Jump to content

సుందర కాండ

వికీపీడియా నుండి

సుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడ ను మునికి తెలియజేయడం ఇందులో ముఖ్యాంశాలు.

సుందరకాండములోని కొన్ని ఘట్టాలు - 1800 కాలం నాటి చిత్రం - ఇందులో సాగర లంఘనం, సీతా దర్శనం, లంకా దహనం చిత్రీకరింపబడినాయి

సుందరకాండ పేరు

[మార్చు]

వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబంధించిన పేర్లు పెట్టాడు. కాని సుందరకాండకు "సుందరకాండ" అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది.

సుందరే సుందరో రామ:
సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది?

అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.

మరొక అభిప్రాయం: "హనుమంతుడు" (వజ్రాయుధం వల్ల హనుమ, అనగా దవడ, కు దెబ్బ తగిలినవాడు), ఆంజనేయుడు (అంజనా దేవి కుమారుడు), మారుతి (వాయుదేవుని కొడుకు) వంటి పేర్లు హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు "సుందరుడు" అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టాడని అంటారు.

గుంటూరు శేషేంద్ర శర్మ రచన షోడశి - రామాయణ రహస్యములు అనే పుస్తకం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ ఇలా రాశాడు - "రామాయణమునందు తక్కిన కాండలకు తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి విడిగా "సుందరకాండము" అను పేరు ఏల .. అను సంశయము పలుమందికి ఉంది. నేను సుమారు ముప్పది యేండ్లక్రింద కీ.శే. శ్రీ కాశీకృష్ణాచార్యులవారిని ఈ ప్రశ్న అడిగితిని. సుందర హనుమన్మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించుట వలన ఆ పేరు వచ్చినది అని చెప్పిరి."” [1]

అయితే ఆ షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్రశర్మ, పై వాదనలతో ఏకీభవించలేదు. "శ్రీ సుందరకాండకు ఆ పేరెట్లు వచ్చినది?" అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం - సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధములో వసించును. కనుక ఇది సుందరకాండము. ఆది శంకరుని ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము సౌందర్య లహరిలోని "సౌందర్య" పదము ఈ భావములోనే వాడబడింది. బ్రహ్మాండ పురాణములో ఈ కాండము "సౌందర్య కాండము" అనియే చెప్పబడింది.[1]హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగా........

....                                                          - వాడ్రేవు చినవీరభద్రుడు
                                   -------------

MARCH 2, 2024BY VADREVU CH VEERABHADRUDU సమాశ్వాస సౌందర్య గాథ

మొన్న ఒక రోజు కూచుని మొత్తం సుందరకాండ మరోసారి చదివేను. మనశ్శాంతికోరుకునేవారు, తాము తలపెట్టిన పనుల్లో విజయం సిద్ధించాలనుకునేవాళ్ళూ, తమ మనసుని నిర్మలం చేసుకోవాలనుకునేవాళ్ళూ, తమ ఆత్మని ఒక ఔన్నత్యం వైపుగా తీసుకుపోవాలనుకునేవాళ్ళూ, సుందరకాండ పారాయణం చెయ్యడం ఈ దేశంలో తరతరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. 68 సర్గల ఆ కాండ దానికదే ఒక కావ్యంగా, పవిత్రగ్రంథంగా, రామాయణసారంగా పరిగణనకు నోచుకుంది. మహాభారతం నుంచి విడివడి భగవద్గీత ఎలా ఒక ఆధ్యాత్మిక, యోగవిద్యాగ్రంథంగా గుర్తింపు పొందిందో, సుందరకాండ కూడా రామాయణంతో సమానంగా గౌరవం పొందిందని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు.

కాని ఆ కాండ చదివిన ప్రతి ఒక్క పాఠకుడికీ ఒకే రకమైన అనుభూతి సిద్ధిస్తుందని చెప్పలేం. గుంటూరు శేషేంద్ర శర్మకి ఆ కాండ మొత్తం శ్రీవిద్యాసారంగా కనిపించింది. సీతమ్మవారు శ్రీవిద్యగానూ, హనుమంతుడు ఒక శ్రీవిద్యోపాసకుడిగానూ ఆయనకు కనబడ్డారు. తనకి కలిగిన దర్శనాన్ని ఆయన ‘షోడశి,రామాయణ రహస్యాలు’ అనే పుస్తకంగా రాసారు కూడా. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ సుందరకాండను శేషేంద్ర చదివినపద్ధతి చూసి నిలువెల్లా చకితుడైపోయాడు కూడా. షోడశిలో గొప్ప విషయమేమిటంటే, శేషేంద్ర తన దర్శనం మొత్తాన్ని వాల్మీకి శ్లోకాల ఆధారంగానే వివరించడం. ఎక్కడా ఒక్క మాట, ఒక్క భావన శేషేంద్ర అదనంగా చెప్తున్నట్టు ఉండదు. చూడబోతే షోడశి చదివాకనే వాల్మీకి సుందరకాండ రాసాడా అనిపిస్తుంది మనకి! www.facebook.com/shodasi/

