Jump to content

నూనె

వికీపీడియా నుండి
(నూనెలు నుండి దారిమార్పు చెందింది)
కృత్రిమ మోటారు నూనెను ఒంచుతున్న దృశ్యం

నూనె లేదా తైలం (ఆంగ్లం: Oil) ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద, సాధారణ వాతావరణ పీడనంలో ద్రవరూపంలో ఉండే ద్రవ రసాయన పదార్థాలు. ఇవి సాధారణంగా నీటి లో కరుగవు. ఇవి ఎక్కువగా హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ సమ్మేళనాలు. కొన్నింటిలో వీటికి అదనంగా సల్ఫరు, నైట్రోజన్, వంటివి కూడా చేరి వుండును. వంట నూనెలు, పెట్రోలియం మొదలైనవి ముఖ్యమైన నూనెలు.

రకాలు

[మార్చు]
ఆహారంలో వాడే అవిసే నూనె సీసా

నూనెలు స్థూలంగా రెండు రకాలు: 1. శిలాజ నూనెలు. ముడి పెట్రోలియం నుండి తయారగు నూనెలు. 2. సేంద్రియ నూనెలు. జంతు, వృక్ష సంబంధిత నూనెలు.

శిలాజ సంబంధిత నూనెలు

[మార్చు]

ముడి పెట్రోలియం నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling point) కలిగిన హెక్సెను, పెట్రొలు/పెట్రోల్, కిరోసిన్ , డీసెలు వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణోగ్రత ఉన్నవి ఖనిజ తైలము / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా, ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగున్నప్పటికి, ఇవి కొవ్వు ఆమ్లాలను కలిగుండవు. ఇవి ఆధునిక మానవునికి విస్తృతంగా ఇంధనంగా ఉపయోగపడుతున్నాయి.

సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు

[మార్చు]

ఈ ఆర్గానిక్ నూనెలు మొక్కలు, జంతువులు లేదా ఇతర జీవుల నుండి ఆర్గానిక్ ప్రక్రియల ద్వారా తయారవుతాయి. అన్ని నూనెలూ కొవ్వు పదార్థాలే.

జంతు నూనెలు

[మార్చు]

జంతు/జీవనూనెలు : జంతు నూనెలను భూమి మీద నివసించు, నీళ్లలో జీవించు జంతువుల నుండి ఉత్పత్తి చేయుదురు. ఇవి రెండు రకాలు.

  • 1. క్షీరద జంతువుల పాల నుండి ఉత్పతి చేయు కొవ్వులు (ఆవు, గేదె, మేక వంటి క్షీరదాలు).
  • 2. జంతువుల దేహభాగాలు, మాంసం నుండి వేరుచేయు కొవ్వులు (లార్డ్‌, టాలో వంటివి. బీఫ్ నుండి తయారుచేయు కొవ్వును టాలో అని, పంది మాంసం నుండి ఉత్పత్తి చేయు కొవ్వును లార్డ్‌ అంటారు). జలచరాలైన చేపల తల, కాలేయముల నుండి ఉత్పత్తి చేయు కొవ్వులు (cod liver oil, fish oil వంటివి). జంతుకొవ్వులు కొవ్వు ఆమ్లాలను ట్రైగ్లిసెరైడులుగా కలిగి ఉంటాయి. లార్డ్‌, టాలో వంటి జంతు కొవ్వులలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. జలచర జంతు కొవ్వులలో ఒమేగా 3-, -6 కొవ్వు ఆమ్లాలున్నాయి.

వృక్ష నూనెలు

[మార్చు]

వృక్షనూనెలు : వృక్ష నూనెలు రెండు రకాలు.

1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే శాకతైలములు/నూనెలు (vegetable oils) అంటారు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహారయోగ్యమైనవి (edible oils). ఇవిసంతృప్త కొవ్వుఆమ్లాలు, అసంతృప్త కొవ్వుఆమ్లాలను కలిగి ఉంటాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో రెండు రకాలున్నవి.ఒకటి ఏక ద్విబంధమున్న అసంతృప్త ఆమ్లాలు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న ఆమ్లాలు.ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను బహుద్విబంధ కొవ్వు ఆమ్లాలని అంటారు. కొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహారయోగ్యం కాదు. వాటిని సబ్బులు, కొవ్వు ఆమ్లాలు, గ్రీజుల తయారిలో వాడెదరు.

2. మొక్కల/చెట్ల ఆకులు, పూలు, పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins), వేళ్ళ నుండి ఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలనుఆవశ్యక నూనె లు (essential oils) అంటారు. ఆవశ్యక నూనెలు, ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేర్వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌ బెంజిన్ రింగులను కలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలుగా వినియోగిస్తారు.

  • పూల నుండి తీయు నూనెలు: గులాబీ, మల్లెలు, జాజి వంటివి.
  • పూల మొగ్గల నుండి: లవంగనూనె వంటివి.
  • బెరడునుండి: దాల్చినచెక్క (cinnamon), cassia,, sassafras లనుండి
  • ఆకుల నుండి: నీలగిరి (Eucalyptus), దాల్చిన (cinnamon), లెమన్‌గ్రాస్‌, పెప్పెర్‌మెంట్, రోజ్‌మేరి, టీ నూనెలు
  • కాండం నుండి: గంధంనూనె, దేవదారు (cedar), కర్పూరం, రోజ్‌వుడ్‌ నూనెలు.
  • దుంపవేర్లు: అల్లం. పసుపు
  • పళ్లతొక్కలు: నిమ్మ, బత్తాయి, ద్రాక్ష
  • వేళ్లు: వెలెరియన్ (Valerian)
  • వంట నూనెలు (Cooking oils) : ఇవి నూనె గింజల నుండి తయారుచేస్తారు.

