Jump to content

శల్య పర్వము ప్రథమాశ్వాసము

వికీపీడియా నుండి
(శల్య పర్వము నుండి దారిమార్పు చెందింది)


ప్రథమాశ్వాసం

[మార్చు]

పదునేడవ నాటి యుద్ధం దుశ్శాసన, కర్ణుల మరణంతో ముగిసింది. మిగిలిన వీరులతో సుయోధనుడు తన శిబిరానికి వెళ్ళాడు. శల్యుడిని తన సేనాధిపతిగా చేసాడు. పద్దెనిమిదవ రోజు యుద్ధానికి ఇరుపక్షములు సమాయత్తమయ్యాయి. ధర్మరాజు అత్యంత పరాక్రమంతో శల్యుని సంహరించాడు. తరువాత క్రమంగా కౌరవ ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణించారు. సుయోధనుడు రణ భూమి నుండి తొలగి పోయి ఒక మడుగులో ప్రవేశించాడు. పాండవులు సుయోధనుడిని వెదుకుతూ అక్కడకు వచ్చారు. సూటీపోటీ మాటలతో సుయోధనుడిని యుద్ధోన్ముఖుని చేసారు. భీముడు సుయోధనుడితో గదాయుద్ధం చేసి అతడి తొడలు విరిచాడు. సుయోధనుడు కుప్పకూలాడు. పద్దెనిమిది రోజుల తరువాత సూర్యాస్తమయ సమయానికి సుయోధనుడు కుప్పకూలడంతో భారత యుద్ధం ముగిసింది. ఆ రోజు రాత్రి అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యుడు వెంట రాగా పాండవ శిబిరాన ప్రవేశించి చావగా మిగిలిన ప్రభద్రక, పాంచాల, మత్స్య సైన్యాలను హతమార్చాడు. పాండవులని భ్రమించి ఉపపాండవులను హతమార్చాడు. ఇదంతా కళ్ళారా చూసిన సంజయుడు అమితమైన దుఃఖంతో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెప్పడానికి హస్థినాపురం వచ్చాడు.

సంజయుడు పదినెనిమిదవనాటి యుద్ధవిశేషములు చెప్పుట

[మార్చు]

సంజయుడు ధృతరాష్ట్ర మందిరం ప్రవేశించగానే అక్కడ గుమిగూడి ఉన్న ధృతరాష్ట్రుడి కోడళ్ళను, విదురుడిని, గాంధారిని చూసి ఏడుస్తూ " ధృతరాష్ట్ర మహారాజా ! శల్యుడు, శకుని, ఉలూకుడు , సంశక్తులు, కాంభోజులు, శతానీకుడు, యవనులు, పర్వతరాజులు, మ్లేచ్ఛులు ఇలా మనకు సాయం చేయ వచ్చిన సమస్త మహారాజులు ససైన్యంగా యుద్ధంలో మరణించారు. కర్ణుడి కుమారులు అందరూ మరణించారు. నీకుమారుడు సుయోధనుడు తొడలు విరుగకొట్టబడి కటిక నేల మీద పడి ఉన్నాడు. భీముడు తన ప్రతిన నెరవేర్చుకున్నాడు.మనపక్షమున అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అను ముగ్గురు రధిక త్రయం పాండవ పక్షాన శ్రీకృష్ణుడు, సాత్యకి, పంచపాండవులు, నీ కుమారుడైన యుయుత్సుడు బ్రతికి ఉన్నారు. సుయోధనుడి పదకొండు అక్షౌహినుల సైన్యం సర్వనాశనం అయింది " అన్నాడు.

దృతరాష్ట్రుడు కుమారుల కొరకు విలపించుట

[మార్చు]

ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, ఆమె కోడళ్ళు మూర్ఛ పోయారు. మిగిలిన వారు నిశ్చేష్టులు అయ్యారు. ధృతరాష్ట్రుడు కొంతసేపటికి తేరుకుని పక్కనే ఉన్న విదురునితో " విదురా ! నేను పుత్రహీనుడను అనాధను అయ్యాను. నాకు బంధువు అనే వాడివి నువ్వు మాత్రమే మిగిలావు " అని తిరిగి మూర్చిల్లాడు. దాసీ జనం చేసిన ఉపచారములతో తేరుకుని " విదురా ! నా మనస్సు నా వశమున లేదు " వీరిని తమ తమ నివాసములకు పంపి వేయి " అన్నాడు. విదురుడు స్త్రీలనందరిని వారి వారి నివాసముకు పంపాడు. ధృతరాష్ట్రుడు " విదురా ! ఇప్పుడు నాకు ఏమి గతి ? నా కొడుకులు అందరూ చచ్చినా పాండుసుతులు ఒక్కరు కూడా చావక పోవడం వింత కాదా ! నూరుగురు కుమారులు మరణించినా నా గుండెలు బద్దలు కాకుండా ఉన్నాయంటే నాది గుండా లేక పాషాణమా ! పుట్టు గుడ్డినైన నేను కుమారుల ముద్దు ముచ్చట చూసుకొనుటకు నోచుకొనక పోయినా వారి మరణ వార్త వినవలసిన దుర్గతి మాత్రం దాపురించింది. సుయోధనా ! ఎక్కడ ఉన్నావు మీ అమ్మ గాంధారి పిలుస్తుంది రారా ! ఈ ముసలి తనంలో మమ్ము విడిచి ఎక్కడకు వెళ్ళావు. ఇలా మమ్ములను అనాథలను చేసావే నీవు మా మీద చూపిన ఆప్యాయత ఏమైంది. నిరంతరం సేవలందుకునే నీవు కటిక నేల మీద దొర్లుతున్నావా ! నాడు నాకు చెప్పిన మాటలు మరిచావా ! " నా వెంట భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు ఉన్నారు అన్నావే. కర్ణుడు ఒక్కడు చాలు పాండవులను అందరినీ సంహరించడానికి అన్నావు. వీరుకాక బాహ్లిక, సోమదత్త, శకుని, భూరిశ్రవ, శల్య, సింధురాజులు ఉన్నారని చెప్పావే. వీరు చాలరా పాండవుల జయించడానికి " అన్నావు కదా ! ఈ రోజు ఆ పాండవుల చేతిలో హతమయ్యావా ! శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్మిని చంపిన అర్జునుడికి అసాధ్యము ఏముంది ? ద్రోణుడు సామాన్యుడా ! అతడిని అర్జునుడు వధించ లేదా ! జయధ్రధుడు సామాన్యుడా ! అతడి తల ఒక్క వేటుతో తుంచ లేదా ! నీవు నమ్మిన కర్ణుడు పాండవులలో ఒక్కరిని వధించాడా ! విధి వైపరీత్యం కాక మరేమి ? బలశాలి శల్యుడు కూడా ఎవరిని వధించ లేదు. నా తమ్ములతో కూడి పాండవులను వధిస్తానని అన్నావు. నీ తమ్ములతో కూడి నీవూ కూలి పోయావు. అదృష్టహీనుడిని అయిన నాకు శుభాలు ఎలా కలుగుతాయి. నా కుమారులంతా మరణించాక నేను ఎవరిని చూసి బ్రతకాలి ? భీమసేనుడు అనునిత్యము సూటీపోటీ మాటలతో వేధిస్తుంటే ఎలా బ్రతుక గలను. నేను అడవులకు పోయి శేషజీవితం గడుపుతాను సంజయా ఆ ఏర్పాట్లు చూడు " అన్నాడు.

