Jump to content

రనౌట్

వికీపీడియా నుండి
2009 జనవరిలో SCG లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో మైఖేల్ క్లార్క్ రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు.

రనౌట్ అనేది క్రికెట్‌లో బ్యాటరును ఔట్‌ చేసే ఒక పద్ధతి. దీన్ని క్రికెట్ చట్టాల్లోని చట్టం 38 ద్వారా నిర్వచించారు.[1] బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడు సాధారణంగా రన్ అవుట్ జరుగుతుంది. బ్యాటరు వికెట్ దగ్గర క్రీజ్ లైన్ దాటి రాకముందే ఫీల్డింగ్ జట్టు బంతిని స్టంపులను తాకిస్తే ఫీల్డింగు జట్టు వికెట్ పొందడంలో విజయం సాధిస్తుంది. బ్యాటర్లు తీస్తున్న అసంపూర్ణ పరుగు లెక్కలోకి రాదు.

చట్టాలు

[మార్చు]

బంతి ఆటలో ఉన్నప్పుడు, వారి బ్యాట్ లేదా వ్యక్తి యొక్క ఏ భాగమూ పాపింగ్ క్రీజ్ వెనుక నేలను తాకి లేని పక్షంలో, ప్రత్యర్థి జట్టు వారి వికెట్లను పడవేస్తే, బ్యాటరు రనౌట్ అవుతాడు.

ఆ డెలివరీ నో బాల్ గానీ వైడ్ (అంటే ఫెయిర్ డెలివరీ కాకపోయినా) గానీ అయితే, పరుగుల ప్రయత్నం చేసినా, చేయకపోయినా బ్యాటర్ రనౌట్‌గా ఔట్ కావచ్చు. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి:

  1. పాపింగ్ క్రీజ్‌లో బ్యాటర్ లేదా వారి బ్యాట్ నేలను తాకి ఉన్నట్లయితే, బ్యాటర్ రనౌట్ అవరు. అయితే వికెట్ పడగొట్టినప్పుడు గాయం కాకుండా ఉండటానికి వారు దానిని వదిలివేయవచ్చు.
  2. బ్యాటరు బంతిని కొట్టాక, అది ఫీల్డర్లెవరినీ తాకకుండా నేరుగా నాన్-స్ట్రైకరు వైపున్న వికెట్లకు తగిలితే నాన్-స్ట్రైకరు రనౌట్ కారు.
  3. స్టంప్డ్ అవుట్‌గా ఇవ్వగలిగితే, దాన్ని రనౌట్ అనరు.
  4. నో బాల్ వేసినపుడు, బ్యాటరు పరుగెత్తడానికి ప్రయత్నించలేదు, మరొక ఫీల్డర్ జోక్యం లేకుండా వికెట్ కీపరు వికెట్లను పడవేసినపుడు బ్యాటర్ రనౌట్ అవరు. ఈ సందర్భంలో అది నో బాల్ అవకపోయి ఉంటే అది స్టంపౌట్ అయ్యేది. అంటే నో బాల్‌లో స్టంపౌట్ ఉండదు.

ప్రత్యర్థి వికెట్ పడగొట్టబడిన వైపుకు అత్యంత దగ్గరగా ఉన్న బ్యాటరు రనౌట్ అవుతాడు. రన్ అవుట్‌కు ముందు పూర్తి చేసిన పరుగులు బ్యాటరుకు అతని జట్టుకూ లెక్కలోకి వస్తాయి.

