మిజోరం శాంతి ఒప్పందం
1986 మిజోరం శాంతి ఒప్పందం | |
---|---|
రకం | శాంతి |
సంతకించిన తేదీ | జూన్ 30, 1986 |
స్థలం | న్యూ ఢిల్లీ |
ఒరిజినల్ సంతకీయులు |
|
కక్షిదారులు | |
భాష | ఇంగ్లీషు |
[1] |
1986 మిజోరం శాంతి ఒప్పందం, మిజోరంలో 1966 నుండి జరుగుతున్న తిరుగుబాటు, హింసను అంతం చేయడానికి భారత ప్రభుత్వం, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్‌ఎన్‌ఎఫ్) ల మధ్య కుదిరిన అధికారిక ఒప్పందం. మిజో నేషనల్ ఫ్రంట్ అనేది భారతదేశం నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి లాల్‌డెంగా నేతృత్వంలోని మిజో వేర్పాటువాదుల సంస్థ. 1950వ దశకం చివరిలో మిజోరంలో మహా కరువు ( మౌతం అని పిలుస్తారు) సమయంలో ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడంతో ఉద్యమం మొద్లైఅంది. తరువాతి దశాబ్దాలలో రాజకీయ తిరుగుబాటుగా మారి సామాజిక అశాంతి ఏర్పడింది. అనేక చర్చల తర్వాత, మిజోరం అకార్డ్, 1986: మెమోరాండం ఆఫ్ సెటిల్‌మెంట్ పేరుతో ఒప్పందపత్రంపై 1986 జూన్ 20 న సంతకాలు అయ్యాయి. ఎమ్‌ఎన్‌ఎఫ్ తరఫున లాల్‌డెంగా, భారత ప్రభుత్వం తరఫున హోం కార్యదర్శి RD ప్రధాన్, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్‌ఖామాలు సంతకం చేశారు.[1] 1947లో బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారతదేశంలో కుదిరిన అత్యంత విజయవంతమైన[2] శాంతి ఒప్పందంగా దీన్ని పేర్కొంటారు.[3] ఈ ఒప్పందం ఫలితంగా భారత ప్రభుత్వం 1986 ఆగస్టు 7 న మిజోరంకు రాష్ట్ర హోదా ఇచ్చింది.[4]
నేపథ్యం
[మార్చు]మిజో ప్రజలు బ్రిటిషు భూభాగంపై దాడి చేసి, జోలుటి (మేరీ వించెస్టర్) అనే బ్రిటిష్ అమ్మాయిని బంధించినందుకు ప్రతీకారంగా మిజో ప్రజలను 1870 నుండి బ్రిటిష్ పాలనలో చేర్చారు.[5] 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో, మిజో ప్రజలు అస్సాం రాష్ట్రం పాలనలో ఉండేవారు. 1952లో, అస్సాం కింద లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్ అనే అనుబంధ ప్రభుత్వం ఏర్పడింది. తరువాతి కాలంలో ఏర్పడిన మిజోరం ప్రాంతం ఇదే. మణిపూర్, బర్మా (మయన్మార్)లో చాలా మంది మిజో ప్రజలు సరిహద్దులుగా గుర్తించబడినందున వారిలో వ్యతిరేకత ఉంది. మిజో ప్రజలకు స్వాతంత్య్రం ఇవ్వాలని లేదా బర్మాలో చేర్చాలని డిమాండ్ చేశారు. 1959 లో మౌతం కారణంగా కరువు ఏర్పడినప్పుడు రాజకీయ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. మౌతం అనేది ప్రతి 48 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు ఒకసారి వెదురు పుష్పించే చనిపోయే పదం. దానికి కీటకాలు ఎలుకలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలుకలు 1959లో వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేశాయి. మిజో ప్రజలు