ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014

తొలి ప్రభుత్వాలు

[మార్చు]
నీలం సంజీవరెడ్డి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసాడు. కానీ ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడవడంతో 1960 జూన్ 10న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత రాయలసీమకు చెందిన నేత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. 1962 సార్వత్రిక ఎన్నికల తరువాత సంజీవరెడ్డి మళ్ళీ 1962 మార్చి 12న ముఖ్యమంత్రి అయ్యాడు. కర్నూలు రవాణా వ్యవస్థ జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ 1964లో ఆయన రాజీనామా చేసాడు.

ఉద్యమాల కాలం

[మార్చు]

ఆయన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి 1964 ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి అయ్యాడు. ఏడున్నరేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడాయన. ఆయన కాలంలోనే విశాఖ ఉక్కు ఉద్యమం, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు జరిగాయి.

1965 లో ఆంగ్లో-అమెరికా నిపుణుల సంఘం ఒకటి విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని కేంద్రప్రభుత్వానికి సలహా ఇచ్చింది.అయితే ఒడిషా, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఈ కర్మాగారం కొరకు కేంద్రాన్ని వత్తిడి చేసాయి. ఆందోళన చెందిన ప్రజలు తెన్నేటి విశ్వనాధం నాయకత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉద్యమం మొదలు పెట్టారు. 1965లో రాష్ట్ర శాసనసభ ఉక్కు కర్మాగారం కొరకు ఒక తీర్మానం కూడా చేసింది. 1966 అక్టోబర్‌, నవంబరు లలో ఉద్యమం హింసాత్మక రూపు దాల్చింది. 32 మంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కర్మాగార స్థాపనను కేంద్రం ప్రకటించడంతో ఉద్యమం ఆగింది. 1971లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధి కర్మాగారానికి శంకుస్థాపన చేసింది.

విద్యార్థులతో మొదలైన మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాజకీయ నాయయకుల చేతుల్లో పడి, రూపు కోల్పోయి చివరికి చల్లారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ఏర్పాటు సమయంలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం లోని అంశాలు సరిగా అమలు జరగడం లేదన్న వాదన ఈ ఉద్యమానికి మూల కారణం. ఈ ఒప్పందానికి తగినట్లుగా, తమకు విద్యా, ఉద్యోగావకాశాలు రావడం లేదన్న అసంతృప్తితో విద్యార్థులు ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఉద్యమం ప్రారంభించారు. రాజకీయావకాశాలు కోల్పోతున్నామన్న అసంతృప్తితో ఉన్న కొందరు రాజకీయ నాయకులు విద్యార్థుల కోరికను ప్రత్యేక తెలంగాణా దిశగా మళ్ళించారు.

1971 సెప్టెంబర్లో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు కాంగ్రెసుకు తిరిగి చేరుకోవడంతో, ఉవ్వెత్తున లేచి పడే తరంగం లాగా ఉద్యమం ఎగసిపడి చల్లారిపోయింది. కాంగ్రెసు అధిష్టానంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రిగా బ్రహ్మానంద రెడ్డి స్థానంలో, 1971 సెప్టెంబర్ 30పి.వి.నరసింహారావు అయ్యాడు. తెలంగాణా ప్రాంతానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఆయన. 1972లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావడంతో మళ్ళీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సంవత్సరం అక్టోబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు మరో ఉద్యమానికి దారితీసింది.

హైదరాబాదు సంస్థానంలో 1915లో నిజాము జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం ముల్కీ నిబంధనలు అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని 1971 అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

తమ రాష్ట్ర రాజధానిలోనే తాము నిరాదరణకు గురయ్యామన్న ఆవేదన కలిగిన ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతూ జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసారు. ఉద్యమం తీవ్ర రూపం ధరించిన తరుణంలో రాష్ట్రప్రభుత్వం నుండి, తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేసారు. 1973 జనవరి 10 న, సరిగ్గా నరసింహారావు మంత్రివర్గ విస్తరణ చేసిన రెండు రోజులకు, కేంద్రప్రభుత్వం ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రపతి పాలన సమయంలో కేంద్ర హోం మంత్రి కె సి పంత్‌ కుదిర్చిన ఒక ఆరు సూత్రాల ఒప్పందంతో రెండు ప్రాంతాల నాయకుల మధ్య సయోధ్య కుదిరింది.

