Jump to content

వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం

వికీపీడియా నుండి
వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం
(VEERESALINGAKAVI LIBRARY)
గ్రంథాలయ నూతన భవనం
దేశముభారత దేశము
తరహాప్రైవేటు
స్థాపితము1897
ప్రదేశముకుముదవల్లి, భీమవరం

శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం భీమవరం సమీపాన కల కుముదవల్లి గ్రామంలో ఉంది. ఇది 1897 సంవత్సరంలో స్థాపించబడింది.

గ్రంథాలయం ఉద్యమం, జాతీయ కాంగ్రెస్ స్థాపన

[మార్చు]
Panorama of VILLAGE
కుముదవల్లి గ్రామ చిత్రం.

ప్రజల సామూహిక శక్తిని సమీకరించి, ఒక వ్యవస్థాపరమైన మార్పుకోసం జరిగే దీర్ఘ కాల పోరాటాన్ని సాంఘిక ఉద్యమం అంటారు. పరాయి పాలన విముక్తి కోసం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించాలనే భావన దివ్య జ్ఞాన సమాజ సభ్యుడైన ఏ.ఓ.హ్యూమ్‌కు కలిగింది. హ్యూం మిత్రులతో కూడిన సమావేశం ఈ ఆలోచనను ధ్రువపరచింది. ఈ అలోచనను ఉద్యమ రూపంలోకి తెచ్చేందుకు 1885లో ముంబై లో ప్రథమ కాంగ్రెస్ మహాసభ జరిగింది. తదుపరి జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.

ప్రారంభ చరిత్ర

[మార్చు]
భూపతిరాజు తిరుపతిరాజు గారు

అప్పటి రోజులలో దాదాబాయి నౌరోజీ రాసిన పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే రచన బ్రిటిష్ పాలన వలన భారత దేశ ఏ విధంగా నష్టపోతున్నదీ వివరించింది. ఇలాంటి పుస్తకాలను చదివేలా చేస్తేనే ప్రజలలో సామాజిక చైతన్యం కలుగుతుందని గ్రహించిన కొందరు యువకులు పల్లెలలో గ్రంథాలయాల స్థాపనకు నడుం బిగించారు. అప్పటి రోజులలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా రాయకుదురులోసుజనానద గ్రంథాలయం, ఏ.ఓ. హ్యూం పేౠన కోపల్లెలోనూ, దాదాబాయి నౌరోజీ పేరున ఉండి గ్రామంలోనూ గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. కుముదవల్లి గ్రామంలో గ్రంథాలయం స్థాపించాలని ఆలోచన ఆ గ్రామానికి చెందిన వడ్రంగి అయిన చిన్నమరాజు గారికి కలిగింది.

ఆయన ముందుగా తన వద్ద కల యాభై పుస్తకాలు, వాటితో పాటుగా తను తెప్పించే దేశాభిమాని, ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రకాశీక వంటివి తెచ్చి గ్రంథాలయం ప్రారంభించారు. దానికి శ్రీ వేరేశలింగ కవి సమాజ గ్రంథాలయం అని నామకరణం చేసారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ పుస్తకాలకు భూపతిరాజు లచ్చిరాజు గారు ఆశ్రయం ఇచ్చారు. 1897 నాటికి తెలుగు పుస్తకాల ముద్రణ అంతగా లేదు. అయినా పోస్టాఫీసూలద్వారానూ, ఇతర మార్గాలలోనూ దొరికినంత వరకూ గ్రంథాలనూ, పత్రికలనూ సేకరించేవారు.

గ్రంథాలయ నిర్మాణ విశేషాలు

[మార్చు]

మొదటి గ్రంథాలయ నిర్మాణం

[మార్చు]

శ్రీభూపతిరాజు తిరుపతిరాజు గారు గ్రంథాలయం ప్రారంభించిన కొద్ది రోజులలో గ్రామానికి చెందిన రైతు కుటుంభానికి చెందిన యువకుడు వీరేశలింగ గ్రంథాలయానికి చదువుకొనేటందుకు వస్తూ దానికి పెద్ద అభిమానిగా మారిపోయాడు. క్రమ క్రమంగా గ్రంథాలయ సేవకే అంకితమైపోయారు. గ్రంథాలయ అభివృద్ధికొరకు నిరంతరం పాటుపడుతూ ఉండేవారు. ఆయనే తిరుపతిరాజు. అప్పటి గ్రంథాలయం ఉచితంగా ఉన్న వసతిలో ఉంది. దానికి శాశ్వతమైన వసతి కొరకు కృషి మొదలెట్టారు. గ్రామ మద్యగా సెంటు స్థలాన్ని గవర్నమెంటు నుండి సంపాదించారు. తన సహచరుడు అయిన కాళ్ళకూరి నరసింహం గారి సలహా మేరకు ప్రజా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిన వితరణ శీలి పోలవరం జమిందారు (వీరిది వీరవాసరం స్వగ్రామం) అయినటువంటి కొచ్చెర్ల కోట రామచంద్ర వెంకట కృష్ణరావు గారిని సంప్రదించి వారి ద్వారా గ్రంథాలయం కొరకు 400 విరాళంగా పొందారు. ఆ నిధితో తాటాకుల ఇంటిని నిర్మించి దానిలోకి గ్రంథాలయాన్ని మార్చారు.

