వన పర్వము ప్రథమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వనపర్వము లేదా అరణ్య పర్వము మహాభారతం ఇతిహాసంలోని మూడవ భాగము. సంస్కృతమూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో కొంత భాగాన్ని నన్నయ అనువదించాడు. నన్నయ మరణించడం వలన అది అసంపూర్తిగా ఉండిపోయింది. సుమారు 200 యేండ్ల తరువాత అరణ్య పర్వ శేషాన్ని ఎఱ్ఱన తెలుగులోనికి అనువదించాడు.

సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.

ప్రధమాశ్వాసం

[మార్చు]
దస్త్రం:Exile of Pandavasa.jpg
అరణ్యానికి వెళుతున్న పాండవులు

ఆ ప్రకారం పాండవులు ఆయుధాలతో ద్రౌపది వెంటరాగా అరణ్వానికి బయలు దేరి ఉత్తర దిక్కుగా పయాణం సాగించారు. వారి వెంట వారి సేవకులు పధ్నాలుగు వేల రథాలతో తరలి వెళ్ళారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ఉపపాండవులు వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసి పురజనులు " ఎక్కడో ఉన్న పాండవులను పిలిపించి జూదం ఆడించి సర్వస్వం హరించి అడవులకు పంపడం భావ్యమా " అనుకుని కంట తడి పెట్టారు " భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు కౄరులైన దుర్యోదనాదులను ఎందుకు ఆపలేదు? ఇక్కడ ధర్మం ఎక్కడుంది. కనుక మేము మీతో అరణ్యాలకు వస్తాము " అని పౌరులు పాండవుల వెంట బయలు దేరారు. ధర్మరాజు " ఆయ్యలారా మీరు మా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞులము. మీరు ఈ వన క్లేశం భరించ లేరు. మీరు మా వెంట రా వద్దు మరలి పొండి " అన్నాడు. ధర్మరాజు మన్నించి పౌరులు వెనుకకు మరలి వెళ్ళారు. తరువాత వారు గంగా తీరం చేరారు. కాని వారి వెంట నిత్యాగ్ని హోత్రులు వారి శిష్యులు వచ్చి చేరారు. ధర్మరాజు " బ్రాహ్మణోత్తములారా! మీరు పూజ్యులు. మేము అడవులలో కందమూలములు తింటూ బ్రతకాలి. మీరు మా వెంట కష్ట పడటం ఎందుకు? మరలి వెళ్ళండి " అన్నాడు. అందుకు వారు " అయ్యా మీరు లేక మేము బ్రతుక జాలము మీ వలె మేము కంద మూలాలు తింటూ ఉంటాము. మా ఆహారం మేము సంపాదించుకుంటాము. మీరు లేని హస్థినలో మేము ఉండజాలము " అన్నారు. అది చూసిన ధర్మరాజు దుఃఖిస్తూ " మంచి భోజనం తినే వీరు కందమూలాలను ఎలా తినగలరు? " అన్నాడు.

శౌనకుడు

[మార్చు]
దస్త్రం:Surya gifts Yudhishthira the Akshayapatra.jpg
సూర్యుని ప్రార్థించి అక్షయపాత్రను వరముగా పొందుతున్న ధర్మరాజు

అది విని శౌనకుడు " ధర్మరాజా ! ఇందుకు ఇంత చింతించ తగునా. వివేకులు ఎందుకూ దుఃఖించరు, వికలురు కారు. ఈ బంధాలు తాత్కాలికాలు కనుక కలత చెందవద్దు. బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కనుక ఆశను వదిలి పెట్టు. ధనం మీద కోరిక కలవాడు పతనమౌతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడ వద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు " అని హితవు చెప్పాడు. అందుకు ధర్మరాజు " అయ్యా! ధనం నా కోసం కాదు. ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా! వారు మా అతిధులు. గృహస్తుకు అతిధి పూజ పరమ ధర్మం కదా! ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి ఆసనం కూర్చడం గృహస్తు ధర్మం. తనకోసం మాత్రం వండుకొని తినడం పాపం. కనుక అతిధి సత్కారం చేయడం నా ధర్మం" అన్నాడు. అందుకు శౌనకుడు " ధర్మరాజా! ఇంద్రియాలు సుఖాలను కోరతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. కానీ మహనీయులు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవరచు కోవడం, ఇంద్రియాలను వశపరచు కోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం అనే నియమాలను ఆచరించే వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా నీవు కూడా గురుసేవా, పెద్దలు చెప్పినది వినడం విన్నదానిని అర్ధం చేసుకోవడం . అర్ధం చేసుకున్నదానిని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దానిని ఆచరించడం , అవసరం లేనిదానిని వదిలివేయడం వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో " అన్నాడు. ధర్మరాజు ధౌమ్యుడితో " అయ్యా ! ఇదేమో అడవి. బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలను " అని అడిగాడు. ధౌమ్యుడు ధర్మరాజుతో " ధర్మరాజా! జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుని ప్రార్ధించి నీ కోరిక నెరవేర్చుకో " అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది ఆదిత్య నామాలు అర్ధంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్టతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి " ధర్మరాజా ! ఈ పన్నెండేళ్ళు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కంద మూలాలు ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించిన, అది నాలుగు విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి " అని వరం ఇచ్చి వెళ్ళి పోయాడు.

