Jump to content

అనలాగ్ ఫోటోగ్రఫీ

వికీపీడియా నుండి
(ఫిలిం ఫోటోగ్రఫీ నుండి దారిమార్పు చెందింది)
వివిధ తయారీదారులచే ఉత్పత్తి చేయబడ్డ ఫిలిం లు
35mm ఫిలిం పై ఛాయాచిత్రం నమోదయ్యే తీరు, సంవర్థనతో దానిని నెగిటివ్ గా మార్చే ప్రక్రియ

అనలాగ్ ఫోటోగ్రఫీ (ఆంగ్లం: Analog photography) అనగా ప్రస్తుతం ఉన్న డిజిటల్ సాంకేతిక (Digital Technology)లో, సంబంధిత డిజిటల్ ఉపకరణాలను (డిజిటల్ కెమెరాలను, ఫోన్ కెమెరాలను, మెమరీ కార్డులను) ఉపయోగించకుండా, ఫిలిం చుట్ట/ఇన్స్టంట్ ఫిల్మ్/ఫోటోగ్రఫిక్ కాగితం లనును సంబంధిత ఫిలిం కెమెరాలలో వాడి, వాటికి అనువైన సారూప్య ప్రక్రియలను అవలంబించి ఛాయాచిత్రాలను సృష్టించటం/ముద్రించటం.[1]

2004 తర్వాత డిజిటల్ ఫోటోగ్రఫీ జనబాహుళ్యం లోకి రావటం వలన అనలాగ్ ఫోటోగ్రఫీ తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ పెరుగుతోన్న సాంకేతికాభివృద్ధితో, మెగాపిక్సెళ్ళ వలన డిజిటల్ ఫోటోగ్రఫీలో అంతులేని స్పష్టత రావటం; డిజిటల్ ఫోటోగ్రఫీలో, రసాయనాల, డార్క్ రూం యొక్క అవసరం లేకపోవటం; ఫోటోగ్రఫీలో ప్రాథమిక అంశాలు తెలియకపోయినా, నైపుణ్యం లేని వారు కూడా కేవలం మోడ్-డయల్ ను మార్చి డిజిటల్ కెమెరాలలో అద్భుతమైన ఫోటోలు తీయగలగటం; వివిధ రకాల డిజిటల్ ఫిల్టర్ లు, ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్లు వాడి ఇష్టానుసారం డిజిటల్ ఫోటోలను మర్చుకోగలిగే సౌలభ్యం కలిగి ఉండటం; ఇలా మార్చిన ఫోటోలను సాంఘిక మాధ్యమాలలో అప్ లోడ్ చేసి మన్ననలు పొందటం డిజిటల్ ఫోటోగ్రఫీలో సులువు కావటంతో ఔత్సాహికులు, నిపుణులు డిజిటల్ బాట పట్టారు.[2]

అయితే ఏ కారణాల వలన అనలాగ్ ఫోటోగ్రఫీ కనుమరుగైందో, అవే కారణాల వలన గోడకు కొట్టిన బంతి వలె మరల తిరిగి వచ్చింది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో 2014 నుండి కొడాక్‌, ఫూజీఫిల్మ్, ఇల్ఫోర్డ్ వంటి బ్రాండ్ల ఫిలిం విక్రయాలను మిన్నంటాయి.[3] 20వ, 30వ పడులలో ఉన్న యువ పోర్ట్రెయిట్, వెడ్డింగ్ ఫోటోగ్రఫర్లు, తాము తీసే ఫోటోలలో ఒక ప్రత్యేక శైలి రావటం కోసం ఫిలింను వినియోగించటమే దీనికి ప్రధాన కారణం. ఫిలిం ఫోటోగ్రఫీలోని సమస్యలు, సాంకేతిక అవరోధాలు, దాని అవలక్షణాలే డిజిటల్ యుగంలో కళాత్మక లక్షణాలుగా పరిగణించబడటం మరొక కారణం.

చాప క్రింద నీరులా పారుతూ ఉన్న నవీన ఫిలిం విప్లవం ఇప్పుడు తూర్పు దేశాలలో కూడా విస్తరిస్తూ ఉంది. అనేక కెమెరాలు, కటకాలు తయారు చేయబడే, ప్రపంచపు ఫోటోగ్రఫీ రాజధానిగా పిలువబడే జపాన్ దేశంలో సైతం ఫోటోగ్రఫర్లు ఫిలిం పైనే మొగ్గు చూపిస్తున్నారు.[4] భారతదేశంలో అనలాగ్ ఫోటోగ్రఫీ పాశ్చాత్య దేశాలలో అంతగా విస్తరించకపోయిననూ, ఇక్కడి ఫోటోగ్రఫర్లలో కొంత శాతం దీనిపై కూడా దృష్టి పెట్టారు.[5][6][7][8]

చరిత్ర

[మార్చు]

సూదిబెజ్జం కెమెరా

[మార్చు]

4వ శతాబ్దంలోనే గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ Problems అని తను వ్రాసిన పుస్తకంలో సూదిబెజ్జం కెమెరాల గురించి చర్చించాడు.

5వ శతాబ్దంలో చైనీయులు పగోడాలు తలక్రిందులుగా గోడలపై కనబడటం గమినించారు. 10వ శతాబ్దానికి చెందిన షెన్ కువో అనే చైనీసు శాస్త్రవేత్త కెమెరా అబ్స్క్యూరా పై పరిశోధనలు చేసి, మొట్టమొదట దానికి జ్యామితీయ, పరిమాణాత్మక గుణగణాలని ఆపాదించగలిగాడు. 10 నుండి 16వ శతాబ్దం వరకూ ఇబ్న్-అల్-హైతం, గెమ్మా ఫ్రిసియస్, గియాంబటిస్టా డెల్లా పోర్టా వంటి వారు సూదిబెజ్జం కెమెరాల వలన ప్రతిబింబం ఎందుకు తలక్రిందులగా ఏర్పడుతుందో రచనలు చేశారు. 1600 వ సంవత్సరానికి గియాంబటిస్టా డెల్లా పోర్టా సూదిబెజ్జం కెమెరాకి కటకాన్ని ఉపయోగించాడు. 1850 సంవత్సరంలో స్కాటిష్ శాస్త్రవేత్త డేవిడ్ బ్ర్యూస్టర్ సూదిబెజ్జం కెమెరాతో మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని సృష్టించాడు.

లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫిక్ ప్లేట్లు/ఫిలిం

[మార్చు]
డాగురోటైప్ పద్ధతి ద్వారా సృష్టించబడే ఛాయాచిత్రం

కాంతిని నమోదు చేయటం పై అంతకు మునుపు నుండే పలువురు పలువిధాలుగా గుర్తించినను, పరిశోధనలు చేసినను వాటిని శాశ్వత పరచే ప్రక్రియలో మాత్రం 18వ శతాబ్దం వరకూ ముందడుగు పడలేదు.

డాగురోటైప్

[మార్చు]

1816 లో కళాకారులైన ఫ్రెంచి సోదరులు జోసెఫ్ నీప్సే, క్లైడ్ నీప్సెలు మొదటి నెగిటివ్ ను, దాని పాజిటివ్ ను సాధించారు. 1826-27 లో వీటిని శాశ్వత పరచే ప్రక్రియలను కనుగొన్నారు. ఇదే పద్ధతిని అనుసరించి కొద్దిగా మెరుగులు దిద్ది వారి భాగస్వామి లూయిస్ డాగురే, డాగురోటైప్ ను కనుగొన్నాడు. 1839 ఆగస్టు 19 న ఫ్రాన్సు, ఫోటోగ్రఫీని ప్రపంచానికి తాము ఇచ్చే కానుకగా పరిచయం చేసింది. 50వ దశకానికి లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ జన బాహుళ్యం లోకి వచ్చింది.[9] సిల్వర్ అద్దకం గల రాగి పలక పై జరిగే రసాయన చర్యలతో నమోదయ్యే కాంతితో ఛాయాచిత్రం ఏర్పడేది. తర్వాత రాగి పలకల స్థానే గాజు పలకలు వచ్చాయి. అప్పట్లో ప్లాస్టిక్ నాణ్యతా పమాణాలు తక్కువగా ఉండటం, ప్లాస్టిక్ కంటే గాజు పలకలే చవకగా లభ్యం కావటంతో డాగురోటైప్ లు ఫోటోగ్రఫీలో రాజ్యం ఏలాయి. కొద్ది పాటి మార్పులతో ఇంగ్లాండుకు చెందిన హెన్రీ ఫాక్స్ టాల్బాట్ క్యాలోటైప్ ను కనుగొన్నాడు. క్యాలోటైప్ లో కాగితపు నెగిటివ్ లు తయారయ్యేవి.

మొట్టమొదటి ఫోటోగ్రఫిక్ సంస్థ ఆన్స్కో

[మార్చు]

ఇత్తడి బొత్తాములు తయారు చేసే స్కోవిల్ సంస్థ, లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీకి ఇత్తడి/వెండితో తయారు చేయబడే ఫోటోగ్రఫిక్ ప్లేట్ల తయారీలోకి అడుగిడింది. 1839 లోనే ఫ్రాన్సు నుండి దిగుమతి అయ్యే ఫోటోగ్రఫిక్ ప్లేట్లకు దీటుగా అమెరికాలోనే స్కోవిల్ కంపెనీ ఫోటోగ్రఫిక్ ప్లేట్లను తయారు చేసింది.[10]

కొలాయిడన్ ప్రక్రియ

[మార్చు]

1851 లో బ్రిటన్ కు చెందిన ఫ్రెడెరిక్ స్కాట్ ఆర్చర్, ఫ్రాన్సుకు చెందిన గుస్తావ్ లే గ్రే దాదాపు ఒకేసారిగా కొలాయిడన్ అనే వెట్ ప్లేట్ ప్రక్రియను కనుగొన్నారు. 1860 నాటికి కొలాయిడన్ ప్రక్రియ డాగురోటైప్ లకు స్వస్తి పలికించింది.

1880 నాటికి డ్రై ప్లేట్ సాంకేతికత కూడా అభివృద్ధి చేయబడింది.

పెట్టె కెమెరా

[మార్చు]
ఫోటోగ్రఫీ శాస్త్రం/కళ మాత్రమే కాదు, ఒక ఆటవిడుపు కూడా అని నిరూపించిన కొడాక్ బ్రౌనీ

తాము క్రొత్తగా తయారు చేసిన రోల్ ఫిలిం విక్రయించేందుకు వీలుగా కొడాక్, మొట్టమొదటి పెట్టె కెమెరా అయిన కొడాక్ నెంబరు 1 ని విడుదల చేసింది. ఫోటోగ్రఫీ అంటే ఉత్సాహం చూపే చిన్నారులను దృష్టిలో ఉంచుకొని ఈ కెమెరా తయారు చేయబడింది. అందుకే అప్పటి పిల్లలు ఇష్టపడే కార్టూన్ బ్రౌనీ పేరు ఈ కెమెరాకు పెట్టబడింది. కేవలం ఒక్క డాలరు ధరతో బ్రౌనీ అమ్మకాలు మొదలయ్యాయి. చవకగా లభ్యమవటం, వాడుకలో సులభంగా ఉండటంతో బ్రౌనీ జనాదరణ పొందింది. ఇతర సంస్థలు కూడా బ్రౌనీ వలె పెట్టె కెమెరాలు తయారు చేయటం ప్రారంభించాయి. బ్రౌనీని మరింత అభివృద్ధి చేసి కొడాక్ బ్రౌనీ 2 ను కూడా విడుదల చేసింది.