సుందరకాండ సంక్షిప్త కథ

[మార్చు]

కిష్కింధ కాండ చివరిలో సీతాన్వేషణానికై దక్షిణదిశకు బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకొంటారు. నూరు యోజనాల అవతల రావణుని నగరం లంకలో సీత ఉండవచ్చునని సంపాతి ద్వారా తెలుసుకొంటారు. కాని సాగర తరణం సాధ్యమయ్యేది ఎలాగని హతాశులౌతారు. జాంబవంతుని ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదం లాగా లంఘించగలనని హనుమంతుడు సన్నద్ధుడౌతాడు. అక్కడినుండి సుందరకాండ కథ మొదలౌతుంది.

హనుమంతుని సాగర తరణ

[మార్చు]
నాగమాత సురసతో మాట్లాడుతున్న హనుమంతుడు - 17వ శతాబ్దం నాటి చిత్రం

హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి, సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు. సూర్యునికి, ఇంద్రునికి, బ్రహ్మకు, భూతకోటికి నమస్కరించాడు. పిక్కలు బిగబట్టి, చేతులు అదిమి, ఒక్కుదుటున లంఘించాడు. అ అదురుకు పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడచిన రామబాణంలా, హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్ళసాగాడు.

రామ కార్యానికి సహాయపడదలచి, దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రాంతి తీసికోమని కోరాడు. ఆ ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి హనుమంతుడు ముందుకు సాగాడు. సురస అనే నాగమాత హనుమను పరీక్షింపదలచి, మృత్యుగహ్వరంలాంటి తన నోరు తెరచి అతని దారికి అడ్డు నిలచింది. యుక్తిగా ఆమె నోట ప్రవేశించి, మళ్ళీ బయటకు వచ్చి, ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగాడు. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి, కడుపును చీల్చి వేసి, అప్రతిహతంమైన రామబాణంలా లంకలోని త్రికూటగిరి శిఖరంపై వాలాడు.

లంకా నగర ప్రవేశం

[మార్చు]

దూరంనుండి లంకానగరం శోభను, సౌందర్యాన్ని, సురక్షిత వ్యవస్థను చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. చీకటి పడిన తరువాత చిన్నపాటి దేహం దాల్చి నగరంలో ప్రవేశించబోయాడు. ద్వారం వద్ద లంకా నగరాధిదేవత లంకిణి అతనిని అడ్డగించింది. హనుమంతుడు ఆమెను దండించాడు. అతడు కారణజన్ముడనీ, బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లనుందనీ లంకిణి గ్రహించింది. ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని లంఘించి, ఎడమ కాలు ముందుంచి, హనుమంతుడు మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెతుకసాగాడు. ఆ సమయంలో చంద్రోదయం జరిగి, లంకానగరం మరింత శోభాయమానం అయింది.

అంతఃపురంలో సీతాన్వేషణ

[మార్చు]

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెతికాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టం లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు. దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించవలెనని ప్రార్థించి సీతాన్వేషణకై అశోకవనంలో అడుగుపెట్టాడు.

అశోకవనంలో సీతమ్మ దర్శనం

[మార్చు]
అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు

అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రములైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. మణిమయాలైన సరస్సులున్నాయి. అద్భుతమైన చైత్య ప్రాసాదములున్నాయి. వాటిలో అతి మనోహరమైన ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు.

అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన ఒక స్త్రీని చూచాడు. ఆమె ఏకవస్త్రయై, ధూమావృతమైన అగ్ని శిఖవలె, మిధ్యాపవాదువలన భంగపడిన కీర్తివలె, మేఘాచ్ఛాదితమైన చంద్రబింబంవలె ఉంది. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.

త్రిజటాస్వప్నం

[మార్చు]
అశోకవనంలో సీతను రావణుడు బెదిరించడం - 16వ శతాబ్దం నాటి చిత్రం

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పము అతనికి కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమగుట తథ్యమని రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.

వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -

అశోక వనములో ఉన్న సీతకు ఆహారాన్ని అందిస్తున్న ఇంద్రుడు

"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.

"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుంన్నది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము త్రాగుచు, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు."

ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

శ్రీరామ వర్ణన

[మార్చు]
సీత హనుమంతునికి చూడామణిని ఇచ్చుట

చెట్టుపైనుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంక ఆలస్యము చేసినచో సీత ప్రాణత్యాగము చేయగలదని ఊహించాడు. కాని ఒక్కమారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె ఖంగారుపడి కేకలు వేయవచ్చనీ, అలాగయితే అసలు పని చెడుతుందని భావించాడు. చెట్టుపైనుండి మెల్లగా దశరథ కుమారుడైన రాముని కథ చెప్పనారంభించాడు. ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. "రాముడు ఆజానుబాహుడు. కమల పత్రాక్షుడు. రూప దాక్షిణ్య సంపన్నుడు. శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మ రక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు. సమ విభక్తములైన శరీరాంగములు కలవాడు. దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠము, కండరములతో మూసుకొనిఫోయిన సంధి యెముకలు కలవాడు. మూడు దృఢమైన స్థానములు, మూడు దైర్ఘ్యముగల అవయవములు, మూడు సమ అవయవములు, మూడు ఎఱ్ఱని ఆవయవములు కలవాడు. పదునాలుగు సమమైన అవయవములు కలవాడు. నాలుగు విధములైన నడక గలవాడు. ఉత్తముడు, వీరుడు. నల్లనివాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు - అట్టి రామలక్ష్మణులు నీకై పరితపించుచున్నారు. సుగ్రీవునితో చెలిమి జేసి, నిన్ను వెదులుటకై నలు తెరగుల వానరులను పంపియున్నారు. ఓ సీతా దేవీ! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచటనుండి తీసికొని పోనున్నాడు" - అని హనుమంతుడు చెప్పాడు.


హనుమంతుడికి చూడామణిని ఇస్తున్న సీత

శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని కోరాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. సీత హనుమంతునితో రామునికి కొన్ని గుఱుతులు చెప్పమని కాకాసుర వృత్తాంతమును చెబుతుంది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఆ మహాంబుధిని దాటడం (హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్ప) ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.

అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి (యుద్ధానికి కాదు) పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి సూర్య చంద్రుల వలె, అగ్ని వాయువులవలె లంకను నాశణం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.

రాక్షసులను దండించడం

[మార్చు]
అశోక వనములో రాక్షసులతో ఘర్షణ పడుతున్న హనుమంతుడు

సీతా దర్శనంతో సంతుష్టుడైన హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుంది. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చును. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ ధ్వంసం చేసి మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.

ఆ కపిని బంధించమని రావణుడు ఎనుబదివేల మంది సైన్యాన్ని పంపాడు. హనుమంతుడు - జయత్యతిబలో రామో, లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య, రామస్యా క్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః అని జయఘోష చేశాడు - మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదము యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.

అప్పుడు రావణుడు, ప్రహస్తుని కుమారుడు మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అఱచేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా యుద్ధ భూమి అంతా శత్రువుల రక్త మాంసాలు చెల్లాచెదరయ్యాయి. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేత నిహతులైపోయారు. రణ భూమి అంతా రాక్షస, వాహన కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.

హముమంతుని బంధించి తీసుకు వెళుతున్న ఇంద్రజిత్తు

ఇక దుర్ధరమైన ప్రతాపశాలి, వర సంపన్నుడు, గొప్ప రథము కలవాడును అయిన అక్షకుమారుడు సకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది. వర్షంలాంటి అక్షకుమారుని బాణాలు హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుజ్జునుజ్జయ్యింది.

ఈ సంగతి తెలిసిన రావణుడు కలవరపడి, పెక్కు జాగ్రత్తలు చెప్పి, ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడూను. అతడు తండ్రికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా నటించాడు. ఆ విధంగా రావణునితో సంభాషించ దలచాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి, బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయారు.

రావణునితో సంవాదం

[మార్చు]
హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం.

బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలో ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలియు, వీరుడును ఐన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచు, అనేక కౄర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’

హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఎవరు పంపారు? - తెలిసికోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుని మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతుంది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకు, లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు. అంతే కాకుండా ఇతను తిరిగి వెళ్ళకపోతే నీను శతృవులతో యుద్ధం చేసి వారిని నిర్జించే అవకాశం కోల్పోతావు. కనుక, దండించి వదలమని సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి వూరంతా త్రిప్పమని ఆనతిచ్చాడు.

లంకా దహనం

[మార్చు]
మండుచున్నలంకను చూచుచున్న హనుమంతుడు

రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయ సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గి చేశాడు.

అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న ఊహతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతను దర్శించి, ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో రాగలడని అభయం పలికాడు. ఆమెకు ప్రణమిల్లి, తిరిగి ఉత్తరదిశకు బయలుదేరాడు.

ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకను భయభ్రాంతమొనర్చి, రావణుని మదమణచి, సీతకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.

తిరుగు లంఘనం

[మార్చు]
లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. - "కనుగొంటిని సీతమ్మను; ఆమె రాక్షసుల బంధీయై, రాముని కొరకు ఎదురు చూచుచు కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న మాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.

ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించుట సరైనపని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.

మధువనం

[మార్చు]
మదువనములో గొడవ చేయుచున్న వానరులు

సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని పరివేష్టించి కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ, మత్తెక్కి పిచ్చిగా ఆడుతూ వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.

సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.

రామునకు సీత జాడ తెలుపుట

[మార్చు]

అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. దృష్టా దేవీ (చూచాను సీతను) అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.

ఓ రామా! సీతామాత ఏకవేణియై, రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక మాసము లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.

(యుద్ధకాండము - మొదటి సర్గము నుండి) - హనుమంతున మాటలు విని శ్రీరాముడు ప్రసన్నుడై ఇట్లు పలికెను. "హనుమంతుడొనర్చిన ఘన కార్యములు లోకములోనే అత్యద్భుతములైనవి. ఊహకు అందనివి. అనితర సాధ్యములు. హనుమంతునితో సమానుడైన తేజోబల సంపన్నుడు ఎవ్వడును లేడు. దుష్కరమైన ప్రభుకార్యములను సాదించుటయే గాక, దానికి భంగము కలుగకుండ, తదనురూపములైన ఇతర కార్యములను కూడ సాధించు సేవకుడు అత్యుత్తముడు. ఈ కార్య సాధన ద్వారా హనుమంతుడు మాయందరి ప్రాణములను కాపాడినాడు. నాకిట్టి మహోపకారమొనర్చిన హనుమంతునకు తగిన ప్రత్యుపకారము చేయలేని దీనుడనై యున్నాను. గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఈయగలను. ప్రస్తుతము నేనీయగలిగిన నా సర్వస్వమిదియే", అని శ్రీరాముడు పులకిత గాత్రుడై తాను అప్పగించిన కార్యమును సాఫల్యమొనర్చి, పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుని తన హృదయమునకు హత్తుకొనెను.

(ఆధ్యాత్మ రామాయణము: శ్రీరాముని పాదపద్మములను తులసీ దళాదులతో పూజించినవారు సాటిలేని పరమపదమును పొందెదరు. అట్టి శ్రీరామ చంద్రుడే పుణ్యముల రాశియైన హనుమంతుని అనుగ్రహించి, స్వయముగా ఆయనకు తన ఆలింగన సౌఖ్యమును ప్రసాదించెను. ఆ మారుతి భాగ్యమును ఎంతని కొనియాడగలము - గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణలోని అనువాదము)

సుందరకాండ ప్రాముఖ్యత

[మార్చు]

రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పేరు గురించి పైన వ్రాసిన విషయాలలో ఆ కాండము మంత్రయుక్తమనీ, పారాయణా భాగమనీ తెలుపబడింది. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయనీ, తలపెట్టిన కార్యం విజయవంతమౌతుందనీ బహుధా విశ్వాసం ఉంది. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. అనగా ఇది రామాయణమునకు బీజకాండము. అసమానమైన మంత్రము. దీని పారాయణమున లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మ శాసనము. అదే బ్రహ్మాండ పురాణము రామాయణములోని ఒక్కొక్క కాండము పారాయణమునకు ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి "చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం, హనూమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమమ్" అని పేర్కొన్నది..[1]

సుందరకాండ పారాయణా విధానం, ఒక్కొక్క భాగానికి లభించే ఫలసిద్ధి గురించి పెక్కు విశ్వాసాలు, ఆధ్యాత్మ గ్రంథాలు ఉన్నాయి. గుంటూరు శేషేంద్ర శర్మ తన "షోడశి - రామాయణ రహస్యాలలో తెలిపిన కొన్ని విశేషాలు [1]

