భారతీయ రైలు రవాణా వ్యవస్థ
భారతీయ రైల్వేలు (ఆంగ్లం: Indian Railways; హిందీ: भारतीय रेल Bhāratīya Rail); సంక్షిప్తంగా భా.రే.) భారత ప్రభుత్వ విభాగము. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది. భారతీయ రైల్వేలు కార్పొరేట్ సంస్థ కానప్పటికీ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ నిర్వహణ శైలిని అలవర్చుకొంటోంది.
భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక [1] మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది. [2] భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదహారు లక్షలు)కలిగి వున్న సంస్థగా రికార్డుని నెలకొల్పింది.[3]
రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ఈ మార్గాల మొత్తం దూరం సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు). సం,2002 నాటికి రైల్వేల వద్ద 2,16,717 వాగన్లు, 39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు ఉన్నాయి. భారత రైల్వే ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతూండగా అందులో 8,702 పాసెంజర్ రైళ్ళు. [2]
భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా సం.1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. సం.1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. సం.1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు (long distance) , నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (suburban)అవసరమైన రైళ్ళను నడుపుతోంది.
చరిత్ర
[మార్చు]భారతదేశంలో రైల్వే వ్యవస్థ కొరకు 1832లో ప్రణాళిక రూపొందించినా, తరువాతి దశాబ్ద కాలం వరకూ ఆ దిశలో ఒక్క అడుగూ పడలేదు. భారతదేశంలో మొదటి రైలు 1837 లో రెడ్ హిల్స్ నుండి చింతప్రేట్ వంతెన వరకు నడిచింది. దీనిని రెడ్ హిల్ రైల్వే అని పిలుస్తారు , విల్లియం అవేరీచే తయారు చేయబడిన రోటరీ స్టీమ్ లోకోమోటివ్ని ఉపయోగించారు. ఈ రైల్వే సర్ ఆర్థర్ కాటన్ చే నిర్మించబడింది , ప్రధానంగా మద్రాసులో రహదారి నిర్మాణ పనుల కొరకు గ్రానైట్ రాళ్ళను రవాణా చేయడానికి ఉపయోగించబడింది. 1844 లో, అప్పటి గవర్నరు జనరలు, లార్డు హార్డింజ్ రైల్వే వ్య్వస్థ నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు. రెండు కూత రైల్వే కంపెనీలను స్థాపించి, వాటికి సహాయపడవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీని అదేశించారు. ఇంగ్లండు లోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా తరువాతి కొద్ది సంవత్సరాలలో రైల్వే వ్యవస్థ త్వరిత గతిన ఏర్పడింది. 1845 లో గోదావరిలో ఒక డ్యామ్ నిర్మాణం కోసం రాళ్ళు సరఫరా చేయడానికి ఉపయోగించే రాజమండ్రిలో దోల్స్లేవమ్ వద్ద గోదావరి డాం కన్స్ట్రక్షన్ రైల్వేను నిర్మించారు. 1851 లో సోలాని అక్విడక్ట్ రైల్వేను రూర్కీలో నిర్మించారు, దీనిని ఒక బ్రిటీష్ అధికారి పేరు మీద ఉన్న "థామస్సన్" అని పిలిచే ఆవిరి లోకోమోటివ్లచే నడపబడుతుంది. సోలానీ నదిపై ఒక కాలువ కోసం నిర్మాణ పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించబడింది. కొన్నేళ్ళ తరువాత, 1853 ఏప్రిల్ 16 న బాంబే లోని బోరి నందర్, ఠాణాల మధ్య -34 కి.మీ.దూరం - మొట్టమొదటి ప్రయాణీకుల రైలును నడిపారు.
ఆంగ్ల ప్రభుత్వం ఎల్లపుడూ రైల్వే సంస్థలను స్థాపించమంటూ ప్రైవేటు రంగ పెట్టుబడుదారులను ప్రోత్సాహించేది. అలా సంస్థలను స్థాపించేవారికి మొదటి సంవత్సరాలలో సంవత్సరానికి లాభం ఐదు శాతానికి తక్కువ కాకుండా ఉండేలా ప్రణాళికను తయారుచేసింది. అలా పూర్తి అయిన తరువాత ఆ సంస్థ ప్రభుత్వానికి అప్పగించేది, కానీ సంస్థ యొక్క కార్యాకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచుకొనేవి. 1880 సం నాటికి ఈ రైలు మార్గాల మొత్తం దూరం సుమారుగా 14,500 కి.మీ (9000 మై) వరకు విస్తరించింది. ఈ మార్గాలలో ఎక్కువ శాతం మహా నగరాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలకు చేరుకునేలా వుండేవి. 1895 నుండి భారతదేశం తన సొంత లోకోమోటివ్స్ (locomotives) స్ద్డాపించడం మొదలుపెట్టింది. తరువాత 1896లో తమ ఇంజనీర్లను , locomotive లను ఉగాండా రైల్వే నిర్మాణానికి పంపింది.