సంజయుడు యుద్ధ వివరణ చేయుట

[మార్చు]

ధృతరాష్ట్రుడు " సంజయా ! నాకు తెలియక అడుగుతున్నాను. భీష్ముడు, ద్రోణుడు మరణించిన తరువాత ఎవరి అండ చూసుకుని నా కొడుకు యుద్ధాన్ని కొనసాగించాడు. ఇది మూర్ఖత్వం కాక మరేమిటి. విదురుడు అప్పుడే చెప్పాడు. నీకొడుకు మూర్ఖుడు అతడిని వదిలి వేయి అని . నేను విన లేదు ఫలితం అనుభవిస్తున్నాను. సంజయా ! కర్ణుడు మరణించిన తరువాత సైన్యాధ్యక్షుడు ఎవరు. యుద్ధం ఎలా జరిగింది వివరించు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఎలా బ్రతికి బయట పడ్డారు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి పాంచాల, భద్రక, మత్స్య సేనలతో ఉపపాండవులు ఎలా మరణించారు. పాండవులు, సాత్యకి, కృష్ణుడు ఎలా తప్పించుకున్నాడు " అని అడిగాడు. కర్ణుడు మరణించాక సుయోధనుడు పిచ్చెత్తినట్లు అరుస్తూ శిబిరానికి వెళ్ళి లోపలకు రాక ఆరుబయట సమావేశమై ధుఃఖం నుండి బయట పడి కార్యాచరణకు పూనుకున్నాడు.

కృపాచార్యుని సంధి ప్రస్థావన

[మార్చు]

కృపాచార్యుడు సుయోధనుడితో " సుయోధనా ! క్షత్రియులకు యుద్ధము పరమ ధర్మం. కాని నేను బ్రాహ్మణుడను. క్షత్రియ ధర్మంగా ఒక మాట చెప్తున్నాను. భీష్మ, ద్రోణ, కర్ణులు దైవీ సంపత్తులు అమిత శౌర్యవంతులు. వారంతా అర్జునుడి చేత మరణించారు. అర్జునుడు అగ్ని కృష్ణుడు వాయువు. అగ్నికి వాయువు తోడైతే నాశనం తప్ప మరేమిటి. అదే ఇప్పుడు జరిగింది. ప్రస్తుతం మన వద్ద తగినంత సైన్యము లేదు. ఉన్న వారు అలసి ఉన్నారు. ఇప్పుడు ఎవరు సైన్యాధ్యక్షుడైనా పాండవులను జయించడం అసాధ్యం. కనుక పాండవులతో సంధి చేసుకొనుట ఉత్తమం. పాండవుల మీద కోపం విడిచి పెట్టు. ఈ యుద్ధం పాండవుల మీద నీకు గల అకారణ కోపం కారణంగానే జరిగింది. కొంచం లౌక్యము చూపిస్తే యుద్ధం నివారించబడేది. మరొక్క మాట మనకు శక్తి సామర్థ్యం అధికంగా ఉన్నప్పుడు యుద్ధం అనుసరణీయం. మన శక్తి తగ్గినప్పుడు సంధి అనుసరణీయం. సకల సామ్రాజ్యానికి అధిపతి కావాలని నీవు తలపెట్టిన యుద్ధం సుఖములు అనుభవించడానికే కదా! ఈ కొద్దిపాటి సైన్యముతో అది సాధ్యం కాదు. ప్రాణంతో ఉంటేనే కదా సుఖములు అనుభవించేది. కనుక ప్రాణములు నిలబెట్టుకునే మార్గం చూడు. సౌమ్యుడైన ధర్మరాజు సంధికి అంగీకరిస్తాడు. కృష్ణుడు సంధికి వ్యతిరేకం కాడు. భీమ, నకుల, సహదేవులు ధర్మరాజు మాట వింటారు. నీవు అంగీకరిస్తే సంధి నెరవేరుతుంది " అన్నాడు.

సుయోధనుడు సంధిని నిరాకరించుట

[మార్చు]

కృపాచార్యుని సంధి ప్రస్థావన సుయోధనుడు మర్యాదగానే నిరాకరించాడు. " ఆ చార్యా ! మీరు నా మంచి కోరి నేను చెడిపోవడం చూడ లేక నాలుగు మంచి మాటలు చెప్పారు. ఆ మాటలు నేను అంగీకరించలేను. ఎందుకంటే మాయా జూదం ఆడించి పాండవుల రాజ్యం అపహరించి వారిని అరణ్యములకు పంపాను. నిండు సభలో పాండవ పత్నిని జుట్టు పట్టి ఈడ్పించి ఘోరంగా అవమానించాను. సంధి చేయ వచ్చిన కృష్ణుడిని పట్టి బంధించాలనుకున్నాను. భీష్మ, ద్రోణ, కర్ణుల చావును కళ్ళారా చూసాను. పసి వాడైన అభిమన్యుడిని అధర్మంగా ఒంటరిని చేసి చుట్టుముట్టి కిరాతకంగా వధించాను. దుశ్శాసనుడిని చంపి రుధిరం తాగి భీముడు చంపడం చూసాను. ఇన్ని చేసిన నేను ఈ నాడు సంధి చేసుకుంటే నా తొడలు విరిచి భీముడు రెండవ శపథం నెరవేర్చుకుంటాడని భయపడి సంధి చేసుకున్నానని లోకులు నవ్వి పోరా ! నిందించరా ! ఏమైనా జరగని ఒకరి దయా దాక్షిణ్యాలతో వచ్చే రాజ్యానికంటే యుద్ధం చేసి మరణించి వీర స్వర్గం పొందుట మేలు కదా ! కనుక యుద్ధం కొనసాగించ నిశ్చయించుకున్నాను. అడ్డు చెప్పకండి. మిగిలిన సైన్యాలతో యుద్ధానికి వెళతాను. ఏమో రేపు నేనే గెలువగలనో ఏమో ఎవరికి తెలుసు " అన్నాడు. సుయోధనుడు తన సైన్యాలను ఉత్సాహపరచి యుద్ధోన్ముఖులను చేసాడు. తరువాత మరునాటి యుద్ధానికి తగిన వ్యూహము కొరకు ఆలోచించాడు. అశ్వత్థామ శకుని, కృపాచార్య, శల్య, కృతవర్మలతో కలిసి ఆలోచించి " సుయోధనా ! మనమీ రాత్రి ఈ శిబిరంలో నిద్రించుట శ్రేయస్కరం కాదు. విజయోత్సాహంతో ఉన్న పాండవులు అర్ధరాత్రి మన మీద దాడి జరిపి మనలను సంహరించ వచ్చు. కనుక మనం ఇచ్చటికి దూరంగా వెళ్ళి విడిది చేస్తాము " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన సుయోధనుడు బంధు మిత్ర సహితంగా సైన్యములతో అక్కడకు రెండు ఆమడల దూరంలో ఉన్న సరస్వతీ నదీ తీరంలో విడిది చేసారు. అలసట తీరేలా అందరూ స్నానాలు చేసారు.