  • రామాయణానికి ఇది బీజకాండము. మంత్ర సంయుక్తము.
  • దీనిలో గుప్తముగా హనుమంతుని కుండలినీ యోగసాధన నిక్షిప్తమై ఉన్నది. మొదటి శ్లోకంలో "చారిణా చరిత పథే.." అన్న పదాలలోనే యోగ సాధన సూచితమైంది. మైనాక, సురస, సింహికా వృత్తాంతాలు గ్రంథి త్రయ భేదనాలకు నిదర్శనాలు. లంకయే మూలాధార చక్రము. సీతా వర్ణనలో వాడిన అనేక పదాలు పరాశక్తికి, కుండలినీ శక్తికి నిదర్శనాలు. సీత కృశించిన "పన్నగేంద్ర వధువు" వలె ముడుచుకొని యున్నది. ("బిస తంతు తనీయసీ" అని కుండలిని వర్ణిస్తారు). ప్రతిపత్ చంద్ర కళ, విద్య, శ్రద్ధ, బుద్ధి, ఆజ్ఞ, కీర్తి వంటి ఉపమానాలు అన్నీ దేవి నామాలుగా లలితా సహస్రనామ స్తోత్రము, దేవీ భాగవతము, దుర్గా సప్తశతి వంటి గ్రంథాలలో ఉన్నాయి. "సుందర" కాండ అనే పేరే సచ్చిదానంద సౌందర్యమూర్తిని సూచిస్తుంది.
  • త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్ర సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది మణిపతకం వంటిది.

"ఆంధ్ర వాల్మీకి", "వాసుదాస స్వామి" అనే బిరుదులతో ప్రసిద్ధుడైన వావిలికొలను సుబ్బారావు తన మందరము అనబడే శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము సుందరకాండలో తెలిపిన మరికొన్ని విశేషాలు [2]

  • వ్యాధులు, కారాగృహ బంధనములు, గ్రహపీడలు, అనపత్యతలు, దారిద్ర్యములోనైన సంకటములన్నియను సుందరకాండ పారాయణము వలన తొలగుటయే గాక భక్తి ముక్తులును కలుగును. ఇది పారంపర్యముగ వచ్చిన మూఢ విశ్వాసము కాదు. పరీక్షితము, సిద్ధాంతితము, ప్రత్యక్షము, సహేతుకము.
  • తత్వ సంగ్రహ రామాయణములో ఏయే సర్గ పారాయణం వలన ఏయే ఫలితాలు కలుగుతాయో చెప్పబడింది.
  • అర్ధ పంచక జ్ఞానము ఆచార్యుల వలననే కలుగునని హనుమంతుని చర్య వలన బోధింపబడింది. అర్ధ పంచకమనగా (1) ప్రాప్యమగు బ్రహ్మ స్వరూపము (2) జీవాత్మ స్వరూపము (3) ఉపాయ స్వరూపము (4) ఫల స్వరూపము (5) విరోధి స్వరూపము
  • దశేంద్రియాధిష్ఠితమైన దేహమే లంక. అహంకార మమకారములు రావణ కుంభకర్ణులు. బంధింపబడిన చేతనుడే సీత. వివేకమే విభీషణుడు. భగవంతుడు తనను రక్షించునో రక్షింపడో అన్న సందేహముచే పరితపించుచున్న జీవునికి ఆచార్యుడు అర్ధ పంచక జ్ఞానము కలుగజేసి ఉజ్జీవింపజేయును.
  • ద్వయ మంత్రములోని శరణ శబ్దార్ధ రహస్యములు ఇందులో వివరింపబడినవి. గాయత్రీ మంత్రములోని "దేవ" శబ్దార్ధము ఇందు శ్రీరామ దివ్య మంగళ విగ్రహ వర్ణనచే వర్ణింపబడింది.
  • సంసార సాగర తరణము కోరు యోగులకు తగిన అభ్యాస విధి ఇందలి హనుమంతుని చర్యల వలన తెలియుచున్నవి.
  • సుందర కాండములోని మొదటి అక్షరము "త" (తతో రావణీతాయాః సీతాయాశ్శత్రుకర్శనః). చివరి అక్షరము "త" (తథాభిపీడితా). ఇది గాక సుందరకాండ ప్రతి సర్గమున మొదటి అక్షరములో సకారముగాని, తకారము గాని, లేదా శ్లోకములో "సీత"యను పదముగాని, తత్పర్యాయపదము గాని ఉండును. అలా కాని చోట్ల సర్గ రెండవ శ్లోకము మొదటి అక్షరము సకారము గాని తకారము గాని కలిగియుండును. "సీత"యే సుందరకాండమునకు అధిష్ఠాన దేవత. "ఓం తత్ సత్" ఈ కాండములో నిక్షిప్తమై ఉంది.