తరువాత భారత రాజ్యాలులు తమ సొంత రైల్వేలను ఏర్పాటు చేసుకొని తమ రాజ్యమంతా విస్తరించారు. అవి నవీన రాష్ట్రాలు అయిన అస్సాం, రాజస్థాన్ , ఆంధ్ర ప్రదేశ్. 1901లో రైల్వే బోర్డు ఏర్పాటు చేయబడింది కాని దాని మొత్తం అధికారం భారత వైస్రాయ్ (లార్డ్ కర్జన్) దగ్గర ఉండేది. రైల్వే బోర్డును కామర్స్ డిపార్ట్ మెంటు పర్యవేక్షంచేది. ఇందులో ముగ్గురు సభ్యులు ఉండేవారు. వారు ఒక ప్రభుత్వ అధికారి (ఛైర్మెన్), ఇంగ్లండు నుండి ఒక రైల్వే మానేజర్ , , రైల్వే కంపెనీలలో నుండి ఒక కంపెని ఏజెంట్. భారతీయ రైల్వే చరిత్రలో మొదటిసారిగా రైల్వే సంస్థలు చిన్నపాటి లాభాలను ఆర్జించటం మొదలైంది. ప్రభుత్వము 1907లో అన్ని రైల్వే కంపేనీలను స్వాధీనము చేసుకొన్నది.
ఆ తరువాతి సంలో విద్యుత్ లోకోమోటివ్ దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. కానీ ఇంతలో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ రైల్వేలు బ్రిటిష్ వారి యుద్ధ అవసరాలకు దేశం వెలుపల కూడా ఉపయోగించడ్డబడ్డాయి. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సరికి రైల్వేలు భారీగా నష్టపోయి ఆర్థికంగా చతికిల పడ్డాయి. ఆ తరువాత 1920 సంలో ప్రభుత్వం రైల్వే సంస్థల నిర్వహణను హస్తగతం చేసుకొని ఇతర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల పరిధి నుండి రైల్వే ఆర్థిక వ్యవహారాలను తప్పిస్తూ నిర్ణయం తీసుకొంది.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని రైళ్ళను మధ్య-ఆసియాకు తరలించి , రైల్వే కర్మాగారాలను ఆయుధ కర్మాగారాలగా ఉపయోగించడంతో రైల్వే రంగం దారుణంగా చచ్చుబడి పోయింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో (1947)రైల్వేలోని పెద్ద భాగం అప్పట్లో కొత్తగా నిర్మించబడిన పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళిపోయింది. నలభై రెండు వేర్వేరు రైల్వే సంస్థలు, అందులోని ముప్పై రెండు శాఖలు అప్పటిలోని భారత రాజరిక రాష్ట్రముల యొక్క సొత్తు, అన్నీ ఒకే సముదాయంలో కలిసి ఏకైక సంస్థగా రూపొందుకొంది. ఆ సంస్థకు "భారతీయ రైల్వే సంస్థ"గా నామకరణ చేసారు. సం 1952 లో అప్పటి వరకు వివిధ సంస్థల ఆధీనంలో వున్న రైల్వే మార్గాలను ప్రాంతాల వారీగా విభజిస్తూ మొత్తం ఆరు ప్రాంతీయ విభాగలను ఏర్పాటు చేయటం జరిగింది. భారతదేశపు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా చక్కపడటంతో అన్ని రైల్వే ఉత్పత్తులూ దేశీయంగానే తయారు చేయటం మొదలయ్యింది. 1985 సం నాటికి బొగ్గుతో నడిచే ఆవిరి యంత్రాలను తొలగించి డీజిల్ , విద్యుత్ ఇంజిన్లను వాడటం మొదలయ్యింది. 1995 సం నాటికి రైల్వే రిజర్వేషన్ సదుపాయాన్ని కంప్యుటరైజ్ చేసారు.