వికెట్ క్రెడిట్ బౌలర్‌కు దక్కదు. బంతిని సేకరించిన ఫీల్డరు, వికెట్‌ను పడసినా, లేదా మరొక ఆటగాడికి బంతిని అందించినా ఆ ఫీల్డఫును "ప్రైమరీ" ఫీల్డరుగా పరిగణిస్తారు. చివరికి వికెట్లను పడేసే ఆటగాడు, అతనికి బంతిన్మి అందించిన ఆటగాళ్ళు అందరూ "సహాయక" ఫీల్డర్‌లుగా పరిగణించబడతారు, గణాంకాలలో రన్ అవుట్‌ కారకులుగా జమ చేయబడతారు.[2]

రన్నర్స్‌తో రన్ అవుట్

[మార్చు]

గాయం/అనారోగ్యం కారణంగా బ్యాటరు, రన్నరుతో ఆడుతూంటే, మైదానంలో ముగ్గురు (లేదా చాలా అరుదైన పరిస్థితుల్లో నలుగురు) బ్యాటర్లు/రన్నర్‌ల మధ్య గందరగోళం ఏర్పడి రనౌట్ అయ్యే ప్రమాదం ఉంది. వికెట్లు పడిపోయినపుడు వీరంతా తమతమ క్రీజుల్లో, తమతమ ఎండ్‌లలో సురక్షితంగా ఉండాలి. ఉదాహరణకు, స్ట్రైక్‌లో ఉన్న బ్యాటరు రన్నర్‌తో కూడి ఉన్నపుడు, బాల్ లైవ్‌లో ఉండగా, ఎల్లప్పుడూ స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజు వెనుకనే ఉండాలి. వారు తమ క్రీజును విడిచిపెట్టినట్లయితే, ఫీల్డర్ స్ట్రైకరు ఎండ్‌లోని స్టంప్‌లను కొట్టి రనౌట్ చేయవచ్చు - బ్యాటరు బౌలర్ ఎండ్‌లో క్రీజు వెనుక ఉన్నప్పటికీ.

2010లో ఇంగ్లండ్‌లో జరిగిన ట్వంటీ20 కప్ ఫైనల్ ముగింపులో హాంప్‌షైర్‌కు చెందిన డేనియల్ క్రిస్టియన్, రన్నర్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, ఆఖరి డెలివరీకి అవసరమైన ఒక పరుగు కోసం తన క్రీజును విడిచిపెట్టిన సంఘటన జరిగింది. అతని ప్రత్యర్థులు సోమర్‌సెట్ కూడా దీన్ని గ్రహించలేక, రన్ అవుట్‌ని అడిగే అవకాశాన్ని విస్మరించారు. దాంతో హాంప్‌షైర్‌ గెలిచింది.[3]

పరుగు కోసం ప్రయత్నించకుండా రన్ అవుట్

[మార్చు]

ఒక బ్యాటరు పరుగు కోసం ప్రయత్నించక పోయినా, క్రీజులో లేనప్పుడు, ఫీల్డర్ వికెట్ పడగొట్టబడినప్పుడు కూడా అతను రనౌట్ అవుతాడు.[4] టెస్టు క్రికెట్‌లో కూడా ఇలాంటి ఔట్‌ల తంతు ఉంది.

బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలినప్పుడు ఈ సందర్భం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. అలా తగిలి బంతి, వికెట్ కీపర్‌కి కాకుండా దగ్గరలో ఉన్న ఫీల్డర్‌కి వెళ్లినప్పుడు (కీపర్ నేరుగా చర్య తీసుకుంటే బ్యాటర్‌ని స్టంపౌట్ చేయవలసి వస్తుంది), బ్యాటరు క్రీజును దాటి ఉంటే, ఫీల్డరు వికెట్‌ను పడగొట్టి బ్యాటరును రనౌట్ చెయ్యవచ్చు.