అస్సాం, భారత అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. స్థానిక సహాయ కార్యక్రమాల కోసం 1960లో మౌతం ఫ్రంట్ అనే సామాజిక సంస్థను స్థాపించారు. సంస్థ మిజో ప్రజలది మాత్రమే అని మిజో ప్రజలను ఉత్సాహపరిచేందుకు త్వరలోనే దానికి మిజో నేషనల్ ఫామిన్ ఫ్రంట్‌గా పేరు మార్చారు. మరుసటి సంవత్సరం కరువు తగ్గుముఖం పట్టడంతో, సంస్థ రాజకీయంగా మారి మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్‌ఎన్‌ఎఫ్)గా మారింది. 1961 నవంబరులో లాల్‌డెంగా అధ్యక్షుడిగా అధికారికంగా రాజకీయ పార్టీగా అవతరించింది. మిజో తెగలందరినీ ఒకే రాజకీయ పాలనలో కలుపుకొని గ్రేటర్ మిజోరామ్‌ను సృష్టించడం కోసం పోరాటం చేయడం దాని ప్రధాన లక్ష్యం. ఇది రెండు దశాబ్దాల పాటు కొనసాగిన రాజకీయ తిరుగుబాటుకు, సామాజిక అశాంతికీ దారితీసింది. [6]
తిరుగుబాటు, చొరబాటు
[మార్చు]ఎమ్‌ఎన్‌ఎఫ్ దాని సాయుధ విభాగం, మిజో నేషనల్ ఆర్మీని సృష్టించింది. ఇది ఆపరేషన్ జెరిఖో కింద 1966 మార్చి 1 న భారతదేశం నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.[7] ప్రధాన పట్టణాల్లో వెంటనే గెరిల్లా యుద్ధం మొదలైంది. ఐజాల్‌లోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌పై దాడి, ప్రభుత్వ ఖజానాను దోచుకోవడం మొదటి ప్రధాన చర్య.[8] ప్రభుత్వ కార్యాలయాలు, స్టేషన్లపై దాడులు చేసి ధ్వంసం చేశారు. అస్సాం ప్రభుత్వం మరుసటి రోజు లుషాయ్ హిల్స్ జిల్లాను "కల్లోలిత ప్రాంతం"గా ప్రకటించింది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్ కింద కేంద్ర ప్రభుత్వం ఎమ్‌ఎన్‌ఎఫ్‌ను తీవ్రవాద సంస్థగా నిషేధించింది.[9] ప్రతీకార చర్యగా ఆ ప్రాంతంలో భారత సైన్యం మోహరించింది. "ఆపరేషన్ సెక్యూరిటీ" పేరిట సైనికులు అనుమానాస్పద పౌరులను చుట్టుముట్టవచ్చనే సైన్యానికి అధికారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో పౌరహక్కులు పూర్తిగా అణచివేయబడ్డాయి. మార్చి 5 నుండి, ఐజాల్‌పై వ్యూహాత్మక బాంబులతో దాడి చేసారు. పట్టణాంలో నివాసయోగ్యత లేని పరిస్థితి ఏర్పడింది. సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం (AFSPA) 1967లో అమలులోకి వచ్చింది. రక్షిత, ప్రగతిశీల గ్రామాలు, కొత్త గ్రూపింగ్ కేంద్రాలు, స్వచ్ఛంద సమూహ కేంద్రాలు, విస్తరించిన లూప్ ప్రాంతాలు వంటి నిబంధనల ప్రకారం "గ్రూపింగ్" అని పిలువబడే ఒక పాలక వ్యవస్థను ప్రకటించారు. సైనిక బలగాలు చిన్న గ్రామాలు ఖాళీ చేయించి, వారిని పెద్ద పెద్ద సమూహాలుగా చేర్చారు.[9] ఈ సమూహాలు గెరిల్లాల కంటే పెద్దగా, వారి కంటే బలంగా ఉండడంతో, గెరిల్లాలు బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) కు, బర్మాకూ పారిపోవలసి వచ్చింది. ఎమ్‌ఎన్‌ఎఫ్ ఆ తర్వాత అజ్ఞాత ఉద్యమంగా మారింది.