కౌరవ సైన్యాధ్యక్షత

[మార్చు]

కౌరవ యోధులు సేదతీరిన తరువాత సుయోధనుడు మరునాటి యుద్ధానికి సైన్యాధ్యత ఎవరికి అప్పచెప్పాలో నిర్ణయించమని అశ్వత్థామను అడిగాడు. అశ్వత్థామ " సుయోధనా ! ఈ క్లిష్ట సమయంలో యుద్ధకళానైపుణ్యం ఉన్న వాడు. వయసులో పెద్ద వాడు, తన మేనళ్ళులను వదిలి మన మీద అభిమానంతో తరఫున యుద్ధం చేస్తున్న వాడు అయిన మధ్ర దేశాధిపతి శల్యుడికంటే మన సైన్యాలకు అధ్యక్షత వహించగల వాడు ఎవ్వడు. కనుక మధ్రదేశాధిపతి శల్యుని మన సైన్యాధిపతిని చేద్దాము " అన్నాడు. సుయోధనుడు " శల్యమహారాజా ! తమరు మా సకల సైన్యములకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను " అని చేతులు జోడించి అడిగాడు. అందుకు శల్యుడు అంగీకరించాడు. వెంటనే సుయోధనుడు సరస్వతీ నదీ జలాలను తెప్పించి శల్యుని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. విజయసూచకంగా కౌరవసేనలు జయజయధ్వానాలు చేస్తూ శంఖం పూరించాయి. పాండవ శిబిరంలో ధర్మరాజు చారులద్వారా ఎప్పటి విషయములు అప్పుడే తెలుసుకుంటున్నాడు. శల్యుడు కౌరవులకు సైన్యాధ్యక్షత వహించిన విషయం తెలుసుకుని " కృష్ణా ! విన్నావా సుయోధనుడు శల్యుడిని కౌరవ సేనకు సైన్యాధ్యక్షుడిని చేసాడు. అందుకు దీటుగా మనం ఏమి చేయాలి " అని అడిగాడు. కృష్ణుడు " ధర్మరాజా ! శల్యుడు మహా బలవంతుడు, బలశాలి, భుజబల సంపన్నుడు. రణకౌశలంలో భీష్మ, ద్రోణ, కర్ణులను మించిన వాడు. నివురుకప్పిన నిప్పులాంటి శల్యుడు రణరంగమున విజృంభించిన మీరు తట్టుకోవడం కష్టం. శల్యుడిని ఎదుర్కొనగల సమర్ధుడివి నువ్వే కనుక రేపటి యుద్ధంలో శల్యుని సంహరించు ఉపాయం చూడు. అతడి మాద్రికి సోదరుడు మీ మేన మామ అందు వలన మీకు అతడి మీద అభిమానం ఉండవచ్చు కాని ఇప్పుడు అతడు శత్రుపక్షమున సైన్యాధ్యక్షత వహించి యుద్ధం చేస్తున్నాడు. కనుక నిర్ధాక్షిణ్యంగా అతడిని వధించిన నీకు విజయం చేకూరగలదు " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! నీవు చెప్పినట్లు చేస్తాను. యుద్ధంలో మనకు విజయం ముఖ్యం కాని బంధుత్వాలు కాదు " అన్నాడు.

కురుపాండవ యుద్ధవ్యూహాలు

[మార్చు]

పద్దెమిదవనాటి యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆజానుభాహుడైన శల్యుని ముందు నిలుపుకుని కౌరవ సైన్యాలు, పాండవులను ముందు నిలుపుకుని పాండవసైన్యాలు యుద్ధభూమికి చేరాయి " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " ఇంకెందుకు సంశయం సంజయా ! పాండవులు శల్యుని నా కుమారుని ఎలా సంహరించారో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! ఇంకా నువ్వు ఇలాంటి మరణవార్తలు వినే స్థితిలో ఉన్నావా ! నేను చెప్పు యుద్ధ విశేషాలు మందుగా విను. మరణవార్తలు ఎలాగూ వినక తప్పదుగా ! " అన్నాడు. " నీ కుమారుడు సుయోధనుడు ఎలాగైనా పద్దెనిమిదవ రోజైనా యుద్ధంలో పాండవులను జయించి రాజ్యాన్ని కైవశం చేసుకోవాలని పేరాశతో ఉన్నాడు. శల్యుడు కురుసైన్యాలను సర్వతోభద్రవ్యూహంలో నిలిపాడు. ముఖద్వారం వద్ద కర్ణుడి పుత్రులతో శల్యుడు నిలిచాడు, కుడి వైపున కృపాచార్యుడు, ఏడమవైపున త్రిగర్త వీరులతో కృతవర్మ నిలిచారు. వెనుకవైపు కాంభోజరాజ సైన్యాలతో కలిసి అశ్వత్థామ నిలిచాడు. మధ్యభాగాన సుయోధనుడు ససైన్యంగా నిలిచాడు. పాండవులు తమ సైన్యాలను త్రిముఖ వ్యూహంగా నిలిపారు. ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి మూడు ముఖద్వారాల వద్ద నిలిచారు. భీమార్జునులు ధర్మరాజుకు ముందు రక్షగా నిలిచారు " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! ఈ పదిహేడు రోజుల యుద్ధం తరువాత ఎవరెవరికి ఎంత సేనలు మిగిలాయో వివరించు " అని అడిగాడు. మహారాజా ! మనపక్షాన పదకొండు వేల రథములు, పదివేల ఏడు వందల గజములు, రెండు లక్షల హయములు, మూడు కోట్ల సైనికులు మిగిలారు. పాండవ పక్షాన ఆరువేల రథములు, మూడువేల ఏనుగులు, ఒక లక్ష గుర్రములు, ఒక కోటి కాల్బలమూ మిగిలాయి " అన్నాడు.

యుద్ధారంభం

[మార్చు]

మరునాడు యుద్ధం ప్రారంభం అయింది. కురుక్షేత్ర సంగ్రామంలో ఆఖరి రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షముల భేరి మృదంగనాదాలు మిన్నంటాయి. సైన్యాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఆరోజు అటో ఇటో తేలాలని ఇరుపక్షములు యుద్ధం సాగిస్తున్నారు. రథములు విరిగి పడుతున్నాయి. కాళ్ళు చేతులు విరిగిన సైనికులు కింద పడి దొర్లుతున్నారు. కొంత మంది సైనికులు తలలు తెగి పడిపోయి ఉన్నారు.గజములు, హయములు కుప్పలుగా పడి ఉన్నాయి. రణభూమి అంతా రక్తసిక్తమై ఉంది. వాటి మధ్య రథములు తిరుగుతున్నాయి. వీరులు జంకక బీభత్స వాతావరణంలో కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు.

నకులుడి శౌర్యం

[మార్చు]

కర్ణుడి మనుమడు చిత్రసేనుడు నకులుని ఎదుర్కొని అతడి విల్లు విరిచి, నుదుటన మూడు బాణములు నాటి, పతాకమును విరిచి, సారథిని చంపాడు. నకులుడు కత్తి డాలు తీసుకుని చిత్రసేనుడు వేయు బాణములు తప్పించుకుంటూ చిత్రసేనుడి దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారిగా విజృంభించి రథము మీద లంఘించి చిత్రసేనుడి తలని కత్తితో ఖండించాడు. అది చూసిన చిత్రసేనుడి సోదరులు సత్యసేనుడు, సుషేణుడు నకులునితో కలియబడ్డారు. నకులుడు మరొక రథం ఎక్కాడు. సత్యసేనుడు, సుషేణుడు నకులుడి మీద బల్లెములు విసిరారు. నకులుడు అవలీలగా వారి రథాశ్వములను చంపాడు. సత్యసేనుడు మరొక రథం ఎక్కి నకులుడి విల్లు విరిచాడు. నకులుడు శక్తి ఆయుధమును వేసి సత్యసేనుడి మీద ప్రయోగించి అతడి తల తెంచాడు. అది చూసి సుషేణుడు నకులుడి మీద బాణములు గుప్పించాడు. నకులుడు భీముడి పుత్రుడైన శ్రుతసోముని రథం ఎక్కి మరొక విల్లందుకుని సుషేణుడి మీద శరవర్షం కురిపించి సుషేణుడి తలను ఒక అర్ధచంద్ర బాణంతో తుంచాడు.

