నార్వే భౌగోళికం
![]() | |
ఖండం | ఐరోపా |
---|---|
ప్రాంతం | ఉత్తర ఐరోపా |
నిర్దేశాంకాలు | 50 degrees north and 8 degrees east |
విస్తీర్ణం | ర్యాంకు: 67th |
• మొత్తం | 323,802 కి.మీ2 (125,021 చ. మై.) |
• నేల | 94.95% |
• నీరు | 5.05% |
తీరరేఖ | 25,148 కి.మీ. (15,626 మై.) |
సరిహద్దులు | భూ సరిహద్దు: 2515 కి.మీ. |
అత్యంత ఎత్తైన బిందువు | గాల్డ్హోపెగ్గెన్ 2,469 m |
అత్యంత లోతైన బిందువు | నార్వేజియన్ సముద్రం -0 meters |
అత్యంత పొడవైన నది | గ్లోమా 604 కి.మీ. |
అత్యంత పెద్ద సరస్సు | మ్యోసా 362 కి.మీ.2 |
ప్రత్యేక ఆర్థిక మండలం | Norway with స్వాల్‌బార్డ్, యాన్ మాయెన్, బోవెట్ ద్వీపం: 2,385,178 కి.మీ2 (920,922 చ. మై.) |
నార్వే ఉత్తర ఐరోపాలో, స్కాండినేవియన్ ద్వీపకల్పంలోని ఉత్తర, పశ్చిమ భాగాలలో ఉన్న దేశం. దేశంలోని ఎక్కువ భాగానికి నీరే సరిహద్దు. దక్షిణాన స్కాగెరాక్ ఇన్లెట్, నైరుతిలో ఉత్తర సముద్రం, పశ్చిమాన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం (నార్వేజియన్ సముద్రం), ఉత్తరాన బేరెంట్స్ సముద్రం ఉన్నాయి. తూర్పున స్వీడన్‌తో భూ సరిహద్దు ఉంది; ఈశాన్యంలో ఫిన్లాండ్‌తో చిన్న సరిహద్దు, రష్యాతో మరింత చిన్న సరిహద్దూ ఉన్నాయి.
భౌగోళికంగా నార్వే సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన అత్యంత కఠినమైన తీరప్రాంతాలలో ఒకటి. కార్ట్‌వెర్కెట్ (అధికారిక నార్వేజియన్ మ్యాపింగ్ ఏజెన్సీ) ప్రకారం, తీరప్రాంతంలో మొత్తం 320,249 ద్వీపాలు, చిన్నదీవులూ ఉన్నాయి. (239,057 దీవులు, 81,192 చిన్నదీవులు). ఇది ప్రపంచంలో ఉత్తరకొసన ఉన్న దేశాలలో ఒకటి. ఇది యూరప్‌లోని అత్యంత పర్వత దేశాలలో ఒకటి. దేశం సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి 460 మీటర్లు (1,510 అ.), ప్రధాన భూభాగంలో 32 శాతం వృక్ష శ్రేణికి పైన ఉంది. దీని దేశ పొడవునా ఉన్న శిఖరాల గొలుసు భౌగోళికంగా స్కాట్లాండ్, ఐర్లాండ్ పర్వతాలతో, అట్లాంటిక్ మహాసముద్రం కింద దాటిన తరువాత, ఉత్తర అమెరికాలోని అప్పలాచియన్ పర్వతాలతో వరుసగా ఉంటుంది. పురాతన సూపర్ ఖండం పాంజియా విడిపోవడానికి ముందు ఇవన్నీ ఒకే శ్రేణిగా ఏర్పడ్డాయని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.[1]
గత హిమనదీయ కాలంలో, అలాగే అనేక మునుపటి మంచు యుగాలలో, దేశం మొత్తం మందపాటి మంచు పలకతో కప్పబడి ఉండేది. మంచు కదలిక లోతైన లోయలను ఏర్పరిచింది. మంచు శిల్పం ఫలితంగా, సోగ్నెఫ్‌జోర్డెన్ ప్రపంచంలోనే రెండవ లోతైన ఫ్యోర్డ్, హార్నిండల్స్వాట్నెట్ ఐరోపాలో కెల్లా అత్యంత లోతైన సరస్సు. మంచు కరిగినప్పుడు, సముద్రం ఈ లోయలలో చాలా వరకు నిండిపోయి, నార్వే లోని ప్రసిద్ధి చెందిన ఫ్యోర్డ్‌లను సృష్టించింది. [2] నేడు ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉన్న హిమానీనదాలు మంచు యుగం నాటి పెద్ద మంచు పలక అవశేషాలు కావు - వాటి మూలాలు ఇటీవలివి. [3] సా.పూ. 7000 నుండి సా.పూ. 3000 వరకు హోలోసీన్ వాతావరణ అనుకూలతలో ప్రాంతీయ వాతావరణం 1961-90 కాలాని కంటే 1–3 °C (1.8–5.4 °F) వరకు వెచ్చగా ఉండేది. ఆ కాలంలో పర్వతాలలో మిగిలిన హిమానీనదాలు దాదాపు పూర్తిగా కరిగిపోయాయి.
మంచుయుగం నాటి మంచు కరిగి, అపారమైన మంచు బరువు నుండి విడుదలై, భూమి పైకిలేవడం మొదలై చాలా కాలం అయినప్పటికీ, అది ఇప్పటికీ సంవత్సరానికి అనేక మిల్లీమీటర్లు పైకి లేస్తోంది. ఈ ఉద్ధరణ దేశంలోని తూర్పు భాగంలో, మంచు కవచం దట్టంగా ఉండే పొడవైన ఫ్యోర్డ్‌ల లోపలి భాగాలలో ఎక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. మంచు యుగం ముగిసిన తరువాత వేల సంవత్సరాల పాటు, సముద్రం నేడు పొడి భూమిగా ఉన్న చాలా ప్రాంతాలను కప్పివేసింది. ఈ పాత సముద్రగర్భం ఇప్పుడు దేశంలోని అత్యంత ఉత్పాదక వ్యవసాయ భూములలో ఒకటి.
