భండారు సదాశివరావు
భండారు సదాశివరావు | |
---|---|
జననం | భండారు సదాశివరావు 1925 మే 29 |
మరణం | 2010, ఏప్రిల్ 3 అమెరికా |
వృత్తి | న్యాయవాది |
మతం | హిందూ |
భార్య / భర్త | కుసుమ |
పిల్లలు | పురుషోత్తం, ధరణి, రమణి, గిరి |
తల్లిదండ్రులు | భండారు వీరరాజేశ్వరరావు, వెంకురావమ్మ |
భండారు సదాశివరావు ప్రముఖ రచయిత, కవి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]బాల్యము, విద్యాభ్యాసము
[మార్చు]భండారు సదాశివరావు క్రోధన నామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ షష్ఠికి సరియైన 1925, మే 29వ తేదీన భండారు వీరరాజేశ్వరరావు, వెంకురామమ్మ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు. ఇతడు ఆరువేల నియోగి. పరాశర గోత్రీకుడు. కృష్ణాజిల్లాలోని వేములపల్లి అగ్రహారం ఇతని స్వగ్రామం. ఇతడు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో కొంతకాలం చదివాడు. తరువాత తండ్రి ఉద్యోగరీత్యా సూర్యాపేట, జనగామలలో చదువు కొనసాగించాడు. పిదప హనుమకొండ కాలేజియేట్ హైస్కూలులో చదివాడు. అనంతరం హైదరాబాదులో తన అన్న భండారు చంద్రమౌళీశ్వరరావు వద్ద ఉండి వెస్లీ స్కూలులో ఫిఫ్త్ ఫారంలో చేరాడు. ఆ తరువాత ఇస్లామియా స్కూలులో చదివాడు. ఆ సమయంలో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఊరేగింపులో పాల్గొన్న కారణంగా అరెస్టు కాబడి జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషను జైలులో 15 రోజులు డిటెన్షన్‌లో ఉన్నాడు. జైలు నుండి వచ్చిన తరువాత వార్ధా వెళ్లి సర్వోదయనాయకుడు ప్రభాకర్‌జీని కలిసి అతని సలహా మేరకు విద్యనభ్యసించడానికి కాశీ వెళ్లాడు. అక్కడ ఉపకార వేతనం పొంది హిందీ పరీక్షలు వ్రాసి సాహిత్యరత్న వరకు చదివాడు.
ఆర్.ఎస్.ఎస్.తో అనుబంధం
[మార్చు]1942 లో కాశీ వెళ్లిన సదాశివరావుకు ఓరుగంటి సుబ్రహ్మణ్యంతో పరిచయమైంది. అతని ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరాడు. స్వయంసేవక్‌గా కాశీలో శాఖలో శిక్షక్, ముఖ్యశిక్షక్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అక్కడే ఇతడికి ఒటిసి ప్రథమవర్ష పూర్తి అయ్యింది. వరంగల్లుకు తిరిగి వచ్చి రెండవ సంవత్సరం ఒటిసిలో పాల్గొన్నాడు. తరువాత నందిగామలో ప్రచారక్‌గా నియమించబడ్డాడు. ఆర్.ఎస్.ఎస్.పై మొదటి నిషేధం సమయంలో 6 నెలలు రాజమండ్రి, బందరు జైళ్లలో నిర్భంధంలో ఉన్నాడు.నిషేధం తొలగించబడ్డాక అనంతపురం జిల్లా ప్రచారక్‌గా 8 నెలలపాటు పనిచేసి 1948లో జాగృతి పత్రికను ప్రారంభించి దానికి ఆయన సహాయ సంపాదకుడిగా సేవలందించాడు. 1952-54 మధ్యలో గుంటూరు జిల్లాలో వేర్వేరు చోట్ల ప్రచారక్‌గా ఉన్నాడు. 1954-58ల మధ్య విశాఖ ప్రచారక్‌గా నియమించబడ్డాడు. విశాఖపట్నంలో ప్రచారక్‌గా ఉన్నప్పుడే భారత్ ట్యుటోరియల్ కాలేజీని నెలకొల్పి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇది ఆ తరువాత భారతీయ విద్యా కేంద్రంగా మారింది. 1959లో సంఘ బాధ్యతలనుండి తప్పుకున్నాడు. ఆ విధంగా 1946 నుండి 1959వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారకుడిగా 13 సంవత్సరాలు పనిచేశాడు.
