అక్షాంశ రేఖాంశాలు: 32°N 46°E / 32°N 46°E / 32; 46

సుమేరు నాగరికత

వికీపీడియా నుండి
(సుమేరియన్ నాగరికత నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
క్రీ.పూ 3వ సహస్రాబ్దిలో సముద్ర మట్టాలు తక్కువగా ఉన్న కారణంగా సముద్ర మార్గాన సింధూ లోయకూ మెసొపొటేమియాకూ మధ్య దూరము ఇప్పటి కంటే చాలా తక్కువగా ఉండి ఉండవచ్చు.[1]
సుమేరు
(సుమారు క్రీ.పూ. 4500–1900)

ఆధునిక పటంపై నాటి సుమేరు కిందకి వచ్చిన ప్రాంతం. ప్రధాన నగరాలు కూడా చూపబడ్డాయి. తీరరేఖ మాత్రం నాటిది. ఆకాలంలో తీరరేఖ దాదాపుగా ఉర్ దాకా వచ్చేది.
భౌగోళిక పరిధిమెసొపొటేమ్యా, నియర్ ఈస్ట్, మధ్యప్రాచ్యం
కాలంనవీన శిలా యుగ ద్వితియార్ధం, కంచుయుగం
తేదీలుసుమారు  క్రీ.పూ. 4500 –  1900
దీనికి ముందుఉబైడు కాలం
దీని తరువాతఅకేడు సామ్రాజ్యం

సుమేరు నాగరికత తామ్ర శిలా యుగం, మొదటి కంచు యుగ కాలాల్లో, సుమారు క్రీ.పూ. 5–6 సహస్రాబ్దుల్లో, దక్షిణ మిసొపొటేమ్యా (ఆధునిక దక్షిణ-మధ్య ఇరాక్) ప్రాంతములో మొదలైంది. ఇది మెసొపొటేమియాలోని నాగరికతల్లో మొదటిది. సింధూ నాగరికత, ప్రాచీన ఈజిప్టు, ఈలము, ప్రాచీన చైనా, కారలు నాగరికత, ఒల్మెక్ నాగరికతలతో పాటు ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికతలలో ఇది కూడా ఒకటి. టైగ్రిసూ, యూఫ్రెటీసు లోయలలో నివసించిన సుమేరు రైతులు ధాన్యం, ఇతర పంటలను విస్తారంగా సాగుచేసారు. ఆ పంట మిగులు వారు పట్టణావాసాలు ఏర్పరిచేందుకు దోహదపడింది. క్రీ.పూ 3000 నాటికీ ఆదిలేఖన పద్ధతులు ఈ నాగరికతలో కనిపిస్తాయి. ఈ నాగరికత యొక్క అత్యంత పురాతన రచనలు ఉరుక్, జెమ్డెట్స్ఱ్ నగరాలలో లభించాయి‌. ఇవీ క్రీ.పూ 3500–3000 నాటివి.

ఉచ్చారణ

[మార్చు]

సుమేరు అనే పదాన్ని ఆంగ్లములో సూమర్ అని పలకబడుతుండగా, భారతీయ ఆంగ్ల ఉచ్చారణలో సుమేరుగా పలుకబడుతోంది.

సుమేరు పదాల తెనిగీకరణా, ఆపద్ధర్మ వ్యాస శైలి వివరణా

[మార్చు]

మౌలిక భాషాశాస్త్రం

[మార్చు]

మనుషులు మాట్లాడినప్పుడు కొన్ని వర్ణాలను నోటి ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఆ వర్ణాల కలయికే మనకి ఒక పదాంశంలా వినబడుతుంది.

పదాంశము అంటే ఒక అర్థవంతమైన వర్ణాల కలయిక. ఇవి పదాలు కావచ్చు లేదా పదానికి చేర్చే ప్రత్యయాలు వంటివి కావచ్చు (ఉదా: తెలుగులో బహువచన ప్రత్యయం 'లు'—కన్ను-కనులు. కనుక తెలుగు భాషలో 'లు' ఒక పదాంశం).

లిపిలో మనము చెప్పదలుచుకున్న మాటలను కొన్ని సంకేతాలుగా వ్రాస్తారు. వీటిని లిపి సంకేతాలు అంటారు. ఈ లిపి సంకేతాలు మూడు రకాలు:

  1. ఒక సంకేతము ఒక పదాంశాన్ని సూచిస్తుంది. ఈ సంకేతాలను పద సంజ్ఞలు అంటారు. సుమేరు శరాకార లిపి ఈ రకమే.
  2. ఒక సంకేతము ఒక గుణింతాక్షరాన్ని సూచిస్తుంది. ఉదా: జపాను లిపి.
  3. ఒక సంకేతము ఒక వర్ణాన్ని సూచిస్తుంది. ఈ సంకేతాన్నే అక్షరము అంటాము. తెలుగుతో సహా ఎక్కువ భాషలకు అక్షర లిపి ఉంటుంది.

పద సంజ్ఞల అక్షరీకరణ

[మార్చు]

కనుక పద సంజ్ఞలను నేటి అక్షర లిపిలో వ్రాసినప్పుడు, ఒక సంజ్ఞకు అనేక అక్షరాలు అవసరమవుతాయి. అలాగే ప్రతీ సంజ్ఞా ఒక పదాంశము కనుక ఒక సంజ్ఞను మన భాషల్లో ఒక పదాన్ని వ్రాసినట్టుగా వ్రాస్తారు. ఐతే పదాంశాల కలయికతో పదాలు తయారవుతాయి కనుక ఈ పదాంశాల మధ్య ఎడము వదలక, దాని బదులు ఒక అడ్డగీత (-) పెడతారు.

సుమేరు పదాల రోమనీకరణకు అధికారిక విధానాలు ఉన్నవి కానీ తెనిగీకరణకు లేవు. కనుక ఈ వ్యాసములో ఆపద్ధర్మంగా కొన్ని నియమాలను అనుసరించడమైనది:

  1. ఒక అక్షర సంజ్ఞను ఒక పదాన్ని వ్రాసినట్టు వ్రాయడమైనది.
  2. ఒకటి కంటే ఎక్కువ సంజ్ఞలతో తయారైన పదాలను వ్రాసినప్పుడు, ఆ సంజ్ఞలన్నీ ఒకే పదాన్ని సూచిస్తాయి కనుక వాటి అక్షరీకరణల మధ్యలో ఎడం ఉండదు. ఐతే ఆ పదం అనేక సంజ్ఞల కలయిక అని సూచించేందుకు, ఆ పదాంశాల మధ్యలో అడ్డగీత పెట్టబడ్డది.
  3. అడ్డగీతకు ఇరు పక్కలా ఉన్న అక్షరాలను ఒత్తులకై కానీ, గుణింతాక్షరాలుగా మార్చేందుకు కానీ కలపకుండా వేర్వేరు పదాలను వ్రాసినట్టు విడివిడిగా వ్రాయడమైనది. కనుక సుమేరు పదాల్లో పదం మధ్యలో నకార పొల్లూ, అచ్చులూ రావచ్చు.

ఈ నియమాలు ఈ వ్యాసమునకై తాత్కాలికంగా తయారు చేసినవే కానీ వీటికి ఏ రకమైన శాస్త్రీయ ఆమోదం కానీ, అధికారిక హోదా కానీ లేవనీ, ఈ వ్యాసాన్ని దాటి ఇతర చోట్ల ఇవి చెల్లవూ, వర్తించబోవని గమనించాలి.

అదనపు వర్ణాలకై వెసులుబాట్లు

[మార్చు]

తెలుగులో లేని కొన్ని వర్ణాలు సుమేరు భాషలో ఉన్నాయి. వాటికై చేసిన కొన్ని వెసులుబాట్లు ఇక్కడ వివరించబడ్డాయి. ఒక కొత్త వర్ణాన్ని వ్రాయాల్సివచ్చినప్పుడు మన భాషలో దానికి దగ్గరి ఉచ్చారణ ఉన్న అక్షరాన్ని ముదురుగా (bold) వ్రాయడమైనది.

అదనపు అక్షరాలు
ముదురు అక్షరం సూచించు వర్ణం అ.ధ్వ.వ అక్షరం వ్యాఖ్య
Voiceless uvular plosive /q/ కురాన్‌లో 'క' ను పలుకు విధానం. దేవనాగరి లిపిలో 'క' కింద చుక్క పెట్టి ఈ అక్షరం సూచించబడుతుంది—क़। ఆంగ్లంలో ఈ శబ్దాన్ని 'Q' అక్షరంతో సూచిస్తారు—Quran. మామూలు 'క' ను పలికినట్లు కాకుండా నాలుక వెనుక భాగాన్ని కొండనాలుకకు తాకించి దీన్ని పలకాలి.
కంఠ్యమూలీయ శ్వాస స్పర్శము /ʔ/ తెలుగులో ఉన్న ఏకైక కంఠ్యమూలీయము 'హ'. అది ఊష్మము. హ లాగా 'క' పలికితే అది . ఆంగ్లంలో uh-oh (ఒక రకమైన నిట్టూర్పు)లో uhకి, ohకి మధ్య వచ్చే వ్యవధిని గా పలుకుతారు.
కంఠ్య శ్వాస ఊష్మం /x/ 'ఖ' ను పలుకుతున్నప్పుడు నాలుక మృదు అంగిటికి ఆనుకుంటుంది. అలా పూర్తిగా ఆన్చకుండా మధ్యలో నుండి గాలిని వదులుతూ పలకాలి. ముస్లిం పేర్లలో కనిపించే 'ఖాన్' ఉచ్చారణ ఇదే. దేవనాగరి లిపిలో 'ఖ' కింద చుక్క పెట్టి ఈ అక్షరం సూచించబడుతుంది—ख़।
కంఠ్య నాద ఊష్మం /ɣ/ 'గ' ను పలుకుతున్నప్పుడు నాలుక మృదు అంగిటికి ఆనుకుంటుంది. అలా పూర్తిగా ఆన్చకుండా మధ్యలో నుండి గాలిని వదులుతూ పలకాలి. దేవనాగరి లిపిలో 'గ' కింద చుక్క పెట్టి ఈ అక్షరం సూచించబడుతుంది—ग़।
దంతమూలీయ నాద ఊష్మం /z/ ఆంగ్ల అక్షరం 'z' ను సూచిస్తుంది. తెలుగులో "రోజు'లో 'జ' కారాన్ని ఇలాగే పలుకుతాము. దేవనాగరి లిపిలో 'జ' కింద చుక్క పెట్టి ఈ అక్షరం సూచించబడుతుంది—ज़।
దంతమూలీయ శ్వాస స్పర్శము /t/ తెలుగు 'ట' మూర్ధన్యము. అంటే మడతపడ్డ నాలుక అంగిటికి తాకగా వచ్చే శబ్దం. పై చిగురు లోపలి భాగాన్ని దంతమూలీయము (దంతాలకు మూలము) అంటారు. నాలుకను మడతపెట్టకుండా చిగురుకు తాకించి పలకాలి. ఆంగ్ల అక్షరం 't' ఉచ్చారణ ఇదే.
దంతమూలీయ నాద స్పర్శము /d/ తెలుగు 'డ' మూర్ధన్యము. అంటే మడతపడ్డ నాలుక అంగిటికి తాకగా వచ్చే శబ్దం. పై చిగురు లోపలి భాగాన్ని దంతమూలీయము (దంతాలకు మూలము) అంటారు. నాలుకను మడతపెట్టకుండా చిగురుకు తాకించి పలకాలి. ఆంగ్ల అక్షరం 'd' ఉచ్చారణ ఇదే.
దంత్య శ్వాస ఊష్మము /θ/ నాలుక రెండు పళ్ళ మధ్యన పెట్టి పై పళ్ళకూ నాలుకకూ మధ్య నుండి గాలి వదులుతూ 'థ' పలకాలి. Thin వంటి ఆంగ్ల పదాల్లో 'th' ఉచ్చారణ ఇదే.
దంత్య నాద ఊష్మం /ð/ 'ద' ను పళ్ళకీ, నాలుకకీ మధ్యన గాలి వదులుతూ పలికితే వచ్చే శబ్దం. తమిళంలో కొన్ని స్థానాల్లో 'ద'ని ఇలా పలుకుతారు.
ఓష్ఠ్యీకరించిన కంఠ్య నాద అంతస్థము /w/ ఆంగ్ల అక్షరం 'W' ఉచ్చారణ. తెలుగులో దీనికి దగ్గరి అక్షరాలేవీ లేవు. హిందీలో కంఠ్య స్పర్శముల పక్కన వచ్చిన 'వ' ను ఇలా పలుకుతారు. కొన్నిసార్లు దేవనాగరి లిపిలో 'వ' కింద చుక్క పెట్టి ఈ అక్షరం సూచించబడుతుంది—व़
/ ఉత్తర దంత్యమూలీయ నాద ఊష్మము /ʃ/ ఆంగ్లంలో 'sh' పలికే విధానం. English. మామూలుగా గా, అనుస్వారం తరువాత గా వ్రాయడమైనది. అనుస్వారం తరువాత వచ్చినప్పుడు ఞ్శ గా పలకాలి.
Pharyngealised voiceless alveolar fricative /sˤ/ గ్రసనీకరించబడ్డ 'స'. మరిన్ని వివరాలకు Pharyngealisation.
Voiceless pharyngeal fricative /ħ/ తెలుగులో ఇలాంటి అక్షరం లేదు. దాదాపుగా ఆవులింతలో వచ్చే శబ్దంలా ఉంటుంది.

పుట్టుపూర్వోత్తరాలు

[మార్చు]

సుమేరు లో సుమారు క్రీ.పూ. 5500–4000 మధ్యన మనుషులు స్థిరనివాసాలు ఏర్పర్చుకున్నారని చరిత్రకారుల అంచనా. వీరు పశ్చిమాసియా వాసులయ్యుండొచ్చు. పట్టణాలూ, నదులూ, వృత్తులకు ఉన్న పేర్ల ఆధారంగా వీరు సుమేరు భాష మాట్లాడేవారని తెలుస్తోంది. ఈ భాష ఏ కుటుంబానికీ చెందినది కాదు. తరువాతి సెమిట భాషల వలె కాక ఇది ఒక అగ్లూటినేటివ్ లాంగ్వేజ్ (agglutinative language (en)). [2][3][4][5]

బ్లౌ స్మారక చిహ్నాలు. ప్రస్తుతం బ్రిటిష్ సంగ్రహశాలలో ఉన్న ఇవి జెమ్డెట్స్ఱ్ కాలంలో క్రీ.పూ 3100–2700 మధ్యలో చెక్కబడినవి. వీటిలో ఆ కాలం నాటి సుమేరుల బొమ్మలూ అలాగే ఆదిమ శరాకార లిపిలో ఉన్న గుర్తులూ కనిపిస్తాయి.

ఐతే ఉత్తర ఆఫ్రికాలోని అలనాటి పచ్చటి సహారాలో నివసించిన వారే మధ్యప్రాచ్యములోని సుమేరుకు వలస వచ్చి అక్కడ వ్యవసాయాన్ని వ్యాపింపజేసారని మరికొందరి పరిశోధకుల వాదన.[6] కానీ వ్యవసాయము మొదట ఫెర్టైల్ క్రిసెంట్‌లో[గమనిక 1]మొదలైందని బలమైన ఆధారాలున్నందున ఈ పరికల్పనకు పెద్దగా మద్దతు లభించలేదు.[7] ప్రత్యేకించి సుమేరులను గూర్చి చెప్పనప్పటికీ, 2016లో లరిడిస్ బృందము మధ్యప్రాచ్యములోని సెమిట సంస్కృతి మొదలవ్వడానికి ముందు నివసించిన వారిలో, ముఖ్యంగా టూఫుల్లో, కొంత ఉత్తర ఆఫ్రికా సంతతి ఉందని ప్రతాపాదించారు. వీరు నటూఫులూ, ప్రీ పోరీ నియోలిథిక్ కాలపు వారి పై జన్యు పరిశోధనలు చేసి, ఈ నిర్ణయానికి వచ్చారు.[7][8] ఇది కాక 2013లో నాలుగు సుమేరు అస్థిపంజరాల నుండి సేకరించిన డి.ఎన్.ఎ నమూనాలపై జన్యు విశ్లేషణ పరీక్షలు జరుపగా, వారికీ సింధు నాగరికత వారికీ సారూప్యతలున్నట్లు తెలిసింది. పురాతన సింధూ-మిసొపొటెమ్యా సంబంధాల వల్ల ఇది జరిగి ఉండవచ్చు.[9] ఇవికాక సుమేరులలో హుర్రియులూ, ఇంకా ఉఱెఱ్ట్యుల సంతతి కూడా ఉందనడానికీ, తద్వారా వీరు కోకసస్ నుండి వలస వచ్చారనీ చెప్పేందుకు కూడా ఆధారాలున్నాయి.[10][11][12]

సుమేరులకు ముందు ఈ ప్రాంతములో నివాసమున్న ఆది మానవులని ప్రోటో-యూఫ్రెటీయన్స్ లేదా ఉబైడులుగా పిలుస్తారు.[13] ఉత్తర మెసొపొటేమియా సామర్రా సంస్కృతి వారి నుండి వీరు ఉద్భవించారని సిద్ధాంతీకరించారు.[14][15][16][17] సుమేరులు ఎన్నడూ ఉబైడుల గురించి ప్రస్తావించ లేదు కానీ వీరే సుమేర్లోని మొట్టమొదటి నాగరిక శక్తి అని అనేక ఆధునిక పరిశోధకుల అభిప్రాయం. వారు చిత్తడి నేల నుండి నీటిని బయటకు పారించి వ్యవసాయానికి అనువుగా మలిచారు, వాణిజ్యం అభివృద్ధి చేసి, నేతపనీ, తోలుపని, లోహపు పని, తాపీపనీ, మృణ్మయకళలలో నైపుణ్యం సాధించారు.[13]

ఇది సుమారు క్రీ.పూ 2600లో చెక్కబడ్డ ఉర్ కేతనం. ఇందులో పరిచారకుల మధ్యన సింహాసనం పై కూర్చున్న ఉర్ రాజును మనం చూడవచ్చు. ఇతడు ఉర్-ప-బిల్-సగ్ అయ్యుంటాడని శాస్త్రీయ అంచనా.

కొంతమంది పరిశోధకులు మాత్రము ప్రోటో-యూఫ్రెటియన్ భాష నుండి సుమేరు భాష వచ్చిందనే సిద్ధాంతముతో విభేదిస్తారు. అలాగే మరొక భాష ప్రభావము సుమేరు భాషపై ఉందనే (substrate effect) సిద్ధాంతముతో కూడా వీరు ఏకీభవించరు. వేటాడటమూ, చేపలు పట్టడమూ జీవనాధారాలుగా అరేబియా సముద్రానికి తూర్పున తీర ప్రాంతాల్లోనూ, చిత్తడి నేలల్లోనూ కొందరు జనాలుండేవారు. రెండు వైపులా చదును చేయబడ్డ పనిముట్ల వాడకము వీరి ప్రత్యేకత. వీరి భాషే సుమేరు భాష అని ఈ విభేదించే వర్గాల వారి అభిప్రాయము.[18] చరిత్ర గ్రంథస్తమవ్వడమనే ప్రక్రియ సుమేరు నాగరికత ఏర్పడ్డ చాలా కాలానికి మొదలైంది. తొట్టతొలి లిఖితపూర్వక చరిత్ర ఎన్‌-మె-బర-గె-సి కాలములోనిది (అంటే ఆదివంశపు కాలము). మంచు యుగం చివరిలో వరదల్లో మునిగిపోక ముందు తూర్పు అరేబియా ప్రాంత (నేటి పర్షియా సింధుశాఖ ప్రాంతం) తీరాన సుమేరులు నివసించేవారని జురిస్ రింశ్ అభిప్రాయము.[19]

సుమేరు నాగరికత ఉరుక్ కాలం (క్రీ.పూ.4 వ సహస్రాబ్ది) లో ప్రారంభమై, జెమ్డెట్స్ఱ్, ఆది వంశపు కాలాల వరకు కొనసాగింది.

