Jump to content

కురుక్షేత్ర సంగ్రామం

వికీపీడియా నుండి
(మహాభారత యుద్ధం నుండి దారిమార్పు చెందింది)
కురుక్షేత్ర సంగ్రామం
తేదీఅనేక విశ్వాసాలు , ఆధారాల ప్రకారం, క్రీ.పూ. 3000 - 1000 ల మధ్య [1]
ప్రదేశంకురుక్షేత్ర , నేటి హర్యానా, భారత్.
ఫలితంపాండవుల విజయం
ప్రత్యర్థులు
పాండవులు - సైన్యాధిపతి- దృష్టద్యుమ్నుడుకౌరవులు - సైన్యాధిపతి - భీష్ముడు
సేనాపతులు, నాయకులు
అర్జునుడు
భీముడు
యుధిష్ఠిరుడు
నకులుడు
సహదేవుడు
భీష్ముడు
ద్రోణుడు
కర్ణుడు
దుర్యోధనుడు
అశ్వత్థామ
బలం
7 అక్షౌహిణులు
1,530,900 సైనికులు
11 అక్షౌహిణులు
2,405,700 సైనికులు
ప్రాణ నష్టం, నష్టాలు
దాదాపు మొత్తం
కేవలం 8 మంది బ్రతికారు - ఐదుగురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు
దాదాపు మొత్తం
కేవలం ముగ్గురు బ్రతికారు - అశ్వత్థామ, కృప, , కృతవర్మ

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.

కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

పూర్వ చరిత్ర

[మార్చు]
మహాభారత కాలం నాటి భారతదేశం.

మహాభారతం, ఒక అతి ముఖ్యమైన హిందూ పురాణ కథ. ఇది కురు వంశీయుల జీవితాలను, వారి అనేక తరాల రాజ్యాధికారాన్ని, పరిపాలనను తెలుపుతుంది. ఈ గాథ మూలం కురువంశానికి చెందిన రెండు దాయాది కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. కురుక్షేత్రం, అనగా కురు వంశీయుల స్థలము , ఈ 'కురుక్షేత్ర' యుద్ధానికి రణరంగము. కురుక్షేత్రం ధర్మక్షేత్రం (ధర్మం యొక్క స్థలము ), లేక field of righteousness గా కూడా ప్రసిద్ధి. ఈ స్థలాన్నే యుద్ధానికి ఎంపిక చెయడానికి మహాభారతంలో ఒక కారణం చెప్పబడింది: ’’ఈ నేలపైన పాపము చేసిననూ ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుంది.’’

ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన వైరి పక్షాలు పాండవులు, కౌరవులు. అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య, రాజ్యకాంక్ష. జూదము ద్వారా పాండవుల రాజ్యాన్ని గెలుచుకోవాలని అతడు సంకల్పించాడు. శకుని సాయంతో అతడు ఆటను మోసపూరితంగా గెలిచి సోదరులైన పాండవులను పదమూడేళ్ళ పాటు అరణ్యవాసానికి పంపాడు. అరణ్యవాసం తర్వాత దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం ఈ యుద్ధానికి దారితీసింది.

తమ కుటుంబంలోని పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని మొదలైన వారికి యుద్ధమును గూర్చి సమాచారమును అందించి ఒక శాంతియుత ఒప్పందం ద్వారా యుద్ధాన్ని నివారించడంలో తోడ్పడమని శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు, పాండవులకు సలహా ఇచ్చాడు.[2] ఈ ప్రతిపాదన కౌరవుల చెంత ఉండగానే, పాండవులు వారి యుద్ధ సన్నాహాలు చేసుకోసాగారు. వారు ఇరుగు పొరుగు దేశాల సహాయమును అర్థించసాగారు.

శాంతి ప్రయత్నాలు

[మార్చు]

శాంతియుత పరిష్కారం కోసం ఇరుపక్షాల మధ్య నాలుగు రాయబారాలు జరిగాయి. అవి:

  • పాండవుల తరపున ద్రుపద పురోహితుడు: కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయబారం విఫలమైంది.
  • ధృతరాష్ట్రుని తరపున కౌరవుల రాయబారిగా సంజయుడు: ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయబారం విఫలమైంది.
  • పాండవుల తరపున శ్రీకృష్ణుడు: ఇది మహాభారత యుద్ధానికి దారితీసిన నిర్ణయాత్మకమైన రాయబారం. సూదిమొన మోపినంత భూమి కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చిచెప్పడంతో రాయబారం విఫలమైంది, యుద్ధం అనివార్యమైంది.
  • కౌరవుల తరపున శకుని కుమారుడు ఉలూకుడు: సన్నాహాలన్నీ పూర్తై, యుద్ధం మొదలయ్యేందుకు కొద్దిగా ముందు ఈ ప్రయత్నం జరిగింది. నిజానికి ఇది శాంతి రాయబారం కాక, పాండవులను కించపరచేందుకు దుర్యోధనుడు జరిపిన ప్రయత్నం మాత్రమే.

కృష్ణ రాయబారం

[మార్చు]

శాంతి ప్రయత్నాల్లో ప్రధానమైనది, నిర్ణయాత్మకమైనదీ కృష్ణ రాయబారం. సంజయుడు రాయబారిగా వచ్చినపుడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా హస్తినాపురానికి వచ్చి శాంతి ప్రయత్నం చేస్తానని అతడికి చెప్పి పంపించాడు. ఆ ప్రకారమే హస్తినాపురం వెళ్ళి, అక్కడ తన ప్రియ భక్తుడు, ధృతరాష్ట్రుని మంత్రీ అయిన విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తన ఆహ్వానాన్ని మన్నించి రాజభవనానికి విందుకు రాలేదని ధుర్యోధనుడు అవమానంగా భావించాడు. ఎలాగైనా సరే శాంతి ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని, శ్రీకృష్ణుని నిర్భంధించాలనీ అతడు పథకం వేశాడు.

కురుసభలో శ్రీకృష్ణుడు చెప్పిన శాంతివచనాలు వేటినీ దుర్యోధనుడు చెవిన పెట్టలేదు. పాండవులు చెప్పమన్నట్లే కనీసం ఐదు ఊళ్ళైనా ఇవ్వమని చెప్పాడు. ఐదు ఊళ్ళు కాదుగదా, సూదిమొన మోపినంత భూమిని కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చి చెప్పాడు. పైగా శ్రీకృష్ణుని బంధించమని సైనికులను ఆజ్ఞాపించాడు. అతని అజ్ఞానానికి శ్రీకృష్ణుడు నవ్వుకుని ఆ సైనికులందరికీ కంటిచూపు లేకుండా చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ స్వరూపాన్ని సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాత్రమే చూడగలిగారు. చివరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ధర్మం నిలబెట్టడానికి యుద్ధం అనివార్యమని తెలుపడానికి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు పయనమయ్యాడు.