కొన్ని ఉదాహరణలు క్లోజ్ ఫీల్డర్ల పదునైన ప్రతిచర్యలకు ప్రసిద్ధి చెందాయి. వీటిలో కొన్ని, బ్యాటరు సరైన శ్రద్ధ లేకపోవడం, హాస్యభరితమైనవి. 1995 లో కేప్ టౌన్‌ టెస్ట్‌లో జరిగిన రనౌట్ ప్రయత్నం టెలివిజన్‌లో క్యాప్చర్ చేయబడింది, సోషల్ మీడియాలో విస్తృతంగా భాగస్వామ్యం చేయబడింది. న్యూజిలాండ్‌కు చెందిన షేన్ థామ్సన్ తన క్రీజ్ వెలుపలకు వచ్చి ముందుకు ఆడి, సొగసైన పోజు ఇచ్చి నిలబడ్డాడు. కొద్ది క్షణాల విరామం తర్వాత, బ్యాట్‌కు దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రోన్యే, కదలకుండా అక్కడే నిలబడ్డ థామ్సన్ వైపు ఒక అడుగు వేసాడు. థామ్సన్ బంతిని అందుకొని, అండర్ ఆర్మ్ త్రోతో స్టంప్‌లను పడవేసాడు. ఇది ఆట స్ఫూర్తికి లోబడి ఉందో లేదో క్రోన్యేకి తెలియలేదు. ఫీల్డింగ్ జట్టు అప్పీల్ చేయకూడదని ఎంచుకుని ఉంటే, బ్యాటర్ ఔటయ్యే వాడు కాదు.[5]

బ్యాటర్ బంతిని డెడ్‌గా భావించినప్పుడు రన్ అవుట్ చెయ్యడం

[మార్చు]

జూనియర్, ఇండోర్ క్రికెట్‌ ఆటల్లో తరచుగా జరిగే ఒక సమస్య ఏమిటంటే, బంతి ఆడిన తర్వాత ఉండే నిశ్శబ్ద క్షణంలో, బ్యాటర్ పరుగు కోసం కాకుండా, వేరే ఉద్దేశంతో వారి క్రీజును వదిలి బయటికి పోవచ్చు. ఉదాహరణకు నాన్-స్ట్రైకర్‌తో మాట్లాడటం కోసం, లేదా పిచ్‌ను వ్యాట్‌తో సవరించేందుకు కావచ్చు. ఆ సమయంలో బంతిని డెడ్‌గా పరిగణిస్తారని ఫీల్డింగ్ టీమ్‌తో ఉన్న సాంప్రదాయికంగా ఉండే అవగాహన కారణంగా వారు అలా చేయవచ్చు. ఆ అవగాహనపై అవతలి జట్టుకు విభిన్నంగా ఉంటే, ఫీల్డర్ ఆ బ్యాటరు వికెట్‌ను పడగొట్టవచ్చు. ఎప్పటిలాగే, ఫీల్డింగ్ జట్టు ఏదైనా ఔట్ అడగాలంటే తప్పనిసరిగా అప్పీల్ చేయాలి. ఫీల్డింగ్ కెప్టెన్ ఆట స్ఫూర్తితో, ఆ అప్పీల్‌ అనాలోచితంగా చేసినట్లు భావించినట్లయితే దానిని ఉపసంహరించుకుంటాడు. ఇది ఆచారం, అభ్యాసం, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే అప్పీల్ చేసినట్లయితే, అంపైర్ డెడ్ బాల్‌ కాదని భావించేట్లైతే బ్యాటరు అవుటైనట్లు అని ప్రకటించాలి.

1882లో ఓవల్‌లో జరిగిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఈ ఆచారం విషయంలో ఘర్షణ జరిగింది. ఆస్ట్రేలియా బౌలరు ఫ్రెడ్ స్పోఫోర్త్‌ను దూషించిన స్యామీ జోన్స్‌ను WG గ్రేస్ ఈ విధంగా రనౌట్‌ చేసాడు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను గెలిచింది. యాషెస్‌గా మారిన మాక్ దహనం జరిగింది ఈ మ్యాచ్ తరువాతనే. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో కథలు కథలుగా చెప్పుకున్న మ్యాచ్‌ ఇదే.

2006 లో, ముత్తయ్య మురళీధరన్‌ను న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కీపర్ బ్రెండన్ మెకల్లమ్ ఇలాగే రనౌట్ చేసాడు. మురళి ఒక పరుగు పూర్తి చేసి క్రీజును విడిచిపెట్టి, శతకం పూర్తి చేసిన కుమార సంగక్కరను అభినందించడానికి వెళ్ళాడు. 2005 లో జింబాబ్వే ఆటగాడు క్రిస్ మ్ఫోఫు, తోటి బ్యాటర్ బ్లెస్సింగ్ మహ్‌వైర్‌ను అభినందించేందుకు క్రీజ్‌ను విడిచిపెట్టగా, బ్రెండన్ మెకల్లమ్ అతన్ని కూడా ఇలాగే రనౌట్ చేయడంలో పాత్ర వహించాడు.[6] మెకల్లమ్ ఆ తర్వాత తన చర్యలు ఆట స్ఫూర్తికి అనుగుణంగా లేవని విచారం వ్యక్తం చేశాడు.[7]