క్రీ.పూ. 3 వ సహస్రాబ్దిలో సుమేరు, అక్కడు భాషలు ఒకదాని వలన మరొకటి ప్రభావితమయ్యాయి. పదజాలమూ, వ్యాకరణమూ, ఉచ్చారణా వంటి అన్ని అంశాల్లోనూ ఈ పరస్పర ప్రభావాన్ని గమనించవచ్చు. కనుక ఈ రెండు భాషలనూ ష్ప్రాఖ్బున్ట్[గమనిక 2] (Sprachbund (en)-భౌగోళిక దగ్గరితనము కారణంగా పరస్పర ప్రభావానికి గురైన భాషలు)గా చెప్పవచ్చు.[20]

సుమారు క్రీ.పూ 2270లో (కురచ కాలవృత్తాంతము ప్రకారము) వాయువ్య దిశన అక్కడు రాజుల ఆక్రమణ మొదలైంది. క్రమంగా సుమేరు మొత్తాన్నీ వారు స్వాధీనము చేసుకున్నారు. రాజ్యాధికారము సుమేరుల చేతి నుండి అక్కడ్ల చేతిలోకి వచ్చింది. ఈ సమయములో సుమేరు భాష వాడుక తగ్గినప్పటికీ, అది ధార్మిక భాషగా కొనసాగింది. మరల సుమారు క్రీ.పూ. 2100–2000 నాటికి రాజ్యాధికారము సుమేరులైన ఉర్ మూడో రాజవంశము చేతికి వచ్చింది. శతాబ్దము పాటు కొనసాగిన వీరి పాలనలో కూడా అక్కడు భాషే వాడుక భాషగా చెలామణీ అయ్యింది.[21]

పెర్షియా సింధుశాఖ తీరంలోని సుమేరు నగరమైన ఎరిడు, ప్రపంచంలోని అతి పురాతన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ మూడు వేర్వేరు సంస్కృతుల కలయిక జరిగి ఉండవచ్చు. అవి:

  1. మట్టి ఇటుకల గుడిసెల్లో నివసిస్తూ, నీటిపారుదల మెళకువల పై పట్టు సాధించిన ఉబైడు రైతులు,
  2. నల్ల గుడారాలలో నివసిస్తూ గొర్రెలూ, మేకల మందలను కాచుకుంటూ బతికే సెమిట సంచార జాతీ
  3. చిత్తడి నేలల్లో పూరిళ్ళలో బ్రతికే మత్స్యకారులూ. ఈ మత్స్యకార గుంపే సుమేరుల పూర్వికులయ్యుండొచ్చు.[21]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]
సుమేరులు
ఎడమ వైపు: సుమారు క్రీ.పూ 2150లో చెక్కబడ్డ సుమేరు రాజు గు-డి-అ తల. కుడి వైపు: శరాకార లిపిలో వ్రాయబడ్డ సఙ్-గిగ్ (𒊕𒈪). నల్ల తల గలవారు అని దీని అర్థం. ఇది సుమేరులు తమని తాము పిలుచుకున్న పేరు. మొదటిది తలకు పద సంజ్ఞ(తలకు సంకేత చిత్రమైనపదసంజ్ఞగా మారి ఇలా అయ్యింది- ), రెండవది నలుపుకూ, రాత్రికీ సంజ్ఞ(సంకేత చిత్రం నుండి వచ్చిన సంజ్ఞ- ).[22][23][24][25]

దక్షిణ మిసొపొటేమ్యాకు చెందిన సెమిటేతర భాషలు మాట్లాడే పురాతన నివాసుల భాషను, వారి తరువాత అక్కడ తూర్పు మెసొపొటేమియాలో స్థిరపడ్డ అక్కడ్లు సుమెరు (𒋗𒈨𒊒-సు-మె-రు[గమనిక 3])[26] అని పిలిచినందున సుమేరు అనే పదం పుటిందని భావిస్తున్నారు.[27][28][29] సుమేరులు తమ భాషను ఎమె-గి లేదా ఎమె-ఙిర్‌ గా పిలుచుకున్నారు.

సుమేరులు తమని తాము " సఙ్-గిగ్/సఙ్-గిగ్-గ "[గమనిక 4] అని చెప్పుకున్నారు. దీనికి అర్థం "నల్ల-తలవారు/నల్ల-తల-మోయువారు" అని."[27][30][31][32] సుమేరు రాజు షుల్-గి తనను తాను నాలుగు పావు భాగాలకూ రాజుగా, నల్ల తల గల ప్రజలకు కాపరిగా చెప్పుకున్నాడు.[33] అక్కడ్లు కూడా సుమేరులను అక్కడు భాషలో 'నల్ల తల గల వారు' అనే అర్థము వచ్చే 'స()ల్మట్ కక్కడీ' అనే పేరుతో పిలిచేవారు.[23][24]

అలాగే సుమేరులు వారి భూమిని క్- ఎన్-గి(-ర్) ('స్థలం' + 'ప్రభువులు' + 'ప్రముఖులు')గా పిలుచుకున్నారని నాటి శాసనాలను బట్టి తెలుస్తోంది. దీని అర్థం "ఉన్నత ప్రభువుల ప్రదేశం".[27][34][35]

అక్కడు భాషలో ఈ సుమెర్ పదము వ్యుత్పత్తి ఏమిటన్నది తెలియదు.[36] దక్షిణ మెసొపొటేమియాను హిబ్రూలో షైనార్ అనీ, ఈజిప్టు భాషలో సెనెగెర్ అనీ, హిటైట్‌లో న్హర్(ర) అనీ పిలుస్తారు. ఈ పదాలన్నీ సుమెర్ పదంలో మార్పుల వల్ల వచ్చుండొచ్చు.[36]

మిసొపొటేమ్యా లోని నగర రాజ్యాలు

[మార్చు]

క్రీ.పూ. 4 వ సహస్రాబ్ది ఆఖరుకు సుమేరు అనేక స్వతంత్ర నగర-రాజ్యాల సమాహారంగా ఉండేది. సరిహద్దు గుర్తులుగా కాలువలూ, సరిహద్దు రాళ్ళూ ఉండేవి. ప్రతి నగరం మధ్యలో ఆ నగర దేవత లేదా దేవునికి అంకితం చేయబడిన ఒక ఆలయం ఉంటుంది. ఈ నగర-రాజ్యాలూ పూజారి ఐన గవర్నరు (ఎన్సీ) పాలనలో గానీ లేదా మతపరమైన కార్యకలాపాలతో మమేకవుతూ ఉండే రాజు (లు-గల్) పాలనలో గానీ ఉండేవి.

అను ౙిక్కుర్రట్, తెల్ల గుడీ
ఉరుక్‌లో ఉన్న అనూ ౙిక్కుర్రట్, తెల్ల గుడీ. పిరమిడ్ ఆకృతిలో కట్టబడ్డ అను ౙిక్కుర్రట్ క్రీ.పూ 4000 నాటిది. సుమారు క్రీ.పూ 3500లో దాని పైన తెల్ల గుడి కట్టబడింది.[37] ఈజిప్టు పిరమిడ్లలో అత్యంత పురాతనమైనది సుమారు క్రీ.పూ 2600 నాటిది. వాటి ఆకృతికి ౙిక్కుర్రట్ ఆధారమయ్యుండొచ్చు.[38][39]

నగర-రాజ్యాలు:

పై 5 నగరాలు జలప్రళయానికి ముందు అధికార కేంద్రాలుగా ఉండేవనీ, జలప్రళయము తరువాత ఆదివంశపు కాలము మొదలైందనీ సుమేరులు నమ్మేవారు.

ఇతర ప్రధాన నగర-రాజ్యాలు:

(1సంబంధిత ఆధునిక ప్రదేశము తెలియరాలేదు)
(2ఉత్తర మిసొపొటేమ్యాలోని సుదూర నగరము)

చిన్న నగరాలు (దక్షిణము నుండి ఉత్తరము వరకు వరసక్రమములో):

(2ఉత్తర మిసొపొటేమ్యాలోని సుదూర నగరము)

ఆగేడ్‌కు నైరుతి వైపున 330 కి.మీ (205 మైళ్ళ) దూరములో మ-రి నగరము ఉండేది. ఇదీనూ, మారుమూల నగరమైన నగర్‌ను మినహాయిస్తే మిగిలిన నగరాలన్నీ గ్డాడుకు దక్షిణాన ఉన్న యూఫ్రేటీసు-టైగ్రిసు సారవంత మైదానంలో ఉన్నాయి. వీటి ప్రస్తుత పేర్లు బాబిల్, డియాలా, వాసిట్, దీ కార్, స్ర, అల్ ముథన్నా, అల్-కాడిసియహ్ (ఇరాక్ గవర్నరేట్స్).

చరిత్ర విభజన

[మార్చు]
సార్గొను మహావీరుడి విజయఫలకంపైనున్న సుమేరు యుద్ధఖైదీ బొమ్మ. సుమారు క్రీ.పూ 2300లో చెక్కబడ్డ ఈ ఫలకం ఇప్పుడు లూవ సంగ్రహశాలలో ఉంది.[40] ఖైదీల యొక్క కేశాలంకరణ సుమేరుల శైలిలో ఉంది (నెత్తి మీద ఉంగరాల జుట్టూ, పక్కలన కురచ వెంట్రుకలూ). ఈ శైలి ఉర్ కేతనం పైన కూడా కనిపిస్తుంది.[41]
టెల్ అస్మర్‌లోని ఈ విగ్రహం దేవునికి సమర్పణగా ఇచ్చినది. ఇది క్రీ.పూ 2750–2600 కాలానికి చెందినది.

చరిత్రపూర్వ ఉబైడు, ఉరుక్ కాలాలలో సుమేరు నగర-రాజ్యాలు అధికారంలోకి వచ్చాయి. సుమేరు లిఖితచరిత్ర క్రీ.పూ. 27 వ శతాబ్దం నుండి మొదలైంది. అయితే మూడవ ఆదివంశపు కాలం వరకు అనగా సుమారు క్రీ.పూ 23 వ శతాబ్దం వరకు చరిత్ర అస్పష్టంగానే ఉంది. ఆ తరువాత నుండి శాసనాలకు ఆధునిక కాలములో పరిష్కరింపబడ్డ సుమేరు లిపి వాడబడింది. క్రీ.పూ. 23 వ శతాబ్దిలో అక్కడు సామ్రాజ్య పాలనలో మొదటిసారిగా మిసొపొటేమ్యా మొత్తం ఒక్క త్రాటి పైకి తీసుకురాబడింది. అలాగే గూట్య కాలం తరువాత మూడవ ఉర్ రాజ్యము ఇలాగే మిసొపొటేమ్యా ఉత్తర, దక్షిణ భాగాలను ఏకము చేసింది. క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో అమోరీయుల దండయాత్రలతో ఈ సామ్రాజ్యము పడిపోయింది. ఆ తరువాత క్రీ.పూ. 1700 వరకు అమోరీయుల "ఇ-సి-ఇన్ రాజవంశం" కొనసాగింది. మిసొపొటేమ్యా బాబిలోనియ పాలనలో సమైక్యంగా ఉన్న కాలములో, అనగా క్రీ.పూ. 1700 వరకు, కూడా అమొరీయ ఇ-సి-ఇన్ రాజవంశము మిగిలి ఉంది. సుమేరులు చివరకు అక్కడు (అస్సీర-బాబిలోనియ) జనాభాలో కలిసిపోయారు.[ఆధారం చూపాలి]

  • ఉబైడు కాలం: క్రీ.పూ. 6500–4100 (మట్టిపాత్రల కొత్తరాతియుగం నుండి తామ్రశిలా యుగము వరకు)
  • ఉరుక్ కాలవ్యవధి: క్రీ.పూ. 4100–2900 (చివరి తామ్రశిలా యుగము నుండి మొదటి కంచు యుగం I వరకు)
    • ఉరుక్ XIV–V : క్రీ.పూ. 4100–3300
    • ఉరుక్ IV కాలం: క్రీ.పూ. 3300–3100
    • జెమ్డిట్ నస్ర్ కాలం (ఉరుక్ III ): 3100–2900 క్రీ.పూ
  • ఆదివంశపు కాలం (మొదటి కంచు యుగము II–IV)
    • మొదటి ఆదివంశపు కాలం: క్రీ.పూ. 2900–2800
    • రెండవ ఆదివంశపు కాలం: క్రీ.పూ. 2800–2600 (గిల్గమేష్)
    • మూడవ ఎ ఆదివంశపు కాలం: 2600–2500
    • మూడవ బి ఆదివంశపు కాలం: క్రీ.పూ. 2500–2334
  • అక్కడు సామ్రాజ్య కాలం: సుమారు క్రీ.పూ 2334–2218 (సార్గొను)
  • గూట్యపు కాలం: క్రీ.పూ. 2218–2047 (ప్రారంభ నాలుగవ కాంస్య యుగం)
  • మూడవ ఉర్ కాలం: క్రీ.పూ. 2047–1940.
బెర్లిన్‌లోని పర్గమన్ సంగ్రహశాలలోనున్న సామర్రా పాత్ర. పాత్రకు మధ్యన ఉన్న స్వస్తికం పునర్నిర్మాణము ద్వారా చేర్చబడింది.[42]

ఉబైడు కాలం

[మార్చు]
ఉబైడు కాలం నాటి మృణ్మయ పాత్ర

చక్కటి చిత్రాలతో అలంకరింపబడి, విలక్షణ శైలిలో తయారు చేయబడ్డ, మృణ్మయ పాత్రలు ఈ కాలములో మనకి కనిపించే ప్రముఖ అంశము. ఉబైడు కాలములో ఈ కుమ్మర శైలి మిసొపొటేమ్యా, పెర్షియ సింధుశాఖ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉండేది. అత్యంత పురాతన మానవ నివాసాలు టెల్ ఎల్ ఒఎలీలో ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఐతే ఉబైడు కాలానికంటే చాలా ముందు నుండే దక్షిణ మిసొపొటేమ్యాలోని పరిస్థితులూ, వాతావరణమూ మానవ నివాసానికి అనుకూలంగా ఉండేవి. కనుక ఇప్పటికింకా కనుగొనని మరింత పురాతన నివాస స్థలాలు ఉండే అవకాశము మెండుగా ఉంది. ఈ ఉబైడు కాలపు సంస్కృతిని పరిశీలిస్తే, ఈ సంస్కృతి ఉత్తర మిసొపొటేమ్యాలోని సామర్రపు సంస్కృతి ప్రభావముతో ఏర్పడినట్లుగా అనిపిస్తుంది. ఈ కాలపు తరువాతిదైన ఉరుక్ కాలము వారిని సుమేరులుగా గుర్తించారు. ఉరుక్ కాలపు వారు ఉబైడు కాలపు ప్రజల తరువాతి తరాలా లేక వారు వేరే సంస్కృతికి చెందినవారా అన్నది తెలియదు. ఉబైడు కాలములో ముఖ్య రాజకీయ, సాంస్కృతిక కేంద్రముగా ఎరిడు ఉండేది. నాగరిక జ్ఞానాన్ని ( మి) ఎరిడు గ్రామ దైవమూ, జ్ఞానానికి ప్రతీక ఐన ఎన్-కి, ఉరుక్ గ్రామ దేవతా, ప్రేమకూ యుద్ధానికీ ప్రతీక ఐన ఇన్-అన్-నకు ఇచ్చే కథ, బహుశా ఎరిడు ప్రాభవము తగ్గి ఉరుక్ వైభవము యొక్క ఆరంభాన్ని సూచిస్తుండవచ్చు.[43]: 174 

ఉరుక్ కాలం

[మార్చు]

ఉబైడు కాలములో కుమ్మర పరిశ్రమ ఒక కుటీర పరిశ్రమగా ఉండేది. నెమ్మదిగా కదిలే కుమ్మరి చక్రాలతో పాత్రలను తయారు చేసీ, వాటిని అందమైన చిత్రాలతో అలంకరించేవారు. క్రమంగా ఈ పాత్రలు, వేగంగా కదిలే చక్రాలపై నిపుణుల చేత భారీ మొత్తములో ఉత్పత్తి చేయబడ్డాయి. ఈ పాత్రలకు అలంకరణలుండేవి కాదు. ఈ కుమ్మర పరిశ్రమ విధానాల్లో వచ్చిన మార్పే ఉరుక్ కాలానికీ, ఉబైడు కాలనికీ మధ్య ప్రముఖ వ్యత్యాసము. [44][45]

పవిత్ర మందకు మేత వేస్తున్న ఉరుక్ పురోహిత రాజు (మతాధికారి)
పవిత్ర మందకు మేత వేస్తున్న ఉరుక్ పురోహిత రాజూ, అతని శిష్యుడూ. సుమారు క్రీ.పూ 3200 నాటి చిత్రం
క్రీ.పూ 3100 నాటి ఉరుక్ కాలపు ముద్ర. లూవ సంగ్రహశాలలోనిది.

ఉరుక్ కాలంలో (సుమారుగా 4100-2900 క్రీ.పూ.) దక్షిణ మిసొపొటేమ్యాలోని నదులూ, కాలువల గుండా పెద్ద మొత్తంలో వ్యాపార సరుకుల రవాణా జరిగేది. ఈ వ్యాపారాలు పెద్ద, పెద్ద పట్టణాల ఆవిర్భావానికి తోడ్పడ్డాయి. నగర-సామ్రాజ్యాల వలె ఈ నగరాల నడిబొడ్డున కూడా ఒక ఆలయము ఉండేది. 10,000కు పైగా జనాభా కల ఈ నగరాల్లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలూ ఉండేవారు. ఈ నగరాల్లో కేంద్రీకృత పాలనా యంత్రాంగము ఉండేది. ఈ యంత్రాంగము నగర నిర్వహణ కొరకు వివిధ శాఖల్లో సిబ్బంది నియామకాలు జరిపేది. ఉరుక్ కాలంలోనే పర్వతదేశం నుండి పట్టుబడ్డ వారిని బానిస కార్మికులుగా ఉపయోగించుకోవడం ప్రారంభం అయింది. పురాతన గ్రంథాలలో ఈ పట్టుబడ్డ బానిసలతో పనులు చేయించారనడానికి తగినన్ని సాక్ష్యాధారాలున్నాయి. టర్కీలోని టౌరసు పర్వతాల నుండి పశ్చిమాన మధ్యధరా సముద్రమూ, తూర్పున ఇరాను వరకు ఉరుక్ నాగరికతకు చెందిన గుర్తులూ, కాలనీలు కనుగొనబడ్డాయి.[46]: 2–3 

ఉరుక్ కాలంనాటి నాగరికత పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజల మీద ప్రభావం చూపించింది. సుమేరు వ్యాపారస్తులూ, ద్వారా సుమేరు సంస్కృతి ఈ చుట్టుపక్కల జనాలకు పరిచయమైంది. ఫలితంగా వీరు కూడా క్రమంగా ఇదే తరహాలో ఉన్న వారి స్వంత ఆర్థికవ్యస్థను, సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నారు (ఉదా: టెల్ బ్రాక్). దీనితో సుమేరు నగరాలు సుదూర కాలనీలను సైనిక బలగముతో తమ గుప్పిట్లో ఉంచుకోలేకపోయాయి.[46]

ఉరుక్ కాలంలో సుమేరు నగరాల పాలనావ్యవస్థ మతరాజ్యవ్యవస్థ అయ్యి ఉండి, మతాధికారి (పురోహిత రాజు) పాలనలో ఉండుండవచ్చు. ఈ విధానములో నగరములోని మందిరము, పురుషులూ, మహిళలతో కూడుకుని ఉండే ఒక పెద్దల మండలి ఆధీనములో ఉండేది. ప్రతీ మండలికీ అధ్యక్షునిగా ఒక మతాధికారి (ఎన్సి) ఉండేవారు. ఈ మతాధికారి నేతృత్వములో మండలి నగరపాలన చేసేది. నగర దైవము పురుషుడైతే మహిళా, స్త్రీ ఐతే పురుషుడూ, మతాధికారులుగా ఉండేవారు.[47] ఈ రాజకీయ నిర్మాణం ఆధారంగానే తరువాతి కాలములో సుమేరు దేవగణము రూపుదిద్దుకుని ఉండవచ్చు. ఉరుక్ కాలంలో యుద్ధాలు, సుశిక్షితులైన సైనిక బలగమూ ఉన్నాయనడానికి పెద్దగా ఆధారాలు లేవు. పట్టణాలకు కూడా సాధారణంగా ప్రకారాలు ఉండేవి కాదు. ఈ కాలములో ఉరుక్ ప్రపంచంలోనే అత్యంత పట్టణీకరణ గల నగరముగా అవతరించింది. నగర జనాభా సంఖ్య మొదటిసారి 50,000ను దాటింది.