సాహితీ విశేషాలు

[మార్చు]

సుందరకాండ పారాయణా విధం

[మార్చు]

ఆపదల నివారణ కోసం, అభీష్ట సిద్ధి, సంకల్ప జయం కోసం సాంప్రదాయికంగా సుందరకాండను పారాయణం చేసే ఆచారం ఉంది. భక్తులు తమ ఇష్టానుసారం, వీలునుబట్టి పారాయణ చేస్తారు. అంతే కాకుండా "ఉమా సంహిత", "తత్వ సంగ్రహం", "బ్రహ్మాండ పురాణం", "పారాశర్య ఉపపురాణం" వంటి గ్రంథాలలో పారాయణకు కొన్ని ప్రత్యేక విధానాలు చెప్పబడ్డాయి. ఏయే తిథి, వార, నక్షత్రాలలో ఏయే శ్లోకాలు, సర్గలు పారాయణం చేయాలో కూడా వివరింపబడింది. ఈ పారాయణంలో "సామాన్య పద్ధతి", "సంపుటీకరణ పద్ధతి" అనే రెండు విధానాలున్నాయి. చైత్ర, వైశాఖ, జ్యేష్ట, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ ఫల్గుణ మాసములలోను; విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులయందును; ఆది, బుధ, గురు, శుక్ర వారములలోను ఈ పారాయణ ప్రాంభించుట మంచిదని - నదీ సాగర తీరములందును, పవిత్ర తీర్ధ క్షేత్రములందును, దేవాలయములలోను, భక్తుల సన్నిధియందును, స్వగృహ దైవ ప్రారంధనా మందిరాలలోను, తులసి కోట చెంతను ఈ పారాయణము ఆచరించుట శుభ ప్రథమని సంప్రదాయ విశ్వాసము. మొత్తం కాండం పారాయణం మాత్రమే కాకుండా ఒక్కొక్క దుఃఖ నివారణకు లేదా ఫల సిద్ధికి కొన్ని కొన్ని శ్లోకములు కూడా పారాయణకు ఉత్తమములని చెబుతారు. "సప్తసర్గ పారాయణ" అనే క్రమం కూడా ఆచరణలో ఉంది.

సాధారణంగా పారాయణానికి ముందు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అంగన్యాస కరన్యాసాదులు నిర్వహిస్తారు. ఒక విధానం ప్రకారం పారాయణం ఈ క్రమంలో ఉంటుంది.

కష్టభంజనుడు హనుమంతుడు - సారంగపూర్ స్వామి నారాయణ మందిరంలోని విగ్రహం
  1. గురువులకు, గణపతికి, ఇష్టదైవానికి, వాల్మీకికి, ఆంజనేయునకు, రామాయణమునకు, శ్రీరామునకు ప్రార్థనలు చేస్తారు.
  2. అనంతరం గాయత్రీ రామాయణం చదువాలి.
  3. సంక్షేప రామాయణము (బాలకాండలోనిది)
  4. శ్రీరామావతార సర్గము
  5. శ్రీ సీతారామ కళ్యాణ సర్గము
  6. శ్రీ సీతారామ సుఖ జీవన సర్గము
  7. శ్రీ సుందర కాండము పారాయణము
  8. నాగపాశ విమోచన సర్గము
  9. ఆదిత్య హృదయము
  10. రావణ వధ సర్గము
  11. శ్రీరామ స్తుతి సర్గము
  12. శ్రీరామ పట్టాభిషేక సర్గము
  13. గాయత్రీ రామాయణము
  14. మంగళ, స్వస్తి శ్లోకములు

పారాయణానంతరం తిరిగి పూజ, నైవేద్యం, మంగళ హారతి, నమస్కారం నివేదిస్తారు.

భగవదారాధనకు కేవలం శ్రద్ధ, భక్తి ఉంటే చాలునని దేశకాల నిమిత్తములు లేవని, వీలును బట్టి ఎంత వీలయితే అంత చదువుకొనవచ్చునని కూడా విశ్వాసం ఉంది.

కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు, పద్యాలు

[మార్చు]

వాల్మీకి రామాయణ శ్లోకములు, అందుకు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వావిలికొలను సుబ్బారావు రచన) లోని తెలుగు పద్యములు ఇవ్వబడినవి.


మొదటి శ్లోకము

తతో రావణీతాయా స్సీతాయా శ్శత్రుకర్షనః
ఇయేష పదమన్వేష్టుం చారణా చరిత పథే

తరువాత రావణాసుర
వరనీతధరాత్మజాత పదమున్వెదకన్
గురుచారణ మార్గంబున
నరుగఁగ నృపదూత గర్శితారి తలంచెన్


చంద్రోదయ వర్ణన

హంసో యథా రాజత పంజరస్థః
సింహోయథా మందర కందరస్థః
వీరో యథా గర్విత కుంజరస్థః
చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః

రాజత పంజరస్థమగు రాజ మరాళము భంగి, మందర
భ్రాజిత కందరస్థ మృగరాజము వైఖరి, భూరి దుర్మదో
ద్వేజక కుంజరస్థుడగు వీరవిధంబునఁ, జంద్రుడయ్యెడన్
రాజిలె నంబరస్థుడయి రాజముఖీ వదనాభిరాముడై
 