వీటికి విరుద్ధమైన సంఘటనలో, 2011 లో, భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆటలో నిర్ణీత విరామానికి ముందు వేసిన చివరి డెలివరీలో, షాట్ బౌండరీకి చేరిందని తప్పుగా భావించి ఇయాన్ బెల్ తన క్రీజ్‌ను విడిచిపెట్టడంతో రనౌట్ అయ్యాడు. ఆట విరామం సమయంలో, ఫీల్డింగ్ కెప్టెన్ MS ధోని తన విజ్ఞప్తిని ఉపసంహరించుకున్నాడు. విరామం తర్వాత బెల్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించడానికి అనుమతించారు.[8] ఈ సంఘటనలో ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, బంతి బౌండరీకి చేరుకున్నప్పుడు స్వయంచాలకంగా డెడ్ అవుతుంది (అంపైర్ ద్వారా వివరణ అవసరం లేదు). కాబట్టి, బంతి బౌండరీని దాటిందనుకుని బెల్ తన క్రీజ్‌ను దాటాడు. అది కొంతమంది ఫీల్డరులను చూసి అతను అలా అనుకుని ఉండవచ్చు. ఒకవేళ ఫీల్డింగ్ జట్టు కావాలని అది డెడ్ బాల్‌ అన్నట్లు భ్రమింపజేసి ఉన్నప్పటికీ, ఈ చర్య క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యగా పరిగణించబడుతున్నప్పటికీ, అంపైరిచ్చిన రనౌట్ నిర్ణయం మాత్రం సరైనదే. MS ధోని తీసుకున్న చర్య అటువంటి కళంకం లేకుండా చేసింది. క్రీడా స్ఫూర్తికి అనుగుణంగా ఉంది. ఇందుకుగాను అతను ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును అందుకున్నాడు.

2017 చట్ట సవరణలో, బ్యాటర్‌ను మోసం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా అన్యాయమని, అంపైర్ దాన్ని బాల్ డెడ్‌గా ప్రకటించాలనీ సవరించింది. అలా కాకుండా బ్యాటరు, బంతి ఆటోమాటిగ్గా డెడ్ అయిందని తానే తప్పుగా భావించి క్రీజు దాటితే అప్పీల్‌లో రనౌట్ అవుతాడు.[9]

"బ్యాకప్" బ్యాటరును రనౌట్ చెయ్యడం

[మార్చు]

ఒక బౌలర్ తన డెలివరీ స్ట్రైడ్‌లోకి ప్రవేశించినప్పుడు, నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటరు సాధారణంగా క్రీజు వదలి బయటికి ('బ్యాక్ అప్') వెళ్తాడు. దీనర్థం బ్యాటరు తన పాపింగ్ క్రీజ్‌ను ముందుగానే వదిలి అవతలి వైపుకు నడవడం మొదలుపెడతాడు. తద్వారా బ్యాటర్లు పరుగు కోసం ప్రయత్నించినపుడు అవతలి ఎండ్‌కు చేరుకోవడానికి తక్కువ సమయం పడుతుంది.

కొన్నిసార్లు బౌలరు వాస్తవానికి బంతిని వేయడానికి (విడుదల చేయడానికి) ముందే, బ్యాటరు తన క్రీజ్‌ను వదిలి బయటికి వెళ్తాడు. ఈ సందర్భంలో బౌలరు, క్రికెట్ చట్టాల ప్రకారం నాన్-స్ట్రైకింగ్ బ్యాటర్‌ను రన్ అవుట్ చేయడానికి చట్టబద్ధంగా ప్రయత్నించవచ్చు. అలా రనౌట్ చేసే ప్రయత్నం విఫలమైతే, బ్యాటర్ క్రీజులోనే ఉండిపోయినట్లయితే, ఆ డెలివరీ డెడ్ బాల్ అవుతుంది.

