ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం | |
---|---|
घृष्णेश्वर ज्योतिर्लिंग मंदिर | |
మహారాష్ట్రలో దేవాలయ ఉనికి [1] | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 20°1′29.9″N 75°10′11.7″E / 20.024972°N 75.169917°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | ఔరంగాబాదు |
ప్రదేశం | ఔరంగాబాదు, మహారాష్ట్ర |
సంస్కృతి | |
దైవం | శ్రి ఘృష్టీశ్వరుడు (శివుడు) |
ముఖ్యమైన పర్వాలు | మహాశివరాత్రి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | హేమమద్పంతి |
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం ఈశ్వరుడుకు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి. దీనిని కొన్నిసార్లు ఘర్నేశ్వర్ లేదా ఘుష్మేశ్వర్ ఆలయం అనికూడా సూచిస్తారు.[2] [3] ఘర్నేశ్వర అనే పదానికి "కరుణ ప్రభువు" అని అర్ధం.[2] హిందూధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్రా ప్రదేశంగా పరిగణిస్తారు. ఇది చివరి లేదా పన్నెండవ జ్యోతిర్లింగం (కాంతి లింగ) గా పరిగణించబడుతుంది.[4] ఈ తీర్థయాత్ర ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లోరాలో (వేరుల్ అని కూడా పిలుస్తారు) వద్ద ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.ఇది ఔరంగాబాద్ నగరం వాయవ్య దిశ నుండి 30 కి.మీ (19 మైళ్లు) దూరంలో ఉంది. ముంబై నగరానికి తూర్పు- ఈశాన్యంగా 300 కిలోమీటర్లు (190 మైళ్లు) దూరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]13, 14 వ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తానేట్ చేత ధ్వంసం చేయబడింది.పునర్నిర్మాణం అనేకసార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్- మరాఠా వివాదంలో నాశనం చేయబడింది. మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, 18 వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యబాయి హోల్కర్ సౌజన్యంతో, ఇది ప్రస్తుతంఉన్న రూపంలో పునర్నిర్మించబడింది.[4] ఇది హిందువుల ముఖ్యమైన, నిరంతరం రోజువారీ భక్తులను, యాత్రికులను ఆకర్షించే పుణ్యక్షేత్రం. దేవాలయ ప్రాంగణంలోకి, దాని లోపలి గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కాని ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి, స్థానిక హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమాన్ని సూచిస్తుంది. [2]
ఘృష్ణేశ్వర్ ఆలయం నిర్మాణం, దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎర్ర రాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరాలతో కూడి ఉంది. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో వేరుల్‌కు చెందిన మలోజీ భోసలే (ఛత్రపతి శివాజీ తాత), తరువాత 18 వ శతాబ్దంలో రాణి అహిల్యబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది. వారణాసి లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, గయ లోని ఒక విష్ణు ఆలయం, ఒక పెద్ద శివ జ్యోతిర్లింగ ఆలయంగా పరిగణించే సోమనాథ్ ఆలయాల వంటి ప్రధాన హిందూ దేవాలయాలు కొన్నిటిని తిరిగి పునర్నిర్మించిన ఘనత అహిల్యబాయి హోల్కర్కు దక్కింది.[5] ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాలలో 240 అడుగులు పొడవు, 185 అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణువు దశవతారాలు 24 స్తంభాలపై పెద్దవరండాలో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది. ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలను సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులోని గర్బాలయం 17 అడుగులు పొడవు, 17 అడుగులు ఎత్తుకలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్ఠంచబడింది.కోర్టు హాలులో నంది విగ్రహం ఉంది. ఘృష్ణేశ్వర్ ఆలయం మహారాష్ట్రలో ఉన్న ఆలయాలలో దీనిని ఒక గౌరవనీయమైన ఆలయంగా పరగణిస్తారు.ఈ ఆలయంలో అనేక హిందూ దేవతలు శిల్పాలు ఉన్నాయి.
జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన ఘృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.
ఇళాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే
ఈ ప్రాంతంలో ఏల్ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్. అదే వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు. ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి. రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్ఠిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.
పురాణగాథ
[మార్చు]పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ గురించి పురాణాల్లో ఈ కథ ఉంది.
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది. వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ.. ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ ‘ ఇదంతా పరమేశ్వరుని లీల’ అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుశమేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుశమేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.
అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్ఠించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు
ఆలయ విశిష్టత
[మార్చు]పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి. ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి. 240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి దృఢంగా, సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి. 24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు.. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.
ఎలా చేరుకోవాలి
[మార్చు]ఔరంగాబాద్ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- దిల్లీ, ముంబయిల నుంచి ఔరంగాబాద్‌కు విమానాలను నడుపుతున్నారు.
- రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు.
- రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్, సొంత వాహనాల్లో ఔరంగాబాద్ నుంచి చేరుకోవచ్చు.
- వేరూల్ గ్రామం నుంచి ఔరంగాబాద్‌కు బస్సులు నడుస్తుంటాయి.
మూలాలు
[మార్చు]- ↑ Grishneshwar Aurangabad GPS Archived 11 సెప్టెంబరు 2013 at the Wayback Machine Govt of Maharashtra
- ↑ 2.0 2.1 2.2 Lochtefeld 2002, p. 247.
- ↑ Swati Mitra (2011). Omkareshwar and Maheshwar. Goodearth Publications. p. 25. ISBN 978-93-80262-24-6.
- ↑ 4.0 4.1 Bruce Norman (1988). Footsteps: Nine Archaeological Journeys of Romance and Discovery. Salem. pp. 99–100. ISBN 978-0-88162-324-6.
- ↑ Swati Mitra (2011). Omkareshwar and Maheshwar. Goodearth Publications. pp. 23–25. ISBN 978-93-80262-24-6.
వెలుపలి లంకెలు
[మార్చు]- Eck, Diana L. (1999). Banaras, city of light (First ed.). New York: Columbia University Press. ISBN 0-231-11447-8.
- Gwynne, Paul (2009). World Religions in Practice: A Comparative Introduction. Oxford: Blackwell Publication. ISBN 978-1-4051-6702-4.