హస్థినా పురం

[మార్చు]

హస్థినా పురంలో ధృతరాష్ట్రుడు విదురునితో " విదురా పాండవులు ఏమి చేస్తుంటారు " అని అడిగాడు. దానికి విదురుడు " పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని సుయోధనుని విడిచి పెట్టు. ద్రౌపదికి, భీమునికి దుశ్శాశనునితో క్షమాణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి " సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం " అన్నాడు. వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. ధ్రుతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. దృతరాష్ట్రుడు " విదురా ! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ధి లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు " అన్నాడు. విదురుడు "ధ్రుతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు " అన్నాడు. విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ " పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, ధ్రుతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి? " అన్నాడు. శకుని " సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు " అన్నాడు. కర్ణుడు " ఈ అదను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము. శత్రుశేషం లేకుండా చేద్దాం " అన్నాడు. కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు ధ్రుతరాష్ట్రుని వద్దకు వచ్చి " నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను " అన్నాడు. వ్యాసుడు " ధ్రుతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు" అన్నాడు.ధృతరాష్ట్రుడు " అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి " అన్నాడు. వ్యాసుడు " మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు " అని వెళ్ళి పోయాడు.

మైత్రేయుడు

[మార్చు]

వ్యాసుడు చెప్పినట్లు కొన్ని రోజుల తరువాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూచి హస్థినాపురం వచ్చాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. మైత్రేయుడు " నేను కామ్యక వనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను. వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు " అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా " అని ధృతరాష్ట్రుడు అడిగాడు. మైత్రేయుడు " ఓ రాజా! పాండవులు ధర్మబుద్ధి కలవారు. వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి. అందు వలన క్షేమమే " అన్నాడు. దుర్యోధనుని వైపు తిరిగి " కుమారా! నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరం వదులుము. అలా చేస్తే నీవు కురువంశానికి మేలు చేసిన వాడివి ఔతావు. పాండవులు వజ్ర శరీరులు. భీముడు హిడింబుని, బకాసురుని, జరాసంధుని, కిమ్మీరుని వధించిన బలాడ్యుడు. అతనిని వధించగల యోధులు లేరు. శ్రీకృష్ణుడు, దుష్టద్యుమ్నుని బంధుత్వం పాండవులకు మరింత బలాన్నిచ్చింది. కనుక నీవు పాండవులతో స్నేహం చేయటం మంచిది " అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు చరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి " సుయోధనా ! యుద్ధభూమిలో భీముని గదాఘాతం నీ తొడలను విరవకలదు " అని మైత్రేయుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాపవిమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. మైత్రేయుడు "మహారాజా! నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ది కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు " అన్నాడు.

కిమ్మీర వధ

[మార్చు]