ట్రాకు
[మార్చు]మొత్తం రైలు మార్గము సుమారు 108,706 కీ.మీ. (67,547 మైళ్ళు). ఈ మార్గాలని వేగం ఆధారముగా (75 కీ.మీ/గం నుండి 160కీ.మీ/గం లేదా 47 మైళ్ళు/గం నుండి 99 మైళ్ళు/గం) విభజించారు. భారతీయ రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే వెడల్పైనది – 4 అడుగులు 8½ అంగుళాలు (1,435 మిల్లీ మీటర్లు)); మీటర్ గేజ్; , నారో గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే తక్కువ).
బ్రాడ్ గేజ్ – 1,676 మీ.మీ (5.5 అడుగులు) – భారతదేశములో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్. సుమారు 86,526 కీ.మీ (53,765 మైళ్ళు)ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఉంది. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ (1,000 మీ.మీ. (3.28 ft) రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారో గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడం చాలా కష్టం. మొత్తం నారో గేజ్ రైలు మార్గం 3,651 కీ.మీ (2,269 మైళ్ళు). ప్రఖ్యాత నీలగిరి పర్వత రైల్వే , డార్జిలింగ్ హిమాలయాల రైల్వేలు నారో గేజ్ రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి. రైల్వేలు ఉపయొగించిన కొన్ని రైలు మార్గాలను జంతు ప్రదర్శన శాలలో ఉపయొగిస్తున్నారు.
రైలు పట్టాల కింద ఉపయోగించే స్లీపెర్స్ ఎక్కువ భాగం కాంక్రీట్ తో తయారైనప్పటికీ కొన్ని పాత రైలు మార్గాలలో టేకు, మహాగని వంటి చెక్క స్లీపర్స్ కూడా వాడకంలో ఉన్నాయి. కాంక్రీట్ స్లీపర్స్ వాడటం వీలు కాని ప్రదేశాలలో లోహపు స్లీపర్స్ కూడా వినియోగంలో ఉన్నాయి.
బోగీ
[మార్చు]సామాన్యంగా ప్రతి ట్రైన్ వెనుక గార్డుకు ఒక ప్రత్యేకమైన భోగి కేటాయంచబడి వుంటుంది. ఈ గార్డు ట్రైన్ బయలుదేరే ముందు అన్నీ సరిగా వున్నాయో లేదో చూసి మందు వుండే వాహకునికి (డ్రైవర్) సంకేతాలను ఇవ్వవలసి వుంటుంది. సాధారణంగా ప్రతి ప్రయాణీకుల ట్రైన్ కూ నాలుగు సాధారణ బోగీలు (ముందు రెండు, వెనుక రెండు) వుంటాయి. అందులో ఒకటి ఆడవారికి కేటాయించబడి వుంటుంది. ప్రతి ట్రైన్ కీ వుండే భోగీల సంఖ్య ఆ మార్గానికి వుండే రద్దీని బట్టి వుంటుంది. అవసరాన్ని బట్టి సామాన్ల కోసం, ఉత్తరాల బట్వాడా కోసం ప్రత్యేక బోగీలు అనుసంధానించి వుండటం కూడా గమనించవచ్చు. దూర ప్రయాణాలు చేసే ట్రైన్లలో వంట సదుపాయం వుండే ప్రత్యేక బోగి భోజన సదుపాయ బోగి కూడా వుంటుంది.
నామకరణ విధానం
[మార్చు]రైళ్ళు వివిధ వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి. వీటి ప్రకారం వాటి ప్రాముఖ్యత, అవి ఆగే ప్రదేశాలు, టిక్కెట్ల రేట్లు ఉంటాయి. ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నాలుగు అంకెల పేరు ఉంటుంది – మొదటి అంకె ఆ రైలును నడిపే రైల్వే మండలాన్ని, రెండోది ఆ రైలును నియంత్రించే సదరు మండలంలోని విభాగం పేరు, చివరి రెండు ఆ రైలు వరుస సంఖ్యను తెలియజేస్తాయి.