అనంతర జీవితం
[మార్చు]1959లో ఇతనికి కుసుమతో వివాహం జరిగింది. భోపాల్‌లో ఇంటరు, అలీఘర్‌లో బి.ఎ. చదివి హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. ఉత్తీర్ణుడై వరంగల్లులో న్యాయవాదిగా స్థిరపడ్డాడు.
సాహిత్యసేవ
[మార్చు]జాగృతి పత్రికకు సహసంపాదకునిగా ఉన్నప్పుడు అనేక కథలు వ్యాసాలు వ్రాసేవాడు.కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కె.ఎం.మున్షీ వ్రాసిన జైసోమనాథ్ నవలను తెలుగులో అనువదించి జాగృతిలో ధారావాహికగా ప్రకటించాడు.ఈ నవల బహుళ ప్రచారంలోకి వచ్చింది. 1958లో మహారాణాబాప్పా, మనవారసత్వం మొదలైన పుస్తకాలు రచించాడు. 1954లో భారతీయ రచయితల సమితికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్‌ను స్థాపించి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలం తరువాత ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్‌ను ఏర్పాటు చేసి దానికి కొంతకాలం ట్రస్టీగా, మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉన్నాడు. వరంగల్లులో పోతన విజ్ఞానపీఠం సభ్యుడిగా ఉన్నాడు. పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, మన్నవ గిరిధరరావు, బిరుదురాజు రామరాజు, కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, కోవెల సుప్రసన్నాచార్య మొదలైనవారితో కలిసి సాహిత్యకార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు.
రచనలు
[మార్చు]- ఛత్రపతి శివాజీ
- సమర్థ రామదాసు
- యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్
- మన పండుగలు[2]
- జై సోమనాథ్[3] (అనువాదం - మూలం: కె.ఎం.మున్షీ)
- మోహన మురళి
- రుక్మిణీ హరణం
- పంచ పాండవులు
- భీముడు
- సత్యభామ
- వ్యాసుడు
- యుధిష్ఠిరుడు
- శాశ్వత ధర్మగోప్త
- సమ్రాట్ చంద్రగుప్త
- దీనదయాళ్ ఉపాధ్యాయ (అనువాదం)
- మన వారసత్వం
- శ్రీ గురూజీ (శ్రీ మాధవ సదాశివ గోళ్వల్కర్ జీవితచరిత్ర)
- పృథ్వీ సూక్తమ్
- అగ్నిమూర్తులు
- మహారాణా బాప్పా
రాజకీయరంగం
[మార్చు]ఆర్.ఎస్.ఎస్. ఆదేశాలమేరకు రాజకీయ రంగంలో సంఘభావాలను వ్యాప్తి చేయడానికి ఇతడు ఎన్నికల సమయంలో అనేక వేదికలపై ఉపన్యాసాలను ఇచ్చాడు. జనసంఘ్ పార్టీ తరఫున కేంద్రం నుండి వచ్చిన దీనదయాళ్‌జీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, దత్తోపంత్ ఠేంగ్డీ, జగన్నాథరావు జోషీ, దేవీప్రసాద్ ఘోష్ మొదలైన నాయకులతో తిరిగి, అనేకానేక వేదికలపై వారు ఇచ్చిన ఉపన్యాసాలను తెలుగులో అనువదించేవాడు. 1971లో వరంగల్లు నుండి లోకసభకు నాలుగు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేశాడు. ఎమర్జన్సీ సమయంలో వరంగల్లు జైలులో ఈయన 19 నెలలు శిక్షను అనుభవించాడు. అక్కడ సంఘకార్యకర్తలతో, కమ్యూనిస్టు నాయకులతో కూడా ఉపనిషత్ సిద్ధాంతాలను, సందేశాలను వివరించేవాడు. ఇతని వద్ద జైలులో సంస్కృత పాఠాలు నేర్చుకున్నవారిలో వరవరరావు, ఎం.ఓంకార్ మొదలైనవారున్నారు.
మరణం
[మార్చు]చివరి దశలో ఈయన తన చిన్నకుమారుడు దగ్గరకు అమెరికా వెళ్ళాడు. అక్కడే ఈయన 2010, ఏప్రిల్ 3 శనివారం కన్నుమూసాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "సాహితీ సౌరభాలు". Archived from the original on 2012-06-21. Retrieved 2015-08-30.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మన పండుగలు పుస్తకప్రతి
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో జై సోమనాథ్ పుస్తకప్రతి
- ↑ సాహితీ వేత్త భండారు కన్నుమూత[permanent dead link]