శల్యుడి పరాక్రమము

[మార్చు]

సుషేణుడి మరణంతో కౌరవసేనలు పారిపోయాయి. అది చూసి శల్యుడు సింహంలా ఘర్జిస్తూ కౌరవ సేనలు పారి పోకుండా నిలిపాడు. తిరిగి కౌరవ సేనలు పాండవసేనలతో తలపడ్డాయి. ధర్మరాజుకు రక్షణగా భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు, నకుల సహదేవులు నిలిచారు. శల్యుడు వారితో ముందుగా యుద్ధం చేస్తున్నాడు.ఇంతలో ప్రభద్రక సేనలు, పాంచాల సేనలు శల్యుడిని చుట్టుముట్టాయి. శల్యుడు వారిని శరవర్షంలో ముంచెత్తి వారందరిని యమసదనానికి పంపాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. అది చూసి ధర్మరాజు శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు ఒక నారాచమును ధర్మరాజు శరీరం చీల్చుకు పోయేలా ప్రయోగించాడు. అదిఛూసిన భీముడు ఏడు బాణములు, నకులుడు అయిదు బాణములు, సహదేవుడు తొమ్మిది బాణములు ఉపపాండవులు అనేక బాణములు వేసి శల్యుడిని ఎదుర్కొన్నారు. అది చూసి కృతవర్మ, కృపాచార్యుడు, శకుని, ఉలూకుడు శల్యునికి సాయంగా వచ్చారు. శల్యుడు భీమసేనుడి హయములను చంపాడు. భీముడు తన గద తీసుకుని కౌరవ సేనలను తనుమాడసాగాడు. సహదేవుడు శల్యుని మీద ధారాపాతంగా బాణములు వేసాడు. శల్యుడు సహదేవుడి హయములను చంపాడు. శల్యుడి కుమారుడు రుక్మాంగదుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు. సహదేవుడు కత్తి తీసుకొని కత్తి తీసుకుని తన రథం మీద నుండి కిందికి దూకి రుక్మాందుడి వైపు వెళ్ళి అతడి రథము మీద లంఘించి అతడి తలను తన కత్తితో నరికాడు.

భీమసేనుడు శల్యుడిని ఎదుర్కొనుట

[మార్చు]

కుమారుడి మరణం కళ్ళారా చూసిన శల్యుడుకోపం తట్టుకొన లేక పాండవ సైన్యాలను దునుమాడసాగాడు. శల్యుడు ధర్మరాజు మీద అతిక్రూర మైన బాణమును వేసాడు. అది చూసి భీముడు తన గద తీసుకుని కిందము దిగి శల్యుడి రథానికి కట్టిన అశ్వములను చంపాడు. శల్యుడు భీముడి మీదకు తోమరం విసిరి భీముడి గుండెలను చీల్చాడు. భీమసేనుడు ఆ తోమరమును లాగి దానితో శల్యుడి సారథిని చంపాడు. శల్యుడు ముద్గర అనే ఆయుధము తీసుకుని రథము నుండి కిందికి దిగాడు. భీముడు తన గదాయుధంతో శల్యుడిని ఎదుర్కొన్నాడు. ఇరు పక్షముల సేనలు యుద్ధం ఆపి వారి గదాయుద్ధం చూడసాగారు. శల్యుడు, భీముడు సింహఘర్జనలు చేస్తూ గుండ్రముగా తిరుగుతూ రెండు ఏనుగులవలె ఢీకొన్నారు. గదా ఘాతములతో శరీరం రక్తసిక్తం అయింది. ఒకరిని ఒకరు కొట్టుకుని మూర్ఛ పోయారు. అది చూసి కృపాచార్యుడు శల్యుని తన రథం మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీముడు మూర్ఛ నుండి తేరుకొని శల్యుడి కొరకు వెదుకుతో పెద్దగా అరుస్తున్నాడు. ఇంతలో చేకితానుడి ఆధ్వర్యంలో పాండవసేన భీముని ముందుకు వచ్చి కౌరవసేనలను ఎదుర్కొంది. సుయోధనుడు చేకితానుడి మీద ఒక ఈటెను బలంగా విసిరి చేకితానుడిని చంపాడు.

శల్యుని శౌర్యం

[మార్చు]
పాండవులతో పోరాడుతున్న శల్యుడు

శల్యుడు తేరుకుని వచ్చి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామకు సాయంగా త్రిగర్త సేనలు వచ్చి చేరాయి. శల్యుడు ధర్మరాజును అమిత శౌర్యంతో ఎదుర్కొని బాణప్రయోగం చేస్తున్నాడు. ధర్మరాజు శల్యుడి శరీరం నిండా పదునాలుగు బాణములు వేసాడు. శల్యుడు అత్యంత శక్తివంతమైన బాణమును వేసి ధర్మరాజు వక్షస్థలం గాయపరిచాడు. ధర్మరాజు విజృంభించి శల్యుడి చక్రరక్షకులను చంపి, సారథిని చంపాడు. సాత్యకి, భీముడు చేది సేనలతో శల్యుడిని ఎదుర్కొని శరవర్షం కురిపించారు. నకులసహదేవులు శల్యుని ఎదుర్కొన్నారు. శల్యుడు విజృంభించి నకులసహదేవుల మీద శరవర్షం కురిపించాడు. ధర్మరాజు శల్యుని ఎదుర్కొని శల్యుడి శరీరం నిండా బాణములు నాటాడు. శల్యుడు ఆ బాణములు ఎదుర్కొని భీమనకులసహదేవుల మీద బాణములు గుప్పించాడు. నకులుడు తన మేన మామను అతి క్రూర బాణములతో కొట్టాడు. భీమ, నకులసహదేవులు, ధర్మరాజు, సాత్యకులు కూడా శల్యుడి మీద బాణములు వర్షంలా వేసారు. శల్యుని శరీరం అంతా రక్తసిక్తమైంది. అయినా శల్యుడు జంకక ధర్మరాజు వింటిని విరిచాడు. ధర్మరాజు వేరొక విల్లు తీసుకుని శల్యుడి అత్యంత ప్రతిభావంతమైన బాణములతో శల్యుడి సారథిని, హయములను కొట్టాడు. శల్యుడు కోపించి ధర్మరాజును మూర్ఛిల్లేలా కొట్టాడు. అది చూసి సాత్యకి శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు సాత్యకి విల్లు విరిచి భీమ, నకుల, సహదేవుల మీద మూడేసి బాణములతో కొట్టాడు. ధర్మరాజు మూర్ఛ నుండి తేరుకుని శల్యుని తన ముద్గరతో కొట్టాడు. అదేసమయంలో భీముడు బల్లెమును, సహదేవుడు గధను, నకులుడు శక్తిని ఒకేసారి శల్యుడి మీద వేసారు. శల్యుడు కోపించి అందరినీ ఎదుర్కొని అందరినీ మూర్ఛిల్లేలా కొట్టాడు. శల్యుడి పరాక్రమానికి అయిదుగురూ చచ్చారని భావించి సుయోధనుడు సంతోషించాడు. సాత్యకి, నకుల సహదేవులు ముందుగా తేరుకుని శల్యుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు తేరుకొని శల్యుని చక్రరక్షకులను చంపాడు. చక్రరక్షకులు లేకున్నా శల్యుడు జంకక యుద్ధం కొనసాగిస్తూ అయిదుగురు వీరులను రక్తం కారేలా కొట్టాడు. ధర్మరాజు దుఃఖించి " కృష్ణుడు చెప్పినది నిజం. భీముని వలన కూడా శల్యుని ఎదుర్కొనుట సాధ్యం కాదు. ఇక శల్యుని తానే సంహరించాలి " అనుకుని తన సేనలను చేయి ఊపి పిలిచాడు. శల్యుడు నకులసహదేవ, భీమ, ధృష్టద్యుమ్న, సాత్యకులను తన బాణములతో కప్పాడు.