సూపరు-ఫాస్టు రైళ్ళన్నిటికీ, మొదటి అంకె ఎప్పుడూ '2' ఉంటుంది. రెండో అంకె రైల్వే మండలాన్ని, మూడోది విభాగాన్ని, ఆ విభాగంలోని వరుస సంఖ్యను తెలుపుతాయి. రెండు గమ్యస్థానాల మధ్య ఎదురుబొదురుగా నడిచే జంటా రైళ్ళకు సాధారణంగా పక్కపక్క నంబర్లు ఉంటాయి. దాదాపుగా అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళన్నిటికీ ఓ ప్రత్యేకమైన పేరు పెడతారు. ఈ పేరు ప్రముఖ వ్యక్తులకు, సంఘటనలకు, నదులు, పర్వతాలు మొదలైన వాటికి చెంది ఉంటాయి. కొన్ని గుర్తుపెట్టుకోదగిన ఉదాహరణలు:
- హైదరాబాద్ లోని చార్మినార్ కట్టడానికి గుర్తుగా, హైదరాబాద్ , చెన్నై ల మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్.
- ఆధ్యాత్మిక నేత అయిన మాతా అమృతానందమయికి గుర్తుగా, పాలక్కాడ్ టౌన్ , తిరువనంతపురము ల మధ్య నడిచే అమృతా ఎక్స్‌ప్రెస్
- మహాత్మా గాంధీ యొక్క సబర్మతి ఆశ్రమం నకు గుర్తుగా, అహ్మదాబాద్ , న్యూ ఢిల్లీ ల మధ్య నడిచే ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్
- ప్రపంచ ప్రఖ్యాత కవి అయిన రవీంద్రనాథ టాగూరుకి గుర్తుగా ముంబయి (చత్రపతి శివాజి టెర్మినస్, CST) , హౌరా (కోల్‌కతా) ల మధ్య నడిచే గీతాంజలి ఎక్స్‌ప్రెస్
- పురాణ పురుషుడైన పరశురాముడు నకు గుర్తుగా, మంగుళూరు , తిరువనంతపురము ల మధ్య నడిచే పరశురామ్ ఎక్స్‌ప్రెస్.
- సూఫీ గురువు ఐన హజరత్ నిజాముద్దీన్ ఔలియా నకు గుర్తుగా వివిధ స్టేషన్ల మధ్య నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్.
రైల్వే మండలాలు
[మార్చు]భారతీయ రైల్వేలను 16 మండలాలు, ఒక ఉప మండలం - కొంకణ్ రైల్వే -గా విభజించారు.
|
కోల్కతా మెట్రో భారతీయ రైల్వేల స్వంతమే అయినప్పటికీ అది ఏ రైల్వే మండలంలోకీ రాదు. దానికదే ఓ ప్రత్యేక మండలంగా పరిగణిస్తారు.
రైళ్ళ క్రమం
[మార్చు]రైళ్ళను వాటి సగటు వేగం ఆధారంగా విభజిస్తారు. వేగవంతమైన రైళ్ళు కేవలం ముఖ్య రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి , దూరప్రయాణానికి కావలసిన భోజన సదుపాయాలు కూడా కలిగి ఉంటాయి.
ర్యాంకు | రైలు | విషయం |
---|---|---|
1 | రాజధాని ఎక్స్‌ప్రెస్ | ఈ రైళ్ళు పూర్తిగా ఎయిర్ కండిషన్ కలిగి, దేశంలోని ముఖ్య నగరాలను దేశ రాజధాని ఢిల్లీతో కలుపుతుంటాయి. మిగిలిన అన్ని రైళ్ళ కన్నా ఆద్యత కలిగి ఉండే ఈ రాజధాని రైళ్ళు దేశంలోనే అతి వేగవంతమైనవి. వీటి సగటు వేగం గంటకు 120 కి.మి (గంటకు 74.5 మైళ్ళు). ఈ రైళ్ళు తమ మార్గంలో కొన్ని ముఖ్య స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. |
2 | శతాబ్ది , జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ | శతాబ్ది రైళ్ళు ఎయిర్ కండిషన్ కలిగి ఉండి, ముఖ్య నగరాలను కలుపుతాయి. అయితే వీటిలో కేవలం కూర్చుని ప్రయాణించే సదుపాయం మాత్రమే ఉంటుంది. జన శతాబ్ది రైళ్ళు ఎయిర్ కండిషన్ లేకుండా ఉండి ప్రయాణ ధరలు శతాబ్ది రైళ్ళకన్నా తక్కువగా ఉంటాయి. |
