రుక్మిణీ లక్ష్మీపతి
రుక్మిణీ లక్ష్మీపతి | |
---|---|
జననం | |
మరణం | 1951 ఆగస్టు 6 | (వయసు 58)
వృత్తి | సామాజిక సేవిక, రాజకీయ నాయకురాలు |
జీవిత భాగస్వామి | ఆచంట లక్ష్మీపతి |
పిల్లలు | ఇందిర రామమూర్తి, ఎండెన్ శ్రీనివాసరావు, ఆచంట జానకిరాం (సవతి కుమారుడు), శారదాదేవి (సవతి కుమార్తె) |
తల్లిదండ్రులు |
|
రుక్మిణీ లక్ష్మీపతిగా ప్రసిద్ధి చెందిన ఆచంట రుక్మిణమ్మ (జ: 6 డిసెంబరు 1892 – మ: 6 ఆగష్టు 1951), భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ శాసనసభకు ఎన్నికైన తొలిమహిళ. అలాగే మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రిగా పనిచేసిన తొలిమహిళ ఈమె.[1]
భారతదేశంలో సుప్రసిద్ధులైన ఆయుర్వేద వైద్యులలో ఒకరైన ఆచంట లక్ష్మీపతి ఈమె భర్త.[2] తొలి భార్యను కోల్పోయిన లక్ష్మీపతిని కులాంతర వివాహం చేసుకున్నది.[3] ఆమె జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది. ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. తర్వాత మద్రాసులో ఖద్దరు ప్రచారము చేసింది.
రుక్మిణీ లక్ష్మీపతి, 1892, డిసెంబరు 6 న, మద్రాసు ప్రెసిడెన్సీలోని మధురైలో జమీందారీ వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు, చూడామణి, శ్రీనివాసరావులు. ఈమె తాత, జమీందారు రాజా టి.రామారావు. ఈమె మద్రాసు కైస్తవ కళాశాలనుండి బి.ఏ. డిగ్రీతో పట్టభద్రురాలైంది.[4] జాతీయోద్యమం పట్ల ఆకర్షితురాలైన రుక్మిణమ్మపై, మహాత్మాగాంధీ, సరోజిని నాయుడు, రాజగోపాలాచారుల ప్రభావం మెండుగా ఉన్నది. బాపూజీ హరిజన నిధికై తన బంగారు ఆభరణాలన్నీ సమర్పించి ఆయన అభిమానాన్ని చూరగొన్నది. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిర్కణోద్యమాలలో పాల్గొని ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవించింది.[4]
1923లో ఈమె భారత జాతీయ కాంగ్రేసు పార్టీలో చేరి రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొన్నది. 1926 వ సంవత్సరం లో పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిగింది. స్త్రీల హక్కుల గురించి చర్చించే ఆ సభకు భారతదేశ ప్రతినిధిగా ఆమె వెళ్ళింది.[5] తర్వాత జిల్లా బోర్డు సభ్యురాలిగా, కార్పొరేషన్ మెంబరుగా, విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా పనిచేసింది. మహాత్మా గాంధీ నిర్వహించిన దండి యాత్ర స్ఫూర్తితో, 1930 వ సంవత్సరం మే నెలలో, రాజాజీ నేతృత్వంలో వేదారణ్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆనాడు జైలుకు వెళ్ళిన తొలి మహిళల జట్టులో నిలిచింది.[6] ఉప్పుసత్యాగ్రహ ఉద్యమ నేపథ్యంలో మద్రాసు ప్రెసిడెన్సీలో అరెస్టు అయిన మొదటి మహిళ ఈవిడే. వివిధ చారిత్రక ఆధారాల ప్రకారం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన తొలి భారతీయ మహిళ కూడా ఆవిడే.[3] ఆ తర్వాత 1940 వరకు ఎన్నో సార్లు జైలుకు వెళ్ళింది.
