Jump to content

సీతాదేవి

వికీపీడియా నుండి
సీతా దేవి

హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత, శ్రీమహాలక్ష్మి అవతారం. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. రామాయణం సీతాయాశ్చరితం మహత్ అని చెప్పబడింది. జానకి, మైధిలి, వైదేహి, రమ కూడా సీత పేర్లు. సీతను తరచు సీతమ్మ తల్లి, చల్లని తల్లి అని వివిధ రచనలలోను, కీర్తనలలోను ప్రస్తావిస్తారు[1].

జననం

[మార్చు]

మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము చేస్తూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత' అని నామకరణము చేసి జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు. సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాసం శుక్లపక్షంలో జరిగింది. ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న జనక్‌పూర్ సీత జన్మస్థలమని చెబుతారు.

పరిణయం

[మార్చు]
సీతా దేవి స్వయంవరము

రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ రక్షణా కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిధిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిధులను ఆహ్వానించి జనకుడు వారికోరికపై తనవద్దనున్న శివధనుస్సును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయిన ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి, విరిచేశాడు.

తన కుమార్తె 'వీర్యశుల్క' అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితోబాటే లక్ష్మణునకు ఊర్మిళతోను, భరతునకు మాండవితోను, శత్రుఘ్నునకు శృతకీర్తితోను వివాహం నిశ్చయమైనది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి "కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది" అని చెప్పాడు. [2] సీతారాముల, వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది. సీత తన భర్తవెంట అయోధ్యకు వచ్చింది. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతున్నది.

వనవాసం

[మార్చు]
పర్ణశాలలో సీతారామలక్ష్మణుల జీవనం

దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి పదునాలుగేండ్లు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు, అత్తలు వారించినా వినకుండా సీత పట్టు బట్టి "నిన్ను విడచి నేనుండలేను. అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా నాకు హంసతూలికా తల్పంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను." అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరింది. అన్నను, వదినను అంటిపెట్టుకుని సేవించడానికి లక్ష్మణుడు బయలుదేరాడు. అప్పుడు రామునకు 25 సంవత్సరములు, సీతకు 18 ఏళ్ళు, లక్ష్మణుడు 16 ఏండ్లవాడు.[3] సీతారాములు చిత్రకూట పర్వతం, మందాకినీ నది అందాలను చూసి మురిసిపోతూ వనవాసం గడుపసాగారు. భరతుడు వచ్చి అన్నపాదుకలు తీసికొని వెళ్ళిన తరువాత సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సీత అనసూయను పూజించింది. అనసూయ సీతకు అనేక పాతివ్రత్య ధర్మాలను ఉపదేశించి, మహిమగల పూలదండ, చందనం, వస్త్రం, ఆభరణాలు బహూకరించింది. సీతనోట సీతాస్వయంవరకథ విని అనసూయ మురిసిపోయింది.

ఇంకా అనేక ముని ఆశ్రమాలు సందర్శించిన తరువాత సీతారామ లక్ష్మణులు పంచవటిలో పర్ణశాలను నిర్మించుకొని వనవాసకాలం గడుపసాగారు.

అపహరణం

[మార్చు]
సీతను రావణుడు అపహరించేటపుడు అడ్డుకొన్న జటాయువు - రాజా రవివర్మ చిత్రం.

లక్ష్మణుని చేత భంగపడిన శూర్పణఖ తన అన్న రావణునితో మొరపెట్టుకొని, "ఆ అందాల రాశి సీత నీకు భార్య కాదగినది" అని నూరిపోసింది. రావణుడు మారీచునితో కలసి చేసిన మాయలేడి పన్నాగము వల్ల రామలక్ష్మణులు పర్ణశాలనుండి దూరముగా వెళ్ళారు. అప్పుడు రావణుడు కపట సన్యాసి వేషంలో వచ్చి సీతను బలవంతంగా తీసుకొని పోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలను ఖండించాడు.

వాయుమార్గంలో రావణునిచే తీసుకుపోబడుతున్న సీతకు తనను రక్షించే నాధుడు కనిపించలేదు. ఆమె తన నగలు కొన్ని తీసి చీరచెంగులో కట్టి ఒక పర్వతశిఖరంమీదనున్న వానరులమధ్య పడేసింది. సీతను రాక్షసుడు శతృదుర్భేద్యమైన తన లంకానగరంలో అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు.