పాఠకుల ఆసక్తి కొత్తగా కట్టిన ఇంటిలోకి మారిన గ్రంథాలయానికి పాఠకుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. ఉన్న వాటితో పాటు మరికొన్ని పత్రికలను కూడా తీసుకోసాగారు అప్పట్లో వచ్చే పత్రికలలో కొన్ని

విజ్ఞాన చంద్రిక గ్రంథమాల ప్రచురణలు అన్నిటినీ గ్రంథాలయానికి సేకరించేవారు. మచిలీపట్టణం ఆంధ్ర భాషావర్ధనీ సమాజ ప్రచురణలు, కందుకూరి వీరేశలింగం వారి అన్ని రచనలూ ఇక్కడ భద్రపరచేవారు. కందుకూరి వారి శిష్యుడైన తిరుపతి రాజు గారు కేవలం గ్రంథాలయాన్ని పుస్తకాల కొరకే కాక ఒక ప్రజా హిత కార్యక్రమ శాలగా మార్చివేసారు. దీని ద్వారా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించేవారు.

రెండవ గ్రంథాలయ నిర్మాణం

[మార్చు]
రెండవ నిర్మాణమైన పెంకుటింటి గ్రంథాలయం

గ్రంథాలయ అభివృద్ధి ఇలా పలు కార్యక్రమాలు జరుగుతూ గ్రంథాలయం అందరి మన్ననలతో పాటుగా పుస్తకాల సంఖ్య, పాఠకుల సంఖ్య కూడా పెరగటం, కొత్తగా పుస్తకాలకు బీరువాలు ఏర్పాటు చేయడం వలన చదువరులకు స్థలాభావం కలగటం గమనింఛి మంచి గ్రంథాలయం నిర్మించవలసిన వసరం ఉన్నదని గ్రహించి ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం ప్రక్కగా మరొక సెంటు భూమి ఇవ్వవలసిందిగా గవర్నమెంటు వారిని కోరారు. వారి అనుమతితో వచ్చిన భూమిలో నిర్మాణం కొరకు తిరుపతి రాజు గారు అనేక మందిని విరాళాలకోసం కలిసారు అలా విరాళం ఇచ్చిన ధాతలు

  • పిఠాపురం మహారాజావారు
  • పోలవరం జమిందారు
  • కోడూరుపాడుకు చెందిన నడింపల్లి నారాయణరాజు
  • భూపతి రాజు సుబ్బరాజు
  • భూపతిరాజు సోమరాజు
  • సాగి వెంకట నరసింహరాజు
  • పెన్మత్స వెంకట్రామరాజు (గోటేరు)
  • భూపతిరాజు కృష్ణం రాజు గారి సతీమణి సీతయ్యమ్మ గార్ల ద్వారా సుమారు 620 రూపాయలు సేకరించి పెంకుటిల్లు నిర్మించారు.

ఈ పెంకుటింటికి కృష్ణారావు మందిరం అని పిలిచేవారు. తరువాత గ్రంథాలయ నిర్వహణ, అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు కావాలని భావించి 1916 నాటికి సుమారు మూడువేల స్థిర, చరాస్తులను గ్రంథాలయానికి సమకూర్చారు. 1932 నాటికి గ్రంథాలయంలో 16 వందల గ్రంంథాలు చేరాయి. ఈ గ్రంథాలయానికి జిల్లాలోనే గొప్ప గ్రంథాలయంగా పేరు ప్రఖ్యాతులు కలిగాయి.