దుర్యోధనునికి శాపం ఇచ్చిన తరువాత ధృతరాష్ట్రుడు " మహాత్మా! కిమ్మీరుడనే రాక్షసుడు భీముని చేతిలో ఎలా చనిపోయాడో వివరిస్తారా? " అని అడిగాడు. మైత్రేయుడు " నా మాటను నీ కొడుకే వినలేదు. నేనెందుకు చెప్పాలి విదురుని అడిగి తెలుసుకో " అని చెప్పి వెళ్ళి పోయాడు. విదురుడు కిమ్మీరుని వృత్తాంతం ఇలా వివరించ సాగాడు. " పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేసాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు " నీ వెవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు " అని ఆడిగాడు. దానికి ఆ రాక్షసుడు " నేను బకుడు అనే రాక్షసుని తమ్ముడిని. నా పేరు కిమ్మీరుడు. మనుష్యులను చంపి తింటూ ఉంటాను నాకు భయపడి ఎవరూ ఈ అరణ్యానికి రారు. మీరు ఎవరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు? " అని అడిగాడు. ధర్మరాజు " నా పేరు ధర్మరాజు వీరు నా సోదరులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాము " అన్నాడు. ఇది విని ఆ కిమ్మీరుడు " నా అన్న బకుని చంపిన భీముడు వీడేనా . వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను " అని వికటాట్టహాసం చేసాడు. ఇది విని అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టాడు కానీ ఈలోగా భీముడు కిమ్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసారు. చెట్లతోనూ రాళ్ళతోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మీరుని అతని అన్న బకుని చంపినట్లు అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యక వనంలో రాక్షస భయం లేకుండా చేసాడు " అని చెప్పాడు. ఇది విని ధృతరాష్ట్రుడు కలత చెందాడు.

కామ్యకవనానికి శ్రీకృష్ణుని విజయం

[మార్చు]
దస్త్రం:Krishna consoling Draupadi.jpg
ద్రౌపదిని ఓదార్చుచున్న శ్రీకృష్ణుడు

అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా! నీవు పురాణ పురుషుడవు. నీవు గంధమాదన పర్వతం మీద పదివేల సంవత్సరాలు తపస్సు చేసావు. పుష్కరంలో పదుకొండు వేల సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ తీరంలో పన్నెండు సంవత్సరాలు వ్రతం చేసావు. దితి కుమారులను దనువు కుమారులను సంహరించి ఇంద్ర పదవి సుస్థిరం చేసావు. నీవు అదితి కుమారుడివి. ఇంద్రుని తమ్ముడవు ఉపేంద్రుడివి. మొదట వామనుడిగా తరువాత త్రివిక్రమునిగా లోకాలను ఆక్రమించావు.లోక కంటకులైన శిశుపాల కంసులను వధించావు. నీవు అవతార మూర్తివి. అనృతం, మదము, కోపం, మత్సరం నీ దగ్గరకు రావు " అని స్తుతించాడు. అప్పడు శ్రీకృష్ణుడు అర్జునినితో " అర్జునా! నీవు నరుడవు. నేను నారాయణుడను. మనం ఒకరికి ఒకరం మిత్రులం " అన్నాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని చూసి " దేవా! నీవు యజ్ఞ పురుషుడివి. సర్వవ్యాపివి. సజ్జనులకు నీవే దిక్కు. నీకు తెలియనిది లేదు. నాకు జరిగిన పరాభవం చెప్తాను. నేను చక్రవర్తి పాండురాజు కోడలిని. పాండవుల భార్యను. మహావీరుడైన దుష్టద్యుమ్నుని సోదరిని. అట్టి నన్ను దుశ్శాశనుడు వెండ్రుకలు పట్టి ఈడ్పించాడు. నా వలువలు విప్పాడు. దారుణంగా నిండు సభలో అవమానించాడు. భీమార్జునులు నా మొర ఆలకించ లేదు. వీరి పరాక్రమమెందుకు? కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. ఎందరూ ఉండి ఎవరూ లేనిదానిని అయ్యాను. ఆ నవ్వు నా మనస్సును కాలుస్తుంది. ఆ కౌరవులు భీమునకు విషం పెట్టారు, పాములతో కరిపించారు. లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నారు. ఇప్పుడు జూదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యం మరచి ఉన్నారు. కాని నేను మరువలేకున్నాను " అన్నది. కృష్ణుడు " అమ్మా! అర్జునిని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తధ్యం ఊరడిల్లుము " అన్నాడు . శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! జరిగినదంతా యుయుధానుడు చెప్పగా విని దుఃఖించాను. ఆసమయంలో నేను మీదగ్గర లేను. ఉంటే ఇంత అనర్ధం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను " అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో " కృష్ణా ! ఆ వృత్తాంతం వివరించు " అన్నాడు.

