Jump to content

జై ఆంధ్ర ఉద్యమం

వికీపీడియా నుండి
(జై ఆంధ్ర నుండి దారిమార్పు చెందింది)
జై ఆంధ్రా ఉద్యమం (1972) జరిగిన సమయంలో గుంటూరు ఓవర్ బ్రిడ్జిపై ర్యాలీ దృశ్యచిత్రం

హైదరాబాదు సంస్థానంలో 1915లో నిజాము జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం ముల్కీ నియమాలు అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. 1969లో ముల్కీ నియమాలు భారతదేశ ప్రజల మౌలిక హక్కులను కాలరాచేటట్లు ఉండటం వలన రాజ్యాంగ విరుద్ధమని[1] భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించడంతో మొదటి తెలంగాణా ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అయితే 1972లో వేరొక కేసులో అంతకు ముందు తాను చేసిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నియమాలను హైదరాబాదులో ఎప్పటినుండో ఉన్న నియమ నిభందనలు కావున వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ముల్కీ నిబంధనలను అమలు చేయాలని అత్యున్నత న్యాసస్థానం తీర్పునిచ్చింది[2]. ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు పర్యవసానం జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీయటం.

నేపథ్యం

[మార్చు]

స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని 1971 అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించటానికిశ్రీబాగ్‌ ఒడంబడిక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో- కోస్తా, రాయలసీమ, తెలంగాణ నాయకుల్ని సంతృప్తి పరచటానికి పెద్దమనుషుల ఒప్పందం లాగానే, జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపటంకోసం "ఆరుసూత్రాల పధకం" రచించారు. ఈ ఆరు సూత్రాల పథకం ముందు ఉన్న అన్ని నిబంధనలను రూపుమాపి అమలులోకి వచ్చింది.

ఉద్యమ ప్రస్థానం

[మార్చు]

కేంద్రప్రభుత్వం రాజీ ప్రతిపాదనగా ఈ నిబంధనల కాలపరిమితి రాజధానిలో 1977 వరకు, మిగతా తెలంగాణలో 1980 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని శాసనం చేసింది. అయితే ఈ ప్రతిపాదన ఆంధ్ర ప్రాంతం వారికి రుచించలేదు. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. శాసనసభ స్పీకరు బి.వి.సుబ్బారెడ్డి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ప్రాంత శాసనసభ్యులంతా తిరుపతిలో సమావేశమై చర్చించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యధిక మంత్రులు రాజీనామా చేసారు.

ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. సమైక్యవాదులపై దాడులు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా ఉద్యమాన్ని వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన రాష్ట్రహితం కాదని వాదించింది. ఆ పార్టీ పత్రిక విశాలాంధ్ర దినపత్రికలో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది. ఉద్యమకారులు పత్రిక ఆఫీసుపై దాడులు చేస్తామని బెదిరించారు.

పరిష్కారం

[మార్చు]

జనవరి 10 న కాంగ్రెసు పార్టీ తమ ముఖ్యమంత్రి, పి.వి.నరసింహారావు చేత రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించింది. ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢంగా వ్యవహరించింది. ఉద్యమం ఆపివేయడానికి ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. ఆ పథకం ఇది:[3]

  1. ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ సంఘాలను రద్దు చేస్తారు.
  2. నాన్ గజిటెడ్ ఉద్యోగాలు, సివిలు అసిస్టెంటు సర్జను ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇస్తారు.
  3. ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు.
  4. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు రాష్ట్రాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తారు.
  5. హైదరాబాదులో కేంద్రవిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి దోహదం చేస్తారు.
  6. పై సూత్రాలను చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేస్తారు.

ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. 1973 డిసెంబర్లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి జలగం వెంగళరావు నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మూలాలు

[మార్చు]
  1. ముల్కీ నిభంధనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: ఏ. వీ. ఎస్. నరసింహా రావు vs. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం Archived 2011-07-21 at the Wayback Machine
  2. 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిభందనలపై చేపట్టిన తదుపరి వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: డైరెక్టరు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం vs. వి. వెంకటరెడ్డి Archived 2011-07-21 at the Wayback Machine
  3. "ఆరు సూత్రాల పధకం యొక్క పూర్తి పాఠం" (PDF). Archived from the original (PDF) on 2009-12-29. Retrieved 2010-01-05.