పురాతన సుమేరు రాజ జాబితాలో ఈ కాలములోని అనేక ప్రముఖ నగరాలను పాలించిన రాజవంశాల పేర్లు ఉన్నాయి. ఈ మొదటి దఫాలో ఉన్న రాజులందరూ జలప్రళయం సంభవించే ముందు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చెప్పబడింది. వీరు కాల్పనిక వ్యక్తులు అయ్యుండవచ్చు. ప్రసిద్ధ పౌరాణిక వ్యక్తులైన అ-లు-లిమ్, డుముౘిడ్ వంటివాళ్ళ పేర్లు కూడా ఈ దఫాలో ఉన్నాయి.[47]

9000–5000 ఏళ్ళ క్రితము భూమిపై వెచ్చటి, తేమపూరిత వాతావరణము ఏర్పడింది. దీన్ని హోలోసీన్ క్లైమాటిక్ ఆప్టిమమ్‌గా (Holocene climatic optimum (en)) వ్యవహరిస్తారు. ఈ వాతావరణము పోయి, భూమిపై పొడి వాతావరణము ఏర్పడ్డ చర్యను పియొర ఆసిలేషన్ (Piora Oscillation (en)) అంటారు. పియొర ఆసిలేషన్ సుమారు క్రీ.పూ 3200–2900 మధ్యకాలంలో జరిగింది. సరిగ్గా ఈ పియొర ఆసిలేషన్ సమయానికే ఉరుక్ కాలము ముగిసింది.[48]

ఆది వంశపు కాలం

[మార్చు]
క్రీ.పూ 26వ శతాబ్దం నాటి బంగారు శిరస్త్రాణం. ఇది మెస్-కలమ్-డుగ్‌ అనే రాజుది. ఇతడు ఉర్ మొదటి వంశపు వ్యవస్థాపకుడు అయ్యుండొచ్చు.

క్రీ.పూ. 2900తో పెద్దల మండలి పాలనావిధానము పోయి, సుమేరులో రాచరికము మొదలైంది. దీనితో పాలనావ్యవహారాల్లో మతానికున్న ప్రాముఖ్యత తగ్గింది.[49] రాజును సుమేరు భాషలో లు-గల్ (లు = మనిషి, గాల్ = గొప్ప) గా వ్యవహరించేవారు. ఈ కాలపు రాజులలో, సుమేరు సంప్రదాయాలలో పితృసమాన గౌరవము కల, డుముౘిడ్, లుగల్-బన్డ, గిల్గమేష్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వీరి పాలన సంకేత చిత్రాల లిపి నుండి ఇప్పుడు మనము చదవగలిగే అక్షర చిహ్నాల లిపి అభివృద్ధికి కొన్ని శతాబ్దాల ముందు, అనగా కీ.పూ.2900లో నడిచింది. ఈ సమయములో సుమేరు సాంస్కృతిక కేంద్రముగా దక్షిణ మిసొపొటేమ్యా ఉన్నప్పటికీ, పాలకులు తమ రాజ్యాలను పొరుగు ప్రాంతాలకు విస్తరింపజేయడముతో, అక్కడి సెమిట వాసులు సుమేరు సంస్కృతిని చాలా వరకు తమ ఆచార వ్యవహారాల్లో భాగము చేసుకున్నారు.

సుమేరు రాజ జాబితాలో ఉన్నవారిలో, వీరగాథల్లో ప్రస్తావించబడ్డ మొదటి రాజు ఎ--న. ఇతడు కిషు మొదటి రాజవంశంలో 13 వ రాజు. పురావస్తు పరిశోధనల ఆధారంగా ధ్రువీకరింపబడిన వాళ్ళలో అత్యంత పురతనమైనవాడు కిషు రాజవంశానికి చెందిన ఎన్-మె-బర-గెసి. ఇతడి పేరూ గిల్గమేష్ పురాణకావ్యంలో కూడా పేర్కొనబడింది. ఈ విషయాన్ని ఆధారము చేసుకుని, గిల్గమేష్ కూడా చారిత్రాక ఉరుక్ రాజు అనే ప్రతిపాదన చేయబడింది. ఈ కాలములో యుద్ధాలు పెరిగాయి. ఈ మార్పు గిల్గమేషు కావ్యములో కూడా ప్రతిబింబిస్తుంది. నగరాల విస్తీర్ణము పెరిగీ, రక్షణగా ప్రాకారాలు నిర్మించబడ్డాయి. ప్రాకారాల పరిమాణం అధికరించబడింది. దక్షిణ మిసొపొటేమ్యాలోని ప్రాకారాలు లేని పల్లెలు కనుమరుగైపోయాయి. (ఎన్మర్కర్, గిల్గమేషులిరువురూ కూడా ఉరుక్ పట్టణానికి ప్రకారాలు నిర్మించినట్లు గాథల్లో చెప్పబడింది.)[50].

లగషు మొదటి రాజవంశం

[మార్చు]
ఎ-అన్-న-టుమ్ రాబందుల శిలాఫలకములో ఒక ముక్క

లగషు రాజవంశాన్ని (సుమారు క్రీ.పూ. 2500–2270) రాజుల జాబితాలో పేర్కొననప్పటికీ అనేక ముఖ్యమైన స్మారక కట్టడాలూ, పురావస్తు పరిశోధనా ఫలితాల ద్వారా ఆ వంశపు ఉనికి ధ్రువీకరించబడింది.

కొంతకాలం మాత్రమే ఉనికిలో ఉన్నప్పటికీ చరిత్రకు తెలిసిన మొట్టమొదటి చక్రవర్తులలో ఒకరుగా లగషు రాజవంశానికి చెందిన ఎ-అన్-న-టుమ్ ప్రత్యేకత సంతరించుకున్నాడు. ఇతడు కిష్, ఉరుక్, ఉర్, లర్సలతో సహా మొత్తం సుమేరును ఆక్రమించి తన సామ్రాజ్యములో కలుపుకున్నాడు. అలాగే లగషు చిరకాల ప్రత్యర్థి ఐన ఉమ్మాను తన సామంత రాజ్యంగా మార్చాడు. అంతేకాక ఆయన రాజ్యం ఈలం, పర్షియ సింధుశాఖ ప్రాంతాలకు కూడా విస్తరించి ఉండేది. అందరినీ భయభ్రాంతులను చేసి అదుపులో పెట్టడమే ఆయన విధానమని అనిపిస్తుంది.[51] అతని రాబందుల శిలాఫలకములో ఖండఖండాలుగా నరికిన ప్రత్యర్థుల శరీరాలను రాబందులు పీక్కు తింటున్నట్లు చెక్కబడింది. అతను మరణంచిన కొద్దికాలానికే ఆ సామ్రాజ్యం చిన్నాభిన్నమైపోయింది.

తరువాత ఉమ్మా మతాధికారి-రాజు లుగల్-ౘగ్-గె-సి ఉరుక్‌ను జయించడంతో లగషు రాజవంశ వైభవము మగిసింది. ఉరుక్ అతని రాజధానిగా మారింది. తరువాత ఆయన పర్షియ సింధుశాఖ నుండి మధ్యధరా వరకు విస్తరించి ఉన్న సామ్రాజ్యాన్ని పాలించాడు. అక్కడు రాజు సార్గొను అధికారములోకి రావడానికి ముందు ఉన్న సుమేరు జాతి రాజులలో ఇతను చివరివాడు.[21]

అక్కడు సామ్రాజ్యం

[మార్చు]
సుమారు క్రీ.పూ 2300 నాటి అక్కడు రాజు సార్గొను విజయఫలకం పైనున్న సుమేరు యుద్ధఖైదీలు.[40][41] లూవ సంగ్రహశాలలోనిది

అక్కడు సామ్రాజ్యము క్రీ.పూ. 2234–2154 (మధ్యమ కాలవృత్తాంతము ప్రకారము) మధ్య కాలములో నడిచింది. తూర్పు సెమిటపు అక్కడు భాష కిషు రాజుల పేర్లు వ్రాయడానికి, మొదటిసారి క్రీ.పూ. 2800లో, వాడబడింది.[51] ఈ భాషలోనే ఆ పేర్లు తదుపరి రాజ జాబితాలలో కూడా వ్రాయబడ్డాయి. పూర్తిగా ప్రాచీన అక్కడు భాషలో వ్రాసిన రచనలు క్రీ.పూ.2500 నుండి ఉన్నాయి. సార్గొను మహావీరుడి (క్రీస్తుపూర్వం 2270-2215) పాలనలో ప్రాచీన అక్కడు భాష వాడకము శిఖరాగ్రమును చేరుకుంది. అయినప్పటికీ పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించిన ఫలకాలను వ్రాయడానికి రాయసగాళ్ళు సుమేరు భాషనే ఎక్కువ వాడేవారు. అక్కడు, సుమేరు భాషలు రెండూ కూడా సుమారు వెయ్యి సంవత్సరాల వరకు వాడుక భాషలుగా ఉన్నాయి. కానీ క్రీ.పూ. 1800 నాటికి సుమేరు భాష ప్రధానంగా పండితులకూ, వ్రాయసగాళ్ళకూ మాత్రమే తెలిసిన గ్రాంథిక భాషగా మారింది. సార్గొనుకు ముందూ, తరువాతి కాలాలను పోల్చి చూస్తే చారిత్రక పరిస్థితుల్లో పెద్దగా అసంబద్ధత లేదనీ, సెమిటులూ, సుమేరుల మధ్య కలహాలకు, చరిత్రాకారులు ఆ కలహము చూపిన ప్రభావము కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఛో౨[గమనిక 5]ఖిల్ యకొప్సన్‌ వాదించాడు.[52] ఐతే, సార్గొను ఆక్రమించుకున్న ఈలము భాగాలలో కొంతకాలం అక్కడు భాష అక్కడి వారిపై రుద్దబడిందనడానికి తిరుగులేని ఆధారాలున్నాయి.

గూట్యపు కాలం

[మార్చు]

క్రీ.పూ. 2083–2050 (మధ్యమ కాలవృత్తాంతము ప్రకారము).

లగషు 2 వ రాజవంశం

[మార్చు]
లగషు వంశస్థుడు గు-డె-అ. ఇతనివి అనేక ప్రతిమలు మనకు దొరికాయి.
గు-డె-అ కుమారుడు ఉర్-నిన్-గిర్-సు ప్రతిమ. సుమారు క్రీ.పూ 2100 నాటిది. లూవ సంగ్రహశాలలోనిది.
లగాషు వంశస్థుడు గు-డె-అ

క్రీ.పూ. 2093–2046 (మధ్యమ కాలవృత్తాంతము ప్రకారము)

క్రీ.పూ. 2093-2046 (మధ్యమ కాలవృత్తాంతము)గూట్యుల చేతిలో అక్కడు సామ్రాజ్యం పతనమైన తరువాత సుమేరు జాతి పాలకుడైన లగషుకు చెందిన గు-డె-అ ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. తమకి తాము దైవత్వాన్ని ఆపాదించుకునే సార్గోనిక రాజుల విధానాన్ని ఇతడు కూడా కొనసాగించాడు. మునుపటి లగషు రాజవంశీకుల వలె గు-డె-అ ఇంకా ఆయన వారసులు కూడా కళలకు ప్రోత్సాహం అందించడముతో, వీరి కాలానికి చెందిన అనేక కళాఖండాలూ, ఉత్పత్తులూ పెద్ద సంఖ్యలో పురావస్తు పరిశోధనల్లో లభ్యమయ్యాయి.

మూడవ ఉర్ కాలం

[మార్చు]
ఇరాక్‌లోని నాస్రిరీయః దగ్గరున్న సుమారు క్రీ.పూ 2100 నాటి ఉర్ మహా ౙిక్కుర్రట్

క్రీ.పూ. 2047-1940 (మధ్యమ కాలవృత్తాంతము ప్రకారము)

తరువాత, ఉర్ యొక్క 3 వ రాజవంశస్తులైన ఉర్-నమ్మూ, అతని వారసుడు షుల్-గిలు సుమేరును పాలించారు. వీరి సామ్రాజ్యము దక్షిణ అస్సీరియా వరకు విస్తరించి ఉండేది. ఇందుమూలాన ఇంతకు ముందు కొందరు చరిత్రకారులు, ఈ కాలానికి సుమేరు పునరుజ్జీవ కాలమని తప్పుడు పేరు ఇచ్చారు.[53]తప్పుడు పేరు ఎందుకైందంటే అప్పటికే ఈ ప్రాంతంలో సుమేరు కంటే సెమిట సంస్కృతులే ఎక్కువ ఉన్నాయి. అస్సీరియా, తదితర ప్రాంతాల్లో అకేడ్ల జనాభా పెరగడమే కాక సెమిటులైన మార్టులు (అముర్రులు) అనేక దఫాల్లో ఇక్కడికి వలస వచ్చారు. వీరు దక్షిణప్రాంతంలో ఇ-సి-న్, లర్స, ఎష్నున్న మరి కొంతకాలం తర్వాత బాబిలోనియా వంటి స్థానిక రాజ్యాలను స్థాపించారు. క్రీ.పూ. 21వ శతాబ్దిలో ఉత్తర భాగములో పురాతన అస్సిరియా సామ్రాజ్యము వలె దక్షిణాన బాబిలోనియా సామ్రాజ్యము కూడా కొంత కాలము ప్రధాన శక్తిగా నిలబడింది. మధ్యయుగములో లాటిను భాషలాగే, శరాకార లిపి వాడుకలో ఉన్నంత కాలము సుమేరు భాష బాబిలోనియా, ఇంకా అస్సీరియా పాఠశాలల్లో ధార్మిక భాషగా నేర్పబడేది.

పతనం

[మార్చు]

దక్షిణ మిసొపొటేమ్యా నుండి ప్రజలు ఉత్తరభాగానికి అధిక సంఖ్యలలో వలసవెళ్ళడం ఎప్పడు మొదలైందో అప్పుడే సుమేరు పతనం మొదలైంది. మట్టిలో క్రమంగా పెరుగుతున్న లవణీయత కారణంగా సుమేరు భూముల వ్యవసాయ ఉత్పాదకత తగ్గుముఖం పట్టింది. ఇదే ఈ వలసలకు కారణం. ఈ ప్రాంతంలో ముందునుండే మట్టి లవణీయత ప్రధాన సమస్యగా గుర్తించబడింది.[54] పేలవమైన డ్రైనేజ్ కారణంగా వ్యవసాయ భూముల్లో నీరు నిలబడిపోయేది. అక్కడి పొడి వాతావరణములో ఈ నీరు ఆవిరవగా, నీటిలోని లవణాలు నేలలో మిగిలిపోయి, క్రమంగా భూలవణీయత పెరగసాగింది. అక్కడు సామ్రాజ్య కాలమూ, తదుపరి ఉర్ మూడవ వంశపు కాలాలలో గోధుమల పంట వేయడము నుండి లవణీయతను తట్టుకోగలిగిన యవలపంట సాగుకు రైతులు మారారు. కానీ అది ప్రజలకు తగినంత ఆహారం అందించ లేదు. దీనివలన క్రీ.పూ 2100 నుండి క్రీ.పూ. 1700 మధ్యలో ఈ ప్రాంతంలో జనాభా దాదాపు ఐదింట మూడు వంతులు తగ్గిందని అంచనా.[55] దీనితో అక్కడు భాష మాట్లాడే ప్రాంతాల్లో జనాభా పెరిగి, సుమేరు భాష ప్రధానంగా ఉన్న ప్రాంతాలలో జనాభా గణనీయముగా తగ్గినది. క్రమంగా సుమేరు మాతృభాషగా అంతరించిపోయి గ్రాంథిక భాషా, ధార్మిక భాషగా మిగిలింది.

మూడవ ఉర్ వంశపు చివరి రాజైన ఇ-బి-సువెన్‌ను (సుమారు క్రీ.పూ 2028–2004) ఓడించి, ఈలములు ఉర్‌ను కొల్లగొట్టాక [ఆధారం చూపాలి], సుమేరు అముర్రుల పాలనలోకి వచ్చింది (ఈ ఘట్టంతో మధ్యకాంస్య యుగం మొదలైనట్టుగా పరిగణిస్తారు). 20 – 18 వ శతాబ్దాల్లో ఉనికిలో ఉన్న ఈ స్వతంత్ర అముర్రు రాజ్యాలు "ఇ-సి-న్ రాజవంశం"గా రాజ జాబితాలో పేర్కొనబడ్డాయి. సుమారు క్రీ.పూ. 1800లో హమ్మురాబి ఆధ్వర్యంలోని బాబిలోనియా విస్తరణతో ఈ వంశము యొక్క శకం ముగిసింది.

తరువాతి కాలాల్లో అస్సిరియా, బాబిలోనియాలను పాలించిన రాజుల్లో కొంతమంది అరుదుగా సార్గోనిక రాజుల బిరుదు ఐన "సుమేరూ, అక్కడు ప్రాంతాలకు రాజు"ను తమకు ఆపాదించుకున్నారు. ఇందుకు ఒక ఉదాహరణ సుమారు క్రీ.పూ 1225లో అస్సిరియాను పాలించిన మొదటి టుకుల్టీ నినుర్టా‌.

జనాభా

[మార్చు]

సుమేర్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ఉరుక్ వైభవము తారాస్థాయిలో ఉన్నప్పుడు, నగర జనాభా 50,000–80,000 ఉండేదని అంచనా వేయబడింది. [56] సుమేర్లో ఇతర ప్రముఖ నగరాలు ఉండడమూ, పెద్దసంఖ్యలో వ్యవసాయ జనాభా ఉండడాన్నీ బట్టి చూస్తే, సుమేరు జనాభా సుమారుగా 8 నుండి 15 లక్షల దాకా ఉండుంటుందని అంచనా. ఈ కాలంలో ప్రపంచ జనాభా 2.7 కోట్లుగా అంచనా వేయబడింది.[57]

సుమేరు భాషకు వేరే ఏ భాషతోను పోలికలూ, సంబంధాలూ లేవు (లాంగ్వేజ్ ఐసొలేట్). ఐతే ఆ కాలములో తక్కువ సాంస్కృతికంగా తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిన వేరే భాష ఉండేదనీ (substrate), ఆ భాష ఏమిటో ఈనాడు మనకి తెలియనప్పటికీ, సుమేరు భాషపై దాని ప్రభావాము తెలుస్తోందనీ (substrate effect), అనేక భాషాశాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. సుమేరులోని కొన్ని ప్రధాన నగరాలకు సుమేరు భాషకు చెందని పేర్లు ఉన్నాయి. ఇదే వీరి ప్రతిపాదనకు ఆధారము. ఈ పేర్లూ, వీరికి ముందు ఇక్కడ నివసించిన జనాల భాషలోనివని వీరి అభిప్రాయము.[58] ఏదేమైనా దక్షిణ మిసొపొటేమ్యాలో ఉబైడు కాలం (క్రీ.పూ.5300–4700(C-14)) నుండి మొదలుకొని సంస్కృతిలో పెను మార్పులేవీ చోటుచేసుకోలేదని పురావస్తు అవశేషాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ స్థిరపడిన సుమేరు ప్రజలు టైగ్రిసు, యూఫ్రేటీసు నదుల కారణంగా సారవంతమైన ఈ ప్రాంతపు భూములను సాగుచేసి వ్యవసాయక్షేత్రాలుగా మార్చారు.