సాల్వునితో శ్రీకృష్ణుని యుద్ధం

[మార్చు]

శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు " రాజసూయయాగం సమయంలో శిశుపాలుడు నా చేతిలో మరణించిన విషయం తెలుసు కదా. శిశుపాలుని తమ్ముడు సాళ్వుడు. అన్నను చంపిన దానికి పగ తీర్చుకోవడానికి ద్వారక మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు నేను మీ వద్ద ఉన్నాను. ద్వారకాపురిని ముట్టడించి నగరం వెలుపలి వనాలను నాశనం చేసాడు. ఆ సమయంలో ద్వారకలో ఉన్న సాంబుడు, ప్రద్యుమ్నుడు సాళ్వునితో ఘోరంగా యుద్ధం చేసారు. ప్రద్యుమ్నుడు సాళ్వునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సాళ్వుడు మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు సాళ్వుని చంపబోగా నారదుడు అడ్డుపడి " కుమారా ! ఇతనిని నువ్వు చంపరాదు. ఇతడు నారాయణుని చేతిలో హతుడు కావలసి ఉంది " అన్నాడు. కనుక ప్రద్యుమ్నుడు ఊరుకున్నాడు. సాళ్వుడు తిరిగి వెళ్ళాడు. నేను ద్వారకకు వెళ్ళగానే సాళ్వుడు ధ్వంశం చేసిన వనాలను చూసాక నాకు కోపం వచ్చింది సాళ్వుని మీదకు యుద్ధానికి వెళ్ళాను. సాళ్వునికి నాకు ఘోర యుద్ధం జరిగినది. సాళ్వుడు నాతో గెలవలేక మాయా యుద్ధం మొదలు పెట్టాడు. నేను వాడి మాయలు వమ్ము చేసాను. ఇంతలో ద్వారక నుండి వసుదేవుడు సాళ్వుని చేతిలో చిక్కాడని నేను వెళ్ళి రక్షించాలని వార్త వచ్చింది." ద్వారకలో బలరాముడు ఉండగా వసుదేవుడు సాళ్వునికి ఎలా చిక్కాడు? " అనుకున్నాను. ఇంతలో సౌంభకమను సాళ్వుని రథం నుండి వసుదేవుడు దిగటం చూసి నా చేతిలో ధనస్సు జారి కింద పడింది. నాకు కొంత సేపు స్పృహ తప్పింది. తెలివి వచ్చి చూసేసరికి సౌంభకంలో వసుదేవుడు లేక పోవడం చూసి అది రాక్షస మాయ అని గ్రహించాను. మరల నాకు సాళ్వునికి మధ్య ఘోరయుద్ధం జరిగింది. చివరికి సాళ్వునిపై చక్రాయుధాన్ని ప్రయోగించి అతడిని వధించాను " అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ద్వైత వనం

[మార్చు]
యుధిష్టురిని కలవడానికి వచ్చిన శ్రీకృష్ణుడు అతనిని అతని అనుచరులను కుంతిని సుభద్రను తీసుకు వెళ్ళడానికి వచ్చిన గరుడుడు-రాజ్మానామా నుండి ఒక దృశ్యం

తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. దుష్టద్యుమ్నుడు ఉపపాండవులను తీసుకుని పాంచాలదేశం వెళ్ళాడు. బ్రాహ్మణులు తమ ముఖ్య సేవకుడైన ఇంద్రసేనుని, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులని తీసుకుని ద్వైతవనానికి వెళ్ళారు. ధర్మరాజు " ఈ అడవిలో కౄరమృగాలు ఉన్నాయి.రాక్షసులు ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి " అని మిగిలిన వారితో అన్నాడు. వారు అక్కడ కుటీరాలు నిర్మించుకుని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు మార్కండేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆ మహర్షిని తగురీతి సత్కరించాడు. " ధర్మరాజా ! నాడు తండ్రి ఆజ్ఞమేరకు అడవులకు వెళ్ళిన రాముడిని , సీతను, లక్ష్మణుని చూసాను తరువాత మిమ్మల్ని చూస్తున్నాను. పూర్వపు రాజులైన సగరుడు, నలుడు, భరతుడు, యయాతి, వైన్యుడు, నభాగుడు మొదలైన వారు సత్య ధర్మాలు పాటించు ఉత్తమ లోకాలు పొందారు. మీకు శుభం కలుగుతుంది " అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు.