హనుమంతుని దర్శనం

[మార్చు]
అశోక వనములో సీతను చూచిన హనుమంతుడు

సీతాపహరణ గురించి తెలిపి జటాయువు మరణించాడు. సీతను ఎడబాసి రాముడు దుఃఖితుడైనాడు. రామ లక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేసుకొన్నారు. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదిక్కులా వానరులను పంపాడు. వారిలో అంగదుని నాయకత్వములో హనుమంతుడు, నీలుడు, జాబవంతాదులు దక్షిణ దిశగా పయనించి సాగరతీరానికి చేరారు. సీత జాడతెలియక ఖిన్నులైన వారికి సంపాతి సీత లంకలోనున్నదని, రావణునిచే బంధింపబడినదనీ చెప్పాడు.

హనుమంతుడు నూరుయోజనముల సాగరమును లంఘించి లంకను చేరాడు. లంకిణిని దండించి, లంకలో జొచ్చి అంతఃపురాలూ, అన్ని భవనాలూ వెదికి సీతను కానక చింతించాడు. మరల సీతారామలక్ష్మణులకు, దేవతలకు నమస్కరించి అశోకవనంలో వెదకసాగాడు. అక్కడ శింశుపావృక్షం క్రింద సింహముల మధ్య చిక్కిన లేడివలె, నివురుగప్పిన నిప్పువలె, విఘ్నములవలన భగ్నమైన సిద్ధివలె, మరచిపోయిన విద్యవలె, అసత్యాపవాదంవలన భంగపడిన కీర్తివలె, హరించుకుపోతున్న సిరివలె, దీనయై యున్న స్త్రీని చూచి 'ఈమెయే సీత' అని నిర్ధారించుకొన్నాడు.

రావణుడు అక్కడికి వచ్చి తనకు లొంగిపొమ్మని సీతను బెదరించాడు. సీత ఒక గడ్డి పరకను అడ్డముగా పెట్టుకొని, రావణునితో "రావణా! నన్ను కాంక్షించడం నీకు తగనిపని. ఇది నీకు, నీ వంశానికి వినాశకారకం. సూర్యునకూ కాంతికీ లాగే రామునకూ నాకూ అవినాభావ సంబంధం ఉంది. నీవు పిరికివాడివి గనుక రాఘవుడు ఆశ్రమంలో లేనప్పుడు నన్ను అపహరించి తెచ్చావు. రామలక్ష్మణుల బాణాలు నిన్నూ, లంకనూ నాశనం చేయడం తధ్యం. వారిని ఎవరూ అడ్డుకొనలేరు. రామునకు నన్ను సమర్పించి శరణు వేడడం ఒకటే నిన్ను రక్షింపగల మార్గం" అన్నది.

లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

క్రుద్ధుడై రావణుడు ఒక నెల గడువుపెట్టి వెళ్ళిపోయాడు. మరణించవలెనని తలచిన సీతను ఓదార్చి త్రిజట తనకు వచ్చిన స్వప్నము గురించి చెప్పినది. ఆమెకు శుభములు కలుగునని, త్వరలో మంచి వార్త వినగలదని ఊరడించింది.

హనుమంతుడు సీతను దర్శించి, రాముని అంగుళీయకమును సమర్పించి, తను వచ్చిన వృత్తాంతము తెలిపెను. సీత రామ లక్ష్మణుల క్షేమం అడిగి, దుఃఖించింది. స్వయముగా రాముడే రావణుని జయించి తనను తీసుకొని వెళ్ళుట రామునకు తగిన పని అని చెప్పినది. హనుమంతుని ఆశీర్వదించి, ఆనవాలుగా తన చూడామణిని ఇచ్చి రామునితో తనమాటలుగా "ఒక్క నెలలోపల నన్ను విడిపించకపోయిన యెడల సీత జీవించియుండదు" అని చెప్పమన్నది.

హనుమంతుడు తరువాత రావణుని సభలో హెచ్చరించి, లంకను కాల్చెను. సీత దీవెనవలన తన తోక కాలినాగాని హనుమంతునకు బాధ కలుగలేదు. మరొకమారు సీతను దర్శించి, తిరుగు ప్రయాణమయ్యెను. రాముని వద్దకు వెళ్ళి "చూశాను సీతను. ఆమె నిన్నే స్మరిస్తూ ఏకవస్త్రయై కృశించి యున్నది" అని సీత సందేశాన్ని వినిపించాడు. కృతజ్ఞతతో రాముడు హనుమంతుని కౌగిలించుకొన్నాడు.రామ లక్ష్మణులు వానర సేనతో కలిసి రావణునితో పోరునకు సిద్ధమయ్యారు.

