శతపథ బ్రాహ్మణం
శతపథ బ్రాహ్మణం (शतपथ ब्राह्मण śatapatha brāhmaṇa, "వంద మార్గాల బ్రాహ్మణం", సంక్షిప్తంగా శ.బ్రా.) వేద కర్మలను వివరిస్తూ, శుక్ల యజుర్వేదం సంబంధం ఉన్న గద్య గ్రంథాలలో ఇది ఒకటి.[1] శుక్ల యజుర్వేదం నకు సంబంధించి ఉన్న ఒకే ఒక బ్రాహ్మణం శతపథ బ్రాహ్మణం ఇది 100 అధ్యాయాలు ఉన్న గ్రథం కాబట్టి దీనికి ఈ పేరు సార్థకమైంది. దీని మూలరూపం రెండు విభాగాలు ఉంది. మాధ్యందిన శాఖకు చెందిన మాధ్యందిన శతపథ బ్రాహ్మణం (శ.బ్రా.మా.), కాణ్వ శాఖకుచెందిన కాణ్వ శతపథ బ్రాహ్మణం (శ.బ్రా.కా.). ఈ రెంటి శాఖలలో చిన్న చిన్న తేడాలుంటాయి తప్ప పెద్దగా భేదము లేదు. సాయణుడు మాధ్యందిన శతపథ బ్రాహ్మణమునకు సమగ్రంగా భాష్యం చేయడము వలన ఇది వైదిక లోకానికి అందుబాటులోకి బాగా వచ్చింది.
మాధ్యందిన శాఖ
[మార్చు]ఈ శతపథ బ్రాహ్మణం పూర్వనామముతో (మాధ్యందిన) 7.624 ఖండికలు (భాగాలు), 100 అధ్యాయాలు, 14 కాండలు (పుస్తకాలు) కలిగి ఉంది. ప్రతికాండ కొన్ని ప్రపాఠకాలుగా విభజింప బడింది. ఈ బ్రాహ్మణంలో 68 ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రపాఠముకాలు తిరిగి అధ్యాయాలుగా విభజింప బడ్డాయి. 100 అధ్యాయాలు మరల 438 బ్రాహ్మణాలుగా వేరుచేయ బడ్డాయి. ప్రతి బ్రాహ్మణం లోనూ కొన్ని కండికలు ఉంటాయి.
శతపథ బ్రాహ్మణంలో 438 బ్రాహ్మణాలుగా విభజించిన ప్రతి ఒక బ్రాహ్మణానికి ఒక్కో పేరు ఉంది. వీటిలో కొన్ని, సృష్టిబ్రాహ్మణం, నక్షత్రబ్రాహ్మణం, సంభారబ్రాహ్మణం, ఉద్గీథబ్రాహ్మణం మొదలయినవి. వీటికి సంబంధించిన వివరాలు భాష్యంలో దొరుకు తున్నాయి. బ్రాహ్మణాలు, అధ్యాయాలు, కాండలు, ప్రపాఠకాలు, కండికలు మొదలయిన వాటి వివరాలు ఈ క్రింద పట్టికలో చూడగలరు.[2]
విభాగం
[మార్చు]శతపథ బ్రాహ్మణం (మాధ్యందిన) | ||||
కాండలు | ప్రపాఠకాలు | అధ్యాయాలు | బ్రాహ్మణాలు | కండికలు |
1 | 7 | 9 | 37 | 837 |
2 | 5 | 6 | 24 | 549 |
3 | 7 | 9 | 37 | 859 |
4 | 5 | 6 | 39 | 648 |
5 | 4 | 5 | 25 | 471 |
6 | 5 | 8 | 27 | 530 |
7 | 4 | 5 | 12 | 398 |
8 | 4 | 7 | 27 | 437 |
9 | 4 | 5 | 15 | 402 |
10 | 4 | 6 | 31 | 369 |
11 | 4 | 8 | 42 | 437 |
12 | 4 | 9 | 29 | 459 |
13 | 4 | 8 | 43 | 432 |
14 | 7 | 9 | 50 | 796 |
మొత్తం | 68 | 100 | 438 | 7624 |
వ్యాఖ్యానాలు
[మార్చు]హరిస్వామి