ద్రౌపది ధర్మరాజు సంభాషణ

[మార్చు]
దస్త్రం:Draupadi and Bhimsena conservation.jpg
యుధిష్టురినితో ద్రౌపది భీమసేనుల సంవాదము

ఒకరోజు ద్రౌపది ధర్మరాజుని చూసి " దృతరాష్ట్రుడు తన కొడుకు మాటవిని మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాని అతనికి మీ మీద కోపం పోయిందా. పోదు ఎందుకంటే అతని హృదయం పాషాణం. తన కొడుకు మిమ్మల్ని నిష్టూరంగా మాట్లాడినప్పుడు అతడు వారించ లేదు. రాజభోగాలు అనుభవించ వలసిన మీరు అడవులలో కష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ ధృతరాష్ట్రుడు లాగా బ్రహ్మదేవుడు మీకు శత్రువైనాడా ఏమి? " అని బాధపడి మళ్ళీ " నీ ఆజ్ఞానువర్తనులైన నీ తమ్ములు తమ పరాక్రమం విడుచి ఉన్నారు. నాడు సామంతుల కిరీట కాంతులతో ఎర్రబడ్డ మీ పాదాలు నేడు బండ రాళ్ళ మీద నడచి ఎర్రబడ్డాయి. అనేక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు కందమూలాలు తింటున్నారు. ఇట్టి దుర్దశలో కోపం విడిచి పెట్టడం తగదు కదా. అమిత బలశాలి భీముడు కందమూలాలు తిని చిక్కి పోయాడు. ధనుర్విద్యా పారంగతుడు అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నారు. వారిని చూసి కూడా ఓర్పు వహిస్తున్నారా? క్షమను తేజస్సును సమయానుకూలంగా ఉపయోగించని రాజు ప్రజల మన్నన పొందజాలడు అనే కథ మన ఇతిహాసంలో ఉంది . పూర్వం బలి చక్రవర్తి క్షమ గొప్పదా ? తేజస్సు గొప్పదా ? అని తన తాత అయిన ప్రహ్లాదుని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు అన్ని సమయాలలో క్షమ పనికిరాదు. అలాగే సదా ప్రతాపం చూపకూడదు రెండూ సమపాళ్ళలో చూపాలి. ఎప్పుడూ క్షమిస్తుంటే సేవకులు పనిచేయరు యజమానిని గౌరవించరు. ఎక్కువ కర్కశంగా ఉంటే ప్రజా కంటకుడౌతాడు " అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ అదేపనిగా తప్పులు చేస్తున్న కౌరవులను క్షమించ వచ్చునా? కనుక ఇది పరాక్రమం, తేజస్సు చూపించ వలసిన సమయం " అన్నది. అందుకు ధర్మరాజు " ద్రౌపదీ! కోపం మహాపాపం. కోపం కలవాడు కర్తవ్యం విస్మరిస్తాడు. చంపకూడని వారిని చంపుతాడు. కోపం వదిలిన వాడు తేజోవంతుడు ఔతాడు. క్షమ కలవాడికి విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనునికి క్షమా గుణం లేదు కనుక అతడు పతనం కాక తప్పదు " అన్నాడు. అందుకు ద్రౌపది " ఓ అజాత శత్రువా! నీవు ధర్మంతో వర్ధిల్లుతున్నావు. కానీ క్షమ శత్రువుల వద్ద తగునా? వంచకుల పట్ల వంచనతో ప్రవర్తించాలి ఓ బ్రహ్మదేవా! నీవు వంచకులకు అభ్యుదయాన్నిచ్చి, ధర్మాత్ముల సంపద పోగొడుతున్నావా? వంచకులు నీకు బంధువులు, ధర్మాత్ములు శత్రువులా? " అని నిర్వేదంతో పలికింది. ధర్మరాజు " ద్రౌపదీ! నీవు నాస్తికురాలి వలె మాట్లాడుతున్నావు. అది తప్పు కదా? ధర్మాత్ములైన మార్కండేయ, వ్యాస, నారదాది మహా మునులు ధర్మాత్ముడనని నన్ను గౌరవిస్తున్నారు. ఇతరులు నా పట్ల అధర్మంగా ప్రవర్తించినా నేను ఎందుకు ధర్మం తప్పాలి? పుణ్యకార్యాలకు ఫలితం లేకుంటే మునిజనాలు వాటిని ఎందుకు ఆచరిస్తారు. నీవు దుష్టద్యుమ్నుడు పుణ్య ఫలమున పుట్టిన వాళ్ళు కదా " అన్నాడు. ద్రౌపది " కర్మఫలానికి విధి కారణం కాదు అనే దానిని కాదు. కాని కర్మ చేయడం మానవ ధర్మం కదా? కర్మ ఫల ప్రాప్తికి మనుష్య ప్రయత్నం తరువాత దైవ బలం సమకూరాలి. పురుషుడు సంకల్పించి తరువాత ప్రయత్నం చేయాలి అప్పుడు దైవం సాయం చేస్తాడు. నువ్వు గింజలో నూనె ఉన్నా, కర్రలో నిప్పు ఉన్నా పురుష ప్రయత్నం లేని ఎడల నూనె రాదు, నిప్పు పుట్టదు కదా? పురుష ప్రయత్నం లేకుండా దైవాన్ని, ధర్మాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుందా? కనుక మీ తమ్ముల పరాక్రమం ఉపయోగించి లక్ష్యమును నిర్ణయించి ఫలసిద్ధి పొందమని నా ప్రార్ధన " అన్నది.

