Jump to content

ప్రకాశం బ్యారేజి

వికీపీడియా నుండి
(ప్రకాశం బ్యారేజీ నుండి దారిమార్పు చెందింది)
ప్రకాశం బ్యారేజి
విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజి
ప్రకాశం బ్యారేజి is located in ఆంధ్రప్రదేశ్
ప్రకాశం బ్యారేజి
ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం బ్యారేజి స్థానం
అధికార నామంప్రకాశం బ్యారేజి
దేశంభారత దేశము
ప్రదేశంవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
స్థితిOperational
నిర్మాణం ప్రారంభం1954
ప్రారంభ తేదీ1957
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంBarrage
నిర్మించిన జలవనరుకృష్ణా నది
పొడవు1,223.5 మీ. (4,014 అ.)

ప్రకాశం బ్యారేజి, విజయవాడ వద్ద, కృష్ణా నది పై నిర్మించిన బ్యారేజి. దీని పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు). 1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.

చరిత్ర

[మార్చు]
ప్రకాశం బ్యారేజి దృశ్యం

పాత ఆనకట్ట

[మార్చు]

1832-1833 లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువు గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. బ్రిటిషు ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై బెజవాడ (విజయవాడ) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.

ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. బెజవాడ వద్ద ఎడమ గట్టునగల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం 1853లో మొదలై, 1854లో పూర్తయింది. 1132 మీ. పొడవు, 4 మీటర్ల ఎత్తుతో అనకట్ట పైగుండా వరదనీరు ప్రవహించేలా నిర్మించబడింది. రూ.1.49 కోట్లు ఖర్చయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని కాటన్ శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించాడు.[1] వంద సంవత్సరాలపాటు ఆనకట్ట ప్రజలకు వరప్రసాదమైంది.

1952లో వచ్చిన వరదలకు ఈ పాత బ్యారేజీ కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత ఏర్పడింది.

కొత్త ఆనకట్ట

[మార్చు]

పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే కొత్త బారేజి నిర్మాణం మొదలయింది. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బారేజిని నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బారేజి నీటి నియంత్రణకే కాక, 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగిఉంది. ఈ రోడ్డు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి 16లో ఉంది. బారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.

మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి కృష్ణా జిల్లా నాగాయలంక, కోడూరు వద్ద రెండు పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణానదిపై చిట్టచివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. 1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది.

ఆయకట్టు వివరాలు

[మార్చు]

బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా డెల్టాకు 181.2 టి.ఎం.సి.ల నీటిని కేటాయించింది. బారేజి కింద సాగునీరు లభించే ఆయకట్టు వివరాలు

ఎడమ గట్టు - (కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు)
సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో
1. ఏలూరు కాలువ 1,15,000 (55,000 పశ్చిమ గోదావరి)
2 రైవస్ & దిగువ పుల్లేరు కాలువ 1,75,000
3 పోలరాజు కాలువ 44,400
4 బంటుమిల్లి కాలువ 64,600
5 కాంప్‌బెల్ కాలువ 49,000
6 బందరు కాలువ 1,07,837
7 ఆర్.ఆర్.పాలెం 32,389
8 ఎగువ పుల్లేరు కాలువ 10,992
9 కృష్ణా ఎడమగట్టు కాలువ 1,36,280
మొత్తం 7,35,498
కుడిగట్టు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు)
సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో
1 కె.డబ్ల్యు.ప్రధాన కాలువ 22,172
2 కుడిగట్టు కాలువ 1,55,344
3 తూర్పు కాలువ 53,992
4 పశ్చిమ కాలువ 27,588
5 నిజాంపట్నం కాలువ 22,124
6 హైలెవెల్ కాలువ 26,414
7 కొమ్మమూరు కాలువ 2,63,717 (75,500 ప్రకాశం)
మొత్తం 5,71,351
ఎత్తిపోతలు
సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో
1 కృష్ణా జిల్లా వైపు 11,500
2 గుంటూరు వైపు 4,500
మొత్తం 16,000

చిత్ర మాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Wright, Arnold (2004). Southern India: Its History, People, Commerce, and Industrial Resources. ISBN 9788120613447.

బయటి లింకులు

[మార్చు]