రాజా టి.రామారావు
రాజా తుమ్మలపల్లి రామారావు (జ.1839[1] - మ.), మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ నాయకుడు, విద్యావేత్త, న్యాయవాది.[2] తొలితరం భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు.[3]
రాజా టి.రామారావు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి మద్రాసులో స్థిరపడిన గోల్కొండ వ్యాపారులు కుటుంబానికి చెందినవాడు. ఈయన 1864లో బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై, 1866 న్యాయశాస్త్రంలో పట్టా పొంది, 1867లో మద్రాసు హైకోర్టులో వకీలుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అనతికాలంలోనే న్యాయవాద ప్రాక్టీసును అభివృద్ధి చేసి, మంచి న్యాయవాదిగా పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత మద్రాసు వకీళ్ల సంఘానికి నాయకుడయ్యాడు. 1880 వ దశకంలో న్యాయస్థానంలో ఈయన తన సమకాలీనులైన ప్రసిద్ధ న్యాయవాదులు, సర్ వి.భాష్యం అయ్యంగార్, సర్ ఎస్.సుబ్రమణ్య అయ్యర్‌లతో తలపడ్డాడు.[4]
తుమ్మలపల్లి రామారావు ఆంధ్ర దేశంలో తొలి న్యాయశాస్త్ర పట్టభద్రుడు.[2] 1862, జూన్ 26, విక్టోరియా మహారాణి ఉత్తర్వుపై మద్రాసు హైకోర్టు ఏర్పడింది.[5] ఆ కాలంలో బ్రిటీషు బారిస్టర్లకు, భారతదేశంలో శిక్షణ పొందిన వకీళ్లకు సమస్థాయిని ఇవ్వాలా లేదా అని చర్చ జరుగుతున్నప్పుడు, మద్రాసు హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి అయిన సర్ కాల్లీ స్కాట్లాండ్, బారిస్టర్లను, వకీళ్లకు సమస్థాయిని నిర్ణయించాడు. ఆ సమయంలో బార్‌లో చేరేముందు వకీళ్లు కనీసం ఒక సంవత్సరం పాటు బారిస్టరు వద్ద పనిచేయాలని ఒక నియమం పెట్టారు. కానీ, బారిస్టరులెవరూ వకీళ్లను శిష్యులుగా తీసుకోవటానికి ముందుకు రాలేదు. దీన్ని గమనించిన కాల్లీ స్కాట్లాండ్, అది కాకపోతే, 18 నెలలపాటు కోర్టుకు హాజరు కావలన్న నియమాన్ని చేర్చాడు. ఈ నియమానికి అనుగుణంగా రాజా టి.రామారావు 18 నెలలు పూర్తిచేసి బార్‌లో చేరటానికి అభ్యర్ధన పెట్టుకున్నాడు. అది తెలిసిన బారిష్టర్లు నియామకాన్ని అడ్డుకోవటానికి మిస్టర్ మిల్లర్‌ను పంపించారు. అయితే, ఈ విషయం తెలిసిన జె.హాల్లవే, రామారావును సాధారణ సమయం కంటే పదిహేను నిమిషాలు ముందు రమ్మని చెప్పాడు. రామారావు వచ్చిన వెంటనే ఆయన్ను కోర్టులో నమోదు చేసి, మిల్లర్ రాగానే "క్షమించండి మిల్లర్ గారూ, మీరు ఆలస్యంగా వచ్చారు, రామారావు ఇప్పటికే నమోదు చేసుకున్నాడు" అని సర్ కాల్లీ స్కాట్లాండ్ అన్నాడని మద్రాసు విక్లీ నోట్స్‌లో ఈ ఉదంతం ప్రచురితమైంది.[6][5]
రామారావు, వెంకటగిరి సంస్థానపు రాజకుటుంబానికి సన్నిహితుడు. వెంకటగిరి రాజా, వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ఈయన చేత, వెలుగోటి వంశచరిత్రను ఆంగ్లంలో వ్రాయించాడు.[7] రామారావు 1875లో 27 తరాల వెంకటగిరి రాజుల చరిత్రపై వారి కుటుంబ దస్తావేజుల ఆధారంగా, "బయోగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ ది రాజాస్ ఆఫ్ వెంకటగిరి" అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథాన్ని మద్రాసు ఆషియాటిక్ ప్రెస్ ముద్రించింది.[8][9]