ప్రాచీన సుమేరు భాషను మాట్లాడిన పురాతన సుమేరులు, ఉత్తర భాగాన నివసించిన రైతులని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. నీటిపారుదల వ్యవసాయ విధానాలను ఆకళింపు చేసుకున్న తరువాత వీరు దక్షిణ భాగానికి వలస వచ్చి ఉంటారని వారి భావన. సామర్రులు ఆదిమ నీటి పారదుల పద్ధతుల నుపయోగించి వ్యవసాయము చేసేవారు. టైగ్రీసూ, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఈ పద్ధతి వాడిన వారిలో వీళ్ళే మొదటివారు. క్రీ.పూ 5700–4900 ప్రాంతములో వీరికి మృణ్మయ పరిశ్రమలుండేవని తెలుస్తోంది. చోగ మామీ (క్రీ.పూ. 5700–4900 C-14) మృణ్మయ పాత్రల్లో సామర్రపు పద్ధతులూ, సుమేరు పద్ధతులూ (ఉబైడు కాలము నాటివి) కూడా కనిపిస్తాయి. 1980 లలో ఫ్రెంచివారు జరిపిన త్రవ్వకాలలో లర్సకు సమీపంలోని టెల్ అవేలి (ఓయిల్లె, ఓయులి) వద్ద ఉబైడు కాలనికి పూర్వము తయారైన పాత్రలు ఎనిమిది స్థాయిలలో లభ్యమయ్యాయి. ఇవి సామర్రపు పాతరలను పోలి ఉన్నాయి. కనుక ఉత్తరాన వ్యవసాయ సంస్కృతిని అలవర్చుకున్న సామర్రులు, నీటి పారదుల నైపుణ్యమూ, శ్రామికుల చేత సేద్యాన్ని నడిపించడానికి కావలసిన సామాజిక వర్గీకరణా పొందాక, దక్షిణ భాగానికి వలస వచ్చుంటారని సిద్ధాంతీకరించడమైనది.[ఆధారం చూపాలి]

అరేబియా సముద్రతీరాన లభ్యమైన పనిముట్ల ఆధారంగా వేటాడడము, చేపలు పట్టడము ద్వారా బతుకుతున్న అక్కడి స్థానికులే నెమ్మదిగా వ్యవసాయాధారిత సమాజాన్ని నిర్మించుకున్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు. మంచుయుగానికి చివరిలో జలప్రళయానికి ముందు పర్షియ సింధుశాఖ ప్రాంతంలో నివసించిన ప్రజలే సుమేరులని జురిస్ రింశ్ విశ్వసిస్తున్నారు.[59]

సంస్కృతి

[మార్చు]

సాంఘిక, కుటుంబజీవితం

[మార్చు]
సుమారు క్రీ.పూ 2400 నాటి ఈ హరశోఠపు శిల్పంలో చేతులు జోడించి ప్రార్థిస్తున్న సుమేరు మహిళను చూడవచ్చు. ఇది ప్రస్తుతం లండన్‌లోని బ్రిటిష్ సంగ్రహశాలలో ఉంది.
సుమేరు మహిళల సమాధుల్లో (ఉర్ రాచ శ్మశానములో) దొరికిన వస్తువుల ఆధారంగా పునర్నిర్మించిన శిరోభూషణమూ, కంఠహారాలూ. ఇది లండన్‌లోని బ్రిటిష్ సంగ్రహశాలలో ఉంది.

సుమేరు సంస్కృతి తొలినాళ్ళ నాటివైన ఆదిమ చిత్రాల ఆధారంగా ఈ క్రింది విషయాలు తెలుస్తున్నాయి:[60]

  • "మృణ్మయ పాత్రల వాడుక చాలా ఎక్కువగా ఉండేది. గిన్నెలూ, పూల జాడీలూ, వివిధరకాల వంటపాత్రలూ తయారు చేయబడుతూ ఉండేవి. తేనే, వెన్నా, మద్యం, ద్రాక్షారసం వంటి ఒక్కొక పదార్థానికీ ప్రత్యేకంగా వాటిని నిల్వ చేసుకోవడానికి తయారైన పాత్రలుండేవి. మద్యాన్ని ఖర్జూర పళ్ళ నుండి తయారుచేసుండొచ్చు. కొన్ని పూల జాడీలకు కొనదేలిన కాళ్ళు ఉండేవి. x ఆకారములో ఉన్న కాళ్ళుండే బల్లలపై ఈ జాడీలనుంచేవారు. సమంగా నిలబడే జాడీలను చతుస్ర లేదా దీర్ఘ చతుస్రాకారాల్లో ఉండే చెక్క బల్లల పై ఉంచేవారు. నూనె జాడీ, బహుశా పదార్థాలను నిల్వ ఉంచే ఇతర జాడీలకు కూడా, మట్టితో మూతచుట్టూ మూసివేసేవారు. ఈ పద్ధతి ప్రాచీన ఈజిప్టులో కూడా ఉంది. ఈ మట్టి పాత్రలను అనుకరిస్తూ, రాతితో పూలజాడీలనూ, గిన్నెలనూ తయారుచేసేవారు."
  • "ఈకలతో చేసిన తురాయిని పెట్టుకునేవారు. మంచాలూ, ఎత్తుపీటలు, కుర్చీలూ వాడేవారు. వీటి కాళ్ళు ఎద్దు కాళ్ళలాగా ఉండేవి. అగ్ని-స్థలాలూ, హోమగుండాలూ ఉండేవి."
  • "కత్తులూ, పిడిసానా, ఉలీ, ఇంకా ఒక రంపం లాంటి పరికరమూ వీరు వాడేవారు. ఈటెలూ, అమ్ములూ, విల్లులూ, బాకులూ (గురిచూసి విసిరే చిన్న కత్తి) యుద్ధంలో ఉపయోగించబడ్డాయి కానీ ఖడ్గాలు వాడారనడానికి ఆధారాలు లేవు. "
  • "వ్రాసేందుకు ఫలకాలు వాడేవారు. చురకత్తి (బాకు) అలుగును లోహముతో చేయగా, పిడిని చెక్కతో తయారుచేసేవారు. బంగారు హారాలు వాడేవారు."
  • "చంద్రమానంతో కాలగణన లెక్కించబడింది."

సుమేరు సంగీతానికి సంబంధించి చాలా సమాచారము లభించింది. వేణువూ, లైరు అనే ఒక తంత్రీ వాయిద్యమూ ఉపయోగించబడ్డాయి. లైరు అనగా ప్రాచీన వీణ (ఆధునిక వీణ కాదు) వంటిది. వీరి వాయిద్యాలలో నేటి కాలములో అందరూ ఎరిగినవి ఉర్ లైరులు.[61]

లగష్ రాజు ఉరు-క-గిన (సుమారు క్రీ.పూ. 2300) అప్పటి ఆచారమైన బహుభర్త్రుత్వాన్ని రద్దు చేశారని శాసనాలు తెలియజేస్తున్నాయి. బహుభర్త్రుత్వానికి పాల్పడిన స్త్రీని ఆమె నేరము చెక్కబడ్డ రాళ్ళతో కొట్టి చంపాలని ఆయన చట్టము చేసారు.[62]

సుమేరు యువరాణీ (సుమారు క్రీ.పూ 2150)
గు-డె-అ కాలము నాటి (సుమారు క్రీ.పూ 2150) సుమేరు యువరాణీ.
శిల్పం యొక్క ముందు భాగము
లూవ సంగ్రహశాల AO 295.

సుమేరు సమాజము పురుషాధిక్య సమాజము. అలాగే సామాజిక వర్గీకరణ ఉండేది. సుమేరు స్మృతులలో మనకి దొరికిన వాటిలో పురాతనమైనది ఉర్-నమ్ము స్మృతి. ఇది మూడవ ఉర్ కాలము నాటిది. ఈ స్మృతిని అధ్యయనము చేయడము ద్వారా ఆనాటి సామాజిక నిర్మాణము పై ఒక మౌలిక అవగాహన వస్తుంది. లు-గలు ("గొప్ప వ్యక్తి" లేదా రాజు) కింద రెండు ప్రాథమిక వర్గాలుగా సమాజంలోని వారందరూ వర్గీకరించబడ్డారు:

  1. "లు" లేదా స్వేచ్ఛ కలిగిన వ్యక్తీ,
  2. బానిసా (పురుషుడు ఐతే ఆరాడ్, స్త్రీ ఐతే జెమి).

'లు' కొడుకును పెళ్ళికి ముందు డుము-నిగా పిలుస్తారు. ఒక స్త్రీ (మునుస్)ను పెళ్ళికి ముందు కూతురిగా (డుము-మి), పెళ్ళి తర్వాత భార్య (మ్)గా, భర్త చనిపోతే విధవగా (నుమసు) గుర్తిస్తారు. ఒక విధవ అదే తెగకు చెందిన మరో వ్యక్తిని మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు.

వివాహాలు సాధారణంగా వధూవరుల తల్లితండ్రుల చేత నిర్ణయించబడేవి[63]: 78 . నిశ్చితార్థములో ఇరు పక్షాలూ పెళ్ళి నిశ్చయమైనట్లు మట్టి ఫలకాలపై నమోదు చేయించేవారు.[63] పెళ్ళికొడుకు పెళ్ళికూతురి తండ్రికి కానుకలివ్వగానే పెళ్ళికి చట్టబద్దత వస్తుంది.[63] సంతోషకరమైన దాంపత్యాన్ని వర్ణిస్తూ ఒక భర్త, తన భార్య తనకు ఎనిమిది మంది కొడుకులనిచ్చినప్పటికీ, ఇంకా తనతో సంభోగించడానికి ఆసక్తి చూపుతుందని చెప్పాడని ఒక సుమేరు నానుడి.[64]

సుమేరులు పెళ్ళికి ముందు లైంగిక సంబంధాలను ఆమోదించినట్లుగా కనిపించదు.[65] సుమేరు భాషలో కానీ, అక్కడు భాషలో కానీ, కన్యత్వము అనే పదానికి సమానార్థకము లేదు. వీరు కన్యత్వం అనే భావనను సంభోగింపబడని, సంభోగానికి గురికాబడని (సుమేరు భాషలో అ-ను-గి-అ లేదా ఎ-ను-గి-అ, అక్కడు భాషలో 'ల నక్బట్), పురుషాంగము తెలియని స్త్రీ (అక్కడు భాషలో గిష్ నున్ౙువ(అ)) అనే వాక్యాలు వాడి వ్యక్తపరిచేవారు.[66]: 91–93  అక్కడు వైద్య గ్రంథాల్లో పేర్కొనబడిన షిషితు అనే పదము కన్నెపొరను సూచిస్తుందా లేక మరేదైనా అర్థముందా అనేదానిపై స్పష్టత లేదు. ఐతే మహిళ కన్యత్వాన్ని నిర్ణయించడములో తరువాతి కాలపు మధ్యప్రాచ్య సంస్కృతులతో పోల్చితే కన్నెపొర పాత్ర చాలా తక్కువ అనిపిస్తుంది.[66]: 92  కన్యత్వము విషయములో స్త్రీ మాటలకే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది.[66]: 91–92 

ప్రాచీన ఆధారాలను బట్టి సుమేరులు శృంగారము పట్ల చాలా ఉదార వైఖరి కలిగియున్నారని తెలుస్తోంది.[67] లైంగిక కట్టుబాట్లు నైతికత మీదకంటే, ఫలానా సంబంధము వారిని మతకర్మలలో పాల్గొనలేని విధంగా మైలు పరిచే అవకాశమెంత అనే విషయము మీద ఆధారపడి ఉండేవి.[67] ఇక వీరు స్వయంతృప్తి లైంగిక పటుత్వాన్ని పెంచుతుందని నమ్మేవారు.[67] సొంతంగానూ, అలాగే వారి లైంగిక భాగస్వాములతో కలిసీ కూడా స్వయంతృప్తి పొందేవారు.[67] గుద మైథునం కూడా వీరికి ఆమోదయోగ్యమే.[67] ఎన్టు పూజారిణులకు[గమనిక 6] పిల్లల్ని కనడము నిషిద్దము.[68][64] కనుక వీరు గుదరతిలో ఎక్కువగా పాల్గొనేవారు.[68][67][64] వ్యభిచారము ఉండేది కానీ మన దేవదాసీ వ్యవస్థ వంటిది ఏదైనా ఉండేదా అన్నది స్పష్టంగా తెలియలేదు.

భాష, లిపి

[మార్చు]
బీరు కేటాయింపులను నమోదు చేయడానికి వాడిన వ్రాత ఫలకం. క్రీ.పూ 3100–3000 కాలం నాటిది.
శరాకార లిపికి ఆధారమైన సంకేత చిత్రాలు గల సున్నపురాతి ఫలకం. క్రీ.పూ 4వ సహస్రాబ్ది నాటిది. లూవ సంగ్రహశాలలోనిది.
వ్రాత అభివృద్ధి ప్రక్రియ యొక్క ప్రామాణిక శాస్త్రీయ పునర్నిర్మాణం. నేటి లిపుల పుట్టుకలో శరాకార లిపి పాత్రను కూడా ఇందులో మనం చూడవచ్చు.[69][70]

సుమేరు పురావస్తు పరిశోధనల్లో కనుగొన్నవాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనవి, శరాకార లిపిలో వ్రాయబడి ఉన్న మట్టి ఫలకాలు. ఇవి పెద్ద సంఖ్యలో దొరికాయి. సుమేరు సంస్కృతిలో వ్రాత అభివృద్ధి అవ్వడము అనేది చారిత్రకాంశాలను పొందుపరచడములోనే కాక, ఇతిహాస కవితలూ, కథలూ అలాగే ప్రార్థనలూ, చట్టాల వంటి వివిధ రకాల సాహిత్యాన్ని సృష్టించే క్రమములో మానవాళి చరిత్రలోనే గొప్ప మైలురాయిగా పరిగణించబడుతుంది.

మొదట్లో బొమ్మలు, అనగా గూఢచిత్రాలు వాడినప్పటికీ, కొద్ది కాలములోనే శరాకార లిపీ, ఆ తదుపరి పదసంజ్ఞలూ (ఆలోచనలను వ్యక్తపరిచేందుకు గుర్తులు) వాడబడ్డాయి.

తడి మట్టిపై త్రిభుజాకారపు రెల్లుతో వ్రాసేవారు. సుమేరు భాషలో కొన్ని వేల వ్రాతలు బయటపడ్డాయి. వ్యక్తిగత, వ్యాపార లేఖలు, రసీదులు, పద కోశాలూ, చట్టాలు, శ్లోకాలు, ప్రార్థనలు, కథలు, రోజువారీ లెక్కల వంటివి ఉన్నాయి. మట్టి పలకల గ్రంథాలయాలు కనుగొనబడ్డాయి. స్మారక శాసనాలూ, అలాగే విగ్రహాలు లేదా ఇటుకలు వంటి వివిధ వస్తువులపై వ్రాతలూ సర్వసాధారణము. శిక్షణలో భాగంగా వ్రాయసగాళ్ళు ఒక్కొక గ్రంథాన్నీ అనేక సార్లు గ్రంథస్తము చేయడముతో, చాలా గ్రంథాలవి అనేక ప్రతులు మనకు దొరికాయి. సెమిట సమాజములో కూడా వాడుక భాష సెమిట భాష ఐనప్పటికీ చాలా కాలము పాటు మతసంబంధ అలాగే చట్టసంబంధ కార్యకలాపాలకు సుమేరు భాష వాడుకలో ఉంది.

శరాకార లిపిలో వ్రాయబడ్డ వాటిల్లో ముఖ్యమైనది 'గిల్గమేష్' అనే ఒక సుదీర్ఘ కావ్యము. ఉరుక్ శిథిలాల్లో లభ్యమైన ఈ కావ్యము ప్రామాణిక శరాకార లిపిలో వ్రాయబడి ఉంది. ఇది రెండవ ఆదిమ వంశపు కాలంలో పాలించిన గిల్గమేష్ (అక్కడు భాషలో) ("బిల్గమేష్ (సుమేరులో)") అనే రాజు గురించి చెబుతుంది. ఈ కథలో గిల్గమేషు, అతని సహచరుడు ఎన్-కి-డు కాల్పనిక సాహసాలు ఉన్నాయి. అనేక మట్టి పలకలపై వ్రాయబడ్డ ఈ కథ మనకు తెలిసినంతలో చరిత్రలోనే మొట్టమొదటి సారి వ్రాయబడ్డ కాల్పనిక సాహిత్యముగా గుర్తింపు పొందింది.

సుమేరు భాషకు దగ్గరగా ఉన్న భాష ఏదీ లేదు. కనుక ఇది ఏ భాషా కుటుంబానికీ చెందదు. ఇలాంటి భాషను భాషాశాస్త్ర పరిభాషలో లాంగ్వేజ్ ఐసొలేట్‌గా పిలుస్తారు (ఒంటరి భాష అని అర్థము). అక్కడు భాష మాత్రము ఆఫ్రోయాసియాటిక్ భాషా కుటుంబంలో సెమిటిక్ విభాగానికి చెందినది. సుమేరు భాష యొక్క భాషా కుటుంబాన్ని కనుక్కోవడానికి జరిగిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. సుమేరు భాషలో పదముకు ఉపసర్గలూ, ప్రత్యయాలు వంటివి చేరడము ద్వారా అర్థము మారుతుంది. ఇలాంటి భాషలను భాషాశాస్త్ర పరిభాషలో అగ్లుటినేటివ్ లాంగ్వేజ్ అంటారు. అనేక శాస్త్రజ్ఞులు సుమేరు భౌగోళిక అంశాలూ, వివిధ కళలూ, వ్యవసాయ విధానాలూ పరిశీలించి ఒక తక్కువ (substratum) లేదా సమాన పలుకుబడి (adstratum) కలిగిన భాష యొక్క ప్రభావమీ సుమేరు భాషపై ఉందని ప్రతిపాదించారు. ఈ ఊహాజనిత భాషకి ప్రోటో-యుఫ్రేటీయ భాష లేదా ప్రోటో-టైగ్రీయ భాషగా పేరు పెట్టారు. ఐతే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే శాస్త్రవేత్తలు కూడా చాలా మంది ఉన్నారు.

ప్రాచీన సుమేరు వ్రాతలు, వ్రాయసగాళ్ళు తాము విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఊతంగా కొన్ని ముఖ్య పదాలు మాత్రము వ్రాసిపెట్టుకున్న సంగ్రహ రూపాలు; అనగా జ్ఞాపన పత్రాలు. వీటిని వ్రాసేది తమ వ్యక్తిగత వాడుకకే కనుక ఇవి వ్యాకరణ నియమాలననుసరించక, గజిబిజిగా ఉంటాయి. అందువలన ఈ ప్రాచీన వ్రాతలనర్థము చేసుకోవడము చాలా కష్టము[71]

క్రీ.పూ. 3 వ–2 వ సహస్రాబ్ది సమయానికి క్రమంగా వాడుక భాషగా సుమేరు స్థానాన్ని అక్కడు భాష ఆక్రమించుకుంది .[72] అయితే సా.శ. 1 వ శతాబ్దం వరకు సుమేరు భాష బాబిలోనియా, అస్సీరియాలో పవిత్ర, గ్రాంథిక, శాస్త్రీయ భాషగా వాడబడింది.[73]

క్రీ.పూ 24వ శతాబ్ది నాటి ప్రార్థనలో ఉన్న సుమేరు పురుషుడి శిల్పం (ఆధునిక తూర్పు సిరియాలో దొరికింది)
సుమేరు మతము
ఉర్ గుడిలో ఆసీనుడైన దేవునికి అర్ఘ్యము సమర్పణను చూపిస్తున్న శిల్పము. క్రీ.పూ 2500 నాటిది.
ఉర్‌లోని గుడిలో అర్ఘ్యమును సమర్పిస్తున్న నగ్న పూజారి. క్రీ.పూ 2500 నాటిది.

సుమేరులు వారికి సంబంధించిన అన్ని విషయాలనూ దైవానికి ఆపాదించేవారు. మరణం, దైవాగ్రహము వంటి విషయాలలో తాము అశక్తులమని విశ్వసించేవారు.[63]

సుమేరు మతవిశ్వాసాల ప్రకారము విశ్వసృష్టికి మూలమైన వృత్తాంతాలు రెండు. ఈ వృత్తాంతాలే వీరి మతానికి మూలస్తంభాలు. మొదటి వృత్తాంతము ప్రకారము సృష్టి అనేది కొన్ని పవిత్రమైన వివాహాలు ఫలితంగా ఉద్భవించింది. ఈ వివాహాల ఫలితంగా వ్యతిరేక శక్తులకు ప్రతీకలైన స్త్రీ, పురుష దైవిక అంశల సంగమము జరిగింది. ఈ సంగమమే సృష్టికి మూలము.

ఈ పవిత్ర వివాహ నమ్మకము యొక్క ప్రభావము మిసొపొటేమ్యాలో తర్వాతి నాగరికతల్లోని మత విశ్వాసాలపై ఉంది. అక్కడు మతములో సృష్టి వృత్తాంతాన్ని ఎనూమ ఎలిష్‌గా వ్యవహరిస్తారు. దీని ప్రకారము మంచినీటి దేవుడూ, పురషాంశ ఐన అబ్ౘు, ఉప్పునీటి దైవమూ, స్త్రీ అంశ ఐన టి-అమట్ కలయిక సృష్టికి మూలము. ఈ కలయికతో జనియించిన వారు లాహ్మ్, లహ్మూలు. వీరిని బురదమయమైన వారు/మట్టితో నిండినవారిగా పిలుస్తారు. ఈ పేర్లను ఎరిడులో ఎన్-కి దేవాలయమైన ఇ-అబ్ౘులోని ద్వారపాలకులకు బిరుదులుగా ఇచ్చేవారు.