యుద్ధ సన దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది. అంతేకాక శ్రీకృష్ణుడే స్వయంగా గొప్ప యోధుడు. కాబట్టి ఆయన సహాయం అర్థించడానికి ఇద్దరూ ద్వారకా నగరానికి వెళ్ళారు. ఇది కృష్ణుని భక్తులకు చాలా ఆసక్తికరమైన ఘట్టం. ముందుగా దుర్యోధనుడు వస్తాడు. అప్పటికి కృష్ణుడు నిద్రపోతూంటాడు. స్వతహాగా గర్విష్టి అయిన ధుర్యోధనుడు కృష్ణుని తల దగ్గర ఉన్న ఆసనంపై కూర్చుని కృష్ణుడు నిద్ర నుంచి లేవడం కోసం ఎదురుచూస్తుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. నిగర్వి,, కృష్ణుని పట్ల భయభక్తులు కలిగిన అర్జునుడు ఆయన పాదాల చెంత కూర్చుని ఎదురు చూస్తుంటాడు. కృష్ణునికి నిద్ర లేవగానే అర్జునుడు కనిపిస్తాడు. అప్పుడు ముందుగా అర్జునుని పలకరించి విషయమడుగుతాడు. నిరాయుధుడైన తాను ఒక పక్షం, తన సైన్యమంతా మరో పక్షంగా చేసి రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమని ముందుగా అర్జునునికి అవకాశమిస్తాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఎక్కడ అశేష సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిన ధుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణే తన పక్షాన రమ్మని కోరడంతో ఊపిరి పీల్చుకుంటాడు. అర్జునుణ్ణి మూర్ఖుడిగా భావిస్తాడు. ఇద్దరూ సంతృప్తిగా తిరిగి వెళతారు. తరువాత శ్రీకృష్ణుని తన రథసారథిగా ఉండమని అర్జునుడు వేడుకుంటాడు. దీనివల్లే శ్రీకృష్ణునికి పార్థసారథి అనే పేరు వచ్చింది.

విరాట రాజ్యంలోని ఉపప్లావ్యములో పాండవులు యుద్ధసన్నాహాలు చేసి అన్ని ప్రాంతాల నుండి 7 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు. కౌరవులు 11 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు.

పాండవ సైన్యం

[మార్చు]
మహాభారత యుద్ధం గురించి తెలుపుతున్న ఒక ప్రతి.

శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు తన సోదరులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరాడు. మొత్తం పాండవ సైన్యాన్ని ఏడు అక్షౌహిణులుగా విభజించాడు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, ద్రుష్ట్యద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో దృష్ట్యద్యుమ్నుని సర్వసైన్యాధిపతిగా నియమించాడు. అదనంగా కేకయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలగు రాజ్యాల సైన్యాలు పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి.

కౌరవ సైన్యం

[మార్చు]

దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం వహించమని భీష్ముని అభ్యర్థిస్తాడు. భీష్ముడు తాను కృతనిశ్చయుడనై యుద్ధము చేస్తాననీ, కానీ తాను పాండవులకు హాని చేయటం గానీ తన గురువు పరశురాముని అవమానించిన కర్ణుని తన సైన్యంలోకి తీసుకోవటం జరగదనే షరతులతో ఆమోదిస్తాడు. పాండవులపై అనురాగంతో, భీష్మ-కర్ణ సమేతమై దుర్భేధ్యమైన ‍‍‍కౌరవ సైన్యంతో పాండవులు పోరలేరని భీష్ముడు ఇలా నిర్ణయించాడని ఒక భావన. ధుర్యోధనుడీ షరతులనంగీకరించి భీష్ముని సర్వసైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవసేన పదకొండు అక్షౌహిణులు. సేనలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమరిది జయద్రధుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోను, కొందరు హస్తినాపురము మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయ పడతారు.

మధ్యస్థులు

[మార్చు]

విదర్భ రాజు రుక్మి, అతని రాజ్యం, బలరాములు మాత్రమే ఈ యుద్ధంలో మధ్యస్థులుగా ఉన్నారు.[3]

సైన్య విభాగాలు , అస్త్ర శస్త్రాలు (ఆయుధాలు)

[మార్చు]

పాండవ సైన్యం మొత్తం 7 అక్షౌహిణులయితే కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు. 21,870 రథబలం, 21,870 గజబలం, 65,610 అశ్వబలం, మరియూ 109,350 కాల్బలం (పదాతిదళం) కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది. అక్షౌహిణిలో రథ, గజ, అశ్వ, పదాతి దళాలు 1:1:3:5 నిష్పత్తిలో వుంటాయి. ఈ విదంగా ఇరుసైన్యాలలోని బలాలనన్నీ కలిపితే ముప్పై లక్షల తొంభై నాలుగువేల మంది (3094000) అవుతారు. ఒక్కో అక్షౌహిణికీ ఒక్కో సైన్యాదిపతీ, సైన్యంమొత్తానికి సర్వసైన్యాద్యక్షుడు నాయకత్వం వహిస్తారు. భారతయుద్ధంలో 18 కి విశేష ప్రాధాన్యత ఉంది, సైన్యంలో ఏ విభాగాన్ని కూడినా వచ్చేసంఖ్య 18, ఇరు సైన్యాలను కలిపితే 18 అక్షౌహిణులు అవుతాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయి, యుధ్ధం కూడా 18 రోజులే జరిగింది. ఈ విదముగా 18 సంఖ్య భారతంలో విశిష్టతను సంతరించుకుంది.

కురుక్షేత్రయుద్ధంలో అనేక అయుధాలు వాడారు. భీష్మ, ధ్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు, భీమ, ధుర్యోధనులు గదను, ధర్మరాజు, శల్యుడు శూలాన్నీ వాడారు. ఇవికాక కత్తులు, బాకులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు.

భారతాన్ని చారిత్రక సత్యంగా గుర్తిస్తే, కురుక్షేత్రయుద్ధాన్ని చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్పవచ్చు. 18 రోజులలోనే ఇరుసైన్యాలలో దాదాపుగా అందరూ మరణిస్తారు. అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒకే రోజులో ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని హతమార్చాడు. ఈవిదంగా యుద్ధం అసంఖ్యాక విధవలని, అంగవికలురని మిగిల్చి తద్వారా ఆర్థిక మాంధ్యానికి కారణమై కలియుగానికి దారితీసిందని చెప్పవచ్చు.

యుద్ధ వ్యూహాలు

[మార్చు]

యుద్ధ సమయంలో ఇరు పక్షాలూ తమ తమ సేనలను వివిధ వ్యూహాలలో సమాయత్తం చేసుకొన్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించ దలచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలాబలాలను ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లున్నాయి.[4]

చక్రవ్యూహంలో అభిమన్యుడు ప్రవేశించే చిత్రం రాతిపై శిల్పరూపంలో.