సరికొత్త గ్రంథాలయ భవన నిర్మాణం

[మార్చు]
మూడవది ప్రస్తుతం ఉన్న కొత్త భవనం
గ్రంథాలయ పై అంతస్తు
గ్రంథాలయ మొదటి అంతస్తు చదువరుల హాలు

దాదాపు 75 సంవత్సరాలు సేవలందించిన గ్రంథాలయ పెంకుటిల్లు బలహీనమైపోవడంతోనూ, పుస్తకాల సంఖ్య పెరగటం వలన, చదువుకొనే స్థలం తగ్గుతూ ఉండటం వలన మరొక విశాలమైన భవన నిర్మాణానికి పూనుకొన్నారు. 1985 మార్చి 1 వ తేదీన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూపతిరాజు రామచంద్రరాజు, వారి సతీమణి సూర్యావతి గార్లచే శంకుస్థాపన చేయించారు. అదే గ్రామానికి చెందిన ప్రముఖులు లార్స్‌విన్ గ్రూప్ కంపెనీకి చెందిన ఎస్.కృష్ణంరాజు గారు, రాసి గ్రూప్ సంస్థల అధిపతి బి.వి రాజు గారు, డెల్టా పేపర్ మిల్స్ అధిపతులు అయిన భూపతిరాజు సూర్యనారాయణ రాజు గార్ల ప్రధాన విరాళాల సహాయంతో సుమారు నాలుగు లక్షలతో నూతన భవనం ఏర్పాటుచేసారు. దీనిని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషీ ప్రారంభోత్సవం చేసారు. అప్పటి నుండి అనేక రకాలుగ ఈ గ్రంథాలయం సేవలు కొనసాగిస్తుంది.

స్థాపనలో ప్రముఖులు

[మార్చు]

గ్రంథాలయం ద్వారా కార్యక్రమాలు

[మార్చు]

అక్షరాస్యతా వ్యాప్తి -

ఈ గ్రంథాలయం ద్వారా రాత్రి పాఠశాలల నిర్వహణ జరిగేది. ఎందరో ఈఊరి పెద్దలు ఈ పాఠశాల ద్వారా విద్యావంతులు అవడం జరిగింది.

స్త్రీ విద్య -

ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్ధతి ఉందేది. 1912 ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు

హిందీ ప్రచారం -

1920 నుండి ఈ గ్రంథాలయం ద్వారా హిందీ తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు.

అసృశ్యతా నివారణ -

సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి బృందం అంతరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.

వైద్య సహాయం -

ఊరిలో పేదవారికి వైద్య సహాయం అందాలనృ ఉద్దేశంతో - 1911 నుండి ఊరిలో వైద్యం తెలిసిన ఘంటశాల నాగభూషణం గారి ఆద్వర్యంలో గ్రంథాలయవేదికగా వైద్య శిబిరాలు కొనసాగేవి, ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. (గ్రంథపాలకులుగా ప్రస్తుతం ఆర్.ఎం.పి పనిచేస్తున్నారు)

సహకార పరపతి సంఘం -

పల్లెలకు రైతులు వెన్నెముఖ అని నిరూపించదానికన్నట్టుగా గ్రంథాలయానికి అనుభందంగా సహకార సంఘం ఏర్పాటు చేసి రైతులకు స్వల్ప వడ్డేలకు రుణాలు ఇవ్వడం చేసారు.

జాతీయోజ్యమానికి సహకారం -

జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు ఈ గ్రంథాలయం ద్వారా పలు కార్యక్రమాలు చేసేవారు. వీటిలో గ్రామ యువకులు పాల్గొనేవారు.

రాజులు కులం సమాజ సేవా సమితి -

రాజులు కుల కుటుంబాలలో వివాహ, ఇతర శుభకార్యక్రమాల సమయంలో ఆయా కుటుంభాల పెద్దల నుండి కొంత కట్నం సమాజాభివృద్దికి ఖర్చుచేయడం తిరుపతిరాజుగారి బృందం మొదలెట్టింది. దీనిని ఒక నిధిగా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డేని పేద విద్యార్థులకు, ఇతర ఉపకారాలకు ఖర్చు పెట్టడం చేస్తున్నారు

స్త్రీ పునర్వివాహాలు -

క్షత్రియ కుటుంభాలలో చాలా కాలం పునర్వివాహాలు ఉండేవి కావు, తిరుపతిరాజుగారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వాదాన్ని బలపర్చి1934లో స్త్రీ పునర్వివాహాలు జరిపించడానికి ఆదర్శంగా తీసుకున్నారు.

పోస్టల్ సేవలు -

చాలా కాలం కుముదవల్లిలో పోస్టాఫీసు లేదు. తిరుపతిరాజుగారి బృందం గ్రంథాలయంలోనే అసలు ధరకే పోస్తేజీని అందించేవారు.

