ఎం. ఎస్. నారాయణ
ఎం. ఎస్. నారాయణ (ఏప్రిల్ 16, 1947 - జనవరి 23, 2015) గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు, రచయిత. సుమారు 17 సంవత్సరాల కెరీర్లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించాడు.[1] చదువుకునే రోజుల నుంచీ హాస్య రచనలు చేస్తూండేవాడు. కొన్ని నాటకాలు రాశాడు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మా నాన్నకి పెళ్ళి (1997).[2] అందులో ఆయన ఒక తాగుబోతు పాత్రలో నటించాడు. తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించాడు.
నేపథ్యం
[మార్చు]గతంలో ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క.[3]
వ్యక్తిగత జీవితము
[మార్చు]బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంవల్ల పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు.
పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయన వద్ద ఎంఎస్ శిష్యరికం చేశారు. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు. తన క్లాస్‌మేట్ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్ళి చేయించడం విశేషం.
వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్రులో వాలిపోయేవారు. తన స్నేహితులు, సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎపుడూ చెపుతుండేవారు. నిడమర్రు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు. 2015 లో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
నాటకాలు
[మార్చు]తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తు గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరాణిక నాటకాలు వేశారు. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడిగా నాటకాలు వేసి అందర్ని మెప్పించేవారు. భీమవరం కేజీఆర్‌ఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించారు.[4]
సినీ ప్రస్థానము
[మార్చు]1995లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. అయితే అంతుకు ముందే వెగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టితో రుక్మిణి సినిమా కథ చర్చల్లో ఆయన హావ భావ ప్రదర్శనకు ముగ్దుడై హాస్యనటుడిగా ఎమ్ ధర్మరాజు ఎం. ఏ. అవకాశం కల్పించారు. పుణ్యభూమి నాదేశం, రుక్మిణి (సినిమా) చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో మా నాన్నకు పెళ్ళి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు.[4]
పేరు పడ్డ సంభాషణలు
[మార్చు]- ఏం చేస్తున్నావ్ ... ఏం చేస్తున్నావ్ ... అని మాటిమాటికీ అడగొద్దు. ఏదో ఒకటి చేసేయగలను (నువ్వు నాకు నచ్చావ్)
- అమ్మా ... నీ కళ్ళేవీ? (నువ్వు నాకు నచ్చావ్)
- షేక్ ఇమామ్ (శివమణి)
- సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు (బన్ని)
- ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి (అతడు)
తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు
[మార్చు]ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు (రామసక్కనోడు, మానాన్నకు పెళ్ళి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు), 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
చలన చిత్ర ప్రస్థానము
[మార్చు]నటించిన చిత్రాల పాక్షిక జాబితా
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- 2011 - ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - దూకుడు
మరణం
[మార్చు]అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్‌లో గల కిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ 2015, జనవరి 23 న మృతిచెందారు.
మూలాలు
[మార్చు]- ↑ ""ఎంఎస్ నారాయణ ఇకలేరు.."". www.sakshi.com. సాక్షి. 23 January 2015. Retrieved 23 January 2015.
- ↑ Codingest. "నవ్వుల నారాయణ". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 2021-02-09. Retrieved 2021-02-12.
- ↑ ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు". తోటపల్లి మధు. Retrieved 27 February 2018.[permanent dead link]
- ↑ 4.0 4.1 http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=699731[permanent dead link]
- ↑ "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
- ↑ "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
- ↑ The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
- ↑ Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 December 2019. Retrieved 30 May 2020.
- ↑ Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 30 May 2020.[permanent dead link]
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
- ↑ "143 review". idlebrain. Retrieved 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Archived from the original on 16 మే 2019. Retrieved 16 May 2019.
బయటి లింకులు
[మార్చు]- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- నంది పురస్కారాలు
- 1950 జననాలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా హాస్యనటులు
- తెలుగు సినిమా దర్శకులు
- నంది ఉత్తమ హాస్యనటులు
- తెలుగు సినిమా రచయితలు
- 2015 మరణాలు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు
- పశ్చిమ గోదావరి జిల్లా రంగస్థల నటులు