వ్యూహ రచన గురించి "డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు" ఇలా రాశాడు[5] -

విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు. అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది, మకర వ్యూహంలో మకరం అంటే మొసలి, మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు. కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి. శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం (బండ) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి.

రోజువారీగా యుద్ధ విశేషాలు

[మార్చు]

వివిధ దినాలలో కురు పాండవ సేవలు పన్నిన వ్యూహాలిలా ఉన్నాయి.

యుద్ధం రోజు పాండవ వ్యూహం కౌరవ వ్యూహం విశేషాలు
1 వజ్ర వ్యూహం సర్వతోముఖ వ్యూహం కృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలునరించ గలిగారు. ఆరోజు పాండవులు చింతా క్రాంతులయ్యారు.
2 క్రౌంచ వ్యూహం త్రికూట వ్యూహం అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోల పరచాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోవడం భీష్మ ద్రోణులకు కూడా సాధ్యం కాలేదు.
3 అర్ధచంద్ర వ్యూహం గరుడ వ్యూహం భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావానలంలా దహించాడు.
4 ? ? అభిమన్యుడు, భీముడు విజృంభించారు. తొమ్మండుగురు కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయాయుద్ధంతో కౌరవసేన కకావికలయ్యింది.
5 శ్యేన వ్యూహం మకర వ్యూహం పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయింది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు పదిమంది మరణించారు. అర్జునుడు పాతికవేల రథికులను నిర్జించాడు.
6 మకర వ్యూహం క్రౌంచ వ్యూహం భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు.
7 వజ్ర వ్యూహం మండల వ్యూహం కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శ్రుతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు.
8 శృంగాటక వ్యూహం కూర్మ వ్యూహం భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది.
9 ? సర్వతోభద్ర వ్యూహం భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారియై భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకొన్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్థించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు
10 ? ? భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరేవైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు.
11 క్రౌంచ వ్యూహం శకట వ్యూహం కౌరవ సేనాపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటిరోజు అర్జునుని రణరంగంనుండి దూరంగా తీసుకెళ్ళాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు.
12 మండలార్ధ వ్యూహం గరుడ వ్యూహం సంశప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణునివల్ల వ్యర్ధమయింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణార్జునులు తొలి ద్వంద్వయుద్ధం చేశారు. మరునాడు అర్జునుని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలని, తిరిగి రానీయమని సంశప్తకులు మాట యిచ్చారు.
13 (సాధారణ వ్యూహం) పద్మ (చక్ర) వ్యూహం
(తమ్మి మొగ్గరము)
ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రధుడు వ్యూహ ద్వారంలో ఆపేశాడు. ఒంటరియైన అభిమన్యుడు ఏడుమార్లు తనను చుట్టుముట్టినవారిని మట్టి కరిపించారు. ఎనిమిదవ సారి అభిమన్యుని అన్నివైపులనుండి చుట్టుముట్టి వెనుకనుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు.
14 ? శకటవ్యూహం +
పద్మవ్యూహం +
సూచీవ్యూహం
ద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు.
15 ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు "అశ్వత్థామ" (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు.
16 అర్ధచంద్ర వ్యూహం మకర వ్యూహం అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు.
17 దుర్జయ వ్యూహం ? దుర్యోధనుని ప్రార్థననంగీకరించి కర్ణునికి సారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రథం భూమిలో దిగబడినపుడు అర్జునుడు అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు.
18 త్రిశూల వ్యూహం సర్వతోభద్ర వ్యూహం దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధారసైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసరారణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాటాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి అక్కడవదిలేసి వెళ్ళారు. తరువాత అర్జునుని కపికేతనం, దివ్యాస్త్రాలు అదృశ్యమయ్యాయి. రథం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి అపాండవం చేస్తానని మాట యిచ్చాడు. (తరువాతి కథ "సౌప్తిక పర్వం"లో ఉంది.)

యుద్ధ నియమాలు

[మార్చు]

యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాద్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు. ఈనియమాలు

  • సూర్యోదయం తోనే యుద్ధం మొదలుపెట్టి, సూర్యాస్తమయంతో విరమించాలి
  • ఒకవీరునితో ఒకేవీరుడు తలపడాలి, అనేకమంది కలసి ఒకేవీరునితో పోరాడరాదు
  • రథికులు రథికులతో, ఆశ్వికులు ఆశ్వికులతో, గజబలం గజబలంతో, పదాతులు పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి
  • యుద్ధవాయిద్యాలు మ్రోగించే వారిని చంపరాదు
  • వాగ్యుద్ధం కోరేవారిపై శస్త్రాలను సంధించరాదు
  • అలసినవారిని, గాయపడినవారిని, పారిపోతున్నవారిని, యుధ్ధంలో పాల్గొనని మనుషి లేదా జంతువును చంపరాదు
  • శరణువేడినవారిని వధింపరాదు, అయితే శరణార్ధి యుద్ధ ఖైదీగా బానిసగా వుంటాడు
  • యుద్ధనియమాలని తు.చ తప్పక పాటించాలి.

అయితే ఇంచుమించు ఈ యుద్ధనియమాలన్నిటినీ ఇరుపక్షాలు ఒక్కసారైనా ఉల్లంఘించాయి.

యుద్ధ కార్యక్రమం

[మార్చు]

కురుక్షేత్ర యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది. యుద్ధం పగటిపూట మాత్రమే జరిగేది, సూర్యాస్తమయం కాగానే పోరాటాన్ని అపేసేవారు. కురుక్షేత్రం వద్ద గల ఒక విశాల ప్రదేశంలో సైన్యాలు తలపడ్డాయి. ద్వంద్వయుద్ధాలతో పాటు మూకుమ్మడి దాడులు కూడా ప్రతీ రోజూ జరిగే యుద్ధంలో భాగంగా ఉండేవి. రోజువారీ పోరులో విజేతలెవరో, విజితులెవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు కావు, మృత కళేబరాల సంఖ్య మాత్రమే. మరణం సంభవించేదాకా జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడే విజేత.

యుద్ధానికి ముందు

[మార్చు]

యుద్ధపు మొదటిరోజున, రాబోయే మిగతా అన్నిరోజుల్లోలాగే, కౌరవ సేన పశ్చిమాభిముఖంగా నిలబడగా, పాండవ సేన తూర్పు ముఖంగా మోహరించింది. కౌరవ సేనను సర్వతోముఖవ్యూహంలో మోహరించారు: ఏనుగులు దాని దేహంగా; రాజులు శిరస్సుగా; అశ్విక దళం ఇరు పార్శ్వాలుగా ఉన్నాయి. భీష్ముడు, తన మహారథికులైన ద్రోణుడు, బాహ్లికుడు, కృపులతో సంప్రదించి వెనుక భాగాన ఉండేందుకు నిర్ణయించుకున్నాడు.