ప్రాంతం, సరిహద్దులు
[మార్చు]నార్వే మొత్తం వైశాల్యం 324,220 కి.మీ2 (125,180 చ. మై.). అందులో 16,360 కి.మీ2 (6,320 చ. మై.) నీరు. స్వాల్బార్డ్, జాన్ మాయెన్ లను కలుపుకుంటే, మొత్తం వైశాల్యం 385,199 కి.మీ2 (148,726 చ. మై.).
దాని 2,515 కి.మీ. (1,563 మై.) ల భూ సరిహద్దులో, 1,619 కి.మీ. (1,006 మై.) ను స్వీడన్‌తోటి, 729 కి.మీ. (453 మై.) ఫిన్లాండ్‌తోటీ, 196 కి.మీ. (122 మై.) రష్యాతోటీ పంచుకుంటుంది.
నార్వే ఖండాంతర తీరప్రాంతం 25,148 కి.మీ. (15,626 మై.) ; దీవులను కూడా కలుపుకుంటే, ఇది 83,281 కి.మీ. (51,748 మై.) [4]

నార్వే ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) మొత్తం 2,385,178 కి.మీ2 (920,922 చ. మై.) విస్తీర్ణంలో ఉంది. ఇది ఐరోపా లోని అతిపెద్ద వాటిలో ఒకటి. ప్రపంచంలో 17 వ అతిపెద్దది. ప్రధాన భూభాగం వెంబడి ఉన్న EEZ విస్తీర్ణం 878,575 కి.మీ2 (339,220 చ. మై.), జాన్ మాయెన్ EEZ 29,349 కి.మీ2 (11,332 చ. మై.) విస్తీత్ర్ణంలో ఉన్నాయి. 1977 నుండి నార్వే స్వాల్బార్డ్ చుట్టూ 803,993 కి.మీ2 (310,423 చ. మై.) జనాభా కలిగిన ఆర్థిక మండలాన్ని క్లెయిమ్ చేస్తోంది. నార్వేకు 10 nmi (18.5 కి.మీ.; 11.5 మై.) సముద్ర సంబంధ అనుబంధ జోన్ కోసం, 200 nmi (370.4 కి.మీ.; 230.2 మై.) ఖండాంతర షెల్ఫ్ కోసం, 12 nmi (22.2 కి.మీ.; 13.8 మై.) ప్రాదేశిక సముద్రం కోసం నార్వే వాదిస్తోంది.
భౌతిక భౌగోళికం
[మార్చు]

స్థూలంగా
[మార్చు]నార్వే ప్రధాన భూభాగంలో విస్తృతమైన సహజ వైవిధ్యం ఉంది. దాని మితమైన పరిమాణాన్ని బట్టి, భూసంబంధమైన, సముద్ర, లిమ్నిక్, స్నో, మంచు పర్యావరణ వ్యవస్థలన్నీ ఉన్నాయి. నార్వే అధిక ఖనిజ, శిలా వైవిధ్యాన్నీ, అధిక వైవిధ్యమైన భూరూపాలనూ కలిగి ఉంది. ప్రధాన ప్రకృతి దృశ్య రకాల్లో లోతట్టు కొండలు, పర్వతాలు, లోతట్టు లోయలు, లోతట్టు మైదానాలు, తీర మైదానాలు, తీరప్రాంత ఫ్యోర్డ్‌లు తీరప్రాంత కొండలు, పర్వతాలూ ఉన్నాయి. [5] ఎక్కువగా ఎత్తైన పీఠభూములు, సారవంతమైన లోయలచే విరిగిపోయిన కఠినమైన పర్వతాలు; చిన్న, చెల్లాచెదురుగా ఉన్న మైదానాలు; ఫ్యోర్డ్‌లు బాగా లోతుకు చొచ్చుకొచ్చిన తీరప్రాంతం; ఈశాన్య కొస ప్రాంతంలో మాత్రమే ఆర్కిటిక్ టండ్రా (ఎక్కువగా వరంజర్ ద్వీపకల్పంలో కనిపిస్తుంది) ఉంటుంది. ఎత్తైన పర్వత ప్రాంతాలలోను, ఫిన్మార్క్ కౌంటీ లోపలి భాగంలోనూ ఏడాది పొడవునా ఘనీభవించిన నేల కనిపిస్తుంది. నార్వేలో అనేక హిమానీనదాలు కూడా ఉన్నయి.
2,469 మీటర్లు (8,100 అ.) ఎత్తున ఉన్న గాల్ధోపిగ్గెన్ నార్వే కెల్లా ఎత్తైన ప్రదేశం. అత్యల్ప స్థానం, నార్వేజియన్ సముద్రం - 0 మీ.
