Jump to content

స్వారోచిష మనుసంభవము

వికీపీడియా నుండి

మనుచరిత్ర, మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు. ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును" [1]

"మనుచరిత్రము" వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ 1947 ముద్రణ ముఖచిత్రం

అల్లసాని పెద్దన, కృష్ణదేవరాల ఆస్థానంలో ఆష్టదిగ్గజాలలో ఒకడు.

ఇతివృత్తము

[మార్చు]

మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. కాశీ నగరం దగ్గర అరుణాస్పద పురము అనే గ్రామములో ప్రవరుడు అనే పరమ నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య సోమిదమ్మి ఎంతో అనుకూలంగా వుండే వారు. . వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. ఒక నాడు వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది.

తిరుగు ప్రయాణమునకు మార్గం గాన రాక ఒక ఉపాయం‌ కోసం చూస్తున్న ప్రవరుడిని చూసి వరూధిని అనే గంధర్వ కన్య మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.

రచనా వైభవం

[మార్చు]

మనుచరిత్రంలో పెద్దన కథన కౌశలం, వర్ణనా చాతుర్యం పండితుల ప్రశంసలందుకొన్నాయి. పెద్దనను సమకాలికులు, అనంతర కవులు కూడా అనుసరించారు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే.[2] పెద్దన రచనలో ముఖ్యాంశాలు

  • వర్ణనా కౌశలం : హిమశైల వర్ణన, ఆరవ అశ్వాసంలో ఋతువర్ణనలు, యుద్ధ వర్ణనలు వంటి అనేక అద్భుతమైన వర్ణనలున్నాయి. ప్రబంధంలో ఉండవలసిన అష్టాదశవర్ణనలన్నీ ఇంచుమించుగా మనుచరిత్రలో కనబడుతాయి.

మచ్చుకు ఈ పద్యం చూడండి.

 అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్.

------------ పెద్దన మనుచరిత్రము నుండి.

  • పాత్ర పోషణ : వరూధినీ ప్రవరులు ఈనాటికీ మన సంభాషణలలో చోటు చేసుకోవడం పెద్దన పాత్ర పోషణలోని నైపుణ్యానికి చిహ్నం.[2]
  • రస పోషణ : శృంగారం, శాంతం, ధర్మం, అద్భుతం, బీభత్సం వంటి అనేక రసాలు ఆయా వృత్తాంతాలలో పాత్రలకు తగినంత ఔచిత్యంతో పెద్దన పోషించాడు.
  • అలంకారిక రామణీయత : పాత్రలకు, సన్నివేశాలకు, రసానికి అనుగుణంగా అలంకారాలను ప్రయోగించాడు.
  • కవితా శైలి : "అల్లసానివారి అల్లిక జిగిబిగి" అనే నానుడి ఉంది. "జిగి" అంటే కాంతి. "బిగి" అంటే కూర్పు, పట్టు. అంటే పదాల ఎంపికలోను, సమాసాల కూర్పులోను, పద్యాల ఎత్తుగడలోను చక్కదనం, చిక్కదనం ఉంటాయన్నమాట.[2]

ప్రశంసలు, విమర్శలు

[మార్చు]

చీమలమర్రి బృందావనరావు : మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత కచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు. ... కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంథం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.[3]

విశేషాలు

[మార్చు]

ఇది తొలి తెలుగు ప్రబంధము, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుండి స్ఫూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు అశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా చెపుతారు.

ఉదాహరణలు

[మార్చు]

వినాయక ప్రార్థన

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా:
ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ:
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా:
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌:

హిమాలయ వర్ణన

అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ:
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన:
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌:
కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌:
తలమే బ్రహ్మకు నైన నీనగమహత్త్వం బెన్న? నే నియ్యెడన్:
గలచోద్యంబులు ఱేపు గన్గొనియెదన్ గా కేమి, నేఁ డేఁగెదన్:
నలినీ బాంధవభానుతప్తరవికాంతస్యందినీహారకందళచూ:
త్కారపరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నమున్ దెల్పెడిన్:.

ఎండకు మంచు కరిగి దానితో పాదములకున్న పసరు కరిగి వెళ్ళుటకు అశక్తుడైనప్పుడు ఈ విధంగా చింతించును,

నను నిముసంబు గానక యున్న నూరెల్ల:
నరయు మజ్జనకుఁ డెం తడలు నొక్కొ:
ఎపుడు సంధ్యలయందు నిలు వెళ్ళనీక న:
న్నోమెడు తల్లి యెంతొఱలు నొక్కొ:
యనుకూల గతి నాదుమనసులో వర్తించు:
కులకాంత విది నెంత కుందు నొక్కొ:
కెడఁ దోడునీడ లై క్రీడించు సచ్ఛాత్రు:
లింతకు నెంత చింతింతు రొక్కొ:
యతిథిసంతర్పణంబు లే మయ్యె నొక్కొ:
యగ్ను లేమయ్యె నొక్కొ, నిత్యంబు లైన:
కృత్యముఁ బాపి దైవంబ | కినుక నిట్లు:
పాఱ వైచితె ? మిన్నులు పడ్డచోట:.

నర్మగర్భంగా వరూధిని పలుకులు

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ:
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా:
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ:
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌:

ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట

ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై:
యంచుల్‌ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ:
యంచున్‌ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ:
మ్మంచున్‌ ద్రోచె కలంచునే సతులమాయల్‌ ధీరచిత్తంబులన్‌:

మూలాలు

[మార్చు]
  1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  2. 2.0 2.1 2.2 తెలుగు సాహిత్య చరిత్ర - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
  3. ఈమాటలో వ్యాసం Archived 2008-10-30 at the Wayback Machine "నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన" - చీమలమర్రి బృందావనరావు

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]