ధర్మరాజు, అర్జునుడు పాండవులు సేనను వజ్రవ్యూహంగా మోహరించారు. తమ సేన కౌరవ సేన కంటే చిన్నది కావడాన తమ సైనికుల్లోని ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువమంది శత్రుసైనికులను ఎదుర్కొనేలా వారీ వ్యూహాన్ని రచించారు. ముందు వరుసల్లో ఉండి పోరాడే సైనికుల వెనక ధానుష్కులు దాగి, తమ బాణవర్షంతో శత్రువును నివ్వెరపరచే వ్యూహం ఇందులో ఇమిడి ఉంది. ముందున్న సైనికులు కత్తులు, గొడ్డళ్ళు, గదలు, బల్లేల వంటి పొట్టి ఆయుధాలతో పోరాడేవారు.

కౌరవ సేనలో పది అక్షౌహిణులను ప్రధాన విభాగంగా మోహరించగా, పదకొండవ అక్షౌహిణిని నేరుగా భీష్ముని నియంత్రణలో ఉంచారు. భీష్ముని రక్షణ ఈ సేన లక్ష్యాల్లో ఒకటి. దుర్యోధనుడు తన ఆశలన్నిటినీ సర్వ సైన్యాధిపతియైన భీష్మునిపైనే పెట్టుకున్నాడు కాబట్టి, అతడి వ్యూహానికి ఆ మహాయోధుడి క్షేమమే కీలకం. దుశ్శాసనుడు భీష్ముని రక్షకదళానికి అధిపతి.

విశ్వరూప ప్రదర్శనం, గీతోపదేశం

రెండు సైన్యాలు మోహరించి ఉండగా ఎదురుగా ఉన్న కౌరవసైన్యంలోని తాత (భీష్ముడు), గురువు (ద్రోణుడు) మొదలైనవారిని చూసాడు అర్జునుడు. అంతేకాదు, వందమంది సోదరులతో సహా బంధుగణం మొత్తాన్నీ, అశ్వత్థామ వంటి మిత్రులనూ కూడా శత్రుసైన్యంలో గమనించి దుఃఖంతో కుంగిపోయాడు. నిరాశలో కూరుకుపోయి, దిక్కుతోచక చేష్టలుడిగిన అర్జునుడు మార్గదర్శనం కోసం తన సారథి, గురువు, మిత్రుడూ ఐన శ్రీకృష్ణుని వేడుకున్నాడు. కృష్ణుడు అర్జునుడి నిరాశను పోగొట్టి, కర్తవ్యాన్ని బోధించి, అతణ్ణి సమరోన్ముఖుణ్ణి చేసాడు. కృష్ణుడి ఈ బోధనలే సుప్రసిద్ధ ధార్మిక గ్రంథమైన భగవద్గీతగా రూపొందాయి. ఈ యుద్ధం ధర్మానికి, అధర్మానికీ మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణిస్తూ ధర్మస్థాపన కోసం అధర్మపక్షం వహించినవా రెవరినైనా సంహరించాల్సిందేనని, అది అర్జునుని కర్తవ్యమనీ కృష్ణుడు బోధించాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా తన కర్మను ఆచరించాలకూడా బోధించాడు. ధర్మస్థాపన కోసం ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని బోధించి, కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి ప్రదర్శించాడు.

గీతోపదేశం.

యుద్ధానికి ముందు, ధర్మరాజు ఎవరూ ఊహించని పని ఒకటి చేసాడు. అకస్మాత్తుగా తన ఆయుధాలను, కవచాదులనూ విసర్జించి, చేతులు జోడించి శత్రుపక్షం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. పాండవులు, కౌరవులూ కూడా అతడి చర్యకు విస్తుపోయారు. కత్తి దూయకముందే లొంగిపోతున్నాడేమో అని నివ్వెరపోయారు. కానీ, విజయం పొందేలా నన్ను ఆశీర్వదించమని తాత భీష్మునికి ధర్మజుడు పాదాభివందనం చెయ్యగానే అందరికీ అర్థమయింది. తాత ఆశీర్వాదం పొంది, ధర్మజుడు తన స్థానానికి తిరిగి రాగానే పోరుకు సర్వం సిద్ధమైంది.

మొదటి రోజు

[మార్చు]

యుద్ధం మొదలు కాగానే భీష్ముడు పాండవసేనను ఛిన్నాభిన్నం చేసాడు. అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు భీష్ముని ఎదుర్కొని, అతడి అంగరక్షకులను ఓడించి కౌరవ సర్వ సైనాధ్యక్షునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ఆనాటి యుద్ధంలో పాండవులు విపరీతంగా నష్టపోయారు. విరాటుని పుత్రులైన ఉత్తరుడు, శ్వేతుడు.., శల్యుడు భీష్ముల చేతుల్లో నిహతులయ్యారు. ధర్మరాజు నిరాశలో మునిగిపోగా యుద్ధంలో అంతిమ విజయం అతనిదేనని చెప్పి కృష్ణుడు ఓదార్చాడు.

రెండవ రోజు

[మార్చు]

యుద్దపు రెండవరోజున కౌరవసేన ఇనుమడించిన విశ్వాసంతో పాండవసేనను ఎదుర్కొంది. తమ సేనలో ఉత్సాహాన్ని నింపేందుకు ఏదో ఒకటి త్వరగా చెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించిన అర్జునుడు, భీష్ముని చంపాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు రథాన్ని భీష్ముని రథం దిశగా నడిపించాడు. భీష్మునితో ద్వంద్వయుద్ధం చేసేందుకు అర్జునుడు చేసిన ప్రయత్నాన్ని భీష్ముని రక్షకదళం భంగపరచడానికి ప్రయత్నించింది. ఎట్టకేలకు అర్జునుడు, భీష్ముడు ఒకరినొకరు ఎదుర్కొని అనేక గంటల పాటు తీవ్రంగా పోరాడారు. ద్రోణుడు, దృష్టద్యుమ్నుడుల మధ్య కూడా అలాగే ద్వంద్వయుద్ధం జరగ్గా, ద్రోణుడు దృష్టద్యుమ్నుడి ధనుస్సును అనేకమార్లు విరగ్గొట్టాడు. భీముడు దృష్టద్యుమ్నుని రక్షించాడు. దుర్యోధనుడు భీమునిపైకి కళింగులను పంపగా వారిలో చాలామంది భీముని చేతిలో ప్రాణాలు కోల్పోయారు. కళింగ సేనలను రక్షించేందుకు భీష్ముడు రాగా, భీమునికి చేదోడుగా ఉన్న సాత్యకి భీష్ముని సారథిని సంహరించాడు. సారథిని కోల్పోయిన భీష్ముని గుర్రాలు రథాన్ని యుద్ధభూమినుంచి దూరంగా తీసుకుపోయాయి. రెండవరోజు యుద్ధం ముగిసేటప్పటికి కౌరవ సేనలు భారీగా నష్టపోయాయి.

