బాల్ ఆఫ్ ది సెంచరీ
ఆస్ట్రేలియా స్పిన్ బౌలరు షేన్ వార్న్, ఇంగ్లాండ్ బ్యాటరు మైక్ గాటింగ్‌కి 1993 జూన్ 4 న, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 1993 యాషెస్ సిరీస్‌లో మొదటి టెస్టు రెండవ రోజున, వేసిన క్రికెట్ బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీ అంటారు. దీన్ని గ్యాటింగ్ బాల్ [1] అనీ దట్ బాల్ అని కూడా పిలుస్తారు.[2][3] ఇంగ్లండ్‌పై తన మొట్టమొదటి మ్యాచ్‌లో తన మొట్టమొదటి బంతికే [4] వార్న్ అద్భుతమైన ఈ డెలివరీ వేసి, గాటింగ్‌ను అవుట్ చేశాడు. ఇది కేవలం ఈ మ్యాచ్ సందర్భంలోనే కాకుండా, సాధారణంగా లెగ్ స్పిన్ బౌలింగు పునరుత్థానాన్ని సూచించడంలో ముఖ్యమైనదిగా భావిస్తారు.
నేపథ్యం
[మార్చు]ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని పిచ్ సాంప్రదాయకంగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అంచేత ఇంగ్లండ్, ఫిల్ టుఫ్నెల్, తొలి మ్యాచ్ ఆటగాడు పీటర్ సచ్ అనే ఇద్దరు స్పిన్ బౌలర్లను ఎంపిక చేసింది. దీనికి విరుద్ధంగా ఆస్ట్రేలియా, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకుంది. అప్పటికి అనుభవం లేని వార్న్ ఒక్కడే స్పిన్నరు. వార్న్ అప్పటి వరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 30.80 సగటుతో 31 వికెట్లు తీసుకున్నాడు.[5] కొంత ఫరవాలేదు అనిపించినప్పటికీ, వార్న్ ప్రారంభ కెరీర్ అద్భుతంగా ఏమీ లేదు,. అతని బౌలింగు శైలి-లెగ్ స్పిన్-చాలా మంది క్రికెట్ అనుచరులు ఆధునిక ఆటలో అంతగా విలువ లేని పురాతన కళగా భావించారు. న్యూజిలాండ్ కెప్టెన్, ప్రముఖ బ్యాట్స్‌మెన్, మార్టిన్ క్రో, ఆ సిరీస్‌కు ముందు వార్న్‌ను ప్రశంసించాడు. అయితే క్రోవ్ ప్రకటన, వార్న్‌ను సమర్థించడం కంటే న్యూజిలాండ్ బలహీనతలకు సాకుగా చెప్పాడని చాలామంది భావించినట్లు విస్డెన్ పేర్కొంది.
ఇంగ్లాండ్ కెప్టెన్ గ్రాహం గూచ్, టాస్ గెలిచి ముందుగా బౌలింగు ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని ఆస్ట్రేలియన్లకు బ్యాటింగ్ కష్టతరం చేయాలని భావించాడూ. మార్క్ టేలర్ సెంచరీ చేసినప్పటికీ, ఆస్ట్రేలియా 289 పరుగుల మోస్తరు స్కోరు వద్ద ఆలౌటైంది. ఇంగ్లాండ్ కూడా బాగానే ప్రారంభించింది, మైక్ అథర్టన్‌ను మెర్వ్ హ్యూస్ అవుట్ చేయడానికి ముందు 71 పరుగులకు చేరుకుంది. గూచ్‌కు ఎదురుగా, మైక్ గ్యాటింగ్ ఉన్నాడు. అతను బ్యాటింగ్‌కు వచ్చి అప్పుడప్పుడే పరుగులు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలన్ బోర్డర్ తన లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్‌ను బౌలింగు లోకి దించాడు. ఓ వైపు గాటింగ్, స్పిన్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా ప్రపంచ స్థాయి ఆటగాడిగా ప్రసిద్ధి చెందాడు. అనుభవం లేని వార్న్‌కు అతను సమస్య అవుతాడని భావించారు.
డెలివరీ
[మార్చు]కొన్ని అడుగుల పాటు నెమ్మదిగా సాగే రనప్ తర్వాత వార్న్, తన కుడి చేతిని తిప్పుతూ, కుడిచేతి వాటం గాటింగ్‌కి లెగ్ బ్రేక్ వేసాడు. బంతి మొదట్లో పిచ్‌పై నేరుగా బ్యాట్స్‌మన్ వైపు వెళ్లింది. స్లో-మోషన్ రీప్లేలలో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా, వేగంగా తిరుగుతున్న బంతి, కుడివైపుకి మళ్లడం ప్రారంభించింది (మాగ్నస్ ప్రభావం కారణంగా). బంతి, గ్యాటింగ్ లెగ్ స్టంప్ లైను నుండి అనేక అంగుళాల బయట ఉంది.
