కలిగిన సాధకుడు కర్మలను వదిలి జ్ఞానయోగము అవలంబించి తుదకు ముక్తిని పొందుతాడు. కనుక మానవుడు నిత్యమూ తాను చేస్తున్న కర్మలలో లీనం కాకుండా మనసును స్థిరముగా నిలిపి కోరికలను వదిలి అన్నింటి ఎడలా సమభావము కలిగి ముక్తిని పొందగలరు. ఋషులారా ! బ్రాహ్మణులారా ! అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పాను. మీరు ఈ విధంగా మీ మీ కర్మలు నిర్వర్తించండి. మీకు పరమపదసిద్ధి కలుగుతుంది " అని బ్రహ్మదేవుడు ఋషులకు మునులకు జ్ఞానోపదేశము చేసాడు. అని గురువు శిష్యుడికి చెప్పాడు. పైవిధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేసాడు.

గురుశిష్యులు

[మార్చు]

అప్పుడు అర్జునుడికి ఒక సందేహము కలిగింది. అర్జునుడు " శ్రీకృష్ణా ! ఇంతకూ ఆ గురువు ఎవరు ? ఆ శిష్యుడుఎవరు ? " అని అడిగాడు. శ్రీకృష్ణుడు పపక నవ్వి " అర్జునా ! ఇంకా అర్ధము కాలేదా ! ఆ గురువును నేను. ఆ శిష్యుడు నా మనసే. నీ మీద ప్రీతితో నీకు జ్ఞానబోధ చేసాను. నీవు నిర్మలము, చంచలము కాని నీ మనసును నా మీద నిలిపి ఆధ్యాత్మమును అనుసరించు. నీలో ఉన్న చింతలు అన్నీ సమసి పోతాయి. ఇప్పుడు చెప్పిన అన్ని విషయములు నీకు నేను యుద్ధముకు ఆరంభంలోనే చెప్పాను. నీ మనసును ఇంద్రియములను నిగ్రహించుకుని అచంచలమైన మనసుతో ఆత్మజ్ఞానంలో రమించు " అని శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధచేసాడు.

బయటి లింకులు

[మార్చు]