మీడియం ఫార్మాట్ రాక

[మార్చు]
1889 లో ఒక వార్తాపత్రికలో ప్రచురించబడ్డ కొడాక్ ప్రకటన

లార్జ్ ఫార్మాట్లు అయిన డాగురోటైప్, కొలాయిడన్ ప్రక్రియలలో వాడబడే ప్లేట్లలో పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటం, కాపీ చేయటం కష్టతరంగా ఉండటంతో క్రొత్త దారులు వెదకవలసి వచ్చింది. ఫోటోగ్రఫీ నైపుణ్యం అవసరమయ్యే ఒక కళ/వైజ్ఙానిక శాస్త్రంగా మాత్రమే కాక, ఔత్సాహికులకు అభిరుచిగా మారటం, ఫోటోగ్రఫీలో వచ్చిన ఈ పెనుమార్పును ఈస్ట్‌మన్‌ కొడాక్‌ అందిపుచ్చుకొంటూ మీడియం ఫార్మాట్ కెమెరాలు, వాటికి తగిన ఫిలింను తయారీ ప్రారంభించటంతో లార్జ్ ఫార్మాట్ ఫిలిం మరుగున పడింది.

టి ఎల్ ఆర్ కెమెరా

[మార్చు]

లార్జ్ ఫార్మాట్ కెమెరాలకు వాడే ముసుగులోకి ఫోటోగ్రఫర్ వెళ్ళటం, కూర్చవలసిన దృశ్యంలో మార్పులు చేయటం కోసం బయటికి రావటం, మరల ముసుగు లోపలికి వెళ్ళటం వలన ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ కు చాలా సమయం వెచ్చించవలసి వచ్చేది. ఇలా కాకుండా కూర్చవలసిన దృశ్యం యొక్క ప్రతిబింబం కెమెరాలో కనబడితే సమయం ఆదా అవుతుంది అనే ఉద్దేశంతో టే ఎల్ ఆర్ కెమెరాలు అవతరించాయి.

1885 లోనే లండన్ కు చెందిన ఒక సంస్థ మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరాను తయారు చేసినట్లుగా చెప్పుకొంది. 1929 లో జర్మనీ తయారీలు అయిన రోలీకార్డ్, రోలీఫ్లెక్స్ కెమెరాలతో టి ఎల్ ఆర్ కెమెరాలు జనాదరణ పొందాయి.

టాయ్ కెమెరాలు

[మార్చు]

మీడియం ఫార్మాట్ కెమెరాలు వచ్చిననూ అవి కొంత ఖరీదైనవి కావటంతో చవక కెమెరాల అవసరం ఏర్పడింది. పలు సంస్థలు చవకైన మీడియం ఫార్మాట్ టాయ్ కెమెరాలు నిర్మించాయి. వీటిలో లుబిటెల్, డయానా, హోల్గాలు మంచి జనాదరణ పొందాయి. చవకగా ఉండటానికి ప్లాస్టిక్ తో నిర్మాణం చేయటం వలన, నిర్మాణ లోపం వలన ఛాయాచిత్రాలలో కలిగే లైటు లీకులు, ప్లాస్టిక్ కటకాల వలన పిక్టోరియలిజం, ఇంప్రెషనిజం శైలులకు దగ్గరగా ఛాయాచిత్రాలు సృష్టించబడటం/విగ్నెటింగ్ వంటి ప్రభావాలు కనబడటం వంటి వాటిని ఫోటోగ్రఫర్లు కళాత్మక లక్షణాలుగా గుర్తించారు..

లుబిటెల్

[మార్చు]
టాయ్ కెమెరాలకు నాంది పలికిన లుబిటెల్

Gosularstvennyi Optiko-Mekhanicheskii Zavod (GOMZ అనగా State Optical-Mechanical Factory) ను 1965 లో Leningradskoe Optiko Mekhanichesko Obedinenie (LOMO అనగా Leningrad Optical-Mechanical Union) గా మార్చారు. లోమో సంస్థ మొదట Komsomolets అనే టి ఎల్ ఆర్ కెమెరాను తయారు చేసింది. దీనికి మరిన్ని మెరుగులు దిద్ది Lubitel (అనగా రష్యన్ లో ఔత్సాహికుడు (Amateur)) అనే కెమెరాను విడుదల చేసింది.

డయానా

[మార్చు]
లోమోగ్రఫీ సంస్థచే పునర్నిర్మించబడ్డ డయానా ఎఫ్+ కెమెరా

1960వ దశకంలో హాంగ్‌కాంగ్ లోని కౌలూన్ ప్రదేశానికి చెందిన గ్రేట్ వాల్ ప్ల్యాస్టిక్ ఫ్యాక్టరీ (Great Wall Plastic Factory) చే ఒక చవకైన కెమెరాగా డయానా కెమెరాని రూపొందించటం జరిగింది. అధిక భాగం కెమెరాలు యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ఎగుమతి అయ్యేవి. డయానా కెమెరాలలో అధికభాగం నామమాత్రపు ధరలకి వాణిజ్య ప్రదర్శనశాలలో, సంతలలో, తిరునాళ్ళలలో, లాటరీలలో ఇవ్వబడేవి. కొంతకాలం తపాలా ద్వారా కూడా విక్రయించబడినవి.

హోల్గా

[మార్చు]
ఇతర టాయ్ కెమెరాలకు వారసురాలైన హోల్గా

1981 లో టీ. ఎం. లీ చే హాంగ్ కాంగ్ లో రూపొందించబడింది. హోల్గా కెమెరా యొక్క ప్రధాన ఉద్దేశం దిగువ మధ్య తరగతి ఉద్యోగులు అధిక జనులకు పండుగ-పబ్బాలకు సకుటుంబసపరివార ఛాయాచిత్రాలను అతి చవకగా అందుబాటులోకి తేవటం. విదేశీ విపణులకు హోల్గా పరిచయమైన కొన్ని సంవత్సరాలకే కొందరు ఛాయాచిత్రకారులు ప్రకృతి దృశ్యాలను, నిశ్చలన చిత్రాలను, రూప చిత్రాలను ప్రత్యేకించి వీధి ఛాయచిత్రకళను అవాస్తవికంగా, ఇంప్రెషనిజం కళాశైలిని స్ఫురింపజేసేలా చిత్రీకరించటం మొదలుపెట్టారు. కెమెరా సాంకేతికతలో నానాటికీ పెరిగిపోతున్న ఖరీదైన ఆధునిక సాంకేతికతో పోలిస్తే, హోల్గా కెమెరాలో ఖచ్చిత గుణం లేకపోవటం, ఛాయాచిత్రాలు కాంతి తప్పటం,, ఇటువంటి ఇతర చవక లక్షణాల వలన ఛాయాచిత్రకారుడు ఆవిష్కరణపై, సృజనాత్మకతలపై దృష్టి పెట్టవలసి రావటాన్ని ఈ అనుభవపూర్వక వాడుకరులు కొనియాడారు. ఈ అంశాలలో హోల్గా డయానా కెమెరాకు, అదివరకూ ఉపయోగంలో ఉన్న ఇతర టాయ్ కెమెరాలకు వారసురాలైనది.

ఫిలిం చుట్ట

[మార్చు]

ఆన్స్కో-కొడాక్ ల పోటాపోటీ

[మార్చు]

హానిబాల్ గుడ్ విన్ గ్లాస్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా పారదర్శక ఫిలిం రోల్ ను కనుగొన్నాడు. చాలా ప్రయత్నాల తర్వాత గుడ్విన్ ఫిలిం పై పేటెంటు హక్కులను పొందాడు. గుడ్విన్ తో ఒప్పందం ప్రకారం పేటెంటు హక్కులు గల ఫిలింను స్కోవిల్ సంస్థ తయారు చేయటం మొదలు పెట్టింది.

ఒక ప్రక్క కొడాక్ వేగం పెంచింది. అంతకు మునుపు ఫోటోగ్రఫీ ఒక కళగా, శాస్త్రంగా పరిగణించబడి కేవలం నిపుణులకు మాత్రమే సాధ్యపడేది. ఫోటోగ్రఫీకి కావలసిన పరికరాలు పెద్దవిగా ఉండటం, దాని వలన వాటి ధర కూడా ఎక్కువగా ఉండటం, ఫోటోగ్రఫీలో ఔత్సుకుత పెరగటం, సాధారణ ప్రజానీకం కూడా ఫోటోగ్రఫీని అభిరుచిగా అలవరచుకోవటం గమనించిన కొడాక్ ఫోటోగ్రఫీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో 1901 లో కొడాక్ బ్రౌనీ అనే ఒక మీడియం ఫార్మాట్ కెమెరాను తయారు చేసింది.[11] రెండుంపాఫు (2.25) ఇంచిల పొడవు, అంతే వెడల్పు గల ఫోటోలను 117 ఫిలిం పై నమోదయ్యే ఈ కెమెరా మీడియం ఫార్మాట్ ఫిలింకు బీజాలు వేసింది. తర్వాతి కాలంలో 117 ఫిలిం వాడే కెమెరాల తయారీ ఆగిపోవటం, మీడియం ఫార్మాట్ లో 120, 620, 220 ఫిల్ంలు రావటంతో కొడాక్ 117 ఫిలిం తయారీని ఆపివేసింది.

1970లో 135 ఫిల్మ్ రాకతో మీడియం ఫార్మాట్ లు కనుమరుగయ్యాయి.[12]

అమెరికా నుండి ప్రపంచానికి విస్తరించిన కొడాక్

[మార్చు]

ఫోటోగ్రఫీ కేవలం నిపుణులకే కాదని, సగటు వినియోగదారుడు కూడా చక్కని ఫోటోలు తీయవచ్చని, దీని కోసం వినియోగదారుడు శ్రమ పడవలసిన అవసరం లేదని, కేవలం కెమెరా పైనున్న మీట వారు నొక్కితే చాలు, మిగతాది తాము చూసుకొంటామని కొడాక్ తెలిపింది. ఫోటోగ్రఫీని ఒక వైజ్ఞానిక శాస్త్రం, ఒక కళ అనే మూసల నుండి బయటపడవేసి అనలాగ్ కెమెరా లను, ఫిలింను జనబాహుళ్యంలోకి తెచ్చింది ఈస్ట్‌మన్‌ కొడాక్‌ యే. కొడాక్ కంటే మేలిమి ఫిలిం చుట్టలను ఆన్స్కో తయారు చేసిననూ, ఆన్స్కో ఎన్నటికీ కొడాక్ ను ఢీ కొట్టలేకపోయింది. తన పరిశోధనలతోనే ఫిలిం చుట్టకు అనేక మెరుగులు దిద్దిన కొడాక్ సంస్థ, బలమైన ప్రత్యర్థి లేకపోవటంతో ఫిలిం తయారీలో కొంతకాలం గుత్తాధిపత్యం చెలాయించింది.