ఉపయోగాలు

[మార్చు]

ఆహారం

[మార్చు]

వివిధ రకాల వంట నూనెలు ఆహారంగా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వంటనూనెలు ఆహారంలో ఉండటం చాలా అవసరం. వంటనూనెలలో కొవ్వు ఆమ్లాలు, విటమినులు ఉంటాయి. నువ్వుల నూనె మొదలైనవి వివిధ వంటలలో రుచి కోసం, బలానికీ వాడతారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తక్కువ స్మోకింగ్ పాయింట్‌ల కారణంగా మీడియం నుండి తక్కువ వేడిలో తయారుచేసిన ఆహారానికి అనుకూలంగా ఉంటాయి, అయితే అధిక స్మోకింగ్ పాయింట్‌ల కారణంగా వేడి-పీడన నూనెలు అధిక ఉష్ణోగ్రతల వద్ద[1] భోజనం చేయడానికి ప్రాధాన్యతనిస్తాయి.

జుత్తు

[మార్చు]

నూనెల్ని జుట్టుకు మెరుపు కోసం రాసుకుంటారు. అందువలన జుట్టు చిక్కుపడిపోకుండా మెత్తగా ఉంటుంది. తలకి నూనె రాసుకొని స్నానం చేయడం చాలామందికి అలవాటు. కేశనూనెలుగా శాకనూనెలను (కొబ్బరి, ఆముదం, బాదం) ఉపయోగిస్తారు. మినరల్‌నూనెలను వాడరు. వాసననిచ్చుటకై కేశనూనెలలో ఆవశ్యక నూనెలను కలుపుతారు.

చల్లదనం

[మార్చు]

మినరల్/ఖనిజ నూనెలను కొన్ని విద్యుత్ పరికరాలలోని వేడిని తగ్గించడానికి వాడతారు. ముఖ్యంగావిద్యుత్తు ట్రాన్సుఫారంలలో. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తి అయిన విద్యుత్తును పంపిణి చేయునప్పుడు, ఉపవిద్యుత్తు పంపిణి కేంద్రాలకు పంపుటకు, ఎక్కువ వోల్టేజికి మార్చి (11-33KV) సరాఫరా చేయుదురు. అలాగే ఉపవిద్యుత్తు కేంద్రాలలో విద్యుత్తు వొల్టేజిని తగ్గించి (గృహాలకు250 volts,, పరిశ్రమలకు11Kv-440V) పంపిణి చేయుదురు. ఇలా విద్యుత్తు యొక్క వొల్టేజిని తగ్గించుటకై, పెంచుటకై ట్రాన్సుఫార్మర్ (transformer) లను ఉపయోగించెదరు. ఇలా వొల్టేజిని తగ్గించు, పెంచు సమయంలో వేడి ఉత్పన్నమగును. ఆ వేడిని తగ్గించుటకై ట్రాన్సుఫారం ఆయిల్‌ అనబడు మినరల్‌ నూనెను ట్రాన్సుఫారంలలో ఉపయోగించెదరు.

ఇంధనం

[మార్చు]

నూనెలు మండినప్పుడు వేడిని విడుదల చేస్తాయి. అందుకోసం చాలా రకాల మినరల్ నూనెల్ని (పెట్రొల్, డిజెల్‌, కిరోసిన్‌, ఫర్నెస్‌ ఆయిల్‌ వంటివి) ఇంధనంగా వివిధ వాహనాలలో ఉపయోగిస్తున్నారు.

ఘర్షణ తగ్గించడం

[మార్చు]

మోటారు యంత్రాలలోని ఘర్షణ, తద్వారా ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించడానికి మినరల్ నూనెల్ని వాడుతున్నారు. యంత్రాల ఘర్షణ తగ్గించుటకై వాడు నూనెలను కందెనలు (lubricants) అంటారు.ఇవి రెండురకాలు. ఒక రకం ఘన కందెనలు అంటారు. ఆంగ్లభాషలో గ్రీజు అంటారు. రెండవ రకము ద్రవ ఇంధనాలు. వీటిని ఖనిజనూనెలతో చేయుదురు.

విద్యుత్ ఉత్పాదన

[మార్చు]

నూనెలను మండించి, వెలువడిన ఉష్ణం ద్వారా నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్‌లను త్రిప్పి, జనరేటరులద్వారా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేయుదురు. నూనెలను ఇంధనంగా వినియోగించి, బాయిలరు ఫర్నెసులో మండించి, ఉత్పన్నమైన వేడితో బాయిలరులోని నీటిని ఎక్కువ వత్తిడి కలిగిన (25-30Kg/cm2) నీటి ఆవిరిగా (steam) మార్చి, ఆ నీటి ఆవిరితో టర్బైనును తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేయుదురు.

చిత్రలేఖనం

[మార్చు]

నూనెలలో వర్ణకాలను కలిపి ఆయిల్ పెయింట్ తయారుచేసి అద్భుతమైన కళాఖండాలను సృష్టించవచ్చును.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Cold Pressed Gingelly Oil 5 Litres". www.standardcoldpressedoil.com. Retrieved 2022-01-20.

2. Wood pressed Sesame Oil 1 Liter

"https://te.wikipedia.org/w/index.php?title=నూనె&oldid=4301952" నుండి వెలికితీశారు