భీముని ఆవేదన

[మార్చు]

ద్రౌపది మాటలకు భీమసేనుడు వంతపాడాడు. " అన్నయ్యా! రాజ్యం మన తండ్రి తాతలది దానిని నీవు అన్యుల పరం చేసి ఇక్కడ ధర్మవచనాలు పలుకుతున్నావు. చెడ్డ వారిని ధర్మబుద్ధితో జయించగలమా? అది సాధ్యమా ? పరాక్రమంతో శత్రువులను జయించాలి కాని ధర్మం ధర్మం అంటూ పలవరించడం తగదు. పరాక్రమం లేని వాడు కృంగి పోవాలి కాని నీ వంటి వారు కాదు. ఆ నాడే శత్రువులను చంపి ఉంటే మనకు ఈ వనవాసం ప్రాప్తించేది కాదు. ఒప్పందాన్ని మీరు అతిక్రమించలేక పోవడం కౌరవులకు చులకన అయింది అది మన పిరికితనం అనుకుంటున్నారు. నీవు అనుసరిస్తున్న ధర్మం మనకు, మన బంధు వర్గాలకు బాధ కలిగిస్తుంది. శత్రువులను జయించడం, ప్రజల భయాన్ని పోగొట్టడం, దానధర్మాలు చేయడం, యజ్ఞయాదులు చేస్తూ బ్రాహ్మణులను పూజించడం క్షత్రియ ధర్మం. కేవలం ధర్మాచరణతో శత్రువులను జయించ లేము. మోసాన్ని మోసంతో జయించాలి. ఒప్పందాన్ని పక్కన పెట్టి వాళ్ళను జయిద్దాం. రాజులంతా మనకు సాయం చేస్తారు. కౌరవ రాజ్యంలోని ప్రజలు నీ పాలన కోరుకుంటున్నారు " అని భీముడన్నాడు. ధర్మరాజు " భీమా ! నీ మాటలు ధర్మ సమ్మతమే కానీ నేను సభలో పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తానని చెప్పాను. క్షణిక సుఖాలకు ఆశించి సత్యాన్ని ధర్మాన్ని విడువను. మనకు మేలు జరిగే వరకూ వేచి ఉంటాను " అన్నాడు. భీముడు " అన్నయ్యా ! మృత్యువు ఎప్పుడూ మన వెంట పొంచి ఉంటుంది. ఈ జీవితాలు ఆశాశ్వతం కనుక శాశ్వతం అనుకుని వేచి ఉండుట తగునా ? మరణించే ముందు పగ తీర్చుకోవాలి కదా? " అన్నాడు." శత్రువులపై ప్రతీకారం చేయాలని నా హృదయం తపిస్తుంది. నా తమ్ముల యొక్క ద్రౌపది యొక్క దుఃఖం తీర్చడం కుండా ధర్మం, దయా అంటూ కూర్చోవడం తగునా? నీవనుసరించే మార్గం బ్రాహ్మణులకు తగును కానీ క్షత్రియులకు కాదు. క్షాత్ర ధర్మం ప్రకారం యుద్ధం చేస్తాము. అడవిలో పన్నెండేళ్ళు గడప వచ్చు. కానీ జనపదాలలో పన్నెండు నెలలు గడపడం అసాధ్యం. జగత్ప్రసిద్ధులమైన మనం దాగుట అసాధ్యం కనుక తిరిగి అరణ్యవాసం అజ్ఞాత వాసం ఇలా ఎన్నాళ్ళు. కనుక ఇప్పటి మన పదమూడు నెలల వనవాసం పదమూడేళ్ళుగా భావించడంలో తప్పేమి లేదు " అని భీముడన్నాడు. ధర్మరాజు భీమునితో " భీమా ! నీకు పాండిత్యం, పరాక్రమం, దర్పం ఉన్నాయి. కనుక నేను చెప్పేది ఆలోచించు. కౌరవులతో యుద్ధం సామాన్యమైనది కాదు. కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దూకుడు తగదు. అప్పుడే మనకు దైవం అనుకూలిస్తాడు. దృతరాష్ట్రుని కుమారులు మహావీరులు పైగా దుర్మార్గులు. వారికి కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుల అండ ఉంది. రాజసూయయాంలో మనచేత ఓడింపబడిన రాజులంతా కౌరవ పక్షాన చేరారు. కర్ణుడు మహావీరుడు, కవచకుండల ధారి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వంటి మహా యోధులకు మనపట్ల విరోధం లేకున్న ధర్మాన్ని అనుసరించి దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తారు. వారిని ముందుగా జయించి కాని దుర్యోధనుని జయించ లేము . కనుక యుద్ధానికి ఇది తగిన సమయం కాదు " అని చెబుతుండగా వ్యాసుడు అక్కడకు వచ్చాడు.

అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించుట

[మార్చు]

ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు." ధర్మరాజా! నీ మనస్సులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునకు ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి " అని చెప్పాడు . వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యక వనానికి వెళ్ళారు. ధర్మరాజు ఒకరోజు అర్జునినితో " అర్జునా ! భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని గెలవాలంటే మనకూ దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేసాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నీవు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమతమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమ శివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు " అని చెప్పి అర్జునునకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అవే విద్యను ఉపదేశం చేసాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయడానికి గంధ మాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునిని చూసి " వీరుడా నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంతస్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని ? నీ ఆయుధములు విడిచి పెట్టు " అన్నాడు. ఆ మాటలకు చలించకుండా స్థిరంగా ఉన్న అర్జునిని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమైయ్యాడు. " అర్జునా నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో " అని అన్నాడు. అర్జునుడు " నాకు దివ్యాస్త్రాలు కావాలి " అన్నాడు. ఇంద్రుడు " ఎలాగూ అవి లభిస్తాయి. అమరత్వం కావాలా? " అని అడిగాడు. అర్జునుడు " ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి. అవి నాకు ప్రసాదించండి " అన్నాడు. ఇంద్రుడు " అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి " అన్నాడు.

అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట

[మార్చు]
దస్త్రం:Kirata and Arjuna Story.jpg
అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట, శివునితో అర్జునుని యుధ్ధము

వెంటనే అర్జునుడు ఇంద్రకిలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుడుని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు తగలగానే ఆపంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో " నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా " అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా ? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా " అన్నాడు శివుడు.

పందికి గురిపెడుతున్న అర్జునుడు

అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ లేదు. అర్జునునకు ఆశ్చర్యం వేసింది " ఇతను సామాన్యుడు కాదు దేవేంద్రుడైనా పరమ శివుడైనా అయి ఉండాలి " అనుకున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి " అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు వేసే బాణముల నన్నీ శివుడు పర్వతం శిలావర్షాన్ని స్వీకరించి నట్లు స్వీకరించాడు. అక్షయ తూనిరాలలోని బాణాలు అన్ని అయిపోయాయి.గాండీవం తీసుకుని కొట్టగా అతని చేతిలోని గాండీవం అదృశ్యం అయింది.ఖడ్గం తీసుకొని శివుని శిరస్సుపై బలమంతా ప్రయోగించి కొట్టగా ఖడ్గం ముక్కలై పోయింది. చెట్లతోనూ శిలలతోను యుద్ధం చేశాడు. అన్నిటిని శివుడు తనలోనికి తీసుకున్నాడు. ఇక పిడికిళ్ళతో శంకరుడిని కొట్ట నారంభించాడు. కిరతార్జును లిరువురు భయంకరంగా ద్వంద యుద్ధం చేయసాగారు. కొంతసేపటికి అర్జునుడు శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్చబోయాడు.కాసేపటికి తేరుకుని రక్తసిక్తమైన తన శరీరమును చూసుకొని మట్టితో శివలింగమును చేసి పుష్పములు, మాలలతో పూజించాడు. అప్పుడు పార్ధివ లింగంపై తను పూజించిన మాల కిరాతుని శిరస్సుపై కనిపించింది. ఆశ్చర్యపోయిన అర్జునుడు కిరాతకుడే శివుడని గ్రహించి కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. " పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు " అన్నాడు. అంత నిజ రూపంలో ప్రత్యక్షమైన శివుడు " అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి . ఇదిగో నీ గాండీవం .ఇంకా ఏదైనా వరం కోరుకో " అన్నాడు. అర్జునుడు " త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు " అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం , సంధానం, మోక్షణము,