అర్జునుడి పరాక్రమం

[మార్చు]

అశ్వత్థామ నాయకత్వంలో సంశక్తులు అర్జునుడితో యుద్ధంచేస్తున్నారు. అశ్వత్థామ సంశక్తులతో కలిసి అర్జునుడిని వివిధరకాల బాణ, అస్త్ర, శస్త్రములతో చికాకు పరుస్తున్నాడు. అర్జునుడు కోపించి విజృంభించి సంశక్తుల రథములను, కేతనములను, ధనస్సులను విరిచాడు. కవచములను భేదించి హయములను చంపి రెండు వేల మంది సంశక్తులను చంపాడు. అశ్వథ్థామ అర్జునుడిని ఎదుర్కొని అర్జునుడిని పన్నెండు బాణములతోను కృష్ణుడిని పది బాణములతోను కొట్టాడు. అర్జునుడు బ్రాహ్మణుడైన అశ్వత్థామను మనస్సులో నమస్కరించి అశ్వత్థామ సారథిని, హయములను చంపాడు. అశ్వత్థామ ముసలమును, పరిఘను అర్జునుడి మీద ప్రయోగించాడు. పరిఘను, ముసలమును తునాతునకలు చేసి అర్జునుడు అశ్వత్థామ శరీరంలో మూడు బాణములు నాటాడు. అది చూసిన సంశక్తులు అశ్వత్థామను దాటి అర్జునుడిని ఎదుర్కొన్నారు. ఇంతలో తనను ఎదుర్కొన్న పాంచాల రాకుమారుని తలను అశ్వత్థామ ఒకే బాణంతో ఖండించి తిరిగి అర్జునుడిని ఎదుర్కొన్నాడు.

కురుపాండవ సమరం

[మార్చు]

సుయోధనుడు ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని వాడి అయిన అయిదు బాణములు ధృష్టద్యుమ్నుడి మీద వేసాడు. ధృష్టద్యుమ్నుడు ప్రతిగా సుయోధనుడి మీద డెబ్బై బాణాలను ప్రయోగించాడు. అది చూసిన సుయోధనుడి తమ్ములు అన్నకు సాయంగా వచ్చి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నారు. ధృష్టద్యుమ్నుడు కోపించి వారి మీద వాడి అయిన బాణములు ప్రయోగించాడు. శిఖండి ప్రభద్రకులు కృపాచార్యుడు, కృతవర్మలను ఎదుర్కొన్నారు. శల్యుని నకులసహదేవ, భీమ, ధర్మరాజాదులు ఎదుర్కొని సమరం సాగిస్తున్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. నకులుడు శల్యుని మీద పది బాణములు వేసాడు. శల్యుడు నకులుని మీద మూడు బాణములు ప్రయోగించి నకులుడి విల్లు విరిచాడు. అయిదుగురు యోధులూ శల్యుని ఎదుర్కొన్నారు. శల్యుడు జంకక వారందరిని తన బాణములతో నొప్పించాడు. సుయోధనుడు తన సైన్యముతో శల్యునికి సాయంగా వచ్చాడు. కృష్ణార్జునులు తమ సైన్యములను ఒక చోట సమీకరించారు. అర్జునుడు కృపాచార్యుని, సహదేవుడు శకునిని, ఉపపాండవులు కౌరవ పక్షాన పోరాడుతున్నమిత్రరాజుల్ను, శిఖండి అశ్వత్థామను, భీముడు సుయోధనుని, ధర్మరాజు నకులుడితో చేరి శల్యుని ఎదుర్కొన్నారు. ఇరు పక్షముల మధ్య ఘోరంగా పోరు సాగుతుంది. శల్యుడు అంతటా తానే అయి సమరం సాగిస్తున్నాడు. మధ్యాహ్న సూర్యుడికి ప్రతిబింబంలా వెలిగి పోతున్న శల్యుడి పరాక్రమానికి పాండవసేనలు ఆగ లేక వెనుకంజ వేస్తున్నాయి. అది చూసి ధర్మరాజు చేతులు ఊపుతూ సైన్యాలను ఉత్సాహపరచి తమ్ములను దగ్గరకు పిలిచి " మీరంతా మీమీ పరాక్రమానికి అనుగుణంగా భీష్మ, ద్రోణ, కర్ణాది యోధులను చంపారు. ఈ రోజు నేను మహా వీరుడైన శల్యుడిని చంపుతాను. ఎలాగంటే నారధముకు కుడి వైపున నకులుడు, సాత్యకి ఎడమ వైపున సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు రక్షణగా ఉంటారు. వెనుక అర్జునుడు, ముందు భీముడు ఉంటారు. ఎందుకంటే శల్యుడికి రక్షణగా కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని నిలుస్తారు " అన్నాడు. ధర్మరాజు చెప్పినట్లే ధృష్టద్యుమ్నుడు, పాండవులు నిలిచారు. అది చూసిన సుయోధనుడు శల్యునికి రక్షణగా కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ, శకునులను నిలిపాడు. ధర్మరాజు శల్యుని ఎదుర్కొన్నాడు పోరు ఘోరంగా సాగుతుంది.

శల్యవధ

[మార్చు]
పాండవులను ఎదుర్కోటున్న శల్యుడు

అర్జునుడు కృపాచార్యుని, కృతవర్మను ఎదుర్కొన్నాడు. శల్యుని సైన్యం ధర్మరాజును చుట్టుముట్టింది. ధర్మరాజు కోపంతో విజృంభించాడు. రథములు విరుగుతున్నాయి. గజములు, హయములు కుప్పలుగా చచ్చి పడుతున్నాయి. రణరంగం అంతా బీభత్సంగా ఉంది. ధర్మరాజు శల్యుడు తమ శంఖములు పూరించి యుద్ధముకు తలపడ్డారు. ఒకరి మీద ఒకరు అస్త్రప్రయోగం చేసుకుని శరీరాలను రక్తసిక్తం చేసుకున్నారు. శల్యుడు ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని శల్యుడి విల్లు విరిచి ఎడతెరిపి లేకుండా మూడు వందల బాణములు వేసి శల్యుని హయములను చంపి, కేతనము విరిచాడు. శల్యుడు రథము మీద కూలబడ్డాడు. ఆది చూసిన ఆశ్వత్థామ శల్యుడిని తన రథము మీదకు ఎక్కించి తీసుకు వెళ్ళాడు. శల్యుడు పడిపోగానే ధర్మరాజు పొలికేకలు పెడుతూ విజృంభించాడు. కౌరవ సేనలను ఎదుర్కొని తరుముతున్నాడు. ఇంతలో శల్యుడు మూర్ఛ నుండి తేరుకుని మరి ఒక రథము మీద ఎక్కి ధర్మజుని ఎదుర్కొన్నాడు. తనను ఎదుర్కొన్న ధృష్టద్యుమ్న, నకుల సహదేవ, సాత్యకులను వాడి అయిన బాణములతో కొట్టి తప్పించి తిరిగి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు అత్యంత వాడి అయిన బాణములతో శల్యుని కొట్టాడు. అది చూసి సుయోధనుడు తన సైన్యాలను శల్యునికి సాయంగా పంపాడు. వారి అండ చూసుకుని శల్యుడు ధర్మరాజును ఎదుర్కొని ధర్మరాజు శరీరంలో ఏడు భయంకర బాణములు నాటాడు. సుయోధనుడి సేనలతో భీముడు పోరాడుతున్నాడు. ధర్మరాజు తొమ్మిది భయంకరమైన బాణములు శల్యుని శరీరంలో గుచ్చాడు. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు ఒక బలమైన బాణమును ధర్మరాజు గుండెలకు గురి చూసి కొట్టాడు. ధర్మరాజు శల్యుని తన బాణములతో మూర్ఛిల్లజేసాడు. అంతలోనే శల్యుడు తేరుకుని ధర్మరాజును ఎదుర్కొని ధర్మరాజు మీద బాణప్రయోగం చేసాడు. ధర్మరాజు శల్యుని కవచం చీల్చాడు. శల్యుడు ధర్మరాజు వింటిని ఖండించాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని శల్యునిశరీరం నిండా శరములతో నింపాడు. శల్యుడు తన బాణములతో ధర్మరాజు, భీముల కవచం చీల్చాడు. ఇంతలో కృపాచార్యుడు ధర్మరాజు సారథిని కొట్టాడు. శల్యుడు ధర్మరాజు హయములను చంపాడు. ధర్మరాజు విరధుడయ్యాడు. ధర్మరాజు మనస్సులో " శ్రీకృష్ణుడు నన్ను శల్యుని చంపమని నియోగించాడు. ఆ మహానుభావుని మాట వమ్ము అయ్యేలా ఉంది. ఇక నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు " అనుకుని రథము మీద నిలబడి " ఓ పరమేశ్వరా ! నీవు త్రిశూలధారివి, నిర్గుణుడివి, నిరాకారుడివి, త్రినేత్రుడివి. సృష్టి, స్థితి, లయ కారకుడివి. త్రిభువనములకు పూజనీయుడివైన నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను నన్ను ఈ గండం నుండి కాపాడు " అని మనస్ఫూర్తిగా ప్రార్థించి మెల్లగా లేచి శల్యుడి మీద శరప్రయోగం చేసాడు. ధర్మరాజు శక్తి హీనుడయ్యాడని తెలుసుకుని శల్యుడు రెట్టించిన ఉత్సాహంతో ధర్మరాజు మీద బాణములు వేసాడు. భీమసేనుడు మధ్యలో వచ్చి శల్యుని విల్లు విరిచి హయములను చంపాడు. శల్యుడు కూడా విరధుడయ్యాడు. కత్తి డాలు తీసుకుని తన వైపు వస్తున్న శల్యుడి మీద తన శక్తిని అంతా ప్రయోగించి " శ్రీకృష్ణుడు శల్యుని చంపమని నాకు ఆనతిచ్చాడు. ఈ శల్యుడు నావంతు " అని దృఢసంకల్పం చేసి తన వద్ద పూజలందుకుంటున్న పరమేశ్వర ప్రసాదితమైన శక్తి ఆయుధమును బయటకు తీసి భక్తితో నమస్కరించి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ క్రోధంగా ప్రళయకాల రుద్రునిలా శక్తి కొద్దీ విజృంభించి తన వైపు వస్తున్న శల్యుని మీద గురి చూసి బలంగా విసిరాడు. ఆ శక్తి ఆయుధం నిప్పులు కురుస్తూ శల్యుని వైపు దూసుకు పోయి అతడి కవచమును చీల్చుకొని గుండెలను దూసుకుంటూ భూమిలోకి పోయింది. శల్యుడి శరీరం నుండి రక్తం ధారాపాతంగా కారింది. మొదలు నరికిన చెట్టులా శల్యుడు నేల మీద బోర్లా పడ్డాడు. శల్యుడి ప్రాణాలు అనంత వాయువులలో కలిసాయి. శల్యుడి మరణాన్ని చూసి అతడి తమ్ముడు అమిత క్రోధంతో ధర్మజుని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఒక పదునైన బల్లెం విసిరి అతడి తల నరికాడు. శల్యుడు, అతడి తమ్ముడు మరణించడం చూసి కౌరవ సేనలు పారిపోసాగాయి.

