వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 44వ వారం
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/a/a6/Rajoli_Fort_02.jpg/150px-Rajoli_Fort_02.jpg)
మహబూబ్ నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో విస్తీర్ణం పరంగా అతిపెద్దది. 18,432 చ.కి.మీ. విస్తీర్ణం కల్గిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. అమ్రాబాదు గుట్టలు జిల్లా ఆగ్నేయాన విస్తరించాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35 లక్షలు. ఈ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. డిసెంబరు 4, 1890న అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.
ఈ జిల్లాలో 1,553 రెవెన్యూ గ్రామాలు, 1,347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 లోక్సభ నియోజక స్థానాలు, 13 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు (పునర్విభజన ప్రకారం 14 స్థానాలు) ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం తక్కువ. పనులు లేక అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. అక్ష్యరాస్యత కూడా తక్కువ. సామాజికంగా, ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందవలసి ఉంది.
తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణ సమీపాన సుమారు 700 సంవత్సరాల వయస్సు కల్గిన ఒక మహావృక్షం ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్ ఎంపికైనది. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. .....పూర్తివ్యాసం: పాతవి