కొమ్మమూరు కాలువ
కొమ్మమూరు కాలువ | |
---|---|
విశేషాలు | |
పొడవు | 113 కి.మీ. (70 మైళ్లు) (ఒరిజినల్‌గా 91 కి.మీ. or 57 మై.) (బ్యారేజి నుండి దుగ్గిరాల వరకు ఉన్న కాలువను కూడా కొమ్మమూరు కాలువ గానే వ్యవహరించడంతో కాలువ పొడవు పెరిగింది.) |
లాకులు | 7 |
భౌగోళికం | |
మొదలైన స్థానం | దుగ్గిరాల |
ముగిసిన స్థానం | పెదగంజాం |
మొదలైన స్థానపు నిర్దేశాంకాలు | 16°19'58.1"N 80°37'51.1"E |
ముగిసిన స్థానపు నిర్దేశాంకాలు | 15°38'47.4"N 80°13'22.7"E |
శాఖలు | చిన్న శాఖలు చాలానే ఉన్నాయి |
ఇది దేనికి శాఖ | కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ |
వీటిని కలుపుతుంది | కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ బకింగ్‌హామ్ కాలువ |
కొమ్మమూరు కాలువ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లోని దుగ్గిరాల నుండి బాపట్ల జిల్లా, పెదగంజాం వరకు ప్రవహించే పంట కాలువ.[1] దీన్ని బ్రిటిషు వారు, 19 వ శతాబ్దంలో తవ్వారు. దీని పొడవు 91 కిలోమీటర్లు. ఒకప్పుడు ఇది నౌకా రవాణా మార్గంగా విలసిల్లింది. కాకినాడ నుండి మద్రాసు (చెన్నై) వరకు ఉన్న జల మార్గం లోని కాలువల్లో ఇది ఒకటి. మిగతావి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, బకింగ్‌హాం కాలువ. భారత ప్రభుత్వం చేపట్టిన జాతీయ జలమార్గాల ప్రాజెక్టు లోని జలమార్గం 4 లో కొమ్మమూరు కాలువ ఒక భాగం.
1855 లో కృష్ణా బ్యారేజిని నిర్మించిన[2] తరువాత ఈ కాలువ నిర్మాణం పూర్తైంది. సాగునీటిని అందించడంతో పాటు, నౌకా రవాణా మార్గంగా కూడా ఇది ఉపయోగపడింది.
నిర్మాణ చరిత్ర
[మార్చు]కొమ్మమూరు కాలువ నిర్మాణం మొదటి కృష్ణా బ్యారేజీ[గమనిక 1] నిర్మాణాని కంటే ముందే మొదలైంది. అయితే ఈ పని అంత వేగంగా సాగలేదు. 1858-59 సంవత్సరంలో ఈ కాలువపై 38,100 రూపాయలు ఖర్చుపెట్టారు. 1877 నాటికి కాలువ నిర్మాణం పూర్తై, పెద్దగంజాం వద్ద బకింగ్‌హాం కాలువను కలిసింది. దానితో మద్రాసుకు జలమార్గం ఏర్పడింది. దుగ్గిరాల నుండి పెదగంజాం వరకు ఈ కాలువ పొడవు 91 కి.మీ.[3]
మొదటి కృష్ణా బ్యారేజి నిర్మాణానికి ముందే, కొమ్మమూరు కాలువ నిర్మాణానికి ముందే, బ్యారేజీ ప్రాంతం నుండి సహజంగా ఏర్పడిన తుంగభద్ర డ్రెయిన్[గమనిక 2] ఉండేది. ఇది సీతానగరం నుండి దుగ్గిరాల, జాగర్లమూడి, నిడుబ్రోలుల మీదుగా ప్రవహించి నిజాంపట్నం వద్ద సముద్రంలో కలిసేది. ఈ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు సముద్రానికి చేరేందుకు ఇదే వాహకం. బ్యారేజీ నిర్మాణం తరువాత ఈ తుంగభద్ర డ్రెయిన్‌నే బ్యారేజి నుండి వచ్చే కుడి ప్రధాన కాలువగా (దుగ్గిరాల వరకు) మార్చారు. దుగ్గిరాల, సంగం జాగర్లమూడిల మధ్య ఉండే కొమ్మమూరు కాలువ భాగం కూడా ఒకప్పటి ఈ తుంగభద్ర కాలువే. ఉత్తరం నుండి వచ్చే కొమ్మమూరు కాలువ, జాగర్లమూడి నుండి దక్షిణంగా చేబ్రోలు వైపు సాగిపోతుంది. జాగర్లమూడికి పశ్చిమం నుండి వచ్చే గుంటూరు నాలా (డ్రెయిన్), జాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువను కిందనుండి దాటి తుంగభద్ర డ్రెయిన్‌గా మారి తూర్పు దిశలో నిడుబ్రోలు వైపు పోతుంది.