ప్రధాన భూభాగం
[మార్చు]స్కాండినేవియన్ పర్వతాలు
[మార్చు]స్కాండినేవియన్ పర్వతాలు ఆ దేశానికి అత్యంత విశిష్టమైన లక్షణం. స్కాగెరాక్ తీరానికి ఉత్తరాన ఉన్న సెటెస్‌డాల్షీన్‌తో ప్రారంభమయ్యే ఈ పర్వతాలు దేశంలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తాయి. వెస్ట్‌లాండెట్ లోని అనేక ఫ్యోర్డ్‌లను ఖండిస్తాయి. ఈ ప్రాంతంలో హర్డాంగెర్‌విద్దా, జోతున్‌హీమెన్ ( గాల్ధోపిగ్జెన్‌తో 2,469 మీటర్లు (8,100 అ.) asl ), సోగ్నెఫ్‌జెల్, ట్రోల్‌హీమెన్ ఉత్తరాన, పెద్ద హిమానీనదాలు, జొస్టెడల్స్‌బ్రీన్, ఫోల్గెఫోన్నా, హార్డాంజర్జోకులెన్ వంటివి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణి ట్రోండ్‌హీమ్‌కు దక్షిణంగా తూర్పు వైపుకు, డోవ్రెఫ్‌జెల్, రోండేన్ వంటి శ్రేణులతో స్వీడన్ సరిహద్దుకు చేరుకుంటుంది. అక్కడ అవి ఎక్కువగా వాలుగా ఉన్న పీఠభూములుగా మారాయి. ఆ పర్వతాలు ఆ సరిహద్దు వెంట ఈశాన్య దిశలో కొనసాగుతాయి. వాటిని క్జోలెన్ ("కీల్") అని పిలుస్తారు. ఈ పర్వతాలు నార్డ్లాండ్, ట్రోమ్స్‌లో అనేక ఫ్యోర్డ్‌లను ఖండిస్తాయి. అక్కడ అవి మరింత ఆల్పైన్‌గా మారి సముద్రంలో కలిసి అనేక ద్వీపాలను సృష్టిస్తాయి. స్కాండినేవియన్ పర్వతాలు లింగెన్ ఆల్ప్స్‌ను ఏర్పరుస్తాయి. ఇవి వాయవ్య ఫిన్మార్క్‌లోకి చేరుకుని, క్రమంగా అల్టాఫ్‌జోర్డ్ నుండి ఉత్తర కేప్ వైపు ఎత్తు తగ్గుతూ పోయి, చివరికి బారెంట్స్ సముద్రంలో ముగుస్తాయి.
స్కాండినేవియన్ పర్వతాలు సహజంగానే దేశాన్ని భౌతిక ప్రాంతాలుగా విభజిస్తాయి; లోయలు అన్ని దిశలలో పర్వతాలను చుట్టుముట్టాయి.
దక్షిణ తీరం
[మార్చు]దక్షిణ నార్వేలో, దక్షిణ స్కాగెరాక్, ఉత్తర సముద్ర తీరం పర్వత శ్రేణికి దక్షిణంగా ఉన్న లోతట్టు ప్రాంతం, పశ్చిమాన స్టావాంజర్ నుండి తూర్పున ఓస్లోఫ్‌జోర్డ్ లోని బయటి భాగపు పశ్చిమ ప్రాంతాల వరకు ఉంటుంది. దేశంలోని ఈ ప్రాంతంలో, లోయలు ఉత్తర-దక్షిణ దిశగా సాగుతాయి. ఈ ప్రాంతం ఎక్కువగా కొండలతో కూడి ఉంటుంది. అయితే, లిస్టా, జెరెన్ వంటి కొన్ని చాలా చదునైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఆగ్నేయం
[మార్చు]పర్వతాలకు తూర్పున ఉన్న భూమిలో (ఓస్ట్‌లాండెట్, టెలిమార్క్‌లో ఎక్కువ భాగం రోరోస్ మునిసిపాలిటీకి అనుగుణంగా) తూర్పు భాగంలో ఉత్తర-దక్షిణ దిశలోను, పశ్చిమాన వాయువ్య-ఆగ్నేయ దిశలో నడుస్తున్న లోయలు అధికంగా కనిపిస్తాయి. దేశంలోని అతి పొడవైన లోయలైన ఓస్టర్డాల్, గుడ్‌బ్రాండ్స్‌డాల్ లు ఇక్కడ ఉన్నాయి. ఓస్లోఫ్‌జోర్డ్ చుట్టూ ఉన్న పెద్ద లోతట్టు ప్రాంతాలు, అలాగే గ్లోమా నది, మ్జోసా సరస్సులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి.
పశ్చిమ ఫ్యోర్డ్‌లు
[మార్చు]పర్వతాలకు పశ్చిమాన ఉన్న భూమిలో (స్టావాంజర్‌కు ఉత్తరాన ఉన్న వెస్ట్‌లాండెట్‌కు అనుగుణంగా) పర్వత శ్రేణి ప్రముఖంగా కనిపిస్తుంది. పర్వతాలు విస్తరించి, క్రమంగా ఎత్తు తగ్గుతూ తీరం వరకు వెళ్తాయి. ఈ ప్రాంతంలో పెద్ద ఫ్యోర్డ్‌లు అధికంగా ఉంటాయి. వాటిలో అతిపెద్దవి సోగ్నేఫ్‌జోర్డ్, హార్డాంజర్‌ఫ్‌జోర్డ్. గీరాంజర్‌ఫ్యోర్డ్ తరచుగా ఫ్యోర్డ్ దృశ్యాలలో అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తీరాన్ని స్కెర్రీల గొలుసు (చిన్న, జనావాసాలు లేని ద్వీపాలు - స్క్జార్గార్డ్) రక్షిస్తున్నాయి. ఇవి తీరానికి సమాంతరంగా, స్టావాంజర్ నుండి నార్డ్‌కాప్ వరకు దాదాపు 1,600 కిలోమీటర్లు (990 మై.) పొడవున ఉంటాయి. దక్షిణాన, ఫ్యోర్డ్‌లు లోయలు సాధారణంగా పశ్చిమ-తూర్పు దిశలోనూ, ఉత్తరాన, వాయవ్య-ఆగ్నేయ దిశలోనూ ఉంటాయి.