కొడాక్ కు గట్టి పోటీ ఇచ్చిన జపాన్ కు చెందిన ఫూజీఫిల్ం

[మార్చు]
కొడాక్ కు ప్రపంచవ్యాప్తంగా గట్టి పోటీ ఇచ్చిన ఫూజీఫిల్మ్

1934 లో జపాన్కు చెందిన ఫూజీఫిల్మ్ ఫిలిం తయారీ మొదలుపెట్టింది. ఫూజీఫిలిం అమెరికాలో ఫిలిం విక్రయించటం మొదలుపెట్టిననూ అది తమకు ఎన్నటికీ పోటీదారు కాలేదు అని కొడాక్ పొరబడింది. తర్వాత ఫూజీ కూడా కొడాక్ తో పోటీ పడటం, ఫూజీ పై కొడాక్ దావా వేయటం, ఆ దావాలో కొడాక్ వైఫల్యం చవిచూడటం జరిగింది. ఈ లోగా ఫూజీ, అమెరికాలో పుంజుకొంది.

రష్యా ప్రభుత్వపు ప్రశంసలు చూరగొన్న టాస్మా

[మార్చు]

1935 లోరష్యాలోని కాజాన్ కు చెందిన ఫ్యాక్టరీ ఫిలిం నెంబరు 8 మొట్టమొదటి ఫిలింను విడుదల చేసింది. ఫిలిం తయారీలో పలు ఆవిష్కరణలు చేసిన ఈ ఫ్యాక్టరీ, రెండవ ప్రపంచ యుద్ధంలో సైతం ఫిలిం తయారీని ఆపలేదు. అప్పటి సోవియట్ యూనియన్ ప్రశంసలు చూరగొన్న ఫ్యాక్టరీ, 1974లో టాస్మాగా పేరు స్థిరపరచుకొంది. యుద్ధం తర్వాత కూడా టాస్మా ఫిలింలో పలు పరిశోధనలు చేసి, నూతన ఆవిష్కరణలను చేసింది.

ఇటలీ లో పుట్టి ఆస్కార్ అవార్డులు గెలుచుకొన్న ఫెర్రానియా

[మార్చు]
సినిమాను, ఫోటోగ్రఫీని ఉర్రూతలూగించిన ఫెర్రానియా P30 ఫిలిం

మొదట నష్టాలను చవి చూసినా, ఇటలీకి చెందిన ఫెర్రానియా ఫిలిం 30వ దశకంలో లాభాల బాట పట్టింది. అనలాగ్ కెమెరాల తయారీ కూడా మొదలు పెట్టింది. తరాలు, అభిరుచులు మారినా ఇటలీ వాడే ఫెర్రానియా ఫిలిం మాత్రం మారలేదు. క్రొత్తదనం కూడా పాత ఫెర్రానియా పై అద్భుతంగా ఆవిష్కరించబడింది. 40, 50 వ దశకాలలో కూడా ఫెర్రానియాకు తిరుగులేకుండా పోయింది. 60వ దశకంలో విడుదలైన ఫెర్రానియా P30 బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, ఇటాలియన్ సినిమాను క్రొత్త పుంతలు త్రొక్కించింది. హాలీవుడ్ లో P30 ఫిలిం పై నిర్మితమైన చలన చిత్రాలకు ఆస్కార్ల పంట పండింది.

గడువు తీరిన ఫిలిం యొక్క గొప్పదనం చాటిన ఉక్రెయిన్ కు చెందిన స్వెమా

[మార్చు]
అవసరమే ఆవిష్కరణకు మూలం అని నిరూపించిన స్వెమా ఫిలిం

ఒక ప్రక్క 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ఉక్రెయిన్ లో సినీ పరిశ్రమ చావు దెబ్బ తిన్నది. దీనితో సంయుక్త రష్యాకు ప్రియమైన స్వెమా ఫిలిం ఉత్పత్తి ఆగిపోయింది. పౌరాణిక అంశాలను ఉక్రెయిన్ సినీ ప్రేక్షకులు ధిక్కరించటం, వాస్తవానికి దగ్గరగా ఉన్న కథాంశాలను తప్పనిసరి పరిస్థితులలో ఫిలిం స్కూలు విద్యార్థులు గడువు తీరిన ఫిలిం (expired film) పై చలన చిత్రాలు చిత్రీకరించవలసి రావటం, ఫలితంగా లఘు చిత్రానికి చలన చిత్రానికి మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోవటం, దాని వలన వచ్చిన ఆ ప్రత్యేకమైన శైలికి అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు రావటంతో ఫిలిం యొక్క ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలిసివచ్చింది. చలనచిత్ర సాంకేతిక వర్గం/స్టిల్ ఫోటోగ్రఫర్ల యొక్క నైపుణ్యానికి, గడువు తీరిన స్వెమా ఫిలిం పై చిత్రీకరణే ఒక ఒక కొలబద్ధగా మిగిలిపోయింది.

ఇతర దేశాలలో ఫిలిం ల వెల్లువ

[మార్చు]

బెల్జియం నుండి ఆగ్ఫా, జర్మనీ నుండి అడాక్స్, మాకో, ఆర్వో, చైనా నుండి లక్కీ ఫిలిం, షాంఘై ఫిలిం, జపాన్ నుండి నిప్పాన్ ఫిలిం, కోనీకా, మిత్సుబిషి, చెక్ రిపబ్లిక్ నుండి ఫోమా, ఇంగ్లండు నుండి ఇల్ఫోర్డ్, క్రొయేషియా నుండి ఎఫ్కే, భారతదేశానికి చెందిన ఇందు ఫిలింలు ఫోటోగ్రఫీలో, చలనచిత్రరంగంలో సందడి చేశాయి.

135 ఫిల్ం

[మార్చు]

1893 నాటికి వాడబడుతోన్న 70 ఎంఎం ఫిలింను థామస్ ఎడిసన్ పరిశోధనశాలలో పని చేస్తోన్న విల్లియం కెన్నెడీ లారీ డికెన్సన్ అనే సాంకేతిక నిపుణుడు సగానికి కత్తరించి, పైనా, క్రింద్ర, రంధ్రాలు వేయించి మొట్టమొదటి 35ఎంఎం ఫిలింను సృష్టించాడు.[13] నాలుగు రంధ్రాల వెడల్పు ఒక ఫ్రేంగా వాడుకొనటానికి ఈ ప్రయత్నం జరిగింది. (తర్వాతి కాలంలో దీనినే హాఫ్-ఫ్రేంగా గుర్తించటం జరిగింది. 35ఎంఎం ఫిలిం పై ఫుల్ ఫ్రేంకు ఎనిమిది రంధ్రాల వెడల్పు కావలసి వస్తుంది.)

అప్పటికే జనాదరణ పొందిన మీడియం ఫార్మాట్ కెమెరాలు, ఫిలిం కన్నా 135 కెమెరాలు, ఫిలిం చిన్నవిగా ఉండటంతో 1970 నుండి 135 ఫిల్ం ఊపందుకొంది. 1999 నాటికి వచ్చిన డిజిటల్ విప్లవంతో 135 ఫిల్ంతో బాటు మొత్తం అనలాగ్ ఫోటోగ్రఫీ తుడిచిపెట్టుకుపోయింది.[14]

135 ఫిల్ం కు కూడా విస్తరించిన టాయ్ కెమెరాలు

[మార్చు]

Cosina CX2 లాగే ఉండే కెమెరా ఒకటి, రష్యాలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో నిర్మించాలన్న ఆలోచనతో లోమో ఎల్ సి-ఏ తయారు చేయబడింది. 70వ దశకంలో స్మెనా అనే మరో టాయ్ కెమెరా కూడా 135 ఫిలిం కొరకు నిర్మించబడింది. 90వ దశకంలో కళా ఉద్యమంగా మొదలైన లోమోగ్రఫీ, సంస్థగా ఏర్పడి స్ప్రాకెట్ రాకెట్, లా సార్డీనా వంటి 135 ఫిలిం టాయ్ కెమెరాలను రూపొందించింది. దీనితో టాయ్ కెమెరాలు 135 ఫిలింకు కూడా విస్తరించబడ్డాయి.

రేంజ్ ఫైండర్ కెమెరాలు

[మార్చు]

ఫిలిం లో సాంకేతిక పురోగతి

[మార్చు]
సాధారణ దృశ్యాలను కూడా స్వాప్నిక దృశ్యాలుగా తలపింపజేసే ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ

కాలక్రమేణా సాంకేతిక పెరిగేకొద్దీ ఫిలిం తయారీలో కూడా పలు సాంకేతిక పురోగతులు జరిగాయి.

కలర్ ఫిలిం

[మార్చు]

1935 లో కొడాక్ మొట్టమొదటి కలర్ ఫిలిం కొడాక్రోంను విడుదల చేసింది.

1936 లో ఆగ్ఫా తమ కలర్ ఫిలిం ఆగ్ఫాకలర్ న్యూను విడుదల చేసింది.

అధిక ఖర్చు, వాడుక కష్టతరం కావటం వలన యాభయ్యవ దశకం వరకు కలర్ ఫిలింకు పెద్ద గుర్తింపు రాలేదు. 60వ దశకం నుండి కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రం కలర్ ఫిలింను వాడేవారు. 70వ దశకం నాటికి కలర్ ఫిలిం చవకగా లభ్యం కావటం మొదలయ్యింది.

1963 కల్లా పోలరాయిడ్ కూడా ఇన్స్టంట్ కలర్ ఫిలింను విడుదల చేసింది.

స్లైడ్ ఫిలిం

[మార్చు]

1907 లోనే లూమియర్ ఆటోక్రోం స్లైడ్ ప్లేట్ ను కనుగొంది. 1930 లో లూమియర్ ఫిలిం కలర్ విడుదల అయ్యాక ప్లేట్లు ఆగిపోయాయి.

ఇన్ఫ్రారెడ్ ఫిలిం

[మార్చు]

1910 నాటికి ఇన్ఫ్రారెడ్ ఫిలింను ఉపయోగించి ఇన్ఫ్రారెడ్ ఫోటోలు తీయటం జరిగింది. సాంకేతిక, భద్రతా రంగాలకు పరిమితమైన ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ, 1930 నాటికి సాధారణ వినియోగదారులకు చేరింది. 60వ దశకానికి ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీని విరివిగా వాడటం జరిగింది.

డి ఎక్స్ ఎన్ కోడింగ్

[మార్చు]

3 జనవరి 1983న కొడాక్ డి ఎక్స్ ఎన్ కోడింగ్ ఫిలింను విడుదల చేసింది. ఆటోమేటిక్ కెమెరాలలో ఫిలింను లోడ్ చేయటాన్ని సులభతరం చేసింది.

ఎస్ ఎల్ ఆర్ కెమెరా

[మార్చు]
ప్రపంచపు మొట్టమొదటి ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కినీ ఎగ్జాక్టా

టే ఎల్ ఆర్ కెమెరాలలో వీక్షణ ఒక కటకం, ఛాయాచిత్రం నమోదు చేయటానికి మరొక కటకం ఉండటం వలన కొన్ని తప్పులు దొర్లేవి. ఈ తప్పులను సరి చేయటానికి వీక్షణకు, ఛాయాచిత్రం నమోదు చేయటానికి ఒకే కటకం వాడవలసిన అవసరం ఏర్పడింది. ఫలితంగా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు తయారు చేయబడ్డవి.

లార్జ్ ఫార్మాట్ లో ఎస్ ఎల్ ఆర్ కెమెరా 1884 కే అమెరికాకు చెందిన సి ఆర్ స్మిత్ సంస్థ రూపొందించింది. 1920వ దశాబ్దంలో చిన్న ఫార్మాట్ లకు పలు ఇతర సంస్థలు ఎస్ ఎల్ ఆర్ లు రూపొందించాయి. 1936 లో జర్మనీకి చెందిన కినీ ఎగ్జాక్టా వినియోగదారుల కోసం విడుదల చేయబడ్డ మొట్టమొదటి ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయ్యింది.

ఇన్స్టంట్ కెమెరా/ఫిలిం

[మార్చు]
స్వయంచాలితంగా సంవర్థన చెందే పోలరాయిడ్ ఫిలిం

1948 లో అమెరికాకు చెందిన ఎడ్విన్ ల్యాండ్ అనే శాస్త్రవేత్త ఇన్స్టంట్ కెమెరాను కనుగొనటంతో, ఇన్స్టంట్ ఫిలిం ల తయారీ మొదలయ్యింది. పోలరాయిడ్ సంస్థ పలు ఇన్స్టంట్ కెమెరాలను, ఇన్స్టంట్ ఫిలిం లను తయారు చేసింది. కొడాక్, ఫూజీఫిలింలు కూడా ఈ రంగంలో కాలు మోపాయి. ఫోటో తీసిన కొద్ది సెకనులలోనే తమ కళ్ళ ముందే ఫిలిం కాస్తా స్వయంచాలితంగా ఫోటోగా సంవర్థన చెందటం చూసి జనాలు మురిసిపోయేవారు.

డిజిటల్ ఫోటోగ్రఫీ రాక

[మార్చు]

అంతకు మునుపే డిజిటల్ ఫోటోలు తీయబడినను, సగటు వినియోగదారుడిని దృష్టిలో ఉంచుకొని 1975 లో మొట్టమొదటి డిజిటల్ కెమెరాను కొడాక్ తయారు చేసింది. 90వ దశకంలో ఊపందుకొన్న డిజిటల్ ఫోటోగ్రఫీ, అనలాగ్ ఫోటోగ్రఫీకి చరమగీతం పాడింది.

డిజిటల్ ఫోటోగ్రఫీలో ఉన్న లాభాలు

  • ఫిలిం, రసాయనాల, డార్క్ రూం అవసరం లేదు. కాబట్టి ఫిలిం పై తీసే ఫోటో కన్నా డిజిటల్ ఫోటో తీయటం/ముద్రించటం చవక కావటం
  • వాడుకలో సులువు. సాంకేతిక విప్లవంతో డిజిటల్ కెమెరాలు మొబైల్ ఫోన్లలో ఇమిడిపోవటం వలన చిన్నపిల్లలు కూడా ఫోటోలు తీయగలగటం
  • తీసిన ఫోటో సరిగా రాకపోతే తక్షణమే దానిని డిలీట్ చేసి, కెమెరా అమరికలను సరిచేసుకొని మరల ఇంకో ఫోటోను ఎటువంటి ఖర్చు లేకుండా సరిగా తీయగలగటం. ఇలా ఎన్ని మార్లు ఫోటో అనుకొన్న విధంగా రాకపోయిననూ, సరి చేసుకొనే అవకాశం ఎప్పటికీ ఉండటం
  • పలు రకాలు డిజిటల్ ఫిల్టర్లతో, ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్లతో ఫోటోలను మార్చివేసే సౌలభ్యం ఉండటం
  • అంతర్జాలంలో, సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయటం సులభతరం కావటం

వ్యుత్పత్తి

[మార్చు]

21వ శతాబ్దంలో పుంజుకొన్న డిజిటల్ ఫోటోగ్రఫీ నుండి అప్పటికే పాతబడిపోయిన ఫిలింను ఉపయోగించే ఫోటోగ్రఫీని వేరు చేయటానికి, అనలాగ్ ఫోటోగ్రఫీ అనే పదం సృష్టించబడింది.

దశలవారీగా క్షీణించిన అనలాగ్ ఫోటోగ్రఫీ

[మార్చు]

డిజిటల్ విప్లవం అనలాగ్ ఫోటోగ్రఫీకి గొడ్డలి పెట్టు అయ్యింది. ఒక్కొక్కటిగా అన్ని సంస్థలు, తమ అనలాగ్ ఉత్పత్తుల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

2004 లో కొడాక్

[మార్చు]

డిజిటల్ ఫోటోగ్రఫీని అందిపుచ్చుకోలేకపోవటం, ఫిలిం, అనలాగ్ కెమెరాల విక్రయాలు తగ్గుముఖం పట్టటంతో, 90వ దశకం ద్వితీయార్థంలో కొడాక్ ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. 2004 లో కొడాక్ ఇకపై అనలాగ్ కెమెరాలు, ఫిలిం తయారీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.[15][16]

2006 లో నికాన్ , కొనీకా-మినోల్టా

[మార్చు]

2006 లో అనలాగ్ కెమెరాల తయారీని నిలిపివేస్తున్నట్లు నికాన్,[17] కొనీకా-మినోల్టా [18] ప్రకటించాయి

2008 లో పోలరాయిడ్

[మార్చు]
  • 2008 లో ఇన్స్టంట్ కెమెరాలకు, ఇన్స్టంట్ ఫిలింకు స్వస్తి పలుకుతోన్నట్లు పోలరాయిడ్ ప్రకటించింది.[19]

2018 లో కెనాన్

[మార్చు]
  • 2018 లో కెనాన్ తమ అనలాగ్ కెమెరాల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.[20]

మూతబడ్డ ఫిలిం ఫ్యాక్టరీలు

[మార్చు]

90వ దశకంలో ఆన్స్కో

[మార్చు]

90వ దశకానికి హేకింగ్ ఎంటర్ప్రైజెస్ ఆన్స్కోను కొనివేసింది. ఆన్స్కో కాలప్రవాహంలో కలిసిపోయింది.

2004 లో స్వెమా

[మార్చు]

2004 నాటికి స్వెమా నష్టాలలో కూరుకుపోయింది.

నవంబరు 2007 లో షోస్త్కా నగర పాలిక సంస్థ స్వెమా ఫిలిం పునురుద్ధరణలో పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రణాళిక మొదలుపెట్టిననూ, ఇది కాగితాల వరకే పరిమితమైంది.

2005 లో ఆగ్ఫా ఫోటో

[మార్చు]

నష్టానివారణ చర్యలు చేపట్టినా 2005 లో ఆగ్ఫా ఫోటో కుప్ప కూలింది [21] 200/400 స్పీడ్ గల తమ ఫిలిం లనును నిలిపివేస్తున్నట్లు 2018 లో ప్రకటించింది.[22]

2007 లో బర్గర్ ఫిలిం

[మార్చు]

2007 జనవరిలో ఫ్రాన్సుకు చెందిన బర్గర్ ఫిలింతో ఫోర్టే సంస్థ యొక్క ఒప్పందం ముగిసింది.[23]

2010 లో ఫెర్రానియా

[మార్చు]

పలు చేతులు మారిన ఫెర్రానియాను 1964లో 3M అనే సంస్థ సొంతం చేసుకొంది. 80వ దశకం వరకు ఫిలిం ఉత్పత్తి రంగంలో పలు ఆవిష్కరణలు చేసిననూ, 90వ దశకంలో మందగించిన ఎదుగుదల నుండి కోలుకొనేందుకు ఫిలిం ఉత్పత్తిని 3M నుండి ఇమేషన్ అనే సంస్థకు తరలించడం జరిగింది. 2000 సంవత్సరం నాటికి ఇమేషన్ కూడా డిజిటల్ ఫోటోగ్రఫీ యుద్ధాన్ని గెలవలేకపోయింది. 2010 లో ఫెర్రానియా ఫ్యాక్టరీకి తాళం వేయబడింది. ఫ్యాక్టరీని స్థానిక ప్రభుత్వం సొంతం చేసుకొంది.

2012 లో ఎఫ్కే ఫిలిం

[మార్చు]

నష్టాల ఊబిలో చిక్కుకొన్న ఎఫ్కే ఫిలిం [24] 2012 నాటికి మూతబడింది

2016 లో ఫూజీఫిలిం

[మార్చు]

2016 లో ఫూజీఫిలిం, తమ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం తయారీని నిలిప్వేస్తున్నట్లు ప్రకటించింది [25]

2018 లో ఇందు ఫిలిం

[మార్చు]

2018 లో భారత్ కు చెందిన ఇందు ఫిలిం [26]లు కూడా మూతబడింది.

ఫిలిం తిరిగిరాకకు కారణాలు

[మార్చు]

ఫిలిం దూరమయ్యే కొద్దీ, దానికి కావలసిన నైపుణ్యం, ఫిలిం ఫోటోగ్రఫీ యొక్క శైలి, ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళకు ఫిలిం దగ్గరగా ఉండటం వంటి అంశాలపై ప్రజలలో మోజు పెరిగింది.

ఫిలిం లోడ్ చేయడం నుండి ఫోటో ముద్రణ అయ్యేవరకు ప్రతి దశలో ఓర్పు, ఓపిక, నేర్పరితనం, నైపుణ్యం అవసరం అవుతాయి. ప్రక్రియ ఆసాంతం చాలా పరిశ్రమ, సమయం కూడుకొని ఉంటాయి. డిజిటల్ ఫోటోగ్రఫీలో ఇలా ఫోటో తీయగనే, అలా ప్రింటు వేయవచ్చును

నైపుణ్యం

[మార్చు]
సంవర్థన తర్వాత ఫిలిం రీల్ పై కనబడుతోన్న నెగిటివ్ ఫోటోలు
  • అనలాగ్ ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ లోని ప్రాథమిక అంశాలను, మౌలిక సూత్రాలను స్పష్టంగా బోధపడేలా చేస్తుంది.[27]
  • అనలాగ్ కెమెరాల వలన కెమెరాలు (ప్రతి అమరిక, ప్రతి మీట, ప్రతి పిడి) పనిచేసే విధానం కూడా బోధపడుతుంది. ఈ విషయంలో డిజిటల్ కెమెరాలు కేవలం సర్క్యూట్ బోర్డులుగా మాత్రమే పనికివస్తాయి.
  • ఫిలిం ఫోటోగ్రఫీలో ఎల్ సీ డీ మానిటర్ ఉండదు. మెమరీ కార్డు ఉండదు. కేవలం కొన్ని షాట్లు మాత్రమే ఉంటాయి. కావున ఫోటో తీసే ముందే ఫోటోగ్రఫర్ ఒకటికి రెండు మార్లు అమరికలను అన్నింటినీ (సూక్ష్మరంధ్రం, కెమెరా కటకం, కటక నాభి, షట్టరు వేగం, ఫిలిం వేగం వంటివి) సరి చూసుకోవాలి. అనలాగ్ ఫోటోగ్రఫీ ఛాయాచిత్రకారునిలో ఒక రకమైన క్రమశిక్షణను, జాగ్రత్తను అలవరుస్తుంది.
  • ఇది నా సృష్టి అనే భావన అనలాగ్ ఫోటోగ్రఫీలో మాత్రమే ఉండటం. డిజిటల్ కెమెరాలలో ఏవో కొన్ని అమరికలవల్ల ముద్రణ అయ్యే ఛాయాచిత్రంలో కంటే, ప్రతి అమరికను ఫోటోగ్రఫర్ తనకు కావలసినట్లుగా అమర్చుకొని తీయటం వలన, ఛాయాచిత్రం తాను అనుకొన్నట్లు రావటం వలన, ఒక అనలాగ్ ఫోటోగ్రాఫ్ తన స్వంతం అవుతుంది.
  • ఫిలిం సంవర్థన లోని రహస్యాన్ని ఛేదించే అవకాశం అనలాగ్ ఫోటోగ్రఫీలోనే ఉంది. ఇవ్వాళ్టి డిజిటల్ పరికరాల ఆవిష్కరణకు డార్క్ రూం యే వేదిక అని తెలుసుకోగలగటం. డిజిటల్ సాంకేతికతతో చేసే అన్ని పనులను, డార్క్ రూంలో కూడా చేయగలం అని తెలుసుకొనే అవకాశం కూడా అనలాగ్ ఫోటోగ్రఫీలోనే ఉంది.
  • అనలాగ్ ఫోటోగ్రఫీ సమగ్రమైనది, పరిపూర్ణత గలది అనే భావన.[28] మన ఇళ్ళలో ఫిలింతో తీసిన ఫోటోగ్రాఫ్ లన్నీ ముద్రితమై ఆల్బంలలో భద్రంగా ఉండటమే దీనికి నిదర్శనం.
  • బ్లాక్ అండ్ వైట్ ఫిలింను కావాలనుకొంటే ఆరు రెట్లు ఎక్కువగానీ, ఆరు రెట్లు తక్కువగానీ బహిర్గతం చేసి, వాటిలో మనకి నచ్చింది ఎంచుకోవచ్చు. కలర్ ఫిలింలో ఇదే వెసులుబాటు కాస్త తగ్గిననూ, దీనిని రెండు రెట్లు ఎక్కువగానీ, రెండు రెట్లు తక్కువగాన్నీ బహిర్గతం చేసి, వాటిలో మనకి నచ్చింది ఎంచుకోవచ్చు. Film Is Forgiving అనే నానుడి ఇలానే పుట్టింది!

ధరలు

[మార్చు]
  • డిజిటల్ కెమెరాలతో పోలిస్తే, అనలాగ్ కెమెరాలు చవకగా లభ్యం అవుతాయి. లక్షలు వెచ్చించి, డిజిటల్ కెమెరాలను కొని, వాటితో ఫోటోలు తీసి, సాఫ్టువేరు ద్వారా పురాతన అనుభూతిని పొందటం కన్నా, చవకగా ఫిలిం కెమెరాలు కొని ఫోటోలు తీసి అదే అనుభూతి పొందటం సులువు కావటం.

పరిజ్ఙానం

[మార్చు]
  • ఒక్కో అనలాగ్ కెమెరా, ఆయా తరం చరిత్రకు ప్రత్రిరూపం కావటం. ఫోటోగ్రఫీ రంగం ఎన్ని మార్పులకు గురి అయ్యిందో తెలపటం
  • ఫిలిం పై తీసినట్టే డిజిటల్ ఫోటోలను మార్చేసే సత్తా ఫోటో కన్వర్షన్ యాప్ లకు ఉన్నా, నిజానికి ఫిలిం పై తీసిన ఫోటోల అందం ఈ డిజిటల్ యాప్ లతో రాదు. అనలాగ్ ఫోటోగ్రఫీ చీకటి-వెలుగుల గురించి, రంగుల గురించి లోతైన అవగాహనను ఇస్తుంది. కొన్ని రకాల ఫిలింలు రంగులను యథాతథంగా నమోదు చేస్తాయి. కొన్నేమో వర్ణ వైరుధ్యాన్ని (Color Contrast), వర్ణ సంతృప్తతలను (Color Saturation) అతిశయించి నమోదు చేస్తాయి. మరి కొన్ని రంగుల తీవ్రతను తగ్గించి ఛాయాచిత్రాన్ని నమోదు చేస్తాయి.
  • ఒక్కొక్క ఫిలిం, ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క రకంగా స్పందిస్తుంది. డిజిటల్ యాప్ లతో వీటిని తెలుసుకోలేము. కొన్ని రకాల ఫిలింలు స్పష్టతలో డిజిటల్ ఫోటోలతో పోటీపడటం ఒక ఎత్తు అయితే, కొన్నింటిలోని కళాత్మక లక్షణాలను ఈ డిజిటల్ యాప్ లు పుణికిపుచ్చుకోవటం మరో ఎత్తు. ఒక ఛాయాచిత్రం నిజంగా ఫిలిం పై తీయబడిందా, లేక ఫోటో ఎడిటింగ్ సాఫ్టువేరుతో డిజిటల్ ఫోటోనే అలా మార్చివేశారా అనే విషయం నిపుణులు ఇట్టే పసిగట్టేయగలరు.

ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ

[మార్చు]
కలర్ ఫిలింను తప్పుడు దిశగా లోడ్ చేయడం వలన అతిగా బహిర్గతమయ్యే ఎరుపు వర్ణం
  • డిజిటల్ కెమెరాలలో ఉన్న సౌకర్యాల వలన పొరబాటున కూడా పొరబాటుకు స్థానం లేకపోవటం. ఫిలిం ఫోటోగ్రఫీలో ఒక్కోమారు జరిగే పొరబాట్లే, ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళకు దారులు అవ్వటం. (ఉదా: తప్పుడు దిశలో లోడ్ చేసిన కలర్ ఫిలిం, రెడ్ స్కేల్ అనే పద్ధతిని సృష్టించింది. ఒకమారు షాట్ తీసిన తర్వాత, ఫిలింను తదుపరి ఫ్రేంకు కదపటం మరచిపోవటం వలన బహుళ బహిర్గతం అనే పద్ధతిని సృష్టించింది). డిజిటల్ కెమెరాలు ఫోటోగ్రఫర్లను బద్ధకస్తులు చేస్తాయనే అభిప్రాయం ఉండటం.
  • ఫిలిం ఎప్పటికప్పుడు ఫోటోగ్రఫర్ లను ఆశ్చర్యచకితులను చేస్తూనే ఉంటుంది. పురాతన కెమెరాలలో వాడటం వలన లేదా గడువు తీరిన ఫిలిం (expired film) వాడటం వలన సరిగా బహిర్గతం కాకపోవటం, విగ్నెటింగ్కు గురికావటం, లైట్ లీకులు, సాఫ్ట్ ఫోకస్ వంటి లక్షణాలతో ఫిలిం క్రొత్త సమస్యాత్మక లక్షణాలను సృష్టిస్తుంది. ఈ సమస్యాత్మక లక్షణాలే డిజిటల్ యుగంలో కళాత్మక లక్షణాలుగా పరిగణించబడుతోన్నాయి. కొందరు ఫోటోగ్రఫర్లు అయితే ఏకంగా ఇలాంటి పురాతన కెమెరాలను, గడువు తీరిన ఫిలింను అదేపనిగా వాడి సమస్యాత్మక (కళా) లక్షణాలను కొనితెచ్చుకొంటారు.
  • డిజిటల్ ఫోటోలలో వచ్చే మితిమీరిన స్పష్టత పై ఆసక్తి తగ్గటం. అనుకోకుండా అనలాగ్ ఫోటోలలో వచ్చే అస్పష్టత, ఫిలిం గ్రెయిన్, అవి ఫోటోలకు ఇచ్చే పురాతన అనుభూతుల పై మోజు పెరగటం.
  • కొన్ని అనలాగ్ కెమెరాల వలన ఫిలిం పై వచ్చే అనుభూతి, డిజిటల్ ఫోటోగ్రఫీ/ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్లు/సాఫ్టువేర్లతో ఎప్పటికీ అసాధ్యాలుగానే మిగిలి పోవటం [29]
  • ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళను ప్రోత్సహించటానికి alternativephotography.com, pinholeday.org, roll4roll.com వంటి వెబ్-సైటులు సైతం వెలిసాయి.

సయానోటైప్

[మార్చు]
1910 లో సయనోటైప్ లో ముద్రించిన ఒక ఛాయాచిత్రము

సయనోటైప్ అనునది ఫోటోలని సయాన్ బ్లూ రంగులో ముద్రించే ఒక ఫోటోగ్రఫిక్ ప్రింటింగ్ ప్రక్రియ. 20వ శతాబ్దంలో ఈ ప్రక్రియ ఇంజినీరింగ్ రంగాల్లో బాగా ప్రాచుర్యం పొందినది. సరళమైన తక్కువ ఖర్చుతో కూడుకొన్న ఈ ప్రక్రియ ఇంజనీరింగ్ రంగంలో భాగమైన బ్లూప్రింట్ లని పెద్దమొత్తంలో కాపీ చేయటానికి ఉపయోగపడేది. ఇందులో రెండు రసాయనాలని ఉపయోగిస్తారు.

  • అమ్మోనియం ఫెర్రిక్ సైట్రేట్
  • పొటాషియం ఫెర్రిసయనైడ్

డబుల్/మల్టిపుల్ ఎక్స్పోజర్

[మార్చు]

ద్విబహిర్గతం అనగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బహిర్గతాలని ఒకే ఫిలిం ఫ్రేం పై జరపడం. ఇలా బహిర్గతం జరపటం వలన ఒకే ఛాయాచిత్రంలో పలు ప్రతిబింబాలు ఒకదాని పై ఒకటి ఉన్నట్టు అగుపిస్తాయి.

