Jump to content

శ్యాంప్రసాద్ ముఖర్జీ

వికీపీడియా నుండి
(శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ నుండి దారిమార్పు చెందింది)
శ్యాంప్రసాద్ ముఖర్జీ
శ్యాంప్రసాద్ ముఖర్జీ


నిర్వహించిన పదవులు
జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు
కోల్‌కత విశ్వవిద్యాలయం మాజీ కులపతి
మాజీ కేంద్ర మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 6, 1901
కోల్‌కత
మరణం జూన్ 23, 1953
రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్
డిసెంబర్ 26, 2008నాటికి

శ్యాంప్రసాద్ ముఖర్జీ, (1901, జూలై 6) ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెసు వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకొని అక్టోబరు 21, 1951 న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953 న మరణించేవరకు కొనసాగినాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901 జూలై 6 న కోల్‌కతలో జన్మించాడు. తండ్రి అశుతోష్ ముఖర్జీ బెంగాల్‌లో గౌరవాదరణ కలిగిన న్యాయవాది, కలకత్తా విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేసిన ప్రముఖుడు. తల్లి పేరు జోగ్‌మాయా దేవి ముఖర్జీ.

ముఖర్జీ డిగ్రీ విద్యాభ్యాసం కోల్‌కత లోనే కొనసాగింది. 1921లో ఆంగ్లంలో మొదటి స్థానంలో పట్టా పుచ్చుకున్నాడు. 1923లో ఎంఏ పట్టా పొందినాడు. 1924లో న్యాయవాద పట్టా కూడా స్వీకరించాడు. తండ్రి మరణానంతరం 1924 లో కలకత్తా హైకోర్టులో అడ్వకేట్‌గా పేరు నమోదుచేసుకున్నాడు. ఆ తరువాత ఇంగ్లాండుకు పయనమై 1927లో బారిష్టరు పట్టా పొందినాడు. 1934లో 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయపు కులపతిగా నియమించబడి, పిన్న వయస్సులో ఈ పదవిని పొందిన ఘనత పొందినాడు. 1938 వరకు ముఖర్జీ ఈ పదవిని నిర్వహించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ముఖర్జీ తొలుత భారత జాతీయ కాంగ్రెసు తరఫున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యాడు. మరుసటి సంవత్సరంలోనే బెంగాల్ శాసనసభను బహిష్కరించాలని భారతీయ జాతీయ కాంగ్రెసు నిర్ణయించడంతో ఆ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందినాడు. 1941-42 లో బెంగాల్ ప్రావిన్సు మొదటి ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టినాడు.

అనతికాలంలోనే హిందువుల తరఫున మాట్లాడే వక్తగా పేరు పొంది హిందు మహాసభలో ప్రవేశించి 1944లో ఆ సంస్థ అధ్యక్షుడైనాడు. ముఖర్జీ ముస్లిములకు వ్యతిరేకి కాకున్ననూ పాకిస్తాన్ ఏర్పాటును కోరుకొనే మహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన హిందూ రాజకీయ నాయకుల పంథాను అనుసరించాడు. ప్రారంభంలో భారత విభజనకు వ్యతిరేకంగా ఉన్న ముఖర్జీ 1946-47 మతకలహాల అనంతరం బెంగాల్ విభజనకు సైతం అంగీకరించాడు. ముస్లిం ఆధిక్యత కల ప్రాంతాలలో ముస్లింలీగ్ పాలిత ప్రాంతాలలో హిందువులు ఉండరాదని తన గళం వినిపించాడు.