యుద్ధం, అగ్ని ప్రవేశం, పట్టాభిషేకం

[మార్చు]
అగ్ని ప్రవేశము చేస్తున్న సీతా దేవి

భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారంసీతకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

రాముడు "సీతా, ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను. రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను" అని కఠినంగా మాట్లాడాడు. సీత దుఃఖంతో బావురుమంది. "ఆర్యపుత్రా, వీరాధివీరా, నీవు పామరునివలె మాట్లాడుతున్నావు. రావణుడు నన్ను తాకిన దోషం నాది కాదు. దైవానిది. నా హృదయం నీమీదే లగ్నం అయి ఉన్నది. నేను జనకుని పెంపుడు కూతురిని. భూమి సుతను. నా భక్తినీ శీలాన్నీ విశ్వసించలలేక పోతున్నావా?" అని విలపించింది.

సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, కళంకిని యనిపించుకొని నేనింక బ్రతుకలేను. నా సుగుణాలని కీర్తించని నా భర్త నలుగురిముందు నన్ననరాని మాటలన్నాడు. అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది. సీత అవనత శిరస్కయై రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయాలి" అని పలికి మంటలలోనికి నడచింది. అందరూహాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ రాముని సమక్షంలో నిలిచి "రామా నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? ప్రాకృతునిలా సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. నీవు విష్ణువు అవతారానివని చెప్పాడు.

అగ్ని సీతను వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు. సీత అప్పుడు ఉదయసూర్యబింబంలా ఉంది. "రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన సాధ్వి. ఈమెను అవశ్యం పరిగ్రహించు. నాకడ్డు చెప్పవద్దు. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అని చెప్పాడు. రాముడు "సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింపజాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీత చేతినందుకొన్నాడు.

సీతారామలక్ష్మణులు అయోధ్య చేరుకొన్నారు. సీతాసమేతంగా రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషేక సమయంలో సీత విలువైన ఆభరణాలూ, వస్త్రాలూ, ముత్యాలహారం హనుమంతునకిచ్చింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్లమబ్బులా ప్రకాశించాడు.

ఉత్తర రామాయణం

[మార్చు]
లవ కుశులతో సీతా దేవి

(ఉత్తర రామాయణ గాథ లవకుశ సినిమా, నాటకాల ద్వారా తెలుగునాట సుపరిచితం.) రామరాజ్యం చల్లగా సాగుతున్న సమయంలో ఒకపామరుడు "పరులయింటనున్న పడతిని తెచ్చుకొని యేలుకోవడానికి నేను రామునివంటివాడను కాను" అని మాట జారాడు. అది చారుల ద్వారా తెలుసుకొన్న రాముడు లోకాపవాదుకు, వంశ ప్రతిష్ఠా భంగమునకు వెరచి, నిండు చూలాలైన సీతను అడవిలో వదలి రమ్మని లక్ష్మణుని ఆజ్ఞాపించాడు.

మళ్ళీ అడవులపాలైన సీత వాల్మీకి ఆశ్రమంలో తలదాచుకొని కుశలవులను కంటుంది. వారు వీరాధివీరులు. వాల్మీకి ద్వారా రామాయణమును విన్నవారు. రాముడు అశ్వమేధయాగం చేయగా ఆ యాగాశ్వాన్ని లవకుశులు బంధిస్తారు. అప్పుడు జరిగిన ప్రతిఘటనలో రామునకు కుశలవులు తన బిడ్డలని తెలుస్తుంది. వారిని రామునకప్పగించి సీత భూమిలో ప్రవేశిస్తుంది.

హిందూ సంస్కృతిలో సీతా చరిత్ర ప్రభావం

[మార్చు]

హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతా చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది.సిత దెవి ఎంతో గొప్పగ జీవించింది.సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచింది.

మూలాలు

[మార్చు]
  1. మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. జనకుని కూతుర జనని జానకమ్మ - రామదాసు కీర్తన.
  2. ఇయం సీతా మమ సుతా సహధర్మచారిణీ తద, భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా
  3. http://www.newdharma.org/royal_chron.htm

వనరులు

[మార్చు]
  • వాల్మీకి రామాయణం - సరళ సుందర వచనము- బ్రహ్మశ్రీ కొంపెల్ల వెంకటరామ శాస్త్రి - రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి .

బయటి లింకులు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సీతాదేవి&oldid=4300719" నుండి వెలికితీశారు