కొంతమంది పరిశీలకులు ఈ విధంగా బ్యాటర్‌ను కొట్టివేయడం పేలవమైన క్రీడా మర్యాదగా, ఆట స్ఫూర్తికి విరుద్ధంగానూ భావిస్తారు. అయితే, చట్టాలు, నిబంధనలు ఆట నిర్మాణానికి ఉపయోగించడానికే ఉన్నాయని, అది వృత్తిపరమైన నిబంధనలలో భాగమేనని స్పష్టంగా ఉందనీ, నిబంధనలను అమలు చేయడం చట్టబద్ధమైనది, క్రీడాపరమైనదేననీ చాలా మంది భావిస్తారు.[10][11]

పూర్వ సంప్రదాయం ప్రకారం, ఒక ఉదారమైన బౌలరు, వికెట్ తీయకుండా క్రీజులో ఉండమని బ్యాటర్‌ని హెచ్చరించవచ్చు. అయితే ఇది క్రికెట్ చట్టాలు లేదా క్రికెట్ స్పిరిట్‌పై MCC గైడెన్స్ నోట్స్ కు సంబంధించి, బౌలరు అలా చెయ్యవలసిన అవసరం లేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అలాంటి రనౌట్ జరిగినప్పుడు, అది చర్చను రేకెత్తించింది.[12] ఇటువంటి తొలగింపులు క్రికెట్‌లో జరుగుతూనే ఉన్నాయి. దీనిపై అభిప్రాయ భేదాలు కూడా ఉంటూనే ఉన్నాయి.[13][14]

1850లో ఎటన్, హారో మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ "బ్యాకింగ్ అప్" రనౌట్ ఐన మొట్టమొదటి సంఘటనల్లో ఒకటిగా నమోదైంది. ఎటన్ బౌలరు విలియం పెర్స్ట్, చార్లెస్ ఆస్టెన్-లీని రనౌట్ చేసాడు.[15]

వినూ మన్కడ్

[మార్చు]

ఈ పద్ధతిలో అవుట్ చేయడంలో అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ భారత బౌలర్ వినూ మన్కడ్. భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంగా 1947 డిసెంబరు 13 న సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఇది జరిగింది. మన్కడ్, బిల్ బ్రౌన్‌ను రనౌట్ చేసాడు. బంతిని వేసే క్రమంలో మన్కడ్, దానిని పట్టుకొని బ్రౌన్‌ అతని క్రీజు నుండి బాగా బయట ఉన్నపుడు, బెయిల్‌లను తొలగించాడు. ఆ పర్యటనలో మన్కడ్ బ్రౌన్‌ను ఈ పద్ధతిలో ఔట్ చేయడం ఇది రెండోసారి - అంతకు ముందు ఆస్ట్రేలియన్ XIతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలా చేసాడు.[16] ఆ సందర్భంలో అతను బ్రౌన్‌ను రన్నవుట్ చేసే ముందు ఒకసారి హెచ్చరించాడు. ఆస్ట్రేలియన్ పత్రికలు మన్కడ్‌ క్రీడాస్ఫూర్తి చూపలేదని ఆరోపించాయి. అయితే ఆ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ డాన్ బ్రాడ్‌మాన్‌తో సహా కొంతమంది ఆస్ట్రేలియన్లు మన్కడ్ చర్యలను సమర్థించారు. అప్పటి నుండి, ఈ పద్ధతిలో చేసే రనౌట్‌ను (అనధికారికంగా) "మన్కాడెడ్" అని అనడం మొదలైంది.