అర్జునుడికి పాశుపతాన్ని ఉపదేశిస్తున్న ఈశ్వరుడు

సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు.శివుడు అర్జునుడితో " అర్జునా! ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు వచ్చాడు. " అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము " అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేసారు. అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు.

ఇంద్రలోకంలో అర్జునుడు

[మార్చు]
దస్త్రం:Urvashi curses Arjuna.jpg
అర్జునునికి ఊర్వశి శాపం

దానిపై అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్య చంద్రులు లేకనే స్వయంప్రకాశంతో వెలిగి పోతున్న అమరావతి నగరాన్ని చూసాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించాడు. అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి " అమ్మా! నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా? " అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరించాడు. " అర్జునా ! నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం నేను దేవ వేశ్యని. మాకు వావివరసలు ఉండవు. నీకు నేను ఏవిధంగా తల్లిని అయ్యాను " అన్నది. " మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కనుక నీవు నాకు మాతృ సమానురాలివి. స్వేచ్ఛా శృంగారం దోషం, పాపం " అన్నాడు. ఊర్వశి కోపించి " కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ళ మధ్య సంచరించు " అని శపించి వెళ్ళి పోయింది. ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడుతో " అర్జునా! నీ వంటి ధైర్యవంతుని నేను ఇదివరకు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కాని అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉంవడచ్చు. నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగి పోతుంది " అని ఊరడించాడు. తరువాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రోమశుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధ సింహాసానంపై కూర్చున్న అర్జునుని చూసి " ఎవరీతుడు ? " అని ఇంద్రుని అడిగాడు. దానికి దేవేంద్రుడు " మహర్షీ ! ఇతడు పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతను నివాత కవచులను రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధర్మరాజుకు చెప్పండి. ధర్మజుని తీర్ధయాత్రలు చేయమని నా తరఫున చెప్పండి. తీర్ధయాత్రల వలన అతడు పాప రహితుడు కాగలడు " అని రోమశునితో చెప్పాడు.

ధృతరాష్ట్రుని చింత

[మార్చు]

భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి " సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది. పరుషంగా మాట్లాడి కర్ణుడు చేసిందేముంది. ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు లాక్కురావడమే ఇంతటి వైరానికి దారి తీసింది. ఇప్పటికీ మందభాగ్యుడైన నాపుత్రుడు దుర్యోధనుడు ఊరుకోవడం లేదు. అర్జునుడి పరాక్రమం చాలా ఆశ్చర్యంగా వుంది. అతడు మహాదేవుడితోనే బహుయుద్ధంకూడా చేసాడని విన్నాను " అన్నాడు . సంజయుడు " సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభి షేకం చేస్తానని అన్నాడట. అంత ధర్మరాజు "పదమూడు సంవత్సరములు గడచిన తర్వాత వారిని వారి బంధువులతోకూడా సంహరించు. నేను రాజులందరిలో చేసిన వనవాస ప్రతిజ్ఞను భంగం చేయకు" మని ప్రార్ధించగా ద్దృష్టద్యుమ్నాదులు కృష్ణుడిని సముదాయిన్చారట. మిగిలినవారు వారించి అర్జునునికి సారథ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గదాఘాతాలకు తట్టుకోగలరా? " అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు " నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నాకొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేం చేయుదును " అని పరితపించాడు. ధర్మరాజు కామ్యకవనంలో అర్జునుని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు " అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపస్సుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునుని మీద ఆధారపడి ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునుని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. రణరంగంలో నన్ను, అర్జునిని ఎదిరించే వారు లేరు" అన్నాడు. అందుకు ధర్మరాజు " భీమసేనా! ఆ విషయం నాకు తెలియును. కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి. విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను " అన్నాడు ధర్మరాజు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]