మూడవ రోజు

[మార్చు]

మూడవనాటి యుద్ధంలో భీష్ముడు గరుడ వ్యూహాన్ని రచించాడు. వ్యూహపు అగ్రభాగాన భీష్ముడు స్వయంగా తానే ఉండగా, వెనుకభాగాన్ని దుర్యోధనుడు ససైన్యంగా కాపు కాసాడు. దీనికి ప్రతిగా పాండవులు అర్థచంద్ర వ్యూహాన్ని రచించారు. వ్యూహపు రెండు కొనలను భీమార్జునులు రక్షిస్తున్నారు. కౌరవులు అర్జునునిపై దాడిని కేంద్రీకరించారు. అర్జునుడి రథం శత్రువుల బాణాలు, బల్లేల వర్షంలో మునిగిపోయింది. ఆ దాడిని ఎదుర్కుంటూ అర్జునుడు తన బాణాలతో రథం చుట్టూ కోట నిర్మించాడు. అభిమన్యుడు, సాత్యకి కలిసి శకునికి చెందిన గాంధార సేనలను ఓడించారు. భీముడు, అతడి తనయుడు ఘటోత్కచుడు కలిసి కౌరవసేన వెనుక భాగంలో దుర్యోధనుని ఎదుర్కొన్నారు. భీముడి ధాటికి దుర్యోధనుడు తన రథంలో మూర్ఛిల్లాడు. వెంటనే అతడి సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయి, దుర్యోధనుని ప్రమాదం నుండి తప్పించాడు. దుర్యోధనుడి రథం యుద్ధభూమి నుండి వెళ్ళిపోవడం గమనించిన అతడి సేనలు చెల్లాచెదురు కాసాగాయి. భీష్ముడు అక్కడికి చేరుకుని తిరిగి వారిలో విశ్వాసం నెలకొల్పాడు. దుర్యోధనుడు కూడా కొద్ది సేపటికి తిరిగి అక్కడికి చేరుకున్నాడు. పాండవుల పట్ల భీష్ముడు మృదువుగా వ్యవహరిస్తున్నాడనే భావనతో కినుకతో ఉన్న దుర్యోధనుడు అదే విషయాన్ని భీష్మునికి చెప్పాడు. ఈ అసత్య ఆరోపణతో బాధపడ్డ భీష్ముడు మరింత క్రోధావేశంతో పాండవసేనపై విరుచుకుపడ్డాడు. యుద్ధభూమిలో అనేక మంది భీష్ములు ఉన్నట్లుగా తోచింది.[6] పాండవసేనలో కలకలం మొదలై వారు వెనక్కి తగ్గారు.

తమ సేనలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు కృష్ణార్జునులు భీష్ముని ఎదుర్కొన్నారు. అర్జునుడు, భీష్ముడు తీవ్రమైన ద్వంద్వ యుద్ధం చేసారు. స్వయానా తన తాతపై చేస్తున్న యుద్ధం కావడంతో అర్జునుడు యుద్ధంపై మనసు నిలుపలేకపోయాడు. భీష్ముని ధాటికి అర్జునుడు ఆగలేకపోతున్నాడని గ్రహించిన కృష్ణుడు ఆగ్రహించి, భీష్ముని సంహరించేందుకు స్వయంగా తానే రథం దిగి, చక్రధారియైనాడు. వెంటనే భీష్ముడు కృష్ణుడి పాదాలపై పడి ఆ పరమాత్ముడి చేతుల్లో మరణించడం కంటే మహర్దశ మరొకటి లేదని చెబుతూ తనను సంహరించమని వేడుకున్నాడు. కృష్ణుడు శాంతించి వెనక్కి మరలగా, భీష్మార్జునుల యుద్ధం తిరిగి మొదలైంది. వారిద్దరూ శత్రుసైన్యంలోని అనేకమంది వీరులను సంహరించారు.

నాలుగవ రోజు

[మార్చు]

నాలుగవరోజు యుద్ధం భీష్ముని పరాక్రమ ప్రదర్శనకు వేదికైంది. యుద్ధ ప్రారంభం నుంచీ భీష్ముడు తన సేనతో సహా పాండవ సేనపై విరుచుకుపడ్డాడు. అనేకమంది కౌరవ యోధులు అభిమన్యుడిపై దాడి చేసారు. అర్జునుడు తన పుత్రునికి తోడుగా పోరులో పాల్గొన్నాడు. భీముడు తన గదాప్రహారాలతో కౌరవ సేనపై దాడి ప్రారంభించాడు. అది చూసిన దుర్యోధనుడు ఏనుగుల దండును భీమునిపైకి పంపాడు. తనపైకి దూసుకువస్తున్న ఏనుగులను చూసిన భీముడు రథం నుండి దూకి, తానొక్కడే వాటిని ఎదుర్కొన్నాడు. అతడి దాడికి భీతిల్లిన ఏనుగులు చెల్లాచెదురైపోయాయి. ఆ తొక్కిడిలో అనేకమంది కౌరవ సైనికులు మరణించారు. అది చూసిన దుర్యోధనుడు మరింత మంది సైనికులను భీమునిపైకి పంపాడు. వారి దాడిని ఎదుర్కొంటూనే భీముడు దుర్యోధనుని సోదరులపై దాడి చేసి, వారిలో ఎనిమిది మందిని సంహరించాడు. ఈ పోరులో రొమ్ములో బాణం గుచ్చుకుని భీముడు రథంలో కూలబడ్డాడు. అది చూసిన ఘటోత్కచుడు వీరావేశంతో కౌరవసేనపై దాడి చేసాడు. ఘటోత్కచుణ్ణి ఆ స్థితిలో ఎవరూ ఎదుర్కొలేరని తెలిసిన భీష్ముడు తన సేనను వెనక్కి రావలసినదిగా ఆదేశించాడు. సోదరులను కోల్పోయిన దుర్యోధనుడు కుంగిపోయాడు.

ఐదు నుంచి తొమ్మిదవ రోజులు

[మార్చు]

సోదరులను కోల్పోయి దుఃఖపీడితుడైన దుర్యోధనుడు నాలుగవరోజు రాత్రి భీష్ముని వద్దకు వెళ్ళాడు. తమ కంటే పెద్ద సేనను ఎదుర్కుంటూ కూడా పాండవులు యుద్ధంలో ఎలా నిలబడగలుగుతున్నారు, ఎలా జయం పొందుతున్నారు అంటూ దుర్యోధనుడు భీష్ముని ప్రశ్నించాడు. పాండవుల పక్షాన ధర్మం ఉందని చెబుతూ, పాండవులతో సంధి చేసుకొమ్మని భీష్ముడు దుర్యోధనునికి సూచించాడు.