శల్యుని బంధువులు పాండవులను ఎదుర్కొనుట

[మార్చు]

శల్యుని మరణానంతరం సాత్యకి కౌరవసేనను తరుముతున్నాడు. అది చూసి కృతవర్మ సాత్యకి ఎదుర్కొన్నాడు. కృతవర్మ సాత్యకి విల్లు విరిచాడు. సాత్యకి మరొక ధనస్సు తీసుకుని కృతవర్మ రథాశ్వములను, సారథిని చంపాడు. అది చూసి కృపాచార్యుడు కృతవర్మను తన రథము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. సాత్యకి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవసేనలు పారిపోసాగాయి. పాండవసైన్యం కౌరవసైన్యాలను వెంటాడుతుంది. సుయోధనుడు ఒక్కడే పాండవ సేనకు ఎదురు నిలిచాడు. మరొక రథం సమకూర్చుకుని మరలా కృతవర్మ అక్కడకు వచ్చి తిరిగి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు కోపించి కృతవర్మ రథాశ్వములను చంపాడు. అశ్వత్థామ కృతవర్మను ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్ళాడు. ధర్మరాజు ఆరు బాణములతో కృపాచార్యుని కొట్టాడు. కృపాచార్యుడు పదహారు బాణములతో ధర్మరాజును కొట్టాడు. సుయోధనుడు తన సైన్యాలను ప్రోత్సహిస్తూ యుద్ధ భూమి అంతా తిరుగుతున్నాడు. సుయోధనుడి మాటలకు ధైర్యం తెచ్చుకుని కౌరవసేనలు పాండవసేనలను ఎదుర్కొన్నాయి. సుయోధనుడి అండ చూసుకుని శల్యుడి సైన్యం ధర్మరాజును ఎదుర్కొన్నాయి. సుయోధనుడు వారిని వారించి " తొందర పడకండి నా వెనుక నిలవండి అందరం కలిసి ధర్మరాజును ఎఎదుర్కొంటాము అన్నాడు " అయినా వారు వినక సుయోధనుడిని దాటి ధర్మరాజును చుట్టుముట్టారు. ఇంతలో భీముడు, నకులసహదేవులు, ఉపపాండవులు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి శిఖండి తమ తమ బలాలతో వారిని చుట్టుముట్టారు. అది చూసి శకుని " సుయోధనా ! శల్యుని బంధువులందరినీ పాండవులు చంపుతారు వారిని కాపాడవయ్యా " అని అరిచాడు. అందుకు " నేనేం చెయ్యను మామా వారు నా మాట కూడా వినక వెళ్ళారు. ఫలితం అనుభవిస్తారు " అని నిర్వేదంగా అన్నాడు. శకుని " అది కాదు సుయోధనా ! వారు నీ పక్షాన యుద్ధం చెయ్యడానికి వచ్చారు. వారు ఆపదలో ఉన్నప్పుడు నువ్వేకదా రక్షించాలి " అన్నాడు. శకుని మాటలు విని సుయోధనుడు " అలాగే వెళ్ళి వారిని రక్షస్తాను " అని వెళ్ళాడు కాని అప్పటికి భీమ, సాత్యకి, నకులసహదేవాదులు శల్యుని బంధువులను నిశ్శేషంగా యమసదనానికి పంపారు. అది చూసి సుయోధనుడి సైన్యం వెనుకకు పారిపోయింది.

కురుపాండవ యోధుల సమరం

[మార్చు]