ఒప్పందంలో భాగంగా 1973 డిసెంబర్ 10జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసిన నేతగా జలగం ప్రసిద్ధి చెందాడు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ నిలదొక్కుకోడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాడు.

కాంగ్రెసులో కలహాలు

[మార్చు]

1978 జనవరిలో కాంగ్రెసు చీలి ఇందిరా కాంగ్రెసు ఏర్పడినప్పుడు, రాష్ట్రంలో అధిక కాంగ్రెసు నాయకులు రెడ్డి కాంగ్రెసులో చేరారు. మర్రి చెన్నారెడ్డి మాత్రం ఇందిరా కాంగ్రెసులో ఉన్నాడు. 1978 ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెసు 175 స్థానాలు సాధించి అధికారం కైవసం చేసుకుంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.

1978 - 1983 మధ్య కాలంలో రాష్ట్ర కాంగ్రెసులోని అంతర్గత కలహాల కారణంగా నలుగురు ముఖ్యమంత్రులను మార్చి, పార్టీ అప్రదిష్ట పాలయింది. 1978 మార్చి 6 నుండి 1980 అక్టోబర్ 11 వరకు చెన్నా రెడ్డి, తరువాత 1982 ఫిబ్రవరి 24 వరకు టంగుటూరి అంజయ్య, తదుపరి కేవలం ఏడు నెలల పాటు భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రులు కాగా 1983 జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బొద్దు పాఠ్యం

తెలుగుదేశం ప్రాభవం

[మార్చు]
నందమూరి తారక రామారావు

1982లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటన జరిగింది. సినిమాల్లో తన నటన ద్వారా ప్రజల మన్ననలు పొందిన నందమూరి తారక రామారావు మార్చి 29తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. కాంగ్రెసు అసంతృప్త నాయకుడు, నాదెండ్ల భాస్కరరావు ఆయనతో చేతులు కలిపాడు. పదే పదే ముఖ్యమంత్రుల్ని మార్చి కాంగ్రెసు పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపిస్తూ, ఆత్మగౌరవ పునరుద్ధరణ నినాదంతో నందమూరి తారక రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. 1983 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం 198 స్థానాలు గెలుచుకొని అధికారానికి రాగా, 60 స్థానాలతో కాంగ్రెసు ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌లో మొట్ట మొదటి సారిగా కాంగ్రెసు ప్రతిపక్షం స్థానానికి చేరింది.

కమ్యూనిస్టు పార్టీలైన సి.పి.ఐ, సి.పి.ఎంలు పరస్పర అవగాహనతో పోటీ చేసినా, 4, 9 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రామారావు ప్రభంజనం ఎంత బలంగా ఉందంటే - ఈ రెండు ప్రాంతాల్లో కలిపి కాంగ్రెసుకు కేవలం 8 శాతం స్థానాలు మాత్రమే దక్కాయి.

రామారావు చేతిలో ఓటమి కాంగ్రెసుకు భరించరానిదయింది. రెండు పార్టీల మధ్య ఉన్న వైరం కాంగ్రెసు పాలిత కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలకు పాకింది. 1984 ఆగష్టు 16 న రామారావు శస్త్రచికిత్సకై అమెరికా వెళ్ళిన సమయంలో, గవర్నరు రాంలాల్‌, రామారావును ముఖ్యమంత్రిగా తొలగించి, నాదెండ్ల భాస్కరరావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాడు. రామారావును పైలట్‌ గా, తనను కో పైలట్‌గా చెప్పుకున్న భాస్కరరావు కాంగ్రెసు పార్టీ పరోక్ష అండదండలతో, తగినంత మంది శాసనసభ్యుల మద్దతు లేకున్నా గద్దెనెక్కగలిగాడు.

