దుక్కిపాటి మధుసూదనరావు

వికీపీడియా నుండి
(దుక్కిపాటి మదుసూదనరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దుక్కిపాటి మధుసూదనరావు
దుక్కిపాటి మధుసూదనరావు
జననందుక్కిపాటి మధుసూదనరావు
జూలై 27, 1917
కృష్ణా జిల్లా గుడివాడ తాలూకులోని పెయ్యూరు
మరణంమార్చి 26, 2006
మరణ కారణంన్యుమోనియా వ్యాధి
ఇతర పేర్లుదుక్కిపాటి
ప్రసిద్ధిప్రముఖ తెలుగు నిర్మాత
తండ్రిసీతారామ స్వామి
తల్లిగంగాజలం

దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 27, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మించిన తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒకరు.

దుక్కిపాటి గారు 10 సెప్టెంబరు 1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావులతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను స్థాపించి, మొదటి ప్రయత్నంగా దొంగరాముడు (1955) సినిమాను తీశారు. తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు.

బాల్యం

[మార్చు]

దుక్కిపాటి మధుసూదనరావు గారు సీతారామ స్వామి, గంగాజలం దంపతులకు 17 జూలై, 1917 తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకులోని పెయ్యేరు గ్రామంలో జనించారు. చిన్నతనంలో కన్నతల్లి కనుమూయడంతో సవతితల్లి పెంచి పెద్దచేశారు. ఆమె కన్నతల్లి ప్రేమ ఎరుగని దుక్కిపాటిని లాలించి, బుజ్జగించి, తీర్చి, ప్రయోజకుడిని చేశారు. అందుకే ఆయన ఆ తల్లిని మరవలేకపోయారు. అందుకే ఆయన ఆమె పేరు మీద అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

చదువుకోవలసిన వయసులో తండ్రి అనారోగ్యంతో మంచం పట్టడంతో చదువు మానక తప్పిందికాదు. చదవుమాని వ్యవసాయం పనులు చేశారు. అలా కొన్నాళ్లకి వ్యవసాయం ఒకదారికి రాగానే దుక్కిపాటి మళ్లీ చదువుపై దృష్టి సారించారు. నోబుల్‌ కళాశాలలో చేరారు. అక్కడ ఆయన చక్కని కార్యకర్తగా ఎదగడానికి పరిస్థితులు ప్రేరేపించాయి. కళాశాలలో 'డ్రమెటిక్‌ అసోసియేషన్‌' ఎన్నికల్లో నిలిచి దానికి కార్యదర్శి అయ్యారు. ఆ కాలంలో ఆయన ఎన్నో నాటికలు విద్యార్థులచేత ప్రదర్శింపచేశారు. అలా ఆయన విద్యార్థి దశనుంచే నాటకానుభవం గడించారు.

చదువు పూర్తయ్యాక ఎక్సెల్సియల్‌ క్లబ్బు అనే నాటక సంస్థను ప్రారంభించారు. దానికి కార్యదర్శి అయ్యారు. కోడూరి అచ్చయ్య, ఎం.ఆర్‌.అప్పారావు వంటి మిత్రులతో కలసి ఆ క్లబ్బు పక్షాన నాటకాలు విరివిగా ప్రదర్శించారు. మధుసూదనరావు తెచ్చిన సంస్కరణలే ఆయనకు పేరు తెచ్చాయి. ఆ కాలంలో పౌరాణిక నాటకాలకే ఆదరణ. వాటి ఆధిపత్యాన్ని తగ్గించాలనుకొన్న దుక్కిపాటి సాంఘిక నాటకాల రూపకల్పనకు నడుం బిగించారు. ఎక్సెల్సియల్‌ క్లబ్లులో దుక్కిపాటితోపాటు పెండ్యాల, బుద్ధిరాజు శ్రీరామమూర్తి వంటివారూ ఉండేవారు. వారి సహకారంతో ఆయన ఆశాజ్యోతి, సత్యాన్వేషణ, తెలుగుతల్లి వంటి సాంఘిక నాటకాలను రాయించి చేపట్టారు. అవి ఘనవిజయాలన్ని సాధించాయి! ఆ తరుణంలోనే దుక్కిపాటికి అక్కినేనితో పరిచయం కలిగింది.