ఐదవరోజు యుద్ధం మొదలు కాగానే ఊచకోత కొనసాగింది. భీష్ముడి దాడిలో పాండవసేన బాగా నష్టపోయింది. ద్రోణుడి దాడిని ఎదుర్కొన్న సాత్యకి అతడికి ఎదురు నిలువలేకపోయాడు. భీముడు అక్కడికి చేరుకుని సాత్యకిని రక్షించాడు. అర్జునుడు వేలమంది కౌరవ సైనికులను సంహరించాడు. ఊహకందని ఊచకోత ఆ రోజూ ఆ తరువాతి రోజుల్లోనూ కురుక్షేత్రంలో కొనసాగింది.

ఆరవనాటి యుద్ధం మహా మారణహోమానికి గుర్తుగా నిలిచిపోయింది. ద్రోణుడు అంచనాలకందని మారణకాండను సృష్టించాడు. రెండు సేనల వ్యూహాలూ చెల్లాచెదురైపోయాయి.

ఎనిమిదవనాటి యుద్ధంలో భీముడు ఎనిమిది మంది ధార్తరాష్ట్రులను సంహరించగా, కౌరవులు అర్జునుడి కుమారుడైన ఇలావంతుని సంహరించారు.

తొమ్మిదవరోజున భీష్ముని నిలువరించలేకపోతున్న అర్జునుని గమనించిన కృష్ణుడు కోపించి, భీష్ముని పైకి లంఘించాడు. అర్జునుడు మళ్ళీ కృష్ణుని ఆపాడు. భీష్ముడు ఉన్నంత వరకూ గెలవలేమని తెలిసిన కృష్ణుడు భీష్ముని ఎదిరించేందుకు ఒక స్త్రీని యుద్ధంలో నిలపాలని సూచించాడు.

పదవ రోజు

[మార్చు]
'స్మిత్ సోనియన్ సంస్థ' నుండి సేకరించిన చిత్రం అంపశయ్యపై భీష్ముడు.
పర్షియన్ భాషలోని మహాభారతం రజ్మ్ నామా యందలి చిత్రం, మరణశయ్యపై భీష్ముడు, పాండవులు, కృష్ణుడు.

భీష్ముని ధాటికి తాళలేని పాండవులు పదవరోజున శిఖండిని అతడిపై దాడికి పంపించారు. అతడు ఒకప్పుడు స్త్రీ కావడాన, అతడిపై యుద్ధం చేయనని తాను చేసిన ప్రతినకు అనుగుణంగా భీష్ముడు ధనుర్బాణాలను విసర్జించాడు. భీష్ముడిపై శిఖండి దాడి నిర్విరోధంగా, నిర్నిరోధంగా సాగింది. శిఖండి వెనుకగా దాగి, భీష్ముడి దాడిని కాచుకుని ఉన్న అర్జునుడు భీష్ముడి రక్షణ కవచాలను ఛేదించాడు. బాణవర్షంతో శరీరం తూట్లు పడిపోగా భీష్ముడు రథం నుండి నేలకొరిగాడు. శరీరంలో గుచ్చుకుని ఉన్న బాణాల కారణంగా అతడి శరీరం భూమిని తాకలేదు. ఆ బాణాలే శయ్యగా భీష్ముడికి అమరాయి. అంపశయ్యపై ఉన్న భీష్ముని చుట్టూ కౌరవులు, పాండవులు చేరారు. భీష్ముని కోరికపై అర్జునుడు మూడు బాణాలను ప్రయోగించి తలకు దిండుగా అమర్చాడు. స్వచ్ఛందమరణ వరాన్ని పొంది ఉన్న భీష్ముడు ఆ అంపశయ్యపైనే శయనించి, ఉత్తరాయన పుణ్యతిథులు ప్రవేశించిన తరువాత మరణించాడు. హస్తినాపురాన్ని అన్నిదిశలనుండి రక్షిస్తానని తండ్రి శంతనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు యుద్ధం పూర్తయ్యేవరకు జీవించ ఉన్నాడు. ధర్మరాజుకు రాజధర్మాలను బోధించాడు, విష్ణుసహస్రనామాలను స్వయంగా కృష్ణుడికి వినిపించాడు.

పదకొండవ రోజు

[మార్చు]

భీష్ముడు యుద్ధం నుంచి వైదొలిగిన తరువాత కర్ణుడు యుద్ధంలో ప్రవేశించాడు. ధుర్యోధనుడు ద్రోణుని కౌరవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షునిగా నియమించాడు. ధుర్యోధనుడు యుధిష్ఠిరుని సజీవముగా బంధించాలని కోరాడు. అందుకు ద్రోణుడు తగు వ్యూహం రచించాడు. ద్రోణుడు యధిష్టురుని విల్లును తన బాణంతో ఖండించాడు. పాండవ సైన్యం తమ నాయకుని యుద్ధఖైదీగా తీసుకువెళ్తారని భయపడింది. అంతలో అర్జునుడు రంగంలో ప్రవేశించి తన బాణాల వెల్లువతో ద్రోణుని ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు.

పన్నెండవ రోజు

[మార్చు]

ధర్మరాజును బంధించలేకపోయిన ద్రోణుడు, అర్జునుడు అండగా ఉన్నంతవరకూ అది సాధ్యం కాదని దుర్యోధనునికి చెప్పాడు. అది విని, త్రిగర్త దేశాధీశుడైన సుశర్మ తన ముగ్గురు సోదరులు, 35 మంది కుమారులతో కలిసి అర్జునుని సంహరిస్తానని లేదా తామే అతడి చేతుల్లో నిహతులమౌతామనీ ప్రతిన చేసాడు. యుద్ధభూమిలో వారు అర్జునుని ఎదుర్కొన్నారు. ఆ యుద్ధంలో సుశర్మ సోదరులు అర్జునుని చేతిలో మరణించారు. అర్జునుని ఎదుర్కొనేందుకు దుర్యోధనుడు ప్రాగ్జ్యోతిషపురానికి (నేటి అస్సాం) రాజైన భగదత్తుని పిలిపించాడు. భగదత్తుని వద్ద వేలాది ఏనుగులతో కూడిన సైన్యం ఉంది. భగదత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుపై ఎక్కి అర్జునుని ఎదుర్కొన్నాడు. సుప్రతీకము అష్టదిగ్గజములలో ఒకటి. తీవ్రంగా జరిగిన వారి పోరులో శస్త్రాస్త్ర ప్రయోగంలో అర్జునునికి భగదత్తుడు సరిజోడుగా నిలిచాడు. ఎట్టకేలకు అర్జునుడు సుప్రతీకమును చంపి ఆ వెంటనే భగదత్తుని కూడా సంహరించాడు.

