Jump to content

స్టీము ట్రాప్

వికీపీడియా నుండి
1885నాటి స్టీము ట్రాప్
స్టీము ట్రాప్
బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్
టిడిఎస్ స్టీము ట్రాప్

స్టీము ట్రాప్ (steam trap) అనునది స్టీము (నీటి ఆవిరి), కొంత స్టీము ద్రవీకరణచెందటం వలన ఏర్పడిన నీటి మిశ్రమం నుండి కేవలం నీటిని మాత్రమే బయటికి వెళ్ళుటకు అనుమతించి, స్టీమును బయటకు వేళ్ళకుండా ఆపే పరికరం[1].

స్టీము అనగా పీడనం, అధిక ఉష్ణోగ్రత కల్గివున్న నీటి ఆవిరి. స్టీమును బాయిలరు అను లోహ నిర్మాణంలో ఉత్పత్తి చేస్తారు. ఇంధనాన్ని మండించగా వచ్చు ఉష్ణోగ్రతతో నీటిని వేడి చేసి స్టీము /నీటి ఆవిరిని ఉత్పత్తి చేస్తారు. స్టీమును ఉత్పత్తి చేయు బాయిలరులు పలురకాల నిర్మాణంలో లభ్యం. స్టీము వలన చాలా పారిశ్రామిక ఉపయోగాలు ఉన్నాయి. స్టీమును కేవలం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలో టర్బైనులను తిప్పుటకు మాత్రమే కాక ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్టీము లోకో మోటివ్ రైళ్ళు స్టీము వలెనే తిప్పబడినవి. దాదాపు 150 సంవత్సరాలు పైబడి స్టీము రైలు ఇంజనులు ప్రపంచ మంతటా ఉక్కు పట్టాలపై పరుగులెత్తి, కోట్లాను కోట్ల ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చింది. అలాగే సరుకులను ప్రపంచం నలుచెరుగుల రవాణా చేసాయి. ప్రస్తుత్తం స్టీము ఇంజనుల స్థానంలో డీజిలు, ఎలక్ట్రికల ఇంజనులు ఆక్రమించాయి.

స్టీము ప్రత్యేకతలు

[మార్చు]

స్టీమును భారీ ప్రమాణంలో తయారు చేయుటకు అవసరమైన నీరు విరివిగా లభిస్తుంది. నీరు అతి చౌకగా కూడా లభిస్తుంది. స్టీము యొక్క గుప్తోష్ణం కూడా చాలా ఎక్కువ. గుప్తోష్ణాన్ని ఇంగ్లీషులో ఎంతాల్పిఅంటారు. నీరు వాతావరణ పీడనంవద్ద 100°Cవద్దనే స్టీముగా మారినప్పటికీ, ఒక కేజీ నీరు స్టీముగా మారుటకు 540 కిలో కేలరీల ఉష్ణం (2258కిలో జౌలులు అందాజుగా) అవసరం. దీనినే గుప్తోష్ణం అంటారు. స్టీము పీడనం, ఉష్ణోగ్రత అనులోమానుపాతంలో వుండును. అనగా స్టీము పీడనం పెరిగే కొలది స్టీము ఉష్ణోగ్రత పెరుగుతుంది. కావున ఈ స్టీము యొక్కా అధిక ఉష్ణ ధారణ శక్తిని పరిశ్రమలలో పలురకాలుగా ఉపయోగిస్తారు. రసాయన, ఔషధ తయారి, నూనెల, కాగితపు, చక్కర పరిశ్రమలు ఇలా పలురకాల పరిశ్రమలలో స్టీమును వినియోగిస్తారు[2].

స్టీమును విద్యుతు ఉత్పత్తి కేంద్రాలలో టర్బైను తిప్పుటకు ఉపయోగిస్తారు. స్టీమును చాలా ఘన, ద్రవ, వాయు పదార్థాలను వేడి చేయుటకు ఉపయోగిస్తారు, విభిన్న మరుగు ఉష్ణోగ్రత (బాష్పీభవన స్థానం) లు ఉన్న ద్రవ మిశ్రమాలను వేరు చేయుటకు స్టీమును ఉపయోగిస్తారు. కొన్నింటిని స్టీమును నేరుగా ఆయా పదార్థాల లోకినేరుగా పంపి వేడిచేయగా చాలావరకు హీట్ ఎక్స్చేంజరు అను దాని ద్వారా వేడి చేస్తారు. ఈ హీట్ ఎక్స్చేంజరులు పలు రకాలుగా ఉన్నప్పటికీ అవి పని చేయు విధానం ఒకే సిద్ధాంత పరంగా పనిచేయును. వేడి చెయ్యవలసిన ద్రవం ఉష్ణాన్ని తనద్వారా ప్రసరించే ఉష్ణ వాహక గుణమున్న ఒక యానకంలో ప్రవహిస్తుండగా, యానకం వెలుపల స్టీమును ప్రసరింప చేసి ఉష్ణ పరస్పర మార్పిడి వలన ద్రవాలను వేడి చేస్తారు. ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత పదార్ధం నుండి తక్కువ ఉష్ణోగ్రతవున్న పదార్థానికి వ్యాపిస్తుంది. ఆ విధంగా తక్కువ ఉష్ణోగ్రతలో వున్న ద్రవాలను, వాయువులను, ఘన పదార్థాలను వేడి చేస్తారు.[3].