టి.రామారావు, 1880లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కూడా నియమించబడి, 1886 వరకు ఆరు సంవత్సరాల పాటు కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు. ఈయన కార్యకలాపాలు, సలహాలు, ప్రభుత్వం యొక్క గౌరవాన్ని, ప్రత్యేకంగా అప్పటి మద్రాసు గవర్నరు గ్రాంట్ డఫ్ఫ్ గౌరవాన్ని అందుకున్నాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఈయన చేసిన సేవలను, న్యాయవాద వృత్తిలో ఈయన ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ప్రభుత్వము విక్టోరియా మహారాణి జూబ్లీ ఉత్సవాల సందర్భంగా 1887, ఫిబ్రవరీ 16న ఈయనకు "రాజా" అనే బిరుదునిచ్చి సత్కరించింది.[4][1] ఈయనకు మద్రాసు నగరంలోని అనేక ప్రజా సంస్థలు, ఉద్యమాలతో అనుబంధం ఉన్నది.[4]
రామారావు, తొలితరం భారత జాతీయ కాంగ్రేసు నాయకుల్లో ఒకడు. ఈయన 1889, డిసెంబరు 26 న బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రేసు ఐదవ సమావేశంలో పాల్గొని, సర్ విలియం వెడ్డర్‌బర్న్ అధ్యక్షుడిగా ఎన్నికవడంలో కీలక పాత్రపోషించాడు. డబ్ల్యూ.సి.బెనర్జీ, వెడ్డర్‌బర్న్ పేరు ప్రతిపాదించగా, పడింత్ అయోధ్యనాథ్ బలపరచగా, టి.రామారావు దాన్ని సమర్ధించాడు.[3]
విద్యావేత్తగా మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలకు పోషకుడిగా, 1899 నుండి 1904 వరకు పాఠశాల యాజమాన్య సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ కాలంలో ఎం.ఏ.సింగరాచియర్, ఎం.ఓ.పార్థసారధి అయ్యంగార్, ఎం.వీరరాఘవాచారియర్, ఎం.ఏ.తిరునారాయణాచారియర్ వంటి పురప్రముఖులు ఈ పాఠశాల యాజమాన్య సంఘంలో ఉండేవారు. ఈయన ఆధ్వర్యంలో ప్రధాన పాఠశాల భవనపు ఉత్తర విభాగాన్ని విస్తరించారు.[4] 1886లో ఈయన మద్రాసు విశ్వవిద్యాలయ ఫెలోగా నియమించబడ్డాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Lethbridge, Sir Roper (1900). The Golden Book of India. A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated, of the Indian Empire. With an Appendix for Ceylon. S. Low, Marston & Company. p. 257. Retrieved 27 October 2024.
- ↑ 2.0 2.1 "మన కోర్టులు" (PDF). జమీన్‌రైతు. 1954-07-09. p. 1. Retrieved 2024-10-21.
- ↑ 3.0 3.1 Besant, Annie (1915). How India Wrought for Freedom: The Story of the National Congress Told from Official Records. Theosophical publishing house. p. 77. Retrieved 25 October 2024.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Raja T. Rama Rao, 1889-1904". hinduhighschool.net. Retrieved 21 October 2024.
- ↑ 5.0 5.1 Supreme Court of India. Courts of India Past to Present. Publications Division Ministry of Information & Broadcasting. ISBN 9789354091230. Retrieved 25 October 2024.
- ↑ N. R. K., Tatachariar (11 October 1926). The Madras Weekly Notes. p. 103. Retrieved 25 October 2024.
- ↑ Mund, Subhendu (2021). The Making of Indian English Literature. Routledge. p. 71. ISBN 9781000434231. Retrieved 26 October 2024.
- ↑ ఈతకోట, సుబ్బారావు. "27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర". పుస్తకం.నెట్. Retrieved 26 October 2024.
- ↑ T, Rama Row (1875). Biographical Sketches of the Rajahs of Venkatagiri. Compiled from the Palace Records by Order of the Present Rajah Under the Superintendence of T. Rama Row. Venkatagiri: Asiatic Press. Retrieved 26 October 2024.