ప్రార్ధనా శ్లోకము

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః

మ్రొక్కెద రామచంద్రునకు మోడ్చెదఁ గేలు సుమిత్ర పట్టికిన్
మ్రొక్కెదఁ దద్విహేహప తనూజకు శ్రీరఘురాము దేవికిన్
మ్రొక్కెద ధర్మ వాసవ మరుద్గణ మారుత రుద్రపాళికిన్
మ్రొక్కెద సూర్య చంద్రులకు మ్రొక్కెదఁ దామరసాప్త సూతికిన్
 

సీత వర్ణన

తదున్నసమ్ పాండురదంత మవ్రణమ్
శుచిస్మితమ్ పద్మ పలాశ లోచనమ్
ద్రక్ష్యే తదార్యా వదనమ్ కదాన్వహమ్
ప్రసన్న తారాధిపతుల్య దర్శనమ్

యెప్పుడు చూతునో యేనున్నసంబు, బాండురదంత మవ్రణమునగుచు
మందహాసాంకూర సుందరంబయి పద్మ దళలోచనంబులఁ జెలువుగాంచి
నిర్మ తారేశ నిభదర్శనంబగుచు, నమ్మహాదేవి యాస్యము నేను
ఏగతిఁ గందునో హీనుండు క్షుద్రుండుఁ బరమపాపియుఁ గ్రౌర్యపరుంఢు దులువ
దారుణండయ్యను సువేషధారియయిన
యసుర భూపతిచే బలాత్కృతినపహరింపఁ
బడిన సాధ్విఁ దపస్విని బుడఁము కూతు
రామదేవుని దేవి సతీమతల్లి

నత్వేవ సీతాం పరమాభిజాతామ్
పథి స్థితే రాజకులే ప్రజాతామ్
లతాం ప్రపూల్లామివ సాధుజాతాం
దదర్శ తన్వీం మనసాభిజాతామ్
తాం స్మృతీమివ సందిగ్దామ్ బుద్ధిం నిపతితామివ
విహతామివ చ శ్రద్ధామ్ ఆశాం ప్రతిహతామివ
సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ
అభూతేవాపవాదేన కీర్తిం నిపతితామివ

కుదుటఁబడని శ్రద్ధ, మదికి సందిగ్ధమౌ
స్మృతియు, క్షీణమౌ సిరియుఁ గలుష
యుక్తమైన బుద్ధి, యుపహతిఁ గూడిన
కార్యసిద్ధి నాఁగ గ్రాలుదాని


ఇయం కనక వర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా
ప్రణష్టాపి సతీ యాస్య మనసో న ప్రణస్యతి
అస్యా దేవ్యా యథా రూపమ్ అంగప్రత్యంగ సౌష్టవమ్
రామస్య చ యథా రూపం తస్యేయమసితేక్షణా

ఈ కనకాంగి రాము హృదయేశ్వరి దేవెరి దూరవిప్రవా
సాకుల యయ్యు రాముహృదయంబుననెప్పుడుఁ బాయదున్న, ద
స్తోకము రామచంద్రునెఁడ దోఁచు సురూపము నంగసౌష్ఠవం
బీ కువలాక్షి యందుఁ బరిదృశ్యము లయ్యెను యుక్తమే కదా?

త్రిజటా స్వప్నము

ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితమ్
గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగామ్
యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః
స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృతా
సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థితా
రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభా యథా
రాఘవశ్చ మయా దృష్టః చతుర్దంతం మహాగజమ్
ఆరూఢః శైల సంకాశం చచార సహ లక్ష్మణః
తతస్తౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా
శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ
తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్థస్య దంతినః

ఆకాశ గమనంబు హంస సహస్రంబు, గజదంత మయమైన కలికి పల్ల
కీలోనఁ దెల్లని మాలికల్ చేలముల్, దాల్చి సుమిత్రాగ్ర తనయుతోడ
రామచంద్రుఁడు వచ్చె రమణీయ శుక్లాంబ, రావృత యగుచు నీ దేవి పాల
వెల్లి లోపల నున్న వెల్లని గట్టుపై, భానునితోఁ బ్రభ పరఁగునట్లు
రామచంద్రుతోడ రంజిల్లఁ గంటిని
ధరముఁబోలి నాల్గు దంతములను
మీఱుచున్న గజము మీద సలక్ష్మణుఁ
గౌసలేయు నరుఁ గంటిఁ గలను
 

శ్రీరామ లక్ష్మణ వర్ణన

రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే
తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః
రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా
రక్షితాస్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః
రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా
మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః

రాముండు కమలపత్ర విశాలలోచనుం, డఖి సత్వసుమనోహర గుణుండు
రూపదాక్షిణ్య నిరూఢుఁడై జనియించెఁ దేజంబునందు నాదిత్యుఁబోలు
నోరుపు గుణమున నుర్వికిఁ దుల్యుండు, బుద్ధి బృహస్పతి పురుడు చూపు
సద్యశంబున హరి సకల జీవావళీ, రక్షకుఁడాత్మీయ రక్షకుండు
స్వకుల వృత్తి ధర్మ సంరక్షకుఁడు నాల్గు
జాతుల నరయుచుండు రీతి చెడక
మనుజ హితములైన మర్యాదలందుండి
పరుల నట్ల చేయఁ బనుచుచుండు

భ్రాతా చ తస్య ద్వైమాత్ర స్సౌమిత్రి రపరాజితః
అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథవిధః

రాముని ద్వైమాతురుఁడగు సౌమిత్రి యజయ్యుఁ డాజి సద్గుణ రూప
ప్రేమములనట్టివాఁ డుర్వీ మండలి దేవి! నిన్ను వెదకుచు వారల్


అంగుళీ ప్రదానము

వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః
రామనామాంకితం చేదం ప్రశ్య దేవ్యంగుళీయయకమ్

ఇంకను నమ్మవేని జనకేశ్వర నందిని చూడు రామ నా
మాంకితమైన యుంగరము నాదఁటబంచె నతండు దీని నీ
కింకరు చేత నీదు మదికిన్ ఘటియింపఁగ నమ్మంబు నీ
యంకిలి దీఱు నంచొసఁగ నా యమ గైకొని దానిఁ బ్రీతితోడన్

హనుమంతుని జయ ఘోష

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

జయము జయంబు రామునకు సార పరాక్రమ ధన్యమూర్తికిన్
జయము జయంబు విద్విషద సహ్య తరస్వి సుమిత్ర పట్టికిన్
జయము జయంబు దాశరథి సంపరిపాలితుఁడౌ వలీముఖో
చ్చయ పతి సూర్య పుత్రునకు సాహస విక్రమ కీర్తి శాలికిన్

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః

దాసుఁడ సర్వ సద్గుణ వితాన మనోహర రామమూర్తికిన్
గోసల దేశ వల్లభుకున్ హత శత్రుఁడ వాయుపుత్రుఁడన్
నా సరిగారు సంగరమునన్ దశకంఠులు వేవురేనియున్
వాసి యడంతు ఱాల ద్రుమపాళుల నే హనుమత్సమాఖ్యుఁడన్

అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్

ధ్వంసంబుఁ జేసి లంకను
హింసించి సమస్త రాక్షసేంద్రుల సీతా
హంసీయానకు మ్రొక్కి ప్ర
శంసిత గతిం జనెద మిడుక సకల సురారుల్.

మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడు, కిష్కింధకు ప్రభువు అయిన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసల దేశపు ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను. వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయి మంది రావణులైనా గాని యుద్ధ రంగమున నన్నెదిరించి నిలువలేరు. వేలకొలది శిలలతోడను, వృక్షములతోడను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూస్తూ ఉండెదరు గాక. నేను వచ్చిన పనిని ముగించుకొని, సీతాదేవికి నమస్కరించి వెళతాను.

తెలుగులో సుందర కాండ రచనలు

[మార్చు]
పుస్తకాలు

తెలుగులో అనేక రామాయణాలు వెలువడినాయి. వాటిలో భాగంగా సుందరకాండ కూడా ఉంది. ఇవే కాకుండా ప్రత్యేకంగా సుందరకాండకు సంబంధించిన అనేక రచనలు వెలువడినాయి. వాటిలో కొన్ని -

ఆడియో


మొత్తం సుందర కాండ సర్గల జాబితా

[మార్చు]

ఇతర విశేషాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 గుంటూరు శేషేంద్ర శర్మ రచన షోడశి - రామాయణ రహస్యములు (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000
  2. "మందరము" అనబడే "శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము" -రచయిత వ్యాఖ్యానముతో - రచన: వావిలికొలను సుబ్బారావు - ప్రచురణ : శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజము, అంగలకుదురు, తెనాలి - కూరాడ దుర్గా సుందరశర్మ ద్రవ్య సహాయముతో ముద్రింపబడినది

వనరులు

[మార్చు]
  • వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
  • సుందర కాడంము, పారాయణ గ్రంథం - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2002)
  • ఉషశ్రీ రామాయణం – రచన: ఉషశ్రీ - ప్రచురణ: శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్, విజయవాడ (2005)
  • శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ (2003)

బయటి లింకులు

[మార్చు]