సినీ జీవితం

[మార్చు]

అప్పటికే అక్కినేని ధర్మపత్ని (1941) చిత్రంలో నటించి వెనక్కి వచ్చేశారు. బుద్ధిరాజు శ్రీరామమూర్తి సలహాతో విప్రనారాయణ నాటకంలో దేవదేవి పాత్ర పోషిస్తున్నారు. ఆ నాటక ప్రదర్శన చూసిన దుక్కిపాటి, తమకు కథానాయిక/స్త్రీ పాత్ర లేని లోటు తీరిందని అక్కినేనిని హీరోయిన్ని చేశారు. అలా వారంతా నాటకాల్లో బిజీగా ఉన్నప్పుడే ఘంటసాల బలరామయ్య ఓ రైల్వేస్టేషన్లో అక్కినేనిని చూసి తన సినిమాకు ఆయనే తగిన వ్యక్తి అని నిర్ధారించుకొని చిరునామా తీసుకొన్నారు. తర్వాత గుడివాడకు వచ్చి అక్కినేనికి కబురు చేశారు.

దుక్కిపాటి, రామబ్రహ్మం (అక్కినేని సోదరుడు) ఇద్దరూ అక్కినేనిని ఘంటసాల బలరామయ్య వద్దకు తీసుకెళ్లారు. ఆయన వారిని మద్రాసుకొచ్చి 'ప్రతిభ' ఆఫీసులో సంప్రదించమన్నారు. అంతే దుక్కిపాటి, మరో మిత్రుడు సూర్యప్రకాశరావుతో కలసి అక్కినేనిని తీసుకొని మద్రాసు సెంట్రల్‌ స్టేషనల్లో దిగారు. 'ప్రతిభ' ఆఫీసులో పేకేటి అక్కినేనని స్వాగతించారు. అలా సీతారామజననంలో (1944) అక్కినేని హీరో అయ్యారు. ఆ తర్వాత దుక్కిపాటి బలరామయ్య, చల్లపల్లి రాజాలతో కలసి గూడవల్లి రామబ్రహ్మం దగ్గరకెళ్లి అక్కినేనిని మాయలోకంలో (1945) చిత్రానికి తీసుకొమ్మని సూచించారు. అలా మాయలోకం, తర్వాత శరబందిరాజువింటి చిత్రాల్లో అక్కినేని నటించి నటుడిగా నిలదొక్కుకొన్నారు.

దాదాపు అదే తరుణంలో దుక్కిపాటి మధుసూదనరావు తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతితల్లి అన్నపూర్ణ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దానికి అక్కినేని నాగేశ్వరరావుని ఛైర్మన్‌ని చేశారు. ఆ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు (1955) చిత్రం నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రల జంట కన్నుల పండువుగా నటించడంతో అది ఘనవిజయం సాధించింది. దుక్కిపాటి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

తోడికోడళ్ళు (1957), మాంగల్యబలం (1958), వెలుగునీడలు (1961), ఇద్దరు మిత్రులు (1961), చదువుకున్న అమ్మాయిలు (1963), డాక్టర్‌ చక్రవర్తి (1964), ఆత్మ గౌరవం (1966), పూలరంగడు (1967), విచిత్రబంధం (1972), ప్రేమలేఖలు (1977), రాధాకృష్ణ (1978), పెళ్లీడు పిల్లలు (1982), అమెరికా అబ్బాయి (1987) వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. డాక్టర్‌ చక్రవర్తి చిత్రం రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం. పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి తప్ప మిగిలిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయనడంలో సందేహం లేదు. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా ఇద్దరు మిత్రులు.

అన్నపూర్ణ సంస్థ నిర్మించే సినిమాలకు ఎక్కువగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించే వారు. దుక్కిపాటి తన సినిమాలలో కొర్రపాటి గంగాధరరావు, యుద్దనపూడి సులోచనరాణి, గొల్లపూడి మారుతీరావు, ముప్పాళ్ల రంగనాయకమ్మ (సంభాషణల రచయిత్రి), కె.విశ్వనాథ్ (దర్శకుడు), ఆశాలత కులకర్ణి, జి. రామకృష్ణ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శారద వంటి కళాకారులను పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేనితోపాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. రెండు శరీరాల్లో ఉన్న ఒకే ఆత్మ స్నేహం అంటారు. దాన్ని దుక్కిపాటి, అక్కినేని- ఇద్దరూ నిరూపించారు.

నిర్మాత

[మార్చు]

మరణం

[మార్చు]

దుక్కిపాటిగారు న్యుమోనియా వ్యాధితో బాధపడూతూ 90 యేళ్ళ వయసులో 26 మార్చి, 2006 ఆదివారం రోజున మరణించారు.

వనరులు

[మార్చు]