ధర్మరాజును బంధించాలన్న ద్రోణుడి ప్రయత్నం కొనసాగింది కానీ, ఫలితం దక్కలేదు.

పదమూడవ రోజు

[మార్చు]

ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. త్రిగర్తులు మళ్ళీ అర్జునుని యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధభూమికి మరోవైపున వారితో యుద్ధంలో నిమగ్నమై ఉండటంతో అర్జునుడిని పద్మవ్యూహ ఛేదనకు పిలిచే వీలు లేకపోయింది. అర్జునుడు కాకుండా పద్మవ్యూాన్ని ఛేదించగలిగే శక్తి కలిగినది అతడి కుమారుడైన అభిమన్యుడికే. అయితే అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగలడుగానీ వెనక్కి తిరిగి వచ్చే పరిజ్ఞానం లేదు. ధర్మరాజు అభిమన్యుని పిలిపించి పద్మవ్యూహాన్ని ఛేదించమని ఆజ్ఞాపించాడు. అభిమన్యునికి తోడుగా వెళ్ళేందుకు ప్రయత్నించిన పాండవులను వ్యూహద్వారం వద్ద జయద్రథుడు అడ్డుకోవడంతో అభిమన్యుడు ఒంటరి వాడయ్యాడు. ఆ సమయంలో జరిగిన యుద్ధంలో అభిమన్యుడు దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణుని సంహరించాడు. అభిమన్యుని నిలువరించలేకపోయిన కౌరవులు దుర్యోధనుని ఆజ్ఞ మేరకు మూకుమ్మడిగా అతణ్ణి ముట్టడించారు. ఈ విధంగా పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కుకుని కౌరవుల మూకుమ్మడి దాడిలో అభిమన్యుడు వీరమరణం పొందాడు.

పదునాల్గవ రోజు

[మార్చు]

తన కుమారుడు అభిమన్యుడి మరణవార్త తెలుసుకుని తీవ్రంగా కోపించిన అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు జయద్రథుని సంహరిస్తానని, లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేసాడు. జయద్రథుని అన్వేషణలో అర్జునుడు ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని తుదముట్టించాడు. కౌరవ సైన్యం జయద్రథునికి రక్షణ కవచంగా నిలబడి అర్జునుడి కంట పడకుండా చూసారు. ఎట్టకేలకు మధ్యాహ్నం తరువాత అర్జునుడు జయద్రథుణ్ణి కనుగొన్నాడు. కాని అతడు కర్ణుడితో సహా మరి ఐదుగురు యోధుల రక్షణలో ఉన్నాడు. వారందరినీ జయించి జయద్రథుని సంహరించేందుకు సమయం సరిపోలేదు. సూర్యాస్తమయం కావస్తున్న సంగతి గ్రహించిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యబింబానికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రాంతిని కల్పించాడు. జయద్రథుడు సంతోషంతో రక్షణ కవచం నుండి బయటికి వచ్చాడు. వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం, అర్జునుడు జయద్రథుని సంహరించడం జరిగిపోయాయి.

ఆనాటి పోరు సూర్యాస్తమయం తరువాత కూడా కొనసాగింది. పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తూండగా ఘటోత్కచుడు గాలిలో ఎగురుతూ కౌరవ సైనికులను ఊచకోత కోసాడు. కర్ణుడు అతణ్ణి ఎదుర్కొని ఇంద్రుడు తనకు బహూకరించిన శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ధాటికి విలవిల్లాడుతూ ఘటోత్కచుడు మహాకాయుడై కౌరవసేనపై పడి మరణించాడు. అతడి కింద నలిగి వేలాదిమంది సైనికులు మరణించారు.

పదిహేనవ రోజు

[మార్చు]

ద్రోణుడి చేతిలో ద్రుపదుడు, విరాటుడు నిహతులైన తరువాత, భీముడు, దృష్టద్యుమ్నుడు పదిహేనవరోజున అతడితో పోరాడారు. మహావీరుడు, బ్రహ్మాస్త్ర ప్రయోగవేత్త ఐన ద్రోణుని జయించడం అసాధ్యమని గ్రహించాడు కృష్ణుడు. తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ద్రోణుడు ఆయుధాలను విసర్జిస్తాడని, అప్పుడు అతణ్ణి ఓడించవచ్చని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు. అపుడు భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపి ’అశ్వత్థామ మరణించాడ’ని అరిచాడు. దాన్ని నిర్ధారించుకునేందుకు ద్రోణుడు ధర్మరాజును అడగ్గా ధర్మజుడు, అశ్వత్థామ హతః, కుంజరః అని చాటాడు. కుంజరః అనే పదాన్ని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా పలికాడు. ధర్మరాజు మాటలతో తన కుమారుడు మరణించాడని నమ్మిన ద్రోణుడు హతాశుడై ఆయుధాలను విసర్జించాడు. అపుడు దృష్టద్యుమ్నుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటూ ద్రోణుడిని సంహరించాడు. అప్పటివరకు ధర్మరాజు రథం అతడి ధర్మనిరతకు ప్రతీకగా యుద్ధభూమిలో నేలను తాకకుండా నడిచేది. ఈ అసత్యం చెప్పిన తరువాత అతడి రథం గాలిలో కాక, నేలపైనే నడిచింది.

ఆ రాత్రి కుంతి తన కుమారుడైన కర్ణుని రహస్యంగా కలిసి, అతడికి స్వయానా తమ్ములైన పాండవులను సంహరించవద్దని కోరింది. కర్ణుడు అర్జునుని తప్ప మిగిలిన పాండవులను సంహరించనని ఆమెకు మాట ఇచ్చాడు.

పదహారవ రోజు

[మార్చు]

పదహారవ రోజున కర్ణుడు కౌరవసైన్యానికి సర్వసైన్యాధ్యక్షు డయ్యాడు. ఆ దినమంతా లెక్కకు మించిన యోధులు హతులయ్యారు. కర్ణార్జునుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. కర్ణుడి పరాక్రమాన్ని కృష్ణుడు కూడా ప్రశంశించాడు. చివరికి సాయంకాల సమయానికి కర్ణుడు అర్జునుని గాండీవం యొక్క నారిని తెంపగలిగాడు. ఆపై అర్జునుని సంహరించేలోగా సూర్యాస్తమయం కావడంతో యుద్ధనీతిని పాటిస్తూ కర్ణుడు యుద్ధాన్ని విరమించాడు.