బిల్ బ్రౌన్ రనౌట్ వార్తా నివేదిక

21వ శతాబ్దంలో

[మార్చు]

ఎటువంటి ఆగ్మెంటెడ్ ప్లేయింగ్ పరిస్థితులు లేకుండా క్రికెట్ చట్టాల ప్రకారం ఆడిన అన్ని మ్యాచ్‌లలో, బౌలర్లు తమ రన్ అప్ ప్రారంభించిన తర్వాత, బంతిని విడుదల చేసే ముందు, నాన్-స్ట్రైకింగు ఎండ్‌లో ఉన్న బ్యాటరు తన క్రీజు వెలుపల ఉంటే, ఎటువంటి హెచ్చరిక చేయకుండా, రనౌట్ చేయవచ్చు. ఫీల్డింగ్ జట్టు అప్పీల్ చేస్తే అంపైర్ 41.16 చట్టం ప్రకారం బ్యాటర్‌ను రనౌట్ అయినట్లు ప్రకటిస్తాడు.[17] బౌలర్ దీనికి ఎప్పుడు ప్రయత్నించవచ్చనే విషయంలో మునుపటి చట్టాలు మరింత కట్టుదిట్టంగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ఆటకు భిన్నంగా అవి, బౌలరు తన డెలివరీ స్ట్రైడ్‌లోకి ప్రవేశించే వరకు ఈ ప్రయత్నాన్ని అనుమతించాయి.

2011 ICC టెస్ట్ మ్యాచ్‌లు, [18] వన్ డే ఇంటర్నేషనల్స్, [19] ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ [20] అంతర్జాతీయ ఆటలలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా ఇతర ప్రొఫెషనల్ క్రికెట్‌లో మన్‌కడింగ్‌ను సమర్థించేలా నిబంధనలను సడలించింది..[21]

వివిధ వృత్తిపరమైన ఆట పరిస్థితుల 42.11 ప్రకారం, "బౌలరు బంతిని విడుదల చేయడానికి ముందు, తన సాధారణ డెలివరీ స్వింగ్ పూర్తి చేయనట్లయితే, నాన్-స్ట్రైకర్‌ను రనౌట్ చేయడం సబబే". బౌలింగ్ చేయి బంతిని విడుదల చేసే పాయింట్‌ను దాటిన తర్వాత బౌలరు డెలివరీ స్వింగ్‌ను పూర్తి చేసినట్లుగా అంపైర్లు భావిస్తారు.[22]

2014 జూలైలో, ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్‌ను శ్రీలంకకు చెందిన సచిత్ర సేనానాయకే రనౌట్ చేసాడు. మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు, అంపైర్ల స్వతంత్ర సంప్రదింపుల సంఘమైన ప్రపంచ క్రికెట్ కౌన్సిల్, శ్రీలంక చర్యలను ఏకగ్రీవంగా సమర్థించింది.[23] 2019 మార్చిలో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బట్లర్‌ను రవిచంద్రన్ అశ్విన్ అదే విధంగా అవుట్ చేశాడు.[24][25] ఈ సంఘటన తర్వాత MCC, ఈ 'మన్కడింగ్' అనేది "స్పిరిట్ ఆఫ్ ది గేమ్"లో భాగం కాదని పేర్కొంది.[26]

2022లో ఇంగ్లండ్, భారతదేశం మధ్య జరిగిన మహిళల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో చివరి గేమ్‌లో, ఇంగ్లండ్‌కు కేవలం ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉండగా, భారత్‌పై గెలవడానికి 17 పరుగులు చేయాల్సి ఉండగా, బౌలర్ దీప్తి శర్మ తన డెలివరీ స్ట్రైడ్‌లో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న చార్లీ డీన్‌ని రనౌట్ చేసి వికెట్ తీసింది.[27]

చట్టాలకు అవతారిక అయిన స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని క్రికెట్ సమాజం పరిగణించే ప్రవర్తనల జాబితా ఉంటుంది. అయితే బ్యాకింగ్-అప్ నాన్-స్ట్రైకర్‌ను ఔట్ చెయ్యడం గురించి అందులో ప్రస్తావించలేదు. 2022 అక్టోబరు నుండి నాన్-స్ట్రైకర్ రన్ అవుట్‌పై ఉన్న చట్టాన్ని లా 41 (అన్‌ఫెయిర్ ప్లే) లో కాకుండా లా 38 (రన్ అవుట్) లోకి మారుస్తామని 2022 మార్చిలో MCC ప్రకటించింది.[28]

