సిద్ధవటం కోట
సిద్ధవటం కోట సిద్ధవటం కేంద్రంగా పరిపాలించిన రాజులు నిర్మించిన కోట. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
చరిత్ర
[మార్చు]సిద్ధవటం కోటను విజయనగర చక్రవర్తిగా వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట గురవరాజు పరిపాలించేవారు. ఆయన పరిపాలనలో స్త్రీలను అత్యంత ఘోరంగా అవమానించి మరీ ప్రజల నుంచి ధనం తీసుకుంటూండడంతో ఆ విషయాన్ని కూచిపూడి భాగవతుల ప్రదర్శన ద్వారా తెలిసిన వీరనరసింహరాయలు అతనికి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం కోటను వశపరుచుకునేందుకు యుద్ధాన్ని చేసి కోట వశమయ్యాకా సంబెట గురవరాజును చంపారు.[1] శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు 'కాకుత్థ్స విజయము ' అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు.[2]
మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ వశమయింది.[2]
నిర్మాణం
[మార్చు]కోటకు పడమట, తూర్పున రెండు ద్వారాలున్నాయి.ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహు గ్రహణం పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణి దర్బారు, ఈద్గా మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. శిథిలమవుతూ ఉన్న కామాక్షి ఆలయాన్ని మరమ్మత్తులు చేసి ఉంచారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు.
దేవాలయాలు
[మార్చు]లంకమల లోని నిత్యపూజకోనలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. జిల్లాలో పెద్దయెత్తున శివరాత్రి ఉత్సవాలు జరిగే ప్రాంతాలలో పొలతల తరువాతి స్థానం నిత్యపూజకోనదే.
మూలాలు
[మార్చు]- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
- ↑ 2.0 2.1 "శిల్పకళా తోరణం.. సిద్ధవటం". సూర్య. సూర్య. 10 July 2012. Retrieved 29 December 2014.[permanent dead link]