ట్రాండ్‌హీమ్ ప్రాంతం
[మార్చు]డోవ్రే మునిసిపాలిటీకి ఉత్తరాన ఉన్న భూమి (రోరోస్ మునిసిపాలిటీ తప్ప, ట్రాండెలాగ్ కౌంటీకి అనుగుణంగా ఉంటుంది) మరింత సున్నితమైన ప్రకృతి దృశ్యం కనిపిస్తుంది. ఇది మరింత గుండ్రని ఆకారాలతో, పర్వతాలతో కూడి ఉంటుంది. లోయలు ట్రోండ్‌హీమ్స్‌ఫ్యోర్డ్ వద్ద ముగుస్తాయి, అక్కడ అవి పెద్ద లోతట్టు ప్రాంతంలోకి తెరుచుకుంటాయి. మరింత ఉత్తరాన నామ్సోస్ ప్రాంతంలో నామ్డలెన్ లోయ తెరుచుకుంటుంది. అయితే, ఫోసెన్ ద్వీపకల్పం, ఉత్తర తీరం (లేక మునిసిపాలిటీ) ఎత్తైన పర్వతాలు, ఇరుకైన లోయలు ప్రముఖంగా ఉంటాయి.
ఉత్తర ఫ్యోర్డ్‌లు
[మార్చు]ఉత్తర నార్వేలో ఉత్తరాన ఉన్న భూమిలో (నార్డ్‌ల్యాండ్, ట్రోమ్స్, వాయవ్య ఫిన్మార్క్‌లకు అనుగుణంగా) మళ్ళీ తీరం వరకు వెళ్ళే నిటారుగా ఉన్న పర్వతాలు, అనేక ఫ్యోర్డ్‌లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రాంతపు దక్షిణ భాగంలో ఫ్యోర్డ్‌లు, లోయలు సాధారణంగా పశ్చిమ-తూర్పు దిశలోనూ, ఉత్తరాన వాయవ్య-ఆగ్నేయ దిశలోనూ ఉంటాయి. సాల్ట్ఫ్జెల్లెట్ పర్వత శ్రేణి దీనికి మినహాయింపు. ఈ పర్వత శ్రేణి నుండి లోయ ఉత్తరం-దక్షిణ దిశలో వెళుతుంది. ఈ సన్నటి, పొడవైన ప్రాంతంలో లోఫోటెన్, వెస్టెరాలెన్, సెంజా వంటి అనేక పెద్ద దీవులు ఉన్నాయి.
ఈశాన్య కొసన
[మార్చు]నార్డ్కాప్ తూర్పున ఉన్న లోపలి భాగం లోను, తీరం లోనూ ( ఫిన్మార్క్స్విడ్డా, తూర్పు ఫిన్మార్క్ లకు అనుగుణంగా) పర్వతాలు తక్కువగా ఉన్నాయి. వీటి ఎత్తు 400 మీ. (1,300 అ.) కంటే తక్కువగా ఉంటుంది. లోపలి భాగంలో పెద్ద ఫిన్మార్క్స్ విడ్డా పీఠభూమి ఆధిపత్యం చెలాయిస్తుంది. ఉత్తర-దక్షిణ దిశలో పెద్ద, విశాలమైన ఫ్యోర్డ్‌లు ఉన్నాయి. నార్వేజియన్ తీరంలో సాధారణంగా కనిపించే చిన్న ద్వీపాలు గానీ స్కెరీలు గానీ ఈ తీరంలో లేవు. తూర్పు కొసన ఉన్న వరంజర్‌ఫ్యోర్డ్ తూర్పు-పడమర దిశలో వెళుతుంది. దేశంలో తూర్పున ముఖద్వారం ఉన్న ఏకైక పెద్ద ఫ్యోర్డ్ ఇది.
ఆర్కిటిక్ దీవులు
[మార్చు]స్వాల్బార్డ్
[మార్చు]
బాగా ఉత్తరాన, ఆర్కిటిక్ మహాసముద్రంలో, స్వాల్బార్డ్ ద్వీపసమూహం ఉంది. పెద్ద హిమానీనదాలతో కప్పబడిన పర్వతాలు ద్వీపమంతా ఉంటాయి. ముఖ్యంగా ద్వీపసమూహపు తూర్పు భాగంలో, హిమానీనదాలు 90% పైబడిన ప్రదేశాన్ని కప్పేసి ఉంటాయి. ఆస్ట్‌ఫోనా అనే ఒక హిమానీనదం ఐరోపాలో కెల్లా అతిపెద్దది. ప్రధాన భూభాగంలో లాగా కాకుండా, ఈ హిమానీనదాలు నేరుగా సముద్రంలో కలుస్తాయి.
జాన్ మాయెన్
[మార్చు]వాయవ్య దిశలో, గ్రీన్‌ల్యాండ్ వైపు సగం దూరంలో, జాన్ మాయెన్ ద్వీపం ఉంది, ఇక్కడే, నార్వేలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బీరెన్‌బర్గ్ ఉంది.
అంటార్కిటిక్ దీవులు, అంటార్కిటికాపై దావా
[మార్చు]అంటార్కిటికాలో, దాని ద్వీపాలపై నార్వేకు అనేక ప్రాదేశిక వాదనలు ఉన్నాయి. బౌవెట్ ద్వీపం దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో 54°S వద్ద ఉంది. ఇది ఎక్కువగా హిమానీనదాలతో కప్పబడి ఉంటుంది. ఈ ద్వీపం ప్రపంచంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ సీల్స్, పక్షులు మాత్రమే నివసిస్తాయి. పీటర్ I ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 69°S, 90°W వద్ద ఉంది. ఈ ద్వీపం హిమానీనదాలు, అగ్నిపర్వతాలతో కూడుకుని ఉంటుంది. బౌవెట్ ద్వీపం మాదిరిగానే, ఈ ద్వీపాన్ని కూడా రాజ్యంలో భాగంగా కాకుండా బయటి సామంత ప్రాంతంగా పరిగణిస్తారు. అంటార్కిటికాలో నార్వే ఖండాంతర హక్కు క్వీన్ మౌడ్ ల్యాండ్. ఈ పెద్ద, శంఖాకార ప్రాంతం దక్షిణ ధ్రువం వరకు విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు పలక దీన్ని పూర్తిగా కప్పేసి ఉంటుంది. కొన్ని నునాటక్‌లు (బేర్ రాక్) మంచు పైన చొచ్చుకువస్తాయి. నార్వేజియన్ పోలార్ ఇన్‌స్టిట్యూట్ ట్రోల్ రీసెర్చ్ స్టేషన్‌ను నిర్వహిస్తోంది. ఇది మంచు లేని పర్వత వాలుపై ఉంది. అంటార్కిటికాలో మంచు మీద లేని ఏకైక స్టేషన్ ఇది.