స్వాతంత్ర్యానంతరం

[మార్చు]

జవహర్ లాల్ నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో ముఖర్జీకి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వశాఖను కేటాయించాడు. సర్దార్ వల్లభభాయి పటేల్, భారత జాతీయ కాంగ్రెసు ఇతర నాయకులచే ముఖర్జీ మంచి గౌరవప్రథమైన వ్యక్తిగా గుర్తింపుపొందాడు. 1949లో నెహ్రూ పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ కేంద్ర మంత్రిపదవికి రాజీనామా సమర్పించాడు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత ఎం.ఎస్.గోల్వార్కర్తో చర్చలు జరిపిన అనంతరం అక్టోబరు 21, 1951న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించాడు. నెహ్రూ సోషలిజానికి భిన్నంగా జనసంఘ్ పార్టీ స్వేచ్ఛా మార్కెట్ విధానానికి మద్దతు పలికింది. అంతేకాకుండా దేశం మొత్తానికి హిందువులు, ముస్లిములకు ఒకే విధమైన పౌర స్మృతి ఉండాలని ఉద్ఘాటించింది. గోహత్య, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై కూడా వ్యతిరేకత చూపింది. 1952లో జరిగిన ఎన్నికలలో జనసంఘ్ పార్టీ 3 స్థానాలలో విజయం సాధించగా, అందులో ఒక స్థానం నుంచి ముఖర్జీ విజయం సాధించాడు.

కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారతీయ జాతీయ కాంగ్రెసు విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని (Ek desh mein do Vidhan, do Prdhan and Do Nishan nahi chalenge) పేర్కొన్నాడు. తమ దేశంలో నివసించడానికి ఒక రాష్ట్రంలో అర్హత లేకపోవడానికి, గుర్తింపు చూపవలసి రావడం తదితర కారణాల వల్ల 1953లో కాశ్మీర్ వెళ్ళి నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించి సరిహద్దు వద్ద మే 11 న అరెస్టు అయ్యాడు. అతని ప్రయత్నం వల్ల గుర్తింపుకార్డు నియమం తొలిగించబడిననూ అంతవరకు ముఖర్జీ సజీవంగాలేడు. జూన్ 23, 1953 న కస్టడీలోనే ముఖర్జీ ప్రాణాలు వదిలాడు. ముఖర్జీ మరణంపై అనుమానాలు తలెత్తి విచారణ జరుపవలసిందిగా కోరిననూ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరుపలేదు. ముఖర్జీ తల్లి జోగ్మాయా దేవి ప్రత్యేకంగా ప్రధాని నెహ్రూను కోరిననూ ఫలితం దక్కలేదు. ముఖర్జీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదమైన అంశంగానే మిగిలిపోయింది.

గుర్తింపులు

[మార్చు]

వినాయక్ దామోదర్ సావర్కర్తో బాటు ముఖర్జీ కూడా భారతదేశంలో హిందూజాతీయ వాదపు, ముఖ్యంగా హిందూత్వ ఉద్యమమునకు ప్రముఖుడిగా పరిగణించబడతాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్తు మద్దతుదారులచే మంచి గౌరవానికి పాత్రుడయ్యాడు. 1960, 70 దశకాలలో భారతీయ జనసంఘ్ పార్టీకి ఆ తదనంతరం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి దోహదపడిన అటల్ బిహారీ వాజపేయికి శ్యాంప్రసాద్ ముఖర్జీ మంచి మార్గనిర్దేశం చేశాడు.

1998 ఆగస్టు 27 నాడు అహ్మదాబాదు కార్పోరేషన్ ఒక వారధికి ముఖర్జీ పేరు పెట్టింది.[1]

2001లో భారత పరిశోధనా సంస్థ అయిన CSIR ముఖర్జీ పేరిట ఫెల్లోషిప్‌ను స్థాపించింది .[2] శ్యాంప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్ భారతదేశంలో పిహెచ్‌డి చేయడానికి ఒక అత్యున్నతమైన ఫెలోషిప్‌గా గుర్తింపు పొందినది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ చేసిన మొదటి 20% వారికే ఈ అర్హత పరీక్షకు అవకాశం ఉంటుంది.

2015 లో భారత ప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ని ప్రారంభించింది, దీని లక్ష్యం 300ల రూర్బన్ ప్రాంతాలని పట్టణ కేంద్రాలుగా తిర్చిదిద్ది మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ప్రారంభించారు.[3]

బయటి లింకులు

[మార్చు]

మూలములు

[మార్చు]