Jump to content

నందిగామ (ఎన్టీఆర్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 16°47′00″N 80°18′00″E / 16.7833°N 80.3°E / 16.7833; 80.3
వికీపీడియా నుండి
(Nandigama నుండి దారిమార్పు చెందింది)
పట్టణం
పటం
Coordinates: 16°47′00″N 80°18′00″E / 16.7833°N 80.3°E / 16.7833; 80.3
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండలంనందిగామ మండలం
విస్తీర్ణం
 • మొత్తం25.9 కి.మీ2 (10.0 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం44,359
 • జనసాంద్రత1,700/కి.మీ2 (4,400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1002
ప్రాంతపు కోడ్+91 ( 08678 Edit this on Wikidata )
పిన్(PIN)521185 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

నందిగామ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలానికి చెందిన పట్టణం. ఇది నగరపంచాయితి. ఇది సమీప పట్టణం జగ్గయ్యపేట నుండి 46 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 11575 ఇళ్లతో, 44359 జనాభాతో 2590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 22153, ఆడవారి సంఖ్య 22206. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 7954 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2142. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588883. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..[2][3]

పట్టణ చరిత్ర

[మార్చు]

ఇది 2011 కు ముందు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. 2011 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీప గ్రామాలు అనాసాగరం, హనుమంతులపాలెంలను దీనిలో కలిపి నగరపంచాయితిగా మార్చింది. నందిగామ నగరపంచాయితి పరిదిలో 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి .

రవాణా సౌకర్యాలు

[మార్చు]

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జగ్గయ్యపేట, విజయవాడ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. దగ్గరలోని రైల్వేస్టేషన్ విజయవాడ 50 కి.మీ దూరంలో వుంది, మధిర 17 కి.మి.దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 17, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు 8, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 12 ఉన్నాయి. 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 6 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 3 ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, ఉన్నాయి. సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉంది.

  • కె.వీ.ఆర్.కళాశాల: నందిగామలో మొదట్లో ఎన్.టి.రామారావు పేరిట కాలేజీని స్థాపించారు. కానీ అతని నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో ఆ తరువాత ఈ కాలేజీని కాంగ్రెస్ నాయకుడు కాకాని వెంకటరత్నం పేరిట కె.వీ.ఆర్. కళాశాలగా మార్చారు. ఈ కాలేజీలో చదివి ఐఐఎస్, డాక్టర్లు, ఇంకా జర్నలిస్టులు వంటి అనేక రంగాల్లో ముఖ్యులైన వారు ఉన్నారు.ప్రస్తుతం ఈ కాలేజీకి తుర్లపాటి కోటేశ్వరరావు ప్రిన్స్ పాల్ గా ఉన్నాడు. తుర్లపాటి నాగభూషణ రావు కేవీఆర్ కాలేజీలో చదివి (బీఎస్సీ ఫస్ట్ బ్యాచ్- 1975 - 78) అనంతరం జర్నలిస్ట్ గా ఈనాడు, ఆంధ్రప్రభ, టివీ5 వంటి సంస్థల్లో పనిచేశాడు.అతను యునెసెఫ్, నంది అవార్డులు అందుకున్నాడు. నందిగామకు ల్యాండ్ ఆఫ్ ఎడ్యుకేషనలిస్ట్స్ (విద్యా వేత్తల భూమి) అన్న పేరు రావడానికి తొట్టతొలుతగా ఏర్పాటైన ఈ కాలేజీనే బలమైన కారణంగా చెప్పవచ్చు.
  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఇంతవరకు ఈ పాఠశాలలో బ్రిటిష్ వారు నిర్మించిన గదులలోనే విద్యా బోధన చేస్తున్నారు. ఇప్పుడు 42.5 లక్షల ఆర్.ఎం.ఎస్.ఏ. నిధులతో, నూతన గదులు నిర్మించారు. ఈ గదులను వచ్చే వార్షికోత్సవంనాడు ప్రారంభించెదరు. ప్రస్తుతం ఈ పాఠశాలలో, ఆరవతరగతి నుండి పదవ తరగతి వరకు 476 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. 120 మంది పదవ తరగతిలో ఉన్నారు. నందిగామలో ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు ఉండటంతో, దూరప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, ఆ వసతి గృహాలలో బసచేయుచూ, ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో పదవ తరగతి వ్రాసిన విద్యార్థులు, 90% ఉత్తీర్ణత శాతం సాధించారు. పాఠశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత ఐ.ఏ.ఎస్. అయిన శ్రీ చెన్నావఝుల శ్రీరామచంద్రమూర్తి, ఈ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం, 25వేల రూపాయల నగదు బహుమతులను అందించుచున్నారు.

