Jump to content

లింగాయతి

వికీపీడియా నుండి

బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు. ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు. శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు.

నేపధ్యము

[మార్చు]

లింగాయత సిద్ధాంతాన్ని స్థాపించినవాడు బసవణ్ణ. ఆయన సా.శ.1105లో ఉత్తర కర్ణాటకలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతనికి పిల్లనిచ్చిన మేనమామ అప్పటి రాజు బిజ్జలదేవుడి మహామంత్రి. బసవణ్ణ ఆయన ద్వారా ఆస్థానంలో చేరి, క్రమేపీ మహామంత్రి అయ్యాడు. హిందూ మతాచారాల వలన సమాజంలో ఏర్పడిన దురాచారాలను చూసి ఉద్యమం నడిపాడు. వేదాలను, వర్ణవ్యవస్థను తిరస్కరించాడు, తాను యజ్ఞోపవీతాన్ని విసర్జించాడు. 'అనుభవ మంటపం' అని ఒకవేదిక ఏర్పరచి, సర్వజాతులకు సమాన ప్రాధాన్యత యిచ్చాడు. విగ్రహారాధన లేకుండా, నిరాకారుడైన శివుడొక్కడే దైవమని ప్రబోధించాడు. అందరూ ఇష్టలింగం పేర లింగాన్ని మెడలో వేసుకోవాలని, యితర దైవాలను కొలవనక్కరలేదని, చేసే పని ద్వారానే దైవాన్ని చేరతామని (కాయకేవ కైలాస) ప్రబోధించాడు. బహిష్టు వంటి ఆచారాలు పాటించనక్కరలేదని, వితంతువులు పునర్వివాహం చేసుకోవచ్చని, పురుషులతో సమానస్థాయిలో స్త్రీలు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని చెప్పాడు.

విస్తరణ

[మార్చు]

లింగాయతులలో పెద్దకులం, చిన్నకులం అనేవిలేవు. పుట్టుకతో అందరూ సమానమే. లింగాయతుల్లో గురువులే ముఖ్యం. వారికి మఠాలుంటాయి. మఠాధిపతులే మార్గనిర్దేశనం చేస్తారు. బసవణ్ణ వచనాలనే పేర తన సిద్ధాంతాలను ప్రజానీకానికి అర్థమయ్యే కన్నడ భాషలోనే రాసి, ప్రచారం చేశాడు. ఇది ఎంతోమందిని ఆకర్షించింది. బసవణ్ణకు సాధారణ ప్రజల నుంచి రాజుల వరకు అనుయాయులు ఏర్పడ్డారు. వీరిని లింగాయతులుగా పేర్కొంటారు. వీరు హిందూమత విధానాలను తిరస్కరించడంతో ఆగలేదు. అప్పటిలో కర్ణాటకలో బలంగా వున్న బౌద్ధం, జైనంపై దాడులు చేశారు. బసవణ్ణ తర్వాత ఎందరో గురువులు వచ్చారు. అనేక మఠాలు ఏర్పడ్డాయి. బనజిగ లింగాయత్‌, పంచమశాలి లింగాయత్‌, గణిగ లింగాయత్‌, గౌడ లింగాయత్‌ వంటి 42 ఉపశాఖలూ ఏర్పడ్డాయి. అవి విద్యాసంస్థలతో బాటు, అనేక సంస్థలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నాయి.

బసవన్న ఉపదేశాలు

[మార్చు]
మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.
శివుడే సత్యం, నిత్యం.
దేహమే దేవాలయం.
స్త్రీ పురుష భేదంలేదు.
శ్రమను మించిన సౌందర్యంలేదు.
భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.
దొంగలింపకు, హత్యలు చేయకు

కల్లలనాడకు, కోపగింపకు ఆత్మస్తుతి పరనిందల విడువు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అంటారు

"https://te.wikipedia.org/w/index.php?title=లింగాయతి&oldid=4010603" నుండి వెలికితీశారు