3 | సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లేక మెయిల్ | ఈ రైళ్ళ సగటు వేగం గంటకు 55 కి.మి. (గంటకు 34మైళ్ళు) కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటి టికెట్టు ధరలో అదనంగా సూపర్ ఫాస్ట్ సర్చార్జి కలుపుతారు. |
4 | ఎక్స్‌ప్రెస్ | భారతదేశంలో అధిక శాతం రైళ్ళు ఈ తరగతికి చెందినవి. ఇవి సూపర్ ఫాస్ట్ రైళ్ళకన్నా ఎక్కువ స్టేషన్లలో ఆగుతాయి కాని చిన్న చిన్న ఊళ్ళ స్టేషన్లలో మాత్రం ఆగవు. |
5 | పాసెంజర్ , ఫాస్ట్ పాసెంజర్ | ఇవి నెమ్మదిగా ప్రతీ స్టేషను లోనూ ఆగుతూ వెళతాయి. వీటి టికెట్ వెల కూడా చాలా తక్కువ. రైలు మొత్తం జనరల్ కంపార్ట్మెంట్లే వుంటాయి. |
6 | సుబర్బన్ రైళ్ళు | ఇవి నగర ప్రాంతాలలో మాత్రం సంచరించే రైళ్ళు. ఇవి అన్ని స్టేషన్లలోనూ ఆగుతాయి. ప్రాధాన్యతా క్రమంలో ఇవి చివరన నిలుస్తాయి. |
రిజర్వేషన్ టిక్కెట్లు
[మార్చు]ఎనభయ్యవ దశాబ్ధం వరకు రైల్వే రిజర్వేషన్ టికేట్టు మాన్యువల్ గా జరిగేది. 1987 సంవత్సరం కంప్యూటర్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి అంచెలంచెలగా దేశమాంతా కంప్యూటర్ రిజర్వేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
1980 వరకు, భారతీయ రైల్వే రిజర్వేషన్లు సాంప్రదాయక పద్ధతి లోనే జరిగేవి. 1987, నుంచి రైల్వేలలో ఇప్పుడున్న కంప్యూటర్ విధానం అమలు లోకి వచ్చింది. 1995లో రైల్వేలు మొత్తం కంప్యుటరీకరణ చేయడంతో రిజర్వేషన్ సమాచారాన్ని ఎక్కడనుంచైనా చూడగలిగే వీలు కలిగింది. ఈమధ్య ముఖ్యమైన కూడళ్ళలో , చిన్న చిన్న గ్రామాలలో సైతం కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఏర్పాటుచేసారు. ఇటీవలే రైల్వే టికేట్టు ప్రయాణికులకు సులభ పద్ధతిలో ( అనగా ఇంటర్నెట్ ద్వారా , మొబైల్ ద్వారా ) రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఏర్పాటుచేసారు, కాని ఈ సౌలభ్యానికి అదనపు రుసుము వసూలు చేస్తారు.
కొన్ని వర్గాల వారికి అనగా ముసలవారికి (60 ఏళ్ళు పైబడిన వారికి), వికలాంగులకు, చదువుకొనే విద్యార్థులకు , పైస్ధాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు టికేట్టులో రాయితీ కేటాయించడం జరిగింది. ఒక కాల పరిమితిలో లేదా కొన్ని రైళ్ళలో లేదా కొన్ని రైల్వే విభాగాలలో ఎన్ని సార్లైనా ప్రయాణించడానికి వీలుగా సీజన్ టిక్కెట్లు కూడా లభ్యమవుతాయి. యూ-రెయిల్ పాస్ ను పోలి ఉండే ఇండ్-రెయిల్ పాస్ ను కొనడం ద్వారా విదేశీ యాత్రికులు ఒక గరిష్ఠ కాల పరిమితిలోపు భారత దేశాన్ని మొత్తం చుట్టి రావచ్చు. అనగా ఈ కాల పరిమితిలో ఎన్ని రైళ్ళనైనా ఎక్కవచ్చు.