[మార్చు]చాలాప్రాచీనమైన శ్రుత్యర్థవివృత్తి అనే భాష్యం హరిస్వామి మాధ్యందిన శతపథ బ్రాహ్మణానికి వ్రాశాడు. అవంతీ రాజ్యమునకు ఉజ్జయిని రాజదానిగా చేసుకొని ప్రపాలించిన విక్రమార్క మహారాజు ఆస్థానంలో ధర్మాథ్యక్షుడుగానూ, దానాథ్యక్షుడుగానూ హరిస్వామి ఉన్నట్లుగా అతని భాష్యం ద్వారా తెలుస్తున్నది. దీన్నిబట్టి నాగస్వామి కుమారుడైన హరిస్వామి సామాన్యశకానికి మునుపు. 55వ సంవత్సరములో తన భాష్యాన్ని రచించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ఇతని గంభీరమైనటువంటి భాష్యం సంపూర్ణముగా లభించుట లేదు. ఇతనికి సర్వవిద్యానిధానకవీంద్రాచార్య సరస్వతి అనే బిరుదు ఉంది.
సాయణుడు
[మార్చు]వేదసంహితలకు భాష్యం వ్రాశిన పిదప, బ్రాహ్మణానికి కూడా సమగ్ర సంపూర్ణమైన భాష్యం వ్రాయు సంకల్పముతో ఈ మాధ్యందిన శతపథబ్రాహ్మణానికి సాయణుడు భాష్యం వ్రాశినట్లుగా తన ఉపోద్ఘాతంలో చెప్పుకొన్నాడు.[3]
కాణ్వ శాఖ
[మార్చు]ఈ శతపథ బ్రాహ్మణం పూర్వనామముతో (కాణ్వ ) 6,806 ఖండికలు (భాగాలు), 104 అధ్యాయాలు, 17 కాండలు (పుస్తకాలు) కలిగి ఉంది. ఈ బ్రాహ్మణంలోని 104 అధ్యాయాలు 435 బ్రాహ్మణాలుగా వేరుచేయ బడ్డాయి. మరల ప్రతి బ్రాహ్మణం లోనూ కొన్ని కండికలు ఉంటాయి. దీనిలో మొత్తం 6806 కండికలు ఉన్నాయి. ఈ బ్రాహ్మణంలోని అధ్యాయాలు తిరిగి ప్రపాఠకాలుగా విభజింపబడ లేదు. బ్రాహ్మణాలు, అధ్యాయాలు, కాండలు, కండికలు మొదలయిన వాటి వివరాలు ఈ క్రింద పట్టికలో చూడగలరు.[2]
విభాగం
[మార్చు]శతపథ బ్రాహ్మణం (కాణ్వ ) | |||
కాండలు | అధ్యాయాలు | బ్రాహ్మణాలు | కండికలు |
1 | 6 | 22 | 376 |
2 | 8 | 32 | 532 |
3 | 2 | 22 | 124 |
4 | 9 | 36 | 649 |
5 | 8 | 38 | 974 |
6 | 2 | 7 | 700 |
7 | 5 | 19 | 289 |
8 | 8 | 27 | 511 |
9 | 5 | 18 | 257 |
10 | 5 | 20 | 248 |
11 | 7 | 20 | 437 |
12 | 8 | 28 | 286 |
13 | 8 | 31 | 241 |
14 | 9 | 28 | 392 |
15 | 8 | 44 | 308 |
16 | 2 | 8 | 192 |
17 | 6 | 47 | 295 |
మొత్తం | 104 | 435 | 6806 |
విషయాలు
[మార్చు]శతపథ బ్రాహ్మణం లోని రెండు శాఖలయినటువంటి, మాధ్యందినశాఖ, కాణ్వశాఖ లలో ఒక్క పిండపితృయజ్ఞం లోనే తేడా కనపడుతుంది. మాధ్యందినశాఖ బ్రాహ్మణం మొదటి నుండి తొమ్మిదవ కాండ వరకు మాధ్యందినసంహిత క్రమమునే అనుసరిస్తుంది. దర్శపూర్ణమాసయాగం, వాజపేయం, చయనం, ఉషాసంభరణం, రాజసూయం, అశ్వమేధం, ప్రవర్గ్య, సౌత్రామణి, దీక్షాక్రమం, బ్రహ్మవిద్య మొదలయినవి శతపథ బ్రాహ్మణంలో ప్రతిపాదించ బడిన విషయాలు.