కౌరవసేనలో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఇక కురుసామ్రాజ్యానికి అధిపతి ధర్మరాజు సుయోధనుడి పతనం తథ్యం అనుకున్నారు. అది గమనించిన సుయోధనుడు ఏనుగు దిగి ఒక రథం అధిరోహించి తన సైన్యం మధ్య తిరుగుతూ వారికి తన శాయ శక్తులా ధైర్యోత్సాహాలు కలిగిస్తూ " సైనికుల్లారా! వెనుకకు మరలండి పిరికి పందల్లా పారిపోకండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి మీరు పారి పోయినంత మాత్రాన శత్రువులు మిమ్ము విడువరు తరిమి తరిమి చంపుతారు. అలాంటి దిక్కులేని చావు చచ్చేకంటే వీరోచితంగా పోరాడి మరణించి వీరస్వర్గం అలంకరించండి. మన బలం ఎక్కువగా ఉంది పాండవుల బలం తక్కువగా ఉంది. మనం తప్పక గెలుస్తాము " అన్నాడు. ఆ మాటలకు కౌరవసేనలో ధైర్యోత్సాహాలు పెల్లుబుకి రణభూమికి తిరిగి వచ్చారు. వారంతా భీమసేనుడిని చుట్టుముట్టారు. భీముడు తనగద తీసుకుని కౌరవసేనలో మారణహోమం సృష్టించి ఒక్క దెబ్బకు ఇరవై ఒక్క వేలమందిని యమసదనానికి పంపాడు. మరొక పక్క అర్జునుడు కౌరవసేనలకు తన గాండీవం నుండి వెలువడే బాణాల రుచి చూపిస్తున్నాడు. నకులుడు, సహదేవుడు, సాత్యకి శకునిని ఎదుర్కొన్నారు. శకుని కూడా వారిని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఇంతలో సాళ్వుడు ఏనుగు ఎక్కి పాండవసేనలో ప్రవేశించి పాండవ సేనను కకావికలు చేస్తున్నాడు. సాళ్వుని ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొని తన బాణంతో సాళ్వుని ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు సాళ్వుని ఏనుగు పారి పోయింది. సాళ్వుడు దానిని దారికి తెచ్చికుని ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. సాళ్వుని ఏనుగు ధృష్టద్యుమ్నుడి రథాన్ని పైకి ఎత్తింది. అది గమనించిన ధృష్టద్యుమ్నుడు తన గద తీసుకుని కిందికి దూకాడు. భీముడు, సాత్యకి, శిఖండి కూడా సాళ్వుని ఎదుర్కొన్నారు. సాళ్వుడు కూడా అత్యంత ధైర్యసాహసాలతో వారిని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు తనగదతో సాళ్వుని కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఏనుగు కింద పడిపోయింది. సాత్యకి ఒకే దెబ్బతో సాళ్వుని తెల తెగనరికాడు. సాళ్వుని మరణం చూసి కౌరవ సేన పారిపోసాగింది. కృతవర్మ వారిలో ధైర్యోత్సాహలు కలిగించాడు. సాత్యకి ఎనిమిది పదునైన బాణములతో కృతవర్మను కొట్టాడు. కృతవర్మ సాత్యకి విల్లు విరిచాడు. సాత్యకి మరొక విల్లందుకుని కృతవర్మ సారథిని హయములను చంపాడు. కృతవర్మ విరధుడై ఒక శూలం తీసుకున్నాడు. అది చూసి కృపాచార్యుడు తన రథంలో కృతవర్మను ఎక్కించుకుని అక్కడి నుండి తీసుకు వెళ్ళాడు. అప్పటికి కురుసైన్యం చెదిరి పోయింది. నీ కుమారుడు సుయోధనుడు పాండవులను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. పాండవ యోధులంతా చేరి సుయోధనుడిని ఎదుర్కొన్నారు. అంతటా తానై సుయోధనుడు యుద్ధం చేస్తూ ధర్మరాజు మీద నూరు బాణములు భీముని మీద డెబ్బై బాణములు వేసాడు. సహదేవుడు సుయోధనుడిని ఎదిరించారు. కురుసైన్యం ప్రాణముల మీద ఆశ వదులుకుని యుద్ధం చేస్తుంది. శకుని ధర్మరాజు రథాశ్వాలను చంపాడు. సహదేవుడు ధర్మరాజును తన రథం మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజు శకునిని బాణ వర్షంలో తడిపాడు. సుయోధనుడు ధృష్టద్యమ్నుడి విల్లు విరిచాడు. ధృష్టద్యుమ్నుడు మరొక బాణం తీసుకుని సుయోధనుడి మీద బాణ ప్రయోగం చేసాడు. అంతలో ఉపపాండవులు సుయోధనుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు మూడు శరములతో కృపాచార్యుని కొట్టి నాలుగు బాణములతో కృతవర్మ హయములను చంపాండు. అశ్వత్థామ కృతవర్మను తన రథం మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. సుయోధనుడు ఏడు వందల రథములతో ధర్మరాజును చుట్టుముట్టాడు. శిఖండి విజృంభించి ఆ రథములను తన బాణములతో ఖండించాడు. శకుని తన సేనలతో ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు సహదేవుని పిలిచి శకునిని ఎదుర్కొమ్మని అదేశించాడు. శకుని సహదేవుల మధ్య యుద్ధం ఘోరంగా జాగుతుంది. ఇరుపక్షాల అయిదు వేల మూడు వందల ఏనుగులు నేల కూలాయి. యుద్ధ భూమి అంతా పీనుగుల పెంట అయింది. మిగిలిన ఏడు వందల హయములతో శకుని తప్పించుకున్నాడు. శకుని సుయోధనుడి వద్దకు వెళ్ళి " ముందు పాండవుల వద్దకు వెళ్ళి వారి గజబలమును అశ్వబలమును తుద ముట్టించాలి. తరువాత కాల్బలములను నాశనం చేయవచ్చు" అన్నాడు. శకుని మాటలు విని సుయోధనుడు తన గజ, అశ్వబలాలను సమాయత్తం చేసాడు.

కృష్ణార్జునుల సంభాషణ

[మార్చు]

శకుని సుయోధనుల సంభాషణ విని అర్జునుడు " కృష్ణా ! చూసావా పద్దెనిమిది రోజుల యుద్ధం తరువాత కురుసైన్యం పూర్తిగా ఏ వైపు చూసినా సుయోధునుడిలో మార్పు రాలేదు. భీష్ముడు పడి పోయిన తరువాత సంధి చేసుకుంటే ఇంత వినాశనం తప్పేది. సుయోధనుడి మూర్ఖత్వం సంధి చెయ్యనివ్వ లేదు. ద్రోణుడు, జయద్రధుడు, భగదత్తుడు మరణించిన తరువార కూడా సుయోధనుడిలో మార్పు రాలేదు. సర్వనాశనం జరిగి పోయింది. సుయోధనుడు ఎవరిని లక్ష్యపెట్ట లేదు. తన ఆప్తులైన కర్ణుడు, దుశ్శాసనుడు మరణించిన తరువాత కూడా అతడికి బుద్ధి రాలేదు. శల్యుడి మరణం కూడా అతడిలో మార్పు తీసుకురాలేదు. అతడి మూర్ఖత్వాన్ని ఏమనాలి ? సుయోధనుడి తనువులో ప్రాణమున్నంతవరకు రాజ్యభోగాల మీద ఆశ అతడిని విడువదు. అతడు తన లోభం వదిలి రాజ్యభాగాన్ని ఇవ్వడు కనుక అతడి మరణం తప్పదని తేలిపోయింది " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! నేను సంధి చేయడానికి కురుసభకు వెళ్ళినప్పుడు విదురుడు కూడా ఇదే అన్నాడు. " కృష్ణా ! నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? సుయోధనుడు వివేక హీనుడు, దుర్మదాంధుడు. సుయోధనుడు మంచి మాటలతో రాజ్యభాగం ఇవ్వడు కనుక యుద్ధం తప్పదు " అన్నాడు. సుయోధనుడు జన్మించినపుడు మహా మునులు అప్పుడు జరిగిన ఉత్పాతాలు చూసి " ఇతడు సమస్త రాజలోకముకు క్షయకారకుడవుతాడు " అని చెప్పారు. అది అక్షరాల నిజమైంది " అన్నాడు. " అవును కృష్ణా ! సుయోధనుడి మూర్ఖత్వం స్వార్ధం అతడి మరణంతో కాని వదలదు. అందుకనే సైన్యం అంతా క్షీణిస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగిస్తున్నాడు "అన్నాడు.