ఇతర కథనాల ప్రకారం - కర్ణుడు పాండవసైన్యంపై దాడి చేసి అనేకమంది సైనికులను సంహరించాడు. అపుడు అర్జునుడు అతణ్ణి ఎదుర్కొన్నాడు. అతడు కౌరవ సైన్యంపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాడు. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో ఇరుపక్షాలు యుద్ధాన్ని విరమించాయి.[7]

పదిహేడవ రోజు

[మార్చు]

పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు భీముని, యధిష్టురుని ఓడించి వాళ్లను ప్రాణాలతో విడిచి పెట్టాడు. తరువాత కర్ణుడు అర్జునునితో ద్వందయుద్ధం కొనసాగించాడు. ఆ యుద్ధంలో కర్ణుడి రథం భూమిలో కూరుకు పోవడం వల్ల కొంత సమయం అడిగాడు. కానీ కృష్ణుడు కర్ణుడు నిరాయుధుడైన అభిమన్యుని ఘాతుకంగా చంపిన విధానము గుర్తుచేసాడు. అది విన్న తరువాత అర్జునుడు తన బాణంతో కర్ణుని వధించాడు. అదే రోజు యుద్ధంలో భీముడు దుశ్యాసనుని రథమును విరిచాడు. తరువాత భీముడు దుశ్యాసనుని పట్టుకుని చంపాడు. ఆ విధంగా ద్రౌపదిని అవమానించినపుడు తను చేసిన పతిజ్ఙ నెరవేర్చాడు.

పద్దెనిమిదవ రోజు

[మార్చు]

పద్దెనిమిదవ రోజున కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో యుద్ధం చేసారు. శల్యుని ధర్మరాజు, శకునిని సహదేవుడు, మిగిలిన ధుర్యోధనుని సోదరులను భీముడూ వధించారు. తను ఓడిపోయానని గ్రహించిన ధుర్యోధనుడు రణరంగం నుంచి పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు. పాండవులు ధుర్యోధనుని కనుగొని తమ ఐదుగురిలో ఎవరో ఒకరితో ద్వంద్వయుద్ధం చేయమన్నారు. ధుర్యోధనుడు తనతో సమానుడు అయిన భీమునితో గదాయుద్ధం చేయాలని కోరుకున్నాడు. బలరాముని పర్యవవేక్షణలో ఇరువురూ గదాయుద్ధం చేసారు. ఈ యుద్ధములో భీముడు కృష్ణుని సంజ్ఞ అనుసరించి ధుర్యోధనుని తొడపై గదతో మోది, తొడలు విరగ్గొట్టి జూదంలో ఓడిననాటి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. నడుము కింద మోదుట ధర్మయుద్ధం కానందున బలరాముడు కోపగించగా కృష్ణుడు అతనిని శాంతింపజేసాడు. తరువాత గాయపడి మరణించనున్న ధుర్యోధనుని అశ్వద్దామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిసి ప్రతీకారం చేస్తామని మాట ఇచ్చారు. ఆ రాత్రి వారు పాండవుల విడిదిపై దాడి చేసి నిద్రిస్తున్న ఐదుగురు ఉపపాండవులను, ద్రుష్ట్యద్యుమ్నుని, శిఖండిని గొంతులు కోసి సంహరించారు.

యుద్ధం తరువాత

[మార్చు]

పదునెనిమిద రోజు తరువాత పది మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికిఉన్నారు. వారు ఐదుగురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, అశ్వథ్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. యధిష్టిరుడు హస్తినాపురమునకు పట్టాభిషిక్తుడయ్యాడు. ముప్పది సంవత్సరములు పాలించిన పిదప అర్జునుని మనుమడు పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి తన సోదరులు, ద్రౌపదితో కలసి హిమాలయాలకు వెడలి పోయాడు. పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మార్గమధ్యంలో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించారు. ధర్మదేవుడు యధిష్టిరుని తన దేహంతోనే స్వర్గలోకమునకు వచ్చుటకు ఆహ్వానించాడు.

కురుక్షేత్ర సంగ్రామ చారిత్రకత

[మార్చు]

కురుక్షేత్రయుద్ధ కాలాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయి. మహాభారత గ్రథంతో పాటు మరికొన్ని గ్రంథాల ఆధారాలతో ఖగోళ దృగ్విషయాలతో సరిపోల్చుతూ యుద్ధకాలం విషయంలో అనేక సిద్ధాంతాలు ప్రతిపాదింబడ్డాయి:[8]

  • డా. ఎస్.బాలకృష్ణ: వరుసగా వచ్చిన చంద్రగ్రహణాల ఆధారంగా సా.శ.పూ 2559 గా ప్రతిపాదించాడు.
  • ప్రొ. ఐ.ఎన్.అయ్యంగార్: జమిలి గ్రహణాలు, శని, గురు గ్రహాల సమ్మేళనాల ఆధారంగా సా.శ.పూ 1478 గా నిర్ధారించాడు.
  • డా. బి.ఎన్.ఆచార్: మహాభారతంలో వివరించిన గ్రహస్థానాల ఆధారంగా సా.శ.పూ 3067 గా నిర్ణయించాడు.
  • పి.వి.హోలే: గ్రహస్థానాలు, పంచాంగాల ఆధారంగా సా.శ.పూ 3143 నవంబరు 13 గా నిర్ణయించాడు.
  • డా. పి.వి.వర్తక్: గ్రహస్థానాల ఆధారంగా సా.శ.పూ 5561 అక్టోబరు 16 గా నిర్ధారించాడు.[9]

చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-12. Retrieved 2009-06-13.
  2. C. Rajagopalachari, Mahabharata, Bharatiya Vidya Bhavan. 1994
  3. "Rukmini". www.mahabharataonline.com (in English). www.mahabharataonline.com. Archived from the original on 2008-04-03. Retrieved 2008-05-27.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. C Rajagopalachari, Mahabharata, 19954
  5. "ఈనాడు" పత్రిక ఆన్‌లైన్ ఎడిషన్ "సాహితీ సంపద" - డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు Archived 2019-08-16 at the Wayback Machine - ఈ భాగం ఈనాడు నుండి యథాతధంగా కాపీ చేయబడింది. రచయితకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో
  6. C. Rajagopalachar, Mahabharata, pp 215
  7. Sacred-Texts.com
  8. ఇతర ఆధారాలతో పాటు, 1950 కి పూర్వం ప్రచురితమైన తొమ్మిది పత్రాలలో ఖగోళ శాస్త్ర బద్ధంగా చేసిన కాలనిర్ణయం కనిపిస్తుంది ఆర్.సి.మజుందార్, ఎ.డి.పుసాల్కర్ (పరిష్కర్తలు): భారతీయుల చరిత్ర, సంస్కృతి సంపుటి I, వేదకాలం. బొంబాయి : భారతీయ విద్యా భవన్ 1951, పే.320 (fn.4)
  9. The Scientific Dating of the Mahabharat War

వనరులు

[మార్చు]


బయటి లింకు

[మార్చు]