సంకలన కాలం
[మార్చు]ఆధ్యాత్మిక విద్యలలో నిష్ణాతులైన బ్రహ్మర్షులతో అత్యంత కళకళలాడుతూ ఉండే మిథిలానగరం రాజధానిగా విదేహ దేశాన్ని పరిపాలించిన జనకుడు కాలంలో ఈ బ్రాహ్మణం బాగా గొప్పగా ప్రచారం పొందింది.[2] కురు దేశము, పాంచాల దేశములందు శతపథ బ్రాహ్మణం వేళ్ళూనుకుందని చెప్పుకునేందుకు అవకాశములెక్కువ. జనమజేయుడు ఈ బ్రాహ్మణంలో కురురాజుగా పిలువబడుతున్నాడు. పాంచాల దేశీయుడైన అరుణి మహర్షి మహా గొప్ప యాజ్ఞికుడు. అరుణి శిష్యుడు యాజ్ఞవల్క్య మహర్షి జనకుడు ఆస్థానంలో సభాపతి.
కాలం
[మార్చు]ఈ సృష్టి వేదాలు ఆధారంగా ప్రాచీన వైదికులు చేశారు. ఇవి సృష్టి కంటే ముందు ఉండి ఉండవచ్చునని ఊహించారు. కాని చరిత్రకారులు, ఆధునికులు ఈ విషయాలను అంగీకరించరు.[2] ఆధునిక విమర్శకులు సామాన్యశకంముందు .800 - 500 సం.ల మధ్యకాలంలో బ్రాహ్మణ వాజ్మయము ఏర్పడిందని వారి విశ్వాసం. ఈ శతపథ బ్రాహ్మణం ఇతర బ్రాహ్మణాల కంటే నవీనమైనది కాబట్టి, ఇది శా.కా. 6వ శతాబ్దంలో ఏర్పడిందని ఊహించబడుతున్నది. కానీ ఈ విషయాన్ని వైదిక మార్గమును అనుసరించే వారు అంగీకరించరు.
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]- Weber, The Catapatha-Brahmana, Berlin, 1949.
- Max Müller, The Satapatha-Brahmana, Madhyandina School, Vol. 12.Part1, Book 1 and 2, Clarendon Press, 1882; reprint by Motilal Banarsidass, 1972.
- Moriz Winternitz, A History of Indian Literature (Vol.I), Second edition 1972.
- W.P Lehmann and H. Ratanajoti, Typological syntactical Characteristics of the Śatapathabrāhmaṇa, JIES 3:147-160.
బయటి లింకులు
[మార్చు]- GRETIL etext
- The Eggeling translation of the Satapatha Brahmana, at sacred-texts.com
- Subhash C Kak. "Anatomy of Sathapatha brahmana" (PDF). Archived from the original (PDF) on 2014-08-01.
మూలాలు
[మార్చు]- ↑ Jones, Constance (2007). Encyclopedia of Hinduism. New York: Infobase Publishing. p. 404. ISBN 0816073368.
- ↑ 2.0 2.1 2.2 2.3 "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
- ↑ సర్వతః సాయణోచార్యో విమృశ్యోదీరితాన్ గుణాన్ | మాధ్యన్దినే శతపధే బ్రాహ్మణే వ్యాకరోతి రత్ ||