యుఫ్రటీసు సముద్రములో కలిసే చోట, నదిలో కొట్టుకొచ్చిన మట్టితో చిన్న, చిన్న దీవులు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను తలపించేలా రెండో పవిత్ర వివాహం జరిగింది. ఈ వివాహ ప్రతిఫలాలే అన్షర్ (ఆకాశపు ఇరుసు), కిర్‌లు (భూమి యొక్క ఇరుసు). వీరిద్దరి సంతానమే అను (ఆకాశము), కి (భూమి)లు.

మరో ముఖ్యమైన పవిత్ర వివాహము పర్వతాలకు దేవి ఐన నిన్-ర్-సఙ్‌కు, మంచినీటికి అధిపతీ, ఎరిడు నగర దైవమైన ఎన్-కికీ మధ్య జరిగింది. వీరి కలయిక భూమికి పచ్చదనాన్నీ, పచ్చిక బయళ్ళనూ ప్రసాదించింది.

సుమేరు సంస్కృతి ఏర్పడ్డ తొలి దశలో దక్షిణాన ఉన్న ఎరిడు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఐతే చరిత్ర వ్రాయబడడము మొదలైన తొలినాళ్ళలోనే మధ్య భాగములోని నిప్పురు నగరము ఎరిడు స్థానాన్ని ఆక్రమించుకుంది. తర్వాత సుమేరు నాగరికత ఉన్నంత కాలమూ, ఈ నగరము తన స్థానాన్ని నిలుపుకుంది. ఇక్కడి పూజారులకు ఇతర నగర-రాజ్యాలమీద రాజకీయ అజమాయిషీ ఉండేది.

దేవుళ్ళు

[మార్చు]
క్రీ.పూ 2300 ప్రాంతం నాటి అక్కడు ముద్ర. ఇందులో మనం వారి దేవుళ్ళైన ఇనానా, ఉటు, ఎన్-కి, ఇసిముడ్లను చూడవచ్చు.

సుమేరులు దేవుళ్ళు అనేకులనీ (బహుదేవతావాదము), మానవ రూపాలు కలవారనీ విశ్వసించారు. ప్రతీ నగర రాజ్యానికీ ప్రత్యేకముగా నగర దేవతలూ, వారికి అంకితమైన గుడులూ, దాతలూ, మతాధికారులూ ఉండేవారు. ఐతే ఆయా నగర దేవతల ఆరాధన, ఆ నగరానికే పరిమతమవ్వాలని లేదు. ఒకే దైవము వివిధ నగరాల్లో పూజలందుకునేవారు. మతవిశ్వాసాలను గ్రంథస్తము చేసిన మొట్టమొదటి సమాజాల్లో సుమేరులు కూడా ఒకరు. కనుక వీరి విశ్వాసాలు మిసొపొటేమ్యాలోని తదుపరి నాగరికతల మతం, నమ్మకాలూ, జ్యోతిషశాస్త్రాలను ప్రభావితము చేసాయి.

సుమేరులు ఆరాధించే దేవుళ్ళు:

  • వీరు స్వర్గాధిపతిని 'అన్‌'గా పిలుస్తారు. ఈయన ఆకాశానికి ప్రతీక—ఆకాశ దేవుడు. ఆకాశాన్ని కూడా సుమేరు భాషలో అన్ అనే అంటారు. అన్ దేవేరి 'కి' (భూమికి ప్రతీక—భూదేవి).
  • దక్షిణాన ఉన్న ఎరిడులోని ఆలయంలో ఉండే ఎన్-కి; సంక్షేమానికీ, జ్ఞానానికి దైవంగా, భూగర్భ జలాలకు అధిపతిగా, వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చే శక్తి కలవాడిగా ఆరాధించబడ్డాడు. మానవాళికి మిత్రుడైన అతడు, మనుష్యులకు కళలు, శాస్త్రాలూ, నాగరిక బుద్ధులూ ప్రసాదించాడు. మొట్టమొదటి చట్టస్మృతి కూడా ఇతని సృష్టిగా భావించబడింది.
  • ఎన్-లిల్ తుఫాను, వాయువూ, వర్షాలకు దేవుడు.[74] నిప్పురు నగర దేవుడైన ఆయన సుమేరుల ప్రధానదైవంగా ఆరాధించబడ్డాడు.[74]: 108 [75]: 115–121  ఆయన దేవేరి నిన్-లిల్. ఈమె దక్షిణపవనాలకు దేవత.[76]: 106 
  • ఇన్-అన్-న ప్రేమకూ, శృంగారానికీ, యుద్ధానికీ దేవత.[43][page needed][77]: 109  శుక్ర గ్రహానికి ఈమె దేవ రూపము. ఉరుక్ నగర మందిరములో అన్‌తో పాటు ఈమె కూడా పూజలందుకునేది. తమకు దైవత్వాన్ని ఆపాదించుకున్న రాజులు, ఇన్-అన్-న, డుముౘిడ్‌ వివాహ ఘట్టాన్ని, తాము పూజారిణులను వివాహమాడడము ద్వారా ప్రదర్శించి ఉండవచ్చు.[77]
  • సూర్య భగవానుడు ఐన డ్. ఇతడు దక్షిణాన లర్స, ఉత్తరాన సిప్పర్లలో నగరదేవునిగా కొలవబడేవాడు.
  • ఉర్ నగరదేవుడూ, చంద్రభగవానుడూ ఐన సీన్
సుమేరులూ, తొలినాటి అకేడ్ల దేవగణము

వీరంతా ప్రధాన దేవుళ్ళు. ఆపైన వందల కొద్దీ చిన్న, చిన్న దేవతలు ఉన్నారు. సుమేరు దేవతలు వివిధ నగరాలతో అనుసంధానించబడి ఉంటారు. ఈ నగరాల రాజకీయ ప్రాముఖ్యతతో పాటే మతపరంగా వారి ప్రాముఖ్యతా మారుతుండేది. దేవుళ్ళు వారికి సేవ చేయించుకొనుటకై బంకమట్టితో మనుష్యులను సృష్టించారు అని సుమేరుల విశ్వాసము. దేవాలయాలు నీటిపారుదల వ్యవసాయానికి అవసరమైన విష్టి కార్యక్రమాలు నిర్వహించేవి. పౌరులందరూ ఆలయానికి కొంత విష్టి చేయడము తప్పనిసరి. ఐతే వెండి చెల్లించడం ద్వారా వారు ఈ బాధ్యత నుండి విముక్తులవ్వవచ్చు.

విశ్వము

[మార్చు]

విశ్వము ఒక పెద్ద గుమ్మటంతో కప్పబడ్డ సమాంతర బింబమని సుమేరులు నమ్మేవారు. మరణము తరువాత మనిషి శోకతప్తమైన అధోలోకములోకి కుప్పకూలి, అక్కడ అనంతకాలాల పాటు గి-డిమ్ అనే ఒక అధమ ప్రేతము వలె పడి ఉండవలెనని నమ్మేవారు.[78]

విశ్వం వీరిచే నాలుగు భాగాలుగా విభజించబడింది:

  • ఉత్తరాన కొండప్రాంతంలో నివసిస్తున్న సుబర్తులు. వీరిపై బానిసలూ, కలపా, ఇతర ముడి పదార్థాల కొరకు అడపాదడపా దాడులు చేసేవారు.
  • పశ్చిమాన గుడార వాసులైన మర్టులు. వీరు పురాతన సెమిట భాష మాట్లాడే ఆదిమానవులు. వీరు మేకలూ, గొర్రెలను కాచుకుంటూ బ్రతికే ఒక సంచార జాతి.
  • దక్షిణాన డిల్మున్ అనే వాణిజ్య రాజ్యము. ఇది మరణించిన వారి భూమిగా, సృష్టి జరుగు ప్రదేశముగా చెప్పబడింది.[79]
  • తూర్పున ఈలములు. ప్రత్యర్థులైన వీరితో సుమేరులకు తరచూ యుద్ధాలు జరిగేవి.

వారికి తెలిసిన ప్రపంచపు సరిహద్దులు: ఎగువ సముద్రం (మధ్యధరా సముద్రతీరం), దిగువ సముద్రం (పెర్షియ సింధుశాఖ), మెలుఖ్ఖ (బహుశా సింధూ లోయ), రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన మగన్ (ఒమన్).

ఆలయాలు

[మార్చు]

ప్రతీ ౙిక్కుర్రట్కూ (సుమేరుల దేవాలయాలు) ఒక ప్రత్యేకమైన పేరు ఉండేది. ౙిక్కుర్రట్ ఒక ముంగిలి ఉంటుంది. ముంగిలికి మధ్య భాగాన పరిశుద్ధులయ్యేందుకు ఒక కొలను ఉంటుంది.[80] దేవాలయానికి ఒక నడిమిసాల్పూ, దానికి ఇరువైపులా పక్కసాల్పులూ ఉంటాయి. పక్కసాల్పులకు చివరన పూజారులకు గదులుంటాయి. ఒక మూలన జంతుబలికి బలిపీఠం, శాకాహార సమర్పణ కొరకు ఒక బల్లా ఉంటాయి. ధాన్యాగారాలూ, గోదాములూ సాధారణంగా ఆలయాల సమీపంలో ఉండేవి. కొంతకాలం తర్వాత సుమేరులు అనేక పెద్ద పేద్ద దిమ్మలను ఒకదానిపైనొకటి కట్టి వాటిపైన గర్భగుడిని ఉంచసాగారు. ఇది నిర్మాణ విధానాల్లో ౙిక్కుర్రటు శైలిగా చెప్పబడుతుంది.[81][82]

అంత్యక్రియలు

[మార్చు]

మరణము తరువాత మనుషులు శోకతప్తమైన అధోలోకములో మగ్గుతారని వీరి నమ్మకము. ఈ లోకము ఎరెష్-కి-గల్ అనే దేవత పాలనలో ఉంటుంది. రాకపోకలను నిరోధించడానికి, వివిధ భూతాలు ఆ రాజ్య ముఖద్వారంలో ఉండి కాపలా కాస్తుంటాయని విశ్వసించేవారు. మృతదేహాలను నగరం వెలుపల ఖననం చేసేవారు. అక్కడ మృతదేహాలను ఒక చిన్న మట్టిదిబ్బతో కింద పూడ్చి, భూతాలకి కొంత ఆహారమూ, ఇతర సమర్పణలను ప్రదానము చేసేవారు. సంపన్నులు డిల్మున్‌లో ఖననం చేసేవారు.[83] ఉర్ రాజశ్మశానములో పు-అ-బి రాణిని పూడ్చినప్పుడు, ఆమె పరివారాన్ని కూడా నరబలిగా సమర్పించారని మనకు తెలుస్తోంది.

వ్యవసాయం, వేట

[మార్చు]

సుమేరలు సుమారుగా క్రీ.పూ. 5000–4500 కాలములో వ్యవసాయ జీవనాన్ని అలవర్చుకున్నారు. అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థా, పెద్ద మొత్తములో సాగు, నాగలి వాడకము, సంవత్సరము పొడుగూతా ఒకే పంటను వెయ్యడమూ, నగరపాలక వ్యవస్థ నేతృత్వములో ప్రత్యేక వ్యవసాయ కార్మిక శక్తి నిర్వహణా వంటి అనేక ప్రధాన వ్యవసాయ విధానాలు ఈ ప్రాంతంలో వాడుకలో ఉండేవి. ఈ వ్యవస్థ కారణంగా దేవాలయ ఖాతాలను నిర్వహించాల్సి రావడమే వ్రాత అభివృద్ధికి దారితీసింది (సుమారుగా క్రీ.పూ.3500లో).

ఉర్ రాజ సమాధులలో దొరికిన కళాకృతి. లెపిస్ లెజులీ, నత్త గుల్లలతో తయారు చేయబడిన దీనిలో సుమేరు సమాజపు దైనందిన వ్యవహారాన్ని చూడవచ్చు.

ఉరుక్ కాలంలోని చిత్రాల ఆధారంగా గొర్రెలూ, మేకలూ, పశువులూ, పందుల వంటి పెంపుడు జంతువులను పెంచేవారని తెలుస్తోంది. వారు వారి ప్రాథమిక వాహనముగా గాడిదనూ ఇతర ఈక్విడ్‌లనూ, బరువులు లాగడానికి ఎద్దులనూ ఉపయోగించారు. "జంతువుల ఉన్ని (వెంట్రుకలతో)తో ఉన్ని దుస్తులూ, తివాచీలూ తయారు చేయబడ్డాయి. ఇంటి చుట్టూ పరివేష్టిత తోటలలో చెట్లూ, ఇతర మొక్కలూ పెంచుకునేవారు. పొలాల్లో గోధుమలూ, బహుశా ఇతర ధాన్యాలు కూడా, సాగుచేయబడ్డాయి. నీరు పెట్టేందుకు ఏతాము ఉపయోగించబడింది. కుండీలూ, జాడీలలో కూడా మొక్కలను పెంచుకునేవారు "[60]

ఉరు-క-గిన రాజా ఏలుబడిలోని నాలుగో ఏటన (అనగా సుమారు క్రీ.పూ 2350) వ్రాయబడ్డ మట్టి ఫలకము. ఇందులో పిల్లలకూ, పెద్దలకూ మంజూరవుతున్న నెలవారీ యవ కేటాయింపుల వివరాలను శరాకార లిపిలో పొందుపరిచారు‌‌.

బీరు త్రాగడము మొదలుపెటిన మొట్టమొదటి వారిలో సుమేరులొకరు. వీరు మద్యాన్ని తమ ముఖ్య పంట ఐన ధాన్యపు గింజలతో చేసేవారు. వారు గోధుమ, యవలూ, అలాగే మిశ్రమ ధాన్యాలతో కూడా బీర్లను తయారుచేసేవారు. బీర్ల తయారీ వారి సంస్కృతిలో ముఖ్య భాగము. గిల్గమేష్ కావ్యములో ఎన్-కి-డుకీ గిల్గమేష్ రాజ్యపు ఆహారాన్నీ, బీరునీ పరిచయము చేసే ఘట్టము ఇలా వర్ణించబడింది: "ఈ నేల ఆచారాన్ని అనుసరించి బీరును పుచ్చుకో ... అతను ఏడు చెంబుల బీరు త్రాగి బెరుకును వదిలి, ఆనందంతో పాడ సాగాడు "[84]

సుమేరుల నీటిపారుదల పద్ధతులు ఈజిప్టులో వాడబడ్డ పద్ధతుల లాంటివే.[85] పట్టణీకరణకూ, నీటిపారుదల పద్ధతుల అభివృద్ధికీ అనుబంధం ఉందనీ, 89% జనాభా నగరాల్లోనే నివసించారనీ అమెరికా ఆంత్రొపాలజిస్టు రొబర్ట్ మెక్కార్మిక్ ఎడమ్స్ పేర్కొన్నాడు.[86]

వారు యవలూ, సెనగలూ, చిరుసెనగలూ, గోధుమలూ, ఖర్జూరాలూ, ఉల్లిపాయలూ, వెల్లుల్లీ, లెటిస్ (ఒక రకపు అకుకూర), లీకులూ (ఉల్లిపాయ లాంటి ఒక రకమైన కూరగాయ), ఆవాలూ పండించేవారు. సుమేరులు విరివిరిగా చేపలను పట్టడమే కాక, రకరకాల కోళ్ళనూ, జింకలనూ వేటాడేవారు.[87]

సుమేరులు వారి వ్యవసాయానికి నీటిపారుదల పద్ధతులపై ఎక్కువగా ఆధారపడేవారు. ఏతాలు వాడీ, కాలువలూ, కరకట్టలూ, అడ్డుకట్ట (వరకట్ట)లూ, జలాశయాలూ కట్టి తగినంత నీటి సరఫరా ఉండేలా చూసుకునే వారు. యుఫ్రేటీసు కొంచెము తక్కువే ఐనప్పటికీ, టైగ్రీసు తరుచూ భారీ వరదలతో సుమేరును ముంచెత్తేది. కనుక కాలువలకు తరుచుగా మరమ్మత్తులు చేసి, పూడికని తీసి, భూమికొలత గుర్తులనూ, సరిహద్దు రాళ్ళనూ మాటిమాటికీ పాతవలసి వచ్చేది. అందుచేత పౌరులందరూ వంతుల వారీగా కాలువల నిర్వహణ విష్టి చేయాలని ప్రభుత్వ నియమము ఉండేది. ఐతే డబ్బు చెల్లించి ఈ నియమము నుండి మినహాయింపు పొందవచ్చు.

"సుమేరు రైతు పంచాంగము" మనకి వీరి వ్యవసాయ పద్ధతులపై కొంత అవగాహన ఇస్తుంది. వీరు మొత్తము మూడు సార్లు కాలువల నుండి పొలాలకు నీళ్ళు వదిలేవారు. ఒకటి వరదల కాలం తరువాత, రెండు వసంత విషువత్తు తరువాత, మూడు వీరి సంవత్సరాది ఐన అకిటు నాట. ఇలా కాలువలలోని నీళ్ళను పొలాల్లో నింపి, మళ్ళీ నీళ్ళను బయటికి వదిలేసేవారు. తరువాత ఎద్దులతో పొలాన్ని తొక్కించి కలుపు మొక్కలను నాశనం చేసేవారు. తదుపరీ, గుద్దళ్ళతో చదును చేసేవారు. నేల బాగా ఎండాక వరుసగా మూడు సార్లు దున్ని, పులక చేసి, కెల్లగించేవారు. ఆ పిమ్మట తొలికలతో మట్టిగడ్డలూ, రాళ్ళూ పగలగొట్టి తదుపరి విత్తనాలు నాటేవారు. వీరికి కాలువల్లో నుండి పొలాల్లోకి వదిలిన నీటిని మరల బయటికి పంపేందుకు సరైన వ్యవస్థ లేదు. కనుక నీరు వదిలాక అది ఆవిరయ్యేవరకు, నీళ్ళలాగే నిలిచి ఉండేవీ. నీరు ఆవిరవగా వాటిలోని ఉప్పులు మట్టిలో కలిసిపోయేవి. దురదృష్టవశాత్తు దీని వల్ల వారి పొలాల్లో మట్టి లవణీయత క్రమంగా పెరిగింది. మూడవ ఉర్ కాలానికి, గోధుమ బదులు లవణీయతను తట్టుకోగలిగిన యవలు వారి ప్రధాన పంటగా ఉండేవి.

వీరు వసంతంలో కోతలు కోసేవారు. ఇందుకు గానూ ముగ్గురు కలసి ఒకటిగా జట్టు కట్టేవారు. వీరిలో కోతలు కోయువారొకరూ, పనలను కట్టలుగా కట్టువారొకరూ, కట్టలను చూసుకొను వారొకరూనూ.[88] ఈ కుప్పలను మొదట ఎద్దులతో నులియజేసి కంకులను వేరుచేసేవారు‌. ఆ పిమ్మట బల్లపై నూర్చి గింజలను వేరుచేసేవారు. ఆ పొట్టుతో పాటున్న గింజల్ని చెరిగి, పొట్టును వదిలించే వారు.

కళాఖండాలు

[మార్చు]
ఉర్ రాచశ్మశానములో (వ్యక్తిగత సమాధి 580) దొరికిన బంగారు బాకు.

సుమేరులో రాతికి కొరత ఉండేది కనుక, దాన్ని కేవలం శిల్పాలకే వాడేవారు. ఇతర కళాకృతులన్నిటికీ మట్టిని వాడేవారు. వీరు కళాఖండాలను ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న లెపిస్ లెజులీ, పాలరాయి, డయొరైట్ వంటి విలువైన రాళ్ళతో పాటు బంగారం వంటి విలువైన లోహాలతో కూడా అలంకరించేవారు. బంగారం, రాగీ, కంచూ వంటి లోహాలతో పాటు ఆల్చిప్పలూ, రత్నాలను కొన్ని ప్రత్యేకమైన శిల్పాలకూ అలాగే ఇతర కళాకృతులలో తాపేందుకూ వాడేవారు. లాపిస్, అలబాస్టర్ [గమనిక 7], సర్పెంటినైట్ వంటి విలువైన రాళ్ళతో పాటు రకరకాల చిన్న చిన్న రాళ్ళను ముద్రలు తయారుచేసేందుకు వాడారు.

వీరి కళాకృతుల్లో అత్యంత ప్రసిద్ధమైనవి ఉర్ లైరులు. ఇవి మనకు తెలిసినంతలో ప్రపంచంలోనే అత్యంత పురాతన తంత్రీ వాయిద్యాలు. 1922–24 వరకు జరిగిన ఉర్ రాచ శ్మశానము యొక్క తవ్వకాల్లో, వీటిని లెనర్డ్ వులీ కనుగొన్నారు.

నిర్మాణశైలి

[మార్చు]
ఉర్ మహా ౙిక్కుర్రట్గా పిలవబడే ఈ కట్టడాన్ని ఉర్ మూడవ రాజవంశపు కాలములో (సుమారు క్రీ.పూ 2100) కట్టారు. ఇందులో ప్రధాన దైవం చంద్రదేవుడు నాన్నా. ఇది ఆధునిక ఇరాక్‌లోని దీ కోర్ గవర్నరేట్ ‌లో ఉంది.

టైగ్రిస్-యుఫ్రేటీసు మైదానములో ఖనిజాలు కానీ, చెట్లు కానీ లేవు. సుమేరుల నిర్మాణాలు అర్ధగోళాకారపు మట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి. వీటిని మాలుతో కానీ సిమెంటుతో కానీ స్థిరపరచే పద్ధతి లేదు. మట్టి ఇటుకలతో కట్టిన కట్టడాలు కొంచెము కొంచెముగా కూలిపోవాల్సిందే. కనుక వాటిని అప్పుడప్పుడూ కూల్చేసి, మళ్ళీ అదే చోటులో కట్టేవారు. ఈ నిరంతర పునర్నిర్మాణంతో క్రమంగా నగరాలు నేల కంటే కొంత ఎత్తులోకి వచ్చి, ప్రతీ నగరము ఒక కొండ లాగా తయారయ్యింది. ఈ కొండలను టెల్‌లు అంటారు. ఇవి మధ్యప్రాచ్యమంతా మనకి కనిపిస్తూ ఉంటాయి.

ఆర్చిబోల్డ్ సేస్ ప్రకారము ఉరుక్ కాలం నాటి చిత్రగుర్తులను బట్టి చూస్తే "రాతికి కొరత ఉండేది. ఉన్న కాస్తను మాత్రము దిమ్మలుగా కోయడమో, ముద్రలుగా మార్చడమో చేసేవారు. నిర్మాణమంతా ఇటుకలతో జరిగేది. నగరాలూ, కోటలూ, గుళ్ళూ, ఇళ్ళూ అన్నీ ఇటుకలతోటే కట్టేవారు. నగరానికి స్థూపాలుండేవి. నగరాన్ని ఒక మానవ నిర్మితమైన మెరకపై కట్టేవారు. నివాస గృహాలు కూడా స్థూపము వంటి ఆకృతిని కలిగి ఉండేవి. ఇంటి తలుపులు కీలు ఆధారంగా తిరుగుతుండేవి. ఒక విధమైన తాళంచెవితో ఇవి తెరవబడి ఉండవచ్చు అని భావిస్తున్నారు. గవను పెద్ద ఎత్తున నిర్మితమై ఉండేది. బహుశా జంట గవనులు ఉండి ఉండవచ్చు. పునాది రాళ్ళ (ఇటుకల) కింద కొన్ని వస్తువులను ఉంచి, పునాదులను వాటిపై ప్రతిష్ఠించేవారు ".[60]

సుమేరుల కట్టడాల్లోకెల్లా అత్యంత ఆకర్షణీయమైన, ప్రసిద్ధమైన భవనాలు ౙిక్కుర్రట్లు. కొన్ని అంతస్తుల వరకు కట్టిన పెద్ద పెద్ద దిమ్మలపై ఒక గుడి ఉంచితే అది ౙిక్కుర్రట్. సుమేరు లోహపు అచ్చులలో రెళ్ళతో కట్టిన ఇళ్ళను చూడవచ్చు. ఇవి దాదాపు సా.శ 400 వరకు కూడా దక్షిణ ఇరాక్‌లో మార్ష్ అరబ్బుల ఇళ్ళకి దగ్గరగానే ఉన్నాయి. సుమేరులకు కమాను నిర్మాణము గురించి తెలుసు. కనుక వారు బలమైన గుమ్మటాల్ని కట్టగలిగారు. అనేక కమానులు కట్టి, వాటిని ఒకటిగా కలిపి, వాటి సహాయముతో గుమ్మటాలు కట్టేవారు. సుమేరు దేవాలయాలూ, రాజభవనాలూ నిర్మించడానికి సంక్లిష్ట పదార్థాలూ పద్ధతులూ ఉపయోగించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి అండగోడా, గర్భాగారం, గోడలోకి సగభాగం ఇమిడి ఉండే స్థంభాలూ. వీటితో పాటు వీరు దేవాలయాలు లాంటి ముఖ్య కట్టడాల్లోకి మట్టితో చేసిన మేకులు దిగ్గొట్టేవారు. ఈ మేకులపై రాజునో, దేవుణ్ణో కీర్తిస్తూ శాసనాలుండేవి.

అంకితమివ్వబడ్డ మేకు. సుమారు క్రీ.పూ 2100 నాటిది.

గణితం

[మార్చు]

సుమారు క్రీ.పూ 4000 నాటికి సుమేరులు ఒక సంక్లిష్ట కొలతల వ్యవస్థను అభివృద్ధి చేసారు. దీని ఆసరాతో అంకగణితం, రేఖాగణితము, బీజగణితములను సూత్రీకరించారు. క్రీ.పూ. 2600 తరువాత నుండి సుమేరులు మట్టి పలకలపై గుణకార పట్టికలు (ఎక్కాలు) రచించటమూ, రేఖాగణిత అభ్యాసాలూ, సమస్యలను పరిష్కరించడమూ మొదలుపెట్టారు. బాబిలోనియా అంకెల తొలి జాడలు కూడా ఈ కాలములో చూడవచ్చు.[90] సుమారు క్రీ.పూ. 2700–2300 సమయానికి వీరు పూసలపాటీని కనుగొన్నారు. అలాగే మొట్టమొదటి వరుస స్తంభాల పట్టిక తయారైంది. ఇది వారి సెగెజెస్మేల్ నంబరు సిస్టం పరిమాణం వరుస ఆదేశాలు వేరు చేసింది.[91]: 11  సుమేరులు మొట్టమొదటిగా స్థలం విలువను లెక్కించడానికి సంఖ్యా వ్యవస్థను ఉపయోగించారు. ఖగోళ గణితములో వీరు స్లైడ్ రూల్ లాంటి ఒక గణన యంత్రాన్ని ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. త్రిభుజము యొక్క వైశాల్యాన్నీ, ఘనము యొక్క ఘనపరిమాణాన్నీ లెక్కగట్టిన మొదటి సంస్కృతి వీరిదే.[92]

ఆర్థిక స్థితీ, వాణిజ్యమూ

[మార్చు]
షురుప్పక్‌లో ఒక మగ బానిసనూ, కట్టడాన్నీ అమ్మకానికి పెడుతూ ఇచ్చిన ప్రకటన. సుమారు క్రీ.పూ 2600 నాటిది.

అనటోలియాలోని (ఆధునిక టర్కీ) సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అబ్సిడియన్ (శిలాద్రవము చల్లబడగా తయారయ్యే స్ఫటికము), ఈశాన్య ఆఫ్ఘానిస్తాన్‌లోని డఖ్షాన్‌కు చెందిన లెపిస్ లెజులీ (రాజావర్తము వంటి రాయి), డిల్మున్ (ఆధునిక బహ్రైన్)కు చెందిన పూసలూ, సింధూ లిపి చెక్కబడి ఉన్న అనేక ముద్రలూ సుమేరులో లభించాయి. వీటిని బట్టి పర్షియ సింధుశాఖ కేంద్రంగా జరిగిన నాటి సుమేరు వాణిజ్య కార్యకలాపాల విస్తృతిని మనము అర్థము చేసుకోవచ్చు. ఉదాహరణకు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి ఉర్‌కు దిగుమతులు జరిగేవీ. ముఖ్యంగా అన్ని రకాల లోహాలనూ అక్కడి వారు దిగుమతి చేసుకున్నారు.

మిసొపొటేమ్యాలో అరుదుగా లభించే చెక్క వంటి సరుకులను సుదూరప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్నట్లు గిల్గమేషు కావ్యంలో ఉంది. లెబనన్ సీడరుకు[గమనిక 8] సుమేరులో చాలా విలువ ఉండేది. ఉర్‌లోని ప్వాబీ రాణి సమాధిలో చెట్టు బంక (వేష్టము) కనుగొనబడింది. సుమేరులు వేష్టమును ముజాంబీకు వంటి సుదూర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకునేవారు.

సుమేరులో బానిసలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థకు వారి సేవలు పెద్ద ఎక్కువేమీ కాదు. బానిస స్త్రీలు నేతగత్తెలుగా, గానుగల్లోనూ, మరల్లోనూ కార్మికులుగా, బరువులు మోసే కూలీలుగా పనిచేసేవారు.

సుమేరు కుమ్మరులు వారి కుండలను దేవదారు నూనె[గమనిక 9]తో గీసిన బొమ్మలతో అలంకరించేవారు. కుమ్మరిపనికి అవసరమైన అగ్నిని ఉత్పత్తి చేయడానికి వీరు బౌ డ్రిల్ (Bow drill) అనే యంత్రము వాడేవారు. సుమేరు తాపీవారూ, మణికారులూ తమ పనుల్లో ఎలబాస్టర్ ((Alabaster) (ఒక రకమైన హరశోఠము), (ఏనుగు)దంతం, ఇనుము, బంగారం, వెండి, కార్నీల్యన్ (Carnelian), లెపిస్ లెజులీలను వాడేవారు.[94]

సింధూలోయ వాసులతో వ్యాపార సంబంధాలు

[మార్చు]
తెల్లటి ఆకృతులు నిక్షారితము చేయబడ్డ ఈ కార్నీల్యన్ పూసల హారము ఉర్ రాచ శ్మశానములో దొరికింది. ఆదివంశపు కాలానికి చెందిన ఈ కళాకృతి సింధూ లోయ నుండి దిగుమతి చేసుకొనబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ప్రస్తుతము ఈ హారము బ్రిటిష్ సంగ్రహశాలలో ఉన్నది.[95]
క్రీ.పూ 3వ సహస్రాబ్దిలో సముద్ర మట్టాలు తక్కువగా ఉన్న కారణంగా సముద్ర మార్గాన సింధూ లోయకూ మెసొపొటేమియాకూ మధ్య దూరము ఇప్పటి కంటే చాలా తక్కువగా ఉండి ఉండవచ్చు.[1]

సుమారు క్రీ.పూ 2350 నుండి సింధు నాగరికత నుండి ఉర్‌కు దిగుమతులు జరిగినట్లుగా ఆధారాలున్నాయి.[96] సింధూ తీరాన కనబడే నత్తల గుల్లలతో[గమనిక 10] చేసిన వివిధ వస్తువులు పురావస్తు పరిశోధనల్లో దొరికాయి. ఇవన్నీ క్రీ.పూ 2500–2000 మధ్య కాలంలో తయారైనవని శాస్త్రవేత్తల అంచనా.[97] క్రీ.పూ 2600–2450 కాలంలో సింధూ లోయలో తయారైన కార్నీల్యన్ పూసలు సుమేరులోని సమాధుల్లో, ముఖ్యంగా ఉర్ రాచ శ్మశానములో దొరికాయి.[98] కొన్ని కార్నీల్యన్ పూసలపై తెల్లటి రంగులో ఉన్న ఆకృతులు నిక్షారితం చేయబడ్డాయి. ఇలా ఆమ్లంతో నిక్షారితం చేసే ప్రక్రియను అభివృద్ధి చేసింది సింధూ వాసులు కనుక, వీటిని సింధూ లోయ నుండి దిగుమతి చేసి ఉండవచ్చు.[99][95][100] లెపిస్ లెజులీ రెండవ నకాడ కాలంలోని (సుమారు క్రీ.పూ 3200) అనేక సమాధుల్లో దొరికాయి. లెపిస్‌ను సుమేరు నుండి ఈజిప్టు వారు దిగుమతి చేసుకునే వారు. ఆఫ్ఘానిస్తాన్‌లో తప్ప వేరెక్కడా లెపిస్ ఉన్నట్లు ఆధారాలు లేవు కనుక, ఈ రాయి అక్కడి నుండి ఇరాన్ పీఠభూమి మీదుగా సుమేరుకు రవాణా చేయబడి ఉండవచ్చు.[101][102]

సింధూ లిపిలో ఉన్న ఎన్నో ముద్రలు మిసొపొటేమ్యాలో, ముఖ్యంగా ఉర్, బాబిలోనియా, కిష్‌లలో, దొరికాయి.[103][104][105][106][107][108]

మూడవ ఉర్ కాలం నాటి రాజైన గు-డె-అ, ప్రకాశభేద్యమైన కార్నీల్యన్‌ను మెలుఖ్ఖ నుండి దిగుమతి చేసుకున్నట్లు గ్రంథస్తము చేయబడి ఉంది. ఈ మెలుఖ్ఖ సింధూ లోయేనని చాలామంది నిపుణుల అభిప్రాయం.[98] మెలుఖ్ఖ నుండి వచ్చిన వ్యాపారులూ, తుపాసీలు మిసొపొటేమ్యాలో ఉన్న విషయం చాలా శాసనాల్లో చెప్పబడినది.[98] అక్కడూ ఇంకా మూడవ ఉర్ ప్రాంతాలలో సింధూ లిపితో ఉన్నవి కానీ, సింధూ లోయతో సంబంధాన్ని సూచించేవి కానీ మొత్తం కలిపి సుమారు ఇరవై ముద్రలు దాకా దొరికాయి.[98]

సింధూ నాగరికత క్రీ.పూ 2400–1800 వరకు తారాస్థాయిలో విలసిల్లింది. ఐతే ఈ వ్యాపార లావాదేవీలు నెరపిన నాటికి ఇది సుమేరు నాగరికత కన్నా చాలా పెద్దది. 65,000 చదరపు అడుగుల వైశాల్యము గల సుమేరుతో పోల్చితే సింధూ నాగరికత 12 లక్షల చ.అ లో విస్తరించి ఉండి, కొన్ని వేల నివాసాలకు అలవాలంగా ఉండేది. రెండు నాగరికతల్లోనూ అతిపెద్ద నగరాలు మాత్రం ఒకే విధమైన వైశాల్యంతో, దాదాపుగా 30–40 వేల జనాభాతో ఉండేవి.[109]

ధనం, ఋణం

[మార్చు]

వీరు యవలనూ, వెండినీ ద్రవ్యముగా వాడేవారు. పెద్ద పెద్ద సంస్థలన్నీ వాటి లెక్కలను యవలూ, వెండిలలో నమోదు చేసేవి. ఆ రెంటికీ మధ్య ఒక స్థిరమైన మారక విలువ ఉండేది. సుంకాలూ, అప్పులూ, ధరవరలన్నీ ఆ రెంటిలో ఏదో ఒక దానిలో లెక్కగట్టబడేవి. చాలా లావాదేవీల్లో అప్పుల పాత్ర ఎక్కువగా ఉండేది. ఉదాహరణకు వర్తకులకు గుళ్ళచే కేటాయింపబడ్డ సరుకులూ, అలాగే మద్యము వ్యాపారుల దగ్గర ఖాతాలో వ్రాయించుకుని మద్యము తీసుకోగా పడ్డ బాకీలూ వంటివి.[110] సుమేరులో మద్యము తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఉండేది. ఈ తయారీదారులు ఎక్కువగా స్త్రీలు. వీరే బేరసారాలు కూడా జరిపేవారు.

సుమేరులో రెండు రకాల ఋణాలు ఎక్కువగా ఉండేవి. ఒకటి వాణిజ్య ఋణాలూ, ఇంకొకటి వ్యక్తిగత వ్యవసాయ ఋణాలూ. వాణిజ్యమును ప్రోత్సహించుటకు దేవాలయాలు ఈ వ్యాపార ఋణాలు మంజూరు చేసేవి. సుమేరు వ్యాపారులు సముద్ర ప్రయాణాలు చేసి, ఇతర ప్రదేశాల్లో కూడా వ్యాపారము చేసేవారు. వ్యాపార ఋణాలను ఎక్కువగా ఈ ప్రయాణ ఖర్చులకై వీరు తీసుకునేవారు. వీటి మారకము వెండి. సుమారు క్రీ.పూ.2000 ముందు వడ్డీ నెలకి అసలులో అరవయ్యో వంతు(1/60)గా (ఒక మినాకు ఒక షెకెల్ చొప్పున) నిర్ణయింపబడింది. తరువాతి రెండు వేల సంవత్సరాల పాటు వడ్డీ మొత్తము ఈ స్థాయిలోనే ఉంది.[110] ఈ రెండూ కాక మరో రకమైన ఋణాలు గ్రామీణ ఋణాలు. ప్రజలెవరైనా తమ సుంకాలను చెల్లించకపోతే ఆ బకాయిలను వారు రాజ్యము నుండి తీసుకున్న అప్పుగా పరిగణించేవారు. ఈ బకాయిలు ఎక్కువగా దేవాలయాలకు కట్టని సుంకముల మూలంగా పడేవి.[111]వీటికి వడ్డీలు ఎక్కువగా ఉండేవి—అసలులో మూడోవంతు (1/3) నుండి సగము (1/2) దాకా. ఈ అప్పుల లావాదేవీలకు మారకంగా యవలూ, ఇతర పంటలూ వాడబడేవి.[110] ఈ గ్రామీణ ఋణాలను పాలకులు మధ్య మధ్యలో మాఫీ చేసి, ఋణగ్రస్తులను వదలివేసేవారు. సాధారణంగా ఏడాదికొకసారి, వారు పట్టాభిషిక్తులైన రోజున, ఇది జరిగేది. ఇది కాక యుద్ధాలూ, కరువుకాటకాలూ వచ్చి పడినప్పుడు కూడా ఋణమాఫీ జరిగేది. మనకి తెలిసినంతవరకు, మొదటిసారి ఋణమాఫీ చేసిన వారు లగషు రాజులైన ఎన్-మె-టె-న, ఉరు-క-గినలు. జరిగిన కాలం క్రీ.పూ 2400–2350లో. హడ్సన్ ప్రకారం ఈ అప్పులు పేరుకుపోతే సన్నకారు రైతులు భూములన్నా కోల్పోతారు లేక వెట్టిచాకిరీలో చిక్కుకుంటారు. వీటిలో ఏది జరిగినా యుద్ధానికి సైనికబలం తగ్గుతుంది. అలా జరగకుండా ఉండేందుకే ఈ మాఫీలు.[110]

సైన్యం

[మార్చు]
సుమారు క్రీ.పూ 2600 నాటి ఉర్ కేతనముపై చెక్కబడ్డ తొలినాటి రథాలు.
రాబందుల ఫలకముపై చెక్కబడ్డ యుద్ధ అమరికలు. సుమేరు రాజు ఎ-అన్-న-టుమ్ నేతృత్వంలో ఫాలాంక్స్ అను యుద్ధ వ్యూహములో అమరి ఉన్న సైనికులు.
నాటి పడవ యొక్క వెండి నమూనా. క్రీ.పూ 2600–2500 నాటిది. ఉర్ రాచశ్మశానములో 789వ వ్యక్తిగత సమాధిలో దొరికింది.

సుమేరు నగర-రాజ్యాల మధ్య 2000 ఏళ్ళ పాటుగా జరిగిన దాదాపు ఎడతెరపి లేని పోరాటాలు అక్కడ యుద్ధ పద్ధతులూ, సాంకేతికతా అభివృద్ధి చెందేందుకు దోహదపడ్డాయి.[112]గ్రంథస్థమైన మొదటి యుద్ధము లగషూ, ఉమ్మ రాజ్యాల మధ్య సుమారు క్రీ.పూ 2450లో జరిగిన పోరాటము. ఇది రాబందుల శిలాశాసనము పైన చెక్కబడింది. దీనిలో పదాతి దళాలకు లగషు రాజు నాయకత్వము వహించడము మనము చూడవచ్చు. ఈ పదాతి దళం ఈటెలూ, దీర్ఘచతుస్రాకారపు డాలుతో సన్నద్దమయ్యి, రాగి శిరస్త్రాణాలను ధరించి, ఉన్నట్లుగా చెక్కబడి ఉంది. ఈ శాసనములో వీరందరూ ఫాలాంక్స్ వంటి ఒక అమరికలో నిలబడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యూహనిర్మాణానికి శిక్షణా, క్రమశిక్షణా అవసరము కనుక, సుమేరులో సుశిక్షితులైన సైనిక బలగము ఉండేదని తెలుస్తోంది.[113]

సుమేరు సైన్యం ఒనేజర్ల[గమనిక 11]ను పూన్చిన బళ్ళను రథాలుగా వాడేది. ఈ తొలినాటి రథాలు యుద్ధములో వాడేందుకు తరువాతి కాలపు వాటంత అనువైనవి కావు. కొంతమంది ఈ రథాలు ప్రధానంగా రవాణాకు వాడేవారని సూచించారు. ఐతే ఈ రథాల్లోని పరివారము గొడ్డళ్ళూ, ఈటెలూ పూని ఉండేవారని తెలుస్తోంది. రథాలకు నాలుగు లేదా రెండు చక్రాలు ఉండేవి. నాలుగు ఒనేజర్లు పూన్చబడ్డ వీటికి ఇద్దరు సారథులుండేవారు. ఇక రథము యొక్క బండిగా చెకడాబండి ఉండేది. బండి చక్రాలకు మూడు భాగాలుండేవి; మధ్యలో దిండూ, చుట్టూ దాకళ్ళూ, వాటిని చుట్టేస్తూ బయటన ఒక కమ్మి. అలాగే బండికి నేత జల్ల ఉండేది.

సుమేరు నగరాలకు రక్షణ ప్రాకారాలు ఉండేవి. నగర-రాజ్యాల మధ్య యుద్ధాలు ఎక్కువగా ముట్టుకోళ్ళ పోరాటాలు. ఐతే ఆనాటి మట్టి ఇటుకల గోడలు కొందరు శత్రువులను అడ్డుకోగలిగాయి.

సాంకేతిక పరిజ్ఞానం

[మార్చు]

సుమేరుల సాంకేతిక పరిజ్ఞానానికి ఉదాహరణలు: చక్రం, శరాకార లిపీ, అంకగణితం, రేఖాగణితము, నీటిపారుదల వ్యవస్థలు, పడవలు, చాంద్ర-సౌరమాన కాలగణనము, కంచు, జంతుతోలు, రంపం, ఉలి, సుత్తి, పిడిసాన, కళ్ళెం, మేకులు, గుండుసూదులు, ఉంగరాలు, తవ్వుకోలా, గొడ్డలి, కత్తులు, ఈటెలు, బాణములు, బాణం ములుకులు, ఖడ్గం, బంక, నీటితిత్తి, సంచి, కవచం, అంబులపొది, యుద్ధ రథాలు, ఒర, బూట్లు, చెప్పులు, పంట్రకోల, బీరు.

సుమేరులకు మూడు రకాల పడవలు ఉండేవి:

  • మొదటి రకము తెరచాప పడవలు. జుట్టుతో కుట్టబడ్డ వీటిని క్లింకర్ పద్ధతిలో తయారు చేసేవారు. నీరు లోపలికి ఇంకకుండా మట్టి తైలపు పూత పూసేవారు.
  • జంతు తోలూ, రెల్లు గడ్డితో చేసిన తోలు పడవలు రెండో రకము
  • తెడ్డు నౌకలు మూడో రకము. వీటిని చెక్క తెడ్లతో నడుపుతారు. కొన్నిసార్లు ఇవి రాదారి పడవలుగా వాడబడేవి—అనగా తీరం వెంబడి నడుస్తున్న జనాలూ, జంతువులచే ప్రవాహానికి ఎదురు లాగబడేవి.

వారసత్వం

[మార్చు]
సుమేరు పటము

ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల ప్రకారము చక్రవాహనాల వాడకము క్రీ.పూ 4 వ సహస్రాబ్ది మధ్యభాగములో మొదలైంది. దాదాపు ఒకేసారి మూడు వేర్వేరు సమాజాల్లో వీటి మొదటి వాడకము కనిపిస్తోంది. అవీ మిసొపొటేమ్యా, ఉత్తర కాకసస్ (మైకొప్ సంస్కృతి), మధ్య ఐరోపాలు. చక్రం కనుగొన్న మొదట్లో దాన్ని కుమ్మరి చక్రంగా వాడారు. నెమ్మదిగా వాహనాలకూ, కర్మాగారాలకూ దీని వాడకము విస్తరించింది. పరిష్కృత లిపుల్లో ఈజిప్టు గూఢచిత్ర లిపి తరువాత అతి పురాతనమైనది సుమేరు శరాకార లిపి (దానికంటే పురాతనమైన జియఖు గుర్తులు, ర్టరియా పలకలు వంటివాటిపై అనేక వివాదాలు ఉన్నాయి). సుమేరులు మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరు. వీరు నక్షత్రాలను నక్షత్ర సముదాయాలుగా విభజించారు. ఈ సముదాయాలలో చాలా వాటిని పురాతన గ్రీకులు కూడా గుర్తించారు. కొన్ని సముదాయాలు నేటి రాశి చక్రములో కూడా వాడుకలో ఉన్నాయి.[114][నమ్మదగని మూలం] కంటికి కనిపించే ఐదు గ్రహాల గురించి కూడా వారికి తెలుసు.[115]

వారు ఒక ప్రత్యామ్నాయ బేస్ 10, బేస్ 6 తో ఒక మిశ్రమ రేడిక్స్ వ్యవస్థతో సహా అనేక విభిన్న సంఖ్యా వ్యవస్థలను ఉపయోగించి అంకగణితం అభివృద్ధి చేసారు. సుమేరు, బాబిలోనియాలో ఈ సెక్స్మేసిమల్ సిస్టమ్ ప్రామాణిక సంఖ్యా వ్యవస్థగా మారింది. వీరు సైనిక నిర్మాణాలను (యుద్ధ వ్యూహాలను) కనుగొని ఉండవచ్చు. సైనికులను అంగాలుగా విభజించే పద్ధతిని కనుగొన్నారు. వీరి సైనిక అంగాలు: పదాతి, అశ్వికదళం, విలుకాండ్రు. వారు మొట్టమొదటిగా న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలను క్రోడీకరించి అభివృద్ధి చేశారు. వీరి వ్యవస్థ న్యాయస్థానాలు, కారాగారాలూ, ప్రభుత్వ కవిలెలతో సంపూర్ణంగా ఉండేది. మొట్టమొదటి నగర రాజ్యాలు సుమేరులో వెలిసాయి. ఐతే ఆధునిక సిరియా, లెబనన్ ప్రాంతాల్లో కూడా అదే సమయానికి నగర రాజ్యాల లాంటి వ్యవస్థలు ఏర్పడ్డాయి. శరాకార లిపి తయారుచేసాక కొన్ని శతాబ్దాల పాటు దాన్ని అప్పులూ, జమా ఖర్చుల లెక్కలకే వాడేవారు. నెమ్మదిగా సుమారు క్రీ.పూ. 2600 నాటికి సందేశాలు, వర్తమానాలు, చరిత్ర, కథలూ, గణితం, ఖగోళ విశేషాలూ, ఇతర విషయాలను లిపిని ఉపయోగించి నమోదు చేయడము మొదలైంది. వ్రాత సమాజములో వ్యాప్తి చెందడముతో, గ్రామ దేవాలయాల నిర్వహణలో మొట్టమొదటి బడులు ఏర్పడ్డాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

 

