శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం (సురుటుపల్లి)
శ్రీ పల్లికొండేశ్వర దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | తిరుపతి జిల్లా |
ప్రదేశం: | సురుటుపల్లె |
అక్షాంశ రేఖాంశాలు: | 13°9′N 80°18′E / 13.150°N 80.300°E |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | క్రీ.శ. 1344–47 మధ్యకాలం |
సృష్టికర్త: | విజయనగరాధీశుడు హరిహరబుక్కరాయలు |
శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సురుటుపల్లె గ్రామంలో నెలకొనిఉన్న అతిపురాతనమైన శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు లింగ రూపంలో కాక సశరీర రూపధారుడుగా దర్శనమివ్వడం విశేషం. పైగా సదా శివుడు కూడా శ్రీ మహావిష్ణువులా శయన భంగిమలో కనిపిస్తాడు.[1] పరమశివుడు హాలాహలాన్ని సేవించినపుడు కొద్దిసేపు పార్వతీ దేవి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ విగ్రహం ఉంటుంది.
ఆలయ విశిష్టత
[మార్చు]దేవదానవులు అమృతం కోసం క్షీర సాగర మధనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆ కాలకూట విషాన్ని శివుడు మింగి తన గరళంలో దాచుకున్నాడు. కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంత సేపు పార్వతి ఒడిలో సొమ్మసిల్లి, ఆ తరువాత సేదదీరిన క్షేత్రంగా దీనిని చెప్తారు. గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహా విష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. అప్పటి నుండే శివుడు నీల కంటుడిగాను, శ్రీ మహా విష్ణువు నీలిమేఘ శ్యామునిగాను ప్రఖ్యాతి చెందారు.[2]
నారదుడు ముల్లోకాలకూ ఈ సమాచారం చేరవేశాడు. అన్ని సురగణాలకూ ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురుల పల్లి అనే పేరు వచ్చింది. అది కాలక్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురటుపల్లెగా మారింది.
సమస్త భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. శనిపీడితులు, ఇతర జన్మ నక్షత్ర, పితృదోష నివృత్తులకు కృష్ణపక్ష శనివారం త్రయోదశి తిధిలో సంధ్యాసమయంలో ఈ ఆలయంలో జరిగే ప్రదోషపూజలో పాల్గొని దోష నివృత్తి చేసుకుంటారు. శయన భంగిమలో ఉన్న శివుడిని దర్శించుకొంటే అనిర్వచనీయమైన అనుభూతి కలగడంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది అని అంటారు.[3]
స్థలపురాణం
[మార్చు]విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహరబుక్కరాయలు క్రీ.శ. 1344–47 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ జరిపినట్లు ఆలయ కుడ్యాలపై లిఖింపబడి ఉంది. 1979లో కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SITA)చే నిర్వహించబడుతున్నది.[4]
ఎలా చేరుకోవాలి
[మార్చు]ఇది తిరుపతి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం.[5] శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఉన్న సురుటుపల్లి, మండల కేంద్రమైన నాగలాపురం నుండి 11 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి ఒక కి.మీ. దూరంలోనూ ఉంది. తిరుపతి నుండి 73 కిలోమీటర్లు చెన్నై వైపుగా, చెన్నై నుండి 68 కిలోమీటర్లు తిరుపతి వైపుగా ప్రయాణిస్తే తిరుపతి, చెన్నై జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆలయ కాటేజీ రూములు ఐదు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత ఆలయ దర్శనాల బస్సు రోజు ఈ ఆలయానికి వస్తూ ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "special story to lord shiva temple - Sakshi". web.archive.org. 2023-07-24. Archived from the original on 2023-07-24. Retrieved 2023-07-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sri Pallikondeeswarar temple". Dinamalar. 2014. Retrieved 4 November 2021.
- ↑ "Deities in rare form". The Hindu. 28 February 2003. Archived from the original on 15 June 2013. Retrieved 12 October 2016.
- ↑ "Pallikondeeswarar temple Surutapalli". Malaimalar. 13 December 2018. Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
- ↑ "Pallikondeswara Temple: What is the rare glory of Lord Shiva lying on the lap of Goddess Parvati .. Do you know how to reach ..!". TV9. 1 March 2021. Retrieved 4 November 2021.