స్టీము ట్రాప్ అవసరమేమిటి?

[మార్చు]

స్టీము ద్వారా ఇతర పదార్థాలకు ఉష్ణ మార్పిడి జరిగినపుడు, స్టీముకొంత ఉష్ణ శక్తిని కోల్పోయి, దాని ఉష్ణోగ్రత తగ్గును. ఆమేరకు కొంత స్టీము ద్రవంగా మారును. అనగా స్టీము, వేడి నీరుగా పరివర్తన చెందును. ఆ విధంగా ద్రవీకరణ చెందిన స్టీమును కండేన్సేట్ (condensate) అంటారు. ద్రవీకరణ చెందిన స్టీమును అప్పటికప్పుడు తొలగించనిచో, హీట్ ఎక్స్చేంజరులో నీరు నిలిచి పోవడం వలన స్టీము ప్రసరణ జరుగదు. కావున ఉష్ణమార్పిడి, వినిమయం జరగదు. అందువలన ఏర్పడిన నీటిని తప్పనిసరిగా క్రమబద్దంగా తొలగిస్తూ వుండాలి. ఒక మామూలు వాల్వును పాక్షికంగా తెరచి వుంచి నీటిని బయటకు వదల వచ్చును. కాని స్టీము వాడకంలో హెచ్చు తగ్గుల వలన వాల్వుపని తీరులో ఇబ్బందులు ఉన్నాయి. వాల్వు తక్కువ తెరచి వుంచి ఎక్కువ స్టీము వాడిన, నీరు హీటరులో వుండి పోవును. వాల్వు ఎక్కువ తెరచివుండినచో వాల్వునుండి నీటితోపాటు స్టీము బయటకు వెళ్లిపోవును. అలాకాకుండా కేవలం ద్రవీకరణ చెందిన స్టీమును మాత్రమే బయటకు వదిలి, స్టీమును బయటకు రాకుండా నిలువరించు వాల్వు లేదా కవాటమే స్టీము ట్రాప్.

స్టీము ట్రాప్

[మార్చు]

స్టీము అధిక పీడనం, ఉష్ణోగ్రత కల్గి వుండును. అందువలన స్టీము ట్రాప్ లు అన్నియు పోత ఇనుము, ఉక్కు, స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. సాధారణంగా స్టీము ట్రాప్ బాడీ (body) /బాహ్య ఆకృతి భాగాలు పోత ఇనుము, పోత ఉక్కు ( కాస్ట్ స్టీలు) తో చెయ్యబడి వుండును.లోపలి భాగాలు స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. ఉపయోగించు స్టీము ఎక్కువ పీడనం కల్గి వుండును, అధిక ఉష్ణోగ్రత కల్గి ఉన్నందున, వాటిని తట్టుకోగల్గిన విధంగా స్టీము ట్రాపుల నిర్మాణం వుండును. అంతేకాదు ద్రవీకరణ చెందిన స్టీము ఎక్కువ ఆమ్ల గుణాన్ని (pH= 6.౦-6.5) కల్గి వుండటం వలన ఎక్కువ కాలం సంపర్కం వలనలోహాన్ని తిని వేయును. కావున వీటిని అన్నింటిని తట్టుకోగల్గిన విధంగా స్టీము ట్రాపుల నిర్మాణం వుండును.

స్టీము ట్రాప్ రకాలు

[మార్చు]

స్టీము ట్రాపులను వాటి ఆకృతి పరంగా, పనిచేయు విధానాన్ని అనుసరించి పలురకాలుగా వర్గీకరణ చేసారు[4].అవి

  1. బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్[5]
  2. ఇన్వర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్
  3. థెర్మోడైనమిక్ స్టీము ట్రాప్
  4. థెర్మో స్టాటిక్ ట్రాప్
  5. ఆరిఫిస్ ట్రాప్

ఈ వ్యాసాలు కూడా చదవండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "What is a Steam Trap?". tlv.com. Archived from the original on 2017-08-23. Retrieved 2018-03-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "What is Steam?". uniklinger.com. Archived from the original on 2017-08-20. Retrieved 2018-03-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Fundamental Applications of Steam". forbesmarshall.com. Retrieved 2018-03-18.[permanent dead link]
  4. "Steam Trap". forbesmarshall.com. Retrieved 2018-03-18.[permanent dead link]
  5. "Ball Float Steam Traps". miyawaki.net. Archived from the original on 2017-08-25. Retrieved 2018-03-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)