మూలాలు

[మార్చు]
  1. "Law 38 – Run out". MCC. Retrieved 29 September 2017.
  2. "Differentiating Primary and Assistant Fielders when Scoring a Wicket". England and Wales Cricket Board. Retrieved 3 June 2021.
  3. "O runner, where art thou?". Retrieved 12 May 2022.
  4. "Run out Law | MCC". www.lords.org. Retrieved 2022-09-25.
  5. "Full Scorecard of New Zealand vs South Africa 3rd Test 1994/95 - Score Report - ESPNcricinfo.com". ESPN Cricinfo. Retrieved 22 September 2020.
  6. "No regrets on controversial Muralitharan run out - Fleming". Retrieved 12 March 2022.
  7. "'Cricket was meant to be a game, not a life or death struggle'". Retrieved 2 July 2023.
  8. "Dhoni wins Spirit of Cricket award". Retrieved 12 March 2022.
  9. "Law 41 Unfair Play". Retrieved 29 June 2023.
  10. D’Souza, Dilip (28 March 2019). "When baseball has a lesson for cricket: stolen bases and 'Mankading'". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-09.
  11. "On Mankading and the problem with chivalry". www.telegraphindia.com. Retrieved 2020-09-09.
  12. Steve Harmison (4 June 2014). "BBC Sport – Jos Buttler run-out defended by Sri Lanka captain Angelo Mathews". Bbc.co.uk. Retrieved 18 August 2014.
  13. "Mankading incident turns close finish controversial". ESPN Cricinfo. 18 October 2017. Retrieved 18 October 2017.
  14. "Mankad sparks contentious finish". Cricket Australia. Retrieved 19 October 2017.
  15. "Wisden - Obituaries in 1924". ESPNcricinfo. 2 December 2005. Retrieved 2020-10-03.
  16. "Two legends make their entrance". ESPN Cricinfo. 13 November 2008. Retrieved 19 November 2019.
  17. "Law 41". MCC. Retrieved 29 September 2017.
  18. "STANDARD TEST mATCH PLAYING CONDITIONS" (PDF). International Cricket Council. Archived from the original (PDF) on 2013-01-20. Retrieved 2023-08-11.
  19. "STANDARD ONE-DAY INTERNATIONAL mATCH PLAYING CONDITIONS" (PDF). International Cricket Council. Archived from the original (PDF) on 4 March 2016.
  20. "STANDARD TWENTY20 INTERNATIONAL mATCH PLAYING CONDITIONS" (PDF). International Cricket Council. Archived from the original (PDF) on 2013-01-20. Retrieved 2023-08-11.
  21. "IPLT20 match playing conditions 42 Law 42 Fair and Unfair Play". BCCI. Archived from the original on 25 April 2013.
  22. "ICC news: Powerplay tweaks and end of runners | Cricket News | Cricinfo ICC Site". ESPN Cricinfo. Retrieved 18 August 2014.
  23. "World Cricket Committee Running out the non-striker: Law is clear and the act is not against the Spirit of Cricket; Lord's". Lords.org. Retrieved 2014-08-18.
  24. "Buttler's controversial 'Mankad' run out – best of the reaction". International Cricket Council. Retrieved 25 March 2019.
  25. "Jos Buttler 'Mankad' dismissal: Law is 'essential' says MCC". BBC Sport. 26 March 2019.
  26. "Jos Buttler: 'Mankad' dismissal not 'in the spirit of the game' - MCC". BBC Sport. 27 March 2019. Retrieved 28 March 2019.
  27. Wynne, Ffion (24 September 2022). "England v India: Controversial run out secures 3-0 series whitewash for visitors". BBC Sport.
  28. "MCC announces new Code of Laws from 1 October 2022 | Lord's". www.lords.org. Retrieved 2022-03-10.
"https://te.wikipedia.org/w/index.php?title=రనౌట్&oldid=4035797" నుండి వెలికితీశారు