సాంస్కృతిక సంస్థలు

[మార్చు]

బళ్ళారి రాఘవ కళాసమితి

[మార్చు]

తెలుగు పద్య నాటకం ఉన్నంత వరకు, బళ్ళారి రాఘవ పేరు చిరస్థాయిగా నిలిచిపోవును. నందిగామలో ఆ మహానుభావుని పేరుమీద, ఈ సంస్థను 50 సంవత్సరాలక్రితం స్థాపించారు. దీని వ్యవస్థాపకులు గోపాల కృష్ణసాయి. ఈ సంస్థలో ప్రతి సంవత్సరం బళ్ళారి రాఘవ జయంతిని ఘనంగా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్థాపించినప్పటి నుండి, దాతల సహకారంతో, కళారంగంలో పేరుపొందిన ప్రముఖుల జయంతి, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు, 2014, ఆగస్టు-9న స్థానిక ఏ.ఎం.సి. కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రసంగించి, బళ్ళారి రాఘవ నాటకరంగానికి చేసిన కృషిని కొనియాడినారు. ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు కళాకారులు జాతీయ, దేశభక్తి, అభ్యుదయ గీతాలు ఆలపించారు. అనంతరం ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి

పరిపాలన

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఎంతోకాలంగా మేజరు పంచాయతీగా ఉన్న నందిగామను మున్సిపాలీటీగా మార్చాలని చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుండి 2011 సం.న ఆమోదం లభించింది. 2011 సంవత్సరానికి మొత్తం జనాభా సుమారు 50,000. మొత్తం వార్డులు 21. వార్షిక ఆదాయం సుమారు 2 కోట్లు.
  • 2001లో నందిగామ మేజరు పంచాయతీగా ఉన్నప్పుడు, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 27 ఏళ్ళ వయసు లోనే శాఖమూరి స్వర్ణలత సర్పంచిగా పోటీచేసి గెలుపొందింది. గెలవగానే ఈమె మిగతావారిలాగా భర్తకు పెత్తనమిచ్చి ఇంటికే పరిమైతం కాలేదు. తన బాధ్యతలను తానే నిర్వహించింది. వీధి దీపాల సమస్య రాకుండా చూశారు. అంతర్గత రహదారులు అభివృద్ధి చేయటంతో పాటు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంది. యాభై వేల జనాభా ఉన్న నందిగామలో మహిళ అయినప్పటికీ ప్రజలకుఅందుబాటులో ఉంటూ పనిచేయటంతో రెండుసార్లు కలెక్టర్, ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉత్తమ సర్పంచి పురస్కారం అందుకుంది.
  • రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న నందిగామ పంచాయతీకి స్వతంత్రంగా పోటీచేసి, మూడుసార్లు సర్పంచిగా ఎన్నికై రికార్డు సృష్టించారు, యరగొర్ల వెంకటనరసింహం. రాజకీయ ఉద్దండులు నిలబెట్టిన అభ్యర్థులపై విజయం సాధించి, 1981 మే 30 నుండి 2001 ఆగస్టు 14 వరకూ, వరుసగా 20 ఏళ్ళపాటు ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. ప్రస్తుత పంచాయతీ భవననిర్మాణం, కీసర నుండి నందిగామ వరకూ మఛ్నీటి పధకం ఆయన చేయించినవే. మునిసిపల్ కాంప్లెక్స్ నిర్మాణం ఈయన హయాంలో జరిగినవే.

అనాసాగారం

[మార్చు]

అనాసాగారం గ్రామం జాతీయ రహదారి 9కి ఆనుకొని ఉంది, ఇది నందిగామ నుండి రెండు కి.మీ.ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ గ్రామం నందిగామలో పూర్తిగా కలిసిపోయింది. ఈ గ్రామం ఇప్పుడు నందిగామలో ఒక వార్డుగా ఉంది. అనాసాగారంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఇతర గ్రామాల నుండి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు హాజరు అవుతారు. ఈ పాఠశాల కొర్లపాటి చిన్నమల్లయ్య ప్రోద్భలంతో నిర్మించబడింది. ఆ తరువాత వివిధ రాజకీయ నాయకులు దీని అభివృద్ధికి తొడ్పడ్డారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ శుక శ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)

[మార్చు]