శాంతి కోసం చర్చలు
[మార్చు]ఉద్యమంలో పౌరులే ఎక్కువగా నష్టపోతున్నందున, స్థానిక సామాజిక సంస్థలు, చర్చి నాయకులు చర్చలు జరపవలసి వచ్చింది. క్రైస్తవీకరించబడిన సమాజంగా మిజో ప్రజలు చర్చిని మాత్రమే శాంతికర్తగా కలిగి ఉన్నారు. తిరుగుబాటుదారులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిపేందుకు, ప్రెస్బిటేరియన్, బాప్టిస్ట్ చర్చిల అధికారులు సంయుక్తంగా శాంతి కమిటీని రూపొందించారు. [10] ప్రెస్బిటేరియన్ మంత్రి అయిన జైరేమా, 1968 నుండీ ప్రారంభ చర్చలలో ఆధిపత్య శక్తి.[11] 1974లో లాల్‌డెంగా (రాజకీయ శరణార్థిగా లండన్‌లో ఉంటూ) తన నిబంధనలను అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి సమర్పించినప్పుడు ఎమ్‌ఎన్‌ఎఫ్‌కు ప్రభుత్వానికి మధ్య మొదటి ప్రధాన సంభాషణ జరిగింది. కానీ ప్రయోజనం లేకపోయింది.[12] 1982 నాటికి, ఒప్పందం కుదిరే అవకాశాలు కనబడలేదు. మిజోరం గవర్నర్ సౌరేంద్ర నాథ్ కోహ్లి ఈ విషయమై చర్చి పెద్దలు కృషి చెయ్యాలని కోరాడు. 1982 జూన్ 15 న ఐజాల్‌లోని సైనాడ్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ చర్చిల ప్రతినిధులు సమావేశమయ్యారు. జూలై 30న "జోరామ్ కోహ్రాన్ హ్రుయిటుట్ కమిటీ (ZKHC)" (మిజోరం చర్చిల నాయకుల కమిటీ) ఏర్పడింది. సైనిక పరిపాలనచే అణచివేయబడిన పౌరుల దృక్కోణాల నుండి వారు తాజా చర్చలు ప్రారంభించారు. ZKHC కార్యదర్శి VL రావ్నా 1983 మార్చి 1న లండన్‌లో లాల్‌డెంగాను కలుసుకుని ఆయుధాలు విడిచిపెట్టవలసిందిగా కోరాడు. మేలో ZKHC శాంతి కోసం ఉమ్మడి మెమోరాండం తయారుచేయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించింది. అన్ని పార్టీల అధ్యక్షులు సంతకం చేసిన మెమోరాండం ఇలా పేర్కొంది:
పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఈ ముప్పై ఒకటవ తేదీన, మిజోరంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ దిగువ సంతకం చేసిన మేము, మిజోరంలో రాజకీయ ప్రతిష్టంభనను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కొత్తగా చర్చలు జరపమని భారత ప్రభుత్వాన్ని, మిజో నేషనల్ ఫ్రంట్‌ను కోరుతూ మా ఐక్య వైఖరిని ప్రకటిస్తున్నాము.
కేంద్రపాలిత ప్రాంతంలో నివసించే అన్ని వర్గాల ప్రజలు ఈ అభ్యర్థనకు పూర్తి సమ్మతంగా ఉన్నారని మేము ధృవీకరిస్తున్నాము. శాంతి చర్చలు పునఃప్రారంభం కావడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సాధ్యమయ్యే ఏ సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని మేము మా ఏకగ్రీవ హామీని ప్రకటిస్తున్నాము.[13]
ఈ తీర్మానంతో వారు, 1984 మార్చి 7 న ఐజాల్‌ను సందర్శించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీని, ఏప్రిల్ 16న ఐజాల్‌ను సందర్శించిన ప్రధాని ఇందిరా గాంధీని కలిశారు. 1984 అక్టోబరులో లాల్‌డెంగా భారతదేశానికి తిరిగి వచ్చాడు. అయితే అక్టోబరు 31 న ఇందిరా గాంధీ హత్యతో తదుపరి ముందడుగుకు ఆటంకం కలిగింది. శాంతి చర్చలకు ముహూర్తం పెట్టిన రోజు సరిగ్గా అదే.[12] అనేక సార్లు సమాచార మార్పిడి తర్వాత ఎమ్‌ఎన్‌ఎఫ్, 1986లో భారత ప్రభుత్వం నిర్దేశించిన షరతులకు అంగీకరించింది.[14]
శాంతి ఒప్పందం
[మార్చు]రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవగానే, జాతీయ సామరస్యంపై దృష్టి సారించాడు. వెంటనే ఎమ్‌ఎన్‌ఎఫ్ కోసం ఒప్పంద పత్రాలను సిద్ధం చేశాడు. నిబంధనలపై లాల్‌డెంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పటి హోంశాఖ కార్యదర్శి జి.పార్థసారథి చేయగలిగినది పెద్దగా ఏమీ లేకపోయింది. రాజీవ్ ప్రభుత్వం లాల్‌డెంగా చేసిన కింది డిమాండ్లను అంగీకరించలేకపోవడమే దీనికి కారణం:
- ఎమ్‌ఎన్‌ఎఫ్ సభ్యులందరినీ నేరారోపణల నుండి విముక్తి చేయాలి.
- రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించని పక్షంలో మిజోరంలో భారత పార్లమెంటు చట్టం ఏదీ చట్టబద్ధం కాకూడదు.
- మిజోరం ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి. విశ్వవిద్యాలయం, హైకోర్టు ఇవ్వాలి. [15]
1985 సెప్టెంబరు నుండి ప్రారంభమయ్యే చర్చల కోసం రాజీవ్ గాంధీ, RD ప్రధాన్‌ను నియమించాడు. వరుస ఒప్పందాల వైఫల్యాల తర్వాత ప్రధాన్, తన పుట్టినరోజు 1986 జూన్ 27 న న్యూ ఢిల్లీలోని తన కార్యాలయంలో టీ తాగడం కోసం లాల్‌డెంగాను ఆహ్వానించాడు. ప్రధాన్ మూడు రోజుల్లో పదవీ విరమణ చేయవలసి ఉన్నందున, లాల్‌డెంగా నిజంగా శాంతిని కోరుకుంటే, తన తర్వాత వచ్చే వారసులు మెరుగైన నిబంధనలను అందించే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి, అతను వెంటనే ప్రభుత్వ నిబంధనలకు అంగీకరించాలని ప్రధాన్ లాల్‌డెంగాకు చెప్పాడు. రెండు రోజుల మౌనం తరువాత లాల్‌డెంగా, జూన్ 30 మధ్యాహ్నం శాంతి నిబంధనలను అంగీకరించడానికి ప్రధాన్ కార్యాలయంలోకి ఒంటరిగా వెళ్ళాడు. కానీ అప్పుడు ప్రధాన్ తన కార్యాలయం వీడి వెళ్ళిపోతున్నాడు. అతను లాడెంగాతో మాట్లాడుతూ, ఇకపై ఫంక్షన్ జరిపే అధికారం తనకు లేదని చెప్పాడు. లాల్‌డెంగా వినతి మేరకు, ప్రధాన్ సాయంత్రం 4:30 కి, తన వీడ్కోలు పార్టీ తర్వాత ఆయనను కలవడానికి అంగీకరించాడు. నిర్ణీత సమయానికి, వారు 7 రేస్ కోర్స్ రోడ్‌కి వెళ్లారు, అక్కడ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. గాంధీ, ప్రధాన్ పదవీ కాలాన్ని ఆ అర్ధరాత్రి వరకు పొడిగించాడు. 1986 మిజోరం ఒప్పందం: మెమోరాండం ఆఫ్ సెటిల్‌మెంట్ ను రాత్రి 8:30 కి తయారైంది. లాల్‌డెంగా భార్య, ఎమ్‌ఎన్‌ఎఫ్ అధికారులు, అప్పటి మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా ల సమక్షంలో, ఒప్పందంపై సంతకాలు చేసి 9:30కి బహిరంగంగా ప్రసారం చేసారు. దానిపై ఎమ్‌ఎన్‌ఎఫ్ తరపున లాల్‌డెంగా, భారత ప్రభుత్వం తరపున హోం సెక్రటరీ RD ప్రధాన్, మిజోరం ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి లాల్ఖమా సంతకం చేశారు. ప్రభుత్వపు రెండు ప్రధాన డిమాండ్లు ఏమిటంటే, ఎమ్‌ఎన్‌ఎఫ్ హింసాత్మక కార్యకలాపాలను నిలిపివేస్తుంది, భారత ప్రభుత్వ నియమాలకు కట్టుబడి ఉంటుంది.[16]
ముఖ్యమైన నియమ నిబంధనలు
[మార్చు]ఒప్పందం క్రింది నిబంధనలు, షరతులకు లోబడి ఉంది:[17]
- మిజో నేషనల్ ఫ్రంట్ అన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించాలి.
