వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 50వ వారం
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ea/Krishna_River_Vijayawada.jpg/200px-Krishna_River_Vijayawada.jpg)
విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరము. కృష్ణా జిల్లాలో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు.
విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. రాజధాని హైదరాబాదుకు 275 కి.మీ. దూరములో కృష్ణా జిల్లాలో 61.8 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 851,282. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/వాణిజ్య రాజధాని.
భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల. నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ మూడవ పెద్ద నగరం. 2001 జనగణన ప్రకారం నగర జనాభా 8,51,282 (పరిసర ప్రాంతాలతో కలిపితే 1,039,518). 2006 లెక్కల ప్రకారం ఈ సంఖ్యలు 1,025,436 మరియు 1,411,152.నగరంలో 136 గుర్తింపు పొందిన మురికివాడలున్నాయి. ఈ మురికివాడల్లో మొత్తం 2.21 లక్షల మంది జనాభా ఉన్నారు
ఇంకా... పూర్తివ్యాసం పాతవి