రాయల కళా గోష్ఠి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/19/Asavadi_Prakasa_Rao.jpg/220px-Asavadi_Prakasa_Rao.jpg)
రాయల కళా గోష్ఠి అనంతపురం పట్టణంలో 1974లో ఏర్పాటయిన ఒక సాహిత్య సాంస్కృతిక సంస్థ. ఇది 2 దశాబ్దాల కాలం వివిధ సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలను పొందింది. ప్రముఖ అష్టావధాని, కవి ఆశావాది ప్రకాశరావు ఈ సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశాడు. ఈ సంస్థ సలిపిన నిర్విరామ కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ దీనిని తన అనుబంధ సంస్థగా గుర్తింపునిచ్చింది.[1].
ఉద్దేశ్యాలు
[మార్చు]దేశంలో పెరుగుతున్న తెలుగు భాషా సాహిత్యభ్యుదయాభివృద్ధిని సమీక్షిస్తూ యువకుల, విద్యార్థుల భాషా సాహిత్య స్థాయి రచనలకు ప్రోత్సాహమిస్తూ, వారిలో సాహిత్య, శాస్త్రీయ, కళా వికాసం అభివృద్ధి చెందేలా వివిధ అంశాలలో నిష్ణాతులైన కవిపండితుల నాహ్వానించి వారి విజ్ఞాన పరిధులను పెరుగుదలకు దోహదం చేస్తూ, వకృత్వ, వ్యాసరచన, కవితారచన పోటీలు నిర్వహించడం ద్వారా వారి అంతర శక్తులను వెలికి తీసి, సాంఘిక చైతన్యానికి వారి మేధస్సులను ఉపకరించేలా మలచాలనే ధ్యేయంతో ఈ సంస్థ స్థాపించబడింది.
కార్యక్రమాలు
[మార్చు]ఈ సంస్థ ప్రారంభమైనది మొదలు కవి జయంతులు, కవి సన్మానాలు, కావ్యగానాలు, అష్టావధానాలు, అజ్ఞాత కవిపూజలు, గ్రంథావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు, మారుతున్న విలువలపై సమీక్షా ప్రసంగాలు, సారస్వతోపన్యాసాలు, వివిధ సాహిత్య ప్రక్రియలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధునిక, ప్రాచీన సాహిత్యాలకు వారధిగా నిలిచింది.
ఈ సంస్థ వారం వారం నిర్వహించిన సాహిత్య గోష్ఠులే కాక, త్రైమాసిక సభలను నిర్వహించింది. 1974లో మొదటిసారి రాయలసీమ రచయితల మహాసభలను దిగ్విజయంగా నిర్వహించింది. కీర్తిశేషులు భోగిశెట్టి జోగప్ప స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతియేటా ఒక్కొక్క కవికి నూటపదహారు రూపాయల నగదు పురస్కారాన్ని అందజేసింది. ఈ సాహిత్య పురస్కారం అందుకున్న వారిలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కల్లూరు వేంకట నారాయణ రావు, బెళ్లూరి శ్రీనివాసమూర్తి, రాప్తాటి ఓబిరెడ్డి, శలాక రఘునాథశర్మ మొదలైన వారున్నారు.
ఈ సంస్థ సంపత్ రాఘవాచార్యులు, గడియారం వెంకటశేషశాస్త్రి, కోట వీరాంజనేయశర్మ, లింగాల భోగవతి చెన్నారెడ్డి, సి.వి.సుబ్బన్న శతావధాని, మీగడ నరసింహారెడ్డి, ఆర్.ఎస్.సుదర్శనం, కొలకలూరి ఇనాక్ మొదలైన వారిని ఘనంగా సత్కరించింది.
ఇంకా ఈ సంస్థ అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల సాహిత్య సదస్సు, సరోజినీ నాయుడు శతజయంతి, ముట్నూరు కృష్ణారావు శతజయంతి మొదలైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.
ప్రచురణలు
[మార్చు]ఈ సంస్థ తన కార్యకలాపాలలో భాగంగా కొన్ని గ్రంథాలను ప్రచురించింది. వాటిలో కొన్ని:
- సాహిత్య సంక్రాంతి
- విద్యావిభూషణ
- అన్యాపదేశము
- సరస్వతీ శతకము
- పురుషోత్తముడు (నాటకం)
- శివతాండవము - కొలకలూరి స్వరూపరాణి
- ఆర్కెస్ట్రా - కేతు బుచ్చిరెడ్డి, భూషి కృష్ణదాసు
మూలాలు
[మార్చు]- ↑ బత్తుల, వేంకటరామిరెడ్డి (27 April 1980). "రాయల కళా గోష్ఠి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 27. Archived from the original on 29 నవంబరు 2020. Retrieved 25 January 2018.