కొర్రపాటి గంగాధరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొర్రపాటి గంగాధరరావు
కొర్రపాటి గంగాధరరావు
జననంకొర్రపాటి గంగాధరరావు
1922, మే 10
బాపట్ల
మరణం1986, జనవరి 26
ప్రసిద్ధిదర్శకుడు, శతాధిక నాటక రచయిత, కళావని సమాజ స్థాపకుడు

కొర్రపాటి గంగాధరరావు (1922, మే 10 - 1986, జనవరి 26) నటుడు, దర్శకుడు, శతాధిక నాటక రచయిత, కళావని సమాజ స్థాపకుడు.[1]

జీవిత సంగ్రహం

[మార్చు]

ఇతను 1922, మే 10న మచిలీపట్నంలో జన్మించాడు.[2] ఏలూరు, మద్రాసులో చదివాడు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నాడు.

రచనా ప్రస్థానం

[మార్చు]

తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత ఇతను. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనల అనుగుణమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతం చేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.

ఈయన నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశాడు. నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని ఇతని ఆశయం. కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.

కళాభారతి అనే సాంస్కృతిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించాడు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ, ధంసా, నాలుగు నాలుగు నలభై నాలుగు, స్వర్గసీమ, శాంతి తోరణం, నారీ స్క్వేర్ బ్రహ్మచారి, అమృత మధనం, లకుమాదేవి- కుమారగిరి, నవతా!మానవతా అనే నవలలు రచించాడు. ఇవేకాక బ్రహ్మచారి పెళ్ళాం, యమలోకంలో సావిత్రి, పతి-పత్ని, వేగుచుక్క,డాక్టర్ గారి అమ్మాయి, సినిమా తారా, చేదుకో మల్లయ్య చేదుకో, ద్వి పాత్ర, పరకాయ ప్రవేశం, ఖబడ్దార్ ఖూనీకోర్ మొదలైన అముద్రిత నవలలు కూడా రచించాడు.

రచనలు

[మార్చు]

గంగాధర రావు గారు 130కి పైగా నాటక నాటికలు, 12 రేడియో నాటికలు, 20 నవలలు, 7 కథలు, ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీనాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు, మనిషి వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.[3]

నాటకాలు/నాటికలు

[మార్చు]
  1. రధచక్రాలు (నాటికల సంపుటి)
  2. పెండింగ్ ఫైల్ (నాటిక)
  3. గుడ్డిలోకం
  4. నిజరూపాలు
  5. కమల
  6. కొత్తచిగురు
  7. పుడమితల్లికి పురిటినొప్పులు
  8. ఈ రోడ్డు ఎక్కడికి?
  9. తెరలో తెర

ఆంధ్ర కళాపరిషత్ నిర్వహించిన పోటీలలో పాల్గొన్న, బహుమతులను అందుకున్న 25 నాటికలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన నాటికా పంచవింశతి అనే పేరుతో సంకలనం చేసి ప్రచురించారు.

పురస్కారాలు

[మార్చు]

వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి.

  1. యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు
  2. ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు,
  3. మద్యపాన నిషేధం వస్తువుగా రాసిన పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.

మరణం

[మార్చు]

తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఇతను 1986, జనవరి 26 తేదీన మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. గంగాధరరావు, కొర్రపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130-1.
  2. "శతాధిక నాటక రచయిత". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-04. Archived from the original on 2022-04-04. Retrieved 2022-04-05.
  3. వెంకట లాల్. డా.జి. కొర్రపాటి గంగాధర రావు నవలానుశీలన, తెనాలి, ప్రచురణ 2016.