ఉపపాండవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వలిన కలిగిన సంతానం. వీరు మహాభారత యుద్ధం తరువాత ద్రోణకుమారుడు ఐన అశ్వత్థామచే సంహరించబడ్డారు. వీరి పేర్లు

  1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)
  2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)
  3. శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు)
  4. శతానీకుడు - (నకులుని పుత్రుడు)
  5. శ్రుతసేనుడు - (సహదేవుని పుత్రుడు)

త్రేతాయుగపు కాలంనాటి హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని విశ్వామిత్రుడు అతని రాజ్యము, భార్య, పిల్లలు కట్టు బట్టలతో సహా వదిలి పొమ్మని ఆదేశిస్తాడు. ఈక్రమంలో రాణిపై చేయికూడా చేసుకుంటాడు. ఆ సమయంలో పరమ వీరులయిన అయిదుగురు సైనికులు/రక్షకభటులువిశ్వామిత్రుని చర్యకు మండిపడి అతనిచర్యలను ఖండిస్తారు. దీనికి ఆగ్రహం చెందిన విశ్వామిత్రుడు మీకు ఈ జన్మలో మోక్షం రాకపోవుకాక అని శపిస్తాడు. భీతిల్లిన ఆ రక్షకభటులు మునివర్యుని శాంతింపజేసి, శాపానికి విరుగుడు ప్రసాదించమని వేడుకుంటారు. శాంతించిన విశ్వామిత్రుడు మీరు వచ్చేజన్మలో ఏ బంధాలు ఏర్పడక ముందే చనిపోవుదురు. తర్వాతి జన్మలో పాండవుల పుత్రులుగా జన్మించి ఏ తప్పు చేయనప్పటికీ అశ్వథ్థామ చేతిలో నిద్రించే సమయంలో మరణించి మోక్షం పొందుతారు అని అభయమిస్తాడు. (వారిని చంపిన అశ్వథ్థామ రహస్యం తల్లి అయిన ఉత్తర గర్భంలో ఉన్న పరిక్షిత్తుకు (అభిమన్యుని కుమారునికి) తెలుస్తుంది. ఈ విషయంతెలుసుకున్న అశ్వథ్థామ ఆ గర్భస్థ శిశువును హతమార్చాలని కూడా చూస్తాడట. కానీ శ్రీకృష్ణుడుకాపాడతాడని ఇంకొక కథ ఉంది) ఆ విధంగా పుట్టిన వారే ఉప పాండవులు....

కురుక్షేత్ర సంగ్రామంలో ఉపపాండవుల శౌర్యాన్ని గూర్చి పెక్కు ప్రస్తావనలు ఉన్నాయి. ఆరవనాటి యుద్ధంలో కౌరువులు భీమ దృష్టద్యుమ్నులపై ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు. అప్పుడు పాండవుల పుత్రులు ఐదుగురూ అసమానమైన పరాక్రమం చూపి కౌరవులను పరుగులు తీయించారు. ముఖ్యంగా నకులుని కొడుకు శతానీకుని ప్రతాపం అందరినీ మెప్పించింది. పదహారవరోజు యుద్ధంలో ప్రతివింధ్యుడు విజృంభించి తోమరంతో కౌరవ వీరుడైన చిత్రసేనుని చంపేశాడు. ప్రతివింధ్యుని ఎదిరించిన కౌరవసేన పలాయనం చిత్తగించింది.

సౌప్తిక పర్వం

ఉపపాండవుల మరణం సౌప్తిక పర్వంలో చెప్పబడింది. "అపాండవం" చేస్తానని దుర్యోధనునికి మాట యిచ్చిన అశ్వత్థామ ఈశ్వరదత్తమైన ఖడ్గంతో పాండవసేనపై రాత్రిపూట దాడిచేశాడు. ప్రతివింధ్యున్ని అడ్డంగా నరికేశాడు. శ్రుతసోముడి గొంతు కోసేశాడు. శ్రుతకర్ముడి తల నరికి మెండాన్ని కాలితో తన్నాడు. శతానీకుని, శ్రుతసేనుని తల నరికేశాడు. ఇలా అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు కలిసి ధృష్టద్యుమ్నుడి శిబిరంలో సమస్త సేనను ఘోరంగా చంపేశారు.

విజయశ్రీని వరించామని సంతోషంగా ఉన్నపాండవులకు జరిగింది తెలియగానే వారు ఒక్కమారు మ్రాన్పడిపోయారు. అన్నదమ్ముల శవాలను, పుత్రుల శవాలను చూసి ద్రౌపది గొల్లుమంది. భీమార్జునులు అశ్వత్థామను పట్టుకొన్నారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా అతని తలపైనున్న సహజ సిద్ధమైన మణిని తీసుకొని వదిలేశారు.

మూలాలు

[మార్చు]