వాతావరణం
[మార్చు]
నార్వే వాతావరణం సాపేక్షంగా సమశీతోష్ణంగా ఉంటుంది. ఉత్తర అట్లాంటిక్ ప్రవాహమూ, దాని పొడిగింపు అయిన నార్వేజియన్ ప్రవాహమూ కలిసి గాలి ఉష్ణోగ్రతను పెంచడమే దీనికి ప్రధాన కారణం.[6] ప్రబలంగా ఉన్న నైరుతి గాలులు తేలికపాటి గాలిని ఒడ్డుకు తీసుకువస్తాయి; నైరుతి-ఈశాన్య దిశగా సాగే తీరంఇది పశ్చిమ గాలులు ఆర్కిటిక్‌లోకి చొచ్చుకుపోవడానికి వీలు కల్పిస్తుంది.
అవపాతం
[మార్చు]ఐరోపాలో అత్యంత తేమగా ఉండే దేశాలలో నార్వే ఒకటి. కానీ పర్వత శ్రేణులతో కూడిన భూభాగం కారణంగా అవపాతంలో పెద్ద వ్యత్యాసాలు ఉంటాయి. ఫలితంగా ఒరోగ్రాఫిక్ అవపాతం ఏర్పడుతుంది. వర్షచ్ఛాయా ప్రాంతాలు కూడా ఏర్పడతాయి. కొన్ని ప్రాంతాలలో, చాలా భిన్నమైన అవపాతాలు కలిగిన ప్రదేశాలు చాలా దగ్గరగా ఉండవచ్చు. తీరప్రాంతంలో శరదృతువు చివరిలోను, శీతాకాలంలోనూ అవపాతం ఎక్కువగా ఉండి, ఏప్రిల్ నుండి జూన్ వరకు పొడిగా ఉంటుంది. పొడవైన ఫ్యోర్డ్‌ల లోపలి భాగాలు కొంతవరకు పొడిగా ఉంటాయి. పర్వత శ్రేణికి తూర్పున ఉన్న ప్రాంతాల్లో (ఓస్లోతో సహా) సాధారణంగా తక్కువ అవపాతంతో, ఎక్కువ ఖండాంతర వాతావరణం ఉంటుంది. వేసవి, శరదృతువు ప్రారంభంలో అవపాతం గరిష్టంగా ఉండి, శీతాకాలం, వసంతకాలం పొడిగా ఉంటాయి. ఫిన్మార్క్ లోతట్టు భాగంలో ఒక పెద్ద ప్రాంతంలో 450 mమీ. (17.7 అం.) కంటే తక్కువ వార్షిక వర్షపాతం కలుగుతుంది. పర్వతాలతో చుట్టుముట్టబడిన కొన్ని లోయల్లో చాలా తక్కువ వర్షపాతం కలుగుతుంది. వేసవిలో తరచుగా నీటిపారుదల అవసరం అవుతుంది.
ఉష్ణోగ్రత
[మార్చు]అదే అక్షాంశాల వద్ద ఉన్న ఇతర ప్రాంతాల కంటే తీరం తేలికపాటి శీతాకాలాలను అనుభవిస్తుంది. తీర ప్రాంతాలలో అతి శీతలమైన నెల, వెచ్చని నెలల మధ్య సగటు ఉష్ణోగ్రత వ్యత్యాసం 10–15 °C (18–27 °F) మాత్రమే. లోతట్టు ప్రాంతాల్లో ఈ తేడా ఎక్కువగా ఉంటుంది. కరాస్జోక్‌లో వ్యత్యాసం గరిష్టంగా 28 °C (50 °F) ఉంటుంది.
బో మునిసిపాలిటీ ప్రపంచంలోనే అత్యంత ఉత్తర కొసన ఉన్న ప్రదేశం. ఇక్కడ శీతాకాల నెలలలో సగటు ఉష్ణోగ్రతలు 0 °C (32 °F) కు పైనే ఉంటాయి. వసంతకాలంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి; సంవత్సరంలో పగటిపూట, రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా తేడా ఉండే సమయం కూడా ఇదే. లోతట్టు లోయలు, లోపలి ఫ్యోర్డ్ ప్రాంతాలలో గాలులు తక్కువగా ఉంటాయి. వేసవి రోజులు అత్యంత వెచ్చగా ఉంటాయి. లోతట్టు ప్రాంతాలు జూలై మధ్యలోను, తీరప్రాంతాలు ఆగస్టు మొదటి అర్ధభాగం నాటికీ గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. సాధారణంగా వేసవిలో తేమ తక్కువగా ఉంటుంది.
ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం, నార్వేజియన్ సముద్రపు ఉత్తర భాగంలో రెండుగా విడిపోతుంది, ఒక శాఖ తూర్పు వైపు నుండి బారెంట్స్ సముద్రంలోకి వెళ్ళగా, మరొకటి స్పిట్స్‌బెర్గెన్ పశ్చిమ తీరం వెంబడి ఉత్తరం వైపు వెళుతుంది. ఇది ఆర్కిటిక్ ధ్రువ వాతావరణాన్ని కొంతవరకు మారుస్తుంది. ఆర్కిటిక్ లోని మరే ఇతర ప్రదేశం కంటే అధిక అక్షాంశాల వద్ద ఏడాది పొడవునా ఓపెన్ వాటర్‌కు దారితీస్తుంది. స్వాల్బార్డ్ ద్వీపసమూహానికి తూర్పు తీరంలో సముద్రం, సంవత్సరంలో ఎక్కువ కాలం గడ్డకట్టేది. కానీ భూమి వేడెక్కడం వలన ఇక్కడి జలాలు గమనించదగ్గ విధంగా ఎక్కువ కాలం ఉంటాయి. అట్లాంటిక్ అల్పపీడనాలు శీతాకాలంలో తేలికపాటి గాలులను తీసుకువస్తాయి, ఫోహ్న్ వల్ల మరింత వేడెక్కుతాయి, శీతాకాలంలో ఇరుకైన ఫ్యోర్డ్‌లలో వెచ్చని ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి, తీరప్రాంతాలతో పోలిస్తే, లోతట్టు లోయలు, లోపలి ఫ్యోర్డ్ ప్రాంతాలలో, ముఖ్యంగా వసంతకాలం వేసవిలో రోజువారీ ఉష్ణోగ్రత వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి.

నార్వేజియన్ ప్రధాన భూభాగంలోని అన్ని జనాభా ప్రాంతాలు సమశీతోష్ణ లేదా సబ్‌ఆర్కిటిక్ వాతావరణాలను కలిగి ఉంటాయి (కొప్పెన్ సమూహాలు C, D ). స్వాల్బార్డ్, జాన్ మాయెన్ లలో ధ్రువ వాతావరణం ఉంటుంది (కొప్పెన్ గ్రూప్ E ). 1990 నుండి వేడెక్కడం వల్ల, వేసవికాలం వెచ్చగాను, ఎక్కువ కాలం పాటూ ఉంటుంది. శీతాకాలాలు తేలికగాను, తక్కువ కాలం పాటూ ఉంటాయి. 1991-2020 నాటి కొత్త అధికారిక వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో, అనేక ప్రాంతాలు 1961-90 నాటి సాధారణ స్థితి నుండి కొత్త వాతావరణ మండలానికి మారుతున్నాయి. శీతాకాలాలు వేడెక్కడం వల్ల చాలా జనాభా ఉన్న ప్రాంతాలలో మంచు కవచం కూడా తగ్గింది. స్వాల్బార్డ్‌లో వేడెక్కడం అత్యంత బలంగా ఉన్నట్లు గమనించారు. వేడెక్కడంతో పాటు, చాలా ప్రాంతాలలో అవపాతం పెరిగింది, ముఖ్యంగా శీతాకాలంలో కోత, తద్వారా కొండచరియలు విరిగిపడే ప్రమాదమూ పెరిగాయి.
శీతోష్ణస్థితి డేటా - Oslo - Blindern 1991-2020 (Köppen: Cfb/Dfb) (94 m, extremes since 1900) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 12.5 (54.5) |
13.8 (56.8) |
21.5 (70.7) |
25.4 (77.7) |
31.1 (88.0) |
33.7 (92.7) |
35.0 (95.0) |
33.6 (92.5) |
26.4 (79.5) |
21.0 (69.8) |
14.4 (57.9) |
12.6 (54.7) |
35.0 (95.0) |
సగటు అధిక °C (°F) | 0.1 (32.2) |
1.1 (34.0) |
5.3 (41.5) |
11.0 (51.8) |
16.7 (62.1) |
20.4 (68.7) |
22.7 (72.9) |
21.3 (70.3) |
16.4 (61.5) |
9.6 (49.3) |
4.4 (39.9) |
0.8 (33.4) |
10.8 (51.5) |
రోజువారీ సగటు °C (°F) | −2.3 (27.9) |
−2 (28) |
1.4 (34.5) |
6.2 (43.2) |
11.4 (52.5) |
15.3 (59.5) |
17.7 (63.9) |
16.5 (61.7) |
12.1 (53.8) |
6.5 (43.7) |
2.2 (36.0) |
−1.4 (29.5) |
7.0 (44.5) |
సగటు అల్ప °C (°F) | −4.7 (23.5) |
−4.7 (23.5) |
−2.1 (28.2) |
2.1 (35.8) |
6.8 (44.2) |
10.8 (51.4) |
13.4 (56.1) |
12.5 (54.5) |
8.6 (47.5) |
3.8 (38.8) |
-0.0 (32.0) |
−3.9 (25.0) |
3.6 (38.4) |
అత్యల్ప రికార్డు °C (°F) | −26.0 (−14.8) |
−24.9 (−12.8) |
−21.3 (−6.3) |
−14.9 (5.2) |
−3.4 (25.9) |
0.7 (33.3) |
3.7 (38.7) |
3.7 (38.7) |
−3.3 (26.1) |
−8.0 (17.6) |
−16.0 (3.2) |
−20.8 (−5.4) |
−26.0 (−14.8) |
సగటు అవపాతం mm (inches) | 57.9 (2.28) |
45.6 (1.80) |
41.3 (1.63) |
48.4 (1.91) |
60.1 (2.37) |
79.7 (3.14) |
86.7 (3.41) |
102.8 (4.05) |
82.2 (3.24) |
93.4 (3.68) |
84.6 (3.33) |
53.6 (2.11) |
836.3 (32.95) |
సగటు అవపాతపు రోజులు | 9.8 | 7.3 | 8.5 | 8.1 | 8.5 | 10.1 | 10.9 | 10.9 | 9.4 | 10.9 | 10.7 | 9.2 | 114.3 |
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు | 45.1 | 77.6 | 146.5 | 182.0 | 248.0 | 230.3 | 244.1 | 203.8 | 150.1 | 94 | 50.9 | 40.0 | 1,712.4 |
Average ultraviolet index | 0 | 1 | 1 | 3 | 4 | 5 | 5 | 4 | 3 | 1 | 0 | 0 | 2 |
Source: Seklima [7] |
సహజ వనరులు
[మార్చు]చమురు, సహజ వాయువు, జలవిద్యుత్, చేపలు, అటవీ వనరులతో పాటు, నార్వేలో ఇనుప, ఇనుమేతర లోహ ఖనిజాల నిల్వలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు గతంలో వెలికితీసారు గానీ తక్కువ- స్వచ్ఛత, అధిక నిర్వహణ వ్యయాల కారణంగా ఆ గనులు ఇప్పుడు పనికిరాకుండా పోయాయి. యూరప్‌లో అతిపెద్ద టైటానియం నిక్షేపాలు నైరుతి తీరానికి సమీపంలో ఉన్నాయి. స్వాల్బార్డ్ దీవులలో బొగ్గు తవ్వకం జరుగుతోంది.