పాండవులు కురుసైన్యాలను నాశనం చేయుట

[మార్చు]

కృష్ణార్జునులు యుద్ధ విశేషాలు విశ్లేషించి శేషించిన కురు సేనతో యుద్ధముకు తలపడ్డారు. అర్జునుడి ధాటికి ఆగ లేక కురుసేనలు పారిపోతున్నాయి. సుయోధనుడు వారికి ధైర్యం చెప్తూ చేయి ఊపుతూ వారిని యుద్ధముకు పురి కొల్పుతున్నాడు. మరొక పక్క శతానీకుడు ధృష్టద్యుమ్నుడు కౌరవసేనలను తన బాణాలతో తుద ముట్టిస్తున్నారు. సుయోధనుడు ధృష్టద్యుమ్నుడిని వక్షస్థలంలో తన బాణముతో కొట్టాడు. ధృష్టద్యుమ్నుడు పదునైన బాణములతో సుయోధనుడిని సారధిని, రధాశ్వములను చంపాడు. సుయోధనుడు రధము దిగి గుర్రము నెక్కి తన గజబలముతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు సుయోధనుడి గజబలం మీద బాణములను వర్షంలా కురిపించాడు. మరొక పక్క భీమసేనుడు సుయోధనుడి గజబలమును నిర్మూలిస్తున్నాడు. అది చూసి ధర్మరాజు నకుల సహదేవులతో అక్కడకు చేరుకున్నాడు. సుయోధనుడు వారి మధ్య చిక్కుకున్నాడు. సుయోధనుడు కనపడక అశ్వత్థామ, కృపాచార్యుడు, సుయోధనుడు పాండవుల చేతిలో చనిపోయాడని భ్రమపడ్డారు. వారు సుయోధనుడిని వెదుకుతూ శకుని వద్దకు చేరుకున్నారు. మిగిలిన వారు సుయోధనుడు బ్రతికినా చచ్చినా ఒకటే వెతకడం వృధా అనుకున్నారు. భీముడు కౌరవ గజబలమును ధ్వంశం చేస్తున్నాడు. అది చూసి కౌరవసేనలో చావగా మిగిలిన సేనలు భీముని చుట్టు ముట్టాయి. భీముడు ఆగ్రహోదగ్రుడై వారిని గద తో చావబాదాడు. అయిదు వందల రధములు, ఏడు వందల ఏనుగులు, ఎనిమిది వందల హయములు పది వేల సైనికులను చంపాడు. మిగిలిన వారు భీముడి వంక చూడటానికే భయపడ్డారు. ధృతరాష్ట్ర మహారాజా ! భీమసేనుడు నీ కుమారులైన దుర్మర్షణుడు, శ్రుతాంతుడు, జైత్రుడు, భూరిబలుడు, జయత్సేనుడు, సుజాతుడు, దుర్విహుడు, దుర్విమోచనుడు, అరిహుడు, దుష్ప్రదర్షుడు, శ్రుతపర్వుడు, మహాబాహుడు మొదలగు వారిని చంపాడు. సుయోధనుడి తమ్ములలో సుదర్శనుడు మాత్రం మిగిలాడు. సుయోధనుడి వెంట ఇక కొద్ది పాటి సైన్యమే మిగిలింది. అది చూసిన కృష్ణుడు " అర్జునా ! శత్రు సంహారం ముగిసింది. సుయోధనుడు అతడి తమ్ముడు సుదర్శనుడు కొద్ది పాటి సైన్యం మాత్రమే మిగిలింది. ఇక సుయోధనుడి వధ మాత్రం మిగిలింది. అది పూర్తిగావించి కీర్తిమంతుడివి కా " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! ఇంకా శకుని అతడి వెంట రెండు వందల రథములు, వంద ఏనుగులు, అయిదు వందల హయములు ఉన్నాయి. ఇంకా కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ మిగిలారు. వీరంతా నాకు ఒక లెక్క లోనిది కాదు. తృటిలో సంహరిస్తాను " అన్నాడు.

శకుని వధ

[మార్చు]

కృష్ణుడు రధమును సుయోధనుడి వంకకు పోనిచ్చాడు. సహదేవుడు, భీముడు, సుయోధనుడిని చంపడానికి చెరి ఒక వైపు నుండి వచ్చారు. ఇంతలో శకుని తన సైన్యముతో వారి ముందు నిలిచాడు. శకుని, సుశర్ముడు అర్జునుడిని, సుదర్శనుడు భీమసేనుడిని, సుయోధనుడు సహదేవుని ఎదుర్కొన్నారు. సుయోధనుడు ఒక బల్లెమును సహదేవుడి మీద వేసాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. వెంటనే తేరుకుని సహదేవుడు సుయోధనుడి మీద అత్యంత శక్తివంతమైన బాణములు ప్రయోగించాడు. కౌరవ సైనికులు తోమరములతో అర్జునుడిని కప్పారు. అర్జునుడు కోపించి వాడి అయిన బల్లెములతో గాంధార సేనల తలలు నరికాడు. ఇంతలో త్రిగర్త సైనికులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు సంశక్తులలో ఒక్కడైన సత్యకర్ముడి తలను నరికాడు. చివరగా మిగిలిన సంశక్తుడు సత్యేషుడిని కూడా చంపాడు. ఆఖరుగా మిగిలిన సుశర్మ వక్షస్థలముకు గురి పెట్టి ఒక బల్లెము విసిరాడు. ఆ బల్లెము సుశర్మ వక్షస్థలం చీల్చింది. తరువాత అర్జునుడు సుశర్మ కుమారులు అందరిని ఒక్కొక్కరిని మూడేసి బాణములతో కొట్టి చంపాడు. సంశక్త సైన్యం పారి పోయింది. భీముడు చావగా మిగిలిన సుయోధనుడి తమ్ముడు సుదర్శనుడిని సంహరించాడు " ఓ ధృతరాష్ట్ర మహారాజా ! ఇక నీకుమారులలో ఒక్క సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. శకుని సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గుచ్చాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగారు. అది చూసి కౌరవసేనలు పారి పోయాయి. సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించాడు. సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేసాడు. సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచాడు. శకుని మహా కోపంతో సహదేవుని కత్తిని, గద ను, బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలో ఖండించాడు. అది చూసి శకుని తన రథ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోయాడు. సహదేవుడు అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలల ఫలితం చూసావు కదా ! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని సహదేవుడు శకుని రథాశ్వములను, కేతనమును, విల్లును ఖండించాడు. అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలింది. మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు.

సుయోధనుడి నిష్క్రమణ

[మార్చు]
తన శంఖమును ఊది యుధ్ధము పూర్తి అయిందని ప్రకటిస్తున్న శ్రీ కృష్ణుడు

శకుని మరణానికి పాండవ సైన్యం హర్షాధిరేకంతో జయజయ ధ్వానాలు చేసారు. యోధులు పరమ ప్రమోదంతో శంఖధ్వానం చేసారు. గాంధార సేనలు శకుని మరణం తరువాత కూడా బెదరక తమ రాజు మరణానికి కారకుడైన సహదేవుడి మీద తిరగబడింది. సహదేవుడికి సాయంగా అర్జునుడు, భీముడు నిలబడ్డారు. భీమార్జున ధాటికి ఆగలేక వారి ధాటికి గాంధార సైన్యం నశించింది. సుయోధనుడు రణభూమిలో ఒంటరిగా నిలబడ్డాడు. ఎదురుగా ఆనందాతిరేకంతో హర్షధ్వానాలు చేస్తున్నారు. సుయోధనుడు యుద్ధభూమిని వదిలి వేయడానికి నిశ్చయించుకున్నాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా ! ఆ సమయమున ఇరుపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయి " అని అడిగాడు. సంజయుడు " మహారాజా! ఒక్క సుయోధనుడు తప్ప కౌరవ సైన్యం అంతా సర్వ నాశనం అయింది. పాండవ పక్షాన రెండు వేల రథములు, ఏడు వందల ఏనుగులు, అయిదు వందల హయములు, పది వేల కాల్బలం మిగిలారు. సుయోధనుడు తన గదను భుజం మీద పెట్టుకుని రణభూమిని విడిచి ఎటో వెళ్ళాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. సుయోధనుడి నిష్క్రమణతో పద్దెనిమిది రోజులు అవిచ్ఛన్నంగా సాగిన యుద్ధం సమాప్తమైంది.

బయటి లింకులు

[మార్చు]