క్రమేణా కొమ్మమూరు కాలువ ఉద్భవ స్థానం దుగ్గిరాల అని, తుంగభద్ర కాలువ (వాగు) పుట్టినది సంగం జాగర్లమూడి అని వ్యవహారం లోకి వచ్చింది. కొమ్మమూరు కాలువ ఉద్భవించినది దుగ్గిరాల లోనే అయినప్పటికీ, దీని ఉద్భవ స్థానం బ్యారేజీ వద్దనే అని కొన్ని రచనల్లో, వార్తాపత్రికల్లో రాస్తూ ఉంటారు. బ్యారేజీకీ, దుగ్గిరాలకూ మధ్యలో ఉన్న పశ్చిమ ప్రధాన కాలువను ప్రస్తావించరు. కాకినాడ - పాండిచ్చేరి జలమార్గాన్ని నిర్వచించేటపుడు, జాతీయ జలమార్గం 4 ను నిర్వచించేటపుడూ కూడా అలాగే రాసారు. ఉదాహరణకు, భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ జలవనరుల సమాచార వ్యవస్థ వారు కూడా తమ వెబ్‌సైటులో అలాగే రాసారు.[4] ఆ విధంగా కాలువ ఉద్భవించిన స్థానం బ్యారేజీ అని పరిగణిస్తే ఈ కాలువ పొడవు 113 కి.మీ. ఉంటుంది.
కాలువ మార్గం
[మార్చు]కొమ్మమూరు కాలువ ను ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్‌లో చూడండి |
---|
విజయవాడ వద్ద కృష్ణా బ్యారేజి వద్ద నుండి బయలుదేరిన పశ్చిమ (కుడి) ప్రధాన కాలువ, 20 కిలోమీటర్ల దూరం లోని దుగ్గిరాల లాకుల వద్ద రెండుగా చీలుతుంది. వాటిలో ఒకటి కొమ్మమూరు కాలువ కాగా, రెండవది నిజాంపట్నం కాలువ.[1][5] దుగ్గిరాల లాకుల వద్ద మొదలైన కొమ్మమూరు కాలువ, సంగం జాగర్లమూడి, చేబ్రోలు, కొల్లిమర్ల, నర్సాయపాలెం, కారంచేడు, సంతరావూరు ల గుండా పెదగంజాం చేరుతుంది. పెదగజాం వద్ద ఇది బకింగ్‌హాం కాలువతో కలుస్తుంది. కొమ్మమూరు కాలువ పంటకాలువ కాగా, బకింగ్‌హాం కాలువ ఉప్పునీటి కాలువ. కాలువపై రవాణాకు అనుగుణంగా ఆరు చోట్ల లాకులను నిర్మించారు. అవి దుగ్గిరాల, సంగం జాగర్లమూడి, కొల్లిమర్ల, నర్సాయపాలెం (నల్లమాడ), సంతరావూరు, పెదగంజాంల వద్ద ఉన్నాయి. ఈ లాకులన్నిటికీ ఛాంబరు 150 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో ఉంటుంది.[6]
కొమ్మమూరు కాలువ ప్రయాణ మార్గంలో అనేక చోట్ల డ్రెయిన్‌లు దాటుతాయి. అక్కడ ఆక్విడక్టులను నిర్మించారు. కొల్లిమర్ల వద్ద తుంగభద్ర డ్రెయిన్‌కు చెందిన ఒక పాయ, రేటూరు వద్ద నాగరాజు కాలువ, నర్సాయపాలెం వద్ద నల్లమాడ డ్రెయిన్, పోతుకట్ల వద్ద పేరలి డ్రెయిన్ లు కొమ్మమూరు కాలువను దాటుతాయి.
కొమ్మమూరు కాలువతో పాటు, ఏలూరు కాలువ, కాకినాడ కాలువ, భద్రాచలం వద్ద నుండి ధవళేశ్వరం వరకూ ఉన్న గోదావరి, తెలంగాణ లోని వజీరాబాదు నుండి ప్రకాశం బ్యారేజి వరకు ఉన్న కృష్ణా నది - ఈ ఆరింటినీ కలిపి జాతీయ జలమార్గం 4 గా రూపొందించారు.[4]
రవాణా, సాగు నీటి సౌకర్యాలు
[మార్చు]రాజమండ్రి వద్ద గోదావరి నదిపై రైలు వంతెన 1893 లో నిర్మాణమైంది. విజయవాడ మద్రాసు మధ్య రైలుమార్గం 1899 లో సిద్ధమైంది. ఆ తరువాతనే రైలు సౌకర్యం వచ్చింది. అప్పటి వరకు ఈ ప్రాంత వాసులకు ఈ కాలువలే ప్రధానమైన రవాణా సౌకర్యంగా ఉండేవి.[7] సింగరేణి బొగ్గు గనుల నుండి మద్రాసుకు రవాణా అయ్యే బొగ్గు ఈ కాలువ ద్వారానే వెళ్ళేది. 1896-97 సంవత్సరంలో 33,325 టన్నుల బొగ్గు రవాణా అయింది.[8] 1960 ల వరకు కాలువలో రవాణా జరుగుతూ ఉండేది. ఆ తరువాత రోడ్డు రవాణా, రైలు రవాణా అభివృద్ధి చెందడంతో ఈ కాలువ నిర్లక్ష్యానికి గురైంది.
మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ జలమార్గాల్లో భాగంగా 2016 లో ఈ కాలువను అభివృద్ధి చెయ్యాలనే ప్రతిపాదనలు వచ్చాయి. జలరవాణాకు అనుకూలంగా ఉండాలంటే ఈ కాలువ ఉపరితలాన 120 మీటర్లు, అడుగున 40 మీటర్లూ వెడల్పు ఉండాలి. విజయవాడ నుండి దుగ్గిరాల వరకు కాలువ కొలతలు బాగానే ఉన్నప్పటికీ, ఆ తరువాత వెడల్పు తగ్గిపోతూ వచ్చింది. దుగ్గిరాల నుండి కొల్లిమర్ల లాకుల వరకూ అడుగున 40 మీ. వెడల్పు ఉందిగానీ, పైన వెడల్పు తగ్గిపోయింది. కొల్లిమర్ల తరువాత పెదగంజాం వరకు పైనా అడుగునా రెండుచోట్లా వెడల్పు తగ్గిపోయింది. కొన్నిచోట్ల లోతు కూడా తగ్గిపోయింది. రవాణాకు అనుగుణంగా కాలువను వెడల్పు చెయ్యాల్సిన అవసరం ఉంది.[9]
1897-98 నాటికి కొమ్మమూరు కాలువ కింద 91,162 ఎకరాల ఆయకట్టు ఉండేది.[10] ప్రస్తుతం 2.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.[11] అయితే నిర్వహణ సరిగ్గా జరక్క కాలువ దెబ్బతినడంతో సాగుకు సరిపడా నీరు అండడం లేదు. తుఫాన్లు, వరదల కారణంగా గట్లు దెబ్బతిన్నాయి. గండ్లు పడడం సాధారణమై పోయింది.[12][13] ప్రధాన కాలువకు మరమ్మత్తులు చెయ్యడంతో పాటు, దాని నుంఛి నీటిని తీసుకుపోయే 50 చిన్న కాలువలకు కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. కాలువలో పూడిక తీయాల్సి ఉంది. తూటికాడను తొలగించాల్సి ఉంది. దానితో పాటు కాలువపై ఉన్న వంతెనల వంటి అనేక నిర్మాణాలకు మరమ్మత్తులు చేయాల్సి ఉంది.[14][15]
గమనికలు
[మార్చు]- ↑ కృష్ణానదిపై ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ నదిపై ఇదే స్థలంలో నిర్మించిన రెండవ బ్యారేజీ. 1856 లో ఇదే స్థలంలో ఒక బ్యారేజీని నిర్మించారు. దాదాపు వందేళ్ళ తరువాత అది దెబ్బతినడంతో, 1954 లో ప్రస్తుతమున్న ప్రకాశం బ్యారేజీని నిర్మించారు.
- ↑ కర్నూలు వద్ద కృష్ణానదిలో కలిసే దాని ఉపనది యైన తుంగభద్రా నది, ఇది వేరువేరు. పేర్లు ఒకటే గానీ, ఈ రెంటికీ ఏ సంబంధమూ లేదు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Vijñānasarvasvamu. Vol. 4. తెలుగు భాషాసమితి. 1959. p. 1323.
- ↑ మాదల వీరభద్రరావు (1957). ఆంధ్రప్రదేశ్ జలవిద్యుత్ ప్రాజెక్టులు.
- ↑ మెకెంజీ, గార్డన్ (1883). ఎ మాన్యువల్ ఆఫ్ ది కృష్ణా డిస్ట్రిక్ట్ (PDF). మద్త్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. p. 264.
- ↑ 4.0 4.1 "national_waterways-4 - INDIA WRIS WIKI". indiawris.gov.in. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "PRAKASAM BARRAGE". irrigationap.cgg.gov.in. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ వాల్ష్, జార్జి (1899). ది ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫ్ కృష్ణా డెల్టా (PDF). Vol. 1. మద్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. pp. 139, 140.
- ↑ Muthiah, S. (2013-10-27). "Passengers on the Canal..." The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ వాల్ష్, జార్జి (1899). ది ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫ్ కృష్ణా డెల్టా (PDF). Vol. 1. మద్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. p. 142.
- ↑ "జల రవాణాకు మోక్షమెన్నడో." ఈనాడు (గూగుల్ కాషె నుండి వెలికి తీసిన పేజీ). 2021-05-10. Archived from the original on 2022-06-28. Retrieved 2021-06-28.
- ↑ వాల్ష్, జార్జి (1899). ది ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫ్ కృష్ణా డెల్టా (PDF). Vol. 1. మద్రాసు: మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం. p. 140.
- ↑ "షట్టర్లు శిథిలం". Sakshi. 2014-09-28. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "జల విపత్తు". Sakshi. 2013-10-26. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "కొమ్మమూరు..కన్నీరు!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2020-11-23. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "కొమ్మమూరు..కన్నీరు". Sakshi. 2017-03-14. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
- ↑ "కొమ్మమూరు కాలువకు మరమ్మతులు చేయండి". ప్రజాశక్తి. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.