నార్వే వనరులలో పెట్రోలియం, రాగి, సహజ వాయువు, పైరైట్స్, నికెల్, ఇనుప ఖనిజం, జింక్, సీసం, చేపలు, కలప, జలశక్తి ఉన్నాయి.
జంతుజాలం
[మార్చు]దేశం ఉన్నత అక్షాంశాల మధ్య ఉండడం, దాని వైవిధ్యమైన స్థలాకృతి, వాతావరణాల కారణంగా, నార్వేలో ఏ ఇతర ఐరోపా దేశాలకన్నా ఎక్కువ సంఖ్యలో ఆవాసాలున్నాయి. నార్వే, దాని ప్రక్కనే ఉన్న జలాల్లో సుమారు 60,000 జాతుల మొక్కలు, జంతుజాలం ఉన్నాయి. నార్వేజియన్ షెల్ఫ్ పెద్ద సముద్ర పర్యావరణ వ్యవస్థ. దీన్ని అత్యంత ఉత్పాదకత కలిగినదిగా పరిగణిస్తారు.[8] మొత్తం జాతుల సంఖ్యలో 16,000 జాతుల కీటకాలు (బహుశా ఇంకా 4,000 జాతులు వివరించబడలేదు), 20,000 జాతుల ఆల్గే, 1,800 జాతుల లైకెన్, 1,050 జాతుల నాచులు, 2,800 జాతుల వాస్కులర్ మొక్కలు, 7,000 జాతుల శిలీంధ్రాలు, 450 జాతుల పక్షులు (నార్వేలో 250 జాతులు గూళ్ళు కట్టుకుంటాయి), 90 జాతుల క్షీరదాలు, 45 జాతుల మంచినీటి చేపలు, 150 జాతుల ఉప్పునీటి చేపలు, 1,000 జాతుల మంచినీటి అకశేరుకాలు, 3,500 జాతుల ఉప్పునీటి అకశేరుకాలు ఉన్నాయి. [9] వీటిలో దాదాపు 40,000 జాతులను శాస్త్రీయంగా వివరించారు. 2010 వేసవిలో ఫిన్మార్క్‌లో జరిగిన శాస్త్రీయ అన్వేషణలో నార్వేకి కొత్తగా వచ్చిన 126 రకాల కీటకాలను కనుగొన్నారు. వాటిలో 54 జాతులు సైన్సుకే కొత్త. [10]
2006 IUCN రెడ్ జాబితా ప్రకారం, 3,886 నార్వేజియన్ జాతులు అంతరించి పోతున్నాయి.[11] వీటిలో 17 ని, యూరోపియన్ బీవర్ వంటివి, నార్వేలోని జనాభా అంతరించిపోతున్నట్లు కనిపించకపోయినా, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నందున ఈ జాబితాలో చేర్చారు. ఎరుపు జాబితాలో 430 రకాల శిలీంధ్రాలు ఉన్నాయి, వీటిలో చాలా వరకు పాత అడవులలో మిగిలిన చిన్న ప్రాంతాలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. [12] ఈ జాబితాలో 90 జాతుల పక్షులు, 25 జాతుల క్షీరదాలు కూడా ఉన్నాయి. 2006 నాటికి 1,988 ప్రస్తుత జాతులు అంతరించిపోతున్న లేదా దుర్బలంగా ఉన్న జాబితాల్లో చేర్చారు. వాటిలో 939 దుర్బలంగా ఉన్న జాబితాలో ఉన్నాయి. 734 అంతరించిపోతున్న జాబితా లోమ్ను, 285 నార్వేలో తీవ్రంగా అంతరించిపోతున్న జాబితా లోనూ ఉన్నాయి. వాటిలో బూడిద రంగు తోడేలు, ఆర్కిటిక్ నక్క (స్వాల్బార్డ్‌లో ఆరోగ్యకరమైన జనాభా ఉంది) పూల్ ఫ్రాగ్ ఉన్నాయి.
నార్వేజియన్ జలాల్లో అతిపెద్ద ప్రెడేటర్ స్పెర్మ్ వేల్, అతిపెద్ద చేప బాస్కింగ్ షార్క్. భూమిపై అతిపెద్ద ప్రెడేటర్ ధ్రువ ఎలుగుబంటి. అయితే నార్వేజియన్ ప్రధాన భూభాగంలో అతిపెద్ద ప్రెడేటర్ గోధుమ ఎలుగుబంటి. ఇక్కడి అతిపెద్ద జంతువు కామన్ మూస్.