సందర్శించిన ప్రముఖులు, అభిప్రాయాలు

[మార్చు]

ఈ గ్రంథాలయాన్ని అనేక మంది సందర్శించారు, అలా సందర్శించినవారు తమ అభిప్రయాలను రాసేందుకు ఒక పుస్తకం ఏర్పాటు చేయబడినది, దాని ప్రకారం

ప్రముఖుడు సందర్శన తేదీ అభిప్రాయం
కందుకూరి వీరేశలింగం పంతులు 11-11-1907 ఈ ఊరి వారు చేయుచున్న పని నా కత్యంత ఆనందమవుతున్నది. వీరు సమస్త విషయములలోనూ జనులకభివృద్ది కలిగించుటకు పాటుపడుతున్నారు. ఈ సమాజము చిరకాలము వర్ధిల్లచేసి దీనివలన దేశానికి శ్రేయోభివృద్ది కలిగించును గాక
అయ్యంకి వెంకటరమణయ్య 01-11-1915 ఆంధ్రదేశమున గ్రంథాలయములు బొత్తిగా లేకున్న సమయమున ఈ సమాజము స్థాపించి, పనిచేయుచున్న కార్య నిర్వహకులకృషి మిక్కిలి ప్రశంసనీయము
కోడి రామమూర్తి 23-06-1917 కుముదవల్లి గ్రామస్తులగు క్షత్రియొత్తములు వారల ప్రేమగుణానుభంధముల నను మోకాటిబంటి బురదలో దొర్లుచు నన్ను భుజములమీద తీసుకొనిపోయి వారల సరస్వతీ నిలయమున ప్రాచీన కవుల పరిచయమును నాకు కలుగచేసినందులకు వారలకు నా కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 16-11-1925 వీరేశలింగ కవి సమాజము యొక్క గ్రంథాలయం పఠనాలయము జూచి యానందించితిని. మందిరము పరిశుద్ధమై చెరువు ఒడ్డున నలరారుచు ప్రజాదృష్టినాకర్షించుచుయున్నది.
వున్నవ లక్ష్మీనారాయణ 18-08-1926 ఈ సమాజము గురించి బహుకాలముగా పత్రికల్లో చదువుతూ ఉన్నా ప్రత్యక్షముగ జూచు భాగ్యము నేటికి కలిగినది
చిలకమర్తి లక్ష్మీనరసింహం 28-12-1919 వీరేశలింగ సమాజము యొక్క 22వ వార్షికోత్సవమునకు సభాద్యక్షుడుగానుండుటకు నేను కుముదవల్లి గ్రామమునకు వచ్చి సమాజము యొక్క పూర్వ వృత్తాంతము విని మిక్కిలి సంతసించితిని.
దుగ్గరాల బలరామ కృష్ణయ్య 14-04-1931 నేడు గ్రంథాలయమును సందర్శించితిని. ఆనందము కలిగినది. గ్రామములో యువజనులే కాక పెద్దలును విద్యాసంపాదనాయత్తచిత్తులయి విద్యావ్యాపనమునకు తగు కృషిచేస్తున్నారు.
అడవి బాపిరాజు 26-01-1950 ఒహో ఈ కుముదవల్లి నగరమునకు సర్వ స్వాతంత్ర్య తేజస్వి అయిన నా భారతమాత స్వాతంత్ర్య మహోత్సవానికి అద్యక్షునిగా రావడం ఎంతో ఆనందం, నేను ఎంతో ధన్యుడ్ని.
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు 11-09-1950 ఈ గ్రంథాలయమును 1950 సెప్టెంబరు 11 వతేదీన దర్శించితిని ఇది తెలుగుదేశములో మొదటి గ్రంథాలయాలలో ఒకటి. శ్రీ తిరుపతి రాజు గారు తన సర్వస్వము ధారపోసి పోషించిన ఈ గ్రంథాలయము సర్వవిధముల అభివృద్ధి పొంది ఆదర్శప్రాయముగా సాగుతూ ఉంది.
జంధ్యాల పాపయ్య శాస్త్రి 27-01-1957 ఈ గ్రంథాలమును 20 సంవత్సరాలకు పూర్వం ఒకసారి, తిరిగి ఈ రోజున చూచి ఎంతో ఆనందించాను,

గ్రంథాలయ వార్షికోత్సవ వివారాలు

[మార్చు]
వార్షికోత్సవం జరిగిన సంవత్సరం పాల్గొన్న ప్రముఖులు
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం

1897 నుండి 1997 వరకూ అధ్యక్షుల జాబితా

[మార్చు]

ఇతర విశేషాలు

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23 - 24
25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40 - 41 - 42 - 43 - 44 - 45 - 46 - 47 - 48