రుక్మిణీ లక్ష్మీపతి, 1934లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు పోటీచేసి, గెలిచింది.[7] ఈమె 1935 నుండి 1936 వరకు మద్రాసు రాష్ట్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పనిచేసింది.[4] 1937లో మద్రాసు ప్రెసిడెన్సీ శాసనసభ ఎన్నికల్లో గెలిచి, 1937, జూలై 15న శాసనసభకు ఉపసభాపతిగా (డిప్యుటీ స్పీకరు) ఎన్నికైంది. 1946, మే 1 నుండి 1947, మార్చి 23 వరకు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ప్రజా ఆరోగ్య శాఖామంత్రిగా కూడా పనిచేసింది.[8][9][10][11] ఆరోగ్యశాఖా మంత్రిగా ఆయుర్వేదం మొదలైన భారతీయ వైద్య విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో గణనీయమైన పాత్ర పోషించింది.[3]
సమాచార రంగ ప్రముఖులు ఆచంట జానకిరాం వీరి కుమారుడు.[4] రుక్మిణీ లక్ష్మీపతి భారత స్త్రీ మండల్ మరియు ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ వంటి సంస్థల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నది. ఆమె సామాజిక సంస్కరణలను ప్రోత్సహించడమే గాక, బాల్యవివాహాల వంటి సామాజిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించింది.[3]
రుక్మిణీ లక్ష్మీపతి, 1951, ఆగష్టు 6న మద్రాసులో మరణించింది. చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలోగల మార్షల్ రోడ్దును ఈమె పేరు పెటారు.[12] ఈమె చేసిన సేవలను గుర్తిస్తూ, సంస్మరణార్ధం భారత ప్రభుత్వ తపాలాశాఖ, రెండు రూపాయల విలువ కల ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది.[4][13]
మూలాలు
[మార్చు]- ↑ Ramakrishnan, T (13 March 2010). "Historic moments, historic personalities". The Hindu. Retrieved 8 April 2010.
- ↑ Who's Who in India, Burma & Ceylon. Who's Who Publishers (India) Ltd., 1941. 1941. p. 175.
- ↑ 3.0 3.1 3.2 3.3 "విస్మరించజాలని వీరనారి–రుక్మిణి లక్ష్మీపతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య మనోగతం". ఆంధ్రజ్యోతి. 3 December 2020. Retrieved 19 October 2024.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 పుట్టి, నాగలక్ష్మి. "ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టయిన తొలి భారతీయ మహిళ శ్రీమతి తిరుమతి రుక్ష్మిణీ లక్ష్మీపతి". సంచిక.
- ↑ Seminar on Uplift of Women in South India in 20th Century and Suggestions for 2000 A.D. Conferences, seminars, and workshops series. Vol. 5. Mother Teresa Women's University, Dept. of Historical Studies. 1987. p. 83.
- ↑ Roy, Kalpana (1999). Encyclopaedia of violence against women and dowry death in India. Vol. 1. Anmol Publications. p. 30. ISBN 978-81-261-0343-0.
- ↑ Bhatt, B. D.; Sita Ram Sharma (1992). Women's education and social development. Modern education series. Kanishka Pub. House. p. 343. ISBN 978-81-85475-54-7.
- ↑ Justice Party golden jubilee souvenir, 1968. Justice Party. 1968. p. 62. ISBN.
- ↑ Kaliyaperumal, M (1992). The office of the speaker in Tamilnadu : A study (PDF). Madras University. p. 47.
- ↑ "Rukmini Laxmipathi". Retrieved 12 March 2010.
- ↑ Frederick, Prince (4 December 2002). "Discipline, need of the hour". The Hindu. Archived from the original on 9 November 2003. Retrieved 12 March 2010.
- ↑ "In Chennai Today". The Hindu. 10 July 2005. Archived from the original on 9 November 2006. Retrieved 12 March 2010.
- ↑ Daryanani, Mohan B (1999). Who's who on Indian stamps. p. 219. ISBN 978-84-931101-0-9.