Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వికీపీడియా పరిచయం

వికీపీడియా నుండి

వికీపీడియా పరిచయం

ఇంటర్నెట్ సహకారంతో కంప్యూటరులో ఏదైనా సమాచారం కోసం వెతికినపుడు మనకు ఎక్కువగా వికీపీడియా సైటులో ఉన్న వ్యాసాలే కనిపిస్తుంటాయి. అసలు ఆ వికీపీడియా సైటు ఎవరిది, అన్ని అంశాల గురించి సమాచారం అందులో ఎలా దొరుకుతుంది, ఆ సమాచారాన్ని ఎవరు రాస్తారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. వికీపిడియా అంటే ఏమిటి?

వికీపీడియా అనేది ఎవరైనా రాయదగిన ఒక అంతర్జాల విజ్ఞాన సర్వస్వం. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని సరైన ఆధారాలతో వికీపీడియాలో చేర్చడం లేదా మార్చడం చేయవచ్చు.

2. వికీపీడియా ఎవరిది?

వికీమీడియా ఫౌండేషన్‌ అనే సంస్థ ఈ వికీపీడియాను నిర్వహిస్తోంది. వికీపీడియాతోపాటు ఇతర సోదర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

3. వికీపీడియా ఎందుకు అవసరం, దాని ఉద్దేశ్యం ఏమిటి?

మన అందరికీ అన్నీ విషయాల గురించి తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంపై కొంత విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అలా అందరికీ తెలిసిన విశేష జ్ఞానాన్ని ఒకచోట చేర్చటం వలన విజ్ఞాన సర్వస్వం తయారవుతుంది. అలా రాయబడిన విజ్ఞానసర్వస్వం ఉచితంగా, స్వేచ్చగా అందించటమే ఈ వికీపీడియా ఉద్దేశ్యం.

4. వికీపీడియాలో ఎందుకు రాయాలి, రాస్తే ఏమోస్తుంది?

వికీపీడియాలో వందలాది భాషల్లో ఉన్న లక్షలాది వ్యాసాలను నిత్యం కోట్లాది మంది చదువుతూంటారు. అలాంటివారు తమకు కావలసిన సమాచారం చదువుకునేందుకు సులభంగా లభించే అంతర్జాత సైట్లపై ఆధారపడుతుంటారు. వారికి సరైన సమాచారాన్ని అందించడానికి వికీపీడియా ఒక మార్గం. వికీలో రాయడం వలన తెలుగు భాషమీద పట్టు, రచనలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం తదితర అంశాలలో నైపుణ్యం సాధించవచ్చు.

5. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు ఉంటాయి?

వికీపీడియాలో విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు ఉంటాయి.

6. వికీపీడియాలో రాయడానికి ఎలాంటి అర్హతలు కావాలి?

వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు.

7. వికీపీడియాలో రాయడానికి ఏవేనా నియమాలు ఉన్నాయా?

నిష్పాక్షిక దృష్టితో సమాచారాన్ని రాయాలి. కాపీ హక్కులను ఉల్లంఘించరాదు. ఇతర సభ్యులను గౌరవించాలి. వికీ రచనలో తటస్థ దృక్కోణం ఉండాలి. మౌలిక పరిశోధనలు నిషిద్ధం. రాసే సమాచారం ఎవరైనా నిర్ధారించుకోగలిగేలా ఉండాలి అంటే - వికీపీడియాలో వ్రాసిన విషయం వాస్తవమైనంత మాత్రాన సరిపోదు, అది నిజమేనని ఇతరులు కూడా నిర్ధారించుకొనేందుకు తగిన అవకాశాలుండాలి. సాధారణంగా అందరికీ లభించే పత్రిక, పుస్తకం, వెబ్‌సైటు, ప్రభుత్వ బులెటిన్ వంటి ఏదో ఒక సార్వజనీనమైన ఆధారం చూపాలి.

8. వికీపీడియాలో ప్రస్తుత వికీపీడియన్లు ఏం చేస్తుంటారు?

ప్రస్తుతం వివిధ ప్రచురణల్లో ప్రచురితమై ఉన్న సమాచారాన్ని సేకరించి, సంకలనం చేస్తూ వ్యాసాలు వ్రాయడం
కాపీయింగ్, ఫార్మాటింగ్, వికీకరించడం
వనరులను, మూలాలనూ వ్యాసానికి జోడించటం
క్రొత్త వినియోగదారులకు సహాయం చేయడం చిత్రాలను సృష్టించడం, జోడించడం
విషయ నైపుణ్యాన్ని అందించడం
వాడుకరుల మధ్య వివాదాలు వస్తే మధ్యవర్తిత్వం చెయ్యడం
వికీపీడియా గురించి ప్రచారం చేయటం

9. వికీపీడియాలో వ్యాసాలు రాయడమే కాకుండా ఇంకా ఏఏ పనులు చేయవచ్చు?

10. ఏది వికీపీడియా కాదు?