ప్రతిపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని రామారావు దీనిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. సంయుక్త ప్రతిపక్షం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల మద్దతును కూడగట్టింది. రామారావు తొలగింపు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన కేంద్రం గవర్నరును మార్చి, సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం సుగమం చేసింది. ధర్మయుద్ధంగా రామారావు వర్ణించుకున్న ఈ నెల రోజుల ప్రజాస్వామిక సమరంలో సమైక్య ప్రతిపక్షం గెలిచింది. తొలగించబడిన ఒక ముఖ్యమంత్రి తిరిగి ప్రతిష్ఠితుడవ్వడం భారత దేశ రాజకీయాల్లో అదే తొలి, అదే తుది.

ఆ తరువాత తెలుగుదేశం, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీలు కలిసి మిత్రపక్షాలుగా ఏర్పడి ఎన్నికలలో సమైక్యంగా పోటీ చేసాయి. రామారావు 1985లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిపించి, మరింత మెరుగైన ఫలితాలు సాధించాడు. ఈ ఎన్నికలలో నాదెండ్ల భాస్కరరావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి, 220 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం రెండు స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగాడు.

1985 - 1989 మధ్యకాలంలో రామారావు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి, 55 సంవత్సరాలకు తగ్గించడం, గ్రామసేవకుల వ్యవస్థ రద్దు, పూజారి వ్యవస్థ రద్దు మొదలైనవి వీటిలో కొన్ని. 1989 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ 182 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారానికి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి 1989 డిసెంబర్ 3 న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు.

అయితే కాంగ్రెసులోని ముఠా తగాదాలు యధావిధిగా కొనసాగాయి. కాంగ్రెసు అంతర్గత కలహాలు ఏ స్థాయిలో ఉనాయంటే, హైదరాబాదులో జరిగిన మతకలహాలు కాంగ్రెసు నాయకుడు నేదురుమల్లి జనార్ధనరెడ్డి జరిపించినవేనని ముఖ్యమంత్రి ఆరోపించాడు. 1990 డిసెంబర్ 17న చెన్నారెడ్డి స్థానంలో జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యగానే మతకలహాలు ఆగిపోవడం విశేషం. కాపిటేషను కళాశాలల కుంభకోణంలో చిక్కుకున్న జనార్ధనరెడ్డి స్థానంలో 1992 అక్టోబర్ 9కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన హయాంలో చారిత్రాత్మకమైన సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతునిచ్చాయి.

1994 ఎన్నికలలో చరిత్ర పునరావృతమై, తెలుగుదేశం, మిత్రపక్షాలు కలిసి 253 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెసు కేవలం 26 స్థానాలు గెలిచింది. రామారావు ముఖ్యమంత్రిగా 1994 డిసెంబర్ 12 న ప్రమాణస్వీకారం చేసాడు. కానీ పార్టీలోని అంతర్గత అధికార పోరాటాల కారణంగా 1995 సెప్టెంబర్‌ 1 న రామారావు అల్లుడు, మంత్రీ అయిన నారా చంద్రబాబు నాయుడు అత్యధిక శాసనసభ్యుల మద్దతుతో రామారావును తొలగించి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. దాదాపు పదిసంవత్సరాలు, హైదరాబాదును దేశంలో ప్రధానమైన పట్టణాన్ని తీర్చిదిద్దాడు. అయితే గ్రామీణ రైతుల అవసరాలపై దృష్టిపెట్టలేదన్న అపవాదంతో 2004ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది.

మరల కాంగ్రెస్ చేతిలో అధికారం

[మార్చు]

వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ 2004 లో తిరిగి అధికారంలోకి వచ్చింది. తరువాత 2009లో కూడా విజయంసాధించింది. ఈ దశలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం పుంజుకుంది. వైఎస్ఆర్ అకాలమరణంతో కాంగ్రెస్ రాజకీయాలలో కేంద్రం పాత్ర ఎక్కువైంది. 2014లో ప్రభుత్వం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మద్దతుతో తెలంగాణను భారతదేశ 29 రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు భారతప్రభుత్వం ప్రకటించింది. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలుగా విభజించబడింది. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు అధికార భాష.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 2014 జూన్ 2 న అధికారికంగా విభజన జరిగి, రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

మూలాలు, వనరులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
  • Telangana history web site www.telangananewsonline.com