గమనికలు

[మార్చు]
  1. అనువాదము=సారవంతమైన నెలవంక. ఆ నేల నెలవంక ఆకారములో ఉన్నందున ఈ పేరు వచ్చినది
  2. ఇక్కడి 'ట' తెలుగు 'ట' కాదు. ఆంగ్ల 't'. అనుస్వారాన్ని తెలుగు 'ట' ముందే వాడాలి కనుక వ్యాకరణ సూత్రాలననుసరించి 'నకార పొల్లు' వాడటమైనది.
  3. కొన్ని అక్కడు మాండలికాల్లో షుమెరు గా పలికేవారు
  4. అక్షరలిపి గల తెలుగులో దీన్ని వ్రాస్తే సంగిగ్గ అయ్యేది
  5. ఇక్కడ 'ౘ'కి మహాప్రాణం రావాలి కానీ తెలుగులో ఆ అక్షరం లేదు
  6. ప్రధాన అర్చకురాలను అక్కడు భాషలో ఎన్టు అంటారు.
  7. హరశోఠంలో ఒక రకం. సుమేరు శిల్పాలలో వాడిన హరశోఠం చాలావరకూ ఇదే.[89]
  8. భారతీయ సీడరుకు తెలుగులో సమానార్థకము దేవదారు. కనుక లెబనన్ సీడరును తెలుగులో లెబనన్ దేవదారు అనుకోవచ్చు. ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు చెట్లు. అన్నీ కూడా చెక్కకు ప్రసిద్ధములే.
  9. సుమేరు విషయంలో దేవదారు ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని లబనన్ దేవదారుగా అర్థం చేసుకోవాలి. అలాగే ఆధునిక దేవదారు నూనె వలె దేవదారు నూనెకి దగ్గరగా ఉండే ఇతర చెట్ల నుండి తీసిన నూనె కాకుండా, ఆకాలంలో మేలు దేవదారు నూనెనే వాడేవారు.[93]
  10. ఈ నత్తల శాస్త్రీయ నామాలు Turbinella pyrum, Pleuroploca trapezium
  11. ఒనేజర్‌ను తెలుగులో అడవి గాడిద అనుకోవచ్చు. మన దేశంలో ఇవి గుజరాత్‌లో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Reade, Julian E. (2008). The Indus-Mesopotamia relationship reconsidered (Gs Elisabeth During Caspers). Archaeopress. pp. 12–14. ISBN 978-1-4073-0312-3.
  2. "Ancient Mesopotamia. Teaching materials". Oriental Institute in collaboration with Chicago Web Docent and eCUIP, The Digital Library. Archived from the original on 5 నవంబరు 2013. Retrieved 5 March 2015.
  3. "The Ubaid Period (5500–4000 B.C.)" In Heilbrunn Timeline of Art History. Department of Ancient Near Eastern Art. The Metropolitan Museum of Art, New York (October 2003)
  4. "Ubaid Culture", The British Museum
  5. ""Beyond the Ubaid", (Carter, Rober A. and Graham, Philip, eds.), University of Durham, April 2006" (PDF). Archived from the original (PDF) on 2014-03-21. Retrieved 2018-12-18.
  6. Arnaiz-Villena, Antonio; Martínez-Laso, Jorge; Gómez-Casado, Eduardo (2000). Prehistoric Iberia: Genetics, Anthropology, and Linguistics : [proceedings of an International Conference on Prehistoric Iberia : Genetics, Anthropology, and Linguistics, Held November 16–17, 1998, in Madrid, Spain]. Springer Science & Business Media. p. 22. ISBN 978-0-306-46364-8.
  7. 7.0 7.1 Lazaridis, I.; Nadel, D.; Rollefson, G. (2016). "Genomic insights into the origin of farming in the ancient Near East". Nature. 536 (7617): 419–424. Bibcode:2016Natur.536..419L. doi:10.1038/nature19310. PMC 5003663. PMID 27459054.
  8. "Craniometric analyses have suggested an affinity between the Natufians and populations of north or sub-Saharan Africa, a result that finds some support from Y chromosome analysis which shows that the Natufians and successor Levantine Neolithic populations carried haplogroup E, of likely ultimate African origin, which has not been detected in other ancient males from West Eurasia. However, no affinity of Natufians to sub-Saharan Africans is evident in our genome-wide analysis, as present-day sub-Saharan Africans do not share more alleles with Natufians than with other ancient Eurasians" (తెలుగు అనువాదము: కపాలమాపన విశ్లేషణల్లో నటూఫులకూ, ఉత్తర సహారా అలాగే సహారాకు దక్షిణాన ఉండే వారితో కూడా జన్యు సంబంధాలుండే అవకాశముందని తెలిసింది. పురుష వర్ణగ్రాహక విశ్లేషణలు కూడా నాటూఫులూ, వారి వారసులైన నవీన శిలా యుగపు లెవాంటు సమాజాల్లో ఆఫ్రికా సంతతికి చెందిన యుగ్మ వికల్పాలు ఉన్నట్లుగా తేల్చాయి. ఈ వికల్పములు పడమటి యురాసియుల్లో లేవు. కానీ మా విశ్లేషణల్లో సహారాకు దక్షిణాన ఉండే ఆధునిక ఆఫ్రికా వాసులకు, నాటూఫులతో ఇతర యురాసియులకంటే దగ్గరి జన్యు సంబంధములున్నాయనడానికి ఆధారాలేమీ లభించలేదు.) in Reich, David; Pinhasi, Ron; Patterson, Nick; Hovhannisyan, Nelli A.; Yengo, Loic; Wilson, James F.; Torroni, Antonio; Tönjes, Anke; Stumvoll, Michael (August 2016). "Genomic insights into the origin of farming in the ancient Near East". Nature. 536 (7617): 419–424. Bibcode:2016Natur.536..419L. doi:10.1038/nature19310. ISSN 1476-4687. PMC 5003663. PMID 27459054.
  9. Płoszaj, Tomasz; Chaubey, Gyaneshwer; Jędrychowska-Dańska, Krystyna; Tomczyk, Jacek; Witas, Henryk W. (11 September 2013). "mtDNA from the Early Bronze Age to the Roman Period Suggests a Genetic Link between the Indian Subcontinent and Mesopotamian Cradle of Civilization". PLOS ONE (in ఇంగ్లీష్). 8 (9): e73682. Bibcode:2013PLoSO...873682W. doi:10.1371/journal.pone.0073682. ISSN 1932-6203. PMC 3770703. PMID 24040024.
  10. "Sumerians had connections with the Caucasus". scientificrussia. Archived from the original on 2021-04-15.
  11. "Lexical Matches between Sumerian and Hurro-Urartian: Possible Historical Scenarios". Cuneiform Digital Library Journal. 2014.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. The Diversity of the Chechen culture: from historical roots to the present. UNESCO. 2009. p. 14. ISBN 978-5-904549-01-5.{{cite book}}: CS1 maint: url-status (link)
  13. 13.0 13.1 "Sumer (ancient region, Iraq)". Britannica Online Encyclopedia. Britannica.com. Retrieved 2012-03-29.
  14. Kleniewski, Nancy; Thomas, Alexander R (2010-03-26). Cities, Change, and Conflict: A Political Economy of Urban Life. ISBN 978-0495812227.
  15. Maisels, Charles Keith (1993). The Near East: Archaeology in the "Cradle of Civilization". ISBN 978-0415047425.
  16. Maisels, Charles Keith (2001). Early Civilizations of the Old World: The Formative Histories of Egypt, the Levant, Mesopotamia, India and China. ISBN 978-0415109765.
  17. Shaw, Ian; Jameson, Robert (2002). A dictionary of archaeology. ISBN 978-0631235835.
  18. Margarethe Uepermann (2007), "Structuring the Late Stone Age of Southeastern Arabia" (Arabian Archaeology and Epigraphy Arabian Archaeology and Epigraphy Volume 3, Issue 2, pp. 65–109)
  19. Hamblin, Dora Jane (May 1987). "Has the Garden of Eden been located at last?" (PDF). Smithsonian Magazine. 18 (2). Archived from the original (PDF) on 9 January 2014. Retrieved 8 January 2014.
  20. Deutscher, Guy (2007). Syntactic Change in Akkadian: The Evolution of Sentential Complementation. Oxford University Press US. pp. 20–21. ISBN 978-0199532223.
  21. 21.0 21.1 21.2 Leick, Gwendolyn (2003), "Mesopotamia, the Invention of the City" (Penguin)
  22. Foxvog, Daniel A. (2016). Elementary Sumerian Glossary (PDF). University of California at Berkeley. p. 52.
  23. 23.0 23.1 "The Pennsylvania Sumerian Dictionary: saĝgiga[humankind]". psd.museum.upenn.edu.
  24. 24.0 24.1 Diakonoff, I. M.; D'I︠A︡konov, Igor' Mik︠h︡aílovich (1991). Early Antiquity (in ఇంగ్లీష్). University of Chicago Press. p. 72. ISBN 978-0-226-14465-8.
  25. Feuerstein, Georg; Kak, Subhash; Frawley, David (2005). The Search of the Cradle of Civilization: New Light on Ancient India (in ఇంగ్లీష్) (Second Revised ed.). Motilal Banarsidass Publishers. p. 117. ISBN 978-81-208-2037-1.
  26. "emeĝir [SUMERIAN]". The Pennsylvania Sumerian Dictionary. University of Pennsylvania Museum of Anthropology and Archaeology. Retrieved 14 July 2021.
  27. 27.0 27.1 27.2 "The area in question (the extreme south of Mesopotamia) may now be called Sumer, and its inhabitants Sumerians, although these names are only English approximations of the Akkadian designations; the Sumerians themselves called their land Kengir, their language Emegir, and themselves Sag-giga, "black-headed ones. (అనువాదము: ఇక్కడ చర్చించబడుతున్న ఈ ప్రాంతమును (మిసొపొటేమ్యా దక్షిణ కొన) ఇక సుమేరని పిలవవచ్చు. అలాగే ఆ ప్రాంతపు వారిని సుమేరులుగా పిలవవచ్చు. ఐతే ఈ పేర్లు నాటి అక్కడు పదాలకు అంగ్లీకరణలు మాత్రమే. సుమేరులు తమ ప్రాంతాన్ని క్-ఎన్-గి-ర్ అనీ, తమ భాషను ఎమెగిర్ అనీ తమను తాము సఙ్-గి-గ, అనగా నల్ల తల గాళ్ళు అనీ పిలుచుకున్నారు)" in W. Hallo; W. Simpson (1971). The Ancient Near East. New York: Harcourt, Brace, Jovanovich. p. 29.
  28. Black, Jeremy A.; George, A. R.; Postgate, J. N.; Breckwoldt, Tina (2000). A Concise Dictionary of Akkadian (in ఇంగ్లీష్). Otto Harrassowitz Verlag. p. 384. ISBN 978-3-447-04264-2.
  29. Miller, Douglas B.; Shipp, R. Mark (1996). An Akkadian Handbook: Paradigms, Helps, Glossary, Logograms, and Sign List (in ఇంగ్లీష్). Eisenbrauns. p. 68. ISBN 978-0-931464-86-7.
  30. "The origin of the Sumerians is unknown; they described themselves as the 'black-headed people'" Haywood, John (2005). The Penguin Historical Atlas of Ancient Civilizations (in ఇంగ్లీష్). Penguin. p. 28. ISBN 978-0-14-101448-7.
  31. Diakonoff, I. M. (2013). Early Antiquity (in ఇంగ్లీష్). University of Chicago Press. p. 72. ISBN 978-0-226-14467-2.
  32. Finer, Samuel Edward; Finer, S. E. (1997). The History of Government from the Earliest Times: Ancient monarchies and empires (in ఇంగ్లీష్). Oxford University Press. p. 99. ISBN 978-0-19-820664-4.
  33. "I am the king of the four quarters, I am a shepherd, the pastor of the "black-headed people (అనువాదము: నేను నాలుగు పావులకూ రాజును, నేను గొల్లవాడను, నల్ల తలగల జనాలకు కాపరిని"" in Liverani, Mario (2013). The Ancient Near East: History, Society and Economy (in ఇంగ్లీష్). Routledge. p. 167. ISBN 978-1-134-75084-9.
  34. Toorn, Karel van der; Becking, Bob; Horst, Pieter Willem van der (1999). Dictionary of Deities and Demons in the Bible (in ఇంగ్లీష్). Wm. B. Eerdmans Publishing. p. 32. ISBN 978-0-8028-2491-2.
  35. Edzard, Dietz Otto (2003). Sumerian Grammar (in ఇంగ్లీష్). Brill. p. 1. ISBN 978-90-474-0340-1.
  36. 36.0 36.1 K. van der Toorn, P.W. van der Horst (Jan 1990). "Nimrod before and after the Bible". The Harvard Theological Review. 83 (1): 1–29. doi:10.1017/S0017816000005502.
  37. Crüsemann, Nicola; Ess, Margarete van; Hilgert, Markus; Salje, Beate; Potts, Timothy (2019). Uruk: First City of the Ancient World (in ఇంగ్లీష్). Getty Publications. p. 325. ISBN 978-1-60606-444-3.
  38. "The stepped design of the Pyramid of Zoser at Saqqara, the oldest known pyramid along the Nile, suggests that it was borrowed from the Mesopotamian ziggurat concept.(అనువాదము: నైలు నదీ తీరాన అత్యంత పురాతన పిరమిడ్ ఐన సక్కారాలోని జోసర్ పిరమిడ్ యొక్క శ్రేణీకృత (మెట్ల లాంటి) నిర్మాణ శైలికి మిసొపొటేమ్యా ౙిక్కుర్రట్‌ల నిర్మాణ శైలే ఆధారమయ్యుండొచ్చు.)" in Held, Colbert C. (University of Nebraska) (2018). Middle East Patterns, Student Economy Edition: Places, People, and Politics (in ఇంగ్లీష్). Routledge. p. 63. ISBN 978-0-429-96199-1.
  39. Samuels, Charlie (2010). Ancient Science (Prehistory – A.D. 500): Prehistory-A.D. 500 (in ఇంగ్లీష్). Gareth Stevens Publishing LLLP. p. 23. ISBN 978-1-4339-4137-5.
  40. 40.0 40.1 Potts, D. T. (1999). The Archaeology of Elam: Formation and Transformation of an Ancient Iranian State. Cambridge University Press. p. 104. ISBN 978-0-521-56496-0.
  41. 41.0 41.1 Nigro, Lorenzo (1998). "The Two Steles of Sargon: Iconology and Visual Propaganda at the Beginning of Royal Akkadian Relief". Iraq. 60. British Institute for the Study of Iraq: 85–102. doi:10.2307/4200454. JSTOR 4200454.
  42. Stanley A. Freed, Research Pitfalls as a Result of the Restoration of Museum Specimens, Annals of the New York Academy of Sciences, Volume 376, The Research Potential of Anthropological Museum Collections pp. 229–245, December 1981.
  43. 43.0 43.1 Wolkstein, Diane; Kramer, Samuel Noah (1983). Inanna: Queen of Heaven and Earth: Her Stories and Hymns from Sumer. New York: Harper & Row. ISBN 978-0060147136.
  44. Elizabeth F. Henrickson; Ingolf Thuesen; I. Thuesen (1989). Upon this Foundation: The N̜baid Reconsidered : Proceedings from the U̜baid Symposium, Elsinore, May 30th-June 1st 1988. p. 353. ISBN 978-8772890708.
  45. Jean-Jacques Glassner (2003). The Invention of Cuneiform: Writing in Sumer. p. 31. ISBN 978-0801873898.
  46. 46.0 46.1 Algaze, Guillermo (2005). The Uruk World System: The Dynamics of Expansion of Early Mesopotamian Civilization, Second Edition, University of Chicago Press.
  47. 47.0 47.1 Jacobsen, Thorkild (Ed) (1939),"The Sumerian King List" (Oriental Institute of the University of Chicago; Assyriological Studies, No. 11., 1939)
  48. Lamb, Hubert H. (1995). Climate, History, and the Modern World. London: Routledge. ISBN 0415127351
  49. Jacobsen, Thorkild (1976), "The Harps that Once...; Sumerian Poetry in Translation" and "Treasures of Darkness: a history of Mesopotamian Religion"
  50. George, Andrew (Translator)(2003), "The Epic of Gilgamesh" (Penguin Classics)
  51. 51.0 51.1 Roux, Georges (1993). Ancient Iraq. Harmondsworth: Penguin. ISBN 978-0140125238.
  52. Toward the Image of Tammuz and Other Essays on Mesopotamian History and Culture by T. Jacobsen
  53. Cooper, Jerrold S. (2016). "Sumerian literature and Sumerian identity". Problems of canonicity and identity formation in ancient Egypt and Mesopotamia. Kim Ryholt, Gojko Barjamovic, Københavns universitet, Denmark) Problems of Canonicity and Identity Formation in Ancient Egypt and Mesopotamia (2010 : Copenhagen, Denmark) Literature and Identity Formation (2010 : Copenhagen. Copenhagen. pp. 1–18. ISBN 978-87-635-4372-9. OCLC 944087535.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  54. Jacobsen T, Adams RM. (1958). "Salt and Silt in Ancient Mesopotamian Agriculture: Progressive changes in soil salinity and sedimentation contributed to the breakup of past civilizations". Science. 128 (3334): 1251–8. doi:10.1126/science.128.3334.1251..
  55. Thompson, William R. (2004). "Complexity, Diminishing Marginal Returns and Serial Mesopotamian Fragmentation" (PDF). Journal of World Systems Research. 10 (3): 612–652. doi:10.5195/jwsr.2004.288. Archived from the original on February 19, 2012.{{cite journal}}: CS1 maint: unfit URL (link)
  56. Harmansah, Ömür, The Archaeology of Mesopotamia: Ceremonial centers, urbanization and state formation in Southern Mesopotamia, 2007, p.699
  57. Colin McEvedy and Richard Jones, 1978, Atlas of World Population History, Facts on File, New York, ISBN 0713910313.
  58. Karen Rhea Nemet-Nejat (1998). Daily life in ancient Mesopotamia. Greenwood Publishing Group. p. 13. ISBN 978-0313294976. Retrieved 29 November 2011.
  59. "Has the Garden of Eden been located at last?". Archived from the original on 2005-10-29. Retrieved 2018-12-21.
  60. 60.0 60.1 60.2 Sayce, Rev. A. H. (1908). The Archaeology of the Cuneiform Inscriptions (2nd revised ed.). London, Brighton, New York: Society for Promoting Christian Knowledge. pp. 98–100.
  61. Goss, Clint (15 April 2017). "Flutes of Gilgamesh and Ancient Mesopotamia". Flutopedia. Retrieved 14 June 2017.
  62. Gender and the Journal: Diaries and Academic Discourse p. 62 by Cinthia Gannett, 1992
  63. 63.0 63.1 63.2 63.3 Kramer, Samuel Noah (1963). The Sumerians: Their History, Culture, and Character. The Univ. of Chicago Press. ISBN 978-0-226-45238-8.
  64. 64.0 64.1 64.2 Nemet-Nejat, Karen Rhea (1998), Daily Life in Ancient Mesopotamia, Daily Life, Greenwood, p. 132, ISBN 978-0-313-29497-6
  65. Celibacy in the Ancient World: Its Ideal and Practice in Pre-Hellenistic Israel, Mesopotamia, and Greece by Dale Launderville, p. 28
  66. 66.0 66.1 66.2 Cooper, Jerrold S. (2001). "Virginity in Ancient Mesopotamia". Sex and Gender in the Ancient Near East: Proceedings of the 47th Rencontre Assyriologique Internationale, Helsinki (PDF). Baltimore, Maryland: Johns Hopkins University Press. ISBN 978-951-45-9054-2.
  67. 67.0 67.1 67.2 67.3 67.4 67.5 Dening, Sarah (1996). "Chapter 3: Sex in Ancient Civilizations". The Mythology of Sex. London: Macmillan. ISBN 978-0-02-861207-2.
  68. 68.0 68.1 Leick, Gwendolyn (2013) [1994], Sex and Eroticism in Mesopotamian Literature, New York: Routledge, p. 219, ISBN 978-1-134-92074-7
  69. Barraclough, Geoffrey; Stone, Norman (1989). The Times Atlas of World History. Hammond Incorporated. p. 53. ISBN 978-0-7230-0304-5.
  70. Senner, Wayne M. (1991). The Origins of Writing. University of Nebraska Press. p. 77. ISBN 978-0-8032-9167-6.
  71. Allan, Keith (2013). The Oxford Handbook of the History of Linguistics. Oxford: Oxford University Press. pp. 56–57. ISBN 978-0191643439.
  72. Woods C. 2006 “Bilingualism, Scribal Learning, and the Death of Sumerian” Archived 2013-04-29 at the Wayback Machine. In S.L. Sanders (ed) Margins of Writing, Origins of Culture: 91–120 Chicago
  73. Campbell, Lyle; Mauricio J. Mixco (2007). A glossary of historical linguistics. Edinburgh University Press. p. 196. ISBN 978-0748623792.
  74. 74.0 74.1 Coleman, J.A.; Davidson, George (2015), The Dictionary of Mythology: An A–Z of Themes, Legends, and Heroes, London, England: Arcturus Publishing Limited, ISBN 978-1784044787
  75. Kramer, Samuel Noah (1983), "The Sumerian Deluge Myth: Reviewed and Revised", Anatolian Studies, 33: 115–121, doi:10.2307/3642699, JSTOR 3642699
  76. Black, Jeremy A.; Cunningham, Graham; Robson, Eleanor (2006), The Literature of Ancient Sumer, Oxford University Press, ISBN 978-0199296330
  77. 77.0 77.1 Black, Jeremy; Green, Anthony (1992), Gods, Demons and Symbols of Ancient Mesopotamia: An Illustrated Dictionary, University of Texas Press, ISBN 0-292-70794-0
  78. Black, Jeremy; Green, Anthony (1992). Gods, Demons, and Symbols of Ancient Mesopotamia: An Illustrated Dictionary. University of Texas Press. ISBN 978-0292707948.
  79. Geoffrey Bibby and Carl Phillips, Looking for Dilmun (London: Stacey International, 1996; reprinted London: Knopf, 2013). ISBN 978-0-905743-90-5
  80. Leick, Gwendolyn (2003), Mesopotamia: The Invention of the City' (Penguin)
  81. Mark M. Jarzombek and Vikramaditya Prakash, A Global History of Architecture (London: Wiley, 2011), 33–39. ISBN 978-0-470-90248-6
  82. Crawford, Harriet (1993), "Sumer and the Sumerians" (Cambridge University Press, (New York 1993)), ISBN 0521388503.
  83. Bibby Geoffrey and Carl Phillips (2013), "Looking for Dilmun" (Alfred A. Knopf)
  84. Gately, Iain (2008). Drink: A Cultural History of Alcohol. Gotham Books. p. 5. ISBN 978-1592403035.
  85. Mackenzie, Donald Alexander (1927). Footprints of Early Man. Blackie & Son Limited.
  86. Adams, R. McC. (1981). Heartland of Cities. University of Chicago Press.
  87. Tannahill, Reay (1968). The fine art of food. Folio Society.[page needed]
  88. By the sweat of thy brow: Work in the Western world, Melvin Kranzberg, Joseph Gies, Putnam, 1975
  89. Page name: Gypsum: Uses: Modeling, sculpture and art . Author: Wikipedia contributors. Publisher: Wikipedia, The Free Encyclopedia. Date of last revision: 29 July 2022 15:59 UTC. Date retrieved: 19 August 2022 11:47 UTC. Permanent link: https://en.wikipedia.org/w/index.php?title=Gypsum&oldid=1101156513 Primary contributors: revision history statistics. Page Version ID: 1101156513
  90. Duncan J. Melville (2003). Third Millennium Chronology Archived 2018-07-07 at the Wayback Machine, Third Millennium Mathematics. St. Lawrence University.
  91. Ifrah, Georges (2001), The Universal History of Computing: From the Abacus to the Quantum Computer, New York: John Wiley & Sons, ISBN 0-471-39671-0
  92. Anderson, Marlow; Wilson, Robin J. (2004). Sherlock Holmes in Babylon: and other tales of mathematical history. ISBN 978-0883855461. Retrieved 2012-03-29.
  93. Page name: Cedar oil: Sources and characteristics. Author: Wikipedia contributors. Publisher: Wikipedia, The Free Encyclopedia. Date of last revision: 1 June 2022 15:34 UTC. Date retrieved: 19 August 2022 10:46 UTC. Permanent link: https://en.wikipedia.org/w/index.php?title=Cedar_oil&oldid=1090992335. Primary contributors: revision history statistics. Page Version ID: 1090992335.
  94. Diplomacy by design: Luxury arts and an "international style" in the ancient Near East, 1400–1200 BC, Marian H. Feldman, University of Chicago Press, 2006, pp. 120–121
  95. 95.0 95.1 British Museum notice: "Gold and carnelians beads. The two beads etched with patterns in white were probably imported from the Indus Valley. They were made by a technique developed by the Harappan civilization" (అనువాదం: బ్రిటిష్ సంగ్రహశాల ఉత్తర్వు: "బంగారమూ, కార్నీల్యన్ పూసలూ. తెల్లటి ఆకృతులతో నిక్షరితం చేయబడ్డ ఆ రెండు పూసలనూ బహుశా సింధూ లోయ నుండి దిగుమతి చేసుకుని ఉండవచ్చు. ఈ ఆకృతులు సింధూ నాగరిక వాసులు తయారు చేసిన పద్ధతితో గీయబడ్డాయి.) Photograph of the necklace in question
  96. Reade, Julian E. (2008). The Indus-Mesopotamia relationship reconsidered (Gs Elisabeth During Caspers). Archaeopress. pp. 14–17. ISBN 978-1-4073-0312-3.
  97. Gensheimer, T. R. (1984). "The Role of shell in Mesopotamia : evidence for trade exchange with Oman and the Indus Valley". Paléorient. 10: 71–72. doi:10.3406/paleo.1984.4350.
  98. 98.0 98.1 98.2 98.3 McIntosh, Jane (2008). The Ancient Indus Valley: New Perspectives. ABC-CLIO. pp. 182–190. ISBN 978-1-57607-907-2.
  99. నిక్షారణ పద్ధతి వివరాలకు MacKay, Ernest (1925). "Sumerian Connexions with Ancient India". The Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland (4): 699. JSTOR 25220818. చూడండి
  100. Guimet, Musée (2016). Les Cités oubliées de l'Indus: Archéologie du Pakistan (in ఫ్రెంచ్). FeniXX réédition numérique. p. 355. ISBN 978-2-402-05246-7.
  101. Demand, Nancy H. (2011). The Mediterranean Context of Early Greek History. John Wiley & Sons. pp. 71–72. ISBN 978-1-4443-4234-5.
  102. Rowlands, Michael J. (1987). Centre and Periphery in the Ancient World. Cambridge University Press. p. 37. ISBN 978-0-521-25103-7.
  103. మిసొపొటేమ్యాలో దొరికిన సింధూ లోయ ముద్రల పూర్తి జాబితా కొరకు Reade, Julian (2013). Indian Ocean In Antiquity. Routledge. pp. 148–152. ISBN 978-1-136-15531-4.చూడండి
  104. ఇంకో మిసొపొటేమ్యాలో దొరికిన సింధూ లోయ ముద్రల జాబితా: Possehl, Gregory L. (2002). The Indus Civilization: A Contemporary Perspective. Rowman Altamira. p. 221. ISBN 978-0-7591-0172-2.
  105. "Indus stamp-seal found in Ur BM 122187". British Museum.
    "Indus stamp-seal discovered in Ur BM 123208". British Museum.
    "Indus stamp-seal discovered in Ur BM 120228". British Museum.
  106. Gadd, G. J. (1958). Seals of Ancient Indian style found at Ur.
  107. Podany, Amanda H. (2012). Brotherhood of Kings: How International Relations Shaped the Ancient Near East. Oxford University Press. p. 49. ISBN 978-0-19-971829-0.
  108. Joan Aruz; Ronald Wallenfels (2003). Art of the First Cities: The Third Millennium B.C. from the Mediterranean to the Indus. p. 246. ISBN 978-1-58839-043-1. Square-shaped Indus seals of fired steatite have been found at a few sites in Mesopotamia. [చతురస్రాకృతిలోనున్న కాల్చిన బలపపురాతి సింధూ లోయ ముద్రలు మిసొపొటేమ్యాలో కొన్ని చోట్ల దొరికాయి]
  109. Cotterell, Arthur (2011). Asia: A Concise History. John Wiley & Sons. p. 42. ISBN 978-0-470-82959-2.
  110. 110.0 110.1 110.2 110.3 Hudson, Michael (1998). Michael Hudson and Marc Van De Mieroop (ed.). Debt and Economic Renewal in the Ancient Near East. Bethesda, Maryland: CDL. pp. 23–35. ISBN 978-1883053710.
  111. Van De Mieroop, Marc (1998). Michael Hudson and Marc Van De Mieroop (ed.). Debt and Economic Renewal in the Ancient Near East. Bethesda, Maryland: CDL. p. 63. ISBN 978-1883053710.
  112. Roux, Georges (1992), "Ancient Iraq" (Penguin)
  113. Winter, Irene J. (1985). "After the Battle is Over: The 'Stele of the Vultures' and the Beginning of Historical Narrative in the Art of the Ancient Near East". In Kessler, Herbert L.; Simpson, Marianna Shreve. Pictorial Narrative in Antiquity and the Middle Ages. Center for Advanced Study in the Visual Arts, Symposium Series IV 16. Washington, DC: National Gallery of Art. pp. 11–32. ISSN 0091-7338
  114. Gary Thompson. "History of Constellation and Star Names". Members.optusnet.com.au. Archived from the original on 2012-08-21. Retrieved 2012-03-29.
  115. "Sumerian Questions and Answers". Sumerian.org. Archived from the original on 2012-04-14. Retrieved 2012-03-29.

మరింత సమాచారము కోసము

[మార్చు]
  • Ascalone, Enrico. 2007. Mesopotamia: Assyrians, Sumerians, Babylonians (Dictionaries of Civilizations; 1). Berkeley: University of California Press. ISBN 0-520-25266-7 (paperback).
  • Bottéro, Jean, André Finet, Bertrand Lafont, and George Roux. 2001. Everyday Life in Ancient Mesopotamia. Edinburgh: Edinburgh University Press, Baltimore: Johns Hopkins University Press.
  • Crawford, Harriet E. W. 2004. Sumer and the Sumerians. Cambridge: Cambridge University Press.
  • Leick, Gwendolyn. 2002. Mesopotamia: Invention of the City. London and New York: Penguin.
  • Lloyd, Seton. 1978. The Archaeology of Mesopotamia: From the Old Stone Age to the Persian Conquest. London: Thames and Hudson.
  • Nemet-Nejat, Karen Rhea. 1998. Daily Life in Ancient Mesopotamia. London and Westport, Conn.: Greenwood Press.
  • Kramer, Samuel Noah (1972). Sumerian Mythology: A Study of Spiritual and Literary Achievement in the Third Millennium B.C. (Rev. ed.). Philadelphia: University of Pennsylvania Press. ISBN 978-0-8122-1047-7.
  • Roux, Georges. 1992. Ancient Iraq, 560 pages. London: Penguin (earlier printings may have different pagination: 1966, 480 pages, Pelican; 1964, 431 pages, London: Allen and Urwin).
  • Schomp, Virginia. Ancient Mesopotamia: The Sumerians, Babylonians, and Assyrians.
  • Sumer: Cities of Eden (Timelife Lost Civilizations). Alexandria, VA: Time-Life Books, 1993 (hardcover, ISBN 0-8094-9887-1).
  • Woolley, C. Leonard. 1929. The Sumerians. Oxford: Clarendon Press.

వెలుపలి లంకెలు

[మార్చు]
భౌగోళిక విశేషాలు
భాష
  • Sumerian Language Page, 1996లో మొదలైన ఈ లంకె బహుశా సుమేరుపై ఉన్న లంకెల్లో మొదటిది అయ్యుండొచ్చు. పదకోశం, ప్రాథమిక సమాచారం వంటి వాటితో సమగ్రంగా ఉంటుంది ఇది.
  • ETCSL: The Electronic Text Corpus of Sumerian Literature Archived 2019-05-02 at the Wayback Machine 400 పైగా సుమేరు గ్రంథాలకు పూర్తి స్థాయి అనువాదాలు ఉన్నాయి ఈ లంకెలో.
  • PSD: The Pennsylvania Sumerian Dictionary, నిఘంటువు.
  • CDLI: Cuneiform Digital Library Initiative Archived 2021-05-05 at the Wayback Machine, రోమనీకరించి, బొమ్మలు జతచేయబడ్డ అనేక సుమేరు గ్రంథాలున్న లంకె. ఎక్కువగా ఆదివంశపు కాలం, మూడవ ఉర్ కాలం నాటి గ్రంథాలున్నవి.

32°N 46°E / 32°N 46°E / 32; 46