జాతీయ రహదారి 66 (ఎన్‌హెచ్ 66)[1] 1,640 కి.మీ. పొడవైన 4 వరుసల భారత జాతీయ రహదారి. ఇది భారత పశ్చిమ తీరం వెంబడి పశ్చిమ కనుమలకు సమాంతరంగా ఉత్తర-దక్షిణ దిశలో నడుస్తుంది. ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తూ, ముంబైకి తూర్పున ఉన్న పన్వేల్ నగరాన్ని కన్యాకుమారికి కలుపుతుంది. గతంలో ఇది ఎన్‌హెచ్-17, ఎన్‌హెచ్-47లో భాగంగా ఉండేది.
కర్ణాటకలో ఈ జాతీయ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలు, గ్రేడ్ సెపరేటర్లతో కూడిన 60 మీటర్ల వెడల్పు గల జాతీయ రహదారిగా మార్చే ఎన్‌హెచ్‌ఏఐ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో దీన్ని పెద్దయెత్తున ఉన్నతీకరిస్తున్నారు.[2] గోవా సరిహద్దు (కార్వార్ సమీపంలో) నుండి కేరళ సరిహద్దు (తలపాడు సమీపంలో) వరకు పూర్తి పొడవును నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో ఆరు వరుసలకు విస్తరించేందుకు వీలుగా స్థలం సేకరించారు.[3] భూములు కోల్పోతున్న ప్రజలు, సన్నపాటి రోడ్డుతో సరిపెట్టుకొమ్మని నిరసనలు వెలిబుచ్చారు. కానీ కర్ణాటక ప్రభుత్వం ఆ నిరసనలను పట్టించుకోలేదు.
కేరళలో 6 వరుసల జాతీయ రహదారి కోసం భూసేకరణ, టెండర్ ప్రక్రియ ముగిసింది. కొత్త బైపాస్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అధిక జనాభా సాంద్రత, అధిక భూమి విలువ కారణంగా, కేరళలో జాతీయ రహదారి 45 మీటర్ల వెడల్పు, 6 వరుసలుగా ఉంటుంది. గోవాలో కూడా ఇదే విధమైన అమరిక ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర విభాగాల్లో 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. మహారాష్ట్ర భాగాన్ని నాలుగు వరుసలతో ఫ్లెక్సిబుల్ పేవ్‌మెంట్ (తారు) రోడ్డుగా మార్చనున్నారు.[4][5][6]
ఇది పన్వెల్ వద్ద ఉన్న జాతీయ రహదారి 48 (పాత ఎన్‌హెచ్4) కూడలి వద్ద ప్రారంభమై కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. ఎన్‌హెచ్-66 ప్రధానంగా భారతదేశపు పశ్చిమ తీరం గుండా ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు అరేబియా సముద్ర తీరాన్ని తాకుతుంది. ఎన్‌హెచ్66 కర్ణాటకలోని మరవంతే, కేరళలోని తలస్సేరి, అలప్పుళ వద్ద అరేబియా సముద్రాన్ని తాకింది. ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళుతుంది. జాతీయ రహదారి 66 (గతంలో ఎన్‌హెచ్-17 సంఖ్య) వివిధ రాష్ట్రాలలోని క్రింది నగరాలు, పట్టణాలు, ప్రధాన గ్రామాలను కలుపుతుంది: