నాదెండ్ల గోపన
నాదెండ్ల గోపన లేదా నాదెండ్ల గోపమంత్రి కొండవీడు దుర్గాధిపతి, సాళువ తిమ్మరసు చివరి మేనల్లుడు, శ్రీకృష్ణదేవరాయల సామంతుడు. ఈయన తండ్రి నాదెండ్ల తిమ్మయ్య, తల్లి తిమ్మరుసు చెల్లెలు కృష్ణమాంబ.
నాదెండ్ల గోపమంత్రి ముత్తాత పేరు మల్లయ్య. ఈయనకు గంగన, చిట్టి గంగన్న అని ఇద్దరు సోదరులు. చిట్టి గంగన్న సాళువ నరసింహరాయల వద్ద మంత్రిగా ఉండేవాడు. చిట్టిన గంగన్న అందగాడు, అనర్గళమైన మాటకారి. ఈయనే తన శిష్యుడైన తిమ్మరుసును రాయల కొలువులో ప్రవేశపెట్టి నాదెండ్ల మల్లయ్య మనుమరాలు లక్ష్మమ్మతో తిమ్మరుసుకు వివాహము జరిపించాడు. తిమ్మరుసు చెల్లెలు కృష్ణమాంబకు నాదెండ్ల తిమ్మయ్యతో కుండమార్పిడి వివాహము జరిపించాడు. కృష్ణమాంబకు ముగ్గురు కుమారులు పెద్దవాడు కోనయ్య, ఆ తరువాత అప్పమంత్రి, చివరివాడే నాదెండ్ల గోపమంత్రి
నాదెండ్ల గోపన తెలుగు, సంస్కృతములలో గొప్ప పండితుడు. ఈయన గయోపాఖ్యానాన్ని ద్విపదకావ్యంగా రాశాడు. కృష్ణమిత్రుడు రచించిన ప్రబోధచంద్రోదయము నాటకానికి చంద్రికావ్యాఖ్యను వ్రాశాడు. దాని అవతారికలో ఈయన గురించి తెలుస్తున్నది. మాదయ్యగారి మల్లన రచించిన రాజశేఖర చరిత్రను అంకితము పుచ్చుకొన్న నాదెండ్ల అప్పమంత్రి ఈయన అన్ననే.
శ్రీకృష్ణదేవరాయల రాజ్యారంభ కాలములో గోపమంత్రి గుత్తి దుర్గాధిపతిగా ఉండేవాడు.
1515లో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతులు ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు. కోట బాధ్యతను తిమ్మరుసుకు అప్పగించగా ఆయన తన మేనల్లుడు నాదెండ్ల గోపనను దుర్గాధిపతిగా నియమించాడు.
గోపమంత్రి 1520లో కొండవీటిలోని రాఘవేశ్వరుని ఆలయానికి ప్రాకారగోపురాలు కట్టించి తను రచించిన గయోపాఖ్యాన ద్విపదకావ్యాన్ని ఈ దేవునికి అంకిత మిచ్చాడు. ఈ కావ్యములో 1513 ద్విపద పాదాలున్నాయి. కల్పనలు వర్ణనలు పెద్దగా లేకపోయినా ఇందులోని కథ సాఫీగా సాగుతుందని ఆరుద్ర అభిప్రాయపడ్డాడు. తెలుగులో తొలి గయోపాఖ్యానము రాసిన ఘనత గోపమంత్రిదే. తెనాలి రామలింగడు వ్రాసిన ఉద్భటారాధ్య చరిత్ర కావ్యాన్ని గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికే అంకితమిచ్చాడు.
మూలములు
[మార్చు]- సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర ఏడవ సంపుటం