అస్సాం ఒప్పందం
1985 అస్సాం ఒప్పందం | |
---|---|
రకం | శాంతి |
సందర్భం | అస్సాం ఉద్యమం |
సంతకించిన తేదీ | 15 ఆగస్టు 1985 |
స్థలం | న్యూ ఢిల్లీ |
ఒరిజినల్ సంతకీయులు | |
కక్షిదారులు |
|
భాష | English |
అస్సాం ఒప్పందం అనేది భారత ప్రభుత్వ ప్రతినిధులు, అస్సాం ఉద్యమ నాయకుల మధ్య సంతకం చేసిన సెటిల్‌మెంట్ మెమోరాండం (MoS). [1] 1985 ఆగస్టు 15 న న్యూఢిల్లీలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. తరువాత, మరుసటి సంవత్సరం, 1986 లో, మొదటిసారిగా పౌరసత్వ చట్టాన్ని సవరించారు.[1][2][3] 1979 లో మొదలైన ఆరేళ్ల ఆందోళన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) నేతృత్వంలో, నిరసనకారులు అక్రమ విదేశీయులందరినీ - ప్రధానంగా బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించి వారిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన , ఇప్పుడూ కొనసాగుతున్న పెద్ద ఎత్తున వలసలు స్థానిక ప్రజలను ముంచెత్తుతూ, వారి రాజకీయ హక్కులు, సంస్కృతి, భాష, భూమి హక్కులపై ప్రభావం చూపుతున్నాయని వారు భయపడ్డారు.[4] అస్సాం ఉద్యమంలో 855 మందికి పైగా మరణించినట్లు అంచనా. ఈ ఒప్పందంపై సంతకం చేయడంతో ఉద్యమం ముగిసింది.[5]
1966 జనవరి 1 కి ముందు అస్సాంలోకి ప్రవేశించిన వలసదారులందరినీ అంగీకరించడానికి అస్సాం ఉద్యమ నాయకులు అంగీకరించారు [1] భారత ప్రభుత్వం అస్సామీ ప్రజల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఆందోళనలను గుర్తించి, పై తేదీ ఆధారంగా ఎన్నికల డేటాబేస్‌ను సవరించడానికి అంగీకరించింది.[1] ఇంకా, 1971 మార్చి 25 తర్వాత వచ్చిన శరణార్థులను, వలస వచ్చిన వారినీ అందరినీ గుర్తించి, బహిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది [1] 1971 లో, బంగ్లాదేశ్‌లోని లక్షలాది మంది పౌరులు - అప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవారు - అంతర్యుద్ధం, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మారణహోమం సమయంలో అక్కడి నుండి పారిపోయి, అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, భారతదేశంలోని అనేక ఇతర సమీప రాష్ట్రాలకు శరణార్థుల రూపంలో భారీ యెత్తున చేరుకున్నారు.[6][7]
అస్సాం ఒప్పందం ప్రకారం, భారత ప్రభుత్వం భవిష్యత్తులో చొరబాట్లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సరిహద్దును "సముచిత ప్రదేశాలలో గోడలు, ముళ్ల కంచెల వంటి భౌతిక అడ్డంకులను" ఏర్పాటు చేయడానికి, బంగ్లాదేశ్-భారత అంతర్జాతీయ సరిహద్దులో అన్ని భూ, జల మార్గాలపై భద్రతా దళాల గస్తీని ఏర్పాటు చెయ్యడానికీ అంగీకరించింది.[1] ఈ ప్రయత్నంలో సహాయంగా, గస్తీ దళాలు, భద్రతా దళాలను త్వరితగతిన మోహరించడం కోసం సరిహద్దు దగ్గర రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే పౌరుల జనన, మరణాల జాబితాను తప్పనిసరిగా నిర్వహిస్తుంది.[1] అస్సాం ఉద్యమంలో పాల్గొన్నవారిపై, నాయకులపై ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు, ఒప్పందం తేదీ వరకూ మోపిన అన్ని పోలీసు అభియోగాలను ఉపసంహరించుకున్నారు, మూసివేసారు.[1] అస్సాం ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ద్రవ్య పరిహారం అందించారు. రాష్ట్రంలో చమురు శుద్ధి కర్మాగారాన్ని తెరవడానికి, పేపర్ మిల్లులను తిరిగి తెరవడానికి, విద్యా సంస్థలను స్థాపించడానికి ప్రభుత్వం అంగీకరించింది.[1]