వృక్షజాలం
[మార్చు]
నార్వేలో సహజ వృక్షసంపద గణనీయంగా మారుతుంది. అక్షాంశాల్లో ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ఇది సహజమే. పశ్చిమ ఉత్తర అమెరికాలో ఇలాంటి వాతావరణం ఉన్న ప్రాంతాల కంటే నార్వేలో సాధారణంగా తక్కువ రకాల చెట్లు ఉంటాయి. ఎందుకంటే మంచు యుగం తర్వాత యూరోపియన్ ఉత్తర-దక్షిణ వలస మార్గాలు, జలాశయాలు (బాల్టిక్ సముద్రం, ఉత్తర సముద్రం వంటివి) పర్వతాల అడ్డంకుల కారణంగా మరింత కష్టంగా ఉంటాయి. అమెరికాలో భూమి నిరంతరాయంగా ఉంటుంది, పర్వతాలు ఉత్తర-దక్షిణ దిశను అనుసరిస్తాయి. స్ప్రూస్, పైన్, సరస్సు అవక్షేపాలపై DNA- అధ్యయనాలను ఉపయోగించి చేసిన ఇటీవలి పరిశోధనల్లో నార్వేజియన్ కోనిఫర్లు మంచు యుగం నుండి ఉత్తరాన అండోయా వరకు మంచు రహిత ఆశ్రయాలలో మనుగడ సాగించాయని తేలింది.[13]
అనేక దిగుమతి చేసుకున్న మొక్కలు విత్తనాలు కాసి, వ్యాప్తి చెందగలిగాయి. ఆధునిక నార్వేలోని 2,630 వృక్ష జాతులలో స్థానిక జాతులు సగం కంటే తక్కువ. [14] నార్వేలో పెరుగుతున్న దాదాపు 210 జాతుల మొక్కలు అంతరించిపోతున్నట్లు జాబితా చేసారు. వాటిలో 13 స్థానికమైనవి.[15] నార్వేలోని జాతీయ ఉద్యానవనాలు ఎక్కువగా పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. దేశంలోని ఉత్పాదక అడవులలో దాదాపు 2% వరకూ రక్షిత అడవులు.[16]
భూ వినియోగం
[మార్చు]
నార్వే భూమిలో 3.3% వ్యవసాయ యోగ్యమైన భూమి. అందులో 0% శాశ్వత పంటలు, శాశ్వత పచ్చిక బయళ్లకు ఉపయోగించపడుతోంది. 1993 అంచనా ప్రకారం నార్వేలో సాగునీటి భూమి సుమారు 970 కి.మీ2 (370 చ. మై.). భూభాగంలో 38% అడవులు; 21% కోనిఫెర్ అడవులు, 17% ఆకురాల్చే అడవులూ ఉన్నాయి.[17] మిగిలిన భూమి పర్వతాలు, పొదలు (46%), బురద నేలలు, చిత్తడి నేలలు (6.3%), సరస్సులు, నదులు (5.3%), పట్టణ ప్రాంతాలతో (1.1%) కూడుకుని ఉంది. [18] కాలక్రమేణా, మానవ జోక్యం కారణంగా అరణ్య ప్రాంతాలు తగ్గాయి. వివిధ జీవ జాతులు అంతరించిపోడానికీ , క్షీణిస్తున్న జీవవైవిధ్యానికీ అతి ముఖ్యమైన కారకాల్లో ఒకటిగా మారుతున్న భూ వినియోగమని 2008 లో ఎన్విరాన్‌మెంట్ నార్వే (Miljøstatus) పేర్కొంది.[19]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Glozman, Igor. "Plate tectonics".
- ↑ "Protected Areas and World Heritage - Norway". United Nations Environment Programme. July 2005. Archived from the original on 10 June 2007.
- ↑ "Bjerknes centre for climate research:Norways glaciers". uib.no. Archived from the original on 2 February 2017. Retrieved 9 July 2007.
- ↑ "Norway in the United Kingdom". Norgesportalen. 16 May 2017.
- ↑ (2021). "Diversity and distribution of landscape types in Norway".
- ↑ "News - NORKLIMA". www.forskningsradet.no. Archived from the original on 6 October 2016. Retrieved 16 April 2012.
- ↑ seklima.met.no
- ↑ Norwegian Shelf ecosystem Archived 12 జూన్ 2010 at the Wayback Machine
- ↑ NOU 2004 Archived 11 మే 2008 at the Wayback Machine
- ↑ "Stadig flere insekter oppdages i Finnmark" [More and more insects are being found in Finnmark]. Artsdatabanken (in నార్వేజియన్). 2006. Archived from the original on 4 June 2013. Retrieved 25 December 2019.
- ↑ Artsdatabanken:Norwegian Red List 2006 Archived 20 ఫిబ్రవరి 2007 at the Wayback Machine
- ↑ Panda.org:Norway forest heritage[permanent dead link]
- ↑ "Sturdy Scandinavian conifers survived Ice Age". sciencedaily.com.
- ↑ "Plants in Norway". environment.no. Archived from the original on 7 May 2006. Retrieved 17 August 2006.
- ↑ "Plant talk.org". plant-talk.org. Archived from the original on 28 September 2006. Retrieved 14 October 2006.
- ↑ "26 nye skogreservater". forskning.no. Archived from the original on 20 March 2012. Retrieved 5 July 2011.
- ↑ "Boreal Forests of the World - NORWAY - FORESTS AND FORESTRY". www.borealforest.org.
- ↑ Moen, Asbjørn; Lillethun, Arvid, eds. (1999). Nasjonalatlas for Norge: Vegetasjon. Statens Kartverk. ISBN 9788290408263.
- ↑ "Statistics". miljostatus.no. Archived from the original on 11 March 2009. Retrieved 17 December 2008.