ఇతరాలు

[మార్చు]
  • సరిక్రొత్త సౌకర్యాలు రోజు రోజుకీ పెరిగిపోతుండటం వలన డిజిటల్ కెమెరాలు త్వరగా కాలగర్భంలో కలిసిపోవటం. అనలాగ్ కెమెరాల వినియోగంలో, ఈ నాటికి కూడా ఏ మార్పులూ రాకపోవటం
  • నానాటికీ ఫిలిం ఉత్పత్తులు, కెమెరాలు, ఫిలింను సంవర్థించే ల్యాబ్ లు కనుమరుగవటం. ఫిలిం ఫోటోగ్రఫీ భవితవ్యం ఆగమ్యగోచరం కావటం మూలాన, పాశ్చాత్య యువతలో ఇవి అంతరించిపోయేలోపే వీటిని ఆస్వాదించాలి అనే భావన పెరిగిపోవటం.
  • డిజిటల్ ఫోటోలు శాశ్వతత్వం లేనివి. వీటిని మెమరీ కార్డులలో నిక్షిప్తం చేసుకొన్నా, అవి కనబడకపోయినా/పని చేయకపోయినా ఆ ఫోటోలు ఇక దొరకవు. (మనం ఇటీవలె తీసుకొన్న ఫోటోలు కూడా దొరక్క సతమతం అవుతూ ఉండటం ఈ కాలంలో గమనించవచ్చును.)
  • అనలాగ్ కెమెరాల వినియోగానికికు విద్యుత్తు అవసరంలేదు
  • కేవలం వైవిధ్యం కోసం. డిజిటల్ యుగంలో పుట్టి ఫిలిం అంటే ఏమిటో తెలియని యువతరాన్ని ఆకర్షించటం కోసం.
  • అనలాగ్ ఫోటోగ్రాఫ్ లకు సమయం పడుతుంది. దీనితో తాము తీసిన ఛాయాచిత్రాలు ఫిలిం పై కనబడగనే, ఫోటోగ్రఫర్ లలో కలిగే ఆనందం, డిజిటల్ ఫోటోగ్రఫీలో కలుగదు.

ఫిలిం తిరిగి రాక

[మార్చు]

డిజిటల్ తుఫానును ఎదురీదిన ఫిలిం తయారీదారులు

[మార్చు]

కాలానికి, డిజిటైజేషన్ కు అతీతంగా ఫిలిం తయారీదారులు ఫిలిం తయారీ కొనసాగిస్తూనే ఉన్నాయి.

  • ఒకప్రక్క డిజిటల్ ఫోటోగ్రఫీని అందిపుచ్చుకొంటూనే, మరొక ప్రక్క తమ ఫిలిం ఉత్పత్తులను ఫూజీఫిలిం కొనసాగించింది.
  • మారుతోన్న కాలానికి అనుగుణంగా కేవలం ఫోటోగ్రఫీకే పరిమితం కాకుండా వైద్య, విజ్ఙానిక రంగాలకు అవసరమయ్యే ఫిలింను తయారు చేస్తూ, తమను తాము నవీనీకరించుకొంటూ టాస్మా ముందుకు సాగిపోయింది.
  • లోమోగ్రఫీ సంస్థ రకరకాల క్రొత్త రకం ఫిలిం లను విక్రయించటం మొదలు పెట్టింది.

ఫిలిం విప్లవాన్ని సృష్టించిన లోమోగ్రఫీ

[మార్చు]
ఫిలిం విప్లవాన్ని సృష్టించిన లోమో ఎల్ సీ ఏ కెమెరా

1991లో ఒక విద్యార్థి బృందానికి దొరికిన లోమో ఎల్ సి-ఏ చాలా వ్యత్యాసంగా ఫోటోలను తీయటంతో వారు దాని పై ఆసక్తి కనబరచారు. ఇటువంటి ప్రత్యేకత కలిగి ఉన్న పురాతన కెమెరాలకు క్రొత్త సొబగులు అద్ది వాటిని పునర్నిర్మించటం మొదలు పెట్టారు. లోమోగ్రఫీ అనే సంస్థగా ఏర్పడి లోమో ఎల్ సి-ఏను లోమో ఎల్ సి-ఏ+ గా, డయానా కెమెరాను డయానా ఎఫ్+గా నిర్మించింది. వీటితోబాటు లుబిటెల్, హోల్గా వంటి పలు టాయ్ కెమెరాలకు సూదిబెజ్జం కెమెరాలౌ పునర్జన్మను ఇచ్చింది. డిజిటల్ ఫోటోగ్రఫీ సర్వసాధారణం అయిన నవీన యుగంలో మెరుగులు దిద్దిన పురాతన కెమెరాలకు, గడువు తీరిన ఫిలిం కు, ప్రత్యాన్మాయ ఛాయాచిత్రకళకు గిరాకీ పెరిగింది. లోమోగ్రఫీ ఉద్యమం ప్రపంచం నలుమూలలా ప్రాకుతూ ఫిలిం విప్లవాన్ని సృష్టించింది.

ఫిలిం పై పాశ్చాత్య దేశస్థుల మోజు

[మార్చు]

ఫిలిం ఇక లేదు అనుకొనే అవకాశం లేకుండా పాశ్చాత్య దేశాలలో ఫిలిం పై మోజు పెరిగింది. తమ ఇళ్ళలోని అల్మారాలలో పడి ఉన్న అనలాగ్ కెమెరాలకు పట్టిన దుమ్మును, అక్కడి యువత దులిపారు. వాటిలో ఫిలిం చుట్టలు వేసి అద్భుతమైన ఫోటోలు తీసారు. #FilmIsNotDead, #AnalogPhotography వంటి హ్యాష్ ట్యాగుతో సాంఘిక మాధ్యమాలలో ఫిలిం ప్రేమికులు ఫిలింను ప్రచారం చేయటం మొదలు పెట్టారు. పాతతరం కెమెరాలు, ఫిలింలో ఉండే మంచి లక్షణాలను మాత్రమే కాకుండా, అవాంఛనీయ ఫాగింగ్ (ఫోటోగ్రఫీ), డబుల్ ఎక్స్పోజరు, విగ్నెటింగ్, ఫిలిం గ్రెయిన్ వంటి లక్షణాలను కూడా ప్రేమించటం మొదలు పెట్టారు. 2003 నాటికి ప్రపంచంలో పలు ప్రదేశాలలో ఫిలిం అమ్మకాలు పెరిగాయి.[30]

బర్గర్ ఫిలిం పున:ప్రారంభం

[మార్చు]

హర్మాన్ టెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకొన్న బర్గర్ ఫిలిం 8 నెలల తర్వాత, 2007 లో తెరచుకొంది.

కొనసాగిన పోలరాయిడ్ ఫిలిం/కెమెరా ల తయారీ

[మార్చు]

2008 లో ఇంపాజిబుల్ ప్రాజెక్ట్ అనే సంస్థ పోలరాయిడ్ ను సొంతం చేసుకొంది. 2010 లో అమ్మకాలు మొదలు పెట్టింది. సెప్టెంబరు 2017 న ఇంపాజిబుల్ ప్రాజెక్ట్, పోలరాయిడ్ ఒరిజినల్స్ గా పేరు మార్చుకొంది.

రష్యా లో సరిక్రొత్త ఫిలిం బ్రాండు

[మార్చు]

2009లో రష్యాకు చెందిన ఫిలిం ప్రేమికులు, సెయింట్ పీటర్స్‌బర్గ్ కేంద్రంగా ఫిలింను ఉత్పత్తి చేయటం మొదలు పెట్టారు. 2017లో తమ ఫిలింను వీరు సిల్బెర్రాగా నామకరణం చేశారు.

ఫిలిం అమ్మకాలు పున:ప్రారంభించిన అడాక్స్/ఫిలిం ఉత్పత్తికి సరిక్రొత్త ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు

[మార్చు]

ఆగ్ఫాఫోటోను అడాక్స్ కొన్నది. ఆగ్ఫా ఫిలింలో ఉన్న పలు లోపాలను సరిదిద్దింది. ADOX PAN 400 పేరు పెట్టి 2010 సెప్టెంబరులో ఈ ఫిలింను విడుదల చేసి ఫిలిం అమ్మకాలు పున:ప్రారంభించింది. పలు చేతులు మారిన అడాక్స్, ఆగస్టు 2016 లో స్విట్జర్ ల్యాండ్ లో ఫిలిం తయారీ యంత్రాలను సొంతపరచుకొంది.[31] ఫిబ్రవరి 2017లో జర్మనీ లోని బాద్ సారొ అనే ప్రాంతంలో ఫిలిం/సంబంధిత రసాయనాలు ఉత్పత్తి చేయటానికి సరక్రొత్త ఫ్యాక్టరీ నిర్మించటం మొదలు పెట్టింది.

ఫెర్రానియా పున:ప్రారంభం

[మార్చు]

2013 లో ఇటలీకి చెందిన ఇద్దరు చలనచిత్ర సాంకేతిక నిపుణులు, ఫెర్రానియాను పున:ప్రారంభించటానికి అక్కడి స్థానిక ప్రభుత్వంతో మంతనాలు నడిపారు. అనేక ఒడిదుడుకులకు ఎదురొడ్డి, చివరకు సఫలీకృతులయ్యారు. ఫెర్రానియా యొక్క ఫ్యాక్టరీ LRF (Laboratori Ricerche Fotografiche) లో ఏళ్ళకు తరబడి ఆగిపోయిన యంత్రాలు పని చేయటం మొదలు పెట్టాయి. 2017 ఫిబ్రవరి 1 నాటికి అత్యంత్ర ప్రజాదరణ గల P30 ఫిలిం ఫెర్రానియా ఫ్యాక్టరీలో మరల ఉత్పత్తి అయ్యింది.

కొడాక్ ఉత్పత్తులు పున:ప్రారంభం

[మార్చు]
ఫిలిం తిరిగి రాకను అర్థం చేసుకొన్న కొడాక్ తమ సింగిల్ యూజ్ కెమెరాల తయారీ మరల మొదలు పెట్టింది

2013 లో నష్టాల నుండి కోలుకొన్న తర్వాత తమ అనలాగ్, ఫిలిం ఉత్పత్తులు కొడాక్ అలారిస్ కు మారుస్తున్నట్లు కొడాక్ ప్రకటించింది.