ఒక కాగిత విజ్ఞాన సర్వస్వం కాదు, సొంత ఆలోచనకు సమాచార సేకరణకు ప్రచురణ స్థలం కాదు
నిఘంటువు కాదు
వ్యక్తిగత ఆలోచనలను, అభిప్రాయాలను ప్రచురించే వేదిక కాదు
ప్రచార వాహనం కాదు
ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు
ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్ హోస్టు కాదు
వార్తాపత్రిక కాదు
భవిష్యత్తును చూపే మాయాదర్పణం కాదు
విచక్షణా రహితంగా సమాచారాన్ని సేకరించి పెట్టే సమాచార సంగ్రహం కాదు
పిల్లల కోసం వికీపీడియాను సెన్సారు చెయ్యం

వీడియో పాఠ్యం

[మార్చు]

ప్రస్తుతకాలంలో మనకు ఏదైనా సమాచారం కావాలంటే అంతర్జాలాన్ని ఉపయోగించి ఆ సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. అంతర్జాలంలోని వివిధ వెబ్సైట్లు మనకు కావలసిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆ వెబ్సైట్లలో అత్యంత ప్రాచూర్యం పొందిన వెబ్సైటే ఈ వికీపీడియా. వికీపీడియాలో దాదాపు అన్నింటి గురించిన సమాచారం ఉంటుంది.

ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామం ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఏయే గ్రామాలున్నాయి అనేది ఎక్కడ లభిస్తుంది? తెలుగు వికీపీడియాలో తప్ప ఇంకెక్కడా దొరకదు. ఒకవేళ దొరికినా అరకొర సమాచారమే ఉంటుంది. మానవుడు కోతి నుండి పుట్టాడు అని అంటారు. అసలు మానవ పరిణామం గురించి మనకు తెలుగులో సమాచారం ఎక్కడ దొరుకుతుంది? వికీపీడియాలో దొరికినంత సులభంగా, ఉచితంగా ఇంకెక్కడా దొరకదు. భారత పాకిస్తాన్‌లు 3 పెద్ద యుద్ధాలు చేసుకున్నాయని మనకు తెలుసు. అవి ఎప్పుడు, ఎందుకు, ఎలా జరిగాయి. ఎవరు గెలిచారు అనేది తెలుగులో ఎక్కడ దొరుకుతుంది -వికీపీడియాలోనే! ఇలా అంతర్జాలం సహకారంతో కంప్యూటరులో ఏదైనా సమాచారం కోసం వెతికినపుడు మనకు ఎక్కువగా వికీపీడియాలో ఉన్న వ్యాసాలే కనిపిస్తుంటాయి.

మరి, వికీపీడియా అంటే ఏంటి, అది ఎవరిది, అందులో ఎలాంటి సమాచారం ఉంటుంది, ఆ సమాచారాన్ని ఎవరు రాస్తారు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వికీపీడియా అనేది వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇందులో విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు ఉంటాయి. వికీమీడియా ఫౌండేషన్ అనే లాభాపేక్ష రహిత సంస్థ ఈ వికీపీడియాను నిర్వహిస్తుంటుంది. 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడిన వికీపీడియా, అప్పటినుండి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్లో అతిపెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

అందరికీ తెలిసిన విశేష జ్ఞానాన్ని ఒకచోట చేర్చడం ద్వారా రూపొందిన విజ్ఞానసర్వస్వాన్ని ఉచితంగా, స్వేచ్చగా అందించటమే ఈ వికీపీడియా ఉద్దేశ్యం.

అయితే, వికీపీడియాలో రాయడానికి నిపుణులే కానక్కర్లేదు. ఎవరైనా వికీపీడియాలో రాయవచ్చు. అంటే, స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని సరైన ఆధారాలతో వికీపీడియాలో చేర్చడం లేదా మార్చడం చేయవచ్చు.

అంతర్జాలంలో, పుస్తకాల్లో, ఇతర వనరుల్లో ఉన్న సమాచారాన్ని సేకరించి ఒకచోట చేర్చి వ్యాసాలు రాయాల్సివుటుంది. అంటే, కొత్తగా సమాచారాన్ని సృష్టించడంకాకుండా, ఉన్న సమాచారాన్నే సేకరించి మన స్వంత వాక్యాల్లో రాయాలన్నమాట. అలా రాసిన తరువాత ఆ సమాచారాన్ని ఎక్కడి నుండి సేకరించామో ఆ మూలాన్ని కూడా ఇక్కడ ఉల్లేఖించాల్సివుంటుంది. తెలుగు వికీపీడియాలో రాయడం వలన తెలుగు భాషమీద పట్టు, రచనలో నైపుణ్యం, విషయ పరిజ్ఞానం తదితర అంశాలలో నైపుణ్యం సాధించవచ్చు.

వికీపీడియా గురించి తెలుసుకున్నారు కదా, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వికీపీడియాలో అకౌంట్ ఓపన్ చేసి, చకచకా మీకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో రాసేయండి మరి.