Jump to content

నహుషుడు

వికీపీడియా నుండి

నహుషుడు (సంస్కృతం: नहुष) చంద్ర వంశంలో జన్మించిన రాజు. ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవియందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఇతడు ప్రభ - ఆయువుల పుత్రుడు.ఈతని భార్య ప్రియంవద. ప్రియంవద ద్వారా యతి, యయాతి, సంయాతి, యాయాతి, ధ్రువులనే పుత్రులను కన్నతండ్రి. నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు యాగాలు చేశాడు.(శ్రీమద్భాగవతమునందును, విష్ణుపురాణమునందును నహుషుని కొడుకులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆఱుగురు చెప్పఁబడి ఉన్నారు)

దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి. ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యాదోషం పట్టుకుంది. తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడన్ననుకొని ఆచూకి తెలియని సరస్సులో తామరతూడులో దాగున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని అలోచించి మునులతో సంప్రదించి నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా దేవతలు నహుషుని స్వర్గాధిపతిని చేశారు. పదవి లభించగానే గర్వాంధుడై శచీదేవిని కోరుకుంటాడు. ఆమె విష్ణుముర్తిని వేడుకొనగా, ఆతని సలహా మేరకు నహుషున్ని తనవద్దకు సప్తర్షులు పల్లకీ మోయగా రమ్మని కోరుతుంది. తప్పని పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్తర్షులలో అగస్త్య మహర్షిని నషుషుడు కాలితో తంతాడు. అందుకు ముని నహుషున్ని పదివేల సంవత్సరాలు సర్పంగా పడివుండమని శపిస్తాడు. అగస్త్యున్ని క్షమించమని కోరగా ఎవరయితే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆనాడే నీకు శాపవిముక్తి అని చెబుతారు. ఆనాటి నుండి నహుషుడు సర్పరూపంలో ద్వైతవనంలో తిరుగుతున్నాడు.

పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి ద్వైతవనంలో ప్రవేశిస్తారు. అక్కడ సంచరిస్తున్న భీమున్ని నహుషుడు తన తోకతో బంధిస్తాడు. తమ్మున్ని వెతుక్కుంటూ ధర్మరాజు అది చూచి ఆశ్చర్యపోతాడు. అతన్ని వదిలిపెట్టమని కోరిన ధర్మరాజుని ప్రశ్నలకు సమాధానం చెబితే విడిచిపెడతానంటాడు. అతని ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలిచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాపవిముక్తుడౌతాడు.


ఈతఁడు తన గుణాతిశయముల చేత దేవతలవలన ప్రార్థింపఁబడి దేవేంద్రునికి బ్రహ్మహత్యదోషము సంభవించి ఉండు కాలమున దివిజరాజ్యము చేసెను. అట్లయినను ఇతఁడు దేవరాజ్యము లభింపఁగానే గర్వించి వేదములనుగూర్చి నిర్లక్ష్యముగ భాషించినందున అగస్త్యుఁడు ఇతని అజగరము అగునట్లు శపించెను. ఆశాపము పాండవుల అరణ్యవాసకాలమున తాను అడిగిన కొన్ని ప్రశ్నలకు ధర్మరాజు సమాధానము చెప్పఁగా వినినంతట తీఱెను.


మూలాలు

[మార్చు]
  • నహుషుడు: డాక్టర్ కె. సూర్యనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1999.
  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
"https://te.wikipedia.org/w/index.php?title=నహుషుడు&oldid=3878879" నుండి వెలికితీశారు