గాటింగ్ ప్రతిస్పందిస్తూ తన ఎడమ కాలును బంతి పిచ్ వైపు ముందుకు పోనిచ్చి, బ్యాట్‌ను, ప్యాడ్ పక్కనే, క్రిందికి వంచి పెట్టాడు. లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిన లెగ్-స్పిన్ బంతులకు వ్యతిరేకంగా అనుభవజ్ఞులైన బ్యాటర్లు ఉపయోగించే మామూలు రక్షణ వ్యూహమే ఇది. ఔట్ అయ్యే ప్రమాదం లేకుండా బంతి ప్యాడ్‌కి లేదా బ్యాట్‌కి తగలడం దీని ఉద్దేశం. లెగ్ స్టంప్ వెలుపల బాల్ పిచ్ చేసినందున, బ్యాటరు లెగ్ బిఫోర్ వికెట్ అవుట్ అవడు. బంతి ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగా స్పిన్ అయితే, అది బ్యాట్‌కి తగిలి సురక్షితంగా నేలపైకి పోతుంది కాబట్టి క్యాచ్ కూడా అందదు.
అంతకు ముందు పేస్ బౌలర్ల ఫాలో-త్రూ (ఫుట్‌మార్క్‌లు) కారణంగా పిచ్ అరిగిన చోట బంతి పడింది. దీంతో బంతికి, పిచ్‌కూ మధ్య ఘర్షణ ఎక్కువై, గాటింగ్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా టర్న్ అయింది. బంతి అతని బ్యాట్ వెలుపలి అంచుని దాటి, ఆపై అతని ఆఫ్ స్టంప్ పైభాగంలో తగిలి, బెయిల్‌లను పడేసింది. గ్యాటింగ్ తాను ఎలా బౌల్డ్ అయ్యానా అని చాలా సెకన్ల పాటు పిచ్ వైపు చూసాడు. ఆనక మైదానం నుండి బయటికి వెళ్లిపోయాడు. ఈ ఔట్‌ను స్టీవ్ లిండ్‌సెల్, ఫోటోగ్రాఫ్‌లో బంధించారు. గాటింగ్ షాక్‌లో ఉండడం, వికెట్ కీపర్ ఇయాన్ హీలీ వేడుకతో చేతులు పైకెత్తడం, ఆఫ్ బెయిల్ అతని తలపై ఎక్కడో తిరుగుతూండడం కనిపించింది. [6]
2019 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, భారత బౌలరు కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్‌ను ఔట్ చేసినపుడు వార్న్ బంతికి పోలికలు వచ్చాయి. ది టైమ్స్‌కు చెందిన జేమ్స్ గీర్‌బ్రాంట్ ఆ డెలివరీని "[కుల్దీప్] సొంత 'బాల్ ఆఫ్ ది సెంచరీ' అని పేర్కొన్నాడు. [7] అదేవిధంగా 2018లో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బాల్ ఆఫ్ సెంచరీతో విరాట్ కోహ్లి (హెడింగ్లీలో జరిగిన చివరి వన్డేలో), కెఎల్ రాహుల్ (ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో)లను బౌల్డ్ చేశాడు. 2021 పాకిస్తాన్, ఇంగ్లండ్లో పర్యటించినపుడు చివరి వన్‌డేలో, మాట్ పార్కిన్సన్ ఇమామ్-ఉల్-హక్‌ను బౌల్డ్ చేశాడు. బంతి 12.1 డిగ్రీలి స్పిన్ అయిన ఆ బంతిని 'వన్‌డే క్రికెట్ చరిత్రలో అత్యధికంగా స్పిన్ అయిన బంతి' [8] అని పేర్కొన్నారు.
2021 భారత మహిళల ఆస్ట్రేలియా పర్యటనలో రెండో మహిళల ట్వంటీ 20 మ్యాచ్‌లో, శిఖా పాండే అలిస్సా హీలీని ఔట్ చేసేందుకు వేసిన బంతిని 'బాల్ ఆఫ్ ది సెంచరీ'గా వర్ణించారు. [9] [10] [11]
మూలాలు
[మార్చు]- ↑ Sangster, Tom (2006-11-21). "Warnie's 'Ball of the Century'". Daily Telegraph (Australia). Archived from the original on 2008-05-10. Retrieved 2023-09-19.
- ↑ "Shane Warne". BBC. 2001. Archived from the original on 2009-08-30. Retrieved 2010-01-01.
- ↑ "1st Test: England vs Australia, 3-7 Jun 1993". cricinfo.
- ↑ "Shane Warne's 'Ball of the Century' turns 25". International Cricket Council. Retrieved 4 June 2018.
- ↑ "Shane Warne: 20 years on from the Ball of the Century". BBC Sport. Retrieved 2013-06-07.
- ↑ "Warne to set up base in England". BBC. 2005-03-13. Retrieved 2010-01-01.
- ↑ "Kuldeep's 'ball of the century'". Rediff.com. 17 June 2019. Retrieved 17 June 2019.
- ↑ "Matt Parkinson throws 'biggest spinning ball in ODI history' to Imam-ul-Haq. to mislead - Algulf" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-19.[permanent dead link]
- ↑ "'Ball of the century': Jaffer's tweet on Shikha Pandey's 'unreal' delivery to knock over Alyssa Healy goes viral". Hindustan Times. 8 October 2021. Retrieved 15 January 2022.
- ↑ "'Ball of the century' leaves cricket world in a frenzy". Yahoo Sports. 9 October 2021. Retrieved 15 January 2022.
- ↑ "Breaking Boundaries and Setting Records: The Rise of Alyssa Healy in Women's Cricket An Inspiration to Women Cricketers Everywhere". Retrieved 22 July 2023.