- ఎమ్‌ఎన్‌ఎఫ్ భారత రాజ్యాంగానికి అనుగుణంగా దాని రాజ్యాంగాలను సవరించాలి.
- ఎమ్‌ఎన్‌ఎఫ్ త్రిపుర నేషనల్ వాలంటీర్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ మణిపూర్, ఇతర అనుబంధ విప్లవ సంస్థలకు మద్దతు ఇవ్వడం నుండి వైదొలగాలి.
- ప్రభుత్వం అన్ని అజ్ఞాత వ్యక్తులకు అవసరమైన పరిష్కారం, పునరావాసం కల్పించాలి.
చట్టబద్ధత
[మార్చు]- కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మిజోరంను పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971లోని సెక్షన్ 6లో పేర్కొన్న ప్రకారం మిజోరం భూభాగం ఉండాలి.
- సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత, భారత రాష్ట్రపతి మిజోరం శాసనసభకు ఎన్నిక నిర్వహించాలి.
- "స్పెషల్ కేటగిరీ స్టేట్" కేసు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందించాలి.
- పొరుగు దేశాలతో (అంటే బంగ్లాదేశ్, మయన్మార్) ఒప్పందాలు కుదుర్చుకున్నాక సరిహద్దు వాణిజ్యాన్ని చట్టబద్ధం చేయాలి.
- ఇన్నర్‌లైన్ రెగ్యులేషన్ (మిజోరంలో అనధికారిక సందర్శన లేదా బసను పరిమితం చేస్తుంది) అమలులో ఉండాలి.
- కొత్త రాష్ట్రం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థానిక మాండలికాలను అధికారిక భాషగా స్వీకరించగలదు.
- రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు.
- రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు (రాష్ట్రం కోరుకుంటే).
- మిలిటరీ ఆక్రమించిన స్థలాలకు, 1966 తిరుగుబాటులో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది.
ఫలితం
[మార్చు]ఎమ్‌ఎన్‌ఎఫ్ తమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించింది. దానితో స్వాతంత్ర్యం కోసం, గ్రేటర్ మిజోరం కోసం చేసిన తన పోరాటాన్ని ఎమ్‌ఎన్‌ఎఫ్ విరమించుకుంది. [18] వేడుకలో భాగంగా, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా 1986 జూలైలో మిజోరంలో మూడు రోజుల సద్భావన పర్యటన చేశారు. మిజోరంలో అధికార రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్, తమ శాసనసభ పదవీకాలాన్ని వదులుకుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎమ్‌ఎన్‌ఎఫ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా లాల్‌డెంగాతో పాలక శాసనసభా పక్షంగా మారింది. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్‌ఎన్‌ఎఫ్ విజయం సాధించి లాల్‌డెంగా ముఖ్యమంత్రిగా కొనసాగాడు.[19]
1986 ఆగస్టు 7 న మిజోరం రాష్ట్ర హోదాను భారత ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది.[4] మిజోరం 1987 ఫిబ్రవరి 20 న భారత యూనియన్‌లో 23వ రాష్ట్రంగా అవతరించింది.
1990 జూలై 5 న హైకోర్టు (గౌహతి హైకోర్టు ఐజాల్ బెంచ్) ను స్థాపించారు.[20]
ఒప్పందం కుదిరిన దశాబ్దంన్నర తర్వాత, ఒప్పందంలో భాగమైన మిజోరం విశ్వవిద్యాలయాన్ని 2000 ఏప్రిల్ 25 న పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించారు. విశ్వవిద్యాలయం అధికారికంగా 2001 జూలై 1 న మొదలైంది.[21] ఇది ఇప్పుడు మిజోరంలోని అన్ని కళాశాలలు, వృత్తిపరమైన విద్యా సంస్థలను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Mizoram Accord, 1986" (PDF). United Nations Peacemaker. Retrieved 4 June 2020.