2016 లో భారత్ లో ఫిలిం తయారీకీ ప్రణాళిక చేస్తున్నటు కొడాక్ ప్రకటించింది.[32]

2017 లో తాము 2012 లో నిలిపివేసిన కొడాక్ ప్రొఫెషనల్ ఏక్తాక్రోం తయారీని పున:ప్రారంభిస్తున్నట్లు కొడాక్ అలారిస్ ప్రకటించింది.[33]

2018 లో కొడాక్ అలారిస్, ఫిబ్రవరిలో తమ P3200 ఫిలింను,[34] మేలో డిస్పోజబుల్ కెమెరాను వరకు విడుదల చేసింది.[35]

సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చిన లార్జ్ ఫార్మాట్ ఫిలిం కెమెరాలు

[మార్చు]

సామాన్యుడికి కూడా లార్జ్ ఫార్మాట్ కెమెరాలు అందుబాటులోకి తేవటమే ధ్యేయంగా పనిచేసిన ఇంట్రెపిడ్ కెమెరా కంపెనీ (Intrepid Camera Company) తమ మొట్టమొదటి లార్జ్ ఫార్మాట్ కెమెరాను విడుదల చేసింది.[36]

సూదిబెజ్జం పై మళ్ళీ పెరిగిన ఆసక్తి

[మార్చు]

ఫోటోగ్రఫీలో ఎన్ని మార్పులు వచ్చిననూ, సూదిబెజ్జం అందం సూదిబెజ్జానిదే. అధునాతన కెమెరాలు చిత్రీకరించే ఛాయాచిత్రాలలో షార్ప్ ఫోకస్ వలన చాలా స్పష్టత ఉంటుంది. శక్తిమంతమైన జూం కటకాలతో దృక్కోణపు వక్రీకరణ లేకుండా ఛాయాచిత్రాలు తీయవచ్చు. ఐనా ప్రత్యాన్మాయ ఛాయాచిత్రకారులు సూదిబెజ్జం కెమెరాల వలన ఏర్పడే సాఫ్ట్ ఫోకస్, దృక్కోణపు వక్రీకరణలను ఇష్టపడతారు.

అనలాగ్ విప్లవం తర్వాత సూదిబెజ్జం పై ఆసక్తి పెరిగింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఆఖరి ఆదివారం ప్రపంచ సూదిబెజ్జపు దినంగా ప్రకటించబడింది.[37] ఇబ్బడిముబ్బడిగా సూదిబెజ్జం పై వెబ్-సైటులు పుట్టుకువచ్చాయి. సూదిబెజ్జం కెమెరాతో తీసే ఫోటోలపై ప్రతి యేటా పోటీలు జరుగుచున్నవి [38][39] సూదిబెజ్జం కెమెరాలు కొన్ని ఇళ్ళలో తయారు అవుతూ ఉంటే, కొన్నింటిని సంస్థలు రూపొందించి వినియోగదారులకు విక్రయిస్తున్నాయి.

ఫిలిం లో రకాలు

[మార్చు]

ఫిలిం చుట్టలు

[మార్చు]
35mm ఫిలిం, మీడియం ఫార్మాట్ ఫిలిం, లార్జ్ ఫార్మాట్ ఫిలిం ల పోలిక
డిస్క్ ఫిలిం, 110 ఫిలిం, 35mm ఫిలిం ల పోలిక

ఫిలిం చుట్టలు రెండు రకాలు. అవి

  • ప్రింట్ (నెగిటివ్) ఫిలిం
  • స్లైడ్ (రివర్సిబుల్) ఫిలిం

అనలాగ్ ఫోటోగ్రఫీకి ఉపయోగించే వేర్వేరు రకాల ఫిలిం ఫార్మాట్లు

  • 35mm లేదా 135 ఫిల్మ్: ఫిలిం ఫ్రేంకు పైన, క్రింద స్ప్రాకెట్ రంధ్రాలు గల ఫిలిం. ఒక క్యానిస్టర్ లో ఉన్న ఫిలిం కెమెరాకు ఉన్న ఊచకు చుట్టుకొంటుంది. ఫిలింను బట్టి ఇందులో 28 షాట్ లు గానీ, 36 షాట్ లు గానీ ఉంటాయి. షాట్ లు అయిపోయిన తర్వాత ఫిలింను రీవైండ్ చేసి, డార్క్ రూంలో ఫిలిం చుట్టను బయటకు తీసి, ఫోటోగ్రఫిక్ రసాయనాలతో సంవర్థన చేయవలసి ఉంటుంది. చాలా వరకు పాయింట్-అండ్-షూట్ కెమెరాలలో, ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఈ తరహా ఫిలిం యే వాడబడుతుంది. 35mm ఫిలిం హాఫ్-ఫ్రేంగా లేదా ఫుల్ ఫ్రేంగా వినియోగిస్తూ ఫోటోలు తీయవచ్చును.
  • మీడియం ఫార్మాట్: ఫిలిం వెనుకవైపు ఉన్న కాగితంపై అంకెలు వేసి ఉంటాయి. స్ప్రాకెట్ రంధ్రాలు ఉండవు. ఒక ప్లాస్టిక్ ఊచకు చుట్టిన ఫిలిం చుట్ట, కెమెరాలో మరొక ఊచకు చుట్టుకొంటుంది. ఫిలిం చుట్టుకొన్న ఈ చుట్ట (టేకప్ స్పూల్) ను కెమెరా నుండి బయటికి తీసి, డార్క్ రూంలో ఫిలిం చుట్టాను వెనుక ఉన్న కాగితం నుండి వేర్పరచి ఫోటోగ్రఫిక్ రసాయనాలతో సంవర్థన చేయవలసి ఉంటుంది. చాలా వరకు టి ఎల్ ఆర్ కెమెరాలలో ఈ తరహా ఫిలిం యే వాడబడుతుంది. కొన్ని పాయింట్ అండ్ షూట్ కెమెరాలలో కూడా మీడియం ఫార్మాట్ ఫిలిం వాడబడుతుంది. (ఉదా: హోల్గా, డయానా ఎఫ్+). మీడియం ఫార్మాట్ ఫిలిం 120 ఫిల్మ్, 220 ఫిల్మ్, 620 ఫిల్మ్ ఫార్మాట్లలో లభ్యం అవుతుంది. మీడియం ఫార్మాట్ ఫిలింను పలు ఫ్రేంలను అమర్చి మూడు నుండి పదహారు షాట్లు తీయవచ్చును.
  • 110 ఫిల్మ్: కేవలం ఫిలిం పై భాగంలో ఒక మూలకు స్ప్రాకెట్ రంధ్రాలు ఉంటాయి. ప్లాస్టిక్ క్యాసెట్ లో ఉన్న ఫిలింలో 24 షాట్లు ఉంటాయి.
  • లార్జ్ ఫ్రార్మాట్:

ఇన్స్టంట్ ఫిల్మ్

[మార్చు]

షాట్ తీయగనే కెమెరా నుండి బయటకు వెలువడే ఫిలిం స్వయంచాలితంగా సంవర్థనం చెంది పాజిటివ్ గా మారిపోతుంది. ఇన్స్టాక్స్, పోలరాయిడ్ వంటి సంస్థలు ఈ ఫిలింను తయారు చేస్తాయి. ఈ సంస్థలచే నిర్మించబడే కెమెరాలలోనే ఈ ఫిలింలు ఇముడుతాయి. ఇతర సంస్థలు నిర్మించే ఇన్స్టంట్ కెమెరాలు కూడా ఈ ఫిలింలు ఇమిడేట్లుగానే తయారు చేస్తాయి.

ఫిలిం వేగం

[మార్చు]

సాధారణంగా ఫిలిం వేగం ఐ ఎస్ ఓ 100 నుండి 800 వరకూ ఉంటాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఐ ఎస్ ఓ 25, 50, 1600, 3200 లని కూడా తయారు చేస్తాయి. ఎక్కువ కాంతి ఉన్న ఛాయాచిత్రాలకి ఎక్కువ వేగం అవసరం రాదు. తక్కువ కాంతి ఉన్న ఛాయాచిత్రాలకి ఎక్కువ వేగం గల ఫిలిం అవసరం అవుతుంది.

ఫోటోగ్రఫిక్ కాగితం

[మార్చు]

ఫిలిం విక్రయం

[మార్చు]

ఫెర్రానియా, సిల్బెర్రా, అడాక్స్, ఇల్ఫోర్డ్ వంటి సంస్థలు వారి వారి వెబ్-సైటుల ద్వారా ఫిలింను విక్రయిస్తాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు సైతం పలు రకాల ఫిలిం లను విక్రయిస్తాయి. అనలాగ్ ఫోటోగ్రఫీని సమర్థించే lomography.com, fotoimpex.de, filmphotographystore.com లు పలు రకాల ఫిలిం లను, అనలాగ్ కెమెరాలను విస్తృతంగా విక్రయిస్తాయి. బెంగుళూరుకు చెందిన filmfotostore.com కూడా ఫిలిం,, అనలాగ్ కెమెరాలను విక్రయిస్తుంది.

ఫిలిం సంవర్థన

[మార్చు]

ఫిలిం సంవర్థనంలో రకరకాల ప్రక్రియలు గలవు. బ్లాక్ అండ్ వైట్ ఫిలింను సంవర్థన చేయటానికి వాడే రసాయనాలు వేరైతే, కలర్ ఫిలింను సంవర్థన చేయటానికి వాడే రసాయనాలు వేరు. ఇన్స్టంట్ ఫిలిం కెమెరా నుండి వెలువడగానే ఛాయాచిత్రం దానంతట అదే సంవర్ధన చెందుతుంది.

బ్లాక్ అండ్ వైట్ ఫిలిం గనుక నెగిటివ్ (ప్రింట్) అయితే D-76 రసాయనాలతో, రివర్సిబుల్ (స్లైడ్) అయితే గనుక DR-5 Chrome రసాయనాలతో సంవర్థన చేయవలసి ఉంటుంది.

కలర్ ఫిలిం గనుక నెగిటివ్ (ప్రింట్) అయితే C-41 రసాయనాలతో, రివర్సిబుల్ (స్లైడ్) అయితే గనుక E-6 రసాయనాలతో సంవర్థన చేయవలసి ఉంటుంది.

కొన్ని మెళకువలతో ఫిలిం సంవర్థన ఇంటిలోనే చేసుకొనవచ్చును. లేనిచో ల్యాబ్ లకు పంపవచ్చును. వినియోగదారుని అవసరాన్ని బట్టి సంవర్థన చేయబడ్డ ఫిలింను స్కాన్, ముద్రణలు చేయవచ్చును. భారతదేశంలో ఫిలింను బొంబాయికి చెందిన ideacreative.in, బెంగుళూరుకు చెందిన filmfotostore.com, GG Welling లు చేస్తారు.