అధిక దూరం ప్రయాణించే రైలులో పడుకొనేందుకు పడకల (బెర్త్)ఏర్పాటు ఉంటుంది. ఆ పడకలకు రిజర్వేషన్ ప్రయాణించే తారీఖుకు రెండు నెలల ముందు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రయాణించే వ్యక్తి యొక్క నామధేయము, వయస్సు , రాయితీ వివరాలు టికేట్టులో పొందుపరచబడతాయి. టికెట్టు ధర సాధారణంగా మూల ధరతో పాటు టికెట్టు ధర సాధారణంగా మూల ధరతో పాటు ప్రయాణీకులు ఎంచుకున్న బోగీ తరగతి , రాత్రి ప్రయాణాలకు గానూ రిజర్వేషన్ ధరను కూడా కలుపుకుని ఉంటుంది. మూల ధరకు కొన్నిసార్లు రైలు వర్గీకరణలను బట్టి అదనపు ధరను కలుపుతుంటారు. (ఉదాహరణకు: సూపర్ ఫాస్ట్ రైళ్ళకు సర్చార్జి టికెట్టు మూల ధరకు కలుపుతారు.)
ఒకవేళ రైలులోని సీట్లన్నీ నిండిపోయి ఉంటే టికెట్టు పై ఒక క్రమ సంఖ్యను ముద్రిస్తారు. అది ఆ రైలులో ప్రయాణించడానికి సీటు కోసం వేచి చూస్తున్నవారి సంఖ్యను సూచిస్తుంది. అలా కాకపోతే టికెట్టు పై సీటు / పడక సంఖ్యను ముద్రిస్తారు. అలాంటి టికెట్టును ఖచితపరచబడిన టికెట్టుగా వ్యవహరిస్తారు. వేచియుండు సంఖ్య ఉన్న టికెట్టు కలిగిన ప్రయాణికుడు రైలులో ప్రయాణించరాదు. కేవలం సీటు ఖచితపరచబడిన మీదటనే రైలు ఎక్కాలి. ఇవి రెండూ కాకుండా మరో రకం టికెట్టు ఉంది. దీన్ని RAC లేదా 'రిజర్వేషన్ అగైన్‌స్‌ట్ కేన్సిలేషన్' అని వ్యవహరిస్తారు. అంటే ప్రయాణం రద్దైన వారి సీట్ల కోసమని అర్థం. ఇవి ఖచితపరచబడిన , వేచియుండు టికెట్లకు మధ్య జాతి టికెట్లు. ఇలాంటి టికెట్టు కలిగిన ప్రయాణికుడు సీటు ఖచితం కాకపోయినా రైలు ఎక్కవచ్చు. ఈ టికెట్టుపైనా ఒక క్రమ సంఖ్య ముద్రించబడి ఉంటుంది. వీరికి ఈ సంఖ్య ఆధారంగా రైలు టికెట్టు కలెక్టరు ప్రయాణం మానుకున్న ప్రయాణీకుల సీట్లను కేటాయిస్తారు.
రిజర్వేషన్ లేని టికెట్లు ప్రయాణానికి ముందుగా రైల్వే స్టేషనులోనే కొనుక్కోవచ్చు. కాని ఇలాంటి టికెట్లు కొన్న ప్రయాణీకులు జనరల్ బోగీలోనే ప్రయాణించాల్చి రావచ్చు.
ఉత్పత్తి కేంద్రాలు
[మార్చు]- CLW: చిత్తరంజన్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో విద్యుత్ ఇంజన్లు తయారవుతాయి.
- DLW: వారణాసి లోని డీజల్ లోకోమోటివ్ వర్క్స్ లో డీజలు ఇంజన్లు తయారవుతాయి.
- ICF: పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీలో రైలుపెట్టెలు తయారవుతాయి. ఈ పెట్టెల నేల, అడుగున ఉండే అండరుక్యారేజీతో కలిసి ఉంటుంది.
- RCF: కపూర్తలా లోని రైల్ కోచ్ ఫాక్టరీలో కూడా రైలుపెట్టెలు తయారవుతాయి.
- RWF: యెలహంక లోని రైల్ వీల్ ఫాక్టరీలో చక్రాలు, ఇరుసులు తయారవుతాయి.
- ఇతరత్రా: BHEL కొన్ని విద్యుత్ ఇంజన్లను సరఫరా చేస్తుంది. వివిధ ఇంజను సామాగ్రి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారవుతాయి.
చూడండి
[మార్చు]- భారత రైల్వేలు
- భారతదేశ రైల్వే స్టేషన్ల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ Indian railways chug into the future
- ↑ 2.0 2.1 Salient Features of Indian Railways. Figures as of 2002.
- ↑ Guinness Book of World Records-2005, pg 93