- ↑ Bhattacherjee, S. (20 June 2011). "Accord most successful in the country, says Mizo CM 'Sundry factors ensured peace'". The Telegraph. Retrieved 24 December 2018.
- ↑ Sharma, S.K. (2016). "Lessons from Mizoram Insurgency and Peace Accord 1986" (PDF). www.vifindia.org. Vivekananda International Foundation. Retrieved 24 December 2018.
- ↑ 4.0 4.1 Hazarika, S. (30 September 2016). "'There is Peace in Mizoram Because of Its Brutal Past'". The Wire. Retrieved 24 December 2018.
- ↑ Lewin TH Col. (2007) [1912]. A Fly on the Wheel: Or, How I Helped to Govern India. UK: Oxford University Press. pp. 2656–290.
- ↑ Aplin, K.; Lalsiamliana, J. (2010). "Chronicle and impact of the 2005-09 Mautam in Mizoram". In Singleton, G.; Belmain, S.; Brown, P.; Hardy, B. (eds.). Rodent outbreaks : ecology and impacts. Metro Manila, Philippines: International Rice Research Institute. pp. 22–23. ISBN 978-971-22-0257-5.
- ↑ Sharma, S.K. (2016). "Lessons from Mizoram Insurgency and Peace Accord 1986" (PDF). www.vifindia.org. Vivekananda International Foundation. Retrieved 24 December 2018.
- ↑ Wangchuk, R.N. (2 July 2018). "Mizo Peace Accord: The Intriguing Story Behind India's Most Enduring Peace Initiative!". The Better India. Retrieved 26 November 2019.
- ↑ 9.0 9.1 Nunthara, C. (1981). "Grouping of Villages in Mizoram: Its Social and Economic Impact". Economic and Political Weekly. 16 (30): 1237, 1239–1240. JSTOR 4370043.
- ↑ Pudaite, L.T. (2008). "Negotiating with insurgency and holding on to peace: The Mizoram Experience". In Patnaik, J.K. (ed.). Mizoram, Dimensions and Perspectives: Society, Economy, and Polity. New Delhi, India: Concept Publishing Company. pp. 23–44. ISBN 978-81-8069-514-8.
- ↑ William Sing, N. (26 August 2014). "The fall of kohhran swarkar in Mizoram". Himal Southasian. Retrieved 28 December 2018.
- ↑ 12.0 12.1 Sharma, S.K. (2016). "Lessons from Mizoram Insurgency and Peace Accord 1986" (PDF). www.vifindia.org. Vivekananda International Foundation. Retrieved 24 December 2018.
- ↑ Chhetri, P. (23 August 2011). "The Chruch [sic] Role in the Mizoram Peace Accord". Eastern Panorama. Retrieved 28 December 2018.
- ↑ (2009). "The Mizo People: Problems and Future". Retrieved on 17 December 2018. Archived 2021-10-22 at the Wayback Machine
- ↑ Memo Sigh, L. (25 June 2014). "The Mizo Accord". Imphal Free Press. Archived from the original on 24 December 2018. Retrieved 24 December 2018.
- ↑ Singh, S (30 June 2016). "In fact: Happy Birthday peace: The Mizo Accord turns 30". The Indian Express. Retrieved 24 December 2018.
- ↑ "Mizoram Accord, 1986" (PDF). United Nations Peacemaker. Retrieved 4 June 2020.
- ↑ Sharma, S.K. (2016). "Lessons from Mizoram Insurgency and Peace Accord 1986" (PDF). www.vifindia.org. Vivekananda International Foundation. Retrieved 24 December 2018.
- ↑ "Mizoram Assembly Election Results 1987". www.elections.in. Retrieved 2021-03-31.
- ↑ Meitei, S.N. (2008). "High court in Mizoram: The structure and function of Aizawl Bench". In Patnaik, J.K. (ed.). Mizoram, Dimensions and Perspectives: Society, Economy, and Polity. New Delhi, India: Concept Publishing Company. pp. 435–445. ISBN 978-81-8069-514-8.
- ↑ Jacob, M. (22 August 2013). "Brave New phase of Mizoram". The Telegraph. Retrieved 24 December 2018.