క్రాస్ ప్రాసెసింగ్

[మార్చు]

ఏ రకమైన ఫిలింకు ఆ రకమైన సంవర్థన చేయటం పరిపాటి. అయితే ఒక రకమైన ఫిలింకు సంబంధం లేని మరొక రకమైన ఫిలిం సంవర్థన ప్రక్రియను ఉపయోగించటం వలన విచిత్రమైన/ఆసక్తి గల ఫలితాలు వస్తాయి. దీనినే క్రాస్ ప్రాసెసింగ్ అంటారు. క్రాస్ ప్రాసెసింగ్ చేయటం వలన ఫోటోలలో అసహజమైన రంగులు రావటం, వర్ణ వైరుధ్యం పెరగటం జరుగుతుంది.

లాభనష్టాలు

[మార్చు]

లాభాలు

[మార్చు]
  • శాశ్వతత్వం: ఫిలిం ఫోటోలు శాశ్వతంగా ఉండిపోతాయి.
  • క్రమశిక్షణ: ఫిలిం ఫోటోగ్రఫీ ఒక రకమైన క్రమశిక్షణను అలవరుస్తుంది.

నష్టాలు

[మార్చు]
  • నేర్పు: ఎవరంటే వారు ఫోటోలు తీయటానికి కుదరదు. ఫిలిం ల గురించి, వాటిని కెమెరాలలో ఎలా ఇమడ్చాలి అనే అంశాల గురించి కనీస పరిజ్ఙానం అవసరం. ఫిలింను సంవర్ధన చేయాలన్నా, ఫోటోలుగా ముద్రించాలన్నా ప్రత్యేక నేర్పు, సామాగ్రి అవసరం.
  • బహిర్గతం: తెలియక, పొరబాటున ఫిలిం వెలుతురుకు నేరుగా బహిర్గతం అయితే, ఆ ఫిలిం చుట్ట వ్యర్థం అవుతుంది
  • ధర: డిజిటల్ ఫోటోగ్రఫీతో పోలిస్తే ఫిలిం ఫోటోగ్రఫీ ధర ఎక్కువ. అనలాగ్ కెమెరాల ధర తక్కువ అయిననూ, ఫిలిం ఖర్చు, దానిని సంవర్థన చేయటానికి అయ్యే ఖర్చు, డిజిటల్ తో పోలిస్తే ఎక్కువే.
  • ప్రయాణాలు: ఫిలింను ప్రయాణాలలో తరలించటం ఇబ్బందికరం. పెరిగిన భద్రత తనిఖీల వలన ఎక్స్-రే స్కానింగ లలో ఫిలిం పై ఫాగింగ్ ప్రభావం ఉండవచ్చు.
  • సమయం: ఫోటోలు తయారవటానికి సమయం పడుతుంది
  • జాగ్రత్త: ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఫిలిం పై ఫోటోలు నమోదు కావు.

సాంఘిక మాధ్యమాల లో అనలాగ్ ఫోటోగ్రఫీ

[మార్చు]

అంతర్జాతీయంగా ఫిలిం ప్రేమికులు సాంఘిక మాధ్యమాలలో గ్రూప్సు చేసుకొని, వారు ఫిలిం పై తీసిన పలు రకాల ఛాయాచిత్రాలను పోస్టు చేసి సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూ ఉంటారు.

  • 2.5 లక్షల సభ్యులు కల రెడ్డిట్ లో ఉన్న అనలాగ్ గ్రూపు [40]
  • 50 వేల సభ్యులు కల ఫ్లికర్లో ఉన్న అనలాగ్ ఫోటోగ్రఫీ గ్రూపు [41]
  • 15 వేల సభ్యుల కల ఫేస్ బుక్ లో ఉన్న అనలాగ్ ఫోటోగ్రఫీ గ్రూపు [42]

ఉపశీర్షికలు/హ్యాష్ ట్యాగులు

[మార్చు]

ఫిలిం ఫోటోగ్రఫీని విస్తరింపజేయటానికి సాంఘిక మాధ్యమాలలో ఇటీవలె పుట్టుకొచ్చిన ఉపశీర్షికలు/హ్యాష్ ట్యాగులు కొన్ని:

  • Film Photography (#FilmPhotography)
  • Analog PHotography (#AnalogPhotography)
  • Film is not dead (#FilmIsNotDead)
  • Film is alive (#FilmIsAlive)
  • Long live film! (#LongLiveFilm)
  • I still shoot film! (#IStillShootFilm)
  • Believe in film! (#BelieveInFilm)
  • Stay broke, shoot film! (#StayBrokeShootFilm)
  • Buy film, not megapixels! (#BuyFilmNotMegaPixels)
  • This is why I love film! (#ThisIsWhyILoveFilm)
  • No grain, no glory (#NoGrainNoGlory)
  • Death before digital (#DeathB4Digital)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. అనలాగ్ ఫోటోగ్రఫీని నిర్వచించిన లోమోగ్రఫీ.కాం
  2. డిజిటల్ ఫోటోగ్రఫీ లోని సౌకర్యాలను తెలిపిన లైఫ్ వైర్
  3. 2014 నుండి పెరిగిన ఫిలిం విక్రయాలు
  4. ప్రపంచపు ఫోటోగ్రఫీ రాజధానిగా పిలువబడే జపాన్ యువత కూడా ఫిలిం పైనే మొగ్గు
  5. ఫిలిం పై మొగ్గు చూపొస్తోన్న భారతీయ యువత
  6. భారతదేశంలో కూడా ఫిలిం ఫోటోగ్రఫీ ఉనికి ఉందని తెలిపిన ఫస్ట్ పోస్ట్
  7. ఫ్లికర్ పై ఫిలిం - ఇండియా గ్రూపు
  8. ఫేస్బుక్ పై ఫిలిం ఫోటోగ్రఫీ ఇండియా గ్రూపు
  9. "లార్జ్ ఫార్మాట్ కు బీజం వేసిన నీప్సె సోదరులు". Archived from the original on 2017-02-15. Retrieved 2018-10-06.
  10. "ఆన్స్కో చరిత్ర". Archived from the original on 2016-04-22. Retrieved 2018-10-11.
  11. 117 ఫిలిం ను వాడిన మొట్టమొదటి మీడియం ఫార్మాట్ కెమెరా: కొడాక్ బ్రౌనీ
  12. "135 ఫిల్మ్ వచ్చే వరకు సాధారణ జనం మీడియం ఫార్మాట్ నే వాడేవారు". Archived from the original on 2018-08-12. Retrieved 2018-10-07.
  13. మొట్టమొదటి 35 ఎంఎం ఫిలిం ను రూపొందించిన విలియం కెన్నెడీ లారీ డికెన్సన్[permanent dead link]
  14. "135 డిజిటల్ ఫోటోగ్రఫీ రాక తో అటకెక్కిన 135 ఫిల్మ్". Archived from the original on 2018-08-12. Retrieved 2018-10-07.
  15. ఉత్తర అమెరికా, ఐరోపాలలో ఫిలిం కెమెరాల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించిన కొడాక్
  16. 2004 లో మొట్టమొదటి సారి డిజిటల్ కెమెరాల అమ్మకాలు అనలాగ్ కెమెరాలను మించటంతో తమ అనలాగ్ కెమెరాల తయారీని నిలిపివేస్తోన్నట్లు ప్రకటించిన కొడాక్
  17. ఎదుగుదల ఉండే వాటిలోనే తమ వ్యాపారా దృష్టిని కేంద్రికరించటం లో భాగంగా, అనలాగ్ కెమెరాల తయారీ నిలిపివేతను ప్రకటించిన నికాన్
  18. 2006 లో నష్టాలను తట్టుకోలేక అనలాగ్ కెమెరాల తయారీని సోనీ సంస్థ కు విక్రయించిన కొనీకా-మినోల్టా
  19. తమ ఇన్స్టంట్ ఫిలిం తో బాటు ఇన్స్టంట్ కెమెరాలకు కూడా స్వస్తి పలుకుతోన్నట్లు తెలిపిన పోలరాయిడ్
  20. ఎనిమిది దశాబ్దాల తర్వాత, 2018లో తమ అనలాగ్ కెమెరాల తయారీని నిలిపివేసినట్లు ప్రకటించిన కెనాన్
  21. 2005 లో కుప్ప కూలిన ఆగ్ఫాఫోటో
  22. తమ ఫిలిం చుట్టల తయారీని నిలిపివేస్తున్నట్లు రెండు వేర్వేరు పర్యాయాలలో తెలిపిన ఆగ్ఫా పోటో
  23. బర్గర్ ఫిలిం మూతబడింది
  24. "మూతబడ్డ ఎఫ్కే". Archived from the original on 2016-03-04. Retrieved 2018-09-21.
  25. బ్లాక్ అండ్ వైట్ ఫిలిం తయారీని ఆపివేసిన ఫూజీఫిలిం
  26. మూతబడ్డ ఇందు
  27. "ప్రాథమికాంశాలను బోధపడేలా చేసే అనలాగ్ ఫోటోగ్రఫీ". Archived from the original on 2019-05-15. Retrieved 2018-09-20.
  28. అనలాగ్ ఫోటోగ్రఫర్లతో పెటాపిక్సెల్ ముఖాముఖి
  29. కొన్ని అనుభూతులు ఫిలిం ఫోటోగ్రఫీలోనే సొంతం అని తెలిపిన పెటా పిక్సెల్
  30. పాశాత్య దేశాలలో 2003 నుండే పెరిగిన ఫిలిం అమ్మకాలు
  31. ఫిలిం తయారీ యంత్రాలను సొంతం చేసుకొన్న అడాక్స్
  32. భారత్ లో కొడాక్ పున:ప్రవేశం
  33. "ఏక్తాక్రోం ఫిలిం తయారీని పున:ప్రారంభించిన కొడాక్". Archived from the original on 2018-09-29. Retrieved 2018-09-21.
  34. P3200 ఫిలిం ఉత్పత్తిని మరల ప్రారంభించిన కొడాక్ అలారిస్
  35. ఐరోపాలో డిస్పోజబుల్ కెమెరాను విడుదల చేసిన కొడాక్
  36. సామాన్యుడికి సైతం లార్జ్ ఫార్మాట్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చిన Intrepid Camera Company
  37. ఏప్రిల్ చివరి ఆదివారం సూదిబెజ్జపు ఛాయాచిత్రాల పోటీని నిర్వహించే పిన్ హోల్ డే డాట్ ఆర్గ్
  38. అగ్గిపెట్టెతో సూదిబెజ్జం కెమెరా కు అంకితమైన మ్యాచ్ బాక్స్ పిన్ హోల్ డాట్ కాం వెబ్ సైటు
  39. "పిన్ హోల్ ఫోటోగ్రఫీని ప్రోత్సహించే పిన్ హోల్ డాట్ ఆర్గ్". Archived from the original on 2018-11-16. Retrieved 2018-11-01.
  40. రెడ్డిట్ లో ఉన్న అనలాగ్ గ్రూపు
  41. ఫ్లికర్ లో ఉన్న అనలాగ్ ఫోటోగ్రఫీ గ్రూపు
  42. ఫేస్ బుక్ లో ఉన్న అనలాగ్ ఫోటోగ్రఫీ గ్రూపు