ఈ ఒప్పందం అస్సాం ఉద్యమానికి ముగింపు పలికింది. ఆందోళన నాయకులకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసింది. ఈ ఒప్పందం ఆందోళనకు ముగింపు పలికినప్పటికీ, కొన్ని కీలకమైన క్లాజులు ఇంకా అమలు కాకపోవడం వల్ల కొన్ని సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.[8][9] రాజకీయ శాస్త్ర ప్రొఫెసరైన సంజీబ్ బారువా ప్రకారం, విదేశీయులను గుర్తించే పని రాజకీయంగా కష్టంగా మారింది. ఓటు బ్యాంకులను ప్రభావితం చేసింది. మతపరమైన లేదా జాతి వివక్ష ఆరోపణలు ఎదురయ్యాయి.[10] ఉదాహరణకు, 1990ల ప్రారంభంలో అస్సాం ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హితేశ్వర్ సైకియా తన ప్రసంగాలలో విరుద్ధమైన ప్రకటనలు ఇచ్చాడు.[10] కొంతమంది ముందు, అసలు విదేశీయులు లేనేలేరని చెప్పాడు; మరి కొందరి ముందు, అస్సాంలో వందల వేల మంది అక్రమ విదేశీయులు ఉన్నారని, వారిని బహిష్కరించాల్సిన అవసరం ఉందనీ అన్నాడు.[10] 1997 లో రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయనాన్ని పూర్తి చేసి, వారి ఓటరు జాబితాలో అనేక మంది పేర్లను "డి" అంటే "వివాదాస్పద పౌరసత్వం" అని గుర్తు పెట్టింది. వారిని ఓటు వేయకుండా నిరోధించే ప్రణాళికలు ఉన్నాయి.[10][11] ప్రజలు ఓటు హక్కును కోల్పోయారని విమర్శకులు ఫిర్యాదు చేశారు. [11] "d" అనేది అనుమానం పైననే ఆధార పడి ఉందని, డాక్యుమెంటరీ ఆధారాలపై కాదనీ రాష్ట్ర హైకోర్టు నిర్ధారించింది. నివాసితులందరూ - పౌరులు, విదేశీయులు - తదుపరి అస్సాం ఎన్నికలలో ఓటు వేయడానికి అనుమతించబడ్డారు. అస్సాం ఒప్పందాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అస్సాం ఉద్యమ మద్దతుదారులు పేర్కొన్నారు.[10]
సంతకాలు చేసినవారు
[మార్చు]అస్సాం ఉద్యమ ప్రతినిధులు
- ప్రఫుల్ల కుమార్ మహంత, అధ్యక్షుడు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్
- భృగు కుమార్ ఫుకాన్, ప్రధాన కార్యదర్శి, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్
- బిరాజ్ కుమార్ శర్మ, జనరల్ సెక్రటరీ, ఆల్ అస్సాం గణ సంగ్రామ్ పరిషత్
భారత, అస్సాం ప్రభుత్వాల ప్రతినిధులు
- RD ప్రధాన్, హోం సెక్రటరీ, భారత ప్రభుత్వం
- PP త్రివేది, ప్రధాన కార్యదర్శి, అస్సాం ప్రభుత్వం
వీరి సమక్షంలో
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Assam Accord" (PDF). United Nations Peace Accord Archives. 1985. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "peacemaker" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Text of Assam Accord, according to the Part II (A) The Assam Gazette 23 June 2015, pp 7
- ↑ Assam Accord SATP.org Archives
- ↑ Sangeeta Barooah Pisharoty (2019). Assam: The Accord, The Discord. Penguin Random House. pp. 1–14, Chapter 2, 9 and 10. ISBN 978-93-5305-622-3.
- ↑ Sangeeta Barooah Pisharoty (2019). Assam: The Accord, The Discord. Penguin Random House. pp. 1–7, Introduction chapter. ISBN 978-93-5305-622-3.
- ↑ Yasmin Saikia (2011). Women, War, and the Making of Bangladesh: Remembering 1971. Duke University Press. pp. 40–47. ISBN 978-0-8223-5038-5.
- ↑ Sarah Kenyon Lischer (2015). Dangerous Sanctuaries: Refugee Camps, Civil War, and the Dilemmas of Humanitarian Aid. Cornell University Press. pp. 24–25. ISBN 978-1-5017-0039-2.
- ↑ AASU questions Govts’ sincerity on Accord Archived సెప్టెంబరు 28, 2007 at the Wayback Machine, The Assam Tribune, 13 May 2007.
- ↑ "Union Cabinet clears panel to promote Assam's cultural identity". The Hindu (in Indian English). 2019-01-02. ISSN 0971-751X. Retrieved 2019-01-03.
- ↑ 10.0 10.1 10.2 10.3 10.4 Sanjib Baruah (1999). India Against Itself: Assam and the Politics of Nationality. University of Pennsylvania Press. pp. 160–168. ISBN 0-8122-3491-X.
- ↑ 11.0 11.1 Pinar Bilgin; L.H.M. Ling (2017). Asia in International Relations: Unlearning Imperial Power Relations. Taylor & Francis. pp. 56–60. ISBN 978-1-317-15379-5.