Jump to content

రేలపూతలు

వికీపీడియా నుండి
రేల పూతలు
ముఖపత్రం
కృతికర్త: గోరటి వెంకన్న
ముఖచిత్ర కళాకారుడు: మోహన్
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: పాటలు
ప్రచురణ: సహచర ప్రచురణలు, హైదరాబాదు
విడుదల: :ఆగస్టు, 2002

రేల పూతలు ప్రముఖ వాగ్గేయకారుడు, సినీ పాటల రచయిత, ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాటల సంకలనం.

రచయిత పరిచయం

[మార్చు]

గోరటి వెంకన్న మహబూబ్ నగర్ జిల్లా, తెల్కపల్లి మండలం, గౌరారం గ్రామానికి చెందిన కవి.

పుస్తక సమీక్ష

[మార్చు]

ఎవరికో కొన్ని వర్గాల వారికి మాత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేల పూతలు ఒకటి.

ప్రపంచీకరణ మాయా మబ్బులు పల్లెలను సైతం కమ్మేసి, కుమ్మేస్తున్నప్పుడు, కుల వృత్తులు ధ్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు బలుస్తున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు కవి హృదయం వేదనతో రగిలి, పాటగా రూపుదాల్చి, ఈ 'రేల పూతలు' పూశాయి. ఎంకన్న పాట పల్లె చుట్టూ ప్రదిక్షణ చేస్తుంది. పల్లె అందాలు, పల్లెలోని అమాయకుల అనుబంధాలు, వారి జీవితాల్లోని సుఖం- దుఃఖం, కష్టం -నష్టం, వేదన, పోరాటం ఒకటేమిటి అన్నీ కరిగి గోరటి గొంతులో పాటలై మొలకెత్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో అతని దృష్టి నుండి ఏ వస్తువు తప్పించుకోలేదు. సెలకల్లో ఆడే పిల్లల నుంచి ఆకాశంలో ఎగిరే కొంగల దాకా అన్నీ తన పాటల్లోకి రావాల్సిందే. ఒక వైపు ప్రకృతి పల్లెతో కరువు కాటకాల ఆటలు ఆడి హింసిస్తే, మరో వైపు బహుళ జాతి కంపెనీలొచ్చి కుల వృత్తుల సడుగులు ఇరుగదన్ని మూలకు కూర్చోబెట్టాయి . పల్లె యొక్క ఈ దీనావస్తను చూసి, కవి - "పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలో తల్లి బందీయై పోతుందో" అని ఆవేదన చెందుతాడు. పల్లె విధ్వంసం గురించి ఇంత విషాద భరితంగా పాడిన మరే కవి మనకు కనించడంటే అతిశయోక్తి కాదేమో! ఈ పాటెంత కీర్తి గడించిందో! ఈ పాటతో కవికెంత ఖ్యాతి దక్కిందో! జగద్విఖ్యాతమే. ఉన్న దానితో సంతృప్తి చెందడం పల్లె ప్రజలకు, అణగారిన జీవులకు అలవాటే కదా! అందుకే కవి అంత వేదనలోనూ ఆ పల్లెల్లోనే ఉన్న ఏదో సౌందర్యాన్ని అన్వేషించి, చూసి, దానికి ముగ్ధుడై పరవశించిపోతాడు. లేకుంటే- " గాలికి ఊగి ఆటాడుతూ నేలకు తలలొంచి / సెరువు నీళ్ళను ముద్దాడి మురిసే/నల్ల తుమ్మ చెట్లను..." చూసి -"నా పల్లె అందాలు సూసితే కనువిందురో" అని చెప్పగలడా? "సాళ్ళు దున్నిన ఎర్రని దుక్కిల సంధ్య పొద్దు వాలి వొదిగినప్పుడు" సెలుక ఎంత అందంగా ఉంటుందో చూపగలడా? నేటి జనం నాగరికులైపోతున్నారు. అక్రమాల వక్రమార్గాలను అన్వేషిస్తున్నారు . కాని ఈ లోకం పోకడ తెలియని వారు ఇంకా పల్లెల్లో అక్కడక్కడ మిగిలే ఉన్నారు. అలాంటి వారిలో గోరటి సృష్టించిన 'యలమంద' ఒకడు. వాడికి "లోకం ఎటుపోతున్నా", గొర్ల మందే వాడి లోకం. అందుకే వాడు "తోడున్న గోర్లు" " యాడాదికోసారి లారెక్కుతుంటె" యాడికోతున్నాయని తల్లినడుగుతాడు, తండ్రినడుగుతాడు" "కన్నీళ్ళు రాల్చుతాడు" అని కరుణ రసాత్మక దృశ్యాన్ని మనకు చూపి మన చేతా కన్నీళ్ళు తెప్పిస్తాడు కవి. 'పాట పాడేటి పిల్లలు' పాటతో కవి ఒక్కసారిగా మనల్ని బాల్యంలోకి లాక్కెల్తాడు. వయసు పెరిగే కొద్ది మనుషులకు జ్ఞానం పెరగడం ఏమో! కాని, స్వార్థం పెరగటం మాత్రం ఖాయం. ఏ స్వార్థం ఎరుగని ఆ బాల్యమెంత మధురమో! అన్పిస్తుంది - ఈ పాట చదివినప్పుడు. కసాయి పుత్రులు తల్లి ..."గుండెలపై తన్నినా" ఆ పుత్రులను సైతం "తన గుండె గూటిలో" భద్రంగా దాచుకుంటుందని అమ్మ ప్రేమనూ చూపగలడు కవి. ఈ కవికి ప్రకృతిని చూసి పరవశించటం, దీనావస్థను చూసి కరిగిపోవటమే కాదు, అన్యాయాన్ని చూసి రగిలిపోవటం తెలుసు. కళ్ళెర్రజేయటం తెలుసు. కాబట్టే "ఎరుపు బట్టలు తెద్దామా!... ఎరుకలి బరుగుల తీసుక దొరల ఎంటపడి తరుముదమా!" అని అనగలుగుతున్నాడు. "పెన్నుల మీద మన్ను గప్పితే / గన్నులై మొలకెత్తుతాయిరో" అని హెచ్చరిక చేయగలుగుతున్నాడు. పరుల వైపు వేలెత్తి చూపటం ఇప్పుడు ప్రతివాడికి తెలిసిన సులభసూత్రం. కాని మన వాళ్ళ లొసుగులు బయట పెట్టె సాహసం ఎవరూ చేయరు. ఆ పని గోరటి చేస్తాడు. అందుకే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే గతాన్ని మరిచిన తనోడిని "ఎందిరో మనోడిట్ల ఎందుకిట్ల మారెరో" అంటూ దుమ్ము దులిపే పాట ఎత్తుకోగలడు. "తెలుగుగంగ నీళ్ళు అలుగెల్లిపోతుంటే/ పలుగు రాళ్ళు తేలి పాలమూరు ఏడ్చింది". అని తన మాతృభూమి దీనావస్థను చూపుతాడు. ఇంకా ఈ సంకలనంలో వామపక్ష భావజాలంతో, ఉద్యమాల నేపథ్యంతో, దళితవాద కోణాల్లో రాసిన పాటలూ ఉన్నాయి. ఆ పాటలన్నీ పల్లె నాడిని, వాడిని పట్టి చూపుతాయని అనుటలో సందేహం లేదు. అందుకే గోరటి పాలమూరు పల్లె బంగారం. అతని పాటలు పాలమూరు రేగల్లల్లో పూసిన "రేల పూతలు".

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రేలపూతలు&oldid=2935245" నుండి వెలికితీశారు