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, సుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారు. ఈ దేవాలయంలో నాలుగు దిక్కులా రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చంద్రమౌళీశ్వర స్వామివారల ఉపాలయాలున్నవి. మధ్యలోని ప్రధానాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామివారు కొలువుదీరి ఉండటంతో, ఈ దేవాలయము పంచలింగక్షేత్రము గా ప్రసిద్ధిచెందినది. అందువలన నందిగామ అను పేరువచ్చినది ఈ ఆలయానికి 275 ఎకరాల మాన్యం భూములున్నవి. ఆ భూముల వలన ప్రతి సంవత్సరం ఆలయానికి లక్షల రూపాల ఆదాయం వచ్చుచున్నది. ఈ ఆలయము ఇప్పుడు దేవాదాయధర్మాదాయ శాఖవారి ఆధీనములోఉండి వాసిరెడ్డి రామనాథబాబు ధర్మకర్తగా ఉన్నారు. ఈ దేవాలయములో ప్రతిపూర్ణిమకు, మాసశివరాత్రికి ప్రత్యేకపూజలు జరుగుతాయి కార్తీక మాసంలో ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ మాసమందు నెలరోజుల పాటు భక్తుల గోత్ర నామాలతో అభిషేకాలు, కార్తీక పూర్ణిమ రోజు జ్వాలాతోరణము, కార్తీక మాస శివరాత్రిరోజు లక్షబిళ్వార్చన చాలా బాగా జరుగును.

శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2011వ సంవత్సరంలో జరిగిన కల్యాణం, గవర్నరు, ఇ.యస్.యన్.ల్. నరసింహన్ చేతుల మీదుగా జరిగటం విశేషం..

నందిగామలోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని, పుష్కర నిధులు విరాళాలు, 26 లక్షలతో నూతనంగా పునర్నిర్మించారు. నూతన ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఏప్రిల్-22వతేదీ శనివారంనాడు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, వైభవోపేతంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల మూల విరాట్టును, యంత్రాన్నీ ప్రతిష్ఠించారు. జీవధ్వజస్తంభం, ఆంజనేయస్వామి, విఖనస మహర్షి, రామానుజస్వామి, రాధాకృష్ణులు, విమాన శిఖరాలను ప్రతిష్ఠ చేసారు. సమీపగ్రామాలనుండి ఆలయానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ ఆవరణ క్రిక్కిరిసినది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. [12]

ఈ ఆలయం పునఃప్రతిష్ఠించి, 40 రోజులైన సందర్భంగా, 2017,జూన్-1వతేదీ గురువారం రాత్రి, స్వామివారి ఉత్సవమూర్తులకు కనులపండువగా పుష్పయాగం నిర్వహించారు.

మరిడ్డి మహాలక్ష్మి దేవాలయం

[మార్చు]

దేవాలయంను రాష్ట్ర ప్రథమ స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు నిర్మించారు. ఈ దేవాలయం శిథిలం చెందగా, మరల వారి కుమారులు కృష్ణమోహనరావు, దుర్భాకుల సుబ్రహ్మణ్యకామేశ్వర ఘనపాఠిగారి పర్యవేక్షణలో పునర్నిర్మాణంకావించీ, అమ్మవారి మూల విరాట్టుతో సహా ప్రతిష్ఠలు చేయించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

భూమి వినియోగం

[మార్చు]

నందిగామలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 892 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 166 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 44 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 58 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 60 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 113 హెక్టార్లు
  • బంజరు భూమి: 51 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1201 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 906 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 461 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

నందిగామలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 299 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 161 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

నందిగామలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మిరప, అపరాలు, కాయగూరలు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం, పప్పులు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు

[మార్చు]
  • అయ్యదేవర కాళేశ్వరరావు: ఇతను రాష్ట్ర శాసనసభకు ప్రథమ స్పీకరు. నందిగామ గ్రామం మొత్తం అయ్యదేవర వంశీకుల అగ్రహార గ్రామం. అయ్యదేవర కాళేశ్వరరావు (1882 జనవరి 22 - 1962 ఫిబ్రవరి 26) స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. ఇతను ఎన్టీఆర్ జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు. స్వాతంత్ర్యానంతరం 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఇతని పేరు మీదుగా నిర్మించారు. అదే కాళేశ్వరరావు మార్కెటుగా నేడు ప్రసిద్ధి చేందింది

విశేషాలు

[మార్చు]

నందిగామ మండలంలోని అందరు లబ్ధిదారులకూ గ్యాస్ కనెక్షన్లు అందిన సందర్భంగా, 2017, జూన్-1న మండలాన్ని, పొగరహిత మండలంగా ప్రకటించారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు

[మార్చు]